'Raji-Radha' written by Radhika
రచన : రాధిక
“ఏవండీ ! నాకు ఇక్కడ ఎందుకో వుండ బుద్ది కావడంలేదు. మనం వెళ్ళి పోదామండీ ! “అంటోంది రాజి.
“ఏం, ఏమైంది? బాగానే వుందికదా ! రాధ బాగానే చూస్తోందికదా” అన్నాను .
“ఆ, ఏం బాగు! నన్ను, మిమ్మల్ని గౌరవంగా చూస్తే చాలా? అబ్బాయిని, అదే ప్రణవ్ ని అలా పేరు పెట్టి పిలవడం, వాడికి పనులు చెప్పడం నాకేమీ నచ్చడం లేదు. “
“ సరెలే, అలాగే వెళ్ళి పోదాం. వీలుచూసుకుని అబ్బాయికి చెబుతాను. “
నా చదువు, వుద్యోగం, పెళ్ళి అన్నీ స్వస్థలం లోనూ, ఆ చుట్టుపక్కల అయిపోయింది. మాది మరీ పల్లెటూరూ కాదు, అలాగని పెద్దవూరూ కాదు. నా పెళ్లయ్యాక మా అమ్మ, నాన్నలు నాదగ్గరే వుండేవారు. నా భార్య రాజి, అత్తమామల దగ్గర మంచి పేరే తెచ్చుకుంది. కాలంతో పాటు నా తల్లిదండ్రులు పరమపదించడం, ప్రణవ్ పుట్టడం, వాడి చదువు, పెళ్ళి అన్నీ క్రమంగా జరిగిపోయాయి. నేనూ రిటైరైపోయాను. రాజికి మేమిద్దరమే వుండడం బాగా అలవాటైపోయింది. పైగా యింట్లో పనులకి పనిమనిషి వుంది. నా పుస్తకాలు, నా చదువులతో నాకు కాలక్షేపం అయిపోతుంది. ఆవిడ కాలక్షేపానికి ఇరుగు పొరుగులతో గవ్వలాట, కాకపోతే వుబుసుపోక కబుర్లు. కొడుకు, కోడల్ని చూడాలనిపించి బెంగలూరు వచ్చాము. అబ్బాయికి పెళ్ళి అయిన తరువాత బెంగలూరు లో కాపురం పెట్టించి వెళ్ళిపోయాము. తరువాత మళ్ళి ఏడాది తరువాత ఇదే రావడం. కోడలు , అబ్బాయి తెల్లవారి హడావుడిగా వురుకులు, పరుగుల మీద స్వారి చేస్తారు. అబ్బాయికి కంపెనీ కారు వచ్చి తీసుకెళుతుంది. కారు వచ్చే వేళకి తయారుగా వుండాలి. ఆ కారు లో వాళ్ళ బాస్ కూడా వుంటాడు. ఆయనని వెైట్ చేయిస్తే బాగుండదు, అందుకేనేమో అంత హడావుడిగా పరిగెడతాడు. అమ్మాయి అన్నీచేసుకుని, మాకు అన్నీచూసి ఆఫీసుకి వెళుతుంది. మా వూళ్లో మా దినచర్యకి, ఇక్కడ వీళ్ల పరుగులకీ పొంతన లేదు. నాకు ఎలాగో కాలక్షేపం అయిపోతుంది. చిక్కల్లా మా ఆవిడతోనే.
******
“ప్రణవ్, నేను స్నానానికి వెళుతున్నాను. దోశెలు వేశాను. మనిద్దరికి బాక్సుల్లో సర్దేయవా, ప్లీజ్ ! ఆ చిన్న బాక్సుల్లో చట్నీ కూడా వేయి. నేను వచ్చి అత్తయ్యగారికి, మామయ్యగారికి వేడిగా వేసి పెడతాను. ” కోడలు పిల్ల రాధ, అర్ధింపు.
“ప్రణూ, కొద్దిగా బాటిల్సు లో మంచినీళ్ళు నింపవా!ఆ టిఫిన్ బాక్సులు, నీళ్ళ బాటల్సు బ్యాగులో సర్దేయ్. ”
“ ప్రణీ , నేను రెడీ అయిపోతాను. నా స్కూటర్ సెల్లార్ లోంచి పైకి తెచ్చి పెట్టవా. ఒకసారి స్టార్ట్ చేసి చూడు. నిన్న ఎందుకో వెంఠనే స్టార్ట్ కాలేదు. ”
“అత్తయ్య, మామయ్యగారు టిఫిన్ రెడీ. రండి. ”
“ అమ్మా, నీకు టైమవుతుంది. నువ్వు వెళ్ళు. మేము కొంచెం సేపయ్యాక తీరిగ్గా తింటాము . ” అంటాను .
