#BhagavathulaBharathi, #భాగవతులభారతి, #Safalyam, #సాఫల్యం, ##TeluguHeartTouchingStories
Aa Jnapakam - New Telugu Story Written By Bhagavathula Bharathi
Published In manatelugukathalu.com On 08/01/2025
ఆ జ్ఞాపకం - తెలుగు కథ
రచన: భాగవతుల భారతి
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
ఎన్నో క్షణికాల అనంత కాలం..
అన్నీ క్షణికాలే! పుట్టుక.. చావు.. ఇంకా?
కానీ! మరణం అనే క్షణంకోసం, ఎన్నో క్షణాల సంవత్సరాలు ఎదురుచూసే ప్రాణాలెన్నో.. క్షణం పలకరింపుకోసం ఎదురుచూపైన మనసులెన్నో!
క్షణిక సుఖంకోసం.. అని సాగదీస్తారు కానీ, ఆ క్షణిక సుఖం కోసంఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసే తనువులెన్నో! ఇన్ని నేర్పిన.. ఆరోజుని దాదాపుగా మరిచిపోలేను!
ఎలా మరిచిపోతానూ?
ఆ బెంచ్ పై పక్కనే కూర్చుని, "కాస్త దగ్గరకు జరగొచ్చుగా! "అన్నాను.
జరిగింది తను. తన కుడిచేతిని నా చేతిలోకి తీసుకుని.. నా కుడి తొడపై పెట్టుకున్నాను. తనలో బిడియం..
"అమ్మో! ఈసమయంలో ఓ పరాయి మగవాడి పక్కన కూర్చోటం! ?". సంశయంగా అందామె.
"నన్నింకా పరాయివాడుగానే చూస్తున్నావా?" అన్నాను గుసగుసగా.
ఆమెలో బెరుకు. అదిచూసి నాలో కూడా సంశయం మొదలైంది.
మరి! నాకు అన్ని మెసేజెస్ పెట్టి,
నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తోంది?
మనసులో అనుకున్నాను, గతంలోకి చూస్తూ..
ఏడాది క్రితం అనుకుంటా! నాకో ఫోన్ వచ్చింది.
"మీరో వృద్ధాశ్రమం నడుపుతున్నారుట.
సొమ్ముకోసం విరాళాలు సేకరిస్తున్నారుట" అడిగింది ఆమె.
"మీకెవరు చెప్పారు?" అన్నాను.
"మాకు తెలిసినవాళ్ళు, 'విరాళాలు సేకరింపబడుచున్నవి ' అని మీ ఆశ్రమం పేరు ఈ నెంబర్, ఓగోడ మీద ఉంటే, చూసి, ఈ నెంబర్ నాకు ఇచ్చారు. విరాళం పంపమని. " చెప్పిందామె.
ఆశ్చర్యపోయాను. ఇళ్ళకు వెళ్ళి, వెయ్యి ఆధారాలు చూపించి, లక్షసార్లు తిరిగితేనే
చందాలు వసూలు కాక, ఒక్కోరోజు, ఈ పెద్ద వాళ్ళకి ఒకపూటే అన్నం పెట్టి, రెండుపూట, ఇంత ఉప్మా తో సరిపెట్టి, ఉసూరుమనే వీళ్ళ ముఖాలుచూసి ఈ ఆశ్రమం ఎందుకు పెట్టానురా?అని బాధపడుతున్న, నాకు ఈరోజు, గోడమీద నెంబర్ చూసి, ఫోన్ చేయటమా?
వాటే! వండర్. వీళ్ళు కోటీశ్వరులా? నిజంగా విరాళాలు ఇవ్వటానికే ఫోన్ చేసారా?
"చెప్పండి.! నా పేరు శివరామ్! కరీంనగర్. మీరెవరో?"
