#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #AchiBuchiAppachhi, #ఆచిబూచిఅప్పచ్చి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Achi Buchi Appachhi - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao
Published In manatelugukathalu.com On 03/02/2025
ఆచి బూచి అప్పచ్చి - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
రూపలావణ్యకు 30 సంవత్సరాలు. నాలుగేళ్ల క్రితం పెళ్లయింది భర్త భజరంగరావు. ఉండేది బెంగుళూరు లో. ఆవిడగారు ఇప్పుడు సంవత్సరాది పండుగకు కాకినాడ పుట్టింటికి బయలుదేరింది. చేతిలో సూట్ కేస్ ఉంది. చంకలో పిల్లలు లేరు అనడానికి వీలు లేదు. ఒక పిల్ల కాయ ఆమె కడుపులో ఉంది.
భజరంగరావుది పెద్ద కార్ల వ్యాపారం. అంటే పెద్ద పెద్ద కార్లు కాదు. మామూలు చిన్న కారులే కానీ వ్యాపారం పెద్దదన్నమాట. అందుకనే అతగాడు భార్య వెంట కాకినాడ రావడానికి కుదరలేదు.
డ్రైవర్లు కూడా ఖాళీగా లేక పోవడంతో ట్రైన్ ఎక్కి ఏసీ కంపార్ట్మెంట్లో సింగిల్ గా కాకినాడ వచ్చేసింది రూప లావణ్య.
కాకినాడ స్టేషన్లో ట్రైన్ దిగింది తండ్రి అహోబిలేశ్వరం ఆమెను రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ అమ్మాయి అంటే ఆ తండ్రికి, తల్లికి కూడా అమిత మైన గారాబం. అంతేకాదు బోల్డంత ముద్దుమురిపెం.
పండుగ ఇంకా రెండు రోజులు ఉంది. కూతురిని మార్కెట్కు తీసుకువెళ్లి సంవత్సరాదికి బహుమతిగా తన ముద్దుల కూతురుకి కావలసింది కొనాలి అనుకున్నాడు. అదే మాట చెప్పి మార్కెట్ కు వెళ్లడానికి కూతుర్ని తొందర పెట్టాడు.. అహోబిలేశ్వరం.
''నాన్నా! నాకు బహుమతులు మూడు సంవత్సరాల నుండి ఇస్తున్నావు కదా. అయినా మాకే బోల్డంత డబ్బు. నీ బహుమతులు వద్దు. '' అంది.
ఆ మాటతో అహోబిలేశ్వరం ఆయన భార్య మహoకాళమ్మ కంగారుపడి కూతురుని బ్రతిమలాడారు.
అప్పుడు రూపలావణ్య తల్లి తండ్రి మధ్యన కూర్చు ని.. ''నాన్నా, అమ్మా.. బాల్యంలో నా వయసు మూడవ సంవత్సరం ముగిసిన వెంటనే నన్ను ఇంగ్లీషు చదువులో పెట్టారు. కొన్నాళ్లు హాస్టల్లో పడేశారు. అప్పటి నుండి తల్లిదండ్రులు సరదాగా అనే చాలా చాలా ముద్దు మాటలు, ఆ చిన్నిచిన్నిమిగిలిన చెక్కిలిగింతల ఆనందాలు నాకు తీరలేదు. ఇప్పుడు ఆ సరదాలు తీర్చుకోవాలి అనుకుంటున్నాను. అంటే సంవత్సరాది పండుగకు నేను ఇక్కడ ఉండే ఈ నెల రోజులలో అవన్నీ ఇప్పుడు తీర్చుకోవాలని వచ్చాను. దాంతో మీరు పెద్ద బహుమతి ఇచ్చినంత ఆనందం నాకు కలుగుతుంది.. నా కడుపులో బిడ్డ కూడా పరమానంద పడి పోతుంది.
అదేమిటంటే జాగ్రత్తగా వినండి.. లాల పోసుకో అమ్మ అంటూ లేచిన వెంటనే నా బెడ్రూమ్ లో నా దగ్గరికి వచ్చి అమ్మ అనాలి. నేను మారాం చేస్తాను.. బతిమ లాడాలి. పరిగెత్తుకుని దొడ్లోకి వెళ్లిపోతాను. నన్ను ఎలాగోలా జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకొచ్చి.. అమ్మ ఆ పని పూర్తి చెయ్యాలి.. ఇలా నేను మీ ఇంటి దగ్గర ఉన్నన్నాళ్లు ప్రతి రోజు చేయాలి.
