విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ
'A To AA Part 1/3' New Telugu Story Written By Rathnakar Penumaka
'‘‘అ’’ నించి ‘‘ఆ’’ దాకా - పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం
రచన: రత్నాకర్ పెనుమాక
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
గణ గణ మంటూ గంట మోగింది. హుకుంపేట మండల ప్రజాపరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో పిల్లలు బిలబిలమంటూ గోల చేస్తూ బయటికొస్తున్నారు.
పుస్తకాల సంచులు భుజానేసుకుని ఆ బరువును లెక్క చేయకండా ఇంటికెళ్ళి పోతున్నామనే సందడిలో సంచి బరువుని సునాయాసంగా మోసేత్తన్నారు. ఒక్క ఆనంద్ అని అందరూ పిలిచే కొండేటి ఆనంద్‌కుమార్ అనే మా తమ్ముడు తప్ప! ఆడి చూపులు ఎవరికోసమో ఎదురుచూత్తన్నాయి.
ఆ ఎదురుచూపులు ఎవరికోసమో ఆడికే కాదు ఆ స్కూల్లో అందరికీ తెలుసు, తన క్లాస్‌మేట్ మాగాపు అన్నపూర్ణ కోసమని!
ఇది ఇయ్యేల కొత్తకాదుగా ఆడికి! ఆ అమ్మాయికి! అన్నపూర్ణేమో ఆడి కోసం ఎతుకుతుంది.
ఎతుకుతూనే అప్పుటివరకూ తనతో నడుత్తున్న చెల్లెళ్ళని, జతగత్తెల్ని తప్పించుకుని, స్కూల్ ఎదురుగా ఉన్న పాలూరి యేసుబాబు గారి బడ్డీకొట్టు దగ్గిర తనకోసం ఎదురుచూత్తన్న ఆనంద్‌ని కలుసుకుంది.
ఇద్దరూ అందర్నీ ఒదిలి మాటాడుకుంటా గారపాటోరి ఈది, చాకలిపేట, పెద్దఈది, గొల్లల సందు దాటుకుంటా వాల్‌పోస్టర్లు చూసుకుంటా ఆ సినిమా కబుర్లు చెప్పుకుంటా కొండేటోరి ఈదిలో అన్నపూర్ణ ఆళ్ళు అద్దెకుంటన్న ఇంటికొచ్చేరు.
ఈళ్ళు రాయటం చూసిన అన్నపూర్ణ ఆళ్ళమ్మ మేమంతా అనంతాంటి అని పిలిచే అనంతలక్ష్మి గారు సంతకెల్తా తాళమేసిన ఇంటికి ‘‘తాళం తీయాలి ఉండు రమా!’’ అంటా పక్కింటి రమాదేవి గారి దగ్గర నించి వొచ్చి తాళాలు తీసింది.
ఆనంద్ ఇంటికి ఎళ్ళిపోతుండగా అన్నపూర్ణ ‘‘నందు ఆగు!’’ అంటా రాత్రి అనంతాంటి చేసిన నువ్వుల జంతికలు పట్టుకొచ్చి ఇచ్చింది. అయ్యి తింటా నందు ఇంటికొచ్చేడు.
ఇంటికొస్తూనే పుస్తకాల సంచి ఓ పక్కన పడేసి జంతిక నములుకుంటా డబుల్‌కాట్ మీద అడ్డంగా పడుకుని తింటంటే, ‘‘ఒరేయ్! చిన్నోడా! కాళ్ళు కడుక్కోకుండా మంచ మెక్కేసావా? ఊరంతా తిరిగొచ్చి మంచమెక్కొద్దని ఎన్నిసార్లు చెప్పాన్రా? ఎళ్ళు, ఎళ్ళి కాళ్ళు కడుక్కుని రా!’’ అంటా అమ్మ ఆనంద్‌ని తొందరపెట్టింది. ఆడు తింటున్న జంతిక చూసి ‘‘ఎవరిచ్చార్రా? అన్నపూర్ణక్కేనా?’’ అంటా ఆరా తీసింది.
‘‘అవును అనూనే ఇచ్చింది’’ అంటా కోపంగా కాళ్ళు విదిల్చుకుంటా తప్పదన్నట్టు ఎళ్ళి పెరట్లో ఉన్న సిమెంటు గోళెంలో నీళ్ళు సీమండి చెంబుతో తీసుకొని, ఇసుగ్గా కాళ్ళు మీద గుమ్మరించుకొని కాళ్ళు పూర్తిగా తడవకుండానే వొచ్చి, మళ్ళీ మంచం మీద అడ్డంగా పడిపోయేడు.