"నా పేరు గాయత్రి. విశాఖపట్నం. విరాళం ఎలాపంపాలీ? గూగుల్ పే నెంబర్?.. "
"ఇదేనండి. దీనికే పంపండి. "
”సరే! "
ట్రింగ్ న గూగుల్ ఎకౌంటు లో చూస్తే,
ఐదు వేలు. ఎందుకు పంపారో వివరాలులేవు.
"ఏదోలెండీ! చంద్రుడికో నూలుపోగు".. అని మెసేజ్ వచ్చింది.
"పోనీలేండి. చందాదారులంతా మహారాజ పోషకులవ్వాలనేంలేదుగా! " నా రిప్లై మెసేజ్.
మరుసటి నెల మళ్ళీ పంపారు.
"ఎందుకు పంపారో తెలుసుకోవచ్చునా?"
"అదేంప్రశ్న?"
అంటే! ఇలా ఎవ్వరూ చేయరు. ఒకసారి ఇవ్వటానికే.. మూడుమూసి ఆరుఅతికీ..
అని మనసులో అనుకున్నా, పైకి అంటే, ఈకాసినీ రావు అనుకుని..
"ఏం లేదు! ఎవరి పేరుమీదనైనా అన్నదానం చేయమంటే ఆరోజు వారి పేరుబోర్డు మీద రాస్తాం. " అన్నాను.
"అవసరం లేదు. రోజూ అందుబాటులోనే ఉంటాను. ఫోన్ లో. "
'ఎందుకు?' అని అడగలేకపోయాను.
అన్నట్లుగానే రోజూ వాట్సప్ లో ఏదో ఓ మెసేజ్ పెడుతూ అందుబాటులో ఉండేది.
ఎందుకో తెలీదు. పరిపరి విధాలా ఆలోచనలు. ఓ వేళ నా క్లాస్మేట్స్ ఎవరైనా
దోబూచులాడుతున్నారా? లేక ఈమె వెనుక ఎవరైనా, అజ్ఞాతంగా? ఐనా నాకెందుకింత ఆలోచన?.. అవునుమరీ! .. ఎవరైనా చందాలు కట్టి, మరిచిపోతారు. ఇలా వాట్సాప్ లోకి వచ్చి వేధించరు. ఔనూ! దీనిని వేధింపనే అనాలా? నిరంతరం, అవసరం లేకపోయినా మెసేజ్ లు పెట్టి, పలకరించడం వేధింపేనా? ఏమో! ?
ఈ ఏడాదిలో ఆమె నుండి చందాల రూపంలో అందుకున్నవి లక్ష రూపాయలు. కానీ ఎన్నో రకాల మెసేజెస్ మాత్రం కోకొల్లలు.
మెసేజెస్ కు నేను స్పందించలేదు..
ఇద్దరి మధ్య మాటలు తక్కువే. నేను నిరంతరమూ పోస్టల్ లో ఉద్యోగం, ఆశ్రమం పనులతో బిజీగా ఉంటాను. విరామం కోసం రాత్రికి, ఇంటికి వచ్చి, భార్యాపిల్లలతో గడిపి, వాట్సప్ ఆన్ చేద్దును గదా అంటే వరుసగా ఆమె పెట్టే మెసేజెస్సే.
ఒకదానికీ, ఒక దానికీ, సంబంధం లేకుండా! ఇదేమిటీ? ఇదంతా దేనికీ సంకేతం?ఏం ఆశించీ? డబ్బులకు ఆశించి కాదు, మరి?! ..
ఏమనుకుంటారో అనుకుంటూనే!
"ఏమిటిదంతా?" మెసేజ్ పెట్టా.
సమాధానం లేదు. మసేజెస్ ఆగలేదు. అందులో లవ్ మెసేజెస్ దగ్గర్నుంచి దైవానికి సంబంధించినవీ, గుడ్ మార్నింగ్, ఆఫ్టర్ నూన్, గుడ్ నైట్ లూ ఉండటం ఇంకా ఆశ్చర్యం.
