కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Satakshi' written by Yasoda Pulugurtha
రచన : యశోద పులుగుర్త
పరమేశ్వర శాస్త్రిగారు కాకినాడ ప్రభుత్వ సంస్కృత కళాశాలలో సంస్కృత లెక్చరర్ గా పనిచేసి రిటైర్ అయినారు.. వారి సతీమణి అన్నపూర్ణ.. భర్తకు తగిన ఇల్లాలు.. నిత్యం వారింట్లో పూజామందిరంలో లలితాదేవి, పూజలందుకుంటూ, ధూప దీప నైవేద్యాలతో దేదీప్యమానంగా శోభిల్లుతూ ఉంటుంది.. దసరా పర్వదినాలలో ఆ చుట్టు పక్కల ఉన్నవారందరూ వీరింటికి వచ్చి లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ ఉంటారు.. శాస్త్రిగారు గంభీర స్వరంతో లలితా సహస్రనామాలను ఒక్కొక్కటీ చదవడం, వారిని అనుకరిస్తూ ఆ నామాలను పారాయణం చేస్తుంటే ప్రకృతే స్తంభించిపోయిందా అనేటట్లుగా భక్తిభావంతో తాదాత్మ్యత స్థితిని అనుభవించడం పరిపాటి.. అలాగే కార్తీక మాసంలో ఆయన చెప్పే శివపురాణం విని తరించ వలసిందే..
వారికి ముగ్గురు కూతుళ్లు.. పెద్దమ్మాయి శాకంబరికి, రెండో అమ్మాయి భ్రామరీ కి మంచి సంబంధాలు చూసి వివాహం జరిపించారు.. మూడో అమ్మాయి శతాక్షి డిగ్రీ పూర్తి చేసింది.. ముగ్గురు కూతుళ్లకూ సప్తశతీ దేవతల పేర్లను పెట్టుకున్నారు.. కూతుళ్లనందరినీ డిగ్రీవరకు చదివించారాయన.. శతాక్షికి కూడా యోగ్యుడైన వరుడిని చూసి పెళ్లిచేసే ప్రయత్నంలో ఉన్నారు శాస్త్రిగారు..
శతాక్షి చాలా చురుకైన అమ్మాయి.. మహా తెలివితేటలు కలది.. చూడగానే ఆకర్షించే ముగ్ధమనోహర రూపం.. పచ్చని మేనిఛాయ, చెంపకు చారెడేసి కళ్లు, పిరుదులు దాటిన జడా, నువ్వు పువ్వు లాంటి ముక్కు, చెప్పాలంటే అలనాటి ప్రబంధకవుల కావ్యనాయికా లక్షణాలు చాలానే ప్రొదివి చేసుకుంది..
ఒకరోజున శాస్త్రిగారి చెల్లెలు చంద్రకళ రాజమండ్రి నుండి కాకినాడకు అన్నగారిని చూడాలని వస్తూ ఒక శుభవార్తను కూడా మోసుకొచ్చింది..
అన్నగారి పక్కనే కూర్చుని " మీ బావగారి హైస్కూల్ హెడ్ మాస్టర్ గారబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఎవరైనా తెలుసున్నవారి అమ్మాయి ఉంటే చెప్పమంటూ మా వారిని అడిగారట అన్నయ్యా! మీ బావగారు నాకు ఈ విషయం చెప్పగానే ఎవరో ఏమిటీ, మన శతూ ఉందికదా... అని వెంటనే ఆ అబ్బాయి వివరాలు తీసుకోమని చెప్పాను. వారి అబ్బాయి ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లో బి.హెచ్. ఈ. ఎల్ లో ఇంజనీర్ గా చేస్తున్నాడుట. మాస్టారికి కూడా తండ్రి నుండి సంక్రమించిన పొలాలూ అవీ ఉన్నాయని, చాలా మంచి కుటుంబం అంటూ మీ బావగారన్నారు.. జాతకాలు కలిస్తే పెళ్లిచూపులకు ఆహ్వానించవచ్చని అన్నగారితో చెప్పింది..
శాస్త్రిగారు వెంటనే జాతకాలు చూసారు.. ఇద్దరివీ బ్రహ్మాండంగా కలిసాయని చెల్లెలు ద్వారా వారికి తెలియపరచడం, ఆ తరువాత నెల రోజులలో శతాక్షికి పెళ్లిచూపులు జరిగాయి.. అందమైన శతాక్షి అందరికీ నచ్చేసింది.. పెళ్లికొడుకు రాంబాబు సిగ్గు సిగ్గుగా తలవంచుకుని కూర్చుంటే శతాక్షి నిర్భయంగా తలెత్తి అతని వైపు చూసింది.. అందగాడే కానీ, అంత సిగ్గేమిటి బాబూ, నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత అమాయకుడిలా ఉన్నాడే అనుకుంటూ కిసుక్కున నవ్వబోయి బలవంతంగా ఆపేసుకుంది..
నిశ్చయ తాంబూలాలూ, పెళ్లిమాటలూ మాట్లాడుకుని వీడ్కోలు తీసుకుంటూ అందరూ బయలదేరారు.. ఎందుకో తలెత్తిన రాంబాబు, ఆదాటుగా శతాక్షి వైపు చూసాడు.. ఇద్దరికళ్లూ ఒక్క క్షణం కలుసుకున్నాయి.. అబ్బ ఈ అమ్మాయివి ఎంత అందమైన కనులు అనుకున్నాడు.. హమ్మయ్య ఇప్పటికి అబ్బాయిగారు తలెత్తి చూసారనుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది శతాక్షి.. కూతురికి అంత చక్కని సంబంధం వెతుక్కుంటూ రావడం ఆ లలితాదేవి కృపా కటాక్షాలే అనుకుంటూ ఆనందంతో పొంగిపోయారు శాస్త్రిగారు..
పెళ్లి ఉన్నంతలో ఘనంగా జరిపించారు శాస్త్రిగారు.. ఒక నెలరోజుల తరువాత ఒక మంచి ముహూర్తాన శతాక్షి భర్తతో కలసి హైదరాబాద్ వెళ్లిపోయింది.. హైదరాబాద్ లో కొత్త కాపురం , అప్పుడప్పుడు చిరు అలకలు, కోపాలూ, బుజ్జగింపుల మధ్య వారి కాపురం ఒక మధురకావ్యంలా సాగిపోతోంది.. ఒక ఆదివారం రాంబాబు స్నేహితుడు శ్రీహరి కొత్తదంపతులను తమ ఇంటికి లంచ్ కు ఆహ్వానించాడు.. అన్నయ్యలు లేని శతాక్షి శ్రీహరి ని అన్నయ్యా అంటూ ఆపేక్షగా మాట్లాడుతూ ఆ ఇంట్లో చొరవగా కలసిపోయింది.. సాయంత్రం వరకు సరదాగా గడిపి తిరిగి వస్తున్నపుడు ఆడపడుచుకు పెట్టినట్లుగా దంపతులిరువురికీ బట్టలు పెట్టి సాగనంపారు..
రోజులు సంతోషంగా గడచిపోతున్నాయి.. మధ్యలో ఒకసారి అత్తగారింటికి, అమ్మా వాళ్లింటికి వెళ్లి వచ్చారు.. ఈ మధ్య ఆఫీస్ లో పని ఎక్కువ ఉంటోందని ప్రొడక్షన్ టైమ్ అంటూ రాత్రిళ్లు లేట్ గా వస్తున్నాడు రాంబాబు.. ఆదివారాలు కూడా ఆఫీస్ కంటూ వెళ్లిపోతున్నాడు .. ఆదివారం ఎప్పుడొస్తుందా, ఇద్దరూ కలసి ఏదైనా మంచి సినిమాకు వెళ్లాలని ప్లేన్ చేసుకుంటే రాంబాబు ఆదివారం కూడా ఆఫీస్ కు వెళ్లిపోతుంటే శతాక్షికి బోర్ గా ఉంటోంది.. ఇంట్లో అన్నీ పనులూ తనే చేసుకుంటూ ఇంటిని ఎప్పుడూ కళ కళ లాడేలా నీట్ గా సర్దిందే సర్దుతున్నా బోల్డంత టైమ్ మిగిలిపోతోంది..