అమ్మ నా బెడ్ రూమ్ లో నాకు బట్టలు స్వయంగా తనే చిన్నపిల్లలకు వేసినట్టు వేశాక కూడా ఇది..
అది.. అంటూ చాలా గొడవ పెడతాను. అమ్మ విసుక్కోకుండా బ్రతమలాడి నాకు ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు వేయాలి. అలా మిగిలిన సరదాలు కూడా తీర్చాలి.
ఇక నాన్న.. నీ విషయం ఏమిటి అంటే.. నువ్వు నాకు టిఫిన్ తినిపించాలి.. పాలు తాగించాలి. నిన్ను చాలా బాగా ఏడిపిస్తాను. ఉప్మా పెడితే ఇడ్లీ పెట్టమంటాను, ఇడ్లీ పెడితే పూరి పెట్టమంటాను. అది పెట్టాక అది వద్దు బువ్వ పెట్టు అంటాను. మంచినీళ్లుగ్లాసు కాలితో తన్ను తాను. పాలు నేల మీద ఒంపుతాను.. ఇవన్నీ అప్పుడు అంటే నా మూడు సంవత్సరాల వయసులో చేయాలనుకున్న నా సరదా అల్లరి పనులు. ఇప్పుడు చేసి ఆ మహా అనుభవం పొందాలి అని ఉంది. మీరు భరించాలి. నిజం చెప్పండి నా మూడవ సంవత్సర వయసులో నా ముద్దు మురిపాలు తీర్చుకోకుండానే మీరు కూడా బ్రతికేశారు కదా. ఏం చేస్తారు అప్పటి చదువుల సమాజ విధానాన్ని బట్టి నన్ను దూరంగా పెట్ట వలసి వచ్చింది మీరు. '' అంటూ ఇంకా ఇంకా చెప్తుంది రూప లావణ్య.
అహోబిలేశ్వరం, మహంకాళమ్మ దంపతులు గుడ్లు పెద్దవి చేసుకొని వింటున్నారు. కానీ వాళ్లకు ఆ విషయం తెలియదు. ఒకరి బుర్రతో మరొకరి బుర్ర బాదుకున్నారు కానీ అలా బాదుకున్న సంగతి కూడా వాళ్లకు అర్థం కాలేదు. పెరిగిపోయి ఉన్న గోళ్ళతో ఒకరి కాళ్లు చేతులు మరొకరు గోక్కున్నారు.. అది కూడా వాళ్ళు అవగాహన చేసుకోలేనంత.. మాయా ప్రపంచం లో పడిపోయినట్టున్నారు. వాళ్ళిద్దరూ ఇంచుమించు స్పృహ కోల్పోయినట్టు అయిపోయినా వాళ్ళ కర్ణ భేరికి తమ ఒక్కగానొక్క కూతురు రూపలావణ్య చెబుతున్నవన్నీ చాలా స్పష్టంగా వినపడుతున్నాయి.
రూపలావణ్య బాల్యంలో తీర్చుకోలేకపోయిన తన కోరికలు ఇంకా చెప్పుకుపోతుంది.. ''నాన్నా! ఆ తర్వాత నువ్వు నన్ను ఆచి వెళ్దాం రా అమ్మ అని తీసుకు వెళ్లాలి. నాకు అప్పచ్చిలు కొని పెడతావా అని అడు గుతాను. నువ్వు కొనాలి. అమ్మవారి గుడి దగ్గర తీర్థం లో రంగులరాట్నం ఎక్కించి అక్కడే పీచు మిఠాయి కూడా కొనిపెట్టి దారి పొడుక్కి నేను అది తింటుంటే నా నోట్లో నుంచి చొంగలు కారి నా బట్టల మీద పడితే నువ్వు నన్ను వీపు మీద కొట్టాలి. నేను ఏడుస్తాను.. నువ్వు నన్ను బ్రతిమలాడీ వెనక్కి తీసుకెళ్లి ఇంకొక పీచు మిఠాయి కొనిపెట్టాలి. ఏమి అనకూడదు. ఈ సరదా తీర్చుకోవాలని 28 ఏళ్ల నుంచి ఎదురుచూ స్తున్నాను.
ఇంటికి వచ్చాక బువ్వ పెడతాను రా అమ్మ అని అమ్మ నన్ను అనాలి. అదిగో అక్కడే అసలు కథ మొదలవు తుంది. మీరిద్దరూ అన్నం తినిపించడానికి ప్రయత్నిస్తే నేను మిమ్మల్నిద్దరినీ విసిగిస్తాను. ఒక ముద్ద కూడా తినను. మీ రిద్దరూ నాకు ఫోటోలో చందమామను చూపించి బ్రతిమలాడుతూ చందమామ రావే అన్న పాట పాడుతూ ముద్ద తినిపించాలి. 'అడుగో బూచి బూచి వచ్చేస్తున్నాడు. '.. అంటూ భయ పెట్టాలి. ఇంత పెద్దదానితో ఆటలు, పాటలు ఏమిటి అని సంకోచించ కూడదు.. సిగ్గుపడకూడదు. మొత్తానికి ఆ ఆనందం అలా పూర్తవుతుంది. ఇలాంటి వన్నీ ప్రతిరోజు ఒక సీరియల్ లాగున అలా అలా జరుగుతూ ఉండాలి.. ". రూపలావణ్య తల్లి దండ్రులకు ఇంకా అలా చెప్పుకు పోతుంది. ఇంకా చెప్పటం ఏమాత్రం ఆపలేదు.
అహోబిలేశ్వరం కాస్త స్పృహలోకి వచ్చి సెల్ఫోన్ లో ఏదో నెంబర్ నొక్కాడు. ఐదు నిమిషాల్లో మంత్రేశ్వర రావు వచ్చాడు. రూపలావణ్య చుట్టూ మూడు నిమ్మ కాయలు పెట్టి వేపమండ తో దిష్టి తీశాడు. ఇంకాజర పవలసిన మంత్రతంత్రాలన్ని జరిపించేశాడు. అతని అధీనంలోకి ఏ దెయ్యము రాలేదు.
''అబ్బే.. అమ్మాయికి గ్రహదోషం ఏమాత్రం లేదు.. ఇది దెయ్యం గియ్యం పని కాదు. మంచి డాక్టర్ల కు చూపించoడి.. '' అంటూ వెళ్లిపోయాడు.
మరో ఐదు నిమిషాలకే డాక్టర్ పరాంకుశం వచ్చాడు.. రకరకాల వైద్య పరీక్షలన్నీ చేశాడు. రకరకాల నటనలు చేసి రూపలావణ్యను మామూలు స్థితికి తీసుకు రావడానికి చాలా ప్రయత్నం చేశాడు. అబ్బే.. అతనికి కూడా ఏమాత్రం లైను దొరకలేదు. తన పెట్టే తట్ట బుట్ట అన్ని సర్దేసుకున్నాడు.
''అహోబిలేశ్వరం గారు.. మీరు బాగా తెలుసున్నవారు కనుక చెబుతున్నాను. మీ అమ్మాయికి మానసిక స్థితిలో తేడా ఏమాత్రం లేదు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకండి. ఇతర డాక్టర్కు చూపించకండి. '' అంటూ వెళ్లిపోయాడు. ఏం చేయాలో అర్థంకాక అహోబిలేశ్వరం, మహంకాళమ్మ కూతురు ముఖంలోకి దీనంగా చూశారు.
''నేను చెబితే వినరేమిటి.. నాకు దెయ్యం పట్టలేదు. నిజంగానే నేను చెప్పినవన్నీ చేసి తీరాలి మీరు. ఇదే మీరు నాకు ఇచ్చే నిజమైన పండగ బహుమతి. ఇదిగో.. అమ్మానాన్నా.. ఈ క్షణం నుండి నేను.. ఇప్పుడే మాటలు అలవాటు అవుతున్న రెండేళ్లు నిండిన చిన్న పిల్లను అయిపోయినట్టే అయిపోతున్నాను.. అయి పోతున్నాను.. అయిపోతు.. అయ్యో అయిపోయాను. ''
అంటూ ముడుచుకుని మాట్లాడకుండా ఒక మూల మౌనంగా కూర్చుని మానసికంగా రెండు మూడు సంవత్సరాల పిల్ల మానసిక వయసులోకి మారిపో యింది రూపలావణ్య.
తప్పక ఆ అమ్మాయితో చిన్నపిల్లతో ఆడుకున్నట్టు ఆడుకోవడం మొదలు పెట్టేసారు.. ఆమె తల్లి దండ్రులు.
****
ఒకరోజు ''లడ్డుబత్తాయి'' కావాలి.. అంటూ బుంగ మూతి పెట్టి అడిగింది రూపలావణ్య.
'' లడ్డుబత్తాయి.. అంటే ఏంటమ్మా తల్లి.. బుజ్జి.. సరిగ్గాచెప్పు. '' అడిగాడు తండ్రి గారం చేస్తూ.
''లడ్డుబత్తాయి కావాలి లడ్డుబత్తాయి కావాలి. ఊఊఊఊ. '' సామాను పడగొట్టేయడం మొదలు పెట్టింది రూపలావణ్య. ఆమె తల్లి పరుగున వంటిం ట్లోంచి వచ్చింది.
'' మీరు ఉండండి మీకు ఏమీ అర్థంకాదు. దానికి లడ్డు కావాలి, బత్తాయి కావాలి. అంటే రెండు కావాలి'' అంటూ బెడ్రూమ్ లోకి వెళ్లి గిన్నెలో ఆ రెండు పెట్టి తెచ్చి ఇచ్చింది. రూపలావణ్య ఆ గిన్నె అందుకుని దూరంగా గిరాటు పెట్టింది.
''అది కాదే. మనకు వెండి గిన్నె ఉంది కదా.. ఆ రెండు అందులో పెట్టి అప్పుడు ఇయ్యి'' అన్నాడు అహోబి లేశ్వరం.
మహంకాళమ్మ అలాగే చేసింది. ఈసారి మరింత దూరంగా గిరాటు పెట్టింది రూపలావణ్య. వాళ్ళిద్దరికీ ఎంత ఆలోచించినా లడ్డుబత్తాయి అంటే ఏమిటో తెలియడం లేదు. చాలా సేపు ప్రయత్నించి ప్రయత్నించి తలలు పట్టుకు కూర్చున్నారు వాళ్ళిద్దరూ. రూపలావణ్య మాత్రం లడ్డుబత్తాయి కావాలి అన్నమాట వదలకుండా చిన్నగా ఏడుపు లంకించు కుంది. ఏం చేయాలో అర్థంకాని అహోబిలేశ్వరం తన మొబైల్ తీసి ఆన్ చేశాడు. అవతల నుండి అతని పెదనాన్న ఫోను ఎత్తి మాట్లాడడం మొదలు పెట్టాడు.
''పెదనాన్నా! పెద్ద కష్టం వచ్చింది పెదనాన్నా. మీ మనవరాలు.. లడ్డుబత్తాయి కావాలంటుంది. ఎంత ఆలోచించినా అదేంటో మాకు అర్థం కావడంలేదు. నీకు తెలిస్తే చెప్పవా'' అన్నాడు ఏడుపు ముఖం పెట్టి అహోబిలేశ్వరం.
''అదేమిటిరా.. లడ్డుబత్తాయి.. అన్న పేరు ఎప్పుడూ ఎక్కడా వినలేదు. దానికి 30 ఏళ్లు నిండాయి కదా. అదేమన్నా చిన్న పిల్ల కాదు కదా. లడ్డుబత్తాయి, గిడ్డుబత్తాయి అన్నపదాలు నాకు ముందు ఏడుతరాల నుండి వినలేదు. అదేిoటో వివరంగా దాన్నే అడుగు చెబుతుంది. '' అన్నాడు అటు నుంచి పెదనాన్న పర మేశ్వరరావు.
''నీకు తెలియదు పెద్దనాన్న. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దానికి ఇప్పుడు 30 ఏళ్లు కాదు.. మూడవ ఏడు నడుస్తుంది. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి''' అమాయకంగా అన్నాడు అహో బిలేశ్వరం.
