top of page

ఆ తల్లి పరిష్కారం

#AThalliParishkaram, #ఆ తల్లి పరిష్కారం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ


A Thalli Parishkaram - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 19/04/2025

ఆ తల్లి పరిష్కారంతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


సమయం సాయంత్రం ఆరుగంటలు....

హైస్కూలు ఆవరణంలో ఇరువర్గాల ఆ గ్రామ వ్యక్తుల మధ్యన ఘర్షణ.... వాదోపవాదాలు.... చివరకు కొట్లాట.

ఎవరో బుద్ధిమంతుడు పరుగున అరకిలోమీటర్ దూరంలో వున్న పోలీస్ స్టేషనుకు వెళ్ళి ఆ గొడవను గురించి తెలియజేశాడు.


పోలీసులు లాఠీ కర్రలతో స్కూలు ఆవరణం వైపుకు పరుగు...

దూరాన్నుంచి పోలీసులను చూచిన ఇరువర్గాల వారూ అడ్డదారుల్లో పయనం.

దెబ్బలు బాగా తగిలి నేలకూలిన నలుగురు కదల్లేని స్థితి. ఒంటిపై రక్తం... పోలీసులు వారిని సమీపించి వారి పరిస్థితిని చూచి, పోలీస్ వ్యాన్‍లో వారిని కిలోమీటర్ దూరంలో వున్న హాస్పిటల్‍కు చేర్చారు. హాస్పిటల్లో ఆ నలుగురికీ చికిత్స జరిగింది.


పాతిక ముఫ్ఫై సంవత్సరాల క్రిందట గ్రామవాసుల మధ్యన ఎంతో కులమత రహితమైన సఖ్యత.

ఒకరినొకరు అన్య మతస్థులను, కులాల వారినీ, ఒకరినొకరు ’మామా, బావా, బాబాయ్’ అనే ప్రియమైన పలకరింపులు. కానీ.... నేడు ఆ రీతి... తీరు మారిపోయింది. ప్రతి గ్రామంలో రెండు వర్గాలు. ఒక వర్గానికి మరో వర్గంపైన పగ, ద్వేషం, ప్రతీకార వాంఛ, సఖ్యత నశించింది. పార్టీలపరంగా వ్యక్తుల మధ్యన బేధాభిప్రాయాలు.


పాండు ఆ గ్రామ సర్పంచ్. ఒక వర్గానికి నాయకులు. మనిషి ద్వేషంలో పగబట్టాడంటే నాగుపాము లాంటివాడు.

అతని కుమారుడు గిరీశం. రౌడీ. అందంగా కనుపించిన ఆడపిల్లలను తన బిగికౌగిలిలో చేర్చుకొనే వరకూ నిద్రపోడు. వాడి అనుచరులు ఇద్దరు కోటి, కాళి.


అప్పటికి గిరీశం నలుగురు ఆడపిల్లల జీవితాలను నాశనం చేశాడు. ఇరువురు ఉరేసుకుని చనిపోయారు. ఇరువురు దిగుడు బావిలో శవాలుగా తేలారు.


పోలీసులు వచ్చారు. విచారణ జరిపారు. మొదట ఇద్దరి విషయంలో, వారికి తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలు ఇష్టం లేకుండా ఉరేసుకుని చచ్చారనేది వూరిజనం, గిరీశం వర్గపు సాక్ష్యం. రెండవ ఇరువురూ దిగుడు బావిలో పాచి బండల మీద కాలుపెట్టి కుండల్లో నీరు నింపుకొనే సమయంలో బావిలో పడి ఈత రానందున చచ్చారు అని సర్పంచ్ పాండుగారి తీర్మానం. ఆ వర్గీయులంతా అతనికి సపోర్టు.


రెండవ వర్గానికి నోరు విప్పాలంటే భయం.

పోలీసులకు బిర్యానీ భోజనాలు. నో కేస్.... నోయఫైఆర్....

గిరీశం సంతోషంలో తన మూకతో మందు పార్టీలు..


వ్యతిరేక వర్గీయుడు భీమ. అతని తండ్రి గ్రామ కాపలాదారుడు. నిజాయితీపరుడు. పేరు వీరయ్య. అతనికి, నలుగురు ఆడపిల్లలు చనిపోయేదానికి కారణం గిరీశం అన్న విషయం తెలుసు. చనిపోయిన ఆడపిల్లల తల్లిదండ్రుల మూలంగా అతను విషయాన్ని తెలిసికొన్నాడు. అబద్ధాలు చెప్పి పోలీసులను సాగనంపిన గిరీశం తండ్రి పాండును వీరయ్య నిలదీశాడు. తాను వెళ్ళి పోలీసులకు యధార్థాన్ని చెబుతానని గిరీశానికి శిక్షపడాలని, పాండును విమర్శించాడు వీరయ్య.

పోలీస్ స్టేషన్‍కు వెళ్ళాడు. కానీ అతను మరలా వూరికి తిరిగి రాలేదు. పాండు అనుచరులు వీరయ్యను హతమార్చి శవాన్ని పెన్నానది ఒడ్డున దహనం చేశారు నడిరేయిన.


ఆ దృశ్యాన్ని కాటికాపరి పిచ్చయ్య చూశాడు. వూరిజనం అంతా అతన్ని ’పిచ్చోడా.... పిచ్చోడా’ అని పిలుస్తారు. 


వీరయ్య భార్యపేరు పోలేరి. ఆమెకు కొడుకు భీమ, కూతురు మల్లి. ఆమె వయస్సు పదహారు. భీమ వయస్సు ఇరవై. పోలేరి వయస్సు ముఫ్ఫై ఎనిమిది. గిరీశం చూపు మల్లి మీద పడింది. మల్లిని కలిసేవాడు, మాటలు కలిపేవాడు. అందంగా నవ్వేవాడు. నీవు కోరింది ఇస్తానని చెప్పేవాడు.

కానీ... మల్లి మాత్రం అతన్ని చూచేది కాదు. పలికేది కాదు. రోజురోజుకు గిరీశం హృదయంలో మల్లి పట్ల వ్యామోహం పెరిగింది.

*

ఆ గ్రామంలో సర్పంచ్ పాండుకు ముఖ్య అనుచరులు. డాక్టర్ దివాకర్, మాజీ కరణం మున్సబ్ వెంకటప్పయ్య, వి.ఆర్.ఓ వసంతరావు.


ఆ నలుగురిదీ దాదాపు ఒకే వయస్సు. నలభై ఐదు సంవత్సరాలు. ఆ నలుగురికీ పోలేరి మీద కన్ను... మోహం... వాంఛ... కారణం ముఫ్ఫై ఎనిమిదేళ్ళ పోలేరి, చిన్నతనం నుండీ కాయాకష్టం చేసిన పేదరాలైనందున, చూచేదానికి పాతిక సంవత్సరాల పడుచులా ఉంటుంది. తెల్లని తెలుపు. ఆమెను చూచిన ఏ మగాడికైనా నవనాడుల్లో వీణానాదం మ్రోగుతుంది.


అప్పటికి వీరయ్య మరణించి ఒక్క సంవత్సరం అయింది. ఆ నలుగురు పెద్ద మనుషులు ఒకరికి తెలియకుండా ఒకరు పోలేరిని కలుసుకొని, ’నీ జీవితాంతం నిన్ను మహారాణిలా చూచుకొంటా, నీ పిల్లలను బాగా చదివిస్తాను, నీకు ఏ కొరతా లేకుండా అన్నీ సమకూరుస్తా, నీవు సరే అంటే వారానికి మూడు రాత్రులు వస్తా. వేకువనే వెళ్ళిపోతా’ అని చెప్పేవారు. పోలేరు మౌనంగా వుండిపోయేది.

