'2020-2021 Na Prayanam' written by Kankipati Sowmya
రచన : కంకిపాటి సౌమ్య
ఒక పచ్చటి చక్కటి ఆహ్లాదకరమైన అందమైన పల్లెటూరు. అదే మా ఊరు. నా పేరు లలిత. నేను చిన్నపటినుండీ మా ఊరిలోనే చదువుకున్నాను. నాకు చదువంటే అంత ఇష్టం లేకపోయినా మా ఊరిలో ఎక్కువ చదువుకున్నవారు లేకపోవటంతో మా నాన్న నన్ను బాగా చదివించాలని కోరిక. అలా అని మాది డబ్బున కుటుంబమూ కాదు. అమ్మ చనిపోయింది. నాకు ఉన్నది నాన్న, ఇద్దరు చెల్లుల్లు. నాన్న పొలం పనులు చేస్తూ నన్ను, చెల్లెళ్లను చదివిస్తున్నాడు. చెల్లెల్లిద్దరు గవర్నమెంట్ బడిలో చదుతున్నారు. పై చదువుల కోసం నాన్న పొలం తాకట్టు పెట్టి మరీ నన్ను బాగా చదివించాడు. అందుకు ఫలితంగా 2019 లో ఫిబ్రవరిలో నాకు అమెరికాలోని పెద్ద కంపెనీలో మంచి పోస్టులో ఉద్యోగం వచ్చింది. మంచి సంపాదన. కానీ, కొత్త ప్రదేశం, కొత్త వాతావరణం. అలవాటు పడటానికి నాలుగు నెలలు పట్టింది. కొత్త స్నేహితులూ పరిచయమయ్యారు. సంపాదించిన జీతం నా ఖర్చులకు ఉంచుకుని మిగిలినది నాన్నకి పంపేదానిని. ఇది నా దినచర్య. కొన్ని నెలలు గడిచాయి. కొత్త సంవత్సరం వచ్చింది. అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే నేను కూడా 2020 సంవత్సరం ఎలా ఉండబోతుందో అని ఎదురుచూసా. చివరికి కొత్త సంవత్సరం రానే వచ్చింది. జనవరి నెల కదా, అంటే పండగ మాసం. నెలరోజులు మా సొంతూరులో గడపటానికి అమెరికా నుండి బయలుదేరి 3వ తారీఖునా తెల్లవారుజామున ఊరు చేరాను. పల్లెటూరు అంటేనే పండగలకి పెట్టిన పేరు.అందులో సంక్రాంతి పండుగ అంటే నెల మొదటి రోజునుంచే సందడి మొదలైపోయింది. ఇంటికి వెళ్ళేదారిలో అందరూ ఇంటిముందు ముత్యాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడుతూ, వాకిళ్ళను అలుకుతూ కనిపించారు. ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తువచ్చాయి. కొంచంసేపటికి ఇంటికి చేరుకున్నాను. వారిని చూడగానే ఆనందభాష్పాలు. వాళ్ళే నా ప్రపంచం.పెద్ద చెల్లి నేను వస్తున్నా అని రకరకాల వంటలు వండి ఉంచింది. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. అది 13వ తారీఖు. అంటే భోగి పండుగ. భోగీ మంటలు వేసుకుని ఊరూరంతా చలి కాసుకోటం బలేగా ఉంటుంది. ఆ రోజు మా ఊరి పిల్లలందరికీ భోగిపళ్లు పోసి వారితో ఆటలు ఆడించి బహుమతులు ఇవ్వడం ఆనవాయితి. పసిపిల్లలు కలకాలం వర్ధిల్లాలని వారికి భోగిపళ్లు పోసి ఆశీర్వదిస్తారు. ఆ రోజు చాలా ఆనందంగా గడించింది. మరుసటి రోజు సంక్రాంతి. సంక్రాంతి అంటేనే హరిదాసు, ముత్యాల ముగ్గులకు పెట్టిన పేరు. ఇంక ముగ్గుల పోటీలు ఎలాగూ ఉంటాయి. ముగ్గుల పోటి అంటే చాలు నేను ముందుంట. నేను ఉన్నా అంటే చాలు, పోటీదారులు పాల్గొనాలంటే బయపడిపోతారు. ఇది గత ఐదు సంవత్సరాలుగా జరుగుతుంది. ఈసారి కూడా అలానే పాల్గొన్న. మొదటి బహుమతి నాకే వచ్చింది. సంక్రాంతి ఎలా జరుపుతారో, ఏమేమి చేస్తారో అదంతా నా ఒక్క ముగ్గులో చూపిస్తాను. అదే నా ముగ్గుకున్న విశేషం. అందుకే ప్రతి సారి మొదటి బహుమతి నాకే వస్తాది.