'Aa Enthamma Muppiyyare' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 21/05/2024
'ఆ ఎంతమ్మా! ముప్పియ్యారే!' తెలుగు కథ
రచన, కథా పఠనం: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
"ఏంటి రంగీ ! నిన్న పనిలోకి రాలేదు?" అడిగాను అప్పుడే గేటు తీసుకుని లోపలికి వస్తున్న పనిమనిషి రంగిని.
“నిన్న నా యాడకూతురి మనవడికి పేరెట్టారమ్మా ! అందుకే రాలేదు. మా మావ కూడా ఈడ లేడుకామ్మా ! నా పోరిగాడు, యాడి పెళ్ళాం లగెత్తుకొచ్చి తోలుకెళ్ళారమ్మా. అందుకే పెద్దరికంగా ఎల్లానమ్మా!” అంది రంగి.
"ఏం పేరు పెట్టారు ? " అని అడిగాను తనని.
"యాదయ్యా అనెట్టాము. యచ్చు మా మావ కనబడుతున్నాడు యాడిలో. ఎంత ముద్దొస్తున్నాడో" అంది తన మావను తలచుకుని మురిసిపోతూ.
అలా అంటున్నపుడు దాని ముఖం వేయి ఓల్టుల బల్బులా వెలిగి, మెరుపు తీగె లాగా ఎన్ని వంకర్లు తిరిగిందో ! అలా దాన్ని చూస్తూ ఆశ్చర్య పోవడం నావంతయింది. "ఓసినీ ! ఇంత ముసల్దానివైనా ఇంకా భర్తను తలచుకుని క్రొత్త పెళ్ళికూతురులా సిగ్గుపడుతున్నావు " అనుకున్నాను.
ఏడాది క్రిందట నా వద్ద అది పనిమనిషిగా చేరింది. ఇద్దరు కొడుకులు, కూతురు అని చెప్పి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయ్యి మనవళ్ళు కూడా ఉన్నారని చెప్పటం గుర్తొచ్చింది.
పని పూర్తి చేసి వెళ్ళబోతూ 'ఎల్లొస్తానమ్మా' ! అంది పైట కొంగుతో ముఖం తుడుచుకుంటూ.
"అవునే ! నీ మావ ఎక్కడికెళ్ళాడే? " ఏదో దేశం వెళ్ళాడని లోగడ చెప్పినట్లు గుర్తొచ్చి అడిగాను తనని.
"అదేదో ఇసుక గుంటలు తవ్వి పిట్రోలు, నూనెలు తవ్వుతారట కదామ్మా ! గలుపు కంతిరి యట. మా మావ సెప్పేడు " అంది రంగి. 'గల్ఫ్ కంట్రీస్' అనే మాట కొచ్చిన తిప్పలా' అని నవ్వొచ్చింది.
"ఎన్నేళ్ళయింది వెళ్ళి?" అన్నాను.
"ఎనకెప్పుడో మబ్బు పట్టి వానసినుకులు పడుతుంటే సందెకాడ తడుసుకుంటూ బేగి ఎల్లాడు మా గామం నుంచి ఇమానం ఎక్కటానికి " అంది రంగి.
"ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే వస్తా ! అని లోపలికి వెళ్ళి 1500 రూ. తీసుకొచ్చి దీంతో ఆ పసివాడికి ఏదన్నా కొనిపెట్టు " అని దాని చేతిలో పెట్టాను.
సంతోషంతో తీసుకుని "మాయమ్మ దయగల తల్లి. సల్లగుండమ్మా" అంది పొగుడుతూ.
"ఇంతకీ నీ వయస్సెంతే రంగీ "? అడిగాను తనని. ఎవరినీ వయస్సు ఎంత? అని అడగ గూడదు అని తెలిసినా మాట వరసకు అడిగాను.
"ఆ ఎంతమ్మా ! ముప్పియ్యారే ! అని అయినా యాడాళ్ళ ఈడు, మగాళ్ళ యాదాయం అడగ్గూడదు కామ్మా " అంది ఒయ్యారాలు ఒలకపోస్తూ.
' ఓసినీ ! నీ కులుకు సింగారం కాను! వయస్సు ఎంత ? అని అడిగితే అంత సిగ్గేంటో ? అయినా ముని మనవడు పుట్టినా ఇంకా దాని వయస్సు ముప్పయ్యారేనా ? అమాయకంగా ఉంటూనే 'వయస్సు అడగ్గూడదు ' అని ఎంత జాణతనంగా చురకేసింది. ఇంక దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా! ' అనుకుని తనని ఇంటికి పంపించేశాను.
….సమాప్తం.
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments