top of page

అదృష్టవంతులం అంతే!

Writer: Sairam AlluSairam Allu

#AlluSairam, #అల్లుసాయిరాం, #AdrushtavanthulamAnthe, #అదృష్టవంతులంఅంతే


Adrushtavanthulam Anthe - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 22/03/2025

అదృష్టవంతులం.. అంతే! - తెలుగు కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



బెంగుళూరులో ఇంటర్వ్యూకి వెళ్లి, రాత్రి లేటుగా వచ్చి సిద్ధార్థ్ పడుకున్నాడని, ఉదయం పదిన్నర అవుతున్నా యింట్లోవారు నిద్రలేపలేదు. నిద్రలేపడానికి సిద్ధార్థ్ పెట్టిన అలారం మ్రోగి మ్రోగి అలిసిపోయి ఆగిపోయింది. 


ఫోన్ మ్రోగితే, నిద్రమత్తులో ఉన్న సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెవి దగ్గర పెట్టుకొని "హలో!" అని అన్నాడు. 


"హలో! సిద్ధు! నేను మురళిని! బెంగుళూరు నుంచి బయలుదేరావా? యిప్పుడు ఎక్కడున్నావు?" అని అడిగాడు మురళి. 


"ఇంటి దగ్గరే ఉన్నానురా!" అని సిద్ధార్థ్ చెప్తుంటే, "ఇంటి దగ్గరా! ఎప్పుడొచ్చేశావురా! నిన్న నాకు చాలా సార్లు ఫోన్ చేసినట్టున్నావ్! ఇప్పుడు మిస్సిడ్ కాల్స్ మెసేజ్లు వచ్చాయి! కొంచెం బిజీగా ఉండి మొబైల్ చూసుకోలేదురా!" అని ఆశ్చర్యపోతూ అడిగాడు మురళి. 


"వచ్చేసరికి రాత్రి రెండు అయ్యింది. బాగా అలిసి పోయున్నానురా! యిప్పుడు ఏం చెప్పలేను!" అని అన్నాడు సిద్ధార్థ్. 


"సరే కానీ, యిప్పుడు టైం చూడు. టైం పదిన్నర అవుతుంది. నిద్రమత్తుకి పడుకుంటే, ఎంతసేపైనా పడుకోవాలనే అనిపిస్తుంది. నువ్వు నిద్ర లేచి రెడీ అవ్వు. నేను యింటికి వస్తాను. మాట్లాడుదాం!" అని ఫోన్ కట్ చేసి సిద్ధార్థ్ యింటి వైపు బైక్ పోనిచ్చాడు మురళి. 


టిఫిన్ చేసేసి, బ్యాగులో పేపర్లు చూసుకుంటున్న సిద్ధార్థ్ యింటికి వస్తున్న మురళిని‌ చూసి "మురళి! నువ్వు ఫోన్ చేసినప్పుడే నిద్ర లేచాను. ఏం బెంగుళూరు జర్నీరా బాబు, జీవితంలో గుర్తుండిపోతుందిరా! అప్పుడెప్పుడో క్వాలిఫై అయ్యిన సాప్ట్వేర్ కంపేనీవారు సడెన్ గా కాల్ చేసి బెంగుళూరులో జాబ్ ఇంటర్వ్యూ అంటే బయలుదేరి వెళ్లాను. ఆరోజు, సరిగ్గా మన కళ్యాణ్ పెళ్లికి రెండు రోజులు ముందు పడింది. 


తీరా అక్కడికి వెళ్లాక, ఇంటర్వ్యూలో ఎవేవో ప్రశ్నలు అడిగితే, నాకు తెలిసినదేదో నేను చెప్తే, మొత్తానికి కాదనలేక ఓకే చేశాడనుకో! అదొక హ్యాపీ! అసలైన ట్విస్ట్ ఏమిటంటే, అక్కడ నా పర్సు ఎవరో కొట్టేశారురా బాబు. మనీ, ఎటిఎం కార్డులు అన్ని అందులో పోయాయి. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ! నాకు అక్కడ ఎవరు తెలియదు. తిరిగి వచ్చే జర్నీ టికెట్లకి కుడా డబ్బులు లేవు. 


తెలిసిన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాను. కొందరు డబ్బుల్లేవని, కొందరు ఫోన్-పే పనిచేయట్లేదని, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. కొందరైతే ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఎత్తలేదు మీలాగా! నీకు, కళ్యాణ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా! నాకు తెలిసినది మీయిద్దరే కదరా! మీరు ఫోన్ ఎత్తి ఉంటే, నాకు ఏం బాధ ఉండకపోదును! 

నేను బెంగుళూరు నుంచి విశాఖపట్నం వరకు ట్రైన్ జనరల్ బోగీలో ఒంటి కాలు మీద తపస్సు చేసినట్లు నిలబడి వచ్చాను! కాళ్లు వాచిపోయాయిరా! నొప్పులు, నొప్పులు రా!" అని అంటూ వాచిపోయిన తన కాళ్ళు చూపిస్తున్నాడు సిద్ధార్థ్. 


మురళి చూస్తూ "నిజమేరా! బాగా వాచిపోయాయి! అమ్మకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా కీమో థెరపీ చేయించడానికి విశాఖపట్నం కాన్సర్ హాస్పిటల్ కి వెళ్లాం. అక్కడ అమ్మకి కొంచెం సీరియస్ అయ్యింది. నాకు ఫోన్ పట్టించుకునేటంత టైం దొరకలేదు. స్విచాఫ్ అయిపోయింది. నిన్న రాత్రి విశాఖపట్నం నుంచి ఆరు గంటల ప్యాసింజర్లో మేం వచ్చేసరికి రాత్రి పది దాటిపోయింది. తెల్లవారి మొబైల్ స్విచాన్ చేస్తే, నీ మిస్సిడ్ కాల్స్ మెసేజ్లు వచ్చాయి. చూసి ఫోన్ చేశాను!" అని జరిగినదంతా చెప్పాడు. 


సిద్ధార్థ్ కోపంగా "పోనీ, నువ్వు అంటే ఏదో అమ్మ గురించి హాస్పిటల్లో ఉండి, నీ బాధ నువ్వు పడుతున్నావు. ఫోన్ ఎత్తలేదనుకో! మన కొత్త పెళ్లికొడుకు కళ్యాణ్ అయితే మరీనూ! ఫోన్లు చేశాను. మెసేజ్లు చేశాను. వాట్సాప్ లో కాల్స్ చేశాను. అసలు రెస్పాన్స్ లేదు! పెళ్లి బిజీలో ఉన్నాడంటే, వాడి చేతిలో మొబైల్ కచ్చితంగా ఉండి ఉంటుంది కదా! అయినా, ఫోన్ ఎత్తలేదు. చఁ!! ఒకడు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడంటే, ఎందుకు చేస్తున్నాడో, విషయం ఏమైయింటుందో అని తిరిగి కనీసం ఒక్కసారైనా ఫోన్ చెయ్యాలి కదా!" అని అన్నాడు. 

"నువ్వు చెప్పినట్లు, ఒకడు అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే, విషయం ఏమై ఉంటుందని కనుక్కోవడానికి ఒకసారి అయినా ఫోన్ ఎత్తాలి అన్నావు కదా. అదే విషయాన్ని యింకోలా ఆలోచిస్తే, అన్నిసార్లు ఫోన్ చేస్తున్నా, ఒకడు ఫోన్ ఎత్తట్లేదంటే, వాడి ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాడా, లేడా లేక ఫోన్ ఎత్తడానికి మొబైల్ దగ్గర ఉందా, లేదా లేక యింకా వేరే ఏదైనా కారణాలేమైనా ఉండొచ్చు కదా! ఖాళీగా ఉంటే, ఎవరైనా ఎందుకు ఫోన్ ఎత్తరు? అసలే వాడి బాధలో వాడు ఉంటే!" అని గట్టిగా అడిగాడు మురళి. 


సిద్ధార్థ్ పగలబడి నవ్వుతూ "నువ్వొక్కడివిరా బాబు! ఎవరిని ఏం అననివ్వవు! వాడికేంటిరా బాధ! చక్కగా మనకంటే ముందు పెళ్లి చేసుకున్నాడు! కొత్త పెళ్లికొడుకు! అత్తారింట్లో మర్యాదలు ఏమైనా తక్కువ అయ్యాయని భాధపడుతున్నాడా!" అని అన్నాడు. 


మురళి కోపంగా "అదేంటి రా తెలీదా నీకు! వాడికి అసలు పెళ్ళి జరగలేదు!" అని చెప్తుంటే "జోకులు వెయ్యకురా మురళి! పెళ్లి జరగకపోవడమేంట్రా! అటువంటి విషయాల్లో జోకులు వెయ్యకూడదు. మనం కట్టిన పెళ్లి బ్యానర్లు, కటౌట్లు కట్టినట్టే ఉన్నాయి. వాట్సప్ లో మ్యారేజ్ ఫొటో స్టిల్స్ స్టేటస్ ల్లో చుశాను నేను. పెళ్లికి మనోళ్ళందరూ వచ్చుంటారు. నేనొక్కడినే మిస్ అయ్యానని అనుకుంటున్నాను!" అని నవ్వు ఆపుకుంటూ అన్నాడు సిద్ధార్థ్. 


"నువ్వు చూసింది, చెప్పిందంతా నిజమే! మనం పెట్టిన బ్యానర్లు అలానే ఉన్నాయి. తీసిన ఫోటోలు అలాగే ఉన్నాయి. కానీ, దేవుడు మనతో ఆడుకోవడానికి డిసైడ్ అయితే, అన్ని వైపులా దారులు మూసేస్తాడు. 

దురదృష్టవశాత్తు, పెళ్లి ముందు రోజు రాత్రి కళ్యాణ్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడే చనిపోయారు!" అని మురళి చెప్తుంటే సిద్ధార్థ్ షాకయ్యిపోయాడు. 


సిద్ధార్థ్ భావోద్వేగంతో "నిజంగానే జరిగిందా! ఏంటి వెంకటరమణ మావయ్యకి యాక్సిడెంట్ అయ్యిందా! ఎప్పుడు అల్లుడు, అల్లుడు అని పిలుస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటారురా మావయ్య! పాపం రా! ఇటువంటి విషయాలైనా ఫోన్ చేసి చెప్పాలి కదరా. కనీసం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి కదరా!" అని అన్నాడు. 


మురళి కుడా ఉద్వేగానికి లోనయ్యి "కళ్యాణ్ వాళ్ల అన్నయ్య కరోనా టైంలో చనిపోయాడు. ఆ బాధ నుంచి యిప్పుడిప్పుడే కోలుకుంటున్నారంటే, మళ్లీ యిప్పుడు, వాళ్ల నాన్నకి యిలా జరిగిందంటే, తలుచుకుంటేనే మనకి యిలా ఉందంటే, యింకా వాడికేలా ఉంటుంది! యింక, వాడి బాధలో వాడుంటే చెప్పాలి, చెయ్యాలి అని అంటే ఎలారా? ఇంట్లో జరగవలసిన శుభకార్యం జరగకపోగా, యింటికి ఎప్పటికీ తీర్చుకోలేని లోటు మిగిల్చిన అశుభకార్యం జరిగితే, ఎవరికి మాత్రం నోటంట మాటలు వస్తాయి! 


నీది, నాది కష్టమే! కాదనను. కానీ, వాడి పరిస్థితి యిప్పుడు నరకం! యిప్పుడు చెప్పు! ఎదుటివారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియకుండా, యిష్టానికి వారిని నింద చేసే ముందు, మన పరిస్థితి తెలియకుండా ఎదుటివారు మనల్ని అనవసరంగా తిడితే, మనకి ఎంత కోపం వస్తుందో, ఎదుటివారికి కూడా అలాగే ఉంటుందని, మనకు అర్థం అవ్వాలి! అప్పుడే ఏదైనా ఒక మాట ఆడేముందు, పని చేసేముందు ఆలోచిస్తాం!" అని ఘాటుగా చెప్పాడు. 


సిద్ధార్థ్ భావోద్వేగంతో "తెలియక, ఏదో పొరపాటున అనేశానురా! మీరెవరు నాకు విషయం చెప్పలేదు. నేను రాత్రి రెండు గంటలకి నిద్రమత్తులో వచ్చాను. నాకేం తెలుస్తుంది! నువ్వు యింకా ఏం చెప్పినా, మరి నా బుర్రకి ఎక్కవు. కానీ, అర్జంటుగా పదరా! కళ్యాణ్ యింటికి వెళ్ళాలి! అక్కడికి వెళ్ళకపోతే, యి ఆలోచనలతో నాకు బుర్ర పగిలిపోయేలా ఉంది!" అని గబగబా వచ్చి బైక్ తీశాడు. 


యిద్దరు కలిసి బయలుదేరారు. ఆఘమేఘాలపై బైక్ పోనిచ్చాడు సిద్ధార్థ్. 


కళ్యాణ్ యింటి దగ్గరికి మురళి, సిద్ధార్థ్ చేరుకుని చుట్టూ చూస్తున్నారు. పచ్చని కొబ్బరి ఆకులతో వేసిన పెళ్లి పందిర్లు, మామిడి ఆకుల తోరణాలు, లైట్ సెట్టింగుల సామాన్లు, కూరగాయలు, పెళ్లి డెకరేషన్ల సామాన్లతో నిండిపోయి ఉంది. పెళ్లి చూడడానికి వచ్చినందరి ముఖాల్లో విషాద ఛాయలతో శోకసముద్రంలో మునిగిపోయిన్నారు. శుభకార్యానికని ఎక్కడెక్కడ నుంచో వచ్చిన చుట్టాలు, బంధువులు, సన్నిహితులు, వియ్యాలవారు, వారి బంధువులు, అందరూ యి విషాద ఘటనని చూసి, అక్కడే ఉండి, తలో పనిచేస్తూ, కుటుంబ సభ్యులని ఓదార్చుతున్నారు. 

ఆ వాతావరణం చూశాక యిద్దరికి ఏం చేయాలో తోచక, ఎదురుగా ఉన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి "అత్తయ్య!" అని పొడిబారిన గొంతు సవరించుకుంటూ అన్నాడు సిద్ధార్థ్. 


చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ "వచ్చావా సిద్దు!" అని అంది పద్మ. 


"ఏంటి అత్తయ్య! యింత ఘోరం జరిగిపోయి, రెండు రోజులు అయిపోతుందంట. ఇప్పటికి కూడా నాకు విషయం తెలియలేదు. ఎవరు చెప్పలేదు!" అని బాధపడుతూ అన్నాడు. 


పద్మ దిగాలుగా “కళ్యాణ్ పెళ్లి, నీ జాబ్ ఇంటర్వ్యూ ఒకే రోజున ఉండడంవల్ల, నువ్వు కళ్యాణ్ పెళ్లి కోసమని నీ ఇంటర్వ్యూకి వెళ్లనని మొండిపట్టు పట్టుకుని కూర్చుంటే, మీ మావయ్యే కదా నిన్ను ఒప్పించి, ఆరోజు నిన్ను ఇంటర్వ్యూకి పంపించారు. మావయ్యకి యిలా జరిగిందని విషయం నీకు తెలిస్తే, నీ ఇంటర్వ్యూకి యిబ్బంది అవుతుందని, మీ మావయ్య చివరిగా ఆశపడింది జరగదని, కళ్యాణ్ నీకు చెప్పొద్దన్నాడు!" అని చెప్తుంటే, సిద్ధార్థ్ కళ్లలో నీళ్లు తిరుగుతూ "మురళి! నువ్వు చెప్పింది నిజమేరా! ఎదుటివారి ఉద్దేశం తెలియకుండా, మనకి మనమే ఏదేదో ఊహించేసుకుని, అపార్ధం చేసుకోవడమంత మూర్ఖత్వం యి ప్రపంచంలో యింకొకటి లేదు!" అని భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. 

"యిప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడు?" అని మురళి అడిగితే, "నిన్నటి నుంచి ఏమీ తినలేదు. నా ఏడుపులో పడి, వాడిని నేను పట్టించుకోలేకపోయాను. ఆ గదిలో కూర్చుని గోడకేసి ఫోటోలు చూస్తూనే ఉంటున్నాడు. ఎంత పిలిచినా బయటికి రావట్లేదంట! మీరు వెళ్లి, వాడితో ఎదైనా తినిపించండి!" అని ఏడుస్తూ అంది పద్మ. 


సరేనంటూ యిద్దరూ కళ్యాణ్ గది వైపు నడుస్తూ, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. 


