top of page
Writer's picturePandranki Subramani

అదాటున అంబరాన్నిదాటి పోవాలనుకున్నప్పుడు..



'Adatuna Ambarannidati Povalanukunnappudu' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 02/08/2024

'అదాటున అంబరాన్నిదాటి పోవాలనుకున్నప్పుడు' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



పుష్పగిరి మండల కార్యాలయంలో డిస్పాచ్ క్లర్కుగా ఉంటూన్న సుబ్బరాజు ముఖభావంలో జీవం కరువయిన రీతిన యాంత్రికంగా పనిచేస్తున్నాడు. కళ్ళ కదలిక లేని రొబోలా అన్నమాట-- దానికి కారణం, అతడి చూపూ తనువూ యిక్కడున్నట్లున్నా మనసెక్కడో మందగమనాన ఊగిసలాడుతూంది. పేనాతో రిజష్టర్ల పైన గీస్తూ పోతున్నా అంతుపట్టని రీతిన మనసెక్కడో గిరికీలు తిరుగుతూ ఉంది. ఇక విషయానికి వస్తే రాను రాను అతడిలో మునుపటి పట్టూ సందడీ తగ్గిపోతున్నాయి. 


అదే విధంగా తోటి సిబ్బందితో మునుపులా కలసి మెలసి ఉండటం లేదు. కలివిడిగా క్యాంటీనుకో, ఫుడ్ పాయింటుకో వెళ్ళడం లేదు. మందనుండి వేరుపడ్డ మేకలా తానుగా వెళ్లి భోజనం ముగించాననిపించుకుని తానుగా సీటు కొచ్చి కూర్చుంటున్నాడు. అంతేకాకుండా నిస్పందనగా పని ముగించి మునిమాపుకి వీడ్కోలు పలుకుతూ చప్పుడు చేయని తాబేలులా సాగిపోతున్నా డు. 

ఒకసారేమో - నెల ఒకటవ తారీఖున జీతం బట్వాడా జరుగుతుందన్నది కూడా గుర్తుంచుకోకుండా అదేదో పనిపైన పోస్టాఫీసుకి వెళ్ళి అటునుంచి అలా జీతం డబ్బులు తీసుకోకుండానే ఇంటికి వెళ్లిపోయాడు సుబ్బరాజు. మరునాడతనికి జీతం అప్పగించడానికి బోలెడన్ని బుక్ అడ్జస్ట్ మెంటులు చేసుకోవలసి వచ్చింది సూపర్ వైజర్కి. 


సెక్షన్ సూపర్ వైజర్ సుందర్రావు ముంగాళ్ళపై మూతినుంచుకున్న తెల్ల పిల్లిలా కళ్ళు మిటకరిస్తూ ఇది గమనించాడు. స్వతహాగా అతడికి సుబ్బరాజు పనితనం సదభిప్రాయం ఉండటాన తోచిన వెంటనే ఫైరింగ్ రేంజ్ లోకి దిగలేదు. విషయం తెలుసుకుని సుబ్బరాజును భుజం తట్టి దారిలోకి తేవాలని, ఇంటి వ్యవహారాలను ఆఫీసు వ్యవహారాలను కలగలపకూడదని తేల్చి చెప్పాలని తీర్మానించుకున్నాడు. సమయం కోసం యెదురు చూస్తున్నాడు. 


కాని—అకటా! ఆ లోపల విపత్కర సంఘట నొకటి జరిగిపోయింది. మనసున స్పందన లేకుండా చేసే పనిలో ఎన్నాళ్లు జవాబుదారీతనం ఉంటుందని? సెక్షన్ సూపర్ వైజర్ సుందర్రావు ఊహించినట్లే జరిగింది. సెక్షన్ ఆఫీసరు నుండి దోసిలి చాచి ప్రతికూల శ్రీముఖం అందుకున్నాడు సుబ్బరాజు. 


