ఆడపిల్ల
- Karanam Lakshmi Sailaja
- Feb 13, 2023
- 10 min read

'Adapilla' New Telugu Story
Written By K. Lakshmi Sailaja
రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ
వాకిట్లో ఉన్న నందివర్ధనం చెట్టు నిండుగా విరగబూసి వుంది. ఆ చెట్టు మొదట్లో ఉన్న అరుగు మీద కూర్చొని రామలక్ష్మణులిద్దరూ వారి చేతిలో ఉన్న శనగపిండి తో చేసిన కారం చుట్టలను చిన్నగా నములుతున్నారు. వరండాలో వాలు కుర్చీలో కూర్చొని వారిని ముచ్చటగా చూస్తున్నాడు మాధవ శర్మ. ఇద్దరూ పది సంవత్సరాల లోపు పిల్లలు. చక్కగా చదువుకుంటూ వున్నారు. రేపు సంవత్సరం ఇద్దరినీ కర్నూల్ లో కాన్వెంట్ కు పంపించడానికి ఏర్పాట్లు చెయ్యాలి, అనుకుంటూ ఆలోచన చేస్తున్నాడతను.
ఇంతలో లోపల్నుంచి ఆ పిల్లల అమ్మమ్మ రాధమ్మ వచ్చింది. వరండాలో ఆరబెట్టిన మామిడి వొరుగులను చేత్తో చక్కగా నెరుపుతూ అల్లుడి వైపు తిరిగి ఇలా అంది.
“నాయనా దేవమ్మకు ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. మందులు సరిగా పనిచేస్తున్నట్లుగా లేదు. కానుపు ఇబ్బందువుతుందేమో?”
ఆ మాటలకు ఈ లోకం లో కొచ్చాడు, మాధవశర్మ. ఆమెకు దేవమ్మ ఒక్కతే కూతురు. అందుకని దేవమ్మకు మూడవ గర్భం వచ్చినప్పటి నుంచీ ఇద్దరు మగపిల్లలను, దేవమ్మను చూసుకుంటూ వీళ్ళదగ్గరే వుంది. దేవమ్మకు ఇప్పుడు తొమ్మిదో నెల గర్భం జరుగుతోంది. కానీ గర్భం వచ్చినప్పటినుంచీ దేవమ్మ ఆరోగ్యం అంత కుదురుగా లేదు. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదు.
“రేపు మళ్ళీ కర్నూల్లో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చూపిద్దాం అత్తయ్యాగారూ, ” అన్నాడు మాధవశర్మ లేస్తూ.
కానీ అంత అవసరం లేకుండానే దేవమ్మకు అర్దరాత్రి నొప్పులు వచ్చి, ఆడపిల్లకు జన్మనిచ్చి ఆమె పై లోకాలకు వెళ్ళిపోయింది. ఇద్దరు చిన్నమగపిల్లలతో పాటు, ఇంకొక పసికూన కూడా చేరింది, మాధవశర్మ వంటరి జీవితానికి. ముగ్గురు పిల్లల్తో రాధమ్మ అవస్థ పడటం చూస్తుంటే ఉర్లో వాళ్ళందరూ ఆమె మీద జాలి పడేవాళ్ళు. మాధవశర్మకు ముప్పయి సంవత్సరాలు కూడా నిండలేదు. మరో పెళ్ళి చేసుకొమ్మని ఎంతమంది చెప్పినా మాధవశర్మ ఇష్టపడలేదు.
మగపిల్లలిద్దరినీ కాన్వెంట్ లో చదువుకోవడానికి అగ్రహారం నుండి రోజూ గుర్రం బండిలో కర్నూల్ కు పంపిస్తూ వచ్చారు. ఒక సంవత్సరం నెమ్మదిగా గడిచింది. రోజులు నిండి, నెలలు గడిచేటప్పటికీ, చిన్నపాప మామూలుగా లేదనీ, మాటలు రావనీ, మతిస్థిమితం కూడా లేదనీ అర్ధమయ్యింది. మాధవ శర్మ కుప్పకూలిపొయ్యాడు. పిల్లను చూసినప్పుడల్లా రాధమ్మ గుండెలవిసేలా రోజూ ఏడుస్తూనే ఉంది. అసలే తల్లి లేదు. పైన అవకరాలు తోడయ్యాయి.
ఊర్లోనే ఉంటే పాపకు వైద్యంచేయించడం కష్టం. అలాంటప్పుడు ఇంకా అగ్రహారం లో ఉండటం వద్దని, మేనమామ సలహాతో పాతికెకరాల మాగాణి, యాభై ఎకరాల మెట్ట పొలం, ఊర్లో ఉన్న నాలుగు పెద్ద ఇండ్లు, మూడు పంటకళ్ళాలు అన్నీ వచ్చిన రేట్ కు అమ్మేసి, ముగ్గురు పిల్లలను, అత్తగారిని తీసికొని, హైదరాబాద్ చేరిపోయాడు. అక్కడ వాళ్ళ మేనమామ చూపించిన ఒక వ్యాపారవేత్త దగ్గర తను చదివిన పి. యు. సి. చదువుకు సరిపోయేట్టుగా అసిస్టెంట్ గా చేరాడు.