నేనేమనుకుంటానో అనిగానీ, నా కుటుంబం లోని వారు, ఏమనుకుంటారో అనిగాని, పోనీ, మెసేజ్ కి నా రిప్లై కోసం చూస్తున్నట్లు గానీ, ఏం అనిపించలేదు. నా వ్యక్తిగత వివరాల జోలికీ వెళ్ళలా! ఇలా కూడా జరుగుతుందా?
చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఒకే ధోరణి. ఒకటి రెండుసార్లు నా భార్య చూసినా నన్నేమీ అడగాలా! కారణం నామీది నమ్మకమే కావచ్చు.
ఎందుకిలా?ఎన్నేళ్ళు ఇలా? నా ఆలోచనలు కార్యరూపంలో పెట్టే రోజు వచ్చింది.
వేసవికాలం భార్యను పుట్టింటికి పంపి, మగవాడినైన, సహజచాపల్యంతో, "నాకు మీ విశాఖలో ఓపనుంది, వస్తున్నాను. అడ్రసు చెబితే కలుస్తాను. " అని ఫోన్ చేసాను.
"నన్నెందుకు కలవాలీ?"
"మా వృద్ధాశ్రమానికి మహారాజ పోషకులు కదా! మీరు" నవ్వాను.
"తప్పకుండా రండి.. అడ్రస్.. "
వెదుకుతూ గాయత్రి ఇంటికి వెళ్ళాను.
వెళ్ళేసరికి రాత్రయింది.
ఇదిగో! ఇలా ఈబెంచ్ పై తన పక్కన..
గాయత్రి చక్కగా ఉంది. నా కంటే, నాలుగేళ్ళు పెద్దది. గతంలోని.. నాలోని ఆలోచనల్ని తుంచేస్తూ..
"మనిద్దరం.. ఇక్కడ ఈ బెంచ్ మీద కూర్చున్నాం సరే! ఇది కాక ఇంకో ఉపాయంలేదా?" అంది మెల్లగా.
"అర్ధం కాలేదు" అన్నాను. నిజంగానే ఆమె ఏమందో అర్థం కాలేదు.
"మనిద్దరం వాట్సాప్ లోంచి, ఎగిరొచ్చి ఈ బెంచ్ మీద కలిసాం. దగ్గరగా కూర్చోటాలూ! నా చేతినీ.. ఇలా మీ తొడపై.. ఈ ఇష్టాన్ని వేరే రకంగా కూడా వ్యక్తం చేయవచ్చేమో! "
"అంటే! ఫోన్ లో మీరు చేసిందంతా రైటూ. నేను చేసేది రాంగ్ అంతేనా?" కోపం నాలో.
"కాదు. నా భర్త అనారోగ్యం తో చనిపోయారు. ఒంటరి ఆడదాన్ని. ఇద్దరు చిన్నపిల్లలు. ఎవరితోనూ పంచుకోలేని భావోద్వేగాలూ.. మీ వృద్ధాశ్రమం లో అందరూ పిల్లలు వదిలేసిన పెద్దలేగా! మరి! భర్తలను పోగొట్టుకున్న మాలాంటి వాళ్ళు.. ఎక్కడ చేరాలి? నలుగురికీ చులకనేగా! అవకాశం వస్తే! ?".. అంటూ ఆగింది. చర్నాకోల్ తో ఛెళ్ళున చరిచిన ఫీలింగ్ నాలో..
"ఎలా పోయారు ఆయన?"
"ఏముందీ! తాగుడు వ్యసనం.. లివర్ క్యాన్సర్.. తెలుసుకునే సరికే.. ఫోర్త్ స్టేజ్. వద్దన్న కొద్దీ తాగాడుగా. చచ్చాడు. అనుభవించండి అన్నారు, అమ్మానాన్నలు, చుట్టాలూ, పక్కాలూనూ..
ఒంటరి పోరాటం అప్పుడూ.. పిల్లల్ని పెంచటానికి ఇప్పుడూ! .. ఆయన ఉద్యోగం నాకివ్వటం.. అదో గుడ్డిలో మెల్ల.
