'Abala Kadu Sabala' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
"మమ్మీ! తలనొప్పిగా ఉంది. ఈరోజు క్లాసులన్నీ జరిగాయి. కాస్త కాఫీ ఇవ్వవూ" అంది దీప కాలేజీ నుంచి వస్తూ తల్లి సరోజతో.
"అయ్యో! ఇప్పుడే తెస్తాను. నీవు నీ గదిలో కాసేపు రెస్ట్ తీసుకో " అని వెంటనే వేడి వేడి కాఫీచేసి కూతురి గదిలోకి తీసికెళ్ళి తన చేతికి అందించింది. తర్వాత కాసేపటికి
భర్త రమేష్ బయటనుంచి రాగానే ముగ్గురూ కాసేపు కబుర్లతో గడిపారు. ఇలా రోజులు గడుస్తున్నా యి.
ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసి పెద్దలు ఇచ్చిన ఇంట్లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు రమేష్ భార్య సరోజ, కూతురు దీపతో. ఒక్కగానొక్క కూతురు దీపని చాలా గారాబంగా పెంచి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు.
కొన్ని రోజులకు దీప చదువు పూర్తయింది.
M.S చదవాలన్న తన కోరిక ప్రకారం ఆ ఏర్పాట్లను సిధ్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రమేష్ వాళ్లు. దీప గేట్ పరీక్ష వ్రాసి మంచి స్కోర్ సంపాదించింది. అక్కడ యూనివర్సిటీలలో చదువు కోసం అప్లయి చేసి మంచి యూనివర్సిటీలో సీటు పొందటంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఆ వెంటనే కొన్ని రోజుల కు వీసా రావడం, దీప అమెరికా వెళ్ళిపోవడం అన్నీ సవ్యంగా జరిగిపోయాయి.
దీప అమెరికా వెళ్లి నప్పటినుంచి సరోజ మనసు చాలా దిగులుగా ఉంది. రోజూ గారాలుపోతూ, కబుర్లు చెబుతూ తన చుట్టూ తిరిగే పిల్ల ఇప్పుడు దూరంగా వెళ్ళేటప్పుటికి "మళ్ళీ ఎప్పుడు చూస్తానో నా బంగారు తల్లిని " అని ప్రతిరోజూ మనసు కలతచెందుతోంది సరోజకు. భార్య బాధను అర్థం చేసుకున్న రమేష్ తనను దగ్గరకు తీసుకుని ఓదార్చి ధైర్యం చెప్పడంతో సరోజ మనసు కాస్త స్ధిమిత పడింది.
దీప చదువులోనే కాక కల్చరల్ యాక్టివిటీస్ మొ.. వాటిల్లో కూడా ఫస్ట్. చాలా బుధ్ధిమంతురాలు. ముఖ్యంగా పేరెంట్స్ అంటే తనకు చాలా ఇష్టం. ప్రతి ఆదివారం ఫోన్ చేసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది.
ఆ రోజు ఆదివారం కావటంతో ఉదయాన్నే ఇంటి పని ముగించుకుని దీప వాట్సప్ కాల్ కోసం ఎదురుచూస్తున్నారు సరోజ దంపతులు. ఇంతలో ఫోన్ రింగవటంతో లిఫ్ట్ చేసింది సరోజ.
"హలో! మమ్మీ! ఎలా ఉన్నారు మీరు? ' దీప పలకరింపు . " బాగున్నాము , నీవెలా ఉన్నావమ్మా" అని అడిగింది సరోజ. తర్వాత చాలా సేపు అక్కడ తన చదువు, యూనివర్సిటీ కబుర్లతో గల గలా మాట్లాడుతూనే ఉంది దీప. తను చిన్నప్పటి నుంచీ వసపోసిన పిట్ట లాగా మాట్లాడుతూ, అందరితో చాలా కలుపుగోలుగా సందడిగా ఉండే పిల్ల.
"అది ఫోన్ పెట్టేసి చాలా సేపయింది. ఈపూట నాకు బ్రేక్ ఫాస్ట్ ఏమన్నా ఉందా? కూతురి కబుర్లతో కడుపు నింపేసుకుందామా? " సరదాగా హాస్యమాడాడు రమేష్. చాలా సేపయినా అలా కూర్చుని పరధ్యానంగా ఆలోచిస్తున్న భార్యతో.
"అయ్యో! నా మతి మండా ! ఇంత సేపూ ఇలా కూర్చునే ఉన్నానా? ఉండండి, చిటికెలో టిఫిన్ చేసుకొస్తాను" అని పరుగున వంటగది లోకి వెళ్లి భర్తకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా కమ్మని నేతితో చేసింది .దానికి జతగా పెసరట్లు వేసింది. అంతకు ముందే చేసి ఉంచిన అల్లపు చట్నీ వేసి ప్లేటు లో వేడి వేడి పెసరట్లు , ఉప్మా తెచ్చి భర్త కు అందించింది సరోజ .