మేనమామ ఇంటి దగ్గర ఒక పెద్ద ప్లాట్ తీసుకొని అందులో వరుసగా మూడు ఇండ్లు కట్టాడు. ఒక దాన్లో తాముండి, మిగతా రెండు ఇండ్లు బాడుగకు ఇచ్చారు. హైదరాబాద్ చేరినప్పటినుండి అమ్మాయిని ఎంతో మంది డాక్టర్స్ కు చూపించాడు. అయినా ఏమీ లాభం లేక పోయింది. పాప చూస్తే రత్నం లాగుందని, రాధమ్మ ‘రత్నమ్మ’ అని పేరు పెట్టుకుంది. కానీ ‘బే, బే’ అని తప్ప వేరే మాటలు రాలేదు. ఒక కాలు ఎత్తి నడుస్తూవుండేది. ఎప్పుడూ ఏడుస్తూ, అన్నీ విసిరేస్తూ, అందరినీ కొరుకుతూ ఉండేది.
ఏ స్కూల్ లోనూ పాపను చేర్చుకోలేదు. అనాధలాగా హాస్టల్ లో వదిలెయ్యడం మాధవ శర్మకు ఇష్టం లేదు. ఇంటికి ఒక టీచర్ ను పిలిపిస్తే, రత్నమ్మను చూడడమామెకు సాధ్యం కాలేదు. ఇంక లాభం లేదని చదువు విషయం పక్కన పెట్టేశారు. రత్నమ్మను ఎక్కడికీ పంపకుండా ఇంట్లోనే ఉంచారు. చదువు అనే ప్రసక్తి లేకపోయింది. అందుకని పాపను ఇరవైనాలుగు గంటలూ రాధమ్మ అంటిపెట్టుకొని వుంటూ ఉండేది. రాధమ్మ వయసు పెరుగుతున్నందున, పాపకు అవసరాలు పెరుగుతున్నాయని ఇంట్లో వంటావిడను పెట్టాడు, మాధవశర్మ. పని పిల్ల ఎలాగూ వుంది. దాంతో రాధమ్మకు ఇంట్లో శ్రమ తగ్గి, పాపను చూసుకోవడానికి సమయం దొరికింది.
మగపిల్లలిద్దరిలో పెద్దవాడు శీనయ్య బాగా చదువుకుంటున్నాడు. చిన్న వాడు గోపయ్య చదువులో కొంచెం వెనుకగా ఉండేవాడు. మాధవశర్మ ఆడపిల్ల గురించి దిగులు పడుతూ ఉండేవాడు. రత్నమ్మకు నెమ్మదిగా మాటలు చెపుతూ, కథలు చెపుతూ కోపం తగ్గించడానికి ప్రయతిస్తూ ఉండేది, రాధమ్మ. ఆమె చెప్పినంత సేపూ రత్నమ్మ మౌనంగా ఉండేది. తరువాత మళ్ళీ మామూలే.
శీనయ్య బ్యాంకు ఉద్యోగం సంపాదించాడు. అందరూ సంతోషించారు. ఒక రెండు నెలల తరువాత తన బ్యాంకు లో పని చేసే వరమ్మను ప్రేమించాను, పెళ్ళి చేసుకుంటానంటే సరేనని పెళ్ళిచేశాడు మాధవ శర్మ. కోడలు ఉద్యోగం చేసి వచ్చి ఇంట్లో ఉండే రత్నమ్మను ఎలా చూసుకుంటుంది? అని అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళిష్టపడి చేసుకుంటామన్నప్పుడు, చెల్లి బాధ్యతను తాను గుర్తు చెయ్యడమెందుకని ఆగిపోయాడు, మాధవశర్మ..
వరమ్మ అందరితో బాగానే మాట్లాడుతూ ఉండేది కానీ, ఎక్కువగా బాధ్యతగా ఉండేది కాదు. తన పని ఎంతో అంత వరకే చేసుకుంటూ ఉండేది. రాధమ్మ ఏదైనా పని చెప్తే చేసేది. పన్నెండు సంవత్సరాల రత్నమ్మను దూరం నుంచి చూస్తూ ఉండేది తప్ప, చొరవగా రత్నమ్మకు ఏమీ చేసేది కాదు. అందులోనూ ఉద్యోగానికి వెళ్తుంది. ఇంట్లోవుండే టైం తక్కువ. అందువల్ల రాధమ్మ కుడా వరమ్మను ప్రతేకంగా ఏమీ అనేది కాదు. ఇప్పుడు రత్నమ్మ కూడా ఎప్పుడో తప్ప …. ఎవరినీ ఎక్కువగా అరవడం, కొట్టడం చెయ్యడం లేదు. పిచ్చి చూపులు చూడటం లేదు.