***
సాయంత్రం అమ్మ కాసిచ్చిన పాలు, బోర్నవీటా లేందే తాగనని కొంచెంసేపు మారాం చేసి రేపు కొంటానని అమ్మ మాటిచ్చేక ఆ పాలు తాగేడు. హోమ్ వర్కులన్నీ చేసేసుకున్నాక, నాన్న డ్యూటీ నుంచొచ్చి మొఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని అమ్మ టాప్‌స్టార్ టీ పొడితో చేసిచ్చిన టీ తాగి టి. వి. ఎస్. బండేసుకుని రోజూ నాన్న ఈ టైంకి ఎళ్ళే రాజమండ్రి శ్యామలా సెంటర్ లోని సి. ఐ. టి. యు. ఆఫీసుకి బయల్దేరే వొరకూ ఉగ్గబట్టుకుని గుణగుణమంటూ బట్టీ పడుతూ చదివిన మా తమ్ముడు ఆనంద్, నాన్న బండి ఈది చివర మలుపు తిరగ్గానే పుస్తకాలు మూసేసి సంచి మూలన పడేసి అన్నపూర్ణ ఇంటికి పరిగెట్టేడు.
అన్నపూర్ణ ఆళ్ళ సవతి అన్నయ్య మాగాపు రవీంద్ర ఫైజర్ కంపెనీలో మెడికల్ రిప్రజంటేటివ్‌గా పనిచేత్తాడు. సవతి అన్నయ్య అంటే అన్నపూర్ణ ఆళ్ళ నాన్న నాగేశ్వర్రావు, అదే నాగు అంకుల్ అనంతాంటి కంటే ముందు పెళ్ళి చేసుకున్నారు. ఆళ్ళ కొడుకే రవీంద్ర. ఆవిడ ఏదో జబ్బుచేసి చచ్చిపోతే నాగు అంకుల్ ఆవిడ చనిపోయిన పదేళ్ళకి తనకంటే పదేళ్ళు చిన్నదైన అనంతాంటీని చేసుకున్నారు.
రవీంద్ర అంటే ఆళ్ళింట్లో అందరికీ కొంచెం భయం. అతనింట్లో ఉన్నంతసేపు ఫ్రీగా మాట్లాడుకోరు. అతను ఆళ్ళింట్లో ఎక్కువ చదువుకొని ఉద్యోగం చేత్తన్నాడు కాబట్టి ఆ గౌరవం.
అతను అన్నపూర్ణ, తన చెల్లెళ్ళు వరలక్ష్మి, భవానీల చదువు గురించి పట్టించుకుంటా ఏరోజు హోమ్‌వర్క్‌లు ఆ రోజు చేసారో లేదో చెక్ చేత్తా ఉంటాడు.
అతనింట్లో ఉంటే ఆనంద్ కూడా అన్నపూర్ణతో ఎక్కువసేపు మాట్లాడకుండా వచ్చేత్తాడు.
అతను ఎళ్ళిపోయాక ఆ ఇంట్లో ఆనంద్‌ని ఏ ఇషయానికి అడ్డుచెప్పే వోళ్ళే ఉండరు. అన్నపూర్ణ ఆళ్ళ నాన్న నాగంకుల్‌తో సహా!
ఒక్కో రోజు ఆనంద్ ఏదైనా కారణంతో ఆళ్ళింటికి ఎళ్ళకపోతే అనంతాంటి నాగంకుల్, ఈరోజు ‘‘ఆనందు ఇంటికి రాలేదేమ్మా ఆడికి ఒంట్లో బాలేదా?’’ అంటా ఆరా తీత్తారు. అంత చనువు, చేరిక, అలవాటు ఆనంద్ ఆళ్ళందరికీ!
అప్పుడప్పుడూ వచ్చే అనంతాంటి వాళ్ళ అమ్మ సుందరమ్మ మాత్రం ఆనంద్ ఇంటికొస్తే మొఖం చిట్లించేసుకుంటంది. ఒకసారి ఆనంద్‌ని దగ్గరికి పిలిచి ‘‘ఒరేయ్ అబ్బాయ్! మీరేమింట్లు? కోమట్లా’’ అని అడిగింది ఆనంద్ నల్లగా ఉండటం చూసి!
మామూలుగానే తుంటరైన ఆనంద్ కులం చెప్పకుండా ‘‘మేమా బామ్మగారు చింతుట్లుం’’ అంటా ఎటకారమాడేడు. అది ఇని తిక్క నషాళానికికెక్కిన సుందరమ్మ ‘‘ఒరేయ్ అబ్బాయ్! నీకు రోజంతా ఇక్కడేం పనిరా? ఆడపిల్లలతో ఆటలేంటి?’’ అంటా మొఖం చిట్లించుకుంటా గద్దించింది.
అది ఇన్న అనంతాంటి ‘‘అమ్మా! ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నావే, కులం గొడవెందుకే నీకు? ఆ అబ్బాయి పిల్లలతో కలిసి చదువుకుంటన్నాడు. నాకు కొడుకులాంటోడు. ఒకటి, రెండు రోజులుండి ఎళ్ళిపోయే దానివి ఆ అబ్బాయిని అలా చెదరగొట్టకే అమ్మా’’ అంటా ముసలావిడ నోరు మూయించేసింది.