ఆ మాటలు విన్నాక.. ''హలో.. మాట్లాడేది మా మహాబలేశ్వరం గాడేనా. ఏరా నీకేమన్నా మదపిచ్చ ఎక్కిందా? లేకపోతే ఏమైనా మందేసుకున్నావా. , ?'' తల కంపరం ఎక్కి అడిగాడు పెదనాన్న.
''నీతో తర్వాత మాట్లాడతాను లే పెదనాన్నా, సెల్ పెట్టేయ్. '' అంటూ తను సెల్ ఆఫ్ చేశాడు అహో బిలేశ్వరం. వెంటనే తనకు బాగా పరిచయిస్తుడైన మహామేధావి, జ్ఞాని, సహస్రావధాని చింతామణి శాస్త్రి గారికి ఫోన్ చేశాడు.
''నమస్కారం శాస్త్రిగారు. నేను మీ శిష్యుడిని అహో బిలేశ్వరం ని. నాకు పెద్ద సమస్య వచ్చింది సార్. మీరే తీర్చాలి.. ఖాళీగానే ఉన్నారు కదా.. విషయం ఏమిటంటే మీ గ్రంథాలలో ఎక్కడన్నా.. లడ్డుబత్తాయి.. అన్న పేరు వచ్చిందా? దాని గురించి కొంచెం వివరంగా తెలిస్తే చెప్పండి '' వినయంగా అడిగాడు అహోబిలేశ్వరం. అటు నుంచి చింతామణి శాస్త్రిగారు ఆ పదం విని ఆశ్చర్యపడిపోయాడు.
''ఒరేయ్ అహోబిలేశ్వరం.. నేను చదివిన బహు గ్రంథాలలో ఎక్కడ ఏ పేజీలోనూ ఏ పేరాలోనూ ఏ లైనులోను నువ్వు చెప్పిన లడ్డుబత్తాయి అన్న పదం వినలేదురా. పోనీ లడ్డు మీద బత్తాయి నిలబెడదాం అంటే అలా కుదరదు. పోనీ బత్తాయి మీదే లడ్డు నిలబెడదాం అంటే అది కూడా కుదరదు. జారి పడుతుంది. ఎనీ హౌ అంటే ఏతావాతా చెప్పేది ఏమిటి అంటే.. నువ్వు చెప్పిన లడ్డుబత్తాయి అనే పదం మాత్రం వినడానికి చాలా బహుపసందుగా ఉంది రా. లడ్డు బత్తాయి అన్నమాట వింటేనే నోట్లోంచి లాలా జలం ఊరి క్రింద కారిపోతుంది. అంత మధురంగా ఉందిరా. దాని అర్థం నేను చెప్పలేను కానీ ఒకవేళ నీకు ఎప్పు డైనా మాత్రం తెలిసి ఉంటే నాకు కచ్చితంగా చెప్పు. లడ్డుబత్తాయి మీద నేను ఒక పెద్ద గ్రంథమే రాసేస్తాను. అంతేకాదు రాష్ట్రం మొత్తం తిరిగి పురాణ ప్రవచనాలు కూడా చెప్పి పడేస్తాను. '' అంటూ పెద్దగా నవ్వేశారు బహు బిరుదు గ్రహీత చింతామణిశాస్త్రి గారు.
అహోబిలేశ్వరం గుండెలో పెద్ద బండరాయి పడ్డట్టు అయిపోయింది. గదిలోకి వెళ్లి చూశాడు. తన కూతురు లడ్డుబత్తాయి కావాలంటూ ఇంకా మారం చేస్తూనే ఉంది. మూడేళ్ల పిల్ల లాంటిది కనుక నేల మీద పడి దొర్లేస్తుంది.
***
అదిగో అలా అలా రూపలావణ్య చిన్ననాటి కోరిక లతో, చిన్ని పిల్లమాదిరి అల్లరి చేష్టలతో సంవత్సరాది పండుగ వెళ్లిపోయి నెల రోజులు కూడా గడిచి పోయింది. అహోబిలేశ్వరం లడ్డుబత్తాయి గురించి ఇంకా విషయ సేకరణ చేస్తూనే ఉన్నాడు. ఆ మాట విన్న కొంతమంది నవ్వుతున్నారు. కొంత మంది చీవాట్లు పెడుతున్నారు. కొంతమంది పిచ్చివాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు అహోబిలేశ్వరాన్ని.
