కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Subhavartha' Written By Yasoda Puluurtha
రచన: యశోద పులుగుర్త
ఆడపిల్ల పెళ్లి కోసం ఎన్నో చోట్ల తిరగాలి. ఎన్నో ప్రయత్నాలు చేయాలి.
కానీ మంచి హృదయం, భగవంతుని దయ ఉంటే సంబంధం ఇంటికే వెతుక్కొని వస్తుంది.
ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.
"గుళ్ళోంచి విష్ణుసహస్రనామం వినిపిస్తోంది!
ఆ రోజు శనివారం ! వేంకటేశ్వరస్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు !
మర్రిచెట్టు మీద పక్షుల సందడి పెరుగుతోంది!
పట్టు పంచె కట్టుకుని పువ్వులు కోయడానికి బయటకొచ్చారు మురళీకృష్ణగారు !
వంటింట్లో కాఫీడికాషన్ వాసన...పాలుపొంగినవాసన కలగలిపి ముక్కును తాకింది. "
ఏమోయ్, హైమా పాలు పొంగిన వాసన వస్తోంది, వంటింట్లో లేవా ? అంటూ మురళీకృష్ణ గారు కాస్త గట్టిగా పిలిచేసరికి హైమ ......ఆ వచ్చే... అంటూ హడావుడిగా రావడం,
అయ్యో... స్టౌమీద పాలు ఇప్పుడే పెట్టాను, అప్పుడే పొంగిపోతాయని అనుకోలేదండీ అంటూ ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ ఇంట్లో ఎప్పటినుండో వినిపిస్తున్న మాటలు.
ఆ ఇంట్లో ముందర మురళీకృష్ణ గారు అందరికంటే ముందరే లేచి, నిత్యకృత్యాలు ముగించుకుని, స్నానం చేసి దొడ్లో పారిజాత పూలు, మందారాలు, నందివర్ధనాలు కోసుకుని వస్తారు !
ఆ తరువాత దేవుడికి పూజ చేసుకుని కాని కాఫీ నోట్లో పోసుకోరు. ఇది ఆయన రిటైర్ అయినప్పటినుండి అలవర్చుకున్న ఒక పధ్దతి తో కూడిన అలవాటు. అయితే హైమావతి గారు మాత్రం
ఉదయాన్ని లేచి ఆ కాఫీ తాగందే ఏ ఉత్సాహమూ రాదు. కాఫీ తాగాకే ఆవిడ స్నానం , పూజ వగైరా !
ఈ మధ్య విష్ణుసహస్ర నామ పారాయణాన్ని నలభై రోజులు పారాయణం చేస్తానని మొక్కుకోవడానికి కారణం, వారి కూతురు మౌక్తికకు పెళ్లి ప్రయత్నాలు చేయడం
మొదలు పెట్టారు. ఆవిడ విష్ణు నామ పారాయణం చేస్తున్నపుడు ఆవిడ గొంతుకులోనుండి వస్తున్న విష్ణునామాలు ఎంతో మధురంగా, స్పష్టమైన ఉఛ్చారణతో వినసొంపుగా ఉంటుంది..
ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి గారి గళాన్ని పోలి ఉంటుంది ఆవిడ గొంతుకు. లయబధ్దంగా చేస్తున్న పారాయణం ఆ చుట్టు పక్కల వాతావరణంలో కలసిపోయి ఒక రకమైన పవిత్ర భావన గోచరిస్తుంది.
వారి ఇంటి గోడలు తాకినా విష్ణు నామాలు వినిపిస్తాయని చుట్టు పక్కల వాళ్లు అనుకోవడం వింతకాదు . మురళీకృష్ణ , హైమవతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్దమ్మాయి పెళ్లి చేసారు. అమ్మాయి,
అల్లుడు వైజాగ్ లో ఉంటారు. రెండో అమ్మాయి మౌక్తిక హైదరాబాద్
లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆఖరబ్బాయి ప్రస్తుతం ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, ఆడపిల్లలిద్దరూ బంగారపు బొమ్మలే !
చిదిమి దీపం పెట్టుకోవచ్చు. వారి పెద్దమ్మాయి మృదులకి ఏ ప్రయత్నమూ లేకుండానే చాలా చక్కని సంబంధం రావడం, వెంటనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపడం జరిగిపోయింది. దీనికంతటకూ.
