'Sarasa Salilamu' written by BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
సరళని వెనుక నుండి వాటేసుకున్నాడు శేఖర్. సరళ బిగుసుకుపోయింది. శేఖర్ ఊపిరి సరళ ముఖమును తాకుతూ ఆమెను గమ్మత్తు పరుస్తుంది. సరళ మరింత బిగుసుకుపోయింది. సరళ జడలోని మల్లెల వాసనను ఆయతంగా పీల్చుకున్నాడు శేఖర్. ఆ వెంబడే సరళను మరింతగా బిగిపట్టేడు. సరళ మళ్లీ బిగుసుకుపోయింది. దాంతో సరళ రాను రాను ఒక ప్రతిమలా శేఖర్ కి తోస్తుంది. సరళని విడిచి, "ఎందుకు నెర్వస్ అవుతున్నావు" అడిగాడు శేఖర్. సరళ ప్రయత్నంగా ఊపిరి పీల్చుకుంది. "ఏంటి, సిగ్గా, భయమా" ఆగి అడిగాడు శేఖర్. "రెండూ కాదు. ముందుగా మనం మాట్లాడుకోవాలి" అంది సరళ. "అవునా. సరే మరి." అన్నాడు శేఖర్. సరళ, "మీరు అబద్ధం చెప్పారు" అంది విసురుగా. "ఎవరితో ఎప్పుడు" అన్నాడు శేఖర్ మామూలుగానే. "నాతో, పెళ్లి చూపులప్పుడు, మనం విడిగా మాట్లాడుకున్నప్పుడు" చెప్పింది సరళ. శేఖర్ వెంటనే ఏమీ అనలేదు. కదిలి వెళ్లి టీపాయ్ మీద ఉన్న పళ్లెం లోనించి ఒక ఆపిల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొరుక్కుంటూ దానిని తింటున్నాడు. సరళకి చికాకనిపించింది. "ఏమీ చెప్పరేం" అంది విసుగుగా. "ఏం చెప్పాలి. అప్పటి నా మాటల్లో ఏది అబద్ధం" అడిగాడు శేఖర్ ఈజీగా. "మీ డ్రింకింగ్ అలవాటు గురించి" అంది సరళ వెంటనే. శేఖర్ తల తిప్పుతూ చుట్టూ చూశాడు. ఆ శోభనం గది మరో మారు అతడికి కనువిందుగా అగుపించింది. మౌనంగా నడిచాడు. మంచం మీద కూర్చున్నాడు. సరళ బేజారవుతుంది. "వచ్చి కూర్చో. మాట్లాడుకుందాం. రా" అన్నాడు శేఖర్. సరళ చిత్రమయ్యింది. ఆ గదిన వ్యాపించిన వివిధ పచ్చి పూల వాసనలకి గమ్మత్తవుతున్నాడు శేఖర్. సరళ నిల్చున్న చోట నుండి కదలలేదు. "ఇలానే మాట్లాడవచ్చు" అంది. శేఖర్ తల తిప్పి సరళని చూశాడు. అప్పుడే సరళ పైటుతో కళ్లు వత్తుకోవడం అతడి చూపుల్లో పడింది. నివ్వెర పోతూ - "ఏయ్. ఏమైంది" అన్నాడు. "ఆ రోజు మీరు చెప్పింది అబద్ధం. నేను మరీ అడిగాను. మీరు 'డ్రింకింగ్ అలవాటు లేదు' అని చెప్పారు. నేను నమ్మేను. మీతో పెళ్లికి ఒప్పుకోవడానికి అదీ నాకు ఒక కారణమే." అంది సరళ గబగబా. శేఖర్ కాస్త చలించాడు. "డ్రింకింగ్ పై నీలో ఇంత సీరియస్నెస్ ఉందా" అన్నాడు. "అప్పుడే మీరు చెప్పి ఉంటే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను" అంది సరళ గట్టిగానే. శేఖర్ విలక్షణంగా నవ్వాడు. సరళ పట్టించుకోలేదు. శేఖర్ తన కూర్చున్న మంచం మీద సర్ది ఉన్న పచ్చి పువ్వుల లవ్ సింబల్ నుండి తన దోసిలి నిండా పూలును తీసుకున్నాడు. వాటి వాసనల్ని గాఢంగా పీల్చుకున్నాడు. సరళ కుదురు పల్చబడిపోతుంది. "ఏమిటా చేష్టలు. పిచ్చికాదు కదా" అంది రోషంగా. "ఆఁ. పిచ్చే. ఇంత పసందైన వాతావరణం నడుమ నీ అలరారుతున్న అందాల్ని చూస్తూ చవటగా కూర్చోంటే, పిచ్చి రాక తప్పుతుందా" అన్నాడు శేఖర్ చిత్రంగా. సరళ చురుగ్గా చూస్తూ, "అక్కడితో ఆపండి" అని, "ప్రతిదీ మీకు చులకననేలా ఉంది. లేకపోతే నా బాధని మీరు ఈ పాటికి అర్థం చేసుకొనేవారు" అంది. శేఖర్ లేచి వచ్చాడు. సరళని చేరాడు. అలవోకగా ఆమెను దగ్గరగా తీసుకోబోయాడు. సరళ గబుక్కున తప్పుకుంది. చెంగున ఎడమగా జరిగిపోయింది. "ఆగండి." అంది. తటపటాయించాడు శేఖర్. "నీ కోపంకి కారణం, నా అబద్ధమా, నా అలవాటా" అడిగాడు. "మీ అలవాటే." అని, "నాకు డ్రింకర్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు." అంది సరళ విసురుగా. శేఖర్ ఏమీ అనలేదు. కానీ చిన్నగా నవ్వేడు. అతనిని పట్టించుకోకుండానే, "మీకు స్మోకింగ్ అలవాటు కూడా ఉండే ఉంటుంది" అనేసింది సరళ ఆ వెంటనే. శేఖర్ మాట్లాడలేదు. సరళనే చూస్తూ నిల్చుండి పోయాడు. అప్పుడే అడ్డదిడ్డంగా తలాడించాడు కూడా. సరళ అసహనమవుతుంది. శేఖర్ వెనుతిరిగాడు. టీపాయ్ మీది పళ్లెం లోనించి జాంగ్రీని తీసుకున్నాడు. దాన్ని తింటూ తిరిగి సరళ దరికి వచ్చాడు. సరళ అస్తవ్యస్తమయ్యిపోతుంది. "ఇంతకీ నా డ్రింకింగ్ అలవాటు నీకు ఎలా తెలిసిపోయింది?" అడిగాడు శేఖర్. సరళ చురుగ్గా చూస్తూ, "నిన్నటి డిన్నర్ తర్వాత మీ ఫ్రెండ్స్ తోని మీ చిందులు చూడగలిగాను" చెప్పింది. శేఖర్ చిన్నగా తల విదిలించుకున్నాడు. సరళ తల తిప్పేసుకుంది. "ఓ అదా మేటర్" అన్నాడు. ఆ వెంటనే సరళ వైపు తేఱిపాఱ చూస్తూ, "మరి ఇప్పుడేం చేస్తావు" అడిగాడు చాలా విచిత్రంగా. సరళ తలెత్తింది. శేఖర్ ని చూసింది. "మంచి భర్త దొరకాలనుకున్నాను. నా తపన గాడి తప్పింది. ప్చ్" అంది సరళ దిగులుగా. చిన్నగా నవ్వుతూ, "అంత నిరుత్సాహ పడిపోకు. నేను నీకు సహకరిస్తానులే" అన్నాడు శేఖర్. సరళ మౌనంగా ఉండిపోయింది. శేఖర్ నే చూస్తుంది. "సరే నీ కోసం మారతాను" అన్నాడు శేఖర్. "అంటే" అంది సరళ గబుక్కున. సరళ ఎద ముందరి పుస్తెలని తన కుడి అరచేతితో సుతిమెత్తగా అదిమి పట్టి, "ఒట్టు. ఇకపై నేను డ్రింకింగ్ చేయను" అని చెప్పాడు శేఖర్. షాకయ్యింది సరళ. ఆగి, తర్వాత - "నిజమా" అంది విభ్రమంగా. పుస్తెలని విడిచేస్తూ, "ఒట్టు పెట్టాను. మరింకేం కావాలి" అన్నాడు శేఖర్. సరళ ఆగింది. తర్వాత - "నిజంగానే మానేస్తారా." అని, "ఐనా ఈ శోభనం వాయిదయ్యితేనే నేను నమ్మగలను." అనేసింది. "అలానా. అవునా. సరే ... ఉఁ, నీ ఇష్టం" అనేశాడు శేఖర్ దిగులుగా. "నా ఇష్టం కాదు. మీరు వాయిదాకి ఒప్పుకుంటేనే నేను నమ్మేది" అంది సరళ పట్టుగా. శేఖర్ తడబడ్డాడు. తర్వాత తలాడించేశాడు. *** మర్నాడు - గదిలో తన ఫ్రెండ్స్ తో ఉన్న శేఖర్ - "డామిడ్, కథ అడ్డం తిరిగింది. సరళకి ఇష్టం కాని డ్రింకింగ్ అలవాటు, నాకు ఉందన్నట్టు, తన దృష్టిలో అలా పడేటట్టు, యాక్ట్ చేశాను. తర్వాత సరళ కోసమే దానిని ఇక మీదట వదులుకుంటానని బిల్డప్ తో సరళ మెప్పుని కొట్టేయాలనుకున్నాను. కానీ నేనే తలక్రిందలయ్యిపోయాను" అంటూ వాపోయాడు మాటల మధ్యన. ఆ చెలికాళ్లు గొల్లుమన్నారు. అదే సమయంన - పక్క గదిలో తన ఫ్రెండ్స్ తో ఉన్న సరళ - "వాటర్ పోసుకు తాగుతూ తనకి డ్రింకింగ్ అలవాటు ఉన్నట్టు ఫోజులిస్తూ నన్ను బ్లఫ్ చేయాలని చూశాడు శేఖర్. ఉఁ. నన్నే ఇబ్బంది పెట్టిన ఆ శేఖర్ తో నేను ఆడుకోనా. ఆఁ." అంది నవ్వేస్తూ మాటల మధ్యన. "పాపమే. విముక్తి పర్చేయవే" అన్నారు అక్కడి మిగతా వారంతా కోరస్ గా. "మిగిలిన మా శోభనం రాత్రులు రెండూ ఇలానే కానీ. తర్వాత దరికి రానిస్తాను. విరహంలోని రంజుని పంచుకుంటాం." అని, "మా సంసారం సాంతం 'సరస సలిలము'గా మాత్రం ఇది నిలిచిపోతుంది" అంది సరళ తన్మయంగా. ఆ చెలియలు అంతా మూకుమ్మడిగా ముచ్చటయ్యారు. ***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.