“అత్తయ్యా , కుక్కర్ లో బియ్యం పోసి రెడి గా పెట్టాను. మీరు పది గంటలకి వేడిగా మామయ్య గారికి వండండి. ఆయనకి వేడివేడిగా యిష్టం. అన్నీ రెడీగా పెట్టాను . స్టవ్ వెలిగించండి అంతే !”
ఓ. కే.. బై .
రాధ అబ్బాయిని ఎంత ముద్దుగా, ఎన్ని రకాలుగా పిలుచుకుంటోందో! వినడానికి సొంపుగా వుంటోంది. కాని మా ఆవిడకి మాత్రం ఆ పిలుపులు నచ్చవు. ఆ పిలుపులు వినపడ్డప్పుడల్లా మా ఆవిడ మొహం చూళ్ళేము. అదీగాక అబ్బాయికి పనులు చెపుతోంటే ఆవిడ మనసు కుతకుత లాడిపోతుంది. ఒకందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మా ఆవిడకి మొగుణ్ణి అలా పేరు పెట్టి పిలవడం యిష్టం లేదు కనుక నేను బతికిపోయాను. లేకపోతే నా పేరు సుబ్బారావుని ఎన్ని రకాలుగా పిలిచేదో !! సుబ్బారావు, సుబ్బి, సుబ్బు, సుబ్బా, సుబ్బయ్య . . . . . . .
******
తొమ్మిదయ్యేటప్పటికి యిల్లంతా ఖాళీ అయిపోతుంది . నిశ్శబ్దం. కోడలు పిల్ల చేసిన టిఫిన్ ప్లేట్లల్లో పెట్టుకుని తింటాము . తరువాత నేను ఏవో పుస్తకాలు చదువుకుంటాను . ఆవిడ కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటుంది . కాసేపు టి. వి. చూస్తూ గడిపేస్తాము . భోజనం అయ్యాక కాస్త కునుకు తీస్తాము . నాలుగు గంటలకి కాస్త పలహారం పెడుతుంది . అత్తగారు కష్టపడకూడదని రాధ స్వగృహా నుంచి స్వీట్లు, ఖారా తెచ్చి డబ్బాల్లో పెడుతుంది . పళ్ళు కూడా తెచ్చి పెడుతుంది. బజారు నించి తెచ్చేవన్నీ అమ్మాయే తెస్తుంది. స్కూటర్ మీద ఆఫీసుకి వెళుతుంది కనుక . మా పుత్రరత్నం ఆఫీసు కారులో వెళతాడు, అందుకని బజారుపనులు చేసే తీరిక వుండదు . మా ఆవిడకి బజారు పలహారాలు అంత యిష్టం వుండవు . వేడి వేడిగా పకోడీలో, మిరపకాయబజ్జీలో వేసుకుని తినడం అలవాటు. పాపం అమ్మాయికి టైముండదు. అలా అంటే కనీసం ఆదివారమైనా చేసి పెట్టొచ్చుగా !. . . అంటుంది నా దగ్గర. “చూస్తున్నావుగా ! ఆదివారం మాత్రం అమ్మాయికి తీరిక ఎక్కడ వుంది . న్యాయంగా చెప్పాలంటే ఆదివారం నాడే ఎక్కువ పని వుంటోంది . పాపం మనం వచ్చి యిన్నాళ్ళయ్యింది. ఏ ఆదివారమైనా సరదాగా బయటికి వెళ్ళారా ? ఆ వేళే సోఫా కవర్లు, మంచాలమీద దుప్పట్లు, కర్టెన్లు యివన్నీ మార్చి వుతికినవి వేసుకుని, మాసినవి వుతుక్కుని, ఆరేసుకునేటప్పటికి ఆదివారం కాస్తా అయిపోతుంది . “
“ ఆ ! మీరు మరీను , నేనూ చేశాను . ఇల్లంతా శుభ్రంగా వుంచేదాన్ని కాదా ? మన బంధువులంతా నన్ను మెచ్చుకునేవారు, రాజమ్మ యిల్లు నీటుగా వుంచుతుందని.”