బాల్యంలో మొదలైన వారి స్నేహం, వారికి ముప్ఫై యేళ్ల వయసుతో పాటు ఎదుగుతున్న స్నేహంలో ఎప్పుడు యిటువంటి పరిస్థితి రాలేదు! గదిలో నేలపై కూర్చొని ఎదురుగా గోడపైనున్న వాళ్ళ నాన్న, అన్నయ్య ఫోటోలను బాధగా చూస్తున్నాడు కళ్యాణ్. ఇద్దరూ ఆ గది దగ్గరికి వెళ్లేసరికి, దుఃఖం అనే యింటి గోడలకి నవ్వులు అని రంగులు వేసినట్టు, వారిద్దరిని చూసి ముఖం మీదకి నవ్వు పూతలు పూయించుకుని నవ్వినట్టుగా కనపడదామనుకుంటే, కళ్యాణ్ మనసు మొత్తం భావోద్వేగాలతో నిండిపోయి ఉండి, బాగా ఏడిచి తడి ఆరిపోయిన కళ్ళు సహకరించక, దాచుకున్న కన్నీళ్ళు వచ్చేశాయి. అది చూసి యిద్దరికి నోట మాట రాక, కళ్యాణ్ పక్కన వచ్చి హత్తుకుని ఓదారుస్తున్నారు. 


సిద్ధార్థ్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కళ్యాణ్ ని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ "సారీ రా కళ్యాణ్! ఘోరంరా యిది! నేను ఆ ఇంటర్వ్యూ వెళ్లక ముందురోజు నువ్వు, నేను, మావయ్య మాట్లాడుకున్న మాటలే నాకు యింకా గుర్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఒక జాబ్ ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని, కాకపోతే, నీ పెళ్లికి రెండు రోజుల ముందు బయలుదేరి వెళ్తే, నీ పెళ్లి మిస్ అయిపోతానని, నేను వెళ్ళనంటే, తర్వాత ట్రై చేసుకుందాంలే అని మనిద్దరం అనుకున్నాం! 


కానీ, మావయ్య, మా యింటి దగ్గర పరిస్థితికి, యి ఉద్యోగం చాలా అవసరమని, అన్ని టెస్టులు పాస్ అయ్యి, చివర్లో ఇంటర్వ్యూ దగ్గర ఎందుకు వదిలేస్తున్నావని, ఫ్రెండ్ పెళ్లికి రాకపోతే ఏం పర్వాలేదు, మరుసటి రోజుకి వచ్చేస్తావు కదా, ఏం యిబ్బంది లేదు, నువ్వు వెళ్లి వచ్చేయ్ అల్లుడు అని, నేను వెళ్ళనని ఎంత చెప్పినా, మావయ్య నన్ను ఒప్పించి పంపించేసి, తీరా, నేను తిరిగి వచ్చేసరికి ఆయనే వెళ్లిపోయారురా! ఆ చూపులే చివరి చూపులు అయ్యాయి! ఆ మాటలే గుర్తుండిపోయాయి! మావయ్య కోరుకున్నట్టుగానే, నాకు ఉద్యోగం వచ్చింది. డ్యూటీ చేసిన ప్రతిరోజూ నాకు మావయ్యే గుర్తొస్తాడురా!" అని అన్నాడు. 


మురళి లేచి "రేయ్ సిద్ధు! మనం వాడ్ని ఓదార్చడానికి వచ్చి, మనమే ఏడిస్తే, వాడు ఏడవకుండా ఉంటాడా? కళ్యాణ్! ఏమైనా తిన్నావా?" అని అడిగితే, తిన్నానని కళ్యాణ్ తలవూపుతుంటే “ఎందుకురా అబద్ధాలు ఆడతావు. నువ్వు తినలేదని అమ్మ చెప్పింది. ముఖం కడుక్కో, వేడిగా అన్నం తిందువు గాని! అలా బయటికి వెళ్లొద్దాం!" అని యిద్దర్ని లేపాడు. 


కళ్యాణ్ ముఖం కడుక్కుని భోజనం చేశాడు. తర్వాత ముగ్గురు బయటికి వచ్చారు. 


మురళి బయటికొస్తూ "అత్తయ్య! కళ్యాణ్ భోజనం చేశాడు. ఇక్కడ యిలా ఉంటే, ఎంతసేపైనా యిలానే ఉంటాం. అలా బయటకు తిరిగి వస్తే, మనసు కొంచెం తేలిక పడుతుంది! వెళ్లి వస్తాం అత్తయ్య!" అని అన్నాడు. 