***
ఆ రోజు రవీంద్ర బి. పి. ఎల్. కలర్ టి. వి. కొనుక్కొచ్చాడు. ఆ ఈదిలో ఎవరింట్లోనూ కలర్ టి. వి. మాట దేవుడెరుగు, బ్లాక్ అండ్ వైట్ టి. వి. కూడా లేదు మా ఇంటితో సహా! ఒక్క రేషన్ డీలర్ రేలంగి రాఘవయ్య గారింట్లో తప్ప.
ఆ రోజు ఆడోళ్ళంతా అన్నపూర్ణ ఆళ్ళింటి కాడ గుమికూడారు.
రాజమండ్రి గుండోరి ఈదిలో కర్నీడి ఎలక్ట్రానిక్స్ షాపు నుంచి టి. వి. పట్టుకొచ్చిన టి. వి. టెక్నీషియన్, మేడెక్కి ఎక్కడ సిగ్నల్స్ బాగా అందుతున్నాయో, ఏంటిన్నా ఏ డైరక్షన్‌లో కడితే టి. వి. , చుక్కలు, గీతలు లేకుండా బాగా వొత్తదో కనుక్కొని అటేపు ఏంటెన్నా కట్టేసి దిగాక అనంతాంటి దేవుడి బల్ల మీదున్న పసుపు, కుంకుమ తెచ్చి టి. వి. కి బొట్టెట్టి అన్నపూర్ణతో టి. వి. ఆన్ చేయించేరు.
ఆరోజు శనివారం దూరదర్శన్‌లో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, లిజి, జయసుధ నటించిన సాక్షి సినిమా వొత్తంది. అక్కడున్నోళ్ళందరూ కూచ్చోడానికి, చాపలు, జంబుఖానా ఏసి కూచ్చోబెట్టేరు.
అందరూ సినిమా చూత్తంటే, అనంతాంటి అందరికీ ఉల్లిపకోడీలేసి సాసర్లలో వేడివేడిగా అందించేరు. అయ్యి తింటుండగానే అందరికీ టీ పెట్టి గ్లాసుల్లో పోసి అందించేరు.
వేడివేడి, కమ్మని పకోడీలు తింటా సినిమా చూత్తా టీ తాగేసిన ఆడోళ్ళంతా సినిమా పూర్తయ్యేంత వొరకూ మధ్యలో వొచ్చే ఎడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వొదలకుండా చూసేరు.
సినిమా పూర్తయ్యేక అనంతాంటితో ‘‘అనంతగారు! మీ టి. వి. చాలా బాగుంది థియేటర్‌లో చూసినట్టుంది. ఇక వారం వారం డీలర్ గారింటికి ఎళ్ళక్కర్లేదు. మీ ఇంటికే వచ్చేత్తాం’’ అంటా ఎళ్ళిపోయేరు.
ఆనంద్ మాత్రం అన్నపూర్ణ వాళ్ళతో సహా సినిమా అయ్యేక వొచ్చే వార్తలు, దూరదర్శన్ నేషనల్‌లో వొచ్చే హిందీ కార్యక్రమాలు అన్నీ చూత్తా అక్కడే భోంచేసి టి. వి. చూత్తా టైం మర్చిపోయేడు.
ఎప్పుడో బాగా చీకటి పడ్డాక నాన్న టి. వి. ఎస్. బండి సౌండ్ చెవులకి చేరే వరకూ టి. వి. చూసి, నాన్న బండి అన్నపూర్ణ ఆళ్ళుండే కొండేటోరి ఈది చివర ఉండగానే ‘‘అమ్మో! నాన్న వొచ్చేత్తన్నాడు’’ అంటా అక్కడి నించి దొడ్డి గుమ్మంలోంచి పరిగెట్టి మా ఇంటికొచ్చేసి, ఉప్పుడిదాకా చదువుతానే ఉన్నట్టు పుస్తకం ముందేసుకుని గుణగుణమంటూ పక్కోళ్ళకి ఇనిపించీలా చదవటం మొదలెట్టేడు. ఆడి నటనకి కోపం బదులు నవ్వొచ్చింది మా అమ్మకి అందుకే ఆడినేమీ అనలేదు.
నాన్న బండి ఆగటం ఇని నాన్నకి ఎదురెళ్ళింది, అమ్మ ! నా హోమ్ వర్కులన్నీ ముగించుకొని పుస్తకాలు ఎగబెట్టేసి భోంచేత్తన్న నేను అనుకున్నట్టు గానే, నాన్న లోపలికొత్తానే తమ్ముడు ఇంకా చదువుతుండడం, నేను తింటుండడం చూసి, ‘‘చిన్న పిల్లోడు చదువుకుంటన్నాడు. ఈడి చదువు అప్పుడే అయిపోయిందా? అప్పుడే భోంచేసేత్తన్నాడు’’ అంటా గయ్‌మని లేచేడు. మాఇంట్లో భోజనాలయ్యేక ఇక చదవటం ఉండదు పడుకోవడమే మరి!
