#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #AbalaKaduSabala, #అబలకాదుసబల, #మహిళాసాధికారికత, #TeluguStoryOnWomenEmpowerment
'Abala Kadu Sabala' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 23/10/2024
'అబల కాదు - సబల' తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“అమ్మా! స్కూలు టైమవుతోంది. బాక్సు రెడీనా! “ హడావిడి పడుతూ వచ్చి అడిగింది తల్లిని నీలిమ.
“ఇదిగో!” అని బాక్సుని కూతురి చేతికిచ్చింది తల్లి రేణుక.
దానినందుకుని ఇంటినుంచి జాగ్రత్తగా నడుస్తూ ప్రక్క ఊరిలోని స్కూలుకు బయలుదేరింది నీలిమ.
చాలా వెనుకబడి, కనీస వసతులు కూడా లేని ఆ గ్రామంలో కాంత్యా నాయక్ తనకి పెద్దలిచ్చిన కొద్ది పాటి భూమిని సాగుచేసుకుంటూ భార్యని, కూతురిని పోషించు కుంటున్నాడు. గిరిజన తండాకు చెందిన నీలిమకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. ఆ తండాలో చదువుకున్న వాళ్లు చాలా తక్కువ. పదవతరగతి చదువుతున్న తను కష్టపడి బాగా చదివి ఇంజనీరై, మంచి ఉద్యోగం చేసి తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ధృఢసంకల్పం కలది. నీలిమ. ఆమె అభిప్రాయం తెలిసి తల్లిదండ్రులు సంతోషంతో ఆమెని చదివిస్తున్నారు.
నీలిమ నడుస్తున్న దారంతా చాలా ఎగుడుదిగుడుగా ఉండి జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి. వర్షం వస్తే ఇంక ఆ గ్రామ దుస్థితి చెప్పనక్కర్లేదు. ప్రక్క ఊరి స్కూలులో పదవతరగతి వరకే ఉంది. ఆ ఊరివాళ్లు పట్టణానికి వెళ్లాలంటే ప్రక్క ఊరినుంచి బస్సులో వెళ్లాలి. క్లాసులో పాఠాలని శ్రధ్ధగా వింటూ కష్టపడి చదివే నీలిమకు ధైర్యం, పట్టుదల చాలా ఎక్కువ. రోజూ స్కూలుకు వెళ్లి చదువుతూ కష్టపడి పదవతరగతి పరీక్షలు వ్రాసి ప్రధమ శ్రేణిలో పాసయింది. తల్లితండ్రులు, ఆ ఊరి ప్రజలు నీలిమని చాలా మెచ్చుకున్నారు.
కాలేజీ చదువు కోసం పట్టణంలో ఉన్న తన పిన్ని, బాబాయి వాళ్ల ఇంట్లో చదువనిశ్చయించుకుని అందుకు వాళ్లు అంగీకరించగానే అక్కడికి వెళ్లింది నీలిమ. కాలేజీలో అప్లికేషను పూర్తి చేసి ఇచ్చి, సీటు రాగానే కాలేజీలో చేరింది. బాగా చదువుతూ స్కాలర్షిప్ ను సంపాదించి శెలవలప్పుడు తన ఇంటికి వెళ్లి వస్తోంది. బాగా చదివే ఆమె అంటే క్లాసులో అందరికీ అభిమానం.
చూస్తూండగానే రెండేళ్ల తర్వాత ఇంటర్ మంచి మార్కులతో పాసయి ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది నీలిమ. స్కాలర్షిప్ ని పొందుతూ పుస్తకాలలో తనకి తెలియనివి లెక్చరర్ లని అడిగి తెలుసుకుంటూ పట్టుదలతో చక్కగా చదువుతోంది. శెలవులివ్వగానే తన స్నేహితురాళ్లని తన ఊరికి తీసుకెళ్లేది. గ్రామాలంటే మక్కువతో వాళ్లు ఆగ్రామానికి వచ్చి ఆమెతో గడిపివెళ్లేవాళ్లు. ఆమె తల్లిదండ్రులు వాళ్లని చాలా ఆప్యాయంగా, ప్రేమగా చూసేవాళ్లు.
ఇంజనీరింగ్ ఆఖరి సం…లో ఉండగానే కాంపస్ సెలక్షన్స్ లో మంచి కంపెనీలో ఉద్యోగం పొందింది నీలిమ. ఆ వార్త తెలిసి తల్లిదండ్రులు, ఆ గ్రామ ప్రజలు చాలా సంతోషించారు.
త్వరలోనే ఇంజనీరింగ్ ని పూర్తి చేసి ఒక శుభముహూర్తాన ఉద్యోగంలో చేరింది నీలిమ. వారాంతంలో తన గ్రామానికి వెళ్లి తల్లి తండ్రులను చూసి వస్తూండేది. స్వతహాగా కలుపుగోలుగా ఉండే ఆమెకు కాలేజీలోను, ఆఫీసులోను చాలా మంది స్నేహితులయ్యారు.