ఆ తర్వాత మహిళలందరికీ ఆటలు, వంటల పోటీలు జరిగాయి. సంక్రాంతి అంటే మొగవాళ్లకి మొదట గుర్తు వచ్చేది పందాలు. మా ఊరిలో ఇక చెప్పక్కర్లేదు. ఈ సంవత్సరం పందానికి సంవత్సరంనుండే పందెం కోళ్లను తయారు చేస్తారు. వాటికి బలమైన ఆహారాన్ని పెట్టి పోటీకి సిద్దం చేస్తారు. మా నాన్న కూడా ఒక పుంజుని బలంగా తయారు చేసి పందెంలో దించాడు. తర్వాత పొట్టేళ్ల పందాలు, పేకాటలు జరిగాయి. ఆడవాలమంతా ఆటలు పాటలతో సందడి చేసాము.పిల్లలు, కుర్రోళ్ళు పతంగులను ఎగరవెస్తూ ఒకరి పతంగిని మరొకరు తెంపుతూ ఆనందించారు. ఆ రోజంతా మాకు తెలీకుండానే గడిచిపోయింది. మరుసటి రోజు కనుమ, అంటే పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. మా నాన్న కూడా రైతే. నేనూ ఓ రైతు బిడ్డని కాబట్టి ఒక రైతు ఒక ముద్ద కోసం పడే శ్రమ నాకు బాగా తెలుసు. ఈ పండుగ కూడా మా ఊరూరూ బాగా జరిపారు. పండుగలు అన్ని బాగా జరుపుకున్నాము. నేను పెట్టిన సెలవలు కూడా అయిపోయాయి. చెల్లిలను, నాన్నను వదిలి వెళ్లాలంటే ఏదో బాధ. కానీ వాళ్ళకోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తప్పదు. మిగిలిన రెండు రోజులు వాళ్ళతో బాగా గడిపి జనవరి 18న నేను అమెరికాకి తిరిగి ప్రయాణం అయ్యాను. వెళ్ళిన వారానికి ప్రపంచమంతా వనికిపోయెలా ఒక మహమ్మారి. చైనా దేశంలో పుట్టి ప్రపంచ నలు దిశలా విజృంభించి కోట్లమంది ప్రాణాలను బలిచేసుకోటనికి తయారుగా ఉంది. ఉండటమేంటి, ఇప్పటికీ అదే పనిలో ఉంది. నేను అమెరికా వెళ్ళిన వారానికి కొన్ని ప్రదేశాలలో లాక్ డౌన్ అమలుచేశారు. మరుసటి నెలకి ప్రపంచంలోని సగం దేశాలు బైటికి వెళ్ళటానికి వీలు లేకుండా లాక్ డౌన్ మరియు సెక్షన్ 144 అమలులో ఉంచారు. విదేశాలకు వచ్చినవారు సోంతూరికి వెళ్ళటానికి లేదు. వలస కార్మికులకు దిక్కు లేదు. ఎక్కాడివారు అక్కడ కుక్కిన పేనులా ఇళ్ళల్లో బందీ అయిపోయారు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పెద్ద పెద్ద కంపెనీలు సైతం మూతపడ్డాయి. ఈ మాయదారి కరోనా చిన్నా పెద్దా అని తేడా లేకుండా పేదా ధనిక అనే బేధాలు లేకుండా అందరి ప్రాణాలను బలి తీసుకుంది. భారతదేశంలో 24 మార్చి లాక్ డౌన్ మొదలైంది. నేను నా ఊరు వెళ్ళటానికి వీలులేదు. ఒక పక్క కరోనా మరో పక్క న కుటుంబం ఎలా ఉందో అనే ఆందోళన, భయం రెండు పట్టుకున్నాయి. రాను రాను ఇటలీలో, బ్రెజిల్లో మరణాల రేటు పెరిగిపోతుంది. నాన్నతో చెల్లెళ్లతో ఫోనులో రోజు బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నా. నాన్న పొలం పంటలను అమ్మటానికి వీలులేకుండా అయిపోయింది. అన్ని ధాన్యాలు నిలువ ఉండిపోయాయి. ఒక రకంగా పెద్ద నష్టం మా కుటుంబానికి. మా కుటుంబమే కాదు, ఆన్ని వ్యవస్థలకు కూడా నష్టమే. మా ఊరిలో కూడా జనం కరోనా బారీన పడ్డారు. నాకు ఒకటే భయం నా నాన్న, చెల్లెళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని. అనుకున్నట్టే