ఇంకో రెండు సంవత్సరాలకు గోపయ్య ఒక కంపెనీ లో చిన్న ఉద్యోగం లో చేరాడు. అతని చదువుకు అంతకంటే పెద్ద ఉద్యోగం రాలేదు. పెళ్ళి సంబంధాలు చూడబోతే పెద్దసంబంధాలేవీ రాలేదు. నాలుగవ తరగతి చదివిన అమ్మాయి సంబంధం వస్తే, సరేలే ఈ కోడలైనా రత్నమ్మను చూసుకుంటుంది అని గోపయ్యకు ఆ సంబంధం చేశారు. రత్నమ్మ కంటే నాలుగు సంవత్సరాలు పెద్దయిన చిన్న కోడలు సత్యమ్మ, రత్నమ్మతో ఇలా బట్టలు వేసుకో, ఇలా తిను అని చెప్తుంటే, రత్నమ్మ చేస్తుండేది. అంతే తప్ప సత్యమ్మ కుడా రత్నమ్మ పట్ల ప్రతేకంగా అభిమానంగా ఏమీ ఉండేది కాదు.
ఇద్దరు కొడుకులూ ఇంటి ఖర్చులకు మాధవశర్మకు డబ్బు ఇచ్చేవాళ్ళు. సరే వాళ్ళకూ బాధ్యత తెలుస్తుందని ఆ డబ్బులు తీసుకునే వాడు మాధవశర్మ. రత్నమ్మను ఇద్దరు అన్నదమ్ములూ ముద్దుగానే చూసేవాళ్ళు. అందువల్ల కోడళ్ళిద్దరూ రత్నమ్మ ను ఏమీ విసుక్కునే వాళ్ళు కాదు.
ఒక నాలుగు సంవత్సరాలు గడిచేటప్పటికీ ఇద్దరు కొడుకులకూ ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దకొడుక్కు ఇద్దరు మగపిల్లలు, చిన్న కొడుక్కు ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లవాడు కలిగారు. అంత వరకూ అందరూ కలిసే ఉన్నారు. రాధమ్మ అందరినీ సమానంగా చూసుకుంటూ, సలహాలిస్తూ సంసారాన్ని నడుపుకుంటూ ఉండేది. మాధవ శర్మ ఉదయం వెళితే, రాత్రి వస్తాడు.
శీనయ్య, వరమ్మ ఇద్దరూ ఉద్యోగస్తులు కనుక వాళ్ళ పిల్లలు కాన్వెంట్ లో చదివే వాళ్ళు. గోపయ్య కు చదువు తక్కువ. ఉద్యోగం చిన్నది. జీతం తక్కువ. అందువల్ల వీళ్ళ పిల్లలు చిన్న స్కూల్ లోనే చదివేవాళ్ళు. మామగారి సంపాదనతో పై ఖర్చులు జరుగుతున్నాయి అనే విషయం కూడా సత్యమ్మ గ్రహించుకుంది, కాబట్టి రాధమ్మ తో కూడా వినయంగా ప్రవర్తించేది.
చిన్న పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి, అందరికీ ఇల్లు ఇరుగ్గా అనిపించింది. పెద్ద కొడుకు, కోడలు ఇంట్లోకి మంచి ఫర్నిచర్ కొనుక్కుందామంటే సరిపోదే, ఎలాగా అనుకుంటూ ఉన్నారు. అది గమనించిన మాధవశర్మ ఉన్న మూడిళ్ళల్లో ఒక ఇంట్లో పెద్దకొడుకు కోడలిని, ఉండమన్నారు. ఒక ఇల్లు మాత్రమే బాడుగకు ఇచ్చారు.
కొద్దిరోజులకు వాళ్ళకు ఇల్లు ఇచ్చినందుకు చిన్న కోడలు కొంచెం అసహనంగా ఉన్నట్లు గమనించి, వాళ్ళను కూడా మూడో ఇంట్లో ఉండమన్నాడు మాధవ శర్మ. సత్యమ్మ సంతోషంగా వెళ్ళింది. ఆ ఇంట్లో ఒక రూము బాడుగకు ఇచ్చి, మిగతారూములల్లో సత్యమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. అసలా ఆలోచనతోనే సత్యమ్మ వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళారు. అందరూ కలిసి ఉన్నా నెలనెలా ఇంటి ఖర్చుకు మామగారికిడబ్బులు ఇస్తూనే వున్నారు కనుక విడిగా వున్నా ఒకటే కదా అనుకుంది, సత్యమ్మ. పెద్దకొడుకు, కోడలు మంచి బట్టలు వేసుకోవడం, కొంచెం దర్జాగా వుండటం ఆమెకు కొంచెం కసిగానే అనిపించేది. కానీ ఏమీ చెయ్యలేక మనసులోనే వాళ్ళమీద అసూయ పడుతూ ఉండేది. ఇప్పుడు నెలనెలా ఒక రూము బాడుగ డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి. కనుక కొంచెం తృప్తిగానే ఉంది, సత్యమ్మ.
కొడుకులూ, కోడళ్ళు అందరూ సంతోషంగా వున్నారు. కానీ రాధమ్మ, మాధవ శర్మ మాత్రం రత్నమ్మ తో మిగిలిపోయారు. ఇంట్లో వంటవాళ్ళు, పని వాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళిద్దరూ రత్నమ్మ ను చూస్తూ దిగులు పడ్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల తో పసుపు కుంకుమలు తీసుకుంటూ కళకళ లాడవలసిన పిల్ల జీవితం ఇలా ఉండటం చూస్తుంటే వాళ్ళకు కడుపులోనుంచి దుఃఖం వస్తూ ఉంటుంది. చెల్లెలి మంచి చెడ్డలు చూద్దామని అన్నలకు ఉన్నా, భార్యలు ఎంతవరకు చేస్తారో అని వాళ్ళకూ బాధగానే వుంది. తమ తరువాత ఈ పిల్లను ఎవరు చూస్త్తారు అని అత్తా, అల్లుళ్ళు మధన పడుతున్నారు.