మొత్తానికి రూపలావణ్య భర్త భజరంగరావు వచ్చి తనతో పాటు ఆమెను బెంగళూరు తీసు కెళ్లిపోయే రోజు రానే వచ్చింది.
భర్త వచ్చాక భర్తతో మామూలుగానే మాట్లాడడం మొదలు పెట్టింది రూపలావణ్య. అది చూసి సంతో షించారు ఆమె తల్లిదండ్రులు.
మళ్లీ వెంటనే తల్లి దండ్రుల దగ్గరకు వచ్చిన రూప లావణ్య. '''నాకు రెండు ఇత్తడిబిందెల నిండా లడ్డుబత్తాయి రెడీ చేసి పెట్టండి. కూడా పట్టుకు వెళ్తాను. '' అన డంతో మళ్లీ వాళ్ళిద్దరూ తలలు గోక్కోవడం మొదలు పెట్టారు.
వాళ్ళిద్దరూ ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలో చించి కూతురు తన బెడ్రూమ్లో సూట్కేసు లో బట్టలు సదురుకుంటున్నప్పుడు.. అల్లుడుని మరో గదిలోకి రహస్యంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. జరిగిన విషయం అంతా చెప్పి అసలు ఆ లడ్డుబత్తాయి అంటే ఏమిటో కాస్త తెలిస్తే చెప్పమని బ్రతిమలాడారు.
భజరంగరావు అరగంటసేపు నవ్వేసుకున్నాడు. కాస్త తేరుకొని.. '' అత్తయ్యగారు, మామయ్య గారు.. నాకు కూడా ఒకసారీ ఇలాంటి సమస్య వచ్చింది. చెబుతా వినండి. ఒకరోజు ఆఫీసుకు నేను వెళుతున్నప్పుడు మీ ముద్దుల కూతురు నా బుగ్గ మీద గీరుతూ ''ఏవండీ మీరు వచ్చేటప్పుడు తెల్ల సువాసనలు పట్టుకు రండి. " అంది.
‘ఏమిటి’ అంటూ వివరంగా అడిగాను. మళ్లీ అలాగే.. '' తెల్ల సువాసనలు పట్టుకు రండి. '' అంది.
ఆఫీసులోనూ, ఫ్రెండ్ సర్కిల్లోను తెల్ల సువాసనలు అంటే ఏమిటి?.. అని అడిగాను. వాళ్ళందరూ నాకు మెంటల్ ఎక్కింది అనుకున్నారు. నేను వాట్లను పట్టుకుని వెళ్లకపోవడంతో మీ అమ్మాయి భోజనం మానేసింది. అలా రెండు మూడు రోజులు జరిగింది.
సరే.. నేను ఆఫీసుకు వెళ్లినప్పుడు ఆవిడ నాకు తెలియకుండా బాగా మెక్కి ఉంటుందేమో అన్న విషయం మాత్రం నాకు తెలియదు.
ఆ విషయం పక్కన పెడితే.. ఆ తర్వాత నేను కూడా రెండు రోజులు భోజనం మానేశాను. దాంతో మీ అమ్మాయి ఒక మెట్టు క్రిందకి దిగి నా దగ్గరకు వచ్చి.. ''ఏమండీ కంగారు పడ్డారా.. తెల్లసువాసనలు అంటే మల్లెపువ్వులు. '' అంది.
నాకు చిరాకెత్తి, చెర్రెత్తి.. ''మరి ఈ మాట మామూలు గా చెప్పొచ్చు కదా. '' ఉన్నాను.
దాంతో మీ అమ్మాయి ఏమన్నది అంటే.. '' పోదురూ బడాయి.. మరి మొగుడు పెళ్ళాలు సరదాలు ఎలా తీరతాయి. '' అంది. ఆ రకంగా తన సరదాలు తీర్చుకునే మనస్తత్వం అన్న మాట మీ అమ్మాయిది.