’బాగా ఆలోచించుకో. నీ మేలుకోరి చెప్పినా!...’ అని వెళ్ళిపోయేవారు.


భీమ బి.ఎస్సీ, మల్లి ప్లస్ టూ పట్నంలో చదువుతున్నారు. హాస్టల్లో వుండి సెలవలకు ఇంటికి వచ్చేవారు. తల్లితో పొలం పనులు చేసేవారు. స్కూలు, కాలేజి తెరిచే రోజుకు వెళ్ళిపోయేవారు.

వారిరువురికి వారి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా జరిగిన దారుణాలను గురించి బాగా తెలుసు. అలాగే సంవత్సరం క్రిందట గతించిన తమ తండ్రి చావుకు కారకులెవరో కూడా తెలుసు.

కానీ... ’పేదవాని కోపం పెదవికి చేటు’ అన్నట్లు వారి ఆవేదనను మనస్సులోనే దాచుకొన్నారు ఆ అన్నాచెల్లెళ్ళు. కానీ... పోలేరు హృదయంలో ఆ ఐదుగురిపైన ఎంతో ద్వేషం, పగ, ప్రతీకారవాంఛ...


ఒకనాడు....

సెలవల్లో ఇంటికి వచ్చిన మల్లిని కలిసి గిరీశం మాట్లాడే మాటలను పోలేరి విన్నది.

వీడికి ఆ నలుగురికీ నరకాన్ని చూపించాలని, గ్రామానికి పట్టిన శనిని వదిలించాలని నిర్ణయించుకొంది.


’వూర్లో వుంటే నాలుగువందల మందిలో రెండు వందల మందికి పైగా పాండు వర్గం, అతని మీద ప్రేమాభిమానాలు, గౌరవంతో కాదు భయంతో. అంటే... వూరి జనం అంతా మనస్సులో భయంతోనే బ్రతుకుతున్నారన్నమాట.


ఒక్కప్రాణం పోయి, వారంతా ఆనందంగా బ్రతకడం మంచిది కదా!... పుట్టినవాడు గిట్టక తప్పదు. అనామకులుగా చావడం కంటే, దుష్ట సంహారం చేసి ఒక చరిత్రను సృష్టించి అందరి మనస్సులో శాశ్వతంగా నిలిచిపోవడం ఎంతో గొప్పకదా!..’ అనుకొంది పోలేరి.

ఆ క్షణంలో ఆమె పెదవులపై చిరునవ్వు....


సెలవుల్లో వచ్చిన కొడుకు, కూతురిని పట్నం పంపేముందు "నాయనా భీమా!... తల్లి మల్లీ!.... మన ఈ జీవితం శాశ్వతం కాదు. ఎవరు ముందో ఎవరు వెనుకో!... మనకు తెలియదు. కానీ... మనకు తెలిసింది జీవితాంతం మనం బాగుండాలి. మన చుట్టూ వుండేవారంతా బాగుండాలి. అందరం పరస్పరం స్నేహభావంతో కలిసి మెలసి ఆనందంగా బ్రతకాలి. అదే మంచి మానవత్వం. 


యుగయుగాలుగా ప్రతి యుగంలో వుండినారు దేవతలు. దానవులు. ఇరువర్గాల మధ్యన సంఘర్షణ, పోరులు, హత్యలు. ఈ కలియుగంలోనూ ఆ రెండు తెగలు వున్నాయి. ఆ యుగాల్లాగే ఈ యుగంలోను ఇరువర్గాల మధ్య ద్వేషభావం, పగ, ప్రతీకారవాంఛ, మీరిరువురూ అధర్మాన్ని, అన్యాయాన్ని, అసత్యాన్ని, అనుచితకార్యాలను చేయకూడదు. సత్యం, ధర్మం, నీతి, న్యాయం, దయ, దానగుణాలను కలిగివుండాలి. ఈ సద్గుణాలను మీ సాటివారికి నేర్పాలి. 