రత్నమ్మకు పాతిక సంవత్సరాలు వచ్చాయి. తింటుంది తిరుగుతుంది. అంతే. ఇప్పుడిప్పుడే తన బట్టలు మడత వేసి బీరువాలో పెట్టుకుంటూ ఉంది. ఏదైనా పని చెప్తే చేస్తుంది, గానీ నైపుణ్యాన్గా రాదు. ఆ గిన్నె ఇవ్వు అంటే ఇస్తుంది, ఈ గిన్నె అక్కడ పెట్టు అంటే పెడుతుంది అంతే. పొయ్యిదగ్గరికి పొయ్యే పని అసలు రాదు. స్నానం చేస్తుంది, జడ వేసుకుంటుంది. తనకిష్టం లేని పని ఎవరైనా చెయ్యమంటే మాత్రం కోపం వచ్చేస్తుంది.
ఒకరెండు సంవత్సరాలు గడిచేటప్పటికి రాధమ్మ దైవసాన్నిధ్యం పొందింది. దాంతో ఇంట్లో ఆడతోడు లేకుండా పోయింది, రత్నమ్మకు. తనకూ వయస్సై పోయినందుననూ, ఇంట్లో రత్నమ్మ ఒంటరిదైపోతుందని కూడా మాధవశర్మ ఇక ఉద్యోగం మానివేశాడు. వంటావిడ చేసిస్తే, ప్లేట్ లో పెట్టుకొని తింటుంది రత్నమ్మ. కాంపౌండ్ లో ఉన్న ఇద్దరు అన్నల ఇళ్ళకు కాసేపు వెళ్తుంది. వాళ్ళ పిల్లలను చూస్తూ ఉంటుంది. అన్నలు ఏదో ఒక పండో ఫలమో తెచ్చి ఇస్తారు, ముచ్చటగా. దానికే సంతోషపడి పోతుంది.
ఒకరోజు గోపయ్య సైకిల్ తొక్కుతూ ఇంటికి వస్తూ వుండగా, ఆటో ఒకటి గుద్దేసి వెళ్ళిపోయింది. ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు. డిస్చార్జ్ చేసేటప్పటికి, గోపయ్యకు ఎడమ కాలు లోపల నరాలు పని చెయ్యకుండా అయిపోయాయి. నడటం కష్టమయ్యింది. ఒక్కో అడుగూ వేసుకుంటూ నడుస్తున్నాడు. చేతికి కర్ర ఒకటి ఆధారమయ్యింది. ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. ఇ. ఎస్. ఐ. ద్వారా నెలనెలా కొంచెం డబ్బు ఏర్పాటు జరిగింది. పని చేసే కంపెనీ వాళ్ళు కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు బ్యాంకు లో డిపాజిట్ చేశారు. వాళ్ళు ఉంటున్న ఇల్లు మిగతా భాగం కూడా ఎక్కువ బాడుగకు ఇచ్చారు. పక్క వీధిలో తక్కువ బాడుగకు చిన్న ఇల్లు తీసుకొని వున్నారు.
గోపయ్య పిల్లలు కూడా పెద్ద చదువులు చదవలేదు. కొడుకు కూడా చిన్న చదువే చదివి చిన్న ఉద్యోగమే తెచ్చుకున్నాడు. అందుకని వాళ్ళ ఆడపిల్లకు కూడా మాధవశర్మ పెళ్ళి ఖర్చులు తనే పెట్టుకొని, చిన్నవయసులోనే పెళ్ళిచేశారు.
అయితే పెద్దకొడుకు శీనయ్య పిల్లలు ఇద్దరూ ఇంజనీరింగ్ చదివి ఒకరు కెనడాలోనూ, ఒకరు ఫ్రాన్స్ లోనూ ఉద్యోగాలలో ఉన్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఇంటికి కొంత డబ్బు కూడా పంపిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా మంచి పొజిషన్ లో కొచ్చారు. ఇక్కడి ఇల్లు బాడుగకు ఇచ్చారు. హైద్రాబాద్ లో ఇంకో మూడు ఇండ్లు కొని, ఒక ఇంట్లో వాళ్ళు ఉండి, మిగతా రెండు ఇండ్లు బాడుగకు ఇచ్చారు.
మాధవశర్మకు ఆరోగ్యం క్షీణీస్తోంది. రత్నమ్మ బాధ్యత ను కొడుకులకు అప్పగించాల్సిన సమయమొచ్చిందనిపించింది. ఒకరోజు ఇద్దరు కొడుకులనూ, ఇద్దరు కోడళ్ళనూ పిలిచి సమావేశ పరిచాడు.
“శీనయ్యా, నా పరిస్థితి బాగుండటం లేదు. నేను పోతే చెల్లెల్ని మీ ఇద్దరిలో ఎవరు చూస్తారు?” అంటున్న మాధవ శర్మ మాటలకు అడ్డం వస్తూ “అదేం మాటలు నాన్నా?” అన్నాడు, శీనయ్య బాధగా.