"ఏమోయ్ ! నీచేతితో చేసిన పెసరట్లు, ఉప్మా రుచి ఇంకెవ్వరు చేసినా రాదోయ్. స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుంటుంది . సరిలేరు నీకెవ్వరూ, సరిరారు నీకెవ్వరూ " అని పాట రూపంలో భార్యను పొగిడాడు రమేష్. పొగడ్తలు అంటే ఇష్టపడని స్త్రీలు ఉండరు కదా. అందులోనూ భర్త పొగడ్తలు అంటే మరీ ఇష్టం.
అతని మాటలకు మరింత మురిసిపోతూ " బెత్తెడు దూరమే ఉంది కదా అని అక్కడ రంభా, ఊర్వశి లతో సరస సల్లాపాలాడవచ్చు ఆని వెళ్ళేరు కొంపదీసి, మీ మగవాళ్ళ బుధ్ధి ఎవరికి తెలీదు, చెంతనే రంభ లాంటి భార్య ఉన్నా మీ చూపులన్నీ పక్కింటి పంకజాక్షి మీదేగా, నా జాగ్రత్తలలో నేను ఉన్నా కాబట్టి మిమ్మల్ని దక్కించుకున్నాను" అని ఎత్తి పొడిచింది సరోజ.
"అబ్బబ్బ బుధ్ధి తక్కువై నిన్ను పొగిడాను. మీ ఆడవాళ్లు మాత్రం సామాన్యులా? అనుమానం ముందు పుట్టి తరువాత మీరు పుట్టారు. మీ కళ్ళన్నీ భర్త కదలికలపైనే కదా. మా మగవాళ్ళు మంచివాళ్ళు కనుక సర్దుకుపోయి కాపురాలు చేస్తున్నారు. ఈ మాటలకేం గానీ, పిల్లకు సంబంథాలు వస్తున్నాయి కదా, త్వరలో మంచి వరుడిని చూసి పెళ్ళి చేసేద్దామోయ్". అన్నాడు రమేష్. వాతావరణం తేలికపరిచే ఉద్దేశ్యంతో మాట మార్చే ప్రయత్నంలో. అతనికి తెలుసు దీప అంటే సరోజకు ప్రాణమని.
కూతురి పెళ్లి విషయం ఎత్తగానే సరోజ ముఖం వేయి వోల్టుల బల్బు లాగా వెలిగిపోయి "అవును. మంచిది చూసి చేసేద్ధామండీ, మనం మేట్రిమోనీ లో వెతికి నచ్చినవి దీపకు పంపి , అందులో దానికి నచ్చింది చేసేద్దాం" అంది. ఆ సాయంత్రం మేట్రిమోనీ లో దీప ఫొటోతో ఒక ప్రొఫైల్ ఫిల్ చేసి కొన్ని సంబంధాలను చూసి , వరుడి ఫోటోలు, వివరాలు, కాంటాక్టు నెంబర్ ను కూడా పంపారు దీపకు.
దీప సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఫోన్లో మాట్లాడినా పెళ్లి విషయాలు దాటేస్తోంది దీప. . వీళ్ళు పంపిన అబ్బాయిల వివరాలు నచ్చాయో లేదో తెలియక తల పట్టుకున్నారు సరోజ దంపతులు.
ఒకరోజున "మమ్మీ! నేను నా క్లాస్ మేట్ విలియమ్స్ ను ప్రేమించాను. అతనికి కూడ నేనంటే ప్రాణం. మీ అనుమతితో మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం " అని చాలా కాజువల్ గా చెప్పినట్టు చెప్పింది దీప.
కాళ్ళ క్రింద భూమి అదిరినట్టుగా ఒక్కసారిగా షాకయ్యారు సరోజ వాళ్ళు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కూతురు తన పెళ్ళి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు. తమ కళ్ళకు అది ఇంకా చిన్నపిల్లే. అతను విదేశీయుడు. విదేశీ సంబంధాలు చివరి దాకా ఎంతవరకు సక్రమంగా నిలబడతాయో తెలీదు. 'విదేశీయుడితో ప్రేమ పెళ్ళి' అని బంధువులు , తెలిసిన వాళ్ళు వేలెత్తి చూపుతారు. కాదంటే కూతురి మనసు నొచ్చుకుంటుంది. తనను ఏనాడూ బాధ పెట్టి ఎరుగరు. ఏంచేయాలో తెలియక కూతురికి ఒకసారి నచ్చచెప్పుదాము అనుకున్నారు.