ఆ విష్ణుమూర్తి దయేనని ఆ హైమావతి గారి నమ్మకం ! రెండో దానికి కూడా మంచి సంబంధం రావాలని , చక్కని బుధ్ది, స్వభావం కల అల్లుడు రావాలని ఆవిడ కోరిక. ఆస్తి అంతస్తుల కన్నా, చక్కని
చదువు, మంచి స్వభావం కల అల్లుడు చాలు అనుకునే స్వభావం కలిగిన దంపతులు వారిద్దరూ ! ఆ మధ్య దసరా శెలవులకు వచ్చి తిరిగి హైదరాబాద్ ప్రయాణమౌతున్న మౌక్తికతో మరళీకృష్ణగారు నీకు పెళ్లి సంబంధాలు చూద్దామనుకుంటున్నాం తల్లీ , నీకు సమ్మతనమేనా అని అడగ్గానే,
‘పెళ్లికి తొందరేమొచ్చిందినాన్నా’ అన్నమౌక్తిక సమాధానికి ,
‘లేదమ్మా, ఎప్పుడైనా ఆడపిల్లకు పెళ్లి చేసి పంపాలికదమ్మా, ఆ చేసే పని కరెక్ట్ సమయంలో చేస్తే తల్లితండ్రులుగా మాకొక ఆనందం, బలవంతం పెట్టడం లేదు,
చూచాయగా నీకు చెప్పి చేస్తే మంచిది కదా’ అని అనగానే ........
తలవంచుకుని ‘మీ ఇష్టం నాన్నా’ అని నెమ్మదిగా సమాధానం ఇచ్చిన మౌక్తికను ప్రేమగా తలమీద చేయి వేసి ఆశీర్వదించారు !
ఆ రోజు హైమావతి గారి విష్ణు సహస్రనామ పారాయణం ఆఖరిరోజు. ఆ రోజుతో నలభై రోజులు పూర్తి అవుతాయి. భక్తిగా మహా నైవేద్యాన్ని తయారు చేసి పెట్టుకుని దేవుని ముందు కూర్చుని పారాయణం చేస్తున్నారు. ప్రకృతి కూడా నిశ్చలంగా ఆవిడ పారాయణాన్ని వినాలన్న కుతూహలంతో ప్రశాంతంగా ఉంది. బయట వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంది. ఆవిడ భక్తితో మంద్రస్తాయిలో తీయగా ఆలాపిస్తున్న విష్ణునామాలు ఆ గాలిలో కలసిపోయి మనస్సుని రాగరంజితం చేస్తున్నాయి..
" వనమాలీ గదీ శార్గ్ఞీ శంఖీ చక్రీచ నందకీ!
శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో భిరక్షతు" !
ఈ శ్లోకాన్ని రెండుసార్లు చదువుతూ భక్తిగా కళ్లుమూసుకున్నారు !
అప్పుడే ఒక తెల్లని కారు వీరింటి ముందు ఆగింది. మురళీకృష్ణ గారు పూజ అయిపోయింది కాబట్టి మధ్య హాలులో ఉయ్యాల బల్లమీద కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు.
కారు ఆగిన శబ్దానికితలెత్తి చూసారు. కారులో నుండి దిగిన ఇద్దరు దంపతులు వీరి ఇంటివైపు రావడం చూసి ఆయన బయటకు వచ్చారు. ఫలానా వారిల్లు ఇదేనా
అని అడగగానే ఔనంటు తలూపుతూ వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు !
లోపలి నుండి ఇంకా విష్ణు సహస్రనామాల పారాయణం ఉత్తర పీఠికలో ముగింపు దశలో ఉందన్నట్లుగా
" కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్
| కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామీ !!
అంటూ చదవడం, తరువాత లక్ష్మీ అష్టోత్రం చదివాక హారతి ఇస్తున్నారు. అవతల హాలులో మురళీకృష్ణగారు , వచ్చిన దంపతులు మౌనంగా ఆ పూజ సమాప్తమైపోయేవరకు
అలాగే కూర్చుండిపోయారు..
