ఆ జాబిలితో ఆట
- T. V. L. Gayathri
- 4 hours ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #ఆజాబిలితోఆట, #AaJabilithoAta, #నేర్చుకో

గాయత్రి గారి కవితలు పార్ట్ 14
Aa Jabilitho Ata - Gayathri Gari Kavithalu Part 14 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 23/04/2025
ఆ జాబిలితో ఆట - గాయత్రి గారి కవితలు పార్ట్ 14 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
ఆ జాబిలితో ఆట.
(కవిత )
******************************
నింగిలో మేఘాలు నిగిడి చూస్తున్నాయి.
సంగడిగాళ్ళని సరదాగా నవ్వుతున్నాయి
నిచ్చెనెక్కి మనమంతా నింగిలోకి వెళదాము!
అచ్చంగా శశితోడ నాటాడుకుందాము!
చల్లగా జాబిల్లి స్వాగతించుతాడులే!
పిల్లలకు పెద్దలకు ప్రేమపంచుతాడులే!
మంచుబిందువుల నేరి మన చేతికిస్తాడు!
మంచిగా మాట్లాడి మమత కురిపిస్తాడు!
జాబిల్లిని మనతోటి జతగాడనుకొందాము!
ఆ బంగారు తోటల్లో హాయిగా తిరిగేద్దాము!
వెన్నెలంత తాగేసి విందులనారగిద్దాము!
మున్నెరుగని సంపదను మూటకట్టేద్దాము!
తళుకుమనే తారలను తరలించుకొద్దాము!
వెలుగు విత్తనాలను వీధి వీధి చల్లేద్దాము!
తెలతెలవారంగానే తిరిగి వచ్చేద్దాము!
కలకలా నవ్వుతూ కలిసి బడికెళదాము!//
************************************
నేర్చుకో బాలా!
(కవిత)

పట్టుదలను వీడక పయనించు
గట్టిసంకల్పము తోడచరించు
నీరసము నీకు తగదంచు
ధైర్యముతో నడుగు వేయుచు
పదపదవోయి ముందుకే పదవోయి!
భరతదేశ పౌరుడవు కాద!
చరిత విన్నచో నీకు ధైర్యమే రాద!
సురలు పొగిడిన సీమలో బాధ
పడకుండ వేగమే సాగిపోరాద!
పదపదవోయి!ముందుకే పదవోయి!
చదువు సంధ్యలు నేర్చుకో బాలా!
చతికిల పడుట నీకు మేలా!
ఉప్పెన వలె నురుకుట చాలా
ఒప్పిదము కదా నీకెప్డు బాలా!
పదపదవోయి!ముందుకే పదవోయి!
ఆరంభశూరత్వం విడిచి వేయి!
అతి బద్ధకంతో నిద్రపోకోయి!
పొద్దున లేచి శ్రమ చేయవోయి!
మొద్దుతనము వీడి మేలుకోవోయి!
పదపదవోయి!ముందుకే పదవోయి
చురుకుతనము చూపించ వయ్యా!
వెరపుతో నడుగులు వేయకయ్యా!
నిరతము విశ్వాసం వీడకయ్యా!
చరితను తిరగ వ్రాయవయ్యా!
పదపదవోయి!ముందుకే పదవోయి!
కుంటిసాకులు కొన్ని చూపకోయి!
చంటి పిల్లాడివై బ్రతుకకోయి!
గెలుపు లక్ష్యముగా పోరాడవోయి!
వెల్గు రవ్వగ నీవు నిల్చిపోవోయి!
పదపదవోయి!ముందుకే పదవోయి!//
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comentarios