ఒకరోజు అత్తగారినుండి ఫోన్.. చూడమ్మా శతాక్షీ, అబ్బాయి వాడి ఆఫీస్ కు దగ్గరలో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొంటాను బేంక్ లోన్ తీసుకుని, ముందుగా అడ్వాన్స్ పేమెంట్ కట్టి బుక్ చేసుకోవాలని చెపితే మీ మామయ్యగారు నెలరోజుల క్రితం అయిదు లక్షలు వాడి బేంక్ అకౌంట్ కు పంపించారు.. ఇంకా అవసరమనుకుంటే రెండు మూడునెలల్లో పంట డబ్బులు రాగానే పంపుతానని చెప్పారుట.. దాని విషయం ఏమైందో కనుక్కోమంటున్నారు మీ మామయ్యగారు.. వాడు రాగానే చెప్పమ్మా అంటూ ఫోన్ పెట్టాసారావిడ.. రాంబాబు రాగానే ఈ విషయం చెపుతూ, ‘మరి నాకు చెప్పలేదేమిటీ, ఫ్లాట్ బుక్ చేస్తున్నట్లుగా’ అని అడిగేసరికి, " సారీ శతూ, ఏమిటో ఆఫీస్ పని టెన్షన్ లో చెపుదామనుకుంటూనే మరచి పోయానంటూ" సంజాయిషీ ఇచ్చాడు..
ఒక ఆదివారం నాడు శ్రీహరి వచ్చాడు వీరింటికి.. రాంబాబు ఆఫీస్ పనుందంటూ వెళ్లిపోయాడు పొద్దున్నే .. ఏమ్మా రాంబాబు లేడా ఇంట్లో అని అడిగేసరికి, " అదేమిటన్నయ్యా, మీరు వెళ్లలేదా ఆఫీస్కంటూ" అమాయకంగా అడుగుతున్న శతాక్షి వైపు ఆశ్చర్యంగా చూసాడు..
“అవునన్నయ్యా, రోజూ ఆఫీస్ లో పని ఎక్కువ ఉంటోందని, ప్రొడక్షన్ టైమంటూ చాలా లేట్ గా వస్తున్నారని చెప్తూ ఆదివారాలు కూడా ఆఫీస్ కు వెళ్లిపోతున్నా’రంటూ చెప్పింది..
“ఏమీ లేదమ్మా, నేను నాలుగురోజులు ఆఫీస్ కు శెలవు పెట్టాను.. ఈమధ్య ఆఫీస్ లో కూడా రాంబాబును కలసి చాలా రోజులైపోయింది..
నేనూ వాడూ ఒకే కాంప్లెక్స్ లో పక్క పక్క నే ఫ్లాట్స్ బుక్ చేసాం.. అడ్వాన్స్ పేమెంట్ గా అయిదు లక్షలు కట్టమంటే మనవాడు మూడు లక్షలే కట్టాడుట.. బిల్డర్ నాకు బాగా తెలుసున్నవాడు, అదే పనిగా నాకు ఫోన్ చేస్తూ రాంబాబు మిగతా డబ్బులు ఒక వారంలో కట్టకపోతే అతని ఫ్లాట్ అలాట్ మెంట్ కేన్సిల్ చేస్తానంటున్నాడు.. ఈ విషయం చెప్పిపోదామని వచ్చా”నంటూ , ఆమె వైపు సాలోచనగా చూసాడో క్షణం..
" ఎంత అమాయకురాలు ? అన్నయ్యా అంటూ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుంది ".. తన అనుమానం నిజమేనన్నమాట.. ఈ మధ్య రాంబాబు తనను తప్పించుకుంటూ ఆ దుష్ట చతుష్టంయంతో తిరుగుతున్నాడు.. ఆ దుష్ట చతుష్టంయం గురించి ఆఫీస్ లో అందరికీ తెలుసు.. వచ్చిన జీతం అంతా, తాగుడూ, పేకాటకే ఖర్చు పెడ్తూ , ఇంకా చెప్పాలంటే పరాయి స్త్రీల వెంట పడే రకాలు.. ఆఫీసులోనూ , బయటా అన్నీ అప్పులే వాళ్లకు.. మన రాంబాబు కూడా వాళ్ల వలల్లో పడిపోయాడన్నమాట.. ఆ మధ్య అయిదు లక్షలు మా నాన్నగారు పంపించారని చెప్పాడు.. మూడు లక్షలు పేచేసి రెండులక్షలు పేకాటలో పెట్టి ఉండచ్చు.. తనను తప్పించుకుంటూ తిరగడానికి కూడా అదోకారణం కావచ్చు.. ఇంట్లో భార్యతో ఆఫీసుకి వెడుతున్నానని చెపుతూ రాంబాబు వెలగబెట్టే రాచకార్యాలు ఇవన్నమాట.. ఈ విషయం తను దాచి పెట్టి అన్నయ్యా అంటూ తనను అభిమానించే శతాక్షిని బాధపెట్టడం భావ్యం కాదనుకుని, మెల్లిగా విషయం అంతా చెప్పేసరికి శతాక్షి కళ్లు రోషంతో ఎర్రబడ్డాయి.. ఎంతో అమాయకుడు, మంచివాడనుకున్న తన భర్త ఇలాతనకు అబధ్దాలు చెప్పడం సహించలేక పోయింది.. జాగ్రత్తగా నచ్చ చెప్పుకుని రాంబాబుని ఆ చెడు స్నేహాలనుండి కాపాడుకోమంటూ, వాళ్లు అందరూ రోజూ కలుసుకునే అడ్డా వివరాలు చెప్పి వెళ్లిపోయాడు శ్రీహరి..