హైమవతి దేవుని ముందు కొబ్బరికాయ కొట్టి, హారతి ఇస్తూ... శ్రావ్యంగా అమ్మవారి హారతిపాట ఎత్తుకుంది. మృదు మధురమైన గొంతుకతో వీనుల విందుగా పాడుతున్న పాటకు వీరింటికి వచ్చిన దంపతులుముగ్ధులౌతుండగా భార్య ఏమండీ అన్నపిలుపుకు, ఆ పిలుపుకోసమే ఎదురుచూస్తున్న మురళీకృష్ణ గారు , అది హారతి తీసుకోడానికి సంకేతమని తెలుసుకనుక ఆయన, ఆయన వెంటనున్న కొత్తవారిని చూస్తూ ఆశ్చర్యంగా భర్త కళ్లలోకి చూసింది.
వారు ముగ్గురూ హారతి ని కళ్లకద్దుకోగానే మురళీకృష్ణగారు," హైమా దేవుని దగ్గర నీ పని పూర్తిచేసుకుని ఒకసారి హాలులోకి రమ్మనమని చెప్పారు.."
హైమవతి దేవునికి నైవేద్యం సమర్పించాక హాలులోకి రాగానే ఆ వచ్చిన దంపతులు లేచి నమస్కరించారు. ఆ వచ్చిన వారు శ్రీనివాస్రావ్ గారు, ఆయన సతీమణి రమాదేవిగారు గా పరిచయం చేసుకుని తమ రాకకు కారణం తెలిపారు. తమ ఒక్కగా నొక్క కొడుకు ఐ.ఐ.టీ కాన్పూర్ లో చదివి ఆ తరువాత ఐ.ఐ.మ్ కలకత్తా లో చదివాడని, ప్రస్తుతం జె.పి.మోర్గన్ సంస్త , హైదరాబాద్ లో వైస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాడని, ఆ అబ్బాయి సంబంధం విషయమై వచ్చామని చెపుతూ, వారిని ఆ సమయంలో డిస్చర్బ్ చేసినందుకు క్షమించమని కోరుతూ మాటలాడసాగారు..
ఆ మధ్య దసరా పండుగ వెళ్లాక, రమాదేవి గారు బంధువుల ఇంటికి పెళ్లికి రావడం, తిరుగు ప్రయాణంలో తను ఎక్కిన రైల్వే కంపార్ట్మెంట్ లో నున్న మౌక్తిక తో అనుకోకుండా పరిచయం అయిందని చెప్పారు!
ఆ పరిచయం కూడా, రమాదేవిగారు పెళ్లిలో కాస్త అలసిన కారణంగా అస్వస్తకు లోనైనారని, గిడ్డీనెస్ తో బాధ పడ్తుంటే తనని మౌక్తిక వెంటనే చూసి ఆవిడ బేగ్ లోని టేబ్లెట్ తీసి
ఇవ్వమంటే ఆవిడకు అందించి ఆవిడ చేత మంచినీళ్లు తాగించిందని చెప్పారు !
ఆవిడ రైల్లో తినడానికి ఏమీ ఫలహారం తెచ్చుకోలేకపోతే, తను తెచ్చుకున్న రోటీ, కూర దగ్గర ఉండి తినిపించిందిట !
ఇవన్నీ చెపుతూ, ఆ రోజు నా దగ్గర మీ అమ్మాయే లేకపోతే ఏమై ఉండేదో నా పరిస్తితి అని వాపోయారు. తరువాత రైల్వే స్టేషన్ కు వారి డ్రైవర్ కారు తీసుకుని వచ్చినా, నేను వెళ్లగలనన్నా మౌక్తిక ససేమిరా ఒప్పుకోకుండా తను కూడా వచ్చి తమ ఇంటిలో దింపి మరీ వెళ్లిందని చాలా ఆర్తిగా చెప్పారు.
అవును.. ఆ విషయం మౌక్తిక తనకు ఒక రోజు ఫోన్ చేసి చెప్పడం హైమవతి కి గుర్తుకొచ్చింది !
అందుకే ఆవిడకు సమాధానంగా, “ఇందులో ఏముంది రమాదేవిగారూ సాటి మనిషికి అలా ఉంటే ఏమీ చేయలేకపోతే ఎలాగా” అని అనగానే, “అలా అనకండి, చూస్తూ కూడా నాకెందుకు అని అనుకున్న వారు కూడా ఉంటారు ! కానీ, మీ మౌక్తిక మంచితనం, పెద్దలపట్ల వినయం తమని బాగా ఆకర్షించాయని, మాటల్లో మీ అందరి గురించి, ఆ అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నా’నని చెబుతూ........