అదెలాగంటే- మండల కార్యాలయం నుండి వెళ్లే ఓ ముఖ్యమైన అధికార పూర్వక పత్రాన్ని సచివాలయంలోని- ‘సి’బ్లాక్ కి పంపించే బదులు సుబ్బరాజు దానిని- ‘డి‘బ్లాక్ కి పంపించేసాడు. ఇక చెప్పాలా! పరిస్థితి అగ్గి గుగ్గిలమై పోయింది. కాని అటువంటి గడ్డు పరిస్థితిలోనూ సుబ్బరాజు జంటల్ మ్యాన్ గా ప్రవర్తించాడు. తలా పాపం తిలాపిడికెడన్నట్టు తన లోపాన్ని సీనియర్ అసిస్టెంటు పైనో మరెవరిపైనో నెట్టకుండా జరిగిన తప్పిదనాన్ని నిష్పూచీగా స్వీకరించాడు, 


ఇక-- ఆ పైన సుందర్రావు నిర్లిప్తంగా ఉండలేకపోయాడు. తిన్నగా రంగంలోకి దిగాడు. పై అధికారులతో ముఖాముఖి మాట్లాడి సుబ్బరాజులో తను చూసిన సౌశీల్యం గురించి, కష్టించి పనిచేసే తత్వం గురించి చెప్పి, చార్జి షీటు వరకూ పోనివ్వకుండా ఆపాడు. అదే సమయాన లౌకికం తెలిసినవాడవటం వల్ల అందరిముందూ బాహాటంగా అక్షింతలు వేసి చిన్నబుచ్చ కూడదని భావించి సుబ్బరాజుని క్యాంటీను వేపు తీసుకెళ్లాడు. 


తీసుకు వెళ్లి పెద్దపాటి ఉపోద్ఘాతమేదీ ఇవ్వలేదు. ఒకే మాటన్నా డు- “మీ పెద్దన్నయ్య వంటి వాణ్ణి, మనసు విప్పి చెప్పు- ఏమిటీ గంద్రగోళం?”


దానితో సుబ్బరాజు కనురెప్పల మధ్య చెమ్మ దనం-- సుబ్బరాజు సూపర్ వైజర్ ఆదేశానుసారం మనసు పొరల్ని ఒకటి తరవాత ఒకటిగా విప్పి అతడి ముందుంచాడు. అంతావిన్న సూపర్ వైజర్ నిదానంగానే స్పందించాడు- “అంటే-- నీకొచ్చిన సమస్యంతా ఆఫీసు పనిరద్దీ వల్లనో, ఆర్థిక పరిస్థితి వల్లనో కాదన్నమాట! కేవలం ఇంటి ఆడాళ్ళ వ్యవహారం వల్ల వచ్చిన చిక్కేనన్నమాట! నిజంగానే చెప్తున్నాను సుబ్బరాజూ- నిన్ను చూస్తుంటే మా తమ్ముడు వీర్రాజు జ్ఞాపకం వస్తున్నాడోయ్”


అర్థం కానట్టు చూసాడు సుబ్బరాజు “ఎందుకు సార్? మీ మరదలు పిల్లకూడా పుట్టింటికి వెళ్లిపోయిందా సార్!”


సుందర్రావు నవ్వాడు- “అది కానే కాదోయ్! వాడికి పెళ్ళే కానిదే!”


మరి- అన్నట్టు ప్రశ్నార్థంగా చూసాడు సుబ్బరాజు. 

అప్పుడు సుందర్రావు బ్రాడ్ స్మైల్ చేసాడు. “మేటర్ అది కానే కాదు. వాడు పెళ్ళే వద్దని రాధ్ధాంత చేస్తున్నాడు”.


సుబ్బరాజు మళ్ళీ అడిగాడు- “ఇందులో అతడికి వచ్చిన ప్రోబ్లెమ్ ఏంవిటి సార్?”


“ప్రోబ్లెమ్ వాడికి కాదు. మాకూ! మాకూ అంటే- నాకూ మా అమ్మానాన్నలకూను. సమస్యేమిటంటే- ఎంతటి మంచి సంబంధం తెచ్చినా వద్దంటున్నాడు. ఎంతటి సౌందర్యవతుల ఫోటోలు చూపించినా ఉఁ అనడం లేదు” సుందర్రావు విచార వదనంతో చెప్పా డు. 