“ఇందులో ఇబ్బంది పడేదేం లేదు. నా వయసు, ఆరోగ్యం చూసుకోవాలి కదా!” అన్నాడాయన. మళ్ళీ ఇలా అన్నాడు, ” నా తరువాత రత్నమ్మను తోడబుట్టిన వాళ్ళు మీరే చూసుకోవాలి. ”
ఆయన మాటలకు వరమ్మ, శీనయ్యలు ‘ మాకు ఉద్యోగాలు ఉన్నాయి కదా? మేమెట్లా చూడగలం?’ అనుకుంటూ ఉన్నారు. గోపయ్య, సత్యమ్మలు ‘మా దగ్గర ఏముంది రత్నమ్మకు పెట్టడానికి’ అనుకున్నారు.
ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. కొద్దిసేపు తరువాత పెద్ద కొడుకును చూస్తూ, “మీరు రిటైర్ అయిన తరువాత మీ ఇంట్లో చూసుకుంటారా? “అన్నారు.
“మేము రిటైర్ అయిన తరువాత కెనడాకు కొద్దిరోజులూ, ఫ్రాన్స్ కు కొద్దిరోజులూ వెళదామనుకుంటున్నాము మామయ్యగారూ, ”అంది పెద్దకోడలు వరమ్మ. శీనయ్య ఏమీ చెప్పలేకపోతున్నాడు. చెల్లెలంటే ఇష్టముంది. కానీ ఆడపిల్ల అవసరానికి తనేం చెయ్యగలడు? వరమ్మే చెయ్యాలి. ఆమెను తన చెల్లెలికి చెయ్యమని తను బలవంతం చెయ్యలేడు కదా.
ఇక చిన్న కొడుకు ఏం చెప్తాడని ఆయనేం ఎదురు చూడలేదు. వాళ్ళ పరిస్థితి ఆయనకు తెలుసు. కానీ ఆయనకు తెలియందేమంటే సత్యమ్మ ఇదంతా ముందుగానే ఊహించిందనీ, ఆయన దగ్గరున్న డబ్బు, వాళ్ళు ఉంటున్న ఇల్లు తమకే ఇస్తే బాగుంటుందని మనసులో ప్లాన్ చేకుంటూ ఉందని.
ఆయన నిట్టూర్చి, వరమ్మ చెప్పింది ముందుగానే ఊహించిందే అనుకొని, “గోపయ్యా, నీసంగతేంటి?” అన్నాడు.
“ నాన్నా, నేనేం చెప్పేది?” అన్నాడు దీనంగా.
“నాకు తెలుసు. నా తరువాత ఈ ఇల్లు మీకు చెందేట్టుగా ఇప్పుడే వ్రాస్తాను. రత్నమ్మ ఉన్నన్ని రోజులూ ఆమె ఖర్చుకు గానూ కొంత డబ్బు నా తరువాత మీకు చెందేట్టు వ్రాస్తాను. రత్నమ్మను నా తరువాత మీరు, మీ తరువాత మీ కొడుకు చూస్తామని వ్రాసిస్తే రేపే పేపర్లు అన్నీ రెడీ చేస్తాను, ” అన్నాడు.
ఆ మాటలకు సత్యమ్మ, చాలా సంతోషించింది. సత్యమ్మ సంతోషం చూసి శీనయ్య, గోపయ్య కూడా సంతోషించారు, రత్నమ్మను సత్యమ్మ చూసేందుకు ఇష్టపడటంతో. వరమ్మ ఆ డబ్బుకు ఆశ పడలేదు. కాబట్టి ఏమీ అనుకోలేదు. తెల్లవారే అన్ని ఏర్పాట్లుపూర్తయ్యాయి.
రత్నమ్మకు కుడా నలభై సంవత్సరాలు వచ్చాయి. తింటుందీ, తిరుగుతుందీ. ఎవరినీ ఎక్కువగా అరవడం, కొట్టడం చెయ్యలేదు. సత్యమ్మ చాలా సంతోషంగా ఇంటికెళ్ళి దేవునికి నమస్కారం పెట్టుకుంది. ఇంట్లో దేవుని మండపం ఉంది. కానీ గోపయ్యగానీ, సత్యమ్మ గానీ ఎవరూ ప్రతి రోజూ దీపారాధన చేసేవాళ్ళు కాదు. మాధవశర్మ ఇంట్లో వంటావిడ వచ్చి దీపారాధన చేసేది. అందువల్ల ఆ అలవాటు కొడుకులకు, కోడళ్ళకు రాలేదు. కానీ ఇప్పుడు సత్యమ్మ మాటలు కొత్తగా వున్నాయి.
“ భగవంతుని దయ ఉంటే గానీ మనకు ఇంత డబ్బు, ఇల్లు మనకు వచ్చేది కాదు. రత్నమ్మ మన దగ్గరుంటే నాకేమీ ఇబ్బంది లేదు, ” అంటూ గోపయ్యతో మంచిగా మాట్లాడుతూ రోజూ దేవునికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేది.