శ్రీహరి చెప్పిన మాటలనుండి తేరుకోలేకపోయింది శతాక్షి.. ఫ్లాట్ అడ్వాన్స్ పేమెంట్ కని మామగారు డబ్బు పంపిస్తే ఆ డబ్బు పూర్తిగా కట్టకుండా విచ్చలవిడిగా వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడన్న మాట.. ఎంత నాటకం ? తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడన్న మురిపం క్షణంలో మాయమైంది.. ఈ విషయం మామగారికి, తన తల్లితండ్రులకు తెలిస్తే ఎంత అప్రతిష్ట! తను ఏదో అగాధంలో కూరుకుపోతున్న భావన.. కానీ అదీ ఒక్క క్షణమే.. తను చాలా ధైర్యవంతురాలు.. మగవాడి హృదయం కోర్కెల రెక్కల గుర్రంలాంటిది.. దాన్ని భార్య ప్రేమ బంధం అనే కళ్లెం వేసి అదుపులో ఉంచుకోవాలి.. భర్త తనవాడన్న నమ్మకం ఎంతున్నా పరిస్తితుల ప్రాబల్యమో లేక చెడు స్నేహాల సాలెగూడులోనో చిక్కుకు పోతే అది అతని పతనానికి దారితీయడమే కాకుండా కుటుంబ విఛ్చిన్నం కూడా జరిగే అవకాశముంది.. ఏదో చేయాలి, తన భర్తను ఆ ఉచ్చులోనుండి బయటకు లాగాలనుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది..
కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి అయిదు నిమిషాలు తరువాత లోపలనుండి ఎవరో తలుపు కొద్దిగా తెరిచి చూసారు.. బయట ఎవరో అమ్మాయి నిలబడి ఉందని గ్రహించిన ఆ వ్యక్తి, ‘ఎవరూ’ అని అడిగేసరికి , " కాస్త లోపలికి దారిస్తారా అన్నయ్యగారూ" అంటూ లోపలికి చొచ్చుకుపోయింది.. ఆ గదిలో మొత్కం అయిదుగురు తన భర్తతో కలపి.. హఠాత్తుగా శతాక్షిని చూడగానే రాంబాబు వంటిమీద చెమటలు కారిపోతున్నాయి.. మిగతావాళ్ల పరిస్తితి కూడా అలాగే ఉంది.. ఒక్క క్షణం పరికించి చూసింది నాలుగువైపులా.. డ్రింక్ బాటిల్స్, సిగరెట్ పీకలు, సగం సగం తింటూ వదిలేసిన బజ్జీలు, బిర్యానీ పొట్లాలు .
" ఏమిటి శతూ, ఇక్కడకు ఎందుకొచ్చావ్ అన్న రాంబాబు ప్రశ్నకు
" ఆ ఏమీ లేదు, ఇంట్లో బోర్ గా అనిపించి మీకు కంపెనీ ఇద్దామని, నేనుకూడా మీతో పేకాడాలని వచ్చాననగానే" , రాంబాబు ముఖం నల్లగా మాడిపోయింది..