ఈసారి సుబ్బరాజు కుర్చీలో ఇబ్బంది కరంగా కదలి “అతడికంటూ ఏదో సమస్య-” అంటూ నోరు తెరవబోయాడు. 


కాని సుంద ర్రావు వెంటనే రియాక్టయాడు- “వాడికి సమస్య ఉందంటావా? మొండి బుధ్ధులూను, బండ సమస్యలూను. నానా విధాల పత్రిక వార్తలు చదివి టీ. వీ. లలో బీభత్సకరమైన ఫ్లాష్ వీడియోలు చూస్తూ క్రైమ్ న్యూస్ వింటూ తనకు తానే వైరాగ్యాన్ని పెంచేసుల కుంటున్నాడు సుబ్బరాజూ!” 


ఎలాగన్నట్టు చూసాడు సుబ్బరాజు. 


చెప్పసాగాడు సుందర్రావు- ”ఈ కాలపు అమ్మాయిలందరూ మాష్టర్ ప్లాన్తో మెట్టింటికి వస్తున్నారట. ఏది చేసినా వాళ్ళకు వాళ్ళ పుట్టింటి సపోర్టు ఉంటుందట. కాపురానికి వచ్చిన పెళ్ళాం మొదటి సంవత్సరం నోట్లో నాలికలా బాగానే నడచుకుంటుందట. ఒక బిడ్డను చంకనెత్తుకున్న తరవాత కృష్ణుడిపై దాడిచేసిన పూతనలా దాని అసలు రూపం చూపిస్తుందట. ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి మొగుడి బలహీనతల్ని వాడుకుని నరకాన్ని ఇలలోనే చూపిస్తుందట. ఆ తరవాత అమ్మానాన్నలకు దూరం కాలేక తోబుట్టువులను దూరంగా నెట్టలేక కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టు మిట్డాడాలట. ముక్తాయింపుగా- అడుసు తొక్కనేల- కాలు కడగనేల- అని మనకే హితబోధ చేస్తాడు వాడు. అందులో వాడు తెలుగు టీవీ సీరియల్స్ యెక్కువగా చూస్తాడేమో- వాటి ప్రభావంతో తోట కూర కాడలా తయారయాడు. వాడి ధోరణికి అమ్మానాన్నా బెంబేలు పడిపోతున్నారు- వంశాంకురమే లేకుండా పోతుందేమోనని--” 


“అదెలాగండీ సూపర్ వైజర్ గారూ! మీ బిడ్డలు మాత్రం వాళ్ళ వంశాంకుంరం కాదా?”


ఈ ప్రశ్నతో సుందర్రావు మౌనంగా ఉండి పోయాడు. అది చూసి సుబ్బరాజు కంగారు పడ్డాడు- “నేనేమైనా--” అంటూ మరొకసారి యేదో అనబోతూ ఆగిపోయాడు. 


సుందర్రావు తల అడ్డంగా ఆడించి నిదానంగా అన్నాడు- “అండపిండ బ్రహ్మాండం అంతా ఇక్కడే కదా అణగి ఉంది! నాకు పెళ్ళయి ఏడేళ్లు. ఇంతవరకూ మాఆవిడ కడుపు పండలేదుగా!”

అది విని సుబ్బరాజు ఉన్నపళంగా సారీ చెప్పాడు. 


“సరేలే! మా గొడవ సంగతి అలా ఉంచు. నీ విషయానికే వస్తాను. ఇలలో అందర్నీ సమాన స్థాయిలో తృప్తి పరచడం కుదరని పని. మరీ మెతకతనం చూపిస్తూ నిన్ను నమ్ముకున్న దానిని దూరం చేసుకోవడం తెలివి మాలిన పనే అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంట్లో సంభవించే ఇటువంటి సమస్యలన్నీ అటు ఇటూ తెగ హడావిడి చేస్తూ కదలే ఎండాకాలపు మబ్బుల్లాంటివి. వీటి గురించి తలపోస్తూ మనసు పాడుచేసుకుని ఉన్న ఉద్యోగానికి ముప్పు తెచ్చుకోకు. మీ ఆవిడ భరింపరాని విరక్తికి లోనయి ఇంకేమైనా జరిగే లోపల పరిస్థితిని చక్కదిద్దుకోవటానికి ప్రయత్నించు!” అంటూ లేచాడు సుందర్రావు. 