ఇంతకీ లడ్డుబత్తాయి అంటే మీ అమ్మాయి కి సారెగా ఇవ్వడానికి రెడీచేసి ఉంచారు కదా లడ్డుమిఠాయి.. అదే.. లడ్డుబత్తాయి.. అంటే. ''.. అంటూ మళ్ళీ పక పక నవ్వడం మొదలు పెట్టేసాడు.. అల్లుడు భజరంగరావు.
అల్లుడు చెప్పింది అంతా విన్న అహోబిలేశ్వరం.. మహంకాళమ్మ.. '' ఓస్ ఇంతేనా.. అమ్మయ్య'' అను కుంటూ ఊపిరి తీసి వదిలారు.
భర్తతో తిరుగు ప్రయాణానికి సిద్ధం అయన రూప లావణ్య.. తాను కూడా పట్టుకెళ్ళడం కోసం తన తల్లిదండ్రులు ఇంతకుముందే రెండు ఇత్తడి బిందెలు నిండా రెడీ చేసి ఉంచిన లడ్డుమిఠాయి మూతలు తీసి చూసుకొని.. పరమానందపడి పోయింది.
' అమ్మా, నాన్న.. లడ్డుబత్తాయి.. రెండు ఇత్తడి బిందెల నిండా చేయించారు. అమ్మో ఎంత బాగుందో. నేతి సువాసన గుమగుమలాడిపోతుంది. '' అంటూ తల్లి దండ్రులను ముద్దులతో ముంచేసింది.
అహోబిలేశ్వరం.. మహంకాళమ్మ దంపతులు గండం గట్టెక్కినందుకు కూతురుని వాళ్లు కూడా ముద్దులతో ముంచేశారు. అంతేనా తమ ఒక్కగా నొక్క ముద్దుల కూతురుకు తాము అందమైన, మనోహరమైన బాల్యం దూరం చేసినందుకు.. తమ తప్పు తెలుసుకుని లెంపలు వాయించుకుని ప్రతి సంవత్సరం ఇదే రకంగా బాల్యపు సరదాలు తీరుస్తామని కూతురు చేతిలో చేయి వేసి మాట కూడా ఇచ్చారు.
ఇంకేముంది.. అక్కడoతా ఆనందాలు.. సరదాలు..
******
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
అచ్చి బుచ్చి అప్పచ్చి: N. రాఘవేంద్ర రావు
భలే హాస్యం ... కొత్త కాన్సెప్ట్ ... కడుపుబ్బా నవ్వించింది.
పి.వి. పద్మావతి మధు నివ్రితి
"ఆచి బూచి అప్పచ్చి" కథలో నల్లబాటి రాఘవేంద్ర రావు కుటుంబ సంబంధాలు, సరదా, కులవద్దూ మధ్య యథార్థంగా ప్రస్తావించిన అనేక అంశాలు ఉన్నాయి. ఈ కథలో, రూపలావణ్య అనే యువతి తన చిన్నవయస్సులో ముద్దుగా జీవితం గడిపిన అనుభవాలను తన తల్లి, తండ్రి ముందు హాస్యంగా చెప్పుతుంది.
భజరంగరావు అనే ఆమె భర్త, ఈ సమయంలో కాఠిన్యంతో కూడిన బిజినెస్ మతమని అలవాటైన వ్యక్తి. రూపలావణ్య తన చిన్నప్పుడు చేయని పనులనూ ఆమె తల్లిదండ్రులతో పంచుకుంటూ, ఒక విచిత్రమైన సరదా ఏర్పడుతుంది.
అయితే, ఈ కథలో "లడ్డుబత్తాయి" అనే పదం, దానికున్న అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, వెన్నెల ప్రకంపనలు, హాస్యప్రధాన అంశాలు ఏ విధంగా కలిసిపోతాయో అనే అంశాన్ని తెస్తుంది.
ఈ కథను చదివినప్పుడు, బొమ్మలతో కూడిన ఊహలు, చిన్నపిల్లలకు చేసే అల్లరులు, కోరికలు ఎలా ప్రేక్షకులకు సరదాగా అనిపిస్తాయో అవి ప్రభావితం చేస్తాయి.