నాకు మా తమ్ముడి మీద చాలా మంటొచ్చింది. కానీ పోన్లో అని ఆడి అసలు ఇసయం బయటెట్టలేదు. నాకోపం పసిగట్టిన మా అమ్మ నేనెక్కడ కోపంతో అసలు గుట్టు బయటేట్టేస్తానేమోనని నన్ను కవర్ చేత్తా ‘‘ఆడి వర్కులన్నీ అయిపోయాకే అన్నీ అప్పచెప్పాకే భోంచేత్తన్నాడు లెండి’’ అంటా సర్దిచెప్పింది.
***
ఆరోజు ఆనంద్ స్కూలుకి బయల్దేరి అన్నపూర్ణ కోసం ఆళ్ళింటికి ఎళ్ళాడు. అన్నపూర్ణ కనిపించలేదు కానీ, అనంతాంటి బయటికొచ్చి ‘‘ఒరేయ్ చిన్నా! అక్కకి ఒంట్లో బాలేదు, ఈరోజు స్కూలుకి రాదు’’ అని చెప్పేరు.
‘‘అవునా అనూకి బాలేదా? ఎక్కడుంది? మాట్లాడొత్తానుండాంటీ’’ అంటా లోపలికెళ్ళబోతుంటే ‘‘ఒరేయ్ చిన్నా! నువ్వు చూడకూడదురా! నువ్వు స్కూలు కెళ్ళు, సాయంత్రం మాట్లాడుదు గాని మీ అక్కతో’’ అన్నారు.
అదేంటి ఎప్పుడూ లేంది ఆ ఇంట్లోకి ఎళ్ళటానికి ఆడికి పర్మిషన్ లేకపోవటం! ఇదంతా వింతగా, విడ్డూరంగా ఉంది ఆడికి. ఆడి చిన్ని మనసుకు బోలెడు కష్టంగా అనిపించింది. మొఖం చిన్నబుచ్చుకుని ఎళ్ళబోతంటే ‘‘ఒరేయ్ చిన్నా, అమ్మ ఇంట్లోనే ఉందా?’’ అనడిగారు అనంతాంటి.
“ఉంది ఆంటీ’’ అంటా ఎళ్ళబోతుంటే ఇంట్లోంచి అన్నపూర్ణ చెల్లెళ్ళు వరలక్ష్మి, భవాని పుస్తకాల సంచులు తగిలించుకుని స్కూలుకి బయల్దేరేరు ఆనంద్‌తో కలిసి.
అన్నపూర్ణ వొచ్చేపుడు గలగలా మాటాడుకుంటా, రోడ్డుమీద రాళ్ళు తన్నుకుంటా, అదో ఆటలా ఆడుకుంటా, మా ఊళ్ళో సుబ్బారాయుడి షష్ఠి జరిగినపుడు ఉండే సందడినంతా తన మొఖంలో నింపుకొని కులాసాగా స్కూలుకెళ్ళే ఆనంద్ మొఖంలో ఇప్పుడయ్యేమీ లేవు.
అన్నపూర్ణ కేమైందోననే ఆలోచన, ఆందోళన తప్ప! మౌనంగా నడుస్తున్న ఆనంద్‌తో భవాని, ‘‘ఓయ్ నందూ, అలా సైలెంటైపోయావే? మా అక్కతో తప్ప మాతో మాటాడవా? మీ అక్క గురించి బెంగెట్టుకున్నావా? నీకో ఇసయం చెప్పనా? మీ అక్క ఈరోజే కాదు, పది రోజుల దాకా స్కూలుకి రాదు. పాపం! నీ పరిస్థితేంటో?’’ అంటా ఎటకారమాడిరది.
అప్పటివరకూ మౌన మునిలా ఉన్న ఆనంద్‌కి ఇది ఇంకో షాక్! పాపం ఆ షాక్ నుంచి తేరుకోడానికి ఆడికి పది నిమిషాలు పట్టింది. తేరుకుని భవానీని ఆత్రంగా అడిగాడు ‘‘భానూ, అనూ కేమైంది? పది రోజుల వరకూ ఎందుకు రాదు? చెప్పవా? ప్లీజ్ చెప్పవా?’’ అంటా బతిమాలేడు.
‘‘ఏమో, నాకూ తెలివదు, అమ్మ హెచ్. ఎం. క్షేమామణి మేడమ్‌కి చెప్పమంది’’ అంది. ఆనంద్ చిన్ని మెదడులో పెద్ద పెద్ద ఆలోచనలు, అంత పెద్ద జబ్బు ఏమొచ్చిందబ్బా? నేను చూడకూడని అనారోగ్యం ఏమై ఉంటంది? అని ఆలోచిత్తంటే అపుడు తట్టింది, పొంగు చూపి ఉంటుంది. పొంగు చూపినపుడు, అది గాలి నించి సోకే అంటువ్యాధి కాబట్టి ఎవరినీ రానివ్వరు. అది తగ్గడానికి సుమారు పది రోజులు పడుతాది. అవును, అనూకి పొంగుజల్లి ఉంటది. అనుమానం తీర్చుకోడానికి భవానీని అడిగాడు ‘‘భానూ, అనూకి పొంగా?’’