ఒక రెండు నెలలు గడిచే సరికి మాధవశర్మ భగవంతుని దగ్గరకు వెళ్ళారు. రత్నమ్మను చిన్న ఇల్లయినా వాళ్ళింటికి తీసుకెళ్ళారు గోపయ్య, సత్యమ్మలు. రత్నమ్మ, మాధవశర్మలు ఉన్న ఇంటిని బాడుగకు ఇచ్చారు. ఆడబ్బుకాక బ్యాంకు లో డిపాజిట్ల మీది డబ్బు కూడా వీళ్ళు బ్యాంకు లోనే ఉంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు సంసారం బాగా జరుగుతోంది.
కొడుకు వంశీకి పెళ్ళి చేద్దామంటే చిన్న వుద్యోగం కనుక అందమైన, చదువుకున్న అమ్మాయిలెవరూ ముందుకు రాలేదు. మామూలు చదువుకున్న అమ్మాయితోనే పెళ్ళి చేశారు. కోడలేమీ ఉద్యోగం చెయ్యడం లేదు. అందువల్ల ఇంటిఖర్చులకు వంశీ జీతమొక్కటే వంశీకి ఆధారమయ్యింది. కానీ కోడలు మాత్రం మామగారికి పెన్షన్ వస్తోంది, రెండిండ్ల బాడుగలొస్తున్నాయి కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టమనేది. సత్యమ్మకు ఈ మాటలు కష్టమనిపించి, వాళ్ళను విడిగా ఉండమంది. మాకు జీతం డబ్బులు సరిపోవు అంటే, రత్నమ్మ ఉన్న ఇంటికి బాడుగను వాళ్ళను తీసుకోమన్నాడు గోపయ్య, ఆ మాట సత్యమ్మకు ఇష్టం లేకపోయినా. దాంతో వాళ్ళు వేరే చిన్న ఇంట్లో చేరిపోయ్యారు.
అలా ఒక ఐదారు సంవత్సరాలు గడిచాయి. మొదట్లో ఉన్నంత హుషారుగా రత్నమ్మ ఉండటం లేదు. ఈ మధ్య చేతిలో ఉన్నవి కిందపడేసుకుంటోంది. అన్నం ప్లేటులో అన్నం కిందంతా పడేస్తోంది. గ్లాస్ తో ఉన్న నీళ్ళు కింద పడేస్తోంది. నడుస్తూ నడుస్తూ కిందపడిపోతోంది. సత్యమ్మ ఎంత అరుస్తున్నా వినిపించుకునేది కాదు. సత్యమ్మకు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుండేది.
సత్యమ్మ ఇంట్లో దీపారాధన, పూజ చేసుకోవడానికి ఎక్కువ టైం కేటాయిస్తూవుండేది. గోపయ్య ఏమైనా అనబోతే, ‘ఈ పూజ చేస్తున్నాము కాబట్టే మనకు ఇంత డబ్బు వచ్చింది’, అనేది. అందుకని గోపయ్య కూడా ఎంతో కొంత రత్నమ్మకు చెప్తుండేవాడు. కానీ రత్నమ్మ వినిపించుకునేది కాదు. సత్యమ్మకు కోపం రాకుండా ఉంటుందని గోపయ్య ఇంటిపనిలో సహాయం చేస్తుండేవాడు. కూరలు తరగడం, కాఫీ పెట్టడం అన్నీ చేసేవాడు.
రానురానూ రత్నమ్మ నడవడం కూడా గోడలు పట్టుకొని నడుస్తూ వుంది. ఎందుకిలా చేస్తోందని గోపయ్యకు డౌట్ వచ్చి రత్నమ్మను సత్యమ్మ తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుకెళ్ళి డాక్టర్ కు చూపించారు. కళ్ళు టెస్ట్ చేసి కళ్ళద్దాలు ఇచ్చారు. దాంతో కొంత సమస్య తీరింది. అయినా ఇంతకు ముందు లాగా రత్నమ్మ పళ్ళు తోముకోవడం, స్నానం చెయ్యడం చేసుకోవడం లేదు. రత్నమ్మ దగ్గరుంటేనే పళ్ళు తోముతోంది. అలాచెయ్యి, ఇలాచెయ్యి అంటేనే స్నానం చేస్తోంది. చెప్తేనే బట్టలు వేసుకుంటోంది.
ఇలా రత్నమ్మ విసిగిస్తూవుంటే సత్యమ్మ కు కోపం ఎక్కువవుతోంది. ఇంతకుముందు తనపనులు తాను చేసుకుంది. ఇప్పుడు సత్యమ్మ చెప్పడం కాదు అరిచి చెప్తున్నా రత్నమ్మ చెయ్యడం లేదు. అన్నం కుడా కలిపి ప్లేటులో పెడితేనే తింటోంది. దీంతో యాభై సంవత్సరాలు దాటిన సత్యమ్మకు రత్నమ్మ మీద కోపం వస్తోంది. వయసైపోయిన తరువాత ఇలా తనంత మనిషికి పసిపాపలు చేసే సేవ చెయ్యవలసి రావడం కష్టం గా వుంది. సత్యమ్మ అరిచేకొద్దీ రత్నమ్మ కు కోపం పెరుగుతోంది. డ్రెస్సెస్ చించుకుంటోంది. ఒక్కోసారి కళ్ళద్దాలు విరిచేసేది. మళ్ళీ కొనివ్వాల్సొచ్చేది.