ఆవిడ అలా మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుంది . నేను ఆఫీసు నుంచి పెందరాళే వస్తే , వచ్చేటప్పుడు సందు మొగలో ఒక భార్యా భర్తలు చిన్న బండిలో మిరపకాయ బజ్జీలు , పకోడీలు , పిడతకింద పప్పు, కరకజ్జం యిలాంటివి వేడివేడిగా వేసినవి , ఆవిడకి యిష్టం కదా అని తెస్తుండేవాడిని . ఈవిడ యిప్పుడు రాధ చెయ్యడం లేదని సణుగుతోంది కాని ఆవిడ మాత్రం ఎప్పుడు చేసింది కనక .
******
రాధా, ప్రణవ్ లు రోజూ పొద్దుటే లేచిపోతారు . లేస్తేనే కాని వాళ్లు పనులు చేసుకుని ఆఫీసులకి బయలుదేరలేరు . ఆదివారం నాడు మాత్రం యింకో గంట ఎక్కువగా బద్ధకం తీర్చుకుంటారు . ఇహ లేచిం దగ్గరనుంచి పరుగులే ! ఆ రోజే వాషింగు మెషిన్ పెడతారు . ఆ పని యించుమించు సగం రోజు అయిపోతుంది . ఓ వైపు బట్టలు వుతుక్కుంటూనే టిఫిన్ ఏర్పాట్లు చేస్తుంది .
“ప్రణవ్ , డ్రైయర్ లో బట్టలు తీసి బకెట్లో వేసాను . కొంచెం బకెట్ బయట పెట్టవా , నేను వచ్చి ఆరేస్తాను . కొంచెం క్లిప్పులు పెట్టవా ! ఎగిరిపోతున్నాయి . “ ఒకరికొకరు సాయం చేసుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు .
పెళ్ళయిన కొత్తల్లో మాకు పనిమనిషి సరిగా కుదర్లేదు . అప్పుడు ఆవిడ బట్టలు ఆరేసేటప్పుడు నేనూ సాయం చేసేవాడిని. దుప్పట్లు ఆవిడ పిండ లేకపోయేది. నేను పిండి దణ్ణం మీద ఆరేసేవాడిని. మరి అప్పుడు మా అమ్మ ఎంత బాధ పడిందో !
*******
“ చూడండీ ! నేను ఎప్పుడైనా బాబిగాడితో ఇలా ఆడపనులు చేయించానా ? నాకు చాలా బాధగా వుంది . వెధవకి నోట్లో నాలిక లేదు . ” అని వాపోతోంది కన్నతల్లి . వాళ్ళ బాబిగాడికి కోడలు పిల్ల పనులు చెబుతోందని తెగ యిదైపోతోంది. మరి నాకు చెప్పి తను చేయించుకున్నప్పుడో! ఙాపకం లేదు కాబోలు . !!!!
జ్ఞాపకాల్లో కొంచెం లోపలికి వెళితే . . . . . . రాజి
“ ఏవండీ , ప్రణవ్ కి స్నానం చేయించాను , కొంచెం వాడికి వళ్ళు తుడిచేయండి. నేను కూడా రెండు చెంబులు పోసుకుని వచ్చేస్తాను. మీకు బాక్సు యివ్వాలిగా “ అని బాబును బాత్ రూమ్ లోంచి బయటికి పంపేసి తను లోపల గడియ వేసేసుకునేది. నేను వచ్చేంతవరకూ బాబు అలా స్నానం చేసిన తడితోనే వుండేవాడు. కనీసం వాడికి చలి వేస్తుందని కూడా ఆలోచించేదికాదు.
“యిదిగో , మిమ్మల్నే ! కాఫీ కలిపి స్టవ్ మీద పెట్టాను. బాబికి పాలు కూడా కలిపాను. మీరు కాఫీ తాగి , వాడికి కూడా పాలు కొంచెం కొంచెం గ్లాసులో పోసి పట్టేయండి. దేవుడికొక్క దణ్ణం పెట్టుకుని, రెండు పూలు వేసుకుని వచ్చేస్తాను .