‘‘ఏమో నందు నాకూ తెలియదు’’ అంది భవాని. ‘‘కానీ పొద్దుటి నించి అక్కని గదిలోంచి బయటికి రానియ్యలేదు అమ్మ. మమ్మల్ని కూడా అక్క దగ్గిరికి ఎళ్ళనివ్వలేదు. ఏమైందో మాకూ తెలివదు’’ అంది అప్పటివరకూ మూగదానిలా మౌనంగా ఉన్న వొరలక్ష్మి. ఇంతలో స్కూలొచ్చేసింది.
స్కూలుకెళ్ళేప్పుడు రోజూ అమ్మ ఆనంద్‌కి ఒక పావలా ఇత్తాది. దానితో ఆడు పాలూరి ఏసు గారి బడ్డి కొట్లో స్కూలు లోపలికెళ్ళేప్పుడు బబుల్‌గమ్‌లు కొనుక్కుంటాడు. మధ్యలో అంటే ఇంటర్వెల్‌లో కొనుక్కోడానికి డబ్బులుండవు కాబట్టి అన్నపూర్ణ రోజూ తెచ్చుకునే రూపాయి లోంచి అర్ధ రూపాయితో ఆనంద్ కిష్టమైన తాటితాండ్ర కొంటది.
మజ్జానం ఇంటర్వెల్‌లో అన్నపూర్ణ మిగిలిన అర్ధరూపాయితో ఆనంద్‌కి జీళ్ళో, ఐస్‌లో కొంటది. పాపం! ఈరోజు ఈడొక్కడే కొనుక్కోవాలి. ఈడొక్కడే తినాలి. అందుకే ఏమీ కొనుక్కోకుండానే లోపలికెల్లి పోతంటే భవానీ ‘‘నందు, తాటితాండ్ర కొననా?’’ అని అడిగితే ‘‘వద్దు భాను, నాకేమీ వొద్దు నువ్వు కొనుక్కో’’ అంటా క్లాసు కెళ్ళిపోయేడు.
***
పొద్దుట ఇంటర్వెల్‌లో నందు బయటికే ఎళ్ళలేదు. భవాని బయటికెళ్ళి ఆ రోజు కొత్తగా బొంబాయి స్వీట్ అని చెప్పి పుల్లకి రంగు రంగు జీడి లాంటి లాలీపాప్ నెమలి లాగా చేయించి నందూకి పట్టుకొచ్చి ఇచ్చింది. కానీ, అదెంత వెరైటీగా, అందంగా తినాలనిపించేలా వున్నా దాన్ని తినబుద్దే కాలేదు ఆనంద్‌కి!
ఈ ఒక్క రోజుకే ఇలా ఉంటే ఇంకా పది రోజులా, ఎలా? నేనూ ఏదో వొంకెట్టి మానేత్తే? ఎంచక్కా ఇంట్లోనే ఉండొచ్చు. కానీ ‘‘ఎంచక్కా’’ అనేది ఎప్పుడంటే అన్నపూర్ణ తనతో ఉన్నప్పుడు మాత్రమే! ఇంట్లో ఉన్నా, అనూని చూడనివ్వకపోతే, స్కూలు మానేసిన ఫలితమేంటి? ఇలా చిన్నబుర్రకి పెద్ద పేద్ద ప్రణాళికలు, ఆలోచనలు.
సాయంత్రం ఎలాగో భవాని, వరలక్ష్మిలతో కలసి ఇంటికొచ్చేడు. వొత్తానే అన్నపూర్ణ ఆళ్ళ ఇంటి దగ్గిర అందరూ ఆడోళ్ళే గుమికూడి ఉండటం చూసి ఏమైందో అర్ధం కాలేదు ఆనంద్‌కి. అక్కడున్న రమా ఆంటీ మాత్రం ‘‘ఒరేయ్ నందూ, ఇక్కడికి నువ్వు రాకూడదు, ఇంటికెళ్ళు’’ అంటా గద్దించింది. మొఖం చిట్లించుకొని ఇంటికొచ్చేడు నందు.
వత్తానే ఆ కోపాన్నంతా పుస్తకాల సంచి మీద చూపిత్తా దాన్ని అంత దూరం, కోపమంతా బలంలా మార్చి ఇసిరేసాడు. అది ఎళ్ళటానికి మార్గం లేక గోడకి తగిలి అక్కడే కూలబడిరది. ఆడి కోపం గ్రహించిన అమ్మ ఆడినేమి అనలేదు.