సత్యమ్మ తన కోపాన్ని గోపయ్య మీద చూపించేది. “మీ చెల్లెలికి సేవ చెయ్యలేక నా ప్రాణాలు పోతున్నాయి, ”అంటూ. ఇంట్లో ముగ్గురు ఉన్నా రత్నమ్మను సత్యమ్మ అరిచే అరుపులకు ఇంట్లో పదిమంది ఉన్నట్లు ఉండేది. శీనయ్యా వాళ్ళు అప్పుడప్పుడూ వచ్చి చూసి పొయ్యేవాళ్ళు. వాళ్ళు వస్తూనే తన బాధంతా గుక్కతిప్పుకోకుండా వాళ్ళకు చెప్తుండేది. శీనయ్య చెల్లెలిని పలకరిస్తూ ‘వదిన చెప్పినట్లు వినమ్మా, ’ అని చెప్తుండేవాడు. అంతకంటే సత్యమ్మ ను ఏమైనా అంటే, ‘అయితే కొద్దిరోజులు మీ ఇంట్లో ఉంచుకోండి’అంటుందేమొ’ అని ఆయనకు భయం.
రత్నమ్మకు అరవై సంవత్సరాలు వచ్చాయి. ఆమెకు సేవ చెయ్యడానికి అరవైనాలుగు సంవత్సరాల సత్యమ్మకు శక్తి ఉండటం లేదు. ఈ మధ్యనే బి. పి. షుగర్ కూడా వచ్చాయి. అందువల్ల మాత్రలు వాడుకుంటూ, ఇంటిపని చేసుకుంటూ రత్నమ్మ కు సేవ చెయ్యాలంటే ఆమెకు ఇష్టమనిపించడం లేదు. ఈ మధ్య రత్నమ్మను దబదబా బాదుతూ కొడుతూవుంది కూడా. అలా కొడుతూ ఉంటే గోపయ్య ఏమీ చెయ్యలేక పోతున్నాడు. రత్నమ్మ వయసు పెరుగుతూవుంటే, చిన్న పిల్లలాగా చేస్తోంది. ఇప్పుడు ఆమెకు సత్యమ్మ పని చెయ్యలేక పోతోంది.
పనిమనిషిని పెట్టమంటే, నేను కొంచెం పని చేస్తాలే, అని గిన్నెలు కడగడం కర్రతో ఇల్లు తుడవడం కూడా చేస్తున్నాడు, గోపయ్య. అసలే గోపయ్య స్పీడ్ గా నడవ లేడు. అయినా సత్యమ్మకు కోపం రానీయకుండా ఉండాలని, ఆమె రెండు పూటలా, రెండు గంటల చొప్పున పూజ చేసుకుంటూ ఉంటే, సగం వంట కూడా చేస్తున్నాడు. మిక్సీలు వేస్తున్నాడు. అంతే గానీ పని మనిషిని పెట్టడం లేదు. డబ్బులన్నీ ఖర్చు చేస్తే వంశీకి కూడా జీతం తక్కువ, భవిష్యత్తులో మందుల అవసరాలకు వుంటాయని డబ్బులు దాచిపెడ్తున్నాడు, గోపయ్య.
సత్యమ్మకు ఈ మధ్యనే ఒక ఆలోచన వచ్చింది. ‘రత్నమ్మను వృద్ధాశ్రమానికి పంపిస్తే ఎలా ఉంటుంది, ’ అని. కానీ గోపయ్య ఇష్టపడలేదు. ఆడవాళ్ళకు అన్నిచోట్లా రక్షణ ఉంటుందో లేదో అని భయపడ్డాడు. ‘బావగారూ మీరైనా చెప్పండి, ’ అంది శీనయ్యతో. సరేనని చివరకు ఇలాంటి వాళ్ళను చేర్చుకునే ఒక హోమ్ లో చేర్పించారు. అమ్మయ్య, నాకు విశ్రాంతి గా వుంది అనుకుంది సత్యమ్మ. కానీ తరువాతి వారం శీనయ్య వెళ్ళి చూస్తే, అక్కడ పరిస్థితి ఘోరంగా వుంది. రత్నమ్మ కు రోజూ స్నానం లేక వోళ్ళంతా పుళ్ళు వచ్చాయట. ఆకలనట్టు పెద్దన్నకు పొట్ట చూపించిందట. అందుకని వెంటనే రత్నమ్మను ఇంటికి తీసుకొచ్చేశారు.
మళ్ళీ సత్యమ్మకు రత్నమ్మ భారమయ్యింది. ఈ మధ్య సత్యమ్మ కొడుతుంటే రత్నమ్మ తిరిగి సత్యమ్మను కొడుతోంది. అందుకని ఒకరోజు సత్యమ్మకు కోపమొచ్చి గరిట కాల్చి రత్నమ్మ చేతిమీద వాత పెట్టేసింది.
