top of page
Writer's pictureA . Annapurna

మనిషి -మనసు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.



Manishi Manasu' written by A. Annapurna

రచన : A. అన్నపూర్ణ

ఆరోజు మద్రాస్ IIT సీనియర్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ఉత్సవం జరుపు కుంటున్నారు. ఆ ఉత్సవానికి అమెరికా లోని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం నుంచి అతిధిగా ఎలక్ట్రానిక్స్ ఫ్రొఫెసర్ డా.లీనియో రోచ వచ్చారు.

ఆయన ప్రసంగిస్తూ.....విద్యార్థులకు ఒకమాట చెప్పారు.

“ఈ విద్యాలయం నుంచి ఎందరో ఆణిముత్యాల్లాంటి విద్యార్థులు మా దేశానికి వస్తున్నారు. వారి విద్యా తృష్ణ, కష్టించి పనిచేసే తత్వం వారిని వున్నత శిఖరానికి చేర్చుతూ మాదేశ ప్రతిష్టకు వన్నె తెచ్చింది. అందులో ఎలాంటి సందేహము లేదు.

కానీ వారిలో సేవా భావం కొరవడింది. నేను పుట్టుకతో అమెరికన్ కాదు. మీలాగే చదువు, ఉద్యోగంకోసం

అమెరికా వెళ్ళాను. మాకు సేవాభావం, వాలంటరీ సర్వీసులకు మార్కులు - అర్హతలు గా నియామకాలు జరిగేవి.

పేదవారికి సాయం చేసి వారిపట్ల ఆదరణ చూపగలిగేవారు.... తప్పకుండా పేరు తెచ్చుకుంటారు....” అని చెప్పారాయన. తరువాత విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అమెరికాలో వుండే విద్యావకాశాల గురించి ఎన్నో విషయాలు వివరించారు.

అయన మాటలకు ఎవరు ఎలా ప్రభావితం అయ్యారో తెలియదు. కానీ ఆకాష్ కి ఫ్రొఫెసర్ లీనియో మాటలు బాగా మనసులోకివెళ్లాయి.

ఇంటికి వచ్చాక ....తండ్రితో చెప్పాడు. అప్పటికే అతను అనుకున్నాడు అమెరికా వెళ్లి తీరాలని.

''నాన్నగారూ! నేను అమెరికా వెళ్లి పీహెచ్దీ చేస్తాను'' అన్నాడు.

''మంచిది ఆకాష్! నీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయి.... అంటూ ప్రోత్సహించారు ఆకాష్ తండ్రి.

ఆకాష్ కి స్కాలర్ షిప్ తో అడ్మిషన్ వచ్చింది. అమెరికా వెళ్ళాడు.... ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులో ఎం ఎస్ అండ్ పీహెచ్ డీ 5 ఏళ్లలో పూర్తి చేసాడు.

ఫ్రొ. లీనియో పనిచేసే కాలేజీలో వుద్యోగం కూడా వచ్చింది.

కానీ అతడు ఎలక్ట్రానిక్ కంపెనీలో చేరాడు.

“ఒకరోజు ఇల్లు క్లీన్ చేయడానికి మీ మెయిడ్ని పంపగలరా లీనియో?” అని ఫోన్ చేసాడు ఆకాష్.

''మెయిడ్ ఎందుకు? మా బంధువుల అమ్మాయి చదువుకుంటూ వీకెండ్లో పనిచేస్తూ ఉంటుంది. పంపుతాను”

అంటూ లీసా అనే అమ్మాయిని పంపించాడు.

లీసా ఇంటీరియర్ కోర్సు చేస్తూంది. అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఇలా అన్నిచోట్లా పనిచేసి పాకెట్ మనీ సంపాదించుకుంటారు. పేరెంట్స్ ని అడగరు. వారి మీద ఆధార పడరు.

హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఇంటిపని, మూవీ థియేటర్స్, స్టోర్స్… ఇలా ఎక్కడైనా పనిచేస్తారు. వాళ్ళేమీ చిన్నతనంగా

ఫీలవరు.

అమ్మ నాన్నలను అడగటమే తప్పుగా ఫీలవుతారు.

''హాయ్ ఆకాష్! లీనియో పంపించారు.... ఐ'మ్...లీసా…” అంటూ పరిచయం చేసుకుంది .

ఆ పరిచయం స్నేహంగామారింది.....ఇద్దరూ సినిమాలు, వెకేషన్ ట్రిప్స్… అంటూ విహారాలతో మరీ దగ్గరయ్యారు.

ఒకరోజు లీనియో ''ఆకాష్ ! లీసా నిన్ను ఇష్టపడుతోంది. నువ్వుఏమంటావ్? మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా?'' అంటూ సందేహంగా అడిగాడు.

''లీసా ఇదే అడిగింది. వాళ్ళని ఒప్పిస్తాను అన్నాను. మరి ఈసంగతి మీతో చెప్పలేదా?” అన్నాడు ఆకాష్.

''చెప్పింది ఆకాష్! మీ కుటుంబం ట్రెడిషన్స్ నేను ఇండియా వచ్చినపుడు తెలుసుకున్నాను.. వాళ్ళు ఇలాంటి

విషయంలో కఠినంగా ఉంటారని విన్నాను. నువ్వు మీ తల్లి తండ్రులకు ఒక్కడే కొడుకువి . నిన్ను దూరం చేసుకుంటారా.... నువ్వు వారిని వదులుకుంటావా... అదీ మేము కారణం కాకూడదు అనే అడుగుతున్నాను. నీ లాంటి అబ్బాయి మా ఫ్యామిలీలోకి రావడం మాకు చాలా సంతోషం.... కానీ మనందరం కలిసి వుండాలని నా కోరిక.'' అన్నాడు లీనియో పెద్ద మనసుతో.

''మా గురించి మీకున్న అభిప్రాయానికి ధన్యవాదాలు లీనియో! నేను అవన్నీ ఆలోచించి లీసాను ఇష్టపడలేదు.

నా లైఫ్ పార్ట్నర్గా లిసా సరి ఐన నిర్ణయం అనిపించింది. డోంట్ వర్రీ లీనియో.''అన్నాడు ఆకాష్.

''ఆకాష్ నీకు తెలుసా లీసా కుటుంబం గురించి… నాకు లీసా స్టెప్ సిస్టర్ డాటర్. దానికి చిన్నప్పుడే ఫాదర్

చనిపోయాడు. మా సిస్టర్ పూర్ ఫామిలీ. ఇద్దరు అమ్మాయిలను పెంచుకుంది. చిన్న వయసే ఐనా సెకండ్

మ్యారేజ్ చేసుకోలేదు. ఆమెకు హెల్ప్ గా లీసాను నేను తీసుకు వచ్చాను. లీసా సిస్టర్ టీచర్గా బ్రెజిల్లో పనిచేస్తుంది. అదీ లవ్ మ్యారేజ్ చేసుకుంది. మరి లీసా మదర్ని నువ్వే ఆదుకోవాలి ఓల్డేజీలో.....

ఈ బాధ్యత నీ వారికీ ఇష్టం ఉండక పోవచ్చు. అదే నా సందేహం.'' అన్నాడు లీనియో

''ఐ ప్రామిస్ లీనియో.... లీసా మదర్ మా మదర్ ఒకటే నాకు. సంతోషంగా బాధ్యత తీసుకుంటాను.

ఆలా అని నా పెరెంట్స్ని వదులుకోను. లిసా కి ఇదే చెప్పాను.నా మదర్ని కూడా అలాగే అనుకోవాలని చెప్పాను.'' అన్నాడు ఆకాష్.

''ఏ నీ వె .... మీ వాళ్లతో చెప్పు ...అనుమతి తీసుకో ప్లీస్ …” అన్నాడు లీనియో లేచి వెడుతూ.