ఆ తర్వాత 2 రోజులకు దీప ఫోన్ చేసి అతని వివరాలు , ఫోటోలు, కాంటాక్టు నెంబరు పంపి "అతను కూడా మీతో ఫేస్ టైమ్ చేసి మాట్లాడుతాడు " అంది.
ఎంతగానో ఈ పెళ్లి వద్దని తనకు నచ్చచెప్పచూసినా దీప తన మొండి వైఖరి వీడలేదు. ఇంక చేసేది లేక కూతురి కోసం , తనని దూరం చేసుకోలేక విలియమ్స్ తో ఫేస్ టైమ్ లో మాట్లాడారు సరోజా వాళ్లు.
అతను కూడా బాగానే మాట్లాడాడు. ఆ తర్వాత అతని నుండి రెండు మూడు ఫొన్ కాల్సు.
"మమ్మీ! నేను, విలియమ్స్ ఇంకో 20 రోజులలో ఇండియాకు వస్తున్నాము. రిజిస్టర్ మారేజి చేసుకుంటాము” మారేజి డేట్ కూడా చెప్పి “వారాలే ఉంటాము ఇండియాలో " అంది దీప.
ఆ తరువాత వాళ్ళిద్దరూ కలిసి రావడం, రిజిస్టర్ మారేజి చేసుకుని 2 వారాలు వీళ్ళతో గడిపి అమెరికా వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు సరోజా వాళ్ళు. వాళ్ళ పెళ్లి అయి 7 నెలలు కావస్తోంది.
"మమ్మీ! మేము డివోర్సు తీసుకోవాలి అనుకుంటున్నాము, మా ఇద్దరికీ ప్రతి రోజూ ఏదో ఒక గొడవలు. అయినా అతనికి ఇంతకు ముందే మేరీ తో పెళ్లయిందిట. ఆ విషయం నాకు చెప్పకుండా దాచి నన్ను ప్రేమించినట్టు నటించి పెళ్ళి చేసుకున్నాడు. నిన్న మేరీ వచ్చి ప్రూఫ్సు అన్నీ చూపిస్తే అతనిని నిలదీసి అడిగాను. ముందు కాదని బుకాయించినా తరువాత నిజం ఒప్పుకున్నాడు, నేను ఇండియాకు వచ్చి అతనికి డివోర్సు ఇస్తాను." అన్న దీప మాటలకు బాథతో తల్లడిల్లారు సరోజ దంపతులు.
ఆ తరువాత కొన్ని రోజులకు దీప ఇండియాకు రావడం తన భర్తకు విడాకులు ఇచ్చి విడిపోవడం చకచకా జరిగింది. విషణ్ణ వదనంతో చూస్తూ ఊరుకున్నారు రమేష్ వాళ్ళు.
దీప ఈకాలం ఆడపిల్ల కనుక జరిగినదంతా మర్చిపోయి థైర్యంగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేరు ఇంజనీర్ గా చేస్తూ , పేరెంట్సుని కంటికి రెప్పలాగా చూసుకుంటూ, అనాధ పిల్లల సంస్థ నుంచి ఒక పాపను దత్తత తీసుకుని, ఆ పాప చేత "అమ్మా" అని పిలిపించుకుంటూ తన దైనందిన జీవితంలోకి అడుగులు వేసి ఆఫీసు పనులతో చాలా బిజీ అయింది.
కొంత కాలానికి ఆదే ఆఫీసులో పని చేస్తున్న శేఖర్ దీపను ఇష్టపడి తన కుటుంబ వివరాలను తెలిపి , ఆమెకు ఇష్టమైతే పెళ్లి చేసుకొందామనుకున్న తన నిర్ణయం చెప్పాడు దీపతో. "తను పెంచుకుంటున్న బిడ్డకు తండ్రిగా ప్రేమను పంచటానికి మనస్పూర్తిగా అంగీకరిస్తేనే తను ఈ పెళ్ళికి సిథ్థము" అంది దీప.
శేఖర్ అందుకు ఒప్పుకోగా తమ నిర్ణయాన్ని ఇద్లరూ తమ పేరెంట్స్ కు చెప్పి, రిజిస్టర్ మేరేజితో ఇద్దరూ ఒక ఇంటివారయి క్రొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించారు. కూతురి కాపురం చూసి సంతోషిస్తూ ఆ పాపతో హాయిగా ఆడుకుంటూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు సరోజ దంపతులు.
ఈనాటి ఆడపిల్లలు "అబలలు కాదు- సబలులు". తమ కాళ్ళ మీద తాము నిలబడి థైర్యంగా తమ జీవితం గడపగలరు" అని నిరూపించింది దీప.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
Comments