ఆడు కాళ్ళు కడుక్కోకుండా మంచమెక్కేసినా, స్కూలు నుంచొచ్చి గంటసేపటి వరకూ, ఆ బట్టలు తీయకుండా అలాగే పడుకునే ఉన్నా, ఏమీ అనలేదు అమ్మ! ఓ గంట తర్వాత ఆడి కోపం కాత్త చల్లారినట్టు ఊహించి అమ్మ ఆణ్ణి తల నిమురుతా ‘‘ఏమైందిరా చిన్నోడా, అలా ఉన్నావేరా?’’ అంటా లాలించీసరికి ఆడికి ఏడుపు తన్నుకొచ్చీసింది.
ఆడు అమ్మ కొడుకు, అమ్మకి ఆడు ముద్దుల కొడుకు. అందుకే అమ్మ దగ్గర ఆడికేమీ దాపరికాలుండవు. ఆడు ఏడుత్తంటే జాలితో చలించిపోయిన అమ్మ ఆడి తల ఒళ్ళో ఎట్టుకుని తల నిమురుతూ ‘‘ఏమైందిరా కన్నా?’’ అంటా గారం చేసింది.
అప్పుడు ఆడు చెప్పేడు ‘‘పొద్దుట అనూ ఆళ్ళింటికి ఎళ్తే అనంతాంటి నన్ను లోపలి కెళ్ళనివ్వలేదు, అనూని చూడనివ్వలేదు. నేను చూడకూడదంట! ఇప్పుడు ఎళ్తే రమాంటి, నువ్విక్కడికి రాకూడదురా అంటా పంపించేసింది. భాను ఏమో అను పది రోజుల దాకా స్కూలుకి రాదు అని చెబుతాంది’’ అంటా వెక్కి వెక్కి ఏడ్చేసాడు.
అమ్మ ‘‘ఓరి తింగరి నా కొడకా! అదా, అదేమి కాదురా అనూ అక్క పెద్దదైంది. ఆంటీ మనకీ కబురు చెప్పేరు. ఇందాకే నేనూ ఎళ్ళి వొచ్చాను. ఇందాకే కూర్చోబెట్టారు’’ అని చెబుతాంటే ఆడి మొఖం కందగడ్డలా అయిపోటం నాకు స్పష్టంగా కనిపించింది. ఆడికంత కోపమెందుకొచ్చిందో అర్ధం కాలేదు కానీ,
‘‘అదేంటి పెద్దదవటం? అనూ మా క్లాసులో అందరి కంటే పెద్దదేగా! మా క్లాసులోనే కాదు మా స్కూలులోనే అందరి కంటే అనూనే పెద్దది. అందరి కంటే ఎత్తుగా మా సుజాత టీచర్ కంటే కూడా అనూనే పొడుగు తెలుసా అమ్మా?’’ అంటంటే ఆడికేమీ అర్ధం కాలేదని నాకర్ధమైంది. కానీ ఆడికి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో అమ్మకి అర్ధం కాలేదు.
అమ్మ మనసులో అన్నపూర్ణని ఇంక చదువు మాన్పించేస్తారేమో అని అనుమానం ఉన్నా అది చెబితే ఆడెక్కడ బెంబేలెత్తి పోతాడోనని, భయమేసి చెప్పలేదు.
ఆడిని ఊరకో బెట్టటానికి ఒకమాట చెప్పింది ‘‘చిన్నోడా! రేపు అనూకి నేతితో చక్రపొంగలి చేసిస్తాను నువ్వే పట్టుకెళ్దువుగాని, అప్పుడు మాట్లాడుదువు గాని, సరేనా?’’ అంటా ఆడిని ఊరడిరచింది. అది విన్న ఆడి మనసు నిజంగా తేలికైంది. ఆ ఇసయం ఆడి మొఖంలో ప్రస్ఫుటంగా కన్పించింది.
ఆ రోజు ఆడిని హోమ్‌వర్కులు చేయమని కూడా అనలేదు అమ్మ. ఆడి మూడ్ బాలేదని ఆ రోజు ఆడికి అమ్మిచ్చిన బంపర్ ఆఫర్ అది. అది పూర్తిగా వినియోగించుకుని ఆడు ఆ రోజు పుస్తకం ముట్టకుండా, ఏడు గంటలకే మంచమెక్కేసి ముసుగు తన్నీసేడు.
***
పొద్దుట నాకు కేరేజెట్టి నన్ను స్కూలుకి పంపించేసింది అమ్మ! నేను ఆ కేరేజ పట్టుకుని హుకుంపేటలో ఐదో నెంబర్ సిటీ బస్సెక్కి రాజమండ్రి శ్యామలా సెంటర్‌లో దిగి, ట్రైనింగ్ కాలేజ్‌లో హైస్కూలుకి ఎళ్ళిపోయేను.