అయింది. నాన్నకు కరోనా పాజిటివ్. మా ఊరిలో ఉన్నది ఒకటే ఒక గవర్నమెంటు ఆసుపత్రి. అప్పటికే అక్కడ చాలామంది కరోనాతో చేరారు. నాన్నకు కరోనా అని తెలిసిన మరుక్షణం నా కాళ్ళూచేతులు ఆడలేదు. కలవటానికి లేదు. దగ్గరుండి చూస్కోటానకి లేదు. వీడియో కాల్ ద్వారానే నాన్నకు అన్ని జాగ్రత్తలు చెప్పి ఊరి పక్కన ఉన్న పెద్ద ఆసుపత్రిలో జాయిన్ అవ్వమని చెప్పాను. ఎప్పటికప్పుడు నాన్న ఆరోగ్యం తెలుసుకుంటూనే ఉన్న.చెళ్లెళ్లను కూడా టెస్టులను చేయించుకోమని చెప్పాను. రాను రాను నాన్న ఆరోగ్యం కుదుట పడుతుందని డాక్టర్లు చెప్పారు. రెండు వారాలు అవుతుంది. ఇంటినుండి ఫోను. నాన్న కరోనా వల్ల చనిపోయారని. ఆఫీసులో ఉన్న నేను ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయా. తోటి ఉద్యోగులు వచ్చి నీళ్ళు పోసి లేపితే లేచా. అప్పటికి గానీ తేరుకోలేదు. నాన్న ఇకలెరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయా. చుడాటనికి కూడా నాన్నని ఇంటికి పంపలేదట. ఇక నా పరిస్థితి చెప్పటానికి కూడా లేదు. ఇక్కడినుండి కదలటానికి లేదు. కనీసం నాన్న చివరి చూపు కూడా నోచుకోలేని దుస్థితి. దూరంగా ఉన్న నాకే కాదు దగ్గరే ఉన్న చెల్లెళ్ళకు కూడా లేదు నాన్నను చూడటానికి. ఇలాంటి పరిస్థితి ఏ మనిషికి రాకూడదనుకునే మనం ఈ కరోనా మహమ్మారి వల్ల ఎంతమంది మరణాలు చూడాల్సి వచ్చింది. చెల్లెళ్ళు ఇద్దరు బిక్కు బిక్కుమంటూ ఉంటున్నారు. చిన్నప్పటినుండి అమ్మ నాన్న అన్నీ తనే అయి పెంచిన నాన్న మమ్మల్ని ఇంతవాళ్ళను చేసిన నాన్న ఇక లేరు. ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా అని నేను. ఎప్పటికో సెప్టెంబరులో లాక్ డౌన్ తీసేసారు. అప్పుడు నిమిషం ఆలస్యం చేయకుండా ఊరికి బయలుదేరాను. చెల్లెళ్ళను చూడగానే కన్నీళ్లు ఉబికివచ్చాయి. దగ్గరికి తీసుకుని నాన్నను గుర్తుచేసుకున్నా. తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కొన్ని రోజుల తర్వాత తిరిగి అమెరికాకి ప్రయాణమయ్యా. అక్కడ నేను కంపెనీలో ఇచ్చిన పనులను సమయానికి ముగించాలి. అన్ని చోట్ల నిదానంగా లాక్ డౌన్ తీసేసారు. మూడు నెలలు అవుతుంది. కొత్త సంవత్సరం వచ్చింది. అందరూ 2020 కోసం మొదట్లో ఎలా ఎదురుచూసారో, ఆ సంవత్సరం ఎప్పుడు వెలిపోతుందో అని వేచి చూశారు. నేనూ ఎదురుచూసా. 2021 వచ్చింది. నాకు సెలవులు వచ్చాయి. జనవరి 7న బయలుదేరాను. ఇంటికి వెళ్ళేదారిలో గత సంవత్సరం జరిగిన సంక్రాంతి పండుగ రోజులన్నీ గుర్తువచ్చాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. మహమ్మారి ఎంతటి పని చేసింది. కనీసం ఈ ఏడు అయినా మంచి రోజులు రావాలి. ఎలాగో 16న వాక్సినేషన్ అంట. అది మంచిగా పనిచేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్న. అలా నడుస్తూ ఇంటికి చేరుకున్నా. సెలవులకి చూసి పోవటానికి కాదు, శాశ్వతంగా నా చెల్లెళ్ళతో ఉండిపోవటానికి.
గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.