మా ఇంటికి కోడలుగా కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయని ఆనందంగా చెబుతూ......
ఈ విషయం మా అబ్బాయి హర్షకు చెప్పగానే... అయితే అమ్మా, నీకు నచ్చిందని అన్నావు కాబట్టి, ఆ అమ్మాయికి తెలియకుండా తనని ఒకసారి ఎలాగైనా చూసి వచ్చాక మీకు ఎలా ఉందో చెపుతాను...... ఆ తరువాత మీ ఇష్టం అంటూ , మీ మౌక్తికను ఆఫీస్ లో కాస్తంత దూరం నుండి చూసివచ్చాడుట....
వాడికి నచ్చిందని చెప్పగానే ఇలా వచ్చాం. ఇదిగో మా వాడి ఫొటో అంటూ చూపించారు. ఆ అబ్బాయి చూడడానికి, మౌక్తికకు ఈడూజోడూ గా చాలా బాగున్నాడు.
హైమవతి భర్త వైపు చూసిందో క్షణం ఏమంటారని కళ్లతో ప్రశ్నిస్తూ ?
వెంటనే మురళీకృష్ణగారు మీలాంటి వారు స్వయంగా వచ్చి మా మౌక్తికను చూసి ముచ్చట పడడం సంతోషం. మీ ఆదరాభిమానాలకు మనస్సు సంతోషంతో నిండిపోయింది.
మీ అందరికి, ముఖ్యంగా మీ అబ్బాయికి మా మౌక్తిక నచ్చడం చాలా ఆనందంగా ఉంది శ్రీనివాస్ గారూ !
మా అమ్మాయికి మేము ఎంత చెపితే అంత !
అయినా కూడా ఒకసారి మా అమ్మాయి మీ అబ్బాయిని చూసాక తన అభిప్రాయం కూడా తెలుసుకుంటే అది సబబు గా ఉంటుంది..
ఈ నెలాఖరున మంచి రోజులున్నాయి. మౌక్తికను ఒకసారి రమ్మంటాను.
ఆ సమయంలో మీరు మీ అబ్బాయిని హర్షను తీసుకుని వస్తే పధ్దతిగా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను.
ఒకసారి మనం అంతా కలసినట్టు ఉంటుంది, తరువాత మా మౌక్తిక, మీ అబ్బాయి కలసి ఏమైనా
మాటలాడుకున్నా బాగుంటుందని చెప్పేసరికి ఆయన ఆలోచన బాగుందని శెలవ్ తీసుకుంటామని ఆ దంపతులు అన్నారు !
హైమవతిగారు కాసేపు ఉండమని, దేవుని ప్రసాదం స్వీకరించాక వెడుదురుగాని అని చెప్పి దేవుడి గదిలోకి వచ్చారు.
ఇంకా దేవుని దగ్గర దీపారాధన దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అగరుబత్తెల సువాసన ఆ గది అంతా వ్యాపిస్తోంది.
అరటి ఆకుల్లో దేవుడి కి నివేదించిన చక్ర పొంగలి, దబ్బకాయ పులిహోర ని ప్లేట్లలో సర్దుతూ ఒక్కసారి ఆ విష్ణుమూర్తి కేసి చూసింది.
క్షణ కాలం ఆ మూర్తి తనకేసి చూస్తూ, చిరునవ్వు చిందిస్తూ ......
ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక అలౌకిక ఆనందాన్ని పొందడమే కాకుండా,
కళ్లుమూసుకుని భక్తితో... " హే భగవాన్ అంతా నీదయ మాత్రమే " , నిన్ను నమ్ముకున్న నీ భక్తులను
ఆశీర్వదించమని వేడుకుంటుండగా ప్రక్కనే ఉన్న గుడినుండి శుభసూచకంగా గుడిగంటలు మ్రోగాయి !!
విష్ణుమూర్తి పారాయణం శుభవార్తతో పూర్తి అవడంతో ఆ దంపతులిరువురూ భగవంతునికి భక్తితో నమస్కరించుకున్నారు!!
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
ఎవరికెవరు ఈలోకంలో
శతాక్షి
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.