అమ్మ అనూకి నెయ్యితో చక్రపొంగలి చేసి అందులో జీడిపప్పు, కిస్‌మిస్, పిస్తా ఏసి కమ్మగా వొండి, వేడిగా హాట్ బాక్స్‌లో పెట్టి తమ్ముడికిచ్చి పంపించింది. అది పట్టుకెళ్ళిన నందూని చూసిన నాగంకుల్ ‘‘ఏంట్రా అది’’ అని అడిగేరు.
‘‘అమ్మ అనూకి చెక్రపొంగళి పంపించింది అంకుల్’’ అని చెప్పేడు ఆడు.
‘‘అయితే అక్కడే ఆగిపోయావే? లోపలికి పట్టుకెళ్ళియ్యి’’ అంటంటే ఇంతలో బయటికొచ్చిన అనంతాంటి ‘‘లోపలికి రారా చిన్నా, నిన్న లోపలికెళ్ళొద్దన్నానని కోపమొచ్చిందా? నిన్న ఎళ్ళకూడదురా, ఇప్పుడు ఎళ్ళొచ్చు. ఎళ్ళి అక్క లోపల పడక గదిలో ఉంది, చూడు, ఎళ్ళి అక్కకే ఇవ్వు’’ అంటా ఆంటీ ఆడిని లోపలికి పంపిత్తంటే ఆడి ఆనందానికి అడ్డూ, అదుపు లేకండా పోయింది.
ఆడి నడకలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఐదు అంగల్లో అనూ దగ్గిరికెళ్ళి పోయేడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటా. ఎన్నో రోజుల తర్వాత తనని చూత్తన్న అనుభూతి ఆనందం ఆడి మొఖంలో! అనూకి కూడా అలాగే ఉంది.
ఎళ్ళేసరికి అన్నపూర్ణ పచ్చని కొబ్బరాకుతో చేసిన చాప మీద కూర్చునుంది. మొఖానికి, చేతులకి, కాళ్ళకి పసుపు రాసుకుని ఉంది. చేతుల నిండా గాజులు, ప్రక్కన ఓ మట్టి పిడత, చిన్న ప్లాస్టిక్ బొమ్మ, టాయిలెట్ సామాన్లు, పౌడర్, అద్దం, దువ్విన, తిలకం సీసా ఉన్నాయి. ఆటితో ప్లాస్టిక్ బొమ్మకు ముస్తాబు చేత్తన్న అన్నపూర్ణ నందూ రాటం చూసి ఆనందంతో తబ్బిబ్బైపోయింది. ‘‘నిన్నంతా ఏమైపోయావురా’’ అంటా నిలదీత్తన్నట్టు అడిగింది.
‘‘నిన్న నేనొచ్చానే బాబూ ఆంటీ నేను చూడకూడదని పంపేసింది’’ అంటా సంజాయిషీ ఇత్తన్నట్టు చెప్పేడు.
అమ్మ పంపిన చెక్రపొంగళి ఓ ఐదు స్పూన్లు తిని మిగిలింది ఆడొద్దంటున్నా ఆడికే తినిపించేసింది. అంతా తినేసాక అడిగేడు ‘‘అదేంటే పెద్దదాని వయ్యావంట? మన స్కూల్లో అందరి కంటే నువ్వేగా పెద్దదానివి. మళ్ళీ పెద్దదానివవ్వటమేంటి?’’ అని.
అనూకి ఏమి చెప్పాలో తెలియక సిగ్గుల మొగ్గయింది. ‘‘ఆ ఇసయం ఎందుకులే’’ అని విషయం డైవర్ట్ చేయబోతంటే ‘‘నువ్వు పది రోజుల వరకూ స్కూలుకి రావంట గదా? భాను చెప్పింది’’ అంటా ఆరా తీసేడు.
‘‘అవునురా, నువ్వు కూడా ఏదొక వంకెట్టి మానెయ్యొచ్చు కదరా?’’ అంటంటే ‘‘ఆంటీ నేను రాకూడదు అంటన్నారే బాబూ లేకపోతే ఏదోలా మానేద్దును’’ అన్నాడు.
అలా ఆ రోజు నించి ఆడి దినచర్య స్కూలుకి ఎళ్ళేపుడు అనూతో అరగంట మాటాడటం స్కూలు నుంచి వొచ్చాక నాన్న ఇంటికొచ్చే వరకూ అనూ దగ్గరే కూచ్చుని కబుర్లాడడం.
పొద్దుట స్కూలు కెళ్ళేముందు అనూతో మాటాడటం కోసం మామూలుగా పతీ పనీ నెమ్మదిగా, బద్దకంగా చేసీవోడల్లా కొత్తగా చురుకు, స్పీడందుకున్నాడు.