''సరే ఇప్పుడే వాళ్ళకి ఫోను చేస్తాను…” అన్నాడు ఆకాష్.

అన్నాడు కాని వివరంగా అమ్మకి వుత్తరం రాసాడు…

“మీకు అభ్యంతరం ఉంటే నేను ఇంటికిరాను.

లేదంటే మీరు ఇక్కడికి రండి టికెట్ పంపుతాను.” అని అన్నివిషయాలతో లిసా ఫోటో కూడా పంపుతూ

లెటర్ రాసాడు.

వుత్తరం చదివిన రేవతి అదిరిపడింది. ఆకాష్ ఇలా చేస్తాడని ఊహించలేదు. భర్త ఏమంటాడో అని భయపడింది. రెండురోజుల తర్వాత వుత్తరం ఇచ్చింది. అప్పటికి సెటిల్ అయింది.

ఆకాశకి సపోర్టుగా ఉండాలని నిర్నయిన్చుకుంది కన్న తల్లిగా .

భార్గవ్, వుత్తరం చదివి ఏమీ మాటాడలేదు. ఆలోచిస్తూ వుండిపోయాడు.

మా కుటుంబానికి ఇదో వారసత్వంగా ఉన్నట్టుంది. తాత గారి తమ్ముడు, తరువాత బాబాయి, ఇప్పుడు

నా కొడుకు తరతరాలుగా అదే అవలంబిస్తున్నారు.

వాళ్ళు ఇండియాలో కులాంతర వివాహాలు చేసుకుంటే నా కొడుకు ఇంకో అడుగు ముందుకువేసి

దేశాంతర వివాహం చేసుకున్నాడు.

ఇందులో తప్పు ఏముంది? ఈ కుల మత ప్రాంత బేధాలు మనుషులు ఏర్పరచుకున్నవే.

నీతి శాస్త్రాలు వల్లిస్తూ వేరుభావనలు, ఎక్కువ తక్కువ తేడాలు అవసరం లేదు.

కట్టు.. బొట్టు.. ఆహార నియమాల పట్ల వుండే ఇష్టాలు వేరు కావచ్చు.

''పాత సంప్రదాయాలను కొత్త తరం

తిరస్కరించి అందరమూ ఒక్కటిగా మనుషులను ఏకం చేయడం మెచ్చుకోవాలి. కానీ ద్వేషాలను రెచ్చకొట్టకూడదు.

'ఎవరో ఒకరు ఎపుడో అపుడు కారకులు కావాలి. మా దేవుడు, మీ దేవుడు... మా ఆచారం, మీ ఆచారం...

మీ అలవాట్లు, మా అలవాట్లు... అని విడదీయడం సరికాదు. వంద ఏళ్ళక్రితం పద్ధతులు మారలేదా?

ఇప్పుడూ మారుతున్నాయి . ముందు తరాల్లో కూడా మారుతాయి.

చంద్రమండలం ఒకప్పుడు దేవలోకం. ఇప్పుడు మనిషి కి నివాసం కాబోతోంది. అక్కడ మానవ సృష్టి

త్వరలో జరగవచ్చు. మరో 25 ఏళ్ళకి ఎన్నో మార్పులు చూస్తాము.

అరచేతిలో ప్రపంచం దర్శనం ఇస్తోంది. కొన్ని గంటల్లో సప్త సముద్రాలు దాటుతున్నాం. విదేశాలకు వెడుతున్నాం.

ఎవరితో ఐనా రంగు రూపం తేడా లేకుండా స్నేహం చేయగలం. ఎంత అద్భుతం! జీవన ప్రమాణాలు, విద్య, వైద్యంలో మార్పులు వచ్చాయి . ఎవరికి నచ్చినట్టు వారు ఉండగలరు. స్వేచ్ఛ, స్వతంత్రం వచ్చాయి.