నేను రోజు కాఫీ తాగి, పేపరు చదివి, స్నానం చేసి, టిఫిన్ తిని ఆఫీసుకి బయలుదేరతాను. ఈ పనులన్నీ చేసుకున్నాన్యాయంగా నాకు బోలెడంత తీరిక దొరకాలి. కాని అదేమి ఆశ్చర్యమోగాని నాకు అసలు తీరికే వుండేది కాదు . నేను చేసే పనులకి లెక్క తెలిసేది కాదు .
మరి నాకు పనులు చెప్పినప్పుడు మా అమ్మ మనసు నొచ్చుకుందో లేదో నాకు ఆ రోజూ తెలియలేదు . . . . . ఈ రోజూ తెలియలేదు .
***********
ఓ ఆదివారం సాయంత్రం రాధ ఒక ప్రపోజల్ పెట్టింది. ఏదైనా సినిమాకి వెళ్ళి, వచ్చేటప్పుడు బయట హోటల్లో భోంచేసి వద్దామని ! సరే అందరం సంతోషంగా ఓకే అనేసాము . ఏ సినిమాకి వెళదామని ప్రశ్న. ప్రణవ్ హింది సినిమాకి వెళదామన్నాడు. రాధ మాత్రం అత్తయ్యగారికి హిందీ సినిమా బోరు కొడుతుంది. తెలుగు సినిమా కి వెళితే ఆవిడ సరదాగా చూస్తారు అంది. మెల్లిగా ఏ సినిమాకి వెళ్ళాలి అన్నది చివికిచివికి గాలివాన ఔతోంది రాధ, ప్రణవ్ ల మధ్య . నేను వుండబట్టలేక “ఫరవాలేదులే అమ్మా, హింది సినిమాలు నాకూ యిష్టమే. మీ అత్తగారికి కూడా హిందీ డైలాగులు పూర్తిగా అర్ధం కాకపోయినా కధ అల్లేసుకుంటుంది అని సద్దుమణిగేలా చేసి సినిమాకి వెళ్ళాము .
“సినిమాకి వెళ్ళడానికి యింత రాద్ధాంతం చేయాలా ? ఏదో మొగుడు అడిగాడు , ఏ సినిమా అయితే ఏంటి . వెళ్ళడం ప్రధానం గాని “ అని నాకు వినబడేట్లు నా చెవిలో వూదుతోంది . పాపం ఆ పిల్ల అత్తగారి కోసం మొగుడితో వాదించింది కాని తనకు కూడా హిందీ సినిమాలు యిష్టమే .
కొన్ని రీళ్ళు వెనక్కి వెళితే. . . .
పెళ్ళయిన కొత్తల్లో పండగలకి మా అత్తగారింటికి వెళ్ళాను . పండుగనాడు భోజనాలయ్యాక సినిమాకి వెళదామన్నారు మరదళ్ళు .
“సరే , ఏ సినిమా “
“మంచి హిందీ సినిమా వుంది . చాలా బాగుందని మా స్నేహితులు చెప్పారు . “
“ బావగారికి కూడా హిందీ సినిమాలు యిష్టమే. ”
మా బావమరిది గబగబా వెళ్ళి టిక్కెట్లు తెచ్చాడు. టిక్కెట్లు తెచ్చాక రాజికి తెలిసింది – హిందీ సినిమాకి అని .
“నేను హింది సినిమాకి రాను . ” అంది రాజి .
“బాగుంటుందక్కా “
“నేను రానంటున్నాను కదా. తెలుగు సినిమాకైతే వస్తాను . “
“బావగారు ఒప్పుకున్నారు. ”
“అయినాసరే “
“టిక్కెట్లు కూడా తెచ్చానక్కా . ”
“చించి పారేయండి . నేను రాను . లేకపోతే మీరందరూ వెళ్ళండి . ”
“అదేమిటక్కా , ఈ ప్రోగ్రామ్ వేసిందే నీకొసం , బావగారికోసమే కదా . ఈ సారికి రా అక్కా . ” ఇలా గంట గడిచిపోయింది . సినిమా టైమైపోయింది టిక్కెట్లు వృధా అయిపోయాయి . దీని పర్యవసానం మరునాడు కూడా పడింది . మనసుల్లో చిన్నపాటి అలజడి.