పద్మ గొంతు సవరించుకుంటూ "జాగ్రత్త నాయనా! అసలే మా కుటుంబం మీద దేవుడి చూపు బాగోలేదు. ఎక్కువగా మొక్కినోళ్ళకే మొట్టికాయలు వేస్తాడన్నట్టు, మా దరిద్రానికి ఒక్కొక్కటిగా జరిపించుతున్నాడు. అప్పుడు, పెద్దోడ్ని కరోనా పొట్టన పెట్టుకుంది. యిప్పుడు, శుభమా అని చిన్నోడి పెళ్లి చేద్దామనుకుంటే, వీళ్ల నాన్నని మా దగ్గర నుంచి లాగేసి, నా పసుపు, కుంకుమలు తుడిచేసి, మమ్ముల్ని రోడ్డున పడేశాడు! జాగ్రత్తగా వెళ్లి రండి!" అని చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది. 


ఆ ముగ్గురికి తిరిగి సమాధానం ఏం చెప్పాలో తెలియక, మౌనంగా తల వూపి బయటికి వచ్చారు. 


యింటి బయటికి వచ్చాక, పెళ్లి కటౌట్ బ్యానర్లు దగ్గర నిలబడి, ముగ్గురు యింటివైపు చూస్తూ "చక్కగా పెళ్లి జరిగి, నిండా చుట్టాలతో, బంధువులతో ఎంతో ఆనందంగా ఉండి, పెళ్లికూతురు తెచ్చే సారె సామాన్లు, స్వీట్లతో నిండిపోయి, వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లతో హడావిడిగా ఉండాల్సిన యిల్లు యిది! యిప్పుడు యిల్లంతా బోసిపోయి, అందరి ముఖాలు విషాదంలో మునిగిపోయి, పెళ్లికి అని తెచ్చిన సామాన్లు ఎక్కడవి అక్కడే చెల్లాచెదురుగా చూస్తున్నాయి! పెళ్లికూతురు వైపు వాళ్ళు యింకా విడిది యింట్లో ఉన్నట్టున్నారురా!" అని యింటి వైపు చూస్తూ అన్నాడు సిద్ధార్థ్. 


"ఉన్నారురా! పెళ్లికూతురు ఉండకూడదని పెళ్లికూతురుని ముందు పంపించేశారు. పెళ్లికూతురు నాన్న, దగ్గర బంధువులు యింకా ఉన్నారు!" అని ఒక్కొక్కరిని చూపిస్తూ చెప్పాడు మురళి. 


యిద్దరూ మాట్లాడుతూ వస్తుంటే, కళ్యాణ్ మౌనంగా తల కిందకు దించుకుని ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు. సిద్ధార్థ్ ఆలోచిస్తూ "పాపం! వాళ్ల పరిస్థితి ఎలా ఉందో! మాములుగానే, జనాలు ఎవేవో ఊహించుకుంటారు. యింకా, యింత జరిగాక ఆ అమ్మాయి పైన బోలెడన్ని పుకార్లు రేపుతారు! పెళ్లి అయ్యి, యింట్లో అడుగు పెట్టకముందే మామయ్య ప్రాణాల్ని తీసేసిందని!" అని అన్నాడు. 


మురళి సిద్ధార్థ్ భుజం మీద చెయ్యి వేసి "అంత అవసరం ఏం లేదురా! మన కళ్యాణ్ ఆ అవకాశం ఎవరికి యివ్వలేదు! దురదృష్టవశాత్తు, యిప్పుడు యిలా జరిగింది. పురోహితులతో మాట్లాడి, పెద్దకర్మ మైలు వివరాలు కనుక్కుని, యింట్లో ఎప్పుడు శుభకార్యాలు జరగొచ్చో కనుక్కుని, అప్పుడు గుడిలో పెళ్లి చేసుకుంటామని చెప్పిన తర్వాతే, యిప్పుడు మన పరిస్థితేంటిరా దేవుడా అని దిగాలుపడిన పెళ్లికూతురు వైపు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు అనుకో!" అని అంటే కళ్యాణ్ అవునన్నట్టుగా తలవూపితే "ఇటువంటి పరిస్థితుల్లో కూడా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా కళ్యాణ్! నీ ఆలోచన విధానం సూపర్!” అని కళ్యాణ్ ని కౌగిలించుకుని అభినందించాడు సిద్ధార్థ్. 


సిద్ధార్థ్ కొనసాగిస్తూ “అదంతా సరే కానీ, యిప్పుడు అలా మౌనంగా ఉండకురా! ఏదోకటి మాట్లాడు. నీ లోపల ఉన్నదంతా బయటికి చెప్పురా. కొంచెమైనా నీ బాధ తగ్గుతుంది!" అని అన్నాడు. 