ఆ సంఘటనతో గోపయ్యకు బాగా కోపమొచ్చి, సత్యమ్మ తో గొడవ పడ్డాడు. వాళ్ళన్నయ్య దగ్గరకెళ్ళి విషయమంతా చెప్పాడు. శీనయ్య, వరమ్మ రిటైర్ అయ్యారు. అప్పుడప్పుడూ కొడుకుల దగ్గరికి వెళ్ళి వస్తూ వున్నారు.
రత్నమ్మ గురించి అన్నదమ్ములిద్దరూ చాలాసేపు బాధపడ్డారు. తన స్వంత కూతురే అయితే సత్యమ్మ ఇలా చేసేదా? ఆడపడుచు కాబట్టే కదా తిడుతోంది, కొడుతోంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను చూడలేను అంటోంది. రత్నమ్మను చూసుకుంటానంటేనే కదా లక్షలు విలువచేసే ఇల్లు వాళ్ళ నాన్న వీళ్ళకు రాసిచ్చింది. అప్పుడేమో అంత డబ్బు సంతోషంగా తీసుకొని, ఇప్పుడు రత్నమ్మను చూడాలంటే కష్టమనుకుంటోంది సత్యమ్మ.
తల్లితండ్రులు ఆడపిల్లలను ఇలా అన్నదమ్ముల దగ్గర వదిలేస్తే, వదినలు ఎంతవరకు చూస్తారు? తమంత తాము జీవించలేని వీళ్ళను ఎందుకు భగవంతుడు లోకం మీద వదిలెయ్యడం? ఎవరి తప్పుకు రత్నమ్మ లాంటి వాళ్ళు బలైపోతున్నారు? లేక వారి గత జన్మల పాపఫలం వారు అనుభవిస్తున్నారా? వాళ్ళను చూడటం కోసం డబ్బులిచ్చినా బంధువులు సరిగా చూడటం లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకు, సత్యమ్మకు తేడా ఏముంది? అన్నదమ్ములు చూడాలనుకున్నా, భార్యలు చూడటం లేదు.
శీనయ్య చాలాసేపు ఆలోచిస్తూకూర్చున్నాడు. ఇప్పుడేకాదు గత కొద్దీ రోజులనుంచీ మనసులో రత్నమ్మ గురించి ఆలోచన వస్తోంది, శీనయ్యకు. గోపయ్య ఏమైనా చెయ్యాలనుకున్నా అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అతను చెయ్యలేడు. భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకుంటూ వున్నాడు. తమ్ముణ్ణి తప్పు పట్టలేము. సత్యమ్మ డబ్బులు వచ్చినప్పుడు సంతోషమేగానీ రత్నమ్మను ఆమె తన చెల్లిలాగా కూడా చూడలేకుండా వుంది.
అందుకే శీనయ్య తన ఆలోచనను తమ్మునితో ఇలా చెప్పాడు. “గోపయ్యా, రత్నమ్మను నేను మా ఇంటికి తీసుకెళ్తాను. ”
ఆ మాటలకు గోపయ్య “మరి… వదినకు కూడా ఇబ్బందే కదా, ” అన్నాడు.
“వరమ్మ చూడకుంటే నేను చూస్తాను. నా కూతురైతే నేను చూడనా? మా ఇంట్లోనే రత్నమ్మకు తోడుగా వుండేట్టుగా ఒక మనిషిని నెలజీతం తో ఏర్పాటు చేస్తాను. మా పిల్లలకు కూడా ఇదే చెప్తాను. మాతో పాటే మా ఇంట్లో ఉంటుంది. ఎవరికీ దిగులు ఉండదు. డబ్బుకు నాకు ఇబ్బంది లేదు.
మీకిచ్చిన ఇల్లు, డబ్బు మీరే ఉంచుకోండి. అప్పుడు సత్యమ్మ కూడా సంతోషపడుతుంది. నాన్న తరువాత ఇంటి బాధ్యత చూసుకోవలసినవాడిని. సత్యమ్మ చూస్తున్నది కదా అని ఇన్ని రోజులూ నేను రత్నమ్మను మా ఇంటికి తీసుకెళ్ళలేదు. ఇప్పటికయినా నా బాధ్యత నేను నెరవేరుస్తాను. ఆ తరువాత రత్నమ్మ అదృష్టం, ఆ భగవంతుని దయ, ” అన్నాడు శీనయ్య, దృఢ నిశ్చయంతో.
ఆ మాటలకు గోపయ్య చాలా సంతోషించాడు. రత్నమ్మను అన్నయ్య తీసుకెళితే తనకు ఇంట్లో సత్యమ్మతో గొడవ ఉండదు. ఇంటి పని చేసే పని కుడా ఉండదు. ఇంకా రత్నమ్మ ఇల్లు, డబ్బు తమను ఉంచేసుకొమ్మన్నాడు, కాబట్టి సత్యమ్మ కు ఇంకా సంతోషం. అన్నయ్యకు డబ్బు బాగానే ఉంది కనుక రత్నమ్మకు తిండికి ఇబ్బంది ఉండదు, అని కూడా తృప్తిపడ్డాడు.
ఆ విధంగా రత్నమ్మ జీవితం వొడ్డున పడింది.
[ఇలాంటి ఆడపిల్లలున్న తల్లి తండ్రుల ఆలోచనకు ఈ కథ అంకితం]
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
Podcast Link
Twitter Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
Comments