అవునూ! ఎవరి ఇంట్లోనైనా, ఒక్కరాత్రైనా నిద్రచేసి, కష్టసుఖాలు మాట్లాడుకునీ ఓదార్పులు ఇచ్చీ, పొందే, చుట్టంగానీ, రక్తసంబంధీకులుగానీ ఉంటున్నారా?ఇవాళా రేపూనూ!
ఎవరిసమస్యలు వారికే ఉంటున్నాయి. అందరి జీవితాలూ ఏటికి ఎదురీతలే!
ఇక ఎవర్నీ ఎవరూ పలుకరించే పనేలేదు. అందుకే నిరంతరమూ మీతోనే మాట్లాడుతూ ఉంటాను. వృద్ధాశ్రమం నడపడంలో అంత నైపుణ్యం, సహృదయతా ఉన్న మీరు.. నా విషయంలో వేరే ఆలోచనలకు చోటివ్వరనీ! అదీగాక.. "ఆగింది ఆమె.
"నేనూ! మగాడినే! నువ్వు పెట్టే మెసేజస్ రెచ్చగొట్టే రకంగానే ఉన్నాయిగా! .. ఇక్కడిదాకా రప్పించేటట్లులేవా?"
"నేనూ వయసులోనే ఉన్నాను. ఒకలాంటి తోడు అవసరమే! అలాగని జీవితాన్ని నమ్మి ఎవరి చేతిలోనో పెట్టి, ఆ తర్వాత?! తేడావస్తే? మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఏదోఒకటి మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలీ! .. అనేది కాదు, మాట్లాడుతున్నానా! లేదా అనేదే నాకు ముఖ్యం. "
"టెక్నాలజీ పెరగటం వల్లనో, దైనందిన జీవితంలో హడావిడో! ?మనుషులు మాట్లాడే మనుషులు లేక ఒంటరైపోతున్నారు. ఆమధ్య పేపర్లో చదివా. కేవలం తన తల్లితో మాట్లాడటం కోసం ఓ ఆఫీసరు ఓ ఎంప్లాయిని, అధిక జీతంతో, ఇంట్లో నియమించాడట. ఆవిడ మాట్లాడింది అతను వినాలి అంతే! అదే ఉద్యోగం.
మానవ అవసరాల కోసం ఎన్నో ఉద్యోగాలు వెలిసినాయి. భవిష్యత్తులో ఇదీ ఓ జాబ్ ఆపర్చునిటీ గా కూడా వచ్చేస్తుందేమో! ప్రాణం ఎంతసేపూ, పోవటానికి క్షణం చాలదూ! ?అంటారు. కానీ ఆ క్షణం కోసం, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసే వారు ఎంతోమంది ఉన్నారు. వారు మరణించేవరకూ, ఎదురుచూసే ఓపికలేక, ఇలా వదిలేస్తే, పలకరించే వారు లేక.. "
"నిజమే! ఈ మధ్య సమాజంలో ఒంటరైన వారంతా డబ్బులిచ్చి, తాము చెప్పిందంతా వినే ఓ మనిషిని కూలికి.. అంటే బాగుండదేమో! కానీ.. పెట్టుకుని, మాట్లాడుతున్నారుట. పరిస్థితులేమయినప్పటికీ.. మానసికంగా ఒంటరివారవుతున్నారు. మరి! నాతో చెబితే మాఆశ్రమం లోని, ఎంతోమందితో మాట్లాడించేవాడినిగా! ఇంతదూరం రావాలనే నాలో ఇంత కోరికను పెంచేసి.. ఛా ప్చ్.. " ఫూల్ ని చేసిందనే బాధ.
