top of page
Writer's pictureBVD Prasada Rao

డాక్టర్ రావ్


'Doctor Rao' written by BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

డాక్టర్ రావ్ తన చెంతకి రాగానే, నర్శి తన రెండు చేతుల్ని గమ్మున జోడించేశాడు. ఆ వెంబడే, "డాటర్ ఇదుంచండి" అన్నాడు ఒక కాగితం పొట్లాన్ని ఆయన చేతుల్లోకి తోస్తూ.

డాక్టర్ రావ్ ఆశ్చర్యపోయారు. "వాట్ మాన్. ఏమిటిది" అని అడిగారు, తన చేతుల్లోని ఆ పొట్లాం వంక చూస్తూనే.

"నాను బతకాలి డాటర్. నను బతికించండి డాటర్" అంటూ చెబుతున్నాడు నర్శి.

డాక్టర్ రావ్ అవాక్కయ్యారు.

"ఏం కాదు. భయపడకు" అని చెప్పారు.

"లేదు డాటర్ లేదు. నా ఇల్లాల్ని సంపేసింది ఆ దగుల్బాజీ. నను తగులుకుంది. ననూ సంపితుందేమో ఆ జాలెరగని ఖరానో. అమ్మో! నీకు పున్యముంటాది. నను బతికినీయండి" చెబుతున్నాడు నర్శి.

డాక్టర్ రావ్ చేపట్టిన సర్ది చెప్పే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

నర్శి తన సొదలో తాను ఉన్నాడు.

"లేదు డాటర్. నాను బతకాలి. బతికి తీరాలి. లేకపోతే నా కూతురు .. ఒంటరి ఐపోతాది. మాకెవరూ లేరు. దానికి మేమే. మాలో నా ఇల్లాలు పోయింది. మిగిలిన నేనూ పోతే ..నా కూతురు ఏవయ్యిపోతాదో" అంటూ చెప్పడం ఆపడం లేదు నర్శి.

డాక్టర్ రావ్ సహనం పట్టులోనే కదులుతున్నారు.

"నీకు ఏమీ కాదు. నన్ను పరీక్ష చేయనియ్యి" అంటూ తన చేతిలోని ఆ పొట్లాన్ని నర్శి పక్కన పెట్టారు.

నర్శి టక్కున ఆ పొట్లాన్ని తీసి, తిరిగి డాక్టర్ రావ్ చేతుల్లోకి దాన్ని తోస్తూ, "డాటర్ ఇదే మిగిలింది. నా కూతురు పెల్లికి కూడపెట్టిన బంగారం నగ. కూడేసిన డబ్బు అంతా నా ఇల్లాలికే కర్చు చేసాను. కానీ అది బతకలేదు" అంటూ,

"ఈ నగుంచుకొని నను బతికించండి. నాను బతికితే నాను సస్చినంత వరకు నీ బాకీ తీరుసుకుంటూనే ఉంటాను" అని చెప్పుతున్నాడు నర్శి అస్తవ్యస్తమవుతూ.

"అయ్యా! నేను చెప్పేది ఆలకించు. చెప్పడం ఆపు. నా మాట విను" అన్నారు డాక్టర్ రావ్ కాస్త స్థిరంగానే.

నర్శి ఆగాడు. ఆ సమయంలోనే అక్కడికి చేరింది సిస్టర్ జెర్సీ. "సేవా సమితి వారు పంపారు. కరోనా పోజిటివ్. వారంగా సఫరవుతున్నాడు" అంటూ తన చేతిలోని నర్శి రిపోర్ట్స్ ఫైల్ నందించింది.

డాక్టర్ రావ్ వాటిని చూశారు. సిస్టర్ జెర్సీకి కొన్ని సూచనలు చెప్పారు.

నర్శి పక్కన, తన చేతిలోని పొట్లాన్ని పెడుతూ, "భయపడకు. ఏమీ కాదు. మందులు ఇస్తాం. వాడు. తగ్గిపోతుందిలే" అన్నారు.