శతాక్షి రూపం కాళికారూపంలా గోచరించింది ఆ దుష్టచతుష్టయానికి.. నిప్పులు కురుస్తున్నట్లు వున్న వాడియైన చూపులతో అందరివైపు తీక్షణంగా చూస్తూ, " మీరు చెడిపోవడంకాదు, అమాయకుడైన నా భర్తను కూడా వ్యసనాలకు బానిసను చేసారు. మీకిది ధర్మామా ? ఇంట్లో మీ భార్యలూ, పిల్లలూ వాళ్ల ఆనందాల కంటే ఈ వ్యసనాలే మీకు ఎక్కువ ఆనందాన్ని స్తున్నాయన్నమాట.. మీ భార్యా, పిల్లల ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది.. ఉన్నదంతా పోగొట్టున్నాక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు నిర్జీవమైన జీవితమే మిగులుతుంది.. అందరూ ఛీ కొడతారు.. నేను మీ భార్యలందరినీ కలుపుకుని మీ ఆఫీస్ కు వచ్చి మీ పర్సనల్ డిపార్ట్ మెంట్ హెడ్ ను కలసి మీ అందరి మీద కంప్లైట్ ఇస్తాను.. ఆఫీస్ ఎగ్గొట్టి పేకాటాడడమేకాదు, తాగితందనాలాడుతున్నారని. మీకు సస్పెన్షలు తప్పవు.. అప్పుడు మీ పరిస్తితి ఏమిటో ఊహించుకోండి..”
“శతూ, ఇంక ఆపుతావా” అంటూ రాంబాబు అడ్డుకోబోయాడు..
“మీరుండండి, అయినా మన బంగారం మంచిదైతే ఊళ్ళో వాళ్ళని అనుకోవడం దేనికి? మీరు అంత బలహీనులా రాంబాబూ ? కుక్కకు బిస్కట్ ఎరవేస్తే తోకాడిస్తూ మన వెంట ఎంతదూరమైనా వస్తుంది ఆశగా.. మీరు కూడా అదేరకం అని ఇప్పుడర్ధమైంది.. "
“శతూ, నా మాటవిను, ఇంకెప్పుడూ నేను ఇలా ప్రవర్తించను, నీ మీద ఒట్టం”టూ శతాక్షి చేయి పట్టుకోబోయాడు. శతాక్షి ఆతని చేతిని విసిరికొట్టింది. వెనక్కి తిరుగుతూ వాళ్లను తర్జనతో బెదిరిస్తూ " మా పెదబావగారు పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద పోస్ట్ లో ఉన్నారు.. మీమీద ఒక కంప్లైంట్ ఇస్తే చాలు, ఊచలు లెక్కపెట్టుకుంటూ అక్కడే పేకాట ఆడుకోవ”చ్చంటూ విసవిసా భర్త చేతినందుకుంటూ బయటకు వచ్చేసింది..
బిక్క చచ్చిపోయిన రాంబాబు తలొంచుకుని భార్య వెనుకే నడుస్తున్నాడు .. పంజరంలో బంధింపబడిన చిలకలా ఉక్కిరిబిక్కిరి అవుతూ అవమానంతో తలదించుకున్నాడు.. శతాక్షి ముఖంలో విజయ గర్వం.. ఇంక చచ్చినా రాంబాబు వాళ్ల ముఖం చూడడని గట్టి నమ్మకం.. ఇంటికి వెళ్లాక తను ఖచ్చితంగా చెపుతుంది, మరోసారి ఇటువంటి పనులు చేస్తే అత్తగారికీ మామగారికీ అలాగే తనవాళ్లందరికీ చెపుతానని. ఒక వారం రోజులు చచ్చినా ఈయనతో మాట్లాడకూడదు... ఇటువంటి వాళ్లను పంజరంలో చిలకలా అనుక్షణం జాగ్రత్తగా కాపాడుకుంటూ అప్రమత్తంగా ఉండాలనుకుంది.. రాంబాబు ఇన్నాళ్లూ స్వేఛ్చావిహంగలా ఉన్నాడు. ఏ భార్యకైనా ఒకసారి భర్తమీద అపనమ్మకం కలిగితే భర్త ఏది చెప్పినా అనుమానంగానే చూస్తుంది.. రాంబాబు అంత తొందరగా శతాక్షి చేతిలో ఇరుక్కుపోతానని ఊహించలేదు.. ఆమె ధైర్యానికి అచ్చెరువొందాడు.. చక చకా నిర్భయంగా ముందుకు సాగిపోతున్న శతాక్షి లయబధ్దంగా ఊగుతూ, ముందుకు పడుతున్న తన పొడవైన జడను ఒక చేత్తో విసురుగా వెనక్కి తోసుకుంటూ భర్తతో ఇంట్లోకి అడుగుపెట్టింది.. శతాక్షి వారం రోజులు పూర్తిగా మౌనవ్రతం వహించింది.. అదివరకటిలా కొసరి కొసరి వడ్డించడం, వేడి వేడి అన్నంలో ఎర్రని ఊటతోనున్న ఆవకాయ కలిపి, నెయ్యివేసి పెద్ద పెద్ద ముద్దలు చేసి ప్రేమగా తినిపించడం , చిలిపికబుర్లూ, సందడిలేనేలేవు.. రాంబాబు శతాక్షి దగ్గరకు వచ్చి ప్రేమగా భుజంమీద చేయివేస్తే విసిరికొట్టింది.. సత్యభామను ప్రసన్నం చేసుకోవటానికని ప్రయత్నించిన శ్రీ కృష్ణుని లా రాంబాబు శతాక్షిని ప్రసన్నం చేసుకోడానికి చాలా కష్టపడ్డాడు.. చివరకు ఎన్నో వాగ్దానాలూ, ఒట్లూ, ప్రమాణాల తరువాత శతాక్షి శాంతించింది..