********
రాధ అబ్బాయికన్నా కొంచెం ముందే వస్తుంది . వచ్చి బట్టలు మార్చుకుని కాఫీ కలుపుకుని తను తాగి, ప్రణవ్ కోసం ఫ్లాస్కు లో పోస్తుంది . కాస్త రిలాక్సుగా కాసేపు పేపరు చదివి, ఫోన్లో వాళ్ళ అమ్మగారితోనూ, తెలుసున్న స్నేహితులతోనూ కబుర్లు చెబుతుంది . ఈలోగా అబ్బాయి వచ్చి ఫ్రెష్ అయ్యి ఫ్లాస్కులో కాఫీ తాగి సోఫా లో రాధ పక్కన కూర్చుంటాడు.
మేమిద్దరమూ బాల్కనీలోకి వచ్చి కూర్చుంటాము .
“ఎంతసేపూ , ఆ ఫోన్లో గంటలు గంటలు కబుర్లు. కనీసం బాబికి కాఫీ తను యివ్వచ్చుగా !వాడే పోసుకుతాగాలా ? అయినా అంత కబుర్లేం వుంటాయండీ, తల్లికూతుళ్లకి. ”
“పోన్లేవే!పాపం పగలంతా ఆఫీసులో పనిచేసిచేసి అలసి పోయివుంటుంది. ఓ పదినిమిషాలు అమ్మతో మాట్లాడుకుంటే తప్పేమిటి?”
“మీరు ఆ అమ్మాయిని మరీ వెనకేసుకువస్తారు. ఈగ వాలనివ్వరు. అయినా నా కెందుకులెండి. ”
“రాజి, ఒక్కసారి మన జీవితంలో వెనక్కి వెళ్ళు. నేను ఏమైనా అంటే నిష్టురంగా వుంటుంది. నేను ఆఫీసుకి వెళ్ళిపోయాక పగలంతా యిరుగుపొరుగు తో కబుర్లు చెప్పుకునేదానివి కాదూ.
*****
“ఈ చప్పిడి తిండి తినలేకపోతున్నానండి. కూరల్లో వుప్పు , కారం ఏమీ వుండవు. శుభ్రంగా గోంగూర పచ్చడి కారంకారంగా తిని ఎన్నాళ్ళయ్యిందో. అసలు వీళ్ళు పచ్చళ్ళే తినరు. పాపం బాబిగాడు చిన్నప్పుడు కారాలు ఎలా తినేవాడండీ. ఇప్పుడు జిహ్వ చంపుకుని చప్పిడి తిండి తినడానికి అలవాటు పడ్డాడు. అంతా రాధమ్మ పుణ్యమే. ”
“సరేలే, వాళ్ళిద్దరికి నచ్చినట్లు వాళ్ళు వండుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా నీకేం కావాలో, ఎలా కావాలో రాధకి చెప్పావా? నువ్వు అమ్మాయికి నీ రుచి చెబితే అలాగే చేస్తుంది. అంతేగాని నీ రుచులేమిటో ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది. పెళ్ళైన తరువాత పట్టుమని పదిరోజులు కూడా మనింట్లో లేదు. ఒకసారి చెప్పిచూడు. పొద్దున్నే అంత హడావుడి పడి వంట చేస్తోంది కదా. నువ్వు కొంచెం వంటలో సాయ పడితే, నీక్కావలసిన కారాలు, మిరియాలు వేసుకుని తృప్తిగా భోజనం చేయొచ్చుగా! ఈ సణుగుడు వుండదు. ఈ రోజుల్లో అందరూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మన అలవాట్లు, రుచులు వేరు. ఈ కాలం పిల్లల అభిరుచులు వేరు . ”