"లేదు డాటర్. అలానే ఆడన డాటర్ సెప్పాడు. డబ్బులు కట్టిన కాడికి కట్టించుకున్నాడు. అయినా, అయ్యో! నా ఇల్లాలు పోయింది" చెప్పాడు నర్శి తెగ అలజడిగా.

"అయ్యా! కూలవ్వు! అలా అన్నీ ఆలోచించకు" అన్నారు డాక్టర్ రావ్.

నర్శి అవస్థ పడుతున్నాడు.

"సిస్టర్! ప్లీజ్ ప్రోసీడ్" అంటూ అక్కడ నుండి కదిలారు డాక్టర్ రావ్. అలా వెళ్తూ నర్శి కుడి భుజంపై తన కుడి చేతితో తట్టి కదిలారు.

ఆ సాయంకాలం -డాక్టర్ రావ్ తిరిగి అక్కడకి వచ్చారు. నర్శి నిద్ర పోతున్నాడు. సిస్టర్ జెర్సీ చూపిన రిపోర్ట్స్ చూసి, కొన్ని సూచనలు చేశారు. నర్శి తల పక్కనే ఉన్న పొట్లాన్ని చూసి, "సిస్టర్, దానిని తీసి జాగ్రత్త పరచండి" అంటూ చెప్పి కదిలారు.

ఆ రాత్రి - డాక్టర్ రావ్ రూంకి సేవా సమితి ప్రతినిధి ఒకడు వచ్చాడు.

సిస్టర్ జెర్సీని రమ్మనమని కబురు పంపారు డాక్టర్ రావ్. వచ్చిన సేవా సమితి ప్రతినిధితో, నర్శి చేసింది చెప్పి, "అందుకే మిమ్మల్ని రమ్మనమంది" అని చెప్పారు డాక్టర్ రావ్.

సిస్టర్ జెర్సీ తన వద్దకి రాగానే, "ఆ దాచిన నర్శి పొట్లాన్ని వీరికి అందించండి. వీరి నుండి అది ముట్టినట్టు లెటర్ తీసుకోండి" అని చెప్పారు డాక్టర్ రావ్. సిస్టర్ జెర్సీ ఆ వచ్చిన ప్రతినిధిని తీసుకొని కదిలింది.

మర్నాడు ఉదయం - సిస్టర్ జెర్సీ డ్యూటీ దిగింది. సిస్టర్ కావ్యకి ఛార్జ్ అప్పగించింది. నర్శి వద్దకు డాక్టర్ రావ్ వచ్చారు.

నర్శి, "డాటర్! రాతిరి కునుకు పట్టలేదు. ఆయాసం మొదలయ్యింది. నరుసుకి చెప్పాను. పర్వాలేదు, డాటర్ వచ్చి చూస్తారులే అనేసి పోతుంది" అని చెప్పాడు ఆందోళనగా.

సిస్టర్ కావ్య చూపిన నర్శి రిపోర్ట్స్ ని డాక్టర్ రావ్ చూశారు. సిస్టర్ కావ్యకి సూచనలు చెప్పారు.

"మందులు మార్చాను. వేయి. తగ్గుతుంది. భయపడకు." అంటూ వెళ్లిపోయారు డాక్టర్ రావ్. అప్పుడూ నర్శి భుజం తట్టి కదిలారు. నర్శి చిందరవందరయ్యాడు.

మందులు ఇవ్వడానికి వచ్చినప్పుడు, సిస్టర్ కావ్యతో, "ఆ పొట్లం డాటర్ ఉంచుకున్నాడా?" అని అడిగాడు నర్శి ఆశగా.

"ఏ పొట్లాం" అంది ఆశ్చర్యంగా సిస్టర్ కావ్య.

"నీకు తెలవకపోవచ్చులే. ఇంకో నరుసుకి తెలుసు" అనేసి అప్పటికి తగ్గాడు నర్శి.

