కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Adajanma Atabomma Kadu' Written By Venku Sanathani
రచన: వెంకు సనాతని
ఒక సమయంలో ప్రముఖ క్రికెటర్ ఆట తీరు మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. అందుకు బాధ పడలేదతను. విమర్శకులకు తన బాట్ తో, మెరుగ్గా ఆటతో సమాధానమిచ్చాడు. స్వాతికూడా అదే చేసింది. తనను వేధిస్తున్న బాస్ కు ఎలా బుద్ధి చెప్పిందో ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించిన ఈ కథ చదివితే తెలుస్తుంది.
తెల్లవారు జాము,సమయం 3 గంటల 30 నిమిషాలు అవుతుంది.ఊపిరి తీసుకోలేక ఉక్కిరబిక్కిరవుతుంది అనసూయ. ఛాతి బిగుసుకుపోవటంతో ప్రాణమందక విపరీతంగా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాయి. కదులుతున్న కాళ్ళు తగిలి నీళ్ళ దబరా కిందపడి శబ్దం రావటంతో ఉలిక్కిపడి లేస్తుంది స్వాతి.
"బామ్మా.." అంటూ గావు కేకపెట్టి పరుగుతీసి, పడిపోతున్న బామ్మను పట్టుకుని మంచంపై పడుకోబెడుతుంది. వెంటనే ఇన్హేలర్ అందుకుని బామ్మ నోటికి అందిస్తుంది. శక్తిని కూడదీసుకుని మందును లోపలికి పీల్చటం ద్వారా కొంత ఉపశమనం లభించటంతో బామ్మ ముఖంపై ఉన్న చెమటను తుడిచి, తలను నిమిరి వచ్చి తన మంచంపై కూర్చుంటుంది . తాను లేకపోతే ఏమైపోతుందోనని స్వాతి వైపు చూస్తున్న బామ్మకు, తనకు అన్నీ అయిన బామ్మ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణిస్తూ ఉండటంతో చెమ్మగిల్లిన కళ్ళతోనే తన నిస్సహాయతను బదులిస్తుంది స్వాతి.
*****
అనసూయ,స్వాతి ఇద్దరూ నాన్నమ్మ, మనుమరాళ్ళు. స్వాతి తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోవడంతో పెంచి పెద్ద చేసింది అనసూయ. కొద్ది సంవత్సరాల నుండి అనసూయ విపరీతమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుంది. వయసుతో పాటూ అది కూడా పెరుగుతూ వచ్చింది. తగిన ప్రాణవాయువు అందక అవయవాల పనితీరు కూడా మందగించే సరికి మంచానికే పరిమితం అయ్యింది. ఊరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో స్వాతికి ఉద్యోగం. వచ్చే ఆ కొద్దిపాటి జీతంతోనే ఇద్దరి జీవితాల్ని చక్కబెడుతుంది స్వాతి.
ఆ ఇద్దరికీ ఒకరికొకరు ఆడతోడు తప్ప ఏ మగ దిక్కూ లేదు. మగ దిక్కులేని బ్రతుకులంటే అప్పుడే మీసాలొచ్చిన కుర్రోళ్ళ నుండి ఎప్పుడో కూసాలు కదిలిన ముసలోళ్ళ దాకా అందరికీ అలుసే. అయినా ఈ ఆడవాళ్ళిద్దరూ నిప్పులాంటి వాళ్ళు. నికార్సైనోళ్ళు.
*****
బామ్మకు, స్వాతికి ఇది కొత్తేం కాదు. సమయంతో పని లేకుండా వీళ్ళ పేదరికాన్ని పలకరిస్తుంటుంది అనసూయ జబ్బు అజమాయిషీ చేస్తూ. పెద్దావిడ ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేదని, అందుకు తగిన ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని డాక్టర్లు ఎప్పుడో చెప్పారు.
బామ్మకు ఆపరేషన్ చేయించే స్తోమత లేక మందులతోనే సరిపెడుతుంది స్వాతి. మనుమరాలిని ఇబ్బంది పెట్టలేక ఆ మందులతోనే కాలం వెళ్ళదీస్తుంది అనసూయ.
బామ్మ నిద్రపోయిందని తెలిసి ఇంటి పనుల్లో పడుతుంది స్వాతి. ఇంటిని చక్కబెట్టి, బామ్మకు తగిన సపర్యలు చేసి,మధ్యాహ్న భోజనాన్ని బామ్మ మంచానికి దగ్గరగా పెట్టి “వెళ్ళొస్తాను” అంటూ బామ్మ తలను సున్నితంగా తాకి చెప్తుంది స్వాతి. కళ్ళతోనే సమాధానం ఇస్తుంది అనసూయ. టేబుల్ మీదున్న హ్యాండ్ బ్యాగ్, లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసుకు బయలుదేరుతుంది స్వాతి.