"నా ఒంటరితనపు ఆటలో ఇదీఓభాగమే. ఏమనుకోకండి. మీకు డబ్బులు అవసరం. నాకు మానసిక ఒత్తిడి తగ్గించుకునే మార్గం అవసరం. మీరు ఇంతదూరం వస్తే ఏమయింది? నాకు మీరెవరో, మీకు నేనెవరో తెలిసింది. స్నేహితుల్లా మాట్లాడుకుందాం. భర్తలేని దాన్ని, ఈ రాత్రి మీతో గడిపితే నాకు వచ్చే నష్టమేమీ లేదు. ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోదాం. కానీ ఓ షరతు. "
"అన్ని షరతులూ నువ్వే పెట్టేస్తావా? అంతా నీ ఇష్టమేనా? ఏంటదీ?"
"మీరు వచ్చిన దగ్గర్నుంచి ఇక్కడ జరిగిందేదీ, మీ ఇంట్లో తెలియనీయవద్దు. ముఖ్యంగా మీ భార్యకి.. పిల్లలకి.. మీరు వెళ్ళాక నాకు ఫోన్లు చేయటంగానీ, ఈ సంఘటన తాలుకు మెసేజ్ లు పెట్టటం, పదేపదే నాకోసం రావటము, చేయకండి.
ఒక మధురానుభూతిగా మాత్రం గుర్తుంచుకోండి కానీ, 'అదేదో చెప్పకూడని' సంబంధంగా మార్చకండి.
తేడావస్తే అడ్రసు మార్చుకుంటా. ఇప్పుడు అనుభవిస్తున్నది చాలు. ఓ కాపురాన్ని కూల్చీ, బాగుపడేదేం లేదు”.
ఆమెను ఇంక మాట్లాడనివ్వలేదు నేను. ఆరాత్రి ఆమెను నిద్రా పోనీయలేదు.
////////////////
నా గుండెల్లో దాచుకున్న ఆ జ్ఞాపకం
ఓ కొత్త రూపంతో, ఆశ్రమం ఓసరికొత్త రూపు రేఖలను సంతరించుకుంది.
వృద్ధాశ్రమం తో అనుసంధానంగా
'సాంత్వన హృదయ్' అనే పేరుతో..
'ఒంటరితనంతో బాధపడుతున్న ఎవరైనా సరే ఈ నెంబర్లను సంప్రదించండి. ' అనే కాప్షన్ తో.. మొదలయింది.
ఎవరికీ ఎవరూ ఏమీ కాకపోయినా, ఎంతోమంది, అక్కా చెల్లెళ్ళూ, అన్నదమ్ములు, అమ్మానాన్నలు అనుకుంటూ ఎన్నోవరసలు, బంధాలు కలుపుకుంటున్నారు. ఆశ్రమం అంతా కలివిడిగా తిరుగుతూ, మాట్లాడుకుంటూ తిరుగుతుంటే, సమాజంలో చాలా మానసిక సమస్యలు కొంతైనా తగ్గి, నిత్యనూతనంగా నావల్లనేగా విరిసిందీ! ? అనే విశ్వాసం నాలోపెరిగింది. ఎంతోమంది విరాళాలు పంపుతున్నారు. కానీ! నెలనెలా ఎన్నోవేల రూపాయలు పంపి, నా ఆత్మవిశ్వాసానికి అజ్ఞాతంగా ఇంత ఉన్నతికి కారణమైన గాయత్రి, తను అన్నట్లుగానే, చిన్న అపార్థం వల్ల తన అడ్రసు, ఫోన్ నెంబర్ మార్చుకుని, నన్ను వదిలి వెళ్ళిపోయింది.
ఆశ్రమం లో ఎన్నోఫోన్లు నిరంతరమూ, ప్రేమానురాగాలకోసం మ్రోగుతూనే ఉన్నాయి, గాయత్రిని గుర్తుచేస్తూ.. కానీ! ఆమె వస్తుంది ఏదో ఓ రోజున సాంత్వన నింపే పలకరింపు కోసం..
===========
భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం
ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.
ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో
బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
vani gorthy
•16 hours ago
కథ బాగుంది❤