***
అన్నపూర్ణ కొచ్చిన స్వీట్లు, పిండి వంటలు గానుగ నూనెతో చేసిన వొంటకాలు ‘‘ఆ సమయంలో’’ మామూలుగా ఉండే వెగటు వల్ల కొంచెం రుచి చూసి మిగిలినవి నందుకే పెట్టేసీది. ఈ కార్యక్రమం పుణ్యమాని ఆ పది రోజుల్లో ఆడు ఓ ఐదు కేజీల బరువు పెరిగే ఉంటాడు.
రోజులో ఎక్కువసేపు అనూతో గడిపినా, ఈడిని మా అమ్మ కానీ, అనంతాంటి ఆళ్ళు కానీ వారించక పోవటానికి కారణం ఆడు అన్నపూర్ణ కంటే ఓ మూడేళ్ళు చిన్నోడు వొయసులోనూ, పొడవులోను. నిజానికి అన్నపూర్ణ చదువుతూంది 7వ తరగతే కానీ తనకి పదహారేళ్ళు. అందులోనూ తను వాళ్ళ నాన్నలా పొడవు కాబట్టి స్కూల్లో అందరికంటే పెద్దదానిలా కనిపిత్తంది.
అందుకు ఆడి ఇసయంలో మా ఇంట్లో కానీ, ఆళ్ళింట్లో కానీ ఏ ఇధమైన స్టార్‌లు లేవు, స్టాపులు లేవు, ఎలాంటి షరతులు, నిబంధనలు వర్తించట్లేదు. ఇంతకు ముందుకంటే ఇప్పుడు మరీ ఎక్కువసేపు ఆడు అనూతోనే గడుపుతున్నాడు.
అన్నపూర్ణ పెట్టే పిండి వంటలు తినేసి ఇంట్లో సరిగా భోజనం కూడా చేయట్లేదు. నాన్నకి జడిసి నాన్న వొచ్చే టైంకి ఇంటికొత్తన్నాడు కానీ లేకపోతే అక్కడే పడుకుందుడేమో ఆడు.
***
11వ రోజు పెట్టేరు అనూ కార్యక్రమం. ఇంట్లో మొదటి ఆడబిడ్డ, అందులోనూ మొదటి శుభకార్యం. చేలా ఘనంగా ఏర్పాటు చేసారు నాగంకుల్.
రవీంద్ర అనూకి సవతి అన్న అయినప్పటికీ, తన వొంతుగా కొంత సాయం చేసేడు. అందుకే ఏ లోటు లేకండా ఘనంగా కార్యక్రమం జరిగింది.
ఆ కార్యక్రమానికొచ్చిన సుందరమ్మ ఆనంద్‌ని పిలిచి ‘‘ఒరేయ్ అబ్బాయ్! అదింక చిన్నపిల్ల కాదు, నువ్వింక ఇంటికి రాకు’’ అంటా షరతులు పెట్టింది. అది ఇన్న అనంతాంటి ‘‘అమ్మా నీకెన్నిసార్లు చెప్పానే? ఆ పిల్లోడు మా పిల్లాడే, ఆడినేమీ అనొద్దంటే ఊరుకుని ఉండలేవు’’ అంటా వారించింది.
ఆనంద్‌ని చూసి ‘‘ముసిల్ది అలానే అంటుంది అదేం మనసులో పెట్టుకోకురా చిన్నా’’ అంటా ఆడి రాకకి భరోసా ఇచ్చింది.
ఆడి కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర అనంతాంటి మొఖం కనిపించకుండా అడ్డుపడిరది.
అందరూ విలువైన బహుమతులు చదివిత్తంటే ఆనంద్ మా అమ్మని సతాయించి, పోరుపెట్టి తోపుడుబండి మీద స్టీలు సామాన్లు ఏ వస్తువైనా పదమూడు రూపాయలకే అమ్మే గరగా శ్రీనివాసు దగ్గర స్టీలు బాక్సు కొనిపించుకుని దాని మీద ఆడి పేరు రాయించుకుని, మాన్యం భద్రం గారి ఫ్యాన్సీ షాపుకెళ్ళి మెరుపుల కాయితంతో గిఫ్ట్ ప్యాక్ చేయించి, అనూకిచ్చేడు తన జ్ఞాపకంగా!
ఆ రోజొచ్చిన బహుమతులన్నింటిలోకి ఆళ్ళ నాన్న కొన్న రవ్వల నక్లీస్ కంటే, ఆళ్ళ అమ్మమ్మ కొన్న ఉంగరం కంటే, ఆళ్ళ మామయ్య కొన్న పట్టులంగా, జాకిట్ కంటే ఆడిచ్చిన పదమూడు రూపాయల స్టీల్ బాక్సే అన్నపూర్ణకి విలువైందిగా కనిపించింది.
అందుకే బంగారు వస్తువులన్నీ, అంతకంటే విలువైన ఆ బాక్సులో ఎట్టి బీరువాలో దాచుకుంది. నందుని మాత్రం దాచుకుంది పదిలంగా గుండెల్లో!
========================================================================
ఇంకా వుంది..
========================================================================
రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక
నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.
Comments