కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Miss Beautiful' written by Parimala Kalyan
రచన : పరిమళ కళ్యాణ్
ఆ కాలేజ్ లో మిస్ బ్యూటిఫుల్ పోటీలు జరుగుతున్నాయి.
కాలేజ్ బ్యూటీ గా పిలువబడే సౌజన్య ఆ పోటీల్లో పాల్గొంటోంది.
అందరూ ఆమెదే విజయం అనుకున్నారు.
అనూహ్యంగా ఆమెతో ధీరజ పోటీ పడింది. గెలిచింది.
ఎలా గెలిచింది అన్నది పరిమళ కళ్యాణ్ గారు రచించిన మిస్ బ్యూటిఫుల్ కథ చదివితే తెలుస్తుంది.
అదొక పెద్ద విమెన్స్ కాలేజి. ఆ కాంపస్ లో "మిస్ బ్యూటిఫుల్" అందాల పోటీలు జరుగుతున్నాయి. ప్రేక్షకులు, విద్యార్థులు అందరూ "సౌజన్య! సౌజన్య!" అని అరుస్తున్నారు. సౌజన్య ఆ కాలేజిలో అందరికన్నా అందగత్తె. అంతేకాదు ఆ కాలేజీ యాజమాన్యంలో ఒకరు తన తండ్రి. దాంతో సౌజన్య అంటే కాలేజిలో అందరికీ ఒక రకమైన ఆరాధనా భావం ఉంది.
సౌజన్యకి అందంతో ఎవరూ పోటీ పడలేరు. అందుకే అందరి అంచనాలు సౌజన్య మీదనే ఉన్నాయి. తన స్నేహితురాలి ప్రోద్భలంతో ధీరజ కూడా అదే పోటీలో పాల్గొంది. ధీరజ రంగు తక్కువే అయినా అందంగానే ఉంటుంది కానీ సౌజన్యతో పోటీ పడేంత ఏ మాత్రమూ కాదు. సౌజన్య బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటే ధీరజ ఆత్మ సౌందర్యంతో పోటీలోకి దిగింది.
"ఈ పోటీల్లో కచ్చితంగా క్రౌన్ నాదే" అంది సౌజన్య.
"హా అది అందరికీ తెలిసిందే కదా! కానీ ఈసారి తప్పకుండా మంచి పార్టీ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్", అంటూ ఎంకరేజ్ చేశారు తన స్నేహితురాళ్ళు.
పోటికోసం వచ్చిన ధీరజ ని చూసి,
"అబ్బో ఏంటి మిస్ బ్యూటిఫుల్ కిరీటం గెలుచుకుందామనే? తనకి కిరీటం పెడితే, కాకికి కిరీటం పెట్టినట్టే ఉంటుంది" అంటూ గేలి చేశారు సౌజన్య, ఆమె మిత్ర బృందం.
వారి మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా ఆత్మ విశ్వాసంతో,
"హా! చూద్దాం. ఎవరు గెలుస్తారో, ఎవరిని ఆ కిరీటం వరిస్తుందో?" అనేసి చిరునవ్వుతో అక్కడినుంచీ ముందుకి నడిచింది ధీరజ.
"కొద్ది క్షణాల్లో పోటీ ప్రారంభం కాబోతోంది. 3,2,1 హియర్ వుయ్ గో! పార్టీసీపాంట్స్ ప్లీస్; రౌండ్ -1:" అని అనౌన్స్ చేసింది ఎంసీ.
మొదటి రౌండ్లో లంగా వోణి వేసుకుని వచ్చింది ధీరజ. అదీ చూసి అందరూ నవ్వుకున్నారు. సౌజన్య, మిగతా పార్టిసిపెంట్స్ మాత్రం తమ అందాలను అందరికీ కనువిందు చేశారు.
తర్వాత రౌండ్లో లాంగ్ ఫ్రాక్ వేసుకుని కనీ కనిపించకుండా తన అందాన్ని చూపించింది ధీరజ. మళ్ళీ అందరూ నవ్వుకున్నారు.
"హ హ ఏముందని దీనికి అంత నమ్మకం, ఎలా గెలుద్దామని? మన సౌజి కన్నా అందంగా ఉంటుందా? " అని ఒకరంటే,
"ఛా, సౌజి తో తనకి పొలికేంటి అసలు?" అని మరొకరు.. టైటిల్ సౌజన్య దే అని అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు.
విజేతలను ప్రకటించారు, అందరి అంచనాలను తారుమారు చేస్తూ, ధీరజ "మిస్ బ్యూటిఫుల్" టైటిల్ గెలుచుకుంది. కోపంతో, చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యింది సౌజన్య.
ధీరజ గెలుపుకు కారణం,
చివరి రౌండ్లో అందరినీ అడిగిన ప్రశ్నలు.
"మిస్ బ్యూటిఫుల్ అంటే ఎలాంటి వారిని ఈ టైటిల్ సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు?" అన్న ప్రశ్నకు సమాధానంగా..
"లుక్స్ అంటే చూపుల్లోనూ, బ్యూటిఫుల్ స్మైల్, అంటే చక్కని నవ్వు, అందం అన్నీ ఉన్న వారికే ఈ టైటిల్ అని నేను అనుకుంటున్నాను. సో పైన చెప్పినవన్నీ నాలో ఉన్నాయి కాబట్టి, ఈ టైటిల్ నాకే వస్తుందని నా నమ్మకం" అంది సౌజన్య.