ఒక ఆరునెలల తరువాత రాంబాబు, శ్రీహరి ల గృహప్రవేశ ముహూర్తాలు రెండురోజుల తేడాలో పెట్టుకున్నారు.. ఇద్దరివీ పక్క పక్క ఫ్లాట్సే .. ముందుగా రాంబాబు ఇంటి గృహప్రవేశ మహోత్సవం చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు.. శతాక్షి అమ్మా, నాన్నా, అక్కల కుటుంబాలు, అత్తగారు, మామగారు ఇంకా అనేక మంది బంధుమిత్రుల సమక్షంలో శతాక్షీ సమేత రాంబాబు పట్టుబట్టలు ధరించి పీటలమీద కూర్చున్నారు.. శతాక్షి నాన్నగారు చాలా శాస్త్రోక్తంగా కూతురి ఇంటి గృహప్రవేశం నిర్వహిస్తున్నారు.. ఒక పక్కన పదిమంది వేద పండితులసమక్షంలో వేదపఠనాల మధ్య, మరో పక్కన గణపతి హోమంలో దేదీప్యమానంగా జ్వాలలు ప్రకాశిస్తుంటే గృహప్రవేశ మహోత్సం అత్యంత కన్నుల పండుగగా జరిగింది.. ఇల్లు చాలా బాగుందని, ఇంటీరియర్స్ అవీ చాలా చక్కగా చేయించారని అందరూ మెచ్చుకుంటుంటే " ఆ పొగడ్తలన్నీ నా శ్రీమతికే చెందుతాయండీ, నేను డబ్బు తన చేతికి ఇవ్వడం వరకే , మిగతా విషయాలన్నీ తనే చూసుకుందంటూ" శతాక్షి వైపు ప్రేమగా చూస్తూ జవాబిచ్చాడు..
శ్రీహరి అయితే ఎవరూ లేకుండా చూసి " చెల్లాయ్, జరిగిదంతా మన మంచికే అన్నట్లుగా రాంబాబుని కొంగుకి భలే కట్టేసుకున్నావు . నీమాటే వేదం వాడికిప్పుడు.. నిజానికి రాంబాబు చాలా మంచివాడమ్మా.. ఏదో ఆ సమయంలో ఒక చిన్న బలహీనతకు లోనైనాడు అంతే .. ఆ దుష్ట చతుష్టంయంలో కూడా ఎంత మార్పు వచ్చిందో తెలుసా? అంతా నీ మూలానే.. చక్కగా ఉద్యోగాలకు వస్తూ సంసారాలు చేసుకుంటున్నారని విన్నాను.. నీ ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నానమ్మా” అనగానే " అయ్యో అన్నయ్యా, మీరు ఆరోజు మా ఆయన గురించి చెప్పి ఉండకపోతే ఇప్పుడు నా పరిస్తితి ఎలా ఉండేదా అని అనుకుంటాను. ఈ సంతోషం, ఆనందం అంతా నీ బిక్షే అన్నయ్యా” అంటూ ఆత్మీయంగా మాట్లాడుతున్న శతాక్షిని నిండు నూరేళ్లూ పచ్చగా భర్తా పిల్లలతో జీవించమని ఆశీర్వదించాడు శ్రీహరి.
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.