top of page
Writer's pictureBharathi Bhagavathula

పరిధి


'Paridhi' written by Bhagavathula Bharathi

రచన : భాగవతుల భారతి





కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.



సంయమనం లేని మానవుడి ప్రయాణం

రకరకాల పరిధులలో సాగుతుంది.

చుట్టూ జరిగే తన అనుభవాలతోనే

పరిధిని గీస్తాడు. విచక్షణా తలుపులు బిగించేసుకుని , ఊహల కిటికీలోంచే చూసి,

కనిపించేదే నిజమని భ్రమసి,ఆనందపడీ, కొన్నాళ్ళకి ఛీ ఇదంతా అబద్దం

అని ఆ పరిధిని చెరిపేసి ,మళ్ళీ వేరే పరిధిని

గీసే ప్రయత్నం లో నిమగ్నమౌతాడు.

నిరంతరమూ ఇదే జరుగుతూ ఉంటుంది.

గీసుకోటం,...చెరుపుకోటం ...మళ్లీ గీయటం

@@@

మంగతాయారమ్మ విషయంలోనూ ఇదేజరిగింది. ఇల్లిల్లూ తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండే మంగ తాయారమ్మకి,

ఓ ఇంట్లో పరిచయమయ్యారు , పూజారి శివ ప్రసాద్ శర్మ గారు. ఆయనకు, చేతులు చూసి జాతకాలు చెబుతాడనే పేరుంది.

ఆ ఊరి పూజారి కావటం వల్ల తరచుగా కలిసేది, మంచీ, చెడూ చెప్పించుకుని కొన్నికూరగాయలు ఉచితంగా ఇచ్చేది, మంగతాయారు.

అలా ఆ పరిధిలోనే తిరిగే మంగతాయారు కి చెయ్యిచూసి ",నీ స్థితి మారుతుంది, నువ్వు చాలా గొప్పదానివవుతావ్." అని చెప్పాడు, పూజారి శివ ప్రసాద్ శర్మ.

కాసేపు ఆనందపడి "'ఆ~~ ఇదంతా జరిగేదా? పెట్టేదా!?" అని కొట్టి పారేసేది. మూతిమూడువంకర్లు తిప్పీ!...

అదో అమాయకపు పరిధి.

కాలం తన దారిన తను పరుగిడుతూ, మార్పులూ తెచ్చింది. కారణం.. ఏదైనా!... మంగతాయారు పరిధిని విస్తృతపరిచింది. ఊరు మార్చింది.

ఇంటింటికీ తిరిగే మంగతాయారు స్థితిమారి, మార్కెట్ లో కూరలమ్మే వ్యాపారం కొన్నాళ్ళు, తర్వాత సూపర్ మార్కెట్ స్థాయికీ, ఎదిగింది.

ప్రతిరోజూ అయ్యగార్నే తలుచుకుని

" మహానుభావుడు ఏ నోటితో చెప్పాడో. నా పరిస్థితి మార్చాడు . ఏ నాటికైనా అయ్యగారిని దర్శించి, దండమెట్టాల "

భర్తతో రోజూ చెబుతూ ఉండేది.

శివ ప్రసాద్ శర్మ దేవుడు, అనే భక్తి పరిధిని గీసేసుకుని, అందులోనే తన్మయం అవుతూ, ఏ పని చేసినా మంగతాయారుకి,

" శివా! పరమాత్మా! అంతా నీ ఆశీర్వాదమేనయ్యా! అంతా నీ దయేనయ్యా! ఎన్ని రోజులైనా ఇలాగే భజన చేస్తానయ్యా! నిన్ను దర్శించుకుంటానయ్యా! వస్తా! " అని

శివప్రసాద్ శర్మ నామంతోనే జరిగి పోతున్నాయ్ రోజులు.

ఇంతలో కరోనా మహమ్మారిఅవతరించింది.

" దేవుడి పూజలు కూడా లేకుండా దేవాలయాలు కూడా

మూసేసారు. దేవాలయాలే కాదు, కరోనా పేరుతో ప్రతీ పరిశ్రమేనా!? వ్యవసాయమేనా ?! వ్యాపారమేనా ?! అన్నీ అల్లకల్లోలమైనాయి.

మనిషికీ మనిషికీ మధ్య ,మాయ పొర కప్పేసి దూరం,వ్యాధి సోకిన వారంతా నిజంగానే చనిపోతారనే భయం పరిధిలోకి

మనిషిని నెట్టేసింది .

ఇప్పుడేం చేద్దాం" అన్నాడు భర్త.