"అందం అంటే కేవలం పైకి కనిపించే అందం మాత్రమే కాదు, 'బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మిన్న' అన్నట్టు, పైకి ఎలా ఉన్నా నడవడిక బాగుండాలి, మంచి మనసు ఉండాలి. ఆత్మవిశ్వాసం మాటల్లో చేతల్లో కనపడాలి." అని సమాధానం ఇచ్చింది ధీరజ.
వాటిలో ధీరజ చెప్పిన సమాధానం అందరికి నచ్చేలా ఉండటంతో ధీరజని విజేతగా ప్రకటించటం జరిగిందని న్యాయనిర్ణేతలు తేల్చి చెప్పారు.
అంతే కాదు "పైపై అందాలను మాత్రమే అందరికీ కనిపించేలా రాంప్ పై నడిచారు అందరూ. కానీ ధీరజ మాత్రం తన హుందా తనాన్ని, తెలివిని ప్రదర్శించింది. అలాగే అందంగా ఉన్నామన్న భావనతో కొందరు పైకి గర్వంగా ఉంటూ వారే అధికులమని భావిస్తూ ఉంటారు, కానీ అంతః సౌందర్యం అన్నిటికన్నా ముఖ్యమైనది.
*బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మిన్న* అనే సామెత ఉండనే ఉంది, దాన్ని నిజం చేసినందున ఈ సారి విజేతను మిస్. ధీరజగా ఎంపిక చెయ్యటం జరిగింది." అంటూ ముగించింది ఆ కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేక అతిధి.
ప్రిన్సిపల్ మాట్లాడుతూ, "ధీరజ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. కానీ చదువులో సరస్వతి. సరస్వతి, లక్ష్మి ఓకే చోట నివాసం ఉండరు అన్నట్టు, తనకి మంచి వాక్కు ఉన్నా, చదవాలన్న పట్టుదల, కృషి ఉన్నా తన తండ్రికి చదివించే ఆర్థిక స్తోమత లేదు.
కానీ ఎంట్రన్స్ టెస్టులో ఫస్ట్ ర్యాంక్ సంపాదించింది. తనలోని పట్టుదలను చూసి, మేనేజ్మెంట్ తో మాట్లాడి, ఫీజు రాయితీనీ తనకోసం కల్పించాను.
అలాగే తన విషయంలో నా అంచనా ఎప్పుడూ తప్పలేదు, ప్రతి పరీక్షలో తను కాలేజీ టాపర్ గా నిలిచింది. చదువులోనే కాక ఆక్టివిటీస్ లో కూడా ఎప్పుడూ ముందుండేది.
ఈ సంవత్సరంతో చదువు పూర్తి చేసుకుని బయటకి వెళ్లబోయే తను, నా మాటకు విలువిచ్చి, తన స్నేహితురాళ్ళ ప్రోద్భలంతో ఈ పోటీలో పాల్గొనటం జరిగింది.
ఇక్కడ కూడా తన మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు. *ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ హర్*
తను నా స్టూడెంట్ కావటం నేను, ఈ కాలేజీ ఎంతో గర్వించదగ్గ విషయం! గివ్ హర్ ఏ వెరీ బిగ్ అప్లోజ్!" అని ఉద్వేగంతో ముగించారు.
కళాశాల ప్రాంగణంలో అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.
తన తప్పు తెలుసుకున్న సౌజన్య తల దించుకుంది, ఇకపై ఆకాశంలో విహరించకుండా, నేలపై నడవాలని నిర్ణయించుకుంది.
ధీరజ దగ్గరకి వచ్చి, చెయ్యి కలిపి "కంగ్రాట్స్" అంది.
ధీరజ నవ్వి, చిన్న హగ్ ఇచ్చింది. ఆ ఆలింగనంతో తన మనసులో భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది సౌజన్యకి.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నా పేరు పరిమళ. పరిమళ కళ్యాణ్ పేరుతో కథలు, కవితలు రాస్తూ ఉంటాను. ఇప్పటివరకూ ప్రతిలిపి, మొమ్స్ప్రెస్సో లాంటి సోషల్ ఆప్స్ లో, ఫేస్బుక్ గ్రూప్స్ లోనూ అనేక కథలు రాసాను. తపస్విమనోహరం అనే కొత్త వెబ్ మ్యాగజైన్ కి కూడా కథలు అందిస్తున్నాను. ఈ మధ్యనే పత్రికలకి కథలు పంపటం మొదలు పెట్టాను. నా కథల్లో ఒకటి స్నేహ వార పత్రికలోను, భూమిక మరియు మాలిక వెబ్ పత్రికల్లో ఒక్కొక్క కథ ప్రచురితం అయ్యాయి. కథలే కాకుండా కవితలు, పేరడీ పాటలు కూడా రాస్తూ ఉంటాను. హస్యానందం పత్రికలో పేరడీ పాటల పోటీలో నా పాట బహుమతి గెలుచుకుంది. అలాగే ఆడియో కథలు కూడా చేస్తూ ఉంటాను. అలాగే నాకు దొరికిన కథలు అన్నీ చదువుతూ ఉంటాను.