కళ్యాణ్ నోరువిప్పి "ఏం మాట్లాడాలిరా! ఏం మాట్లాడాలి! నాకింకా యిప్పటికీ మైండ్ బ్లాంక్ గానే ఉంది. మా యింట్లో వరుసపెట్టి ఏదో దాడి చేసినట్లు జరుగుతున్నాయిరా! మనం టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా నాన్నమ్మ, బి. టెక్ చదువుతున్నప్పుడు మా తాతయ్య, జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మా అన్నయ్య, జాబ్ లో సెటిల్ అయ్యి, పెళ్లి చేసుకుంటున్నప్పుడు మా నాన్న చనిపోయారురా! నా కోపాన్ని మా నాన్నమ్మ, నా భవిష్యత్తుని మా తాతయ్య, జీవితంపైన ఆశల్ని మా అన్నయ్య, నా సంతోషాన్ని మా నాన్న, యిలా ఒక్కొక్కరు నాలో ఒక్కొక్కటి తీసుకెళ్లిపోయారు!


కోపం రావట్లేదు. ఆనందం కలగట్లేదు. ఆశలు, కోరికలు ఏం లేవు. గట్టిగా ఏడుపు కుడా రావట్లేదు! ఒక దశలో అన్ని చూసేశాక, జీవితంలో చూడడానికి యింకేమి మిగలదంట! మనిషి జీవితమంటే యింతేనా అని జీవితం మీద విరక్తి కలుగుతుంది! ఈమధ్యన దేవుడు కుడా ఎవరిని సగం అటు, సగం యిటుగా ఉంచట్లేదులే. మొత్తంగా ఒకేసారి తీసుకెళ్లిపోతున్నాడు. ఒకవేళ సగం సగంగా బ్రతికి ఉంచితే, వాళ్లని ఎవరు చూసుకోవట్లేదనేమో! ఒక్కొక్కళ్ళు ఎంత పుణ్యాలు చేసుకుంటున్నారో మరి! ఒకసారి ఆలోచించండి. 


మనతో పాటు ఉన్న అందరూ పోతున్నారు. పాపాత్ములు పోతున్నారు! పుణ్యాత్ములు అయితే ముందే పోతున్నారు!! పేదోళ్లు పోతున్నారు! పెద్దోళ్ళు పోతున్నారు!! ధనవంతులు పోతున్నారు!! గుణవంతులు పోతున్నారు!! ధర్మాన్ని పాటించేవారు పోతున్నారు! అధర్మాన్ని పాటించేవారు పోతున్నారు!! రోడ్డు మీద యాక్సిడెంట్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. డ్రైవింగ్లో ఎంత సీనియర్లు అయినా చిన్న చిన్న యాక్సిడెంట్లో పోతున్నారు! గొప్ప గొప్పోళ్ళే పోతున్నారు!! మరి, యింత మంది మధ్యన, యిన్ని అవాంతరాలు దాటి మనం యింకా బతికేస్తున్నామంటే, మనం ఏమైనా వీరులం, సూరులం అని అనుకుంటున్నారా! 


మనం జస్ట్.. అదృష్టవంతులం.. అంతే! మన టర్న్ యింకా రాలేదు అంతే! పోయినోళ్లంతా నరకం నుండి స్వర్గానికి పోతున్నారు. మనలాంటి అదృష్టవంతులంతా యి నరకంలో తాత్కాలికమైన బంధాలలో పడి ఎదురుచూస్తున్నారంతే!" అని లోలోపల లావాలాగా మరుగుతున్న బాధలో, కళ్యాణ్ లో ఎప్పుడూ చూడని, ఎప్పుడు మాట్లాడని వైరాగ్యంతో కూడిన ఒక్కో మాట వినేసరికి, అసలు మేం చూస్తున్నది మా ఫ్రెండునేనా అనేటంతగా సిద్ధార్థ్, మురళిలు తెల్లబోయి చూస్తూ, మౌనం ఆవహించి, కళ్యాణ్ మాటల అంతరార్థాలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, తిరిగి ముగ్గురు యింటికి వెనుదిరిగారు. 


***

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


 


 



 
 
 

Yorumlar


bottom of page