మీరిరువురూ మీ జీవితాంతం వరకూ ఈనాడు ఎలా కలిసిమెలసి వున్నారో అలాగే వుండాలి. మీ మామయ్య, నా తమ్ముడు రాఘవ మిలటరీ సరిహద్దుల్లో వున్నాడుగా. వాడిని మీరు మార్గదర్శకంగా తీసుకోండి. వాడు దేవుడు. మీకు అన్ని విషయాల్లో అండగా వుంటాడు. వాడు రానున్నాడు. త్వరలో వస్తాడు ఈ అక్కను చూడటానికి" ఆవేశంగా చెప్పుకొచ్చిన పోలేరి ఆపింది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు. "అమ్మా!... ఎందుకమ్మా కన్నీరు?" ఆత్రంగా భీమ, మల్లి ఒకేసారి అడిగారు.


"ఇవి కన్నీరు కాదురా!.... ఆనంద భాష్పాలు...." పవిటతో కన్నీరు తుడుచుకుంది.


పిల్లలకు ఇష్టమని తయారుచేసిన సగ్గుబియ్యం పాయాసాన్ని రెండు గ్లాసుల్లో నింపి ఇరువురికీ అందించింది.


’ఇది నేను మీకు ఇచ్చే చివరి తీపి’ అనుకొంది పోలేరి మనస్సున.


చిరునవ్వుతో బిడ్డలను కౌగలించుకొంది. కుడిచేతిని వారి తలపై వుంచి మనసారా దీవించింది. ఆనందంగా వారిని పట్నానికి బయలుదేరమంది పోలేరి.


ఇరువురూ ఆ తల్లి పాదాలకు నమస్కరించి బస్టాండ్ వైపుకు బయలుదేరారు. బస్సు ఎక్కిన వారికి టాటా చెప్పి, బస్సు కదలగానే, ఇంటివైపుకు బయలుదేరింది పోలేరి.

*

ఆరోజు అమావాస్య. పోలేరి తన సంకల్ప నిర్వహణకు ముహూర్తం పెట్టినరోజు.

ఉదయం ఐదుగంటలకు లేచి తలస్నానం చేసి మంచి చీర కట్టుకొని ఈనాటి ఆడవారు (విడోస్) లాగా పావలా సైజు సింధూరాన్ని నొసటన పెట్టుకొని ఇంటికి తాళం వేసి జాగింగ్‍కు బయలుదేరిన గంగాధరానికి ఎదురుగా వెళ్ళింది. కొంతదూరాన్నుంచి పోలేరును చూచిన గంగాధరం నోట్లో నీళ్లు వూరాయి. వేగాన్ని పెంచి ఆమెను సమీపించాడు.


పోలేరి ఆగి అతనివైపు చూచి కన్ను గీటింది. గంగాధరం ఆమె అందాన్ని చూచి ఆశ్చర్యపోయాడు.

"బాబూ!... రాత్రి తొమ్మిదిగంటలకు మా ఇంటికి రండి. మీకోసం ఎదురుచూస్తుంటాను" అందంగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది పోలేరి.


గంగాధరం.... ’ఇది కలా!... నిజమా!...’ తనను తాను గిల్లుకున్నాడు. నొప్పి వలన నిజమే అని ఋజువైంది. మనస్సున మహాదానందం. ఆనందంగా నవ్వుకొంటూ రాత్రి తొమ్మిదిగంటలు ఎప్పుడు అవుతుందా అనుకొంటూ ముందుకు సాగాడు. పోలేరి పాండు ఇంటికి వెళ్ళింది.


పాండు సర్వాంగ సుందరంగా తన ముందు నిలిచిన పోలేరును చూచి పరవశించాడు.

"పోలేరీ!..." ప్రీతిగా పలకరించాడు.


"రాత్రి తొమ్మిదిన్నరకు మా ఇంటికి రండి సర్పంచ్ సార్!" నవ్వుతూ చెప్పింది పోలేరి.