మా తరంలో ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునే ధైర్యం లేదు . ఇప్పుడు అమ్మ నాన్నలకి చెప్పకుండానే

పెళ్లి చేసుకోగల చొరవ వచ్చింది. ఇక అలవాట్లు అనేవి అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఆహార పదార్ధాలు,

దుస్తులు, ఫ్యాషన్స్... ఒకటేమిటి, అన్నిదేశాల వస్తువులు దొరుకుతున్నాయి. అందువలన అందరూ అన్నీ వాడుతున్నారు. అది తప్పుకాదు. అవకాశం... ఇష్టమైనవాటిని ఆస్వాదించడం..

ఇదంతా అంగీకరిస్తూ ఆకాష్ నిర్ణయాన్ని తప్పు పట్టలేను. వాడి జీవితం వాడిష్టం. రేవతి అమ్మగా ఎలాగూ కొడుకునే సమర్థిస్తుంది. కొన్ని ఇబ్బందులు వున్నా సర్దుకు పోతాం.... ఆకాష్ సుఖమే మాకు సంతోషం.

వెంటనే బదులు రాసాడు భార్గవ, ''ఆకాష్! నీ నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరిస్తున్నాం. కొంత కాలం తర్వాత కోడలిని చూడటానికి వస్తాము. నిండు నూరేళ్లు మీ దాంపత్యం చల్లగా ఉండాలని మా ఆశీస్సులు .

ప్రొఫసర్ లీనియో దంపతులకు, లీసా కుటుంబానికి మా బెస్ట్ విషెస్. త్వరలో అందరమూ కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తాము.''

భార్గవ రాసిన వుత్తరం చదివి ''కలా నిజామా … అమ్మానాన్న ఇంతటి విశాల హృదయులా !” అనుకున్నాడు ఆకాష్

సంతోషంగా.

లీనియో లీసాలకు ఆ లెటర్ని చూపించాడు.

వాళ్ళుకూడా ఆనందపడ్డారు. … ఇంత సులువుగా సమస్య తీరుతుందని అనుకోలేదు.

వెడ్డింగ్ రిజిస్టర్ చేసి పార్టీ ఇచ్చారు స్నేహితులకు.

''మాకు పార్టీకి ఇన్విటేషన్లేదేమి అని లీసా మదర్ - సిస్టర్ అడిగితే 'ఆకాష్ పేరెంట్స్ వచ్చినపుడే మీకు పార్టీ ఇస్తాము… అంతదాకా వెయిట్ చేయండి ' అన్నారు లీనియో., అతని భార్య మరియానాలు.

ఆ మాట ఆకాష్ తన తల్లిదండ్రులకు చెప్పాడు.

లీనియో సంస్కారానికి ముగ్ధుడై... “మంచి కుటుంబం, మర్యాద. మనం అదృష్టవంతులం ..రేవతీ” అంటూ మెచ్చుకున్నాడు భార్గవ.

''అవును...మన ఆకాష్ ది మంచి సెలక్షన్....” అంది రేవతి.

ఆకాష్ కి కంపెనీలో ప్రమోషన్ వచ్చింది.....అదే సమయంలో లీసా పాపకి జన్మ ఇచ్చింది.

ఈ కబురు చెప్పి మీరు మనవరాలిని చూడటానికి వచ్చి తీరాలి అన్నాడు ఆకాష్.

''కాదనడానికి ఏముంది.... మాకూ ఎక్సయిటింగ్ గా వుంది అందరినీ కలవాలని .. వస్తున్నాం…” అన్నారు భార్గవ

రేవతీ.

అందరికి గిఫ్ట్స్ కొనితీసుకుని అమెరికా వెళ్లారు.

5 ఏళ్లతర్వాత అమ్మ నాన్నలను చూసి కన్నీటి పర్యంత మయ్యాడు ఆకాష్.

‘ఇన్నేళ్లు చూడకుండా ఎలా వున్నాను?....’ అని వేదన కలిగింది.

అవును మరి....లీసా స్నేహం, లీనియో దంపతులు చూపిన ఆదరణ అలాంటివి.