సుబ్బరాజు కదలకుండా అలాగే ఉండిపోయాడు. సూపర్ వైజర్ గారి చివరి మాట గుండే కలుక్కుమనేలా చేసింది. ఆయన అన్నట్టు శుభరాజేశ్వరి మరీ విరక్తికి లోనయి యేదైనా అఘాయిత్యానికి తలపడితే-- ఇక అతడు నిశ్చలంగా ఉండలేకపోయాడు, 


మరిక వాస్తవంగా చూస్తే, సుబ్బరాజు ఇంటి వ్యవహారం అందరి ఇండ్ల వంటిది కాదు. శుభరాజేశ్వరి స్వార్థ చింతన లేని నిదాన పరురాలు. సదాచార పరాయణురాలు. విడికాపురం పెట్టాలని తననెప్పుడూ సతాయించలేదు. ఇంట్లోవాళ్ళే- అంటే సుబ్బరాజు అమ్మా అక్కయ్యా కూడ బల్కుకుని శుభరాజేశ్వరి పుట్టింటికి వెళ్ళిపోయేలా గడ్డు పరిస్థితి సృష్టించారు. 


అలాగని, భార్య దూరం కావడానికి కేవలం ఇంట్లో వాళ్ళనే మక్కికి మక్కీగా బాధ్యులు చేయడం కూడా సబబు కానేరదు. ఎందుకంటే- ఇప్పటి పరిస్థితికి చాలా వరకు కారకులు తన అత్తా మామలే. ముఖ్యంగా తన మామగారే. రాజకీయ నేపథ్యంగల అతను పరిధికి మించిన డాంబికంతో నానా వాగ్దానాలు చేసి చక్కా వెళ్ళిపోయాడు. రాజకీయవాదిగా వేదికలపై వాగ్దానాలు వెదజల్లడం అతగాడికి అలవాటైనా కుటుంబ వ్యవహారాలలో అది పనికి రాదన్నది అతడు గాని అతడి భార్యామణి గాని గమనించలేదు. 


అదే ఇప్పుడు శుభ మంగళ రూపవతి అయిన రాజేశ్వరి మెడకు చుట్టుకుంది. నెలల తరబడి కళ్ళు కాయలు కాచేలా యెదురు చూచిన శుభరాజేశ్వరి ఇరుగు పొరుగు వాళ్ళ సూటి పోటి మాటలు తట్టుకోలేక నిలువెల్లా నీరుగారిపోయి ఏదైనా విపరీతమై న చర్యకు పాల్పడితే-- సుబ్బరాజు గుండె గుభేలుమంది. ఇక ఆ రాత్రి అతడు నిద్రకు దూరమయాడు. లేచీ లేచిన వంటనే తలంటు స్నానం చేసి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి బైక్ పైన కూర్చుని సర్రున ఇరవై మైళ్ళ దూరాన్ని అధిగమించి అత్తామామల యింటి ముందు వాలాడు. 


“శుభా! శుభా!” అని గట్టిగా పిలుస్తూ లోపలకు ప్రవేశించాడు సుబ్బరాజు. అల్లుణ్ణి చూసి సంతోషించలేదు కదా— భార్యా భర్తలిద్దరూ తెల్లబోయి నిల్చున్నారు మాటా పలుకూ లేకుండా—

“అదేంవిటి అత్తయ్యా! లోపల శుభరాజేశ్వరి కనిపించదేం?”


ఇద్దరూ దిగ్భ్రాంతి నుండి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ యేక కంఠంతో బదులిచ్చారు-

“అది తాడో పేడో తేల్చుకుంటానని నువ్వు పని చేసే పుష్పగిరి మండల కార్యాలయానికి మాతోడు యేదీ అవసరం లేదని చెప్తూ మమ్మల్నిద్దర్నీ దూరంగా నెట్టుతూ అడ్డదారిన నడచి చేరుకుంటానని ప్రతిజ్ఞ పూని బయల్దేరింది. అది బయల్దేరి రెండు గంటలు దాటింది. నువ్వు శుభరాజేశ్వరిని చూడలేదా!” 