ఒకసారి తన సహోద్యోగులైన వాసవి, శ్రావణి, సమీర, విజయలని తన గ్రామానికి తీసికెళ్లింది నీలిమ. ఆ ఊరిని, అక్కడి ప్రజల స్ధితిగతులను తెలుపుతూ వాళ్లకి ఆ ఊరంతా కలయచూపింది. తన చిన్నప్పటి నుండి ఎలాంటి వసతులు లేని ఆ గ్రామ దుస్ధితి, తమ తండా ప్రజల కష్టాలు అన్నీ వాళ్లకు వివరించింది.
“ చూడు వాసంతీ! కనీస సౌకర్యాలు లేని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి, ఇక్కడి ప్రజలకు మంచి జీవనభృతిని కలిపించాలి. నా బాల్యం నుంచి అది నా ధ్యేయం. దానికి మీ అందరి సంపూర్ణ సహకారం నాకు కావాలి.” అంది నీలిమ.
“తప్పకుండా నీలిమా! ఈ గ్రామాన్ని చూడగానే నాకు చాలా బాధవేసింది. దేశమంతా అభివృద్ధి పధం దిశగా ఉంటే ఇంకా ఈ గ్రామం ఇంత వెనుకబడి ఉండడం నాకు బాధ ఆశ్చర్యం కలిగింది. నీకు నా పూర్తి సహకారం ఉంటుంది ” అంది వాసంతి.
దానికి అందరూ తమ మద్దతు తెలిపారు. వాళ్లందరూ సంపన్నుల పిల్లలు. వాళ్ల తమ తల్లి తండ్రులకు చెప్పి తగిన ధనసహాయం చేయగల సమర్ధులు. పైగా ఉద్యోగస్తులు. వాళ్లు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు నీలిమ చాలా సంతోషించింది.
నీలిమ, తన మిత్రబృందంతో కలిసి తమ తండా పెద్దైన భూక్యానాయక్ ని, మరికొంతమందిని కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తన లక్ష్యాన్ని, వాళ్లకు చెప్పి వాళ్ల సహకారాన్ని కూడా కోరింది. అందరూ సంతోషంగా అంగీకరించారు.
నీలిమావాళ్లు ఇంకో రెండు రోజులు అక్కడే ఉండి ఆ ఊరిలో చేయాల్సిన పనులను, దానికి కావలసిన వనరుల కోసం ఒక ప్రణాళికను రూపొందించుకుని మరలా విధినిర్వహణలో భాగంగా తమ పట్టణానికి వచ్చి ఆఫీసు పనులలో మునిగిపోయారు.
నీలిమ ఆఫీసు పనిచేస్తూ వీలుకుదుర్చుకుని తమ ఊరికి అవసరమైన రోడ్లు, రవాణా పనులకు తమ ఎమ్మెల్యే ని కలిసి అంతా వివరించింది. గవర్నమెంట్ లో ఎవరిని సంప్రదించాలో, ఆ అధికారుల అనుమతులను కూడా తీసుకుంది. తనే స్వయంగా వాళ్లని తీసికెళ్లి తమ ఊరిని చూపించి పరిస్థితిని వివరించింది. వాళ్లు తమ మద్దతు తెలిపి గవర్నమెంటు నుండి రావలసిన ఫండ్ ని త్వరగా వచ్చేట్లు చేసి పనిని మొదలుపెట్టారు.
ఏడాదిన్నర కల్లా ఆ గ్రామానికి మంచి రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, మంచినీటి వసతి సౌకర్యాలు, బస్సు మొ…రవాణా సదుపాయాలు, చుట్టుప్రక్కల గ్రామాలతో అనుసంధానంగా ఉండేట్లు తాము పండించిన పంటని దళారులు లేకుండా తామే స్వయంగా అమ్ముకునేట్లుగా మార్కెట్ యార్డు వచ్చింది.
నీలిమ అభిప్రాయాలను, ధ్యేయాలను, ఊరి ప్రజలకోసం ఆమె పడుతున్న తాపత్రయం, చేస్తున్న కృషిని అర్ధంచేసుకుని ఆమెని ప్రేమించసాగాడు సహోద్యోగి శశాంక్. సిటీలో ధనవంతుడైన గోవిందరావు, లలితలకు శశాంక్ ఏకైక కొడుకు. వాళ్లు ధనవంతులైనా ఆ పొగరు, అహంకారం ఏమాత్రం శశాంక్ కి ఉండగూడదనే తలంపుతో చిన్నప్పటి నుంచి మంచి క్రమశిక్షణ, మానవత్వ విలువలతో పెంచారు. శశాంక్ కూడా చక్కటి ఆశయాలు, మానవత్వ విలువలు కలిగి చక్కగా చదువుకుని ప్రయోజకుడైనాడు.
కొన్ని నెలల తర్వాత శశాంక్ తన మనసులోని ప్రేమని నీలిమకు చెప్పి తన కుటుంబ వివరాలను తెలిపాడు. ఆమెకిష్టమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామన్న తన అభిప్రాయం చెప్పి ఆమె అంగీకారాన్ని కోరాడు. గత రెండేళ్లనుంచి నీలిమ కూడా అతని వ్యక్తిత్వాన్ని దగ్గరగా గమనిస్తున్నదై, కంపెనీలో అతనికున్న మంచి పేరుని, అతని నడవడికను ఎరుగున్నదై అతని ప్రేమని మనస్ఫూర్తిగా అంగీకరించి పెళ్లికి సుముఖత చూపింది.