ఆ రాత్రి - సిరప్ మోతాదు అందిస్తున్న సిస్టర్ జెర్సీతో, "ఆ పొట్లం డాటర్ పట్టుకుపోయాడా?" అని అడిగాడు నర్శి ఆత్రంగా.

సిస్టర్ జెర్సీ కాస్త చలించినా, వెంటనే సర్దుకొని, "లేదు లేదు. దానిని నిన్ను ఇక్కడ చేర్చిన ఆ సేవా సమితి వారికి ఇప్పించేశారు. దానిని వారు నీకు ఇచ్చేస్తారులే" అని చెప్పింది.

నర్శి గింజుకున్నాడు. తర్వాత తన వద్దకి వచ్చిన డాక్టర్ రావ్ తో - "డాటర్, అల్లకెందుకిచ్చేసావు. సెప్పాగా. సాలపోతే నాను బతికితే నాను సచ్చే వరకు కట్టపడి నీ బాకీ తీర్చుకుంటానని!" అన్నాడు నర్శి కోపంగానే.

డాక్టర్ రావ్, "అయ్యా, నీకు ఏమీ కాదు. ధైర్యంగా ఉండు" అని, వెళ్లిపోయారు. అప్పుడూ నర్శి భుజం తట్టి కదిలారు. నర్శి చిరాకయ్యాడు.

ఆ మర్నాడు -మధ్యాహ్నం పూట -

ఒక్కమారుగా నర్శిలో అనారోగ్యం పెరిగింది. డాక్టర్ రావ్ అక్కడ హాజరయ్యారు.

నర్సిని అత్యవసర చికిత్స గదికి చేర్పించారు.

"డాటర్, డాటర్! నాను సస్చిపోతానేమో. భయమవుతోంది. అమ్మో! నా కూతురు.." అంటూ అరుస్తున్నాడు నర్సి.

"అయ్యా! గాభరా కావద్దు" అన్నారు డాక్టర్ రావ్. అప్పుడూ నర్సి భుజం తట్టి చెప్పారు. నానా విధాల ప్రయత్నించారు. నర్శి చివరికి చనిపోయాడు. తదుపరి చర్యలు సాగుతున్నాయి.

కానీ డాక్టర్ రావ్ సతమతం కొనసాగుతూనే ఉంది. తనని ఒక వెలితి వెంబడిస్తూనే ఉంది.

తన డ్యూటీని నిర్వహించలేకపోతున్నారు.సేవా సమితి వారికి కబురు చేశారు. వాళ్లలో ఇద్దరు ప్రతినిధులు వచ్చారు. వాళ్లతో నర్శి గురించి మాట్లాడారు డాక్టర్ రావ్.

"అతని కూతురుని కలిశారు కదా" అడిగారు.

"కలిశాం. మోటివేట్ చేశాం. ఆ బంగారు నగని అందించేశాం కూడా" చెప్పారు వాళ్లు.

"ఆమెని నా వద్దకి తీసుకురాగలరా" అడిగేశారు డాక్టర్ రావ్. ఆ వచ్చిన వాళ్లు డాక్టర్ రావ్ మాట విన్నారు. వాళ్ల ఊతంతో నర్శి కూతురు డాక్టర్ రావ్ ని కలవగలిగింది.

ఆమెతో, "తొలుత తక్షణమే మా ఇంటికి వచ్చేసి, మా కుటుంబం చెంత ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండు. నీ బాధ్యత ఇకపై నాది .. నాది!" అని చెప్పారు డాక్టర్ రావ్.

నర్శి కూతురు డాక్టర్ రావ్ ఇంటిన చేరింది.

అప్పటికి కానీ డాక్టర్ రావ్ లోని సతమతం చప్పబడలేదు, తన డ్యూటీ కుదుటపడలేదు.

***శుభం***

బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు

వీరి పూర్తి వివరాలు వీరి బ్లాగ్ ద్వారా తెలుసు కోవచ్చు.


2 views0 comments
bottom of page