తన చిరకాల వాంఛ నెరవేరబోతున్నందుకు పాండుకు పరమానందం.

పోలేరి డాక్టర్ దివాకర్ క్లినిక్‍కి వెళ్ళింది.

దివాకర్ పోలేరిని చూచి, ఆమెను తన గదిలోకి పిలిచాడు.

నవ్వుతూ పోలేరి "రాత్రి పదిగంటలకు తమరు మా ఇంటికి దయచేయాలి. ఈ మీ దీనురాలు తమరి రాకకు వేచియుంటుంది" అంది.


దివాకర్ వదనంలో పరమానందం.

"తప్పకుండా వస్తాను పోలేరీ!" అన్నాడు పరవశంతో.


పోలేరి గదినుండి బయటికి నడిచింది. మాజీ కరణం మున్సబ్ వెంకటప్పయ్య గారి ఇంటివైపుకు నడిచింది.

వెంకటప్పయ్య పోలేరికి ఎదురైనాడు.


"ఏంది పోలేరి! ఈరోజు ధగధగ మెరిసిపోతున్నావ్!" వ్యంగ్యంగా నవ్వాడు.


"అంతా తమరి కోసమే... రాత్రి పదిన్నరకు మా ఇంటికి దయచేసి నన్ను పావనం చేయండి"

వాలుచూపులతో చూస్తూ వెంకట సుబ్బయ్యను రెచ్చగొట్టింది పోలేరి.

వెంకటసుబ్బయ్య సంతోషంతో తబ్బిబైపోయాడు.

"నాపై ఇన్నాళ్ళకు నీకు దయ కలిగిందా పోలేరీ!..." ఆనందంగా నవ్వుతూ అన్నాడు వెంకట సుబ్బయ్య.


పోలేరి నవ్వుతూ వెనుతిరిగింది. వి.ఆర్.ఓ వసంతరావు ఇంటివైపుకు నడిచింది. 

అప్పుడే వసంతరావు ఇంట్లోనుంచి వరండాలోకి వచ్చాడు. 

"దండాలు బావగారూ!..." నవ్వుతూ చేతులు జోడించింది పోలేరి.


"ఏందే విషయం?"


"మరేం లేదు. తమరు రాత్రి పదకొండు గంటలకు మా ఇంటికి రావాలి. మీకోసం కాచుకొని వుంటాను" ముసిముసి నవ్వులతో పలికింది పోలేరి.


వసంతరావు ఆశ్చర్యపోయాడు.

"నిజంగా రానా!"


"పిలిచింది రమ్మనే కదా బావా!... రా!..." గలగలా నవ్వుతూ పోలేరి వెనుతిరిగింది.


వసంతరావు ఆనందంతో చిందులేశాడు.

*

అమావాస్య కాళరాత్రి....

బారెడు పొడుగున్న బరిసె (పొడుగాటి కత్తి)ను రాతిమీద ఇసకను చల్లి బాగా రెండు వైపులా నూరింది పోలేరు. తుప్పు అంతా పోయి కత్తి మిలమిలా మెరవసాగింది.


గంగాధరం కరెక్టుగా తొమ్మిదిగంటలకు వచ్చాడు. తలుపును కాలితో తోశాడు. అది తెరుచుకొంది.

ఎదురుగా పోలేరి జుట్టు విరబోసుకొని నవ్వుతూ నిలబడి ఉంది. అతని ఒళ్ళు జలదరించింది.


నవ్వుతూ అతని చేతిని పట్టుకొంది పోలేరి. ప్రక్క గదిలోనికి తీసుకొని వెళ్ళింది. మంచంపై కూర్చోబెట్టింది. గోడకు ఆనించి వుంచిన కత్తిని చేతికి తీసుకొని, గంగాధరం గుండెల్లో పొడిచింది.

రక్తప్రసారం.. గంగాధరం నేలకూలాడు. చచ్చిపోయాడు.

అతని కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళి ప్రక్కగదిలో తోసింది. 


తొమ్మిదిన్నరకు పాండు వచ్చాడు.

అతన్ని మంచంపై కూర్చోపెట్టి కత్తితో గొంతులో పొడిచింది పోలేరి.

అతనూ విలవిలా కొట్టుకొని చచ్చిపోయాడు. అతన్ని ప్రక్క గదిలోకి త్రోసింది.


తరువాత డాక్టర్ దివాకర్ రాత్రి పదిగంటలకు...

ఆపై...... మాజీ కరణం మున్సబ్ వెంకట సుబ్బయ్య, రాత్రి పదిన్నరకు చివరగా... వి.ఆర్.ఓ వసంతరావు, రాత్రి పదకొండు గంటలకు పోలేరి ఇంటికి వచ్చాడు. ఆమె కత్తికి బలైపోయారు. 


ఆ ఐదుగురు శవాలను ఇంటి బయట దొడ్డిలో... గుట్టగా చేర్చి, కిరోసిన్ చల్లి అగ్గిపుల్ల గీచిపడేసింది.

ఆనందంతో పోలేరి చిందులేసింది.


"అమ్మా పోలేరమ్మ తల్లీ!... ఈ గ్రామాన్ని పీడిస్తూ వున్న దానవ చీడ పురుగులను హతమార్చాను. నాకు ఇప్పుడు పరమానందంగా వుంది. నేను వారిని చంపి నేరస్థురాలినైనాను. నేను... ఇకపై బ్రతుకకూడదు. తల్లీ నన్ను క్షమించు. నా గ్రామ ప్రజలకు నా వారందరికీ శాంతిసౌఖ్యాలు ప్రసాదించు. నా అవతారం ముగియబోతూ ఉంది..." కత్తిని తన గుండెల్లోకి దించుకుంది.


"నేను చేతిన తప్పులకు నీకు నా రక్తతర్పణం తల్లీ!..." తన రక్తాన్ని చేతుల్లోకి తీసుకొని నేలజారుస్తూ తాను నేలకొరిగింది పోలేరి.

*

ఊరిజనం... ఆ పొగకు వాసనకు చూచి పోలేరి ఇంటికి చేరారు. కాలుతున్న శవాలను, రక్తపు మడుగులో వున్న పోలేరిని చూచి ఆశ్చర్యపోయారు.


సూర్యోదయం అయింది. పట్నంలో వున్న పోలేరి కొడుకు, కూతురికి విషయం తెలిసింది. వారు గ్రామానికి వచ్చారు. తల్లి శవంపై పడి భోరున ఏడవసాగారు. కొడుకు భీమ బార్డర్‍లో వున్న తన మామకు మెసేజ్ పంపాడు. 


పోలేరి శవాన్ని ఐస్ బాక్సులో పదిలపరిచారు. మూడవరోజు పోలేరి తమ్ముడు రాఘవ వచ్చాడు.

అక్క శవాన్ని చూచి ఎంతగానో ఏడ్చాడు. ఆ సాయంత్రం వూరి జనం అందరూ పోలేరి శవాన్ని, పూలను ఎగజల్లుతూ, పోలేరమ్మకు జై... జై...జై నినాదాలతో శ్మశానం వైపుకు తరలించారు. 


అందరి క్షేమంకోరే ఆ మహాతల్లి పోలేరి ఆ గ్రామానికి వున్న సమస్యను ఆ రీతిగా ’ఆ తల్లి పరిష్కారం చేసింది. ఆ గ్రామ చరిత్రలో చరిత్ర నాయకిగా శిలా విగ్రహరూపంతో గ్రామం మధ్యన వెలసింది. ఆ దుర్మార్గుల వలన బలైపోయిన వారి ఆత్మలకు శాంతికి కలిగించింది ఆ పోలేరమ్మ తల్లి.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page