తన కుటుంబ వివరాలను, ఊరిపట్ల, ప్రజల పట్ల తను చేయవలసిన సేవా కార్యక్రమాలను, కడదాకా తన తల్లి తండ్రులను ఏ లోటూ లేకుండా చూసుకోవాల్సిన తన బాధ్యతని చెప్పి అందుకు అతని సహాయ సహకారాన్ని కోరింది నీలిమ. అందుకు అంగీకరించాడు శశాంక్.
ఒక రోజున నీలిమని తమ ఇంటికి తీసికెళ్లి తల్లితండ్రులకు పరిచయం చేసి తన ప్రేమ గురించి, ఆమె కుటుంబం గురించి, చేసిన సేవా కార్యక్రమాలను గురించి అంతా వివరంగా చెప్పాడు శశాంక్. నీలిమని చూసి వాళ్లు చాలా సంతోషించి ఆమె మంచి మనసుని, సేవాదృక్పధంని మెచ్చుకొని పెళ్లికి ఒప్పుకున్నారు.
సంతోషంగా వాళ్లకు నమస్కరించి వచ్చింది నీలిమ.
ఒకనాడు శశాంక్ ని తన ఇంటికి తీసుకొచ్చి తన వాళ్లకు పరిచయం చేసి జరిగిందంతా వివరించింది.
“అమ్మా!, నాన్నా! మీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే నేను శశాంక్ ని పెళ్లిచేసుకుంటాను. నా మనసు నెరిగిన వాడై, నాకార్యదీక్ష, పట్టుదల, పోరాటం, సేవా దృక్పధం అర్థం చేసుకున్న శశాంక్ నా భర్త కావాలనుకున్నాను. మీకిష్టమైతేనే మా పెళ్లి” అంది నీలిమ.
శశాంక్ ని, అతని వినయవిధేయతలని చూసి వాళ్ల పెళ్లికి అంగీకరించారు నీలిమ తల్లిదండ్రులు.
ఒక శుభముహూర్తాన ఇరుకుటుంబాలు కలిసి వాళ్ల పెళ్లిని ఘనంగా జరిపించారు. అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు నీలిమా, శశాంక్ లు.
మరో రెండేళ్లకు తమ సహోద్యోగులు, స్నేహితులు, వాళ్ల తల్లిదండ్రుల ధన సహాయంతో ఆ గ్రామంలో మరుగుదొడ్లు, స్కూలును ఏర్పాటు చేసింది నీలిమ. రోటరీక్లబ్ మొ.. సంస్ధల సాయం తీసుకుని మంచి వసతులతో హాస్పిటల్ ని కట్టించి సిటీనుంచి మంచి వేతనాలతో ప్రజ్ఞావంతులైన డాక్టర్లను, నర్సులను నియమించింది.
మరో ఏడాదికి ప్రభుత్వ అనుమతితో శశాంక్ తండ్రి పెట్టుబడితో సాఫ్టువేరు కంపెనీని తమ ఊరిలో ఏర్పాటు చేసింది నీలిమ. తనకు తెలిసిన మరి కొందరి సాయం తీసుకుని కంప్యూటర్లు మొ .. ఏర్పాట్లు చేసి సాంకేతిక పరిజ్ఞానానికై సుశిక్షితులైన వారిచేత తమ ఊరిలో యువతకి, సమీప గ్రామస్థులకు శిక్షణ నిప్పించి నిరుద్యోగ నిర్మూలన గావించింది.
గృహిణులకు ఉపాధికోసం కుట్టు మిషన్లు, సబ్బుల తయారీ మొ…నేర్పించి వాటి మార్కెటింగ్ వసతిని చూపింది. తాము సంపాదించిన ధనాన్ని దాచుకోడానికై
ప్రభుత్వ సహకారంతో గ్రామీణబాంకుని ఆ గ్రామంలో ఏర్పరచింది. ఈ పనులన్నిటికీ అహర్నిశలు కష్టపడి అందరిచుట్టూ తిరిగి పనులను విజయవంతంగా నెరవేర్చింది నీలిమ.
నిరక్షరాస్యతని పోగొట్టడానికై ఉద్యోగంలో తాను సంపాదించి దాచుకున్న ధనంతో వయోజన పాఠశాలను ఏర్పాటు చేసింది నీలిమ. వృధ్ధులను చదువుకోవడానికి అతికష్టంమీద ఒప్పించి సఫలీకృతురాలైంది.
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తను కష్టపడి చదివి వృధ్ధిలోకొచ్చి తన గ్రామాన్ని, గ్రామ ప్రజల జీవితాన్ని తీర్చిదిద్దిన నీలిమ “ అబల కాదు సబల” అని నిరూపించింది.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comments