అంతేకాదు. జీవిత సహచారిగా లీసా ప్రేమ ఆ దూరాన్ని మరిపించింది.

పెద్దవాళ్ళకి అనుభవమే కనుక ''ఇది సహజం. అందరికీ జరిగేది.'' అనుకుని పిల్లలను ఆశీర్వదించారు.

ఆకాష్ ఇంతదాకా రెంటెడ్ హవుసులో వున్నాడు. ఇప్పుడు పెద్ద ఇల్లు కొన్నాడు.

లీసా డెలివరీ టైముకి వచ్చిన ఆమె మదర్ మొదట్లో కొంత మాటాడటానికి సందేహించింది.

ఎప్పుడు ఎప్పుడూ ఇండియన్స్ ని చూడలేదు. అందులోనూ వీరి కుటుంబం ఆచారాలు అస్సలు తెలియవు.

‘ఏమి తప్పుగా అనుకుంటారో అమ్మాయిని ఇచ్చుకున్న వాళ్ళు తగ్గి మర్యాదగా ఉండాలి ....’ అనుకుంది.

కానీ రేవతి పలకరించి “మనం ఇప్పుడు బంధువులుగా దగ్గర అయ్యాము....” అంటూ తెచ్చిన గిఫ్ట్ బంగారు దుద్దులు ఇచ్చింది. దానితో మనం ఒక్కటే అనే భావించింది ఆవిడ.

భార్గవ కూడా అరమరికలు లేకుండా పలకరించి వారి దేశం విశేషాలు అడిగాడు.

వాళ్ళ భాష వేరు కనుక లీసా అందరికీ మీడియేటర్ అయింది.

లీసా చెల్లి కుటుంబం కూడా వచ్చారు. అంతా సరదా ట్రిప్పులతో గడిపారు.

లీసా ప్రవర్తన, పద్ధతులు ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా మసలుకుంది.

చిన్నపాపతో కాలం యిట్టే గడిచిపోయింది . ఇంటికి తిరిగి వెళ్లాలని అనిపించలేదు రేవతికి.

భార్గవకి ఆఫీసు వుంది కనుక తప్పక తిరిగి ఇండియా వచ్చారు.

వచ్చేముందు ఆకాష్ అన్నాడు.... ''నాన్నగారూ! మీరు రిటైర్ అయ్యేక వచ్చేయండి. ఇక్కడ ఏదైనా చేయవచ్చు'' అని.

''చూద్దాంలే .... అప్పటి సంగతి.. ఇంకా పదేళ్లు సర్వీసు వుంది ''అన్నాడు భార్గవ.

అంచెలంచెలుగా ఎదిగిన ఆకాష్ వృద్ధిలోకి వచ్చాడు. వృద్ధాప్యంలో తల్లి తండ్రులను పిలిపించుకుని

బాగా చూసాడు. వారిని సుఖపెట్టాడు. ఇందులో లీసా సహకారం చాలా వుంది.

అందుకు విదేశీ వనితే ఐనా ఆమెను మెచ్చుకోవలసిందే !

'మనిషి ఎవరు' అని ఆలోచించే కంటే 'మనసు చూడాలి ' అనుకుని లీసాను జీవిత భాగస్వామిగా ఎన్నుకున్న

ఆకాష్ నిర్ణయం అందరూ మెచ్చుకోవాలి. ఇది నిజం .

ఆనాటి ఫ్రొఫెసర్ లీనియో మాటలు అతడు పాటించాడు. ఒక పేద కుటుంబానికి ఆసరా ఇచ్చాడు.

ఎవరైనా ఈ మాటలు గుర్తు ఉంచుకోవాలి. మనం ఎదగటమేకాదు. మరొకరికి చేయూత ఇవ్వాలి.

అప్పుడే ''మానవత్వం'' జీవించి ఉన్నట్టు.

*******

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉఛ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.

నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.





0 views0 comments
bottom of page