'Abhaya Hastham' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 23/09/2024
'అభయహస్తం' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“మీ కజిన్, వాళ్ల అమ్మాయి పెళ్లి బాగానే చేసాడు” అని అంటూ హాల్ లో అటుయిటు నడుస్తున్న సుకుమార్ సెల్ ఫోన్ రింగ్ విని టీవీ బల్ల మీద పెట్టిన ఫోన్ అందుకుని ఎవ్వరా అని చూసాడు. ఆ ఫోన్ తన బావమరిది కొడుకు వేణు నుంచి వచ్చింది. నిన్నటి దాకా ట్రైన్ లోనే వున్నాముగా.. అప్పుడే ఫోన్ చేసాడమిటి అనుకుంటూ ‘హలో’ అన్నాడు.
“మామయ్యా! నేను వేణుని. ఏం చేస్తున్నారు?” అన్నాడు.
“పెళ్లి భోజనాలతో కొద్దిగా షుగర్ పెరిగింది ఏమో అనుకుని నడుస్తున్నాను” అన్నాడు సుకుమార్.
“ఒకసారి కూర్చోండి మామయ్యా! మీతో మాట్లాడాలి” అన్నాడు వేణు.
“ఆ కూర్చున్నాను, చెప్పు” అన్నాడు.
“మామయ్యా! మా అమ్మ చనిపోయింది ఒక పది నిమిషాల క్రితం" అన్నాడు గొల్లుమంటూ వేణు.
“ఉదయమే కదరా అందరం స్టేషన్ లో దిగి క్యాబ్ లు ఎక్కింది, అప్పుడే ఎలా జరిగింది? నేను, మీ అత్తయ్యా బయలుదేరి వస్తున్నాము. ధైర్యంగా వుండు” అంటూ ఫోన్ కట్ చేసి భార్య రమణి తో “యిదిగో.. ఒకసారి ఆ పూజ గది నుంచి వస్తావా” అని పిలిచాడు.
“రెండోసారి కాఫీ నా పూజ పూర్తి అయిన తరువాతే”, అంటున్న రమణి తో “కాఫీ కాదు, ముందు నువ్వు యిటు రా” అన్నాడు గట్టిగా.
“ఏమైంది అలా చెవి తెగిన మేకలా అరుస్తున్నారు” అంటూ పూల దండ తో వచ్చింది రమణి.
“కంగారు పడకుండా విను, మీ వదిన చనిపోయిందిట, యిప్పుడే వేణు ఫోన్ చేసి చెప్పాడు” అన్నాడు భార్యతో సుకుమార్.
“అదేమిటండి, రెండు గంటల ముందు వరకు బాగానే వుందిగా, అప్పుడే యిలా జరగడం ఏమిటండి” అంది.
“నేను ఏమన్నా డాక్టర్ నా, ఎందుకు జరిగిందో చెప్పటానికి, పద క్యాబ్ పదినిమిషాలలో వస్తుంది, వెళ్ళాలి” అన్నాడు.
క్యాబ్ చిక్కడపల్లి లో బావమరిది శంకరం యింటి ముందు ఆగింది.
క్యాబ్ లోనుండి దిగి రెండువ ఫ్లోర్ లో వున్న బావమరిది ఫ్లాట్ లో కి వెళ్ళాడు. హాల్ లో సింహం ప్రశాంతం గా చాపమీద పడుకుని వుంది. ఆవిడని ఆ విధంగా చూడగానే కళ్ళలోనుంచి నీళ్లు ఒక్కసారిగా వుబికి వచ్చాయి సుకుమార్ కి.
కళ్ళు తుడుచుకుని, అక్కడే విషాదంగా మూగ గా రోదిస్తున్న బావమరిది శంకరం దగ్గరికి వెళ్ళాడు. బావమరిది భుజం మీద చెయ్యి వేసి “అటగదరా శివా అన్నట్టుగా మహారాణి లా వెలిగి వెళ్ళిపోయింది. ఒంటరివి నీవే కాదు, మా ధైర్యాన్ని కూడా పట్టుకుని వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు, ‘మాకేం.. విజయ ఉంటే చాలు ఏ పనైనా చేసిపెట్టగలదు’ అనుకుంటూ వున్నాము. యిప్పుడు యిలా అందరిని మోసం చేసి వెళ్ళిపోయింది” అన్నాడు సుకుమార్.
70 ఏళ్ళ సుకుమార్ మామయ్య అలా వణుకుతో మాట్లాడటం విని, వేణు, “మామయ్య.. మీరు యిలా వచ్చి కుర్చీలో కూర్చోండి” అని చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళి కూర్చోలో కుర్చోపెట్టాడు.
నిబ్బరంగా వుండే భర్త అలా కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు ఆయన శరీరం వణకటం చూసిన రమణి కంగారు పడి మంచినీళ్లు యిచ్చి “యివ్వి తాగండి. మీరే యిలా కంగారు పడితే పిల్లలు మరీ దిగులు పడిపోతారు” అంది.
ఏమిటో మాయా, ఆవిడే చనిపోయింది, మనమందరం చిరంజీవులే అన్నట్టుగా మాటల్లో పడిపోయారు అందరూ.
అలా నిన్నటి వరకు ఆవిడదే హడావుడి, యినాడు అలా మీరెవ్వరో నాకు తెలియదు అన్నట్టుగా పడుకుని వున్న ఆమెని చూస్తో గతం లోకి వెళ్ళిపోయాడు సుకుమార్.
సుకుమార్ కి అప్పుడు నలబై ఏళ్ళు, ఒళ్ళు నొప్పులుగా ఉండటం తో ఆఫీస్ నుంచి త్వరగా యింటికి వచ్చేసాడు. మామూలు నొప్పులే అనుకుంటే రాత్రికి జ్వరం కూడా వచ్చింది. ఉదయం లేచి ఆఫీసుకి వెళ్లే ఓపిక లేక ఇంట్లోనే వున్నాడు. లోకల్ గా వున్న డాక్టర్ సలహాతో మందులు వాడుతున్నా జ్వరం తగ్గలేదు సరికదా, దగ్గు, వామిటింగ్స్ కూడా తోడు కావడం తో తన సోదరులకు విషయం తెలియచేసాడు.
దగ్గు జ్వరం అనగానే ఏదో అంటువ్యాది అంటుకుంది అనుకుని, “దూరం నుంచి పలుకరించి, మీ ఆవిడ ఉద్యోగం చేస్తోంది, వాళ్ల ఆఫీస్ వాళ్ళు వైద్య సౌకర్యం యిస్తారు నీకు, జాగ్రత్తగా వుండు, మాకేదైనా వస్తే మా వాళ్ళు ఆటో కూడా పిలువలేరు” అన్నారు కొందరు.
కొంతమంది “భయపడకు, నువ్వు చాలా ధైర్యంగా వుంటావు, మందులు వాడు తగ్గిపోతుంది. మేము వచ్చి చూసి వెళ్తోవుంటాము” అన్నారు.
‘నిజమే ఈ మాయదారి రోగం వాళ్ళకి అంటుకుంటే తన కంటే పెద్దవాళ్ళు తట్టుకోలేరు, వాళ్ళు దూరంగా వుండటమే మంచిది’ అనుకున్నాడు.
సీలింగ్ కేసి చూస్తో, ‘పిల్లలు యింకా చదుకుంటున్నారు, బాధ్యత అంతా భార్య మీద పడింది, రోగం వచ్చి నెల దాటిపోయింది. డాక్టర్స్ ని మారుస్తున్నా, అసలు రోగం ఏమిటో అంతుదొరకడం లేదు’.
యింట్లో పోపు పెట్టిన వాసన కూడా భరించలేక డోకు కుంటున్నాడు సుకుమార్. ఆఫీస్ నుంచి చూడటానికి వచ్చిన స్నేహితులు కూడా, ఇదేమిటి యిలా అయ్యిపోయావు అనడం తో ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు సుకుమార్. ఆ సమయంలో వచ్చారు బావమరిది అతని భార్య విజయ.
“ఏమిటి అన్నయ్యా యింత చిక్కిపోయారు, యిలా వుంటే లాభం లేదు. పదండి మిమ్మల్ని సెంటన్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసి వైద్యం చేయించాలి, యింట్లో వుండి వైద్యం ఏమిటి” అంటూ హడావుడి చేసింది.
“మూడు నెలల నుంచి అన్నం తినడం మానేసారు వదినా, ఏమన్నా అంటే విసుగు ఎక్కువ అయ్యింది” అంది రమణి.
“ఇన్నాళ్ళు మాకు ఎందుకు చెప్పలేదు అన్నయ్య కి యిలా వుంది అని, ముందు కొద్దిగా రసం అన్నం కలుపుకుని రా, ఎందుకు తినడో చూస్తాను” అని తనే వంటగదిలోకి వెళ్ళి కంచం లో రసం అన్నం పట్టుకుని వచ్చింది సుకుమార్ దగ్గరికి.
రసం వాసన రాగానే ప్రేగులోనుంచి తన్నుకొచ్చి పెద్దగా వామిటింగ్ అయ్యింది సుకుమార్ కి. తన కొంగు అడ్డం పెట్టి వామిటింగ్ ని కింద పడకుండా పట్టుకుని, బాత్రూం లోకి తీసుకుని వెళ్ళి క్లీన్ చేసింది విజయ.
“అయ్యో మీ చీర పాడైంది, రోజు ఈయన యిలా యింట్లో వామిటింగ్ చేసుకోవడం, నేను యిల్లు కడగడం అలవాటు అయ్యింది” అంది రమణి తన చీర తీసుకుని వచ్చి విజయకి యిస్తో.
“పర్వాలేదు, ముందు మెల్లగా నడిపించుకుని వెళ్ళి కారులో కూర్చోపెడతాము. నువ్వు మీ ఆయన బట్టలు కొన్ని సంచిలో పెట్టుకుని రా. పిల్లలని పైన ఫ్లాట్ వాళ్ల దగ్గర ఉండమను” అంది. తన భర్త సహాయం తో సుకుమార్ ని మెల్లగా లేవదీసి నడిపించుకుంటూ కారు దగ్గరికి తీసుకొని వెళ్ళింది విజయ.
మలయాళం రావడం తో హాస్పిటల్ లో వున్నవాళ్ళతో చనువుగా మాట్లాడి సుకుమార్ ని అడ్మిట్ చేసింది. అసలే ప్రైవేట్ హాస్పిటల్, డబ్బు కడితే గాని పని జరగదు. ఆ పనులన్నీ ఆమే చూసుకుంది.
“ఈ రాత్రికి మీ తమ్ముడు పడుకుంటాడు, రేపు ఉదయం నేను వచ్చేస్తాను, నువ్వు కారులో ఇంటికి వెళ్ళు, పిల్లలు కంగారు పడతారు” అని చెప్పి రమణి ని పంపించేసింది..
తెల్లారింది, అసలే రమణి ఉద్యోగం ప్రైవేట్ కంపెనీ లో, సెలవు పెడితే ఉద్యోగం వుంటుందో లేదో తెలియని స్థితి, పిల్లల్ని స్కూల్ కి పంపించి తను ఆఫీస్ కి వచ్చి కూర్చొని, తన వదిన విజయకి ఫోన్ చేసి అడిగింది డాక్టర్ ఏమ్మన్నారు అని.
“అన్ని రిపోర్ట్స్ బాగున్నాయి, లంగ్స్ లో నీళ్లు రావడం వలన జ్వరం, దగ్గు” అన్నారు. ఒక నెల రోజులు హాస్పిటల్ లో వుంచి వైద్యం చెయ్యాలి అన్నారు.
డాక్టర్ రాసిచ్చిన లెటర్ తీసుకుని “వస్తున్నా, మీ ఆఫీస్ లో చూపించి హెల్త్ ఇన్సూరెన్స్ కి అప్లై చేద్దువు గాని” అంది.
ఒక నెల అనుకున్నది రెండు నెలలు హాస్పిటల్ వుండాలిసి వచ్చింది.
అన్ని రోజులు రాత్రి సుకుమార్ కి తోడుగా బావమరిది, పగలు కొన్ని రోజులు బావమరిది భార్య విజయ, కొన్నిసార్లు సుకుమార్ తమ్ముడు వుండే వాళ్ళు. మొత్తానికి యింతమంది సహాయం వలన రోగం తగ్గి యింటికి చేరాడు సుకుమార్. రమణి యింట్లో వున్న కొత్త పట్టుచీర తీసుకుని వచ్చి విజయకి బొట్టు పెట్టి యిచ్చి “నీ సహాయం వలన ఈ గండం నుంచి బయట పడ్డాము” అని కృతజ్ఞతలు తెలిపింది.
డబ్బులు వున్న వాళ్ల దగ్గర నుంచి డబ్బు లేని వాళ్ల వరకు ఆవిడ ఇంటికి చేరితే చాలు వాళ్లకు అండగా నిలిచేది. ఆవిడ వల్ల కాని పని లేదు అనిపిస్తుంది ఆవిడ ని చూస్తే. అటువంటి ఆవిడ చలనం లేకుండా, ‘యిహ మీ పని’ అంటూ పడుకుని వుంది.
“మామయ్యా! కొద్దిగా కాఫీ త్రాగండి” అన్న వేణు మాటలకు గతస్మృతుల నుంచి బయటకు వచ్చాడు సుకుమార్.
ఆన్లైన్ లో ఒక గజ మాల తెప్పించి, ఆవిడ మీద కప్పి, తుది వీడ్కోలు సమర్పించాడు.
........
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
***
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
@saipraveenajeedigunta8361
• 1 day ago
Heart touching