*****
రేపు శ్రీరామ నవమి. ఒక్కసారి నా చిన్నప్పుడు మా అమ్మ చేసిన శ్రీరామనవమి గుర్తుకొచ్చింది. మా అమ్మ మా చిన్నప్పుడు ఈ పండుగ చాలా భక్తిగా చేసేది. తెల్లవారుఝామునే లేచి సీతారాములవారి విగ్రహాలకి వస్త్రాలు కట్టి, పూజ చేసేది. రాములవారి పెళ్లి అని బూరెలు, పులిహోర చేసి యిరుగుపొరుగుకి అందరికి పంచేది. పానకం, వడపప్పునైవేద్యం పెట్టి వాటిని వీధి అరుగుమీద పంచడానికి వుంచేది. మేము, పిల్లలము వంతులవారిగా ఆ వీధిన వెళ్లే వాళ్లందరిని పిలిచి పంచిపెట్టే వాళ్లము. మాకు చాలా సరదాగా వుండేది. మా అమ్మ యిష్టంగా చేసే పూజ ఇదేనేమో ! మిగిలిన పండుగలు పిల్లలకోసం అంటే ప్రసాదాలకోసం చేసేది. ఆమె భగవద్గీత బాగా చదివి అర్ధం చేసుకున్న మనిషి. ఎక్కువగా మడితడి లాంటి ఆడంబరాలకి ప్రాధాన్యత యిచ్చేది కాదు. మా ఆవిడ వాళ్ళ అమ్మగారింట్లో ప్రతీ పండుగ చాలా భక్తిగా చేసేవారుట. రాజి కి కూడా పండుగలంటే అలాగే చేసుకోవాలని, మా అమ్మకి పూజాపునస్కారాలమీద అంత శ్రద్ధ లేదని అంటుండేది. రాజి ఇప్పటికీ కొన్నిపండుగలు తనకి తెలియకపోయినా పక్కవాళ్లు చేస్తున్నారని చేసేస్తుంది. ఈరోజు ప్రణవ్, రాధ ఆఫీసునుంచి తొందరగా వచ్చారు. వస్తూవస్తూ రెండు సంచుల్నిండా పూలు, పూలదండలు, నాలుగైదు రకాల పళ్ళు తెచ్చారు. వస్తూనే రాధ “అత్తయ్యగారూ, మామయ్యగారు రేపు శ్రీరామనవమి. నేనూ, ప్రణవ్ శెలవు పెట్టాము. నాకు ఈ పండుగంటే యిష్టం. మీరు పూజ చేయండి. నేను వంట చేస్తాను. ” అని రాముడంటే తనకి ఎందుకు యిష్టమో, ఆయన అందరికి ఎందుకు ఆరాధ్యుడయ్యాడో గలగలా చెప్పేసింది . మరునాడు మాకన్నాముందే లేచి స్నానం చేసేసి రాములవారి అలంకరణలో నిమగ్నమైపోయింది. చాలా చక్కగా అలంకరించింది . చూడడానికి ఒక చిన్న సెట్టింగులా అనిపించింది. ఆ అలంకరణ చూస్తుంటే నిజంగా రాముడు సీతా లక్ష్మణుల సమేతంగా వచ్చేడేమో అనిపించింది. మా స్నానాలు అయ్యేటప్పటికి మాకు టిఫీన్ రెడి చేసి, వంటపనిలోకి వెళ్లిపోయింది. అన్నిపనులు పూర్తిచేసేసి అత్తగారితో పూజ చేయించింది. నిజంగా ప్రణవ్ అదృష్టవంతుడనిపించింది. పనికిపని, పూజకిపూజ, మర్యాదకిమర్యాద అన్నీకలపోసింది. రాజి, అప్పుడప్పుడు తన కోడలికి దేవుడు, భక్తి లేవని, ఎప్పుడూ ఏ పండుగా చేయదని నాతో చాలా సార్లు అంటూవుంటుంది. నాకు తెలుసు నేనేమైనా మాట్లాడితే కోడల్ని సమర్ధిస్తున్నానని అంటుంది. మౌనంగా వుండడమే మంచిదనిపిస్తుంది. యిప్పుడు ఏమంటుందో మరి.
మా ఆవిడ నాకు చెప్పే కంప్లైంట్లన్నిచాలా సిల్లీగా అనిపిస్తాయి. ఆవిడ ఎప్పటికైనా అర్ధంచేసుకుంటుందా, లేక నాతో కాకుండా అమ్మాయితోనే చెప్పి చెడ్డదైపోతుందా అని నాకు భయం. అలా కాకుండా వుంటే బాగుణ్ణు.
ఆ నాటి రాజి- యీనాటి రాధ మీద అలా అంటుందేమిటి ? ఆ నాటి రాజి , యీ నాటి రాజమ్మగారు –సగటు అత్తగారు. అత్తలూ జోహార్లు. సగటుగానే వుండండి. అంతకుమించి రేఖ దాటకండి. దాటితే ఏం జరుగుతుందో- కధ టివి సీరియల్లోలాగ ఎన్ని మలుపులు తిరుగుతుందో !!!
***శుభమ్***