సుబ్బరాజుకి మరొకసారి గుండెకలుక్కుమంది. ఒళ్ళంతా చెమటలు పోసాయి. ””ఎంతపని చేసారు మామయ్యా! అది మొండిగా అడ్డదారిన వెళ్తానంటే విడిచి పెట్టేయడమే! పుష్పగిరికి అడ్డదారిన వెళితే కొండలూ కోనలూ యెదురవుతాయని మీకు తెలవదా? అడవి దొంగలతో బాటు మృగాలు కూడా తచ్చాడుతుంటాయని మీకు తెలవదా!”


అతడలా గట్టిగా అరుస్తూనే బైక్ పైకి దూకి అడ్డదారిన బండిని పోనిచ్చాడు, వజవజ వణుకుతూ-- వేటగాడికి జింక- కండ కావరంతో ఉడికిపోతూన్న మృగాడికి ఒంటరి స్త్రీ కనిపిస్తే కోలాటమేగా మరి! అలా పరి పరివిధాల ఆలోచించుకుంటూ అటవీశాఖ సిబ్బంది సహాయంతో వెతుక్కుంటూ వెళ్లి ఒక కొండ క్రింద బుర్ర పగిలి పడున్న ఒక ఆగంతకుణ్ణి చూసి ఆగాడు. అతడికి చేయూత నిచ్చి యేమైందని అడిగాడు సుబ్బరాజు — కారుతూన్న రక్తాన్ని చేతిగుడ్డతో ఆపుకునేందుకు ప్రయత్నిస్తూ కొండపైకి చేతిని చూపించాడు వాడు. 


అతడు మరుక్షణం ఆలోచించకుండా కొండపైకి పరుగు తీసాడు. అక్కడ జుత్తు విరబోసుకున్న అమ్మోరిలా బండరాయి పైన కూర్చొని ఉంది శుభరాజేశ్వరి. సుబ్బరాజు రొప్పుతూ ఆమెను పొదవి పట్టుకుని అడిగాడు- “ఏమి జరిగింది రాజేశ్వరీ?” 


ఆమె నిశ్చలంగా బదులిచ్చింది. “రెండు జరిగాయి. మొదట నాకు నల్ల చిరుత యెదురైంది. కాని అదేమి విచిత్రమో మరి— అది నావేపు కన్నెత్తి కూడా చూడకుండా తన దారిన తను వెళ్ళిపోయింది. 


కాని— క్రింద పడున్నాడే మనిషి రూపంలో ఉన్న మృగం— నన్ను బలత్కరించాలని వెంటబడ్డాడు. ఎంత గీపెట్టి అరచినా తగ్గ లేదు. నన్ను నేను కాపాడుకోవడానికి కొండెక్కి చేతికందిన బండరాయిని క్రిందకు దొర్లించాను. అది సూటిగా తగిలి వాడి బుర్ర పగిలింది. చచ్చాడనుకున్నాను. వాడింకా చావలేదు. ఇక నేను మాయింటికి వెళతాను. నన్ను దిగబెట్టి వెళ్ళిపొండి“”  అంటూ లేచి కదలిందామె. 


అతడామె చేతిని పట్టుకున్నా డు. “ఇక నువ్వు వెళ్ళేది మీ యింటికి కాదు. మనింటికి. వాళ్ళెవరైనా నిన్ను అడ్డగించడానికి ప్రయత్నిస్తే నేను నల్ల చిరుతలా మారుతాను. నిన్ను దక్కించుకుంటాను. మాయింట్లోవాళ్ళ అత్యాశకు నువ్వు బలిపశువు కావడం నేను భరించలేను. ఇది సత్యం--” అంటూ ఆమెను పొదవి పట్టుకుని క్రిందకు నడిపించాడు. 

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





 






 



51 views0 comments

Comments


bottom of page