*****
బస్సులో ఆలోచనంతా బామ్మ గురించే. నడక దారిలో కూడా. ఆ ఆలోచనలోపడి తెలియకుండానే ఆఫీసును సమీపిస్తుంది స్వాతి. రెండవ అంతస్తులో ఉన్న ఆఫీసుని చూసి కొద్దిపాటి నిట్టూర్పుతో ముందుకు నడుస్తుంది. మెట్ల ద్వారా స్వాతి రాకను గమనించిన మేనేజర్ మూర్తి రూపంలో మరొక సమస్య స్వాతికి ఎదురెళ్తుంది. ద్వారానికి అడ్డుగా నిలబడి నీచంగా ప్రవర్తించిన మేనేజర్ ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపలేని నిస్సహాయతతో తన క్యాబిన్ వద్దకు చేరి రెండు చేతుల్తో తల పట్టుకుని కూర్చుంటుంది.
సాంఘిక సాధింపులతో మొదలుకుని లైంగిక వేదింపులతో మెదలుతున్న నవ సమాజపు నరరూప రాక్షసుల చేతిలో అసువులుబాస్తున్న అబలల తలంపుతో కన్నీళ్ళు పెట్టుకున్నాయి స్వాతి కళ్ళు. “ఆడదానిగా పుడితే ఇంటా అన్నింటా సమస్యలే కదా..!” అని అనుకుంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుని కంప్యూటర్ ఆన్ చేస్తుంది.
*****
తనకు లొంగటం లేదన్న కోపంతో గత కొద్ది రోజులగా స్వాతిపై పని ఒత్తిడి పెంచి పైశాచికానందం పొందుతున్నాడు మేనేజర్ మూర్తి. ఎంత వేదించినా స్వాతిని సాధించలేకపోతున్నానన్న దురాలోచన కలిగిన దూరాలోచనతో స్వాతిని తన క్యాబిన్ కి పిలిచి ఎప్పటి నుండో పెండిగ్లో ఉన్న ఫైల్ ఒకటి బీరువాలో నుండి తీసి స్వాతి చేతిలో పెడతాడు మూర్తి.
"స్వాతి.. ఈ వర్క్ ఈ రోజు పూర్తవ్వాలి. చాలా అర్జెంట్." హుకుం జారీ చేస్తాడు మూర్తి. స్వాతికి తెలుసు ఒక్క రోజులో అయ్యే పని కాదని. అది మేనేజర్ మూర్తి నిజస్వరూపానికి నిలువుటద్దమని భావించి ఇంతకన్నా ఏం చేయగలడని మూర్తిని అసహ్యించుకుంటూ అక్కడ నుండి కదులుతుంది.
ఇంత హింస భరించే బదులు వేరే ఉద్యోగం చూసుకోవచ్చుగా అన్న ఆలోచనకి “ఆడది అడుగు పెడితే చాలు అడుగడుగునా అడ్డు తగిలే మృగాళ్లున్న సమాజంలో ఎక్కడైనా ఇదే కదా ఆడదాని కథ” అంటూ తనకు తానే సమాధానం చెప్పుకుని, ఆఫీసు పనిని తన మానానికి ముడిపెట్టిన మేనేజర్ నీచ బుద్ధికి బుద్ధి చెప్పాలని ఫైల్ తెరిచి పనిలో పడుతుంది స్వాతి. మధ్యాహ్నం భోజనం సంగతి పక్కన పెట్టి మరీ పని పూర్తి చేసే సరికి రాత్రి తొమ్మిదవుతుంది. పూర్తయిన ఫైల్ తీసుకుని వెళ్ళి మేనేజర్ టేబుల్ మీద పెడుతుంది.
ఆ ఫైల్ ఒక్క రోజులో పూర్తి కాదని, చెప్పిన పని పూర్తి చేయలేని స్వాతిని మరింతగా ఇబ్బంది పెట్టాలని, ఆ వంకతో ఎలాగైనా లొంగదీసుకోవాలని ఒంటరి ఊహల్లో తేలిపోతున్న మేనేజర్ మూర్తి ఫైల్ చూడగానే ఆశ్చర్యపోతాడు. “పూర్తయిందా అన్నట్లుగా..!!” స్వాతి వైపు చూస్తాడు.
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం స్వాతి ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడేసరికి తలకొట్టినట్టవుతుంది మూర్తికి. తానెంత తప్పు చేశాడో అర్థమవుతుంది. "క్షమించు స్వాతి" అంటూ పశ్చాత్తాపతో తలదించుకుంటాడు మూర్తి. “ఆడజన్మ ఆటబొమ్మ కాదని, స్త్రీ తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని, ఆడతనంలో అమ్మగుణాన్ని చూడాలని” హితవు పలికి ఆఫీసు గడప దాటుతుంది స్వాతి.
**శుభమ్**
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
పేరు : వెంకు సనాతని
అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత
ఊరు : బాపట్ల
జిల్లా : గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
DP telugu tv • 1 day ago
కథ చాలా బాగుంది చక్కటి కథ 👌👏