అలాంటి పరిస్థితి లో మంగతాయారమ్మ

"మనవ్యాపారం కూడా కుదేలయింది. సూపర్ మార్కెట్ మూసేసే పరిస్థితి వచ్చింది. కూరగాయల వ్యాపారమూ

అంతంత మాత్రంగానే ఉంది. మళ్లీ ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముకునే పరిస్థితి రాదుకదా! ఈ సమయంలో ఆ మహానుభావుడు ఉంటే ఏదైనా ఉపాయం చెప్పేవారేమోనండీ. ఓసారి వెళ్ళి దర్శించుకు వస్తానండీ." అంది.

"మనదే కాదుగా, అందరిదీ అదే దుస్థితి. ఇది జాతీయ, సామాజిక విపత్తే, కాక ప్రపంచమంతా...ఇంకా.. విశ్వానికే విపత్తు.. దీన్ని మూఢనమ్మకాల తో ముడిపెట్టకు తాయారూ! " అన్నాడు భర్త.

ఐనా వినకుండా మంగతాయారమ్మ,

లాక్ డౌన్ కొంత సడలించగానే....

"దేవాలయంతో మనకేం పనిలే! ఆయన ఇంటికేవెడదాం! " అనుకుంటూ పూర్వం తనుఉన్న ఊరే సొంత కారులో కూరలూ, పళ్ళూ తీసుకుని వెళ్ళింది.

వెడుతూనే శివ ప్రసాద్ శర్మ అయ్యగారికి సాష్టాంగ పడిపోయింది, వినయంతో.

"అయ్యగారూ! నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానయ్యగారూ! నా జీవితాన్నే మీ పాదాల దగ్గర దీపంగా పెడతానూ! మీఅంగవస్త్రము విడిచి ఇవ్వండి, నీళ్ళతో

తడిపినోట్లో పిండుకుని తీర్ధంలా పుచ్చుకుంటానూ! మీ బుుణం ఏదో రూపంలో తీర్చుకుంటా అయ్యా! నీ నోటిమాట అమృతపు తునకయ్యా!"

భక్తి ఉన్మాదంలో ఇలా వాక్పవాహం సాగిపోతూనే, మధ్యలో ఆపి వంటింట్లోకి తొంగిచూసి, "అమ్మగారూ! లేరా?! ఎక్కడా అలికిడిలేదూ !~~" అంటూ అర్దోక్తి తో ఆగిపోయింది, మంగ తాయారమ్మ .

పూజారి శివ ప్రసాద్ శర్మ గారు "మా చిన్నపాప పురిటికని మా

ఆవిడ తెనాలి వెళ్ళింది. మధ్యలో కరోనా వచ్చిపడింది. ఆవిడ అక్కడే చిక్కుకుపోయింది .ఇదిగో! రెండు రోజులనుండీ నాకూ దగ్గూ, జ్వరం, డాక్టర్ కు చూపిస్తే ఏంలేదు రెస్టు తీసుకుంటే సరిపోతుందన్నారు...."

అయ్యగారి మాట సాంతం పూర్తికానీయలా!

"అయ్యో! అది కరోనా నేమో!"అంది.

"డాక్టర్ గారైతే కరోనాకాదు! సీజన్ లో వచ్చే జ్వరమనే, చెప్పారు. బలమైన ఆహారం తీసుకోవాలని చెప్పారు. ఆవిడేమో ,అక్కడెక్కడో తెనాలిలో ఉంది. కాచి పోసే దిక్కు లేదు. కాస్త వంటింట్లో పాలూ అవీ ఉన్నాయ్. కొంచెం కాఫీఐనా కలిపివ్వకూడదూ! నీకు పుణ్యం ఉంటుంది. మడీదడీ అని ఇలాంటి సమయంలో పెట్టుక్కూర్చుంటే ఎలాజరుగుతుంది చెప్పూ. " అంటూ దగ్గాడు శివ ప్రసాద్ శర్మ గారు.

అంతే! తనతో తెచ్చిన ఆ కూరగాయలూ, పళ్ళూఅక్కడే వదిలేసి, వడివడిగా కారెక్కేసింది. కరోనా తనకీ అంటుతుందేమో భయపు పరిధిలో...

అచంచలమైన, అఖండమైన , అంతభక్తి పరిధినీ చెరిపేసి, ఇంకే పరిధిని గీసుకోవాలని పరుగెత్తిందో మరి! మంగతాయారమ్మ.

////////////

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.



1 view0 comments
bottom of page