ఆడుతు పాడుతు పని చేస్తుంటే
- Karanam Lakshmi Sailaja
- Feb 22, 2023
- 10 min read

'Aduthu Paduthu Pani Chesthunte' New Telugu Story
Written By K. Lakshmi Sailaja
రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ
యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!
"అంటే అర్ధం ఏంటి నాన్నమ్మా?" అని అడిగాడు కౌస్తుభ్.
"ఆడవారిని ఎక్కడైతే గౌరవిస్తారో.. అక్కడ దేవతలు నివసిస్తారు' అని అర్థం. అంటే దేవతలు మనకు కనిపిస్తారని అనుకోకు. మగవాళ్ళు ఆడవారిని గౌరవించిన చోట కలతలు లేకుండా ప్రశాంతంగా, అందరూ సంతోషంగా ఉండేట్టు దేవతలు అనుగ్రహిస్తారు అని అనుకోవాలి, " అంది విధాత్రి, చదువుతున్న హిందూ పేపర్ ను పక్కన పెడ్తూ.
"మాకు సోమవారం కాలేజ్ లో ఈ విషయం మీద డిబేట్ వుంది నాన్నమ్మా. మా గ్రూప్ వాళ్ళు మాట్లాడాలి. అందుకని మాటర్ కావాలి, " అంటూ "మనూ, నువ్వు కొంచెం గూగుల్ లో చూసి ఒక రెండు పేజీల మాటర్ తయారు చేసి ఇవ్వు. నేను క్రికెట్ ఆడటానికి వెళ్తున్నా, " అంటూ చెల్లికి ఆర్డర్ వేసి బయటకు వెళ్ళి పొయ్యాడు టెన్త్ క్లాస్ చదివే కౌస్తుభ్, నైన్త్ క్లాస్ చదువుతున్న మనస్విని “నాకు టెస్ట్ వుంది, నేను చదువుకోవాలి” అంటున్నా వినిపించుకోకుండా. అక్కడే సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్న శ్రీకృష్ణ ఆ మాటలను పట్టించుకోలేదు. టి. వి. లో సీరియల్ చూస్తున్న త్రివేణి ఒకసారి తల తిప్పి చూసి, నవ్వుకుంటూ మళ్ళీ సీరియల్ లో మునిగిపోయింది. నేనునిట్టూర్చి, ఒక గంట తరువాత ఎవరూ లేకుండా చూసి మనుతో చెప్పాను, “నువ్వు కంగారు పడకు. నేను చేసిస్తాలే నువ్వు చదువుకో, ”అని.
అప్పుడే కాదు, విధాత్రి నాలుగు రోజులక్రితం వీళ్ళింటికి వచ్చినప్పటినుంచీ గమనిస్తూనే ఉంది. ఇంట్లో కౌస్తుభ్ ను ఒక రాజు లాగానూ, మనస్వినిని మామూలుగానూ చూస్తున్నారు తల్లితండ్రులు. కొడుకును ఇంటర్నేనల్ స్కూల్ లోనూ, కూతుర్ని మామూలు ఇంగ్లిష్ మీడియం స్కూల్ లోనూ చదివిస్తూన్నారు. ఆడా, మగా వివక్షత బాగా వుంది ఇంట్లో. డిగ్రీ చదివి, ఉద్యోగం చేస్తున్న త్రివేణి ఇలా అమ్మాయిని తక్కువగా చూడటం వింతనిపించింది విధాత్రికి. శ్రీకృష్ణ ఆమెకు అక్క కొడుకు. త్రివేణి ఆమెకు అన్న కూతురు. ఫంక్షన్స్ కు మాత్రమే రాకపోకలు జరుగుతున్నందున వీళ్ళింట్లో ఇలా జరుగుతున్నదని ఇంతకు ముందు విధాత్రి గమనించలేదు. ఇప్పుడు తాను వచ్చిన రెండు రోజులనుంచీ ఇంట్లో జరిగేదంతా గమనిస్తూ ఉంది. తన కొడుకు, కోడలు డార్జిలింగ్ మొదలైన ఊర్లకు టూర్ వెళ్తున్నందున, కొద్దిరోజులు తను ఒక్కతీ ఇంట్లో ఎందుకని తనను శ్రీకృష్ణా వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళారు, వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ తీరిగ్గా చూస్తోంది.
ఉదయాన్నే “మనూ త్వరగా లే, ” అంటూ ఆ పిల్లను నిద్ర లేపుతోంది, త్రివేణి. ఆపిల్ల లేచి పక్క సర్దుకొని, చక్కగా చదువుకొంది. షూ తుడుచుకొని స్నానం చేసి, క్రాఫ్ దువ్వుకొని పిన్ పెట్టుకుంది. మంచినీళ్లు ఆర్. ఓ. లో పట్టుకొని వాటర్ బాటిల్ తన బ్యాగ్ లో పెట్టుకుంది. టిఫిన్ తిని డైనింగ్ టేబుల్ మీది ప్లేట్ తీసి సింక్ లో పెట్టింది. కొడుకేమో బాగా లేటుగా లేస్తున్నాడు. వాడు లేచినప్పటి నుంచీ వాడికి అన్నింట్లో సహాయం చేస్తున్నారు, త్రివేణి, శ్రీకృష్ణలు. వాళ్ళ నాన్న వాడి పక్క సర్దాడు. వాడు స్నానం చేసి తుడుచుకొని, కుర్చీపైన వేసిన తడి టవల్ను తీసి తీగ మీద ఆరేశాడు. వాడి షూ తుడిచి పెట్టాడు. ఉతికిన సాక్స్ రెడీగా షూ పక్కన పెట్టాడు. వాడు టిఫన్ తినగానే “మనూ అన్నయ్య ప్లేట్ తీసి సింక్ లో పెట్టు, ” అని కూతురుకు చెప్పింది త్రివేణి. మను ప్లేట్ తీసింది. వాడి వాటర్ బాటిల్లో నీళ్ళు పట్టి స్కూల్ బ్యాగుకు సైడ్ న పెట్టింది, త్రివేణి. ఇదంతా వాడు రాజసంగా చేయించుకుంటూ వున్నాడు, మధ్య మధ్యలో త్వరగా అంటూ వాళ్ళను విసుక్కుంటూ ఉన్నాడు.
ఆ రోజు స్కూలుకు సెలవు. కొడుకేమో లేచి గబగబా టిఫన్ తిని మంచి కలర్ ఫుల్ టీషీర్ట్ వేసుకొని ఫ్రెండ్స్ వస్తే రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కూతురు సిక్స్ కే లేచి, చదువుకొని, కొద్దిసేపు స్కిప్పింగ్ ఎక్సరసైజ్ చేసి, స్నానం చేసి కొంచెం మంచి డ్రెస్ వేసుకోగానే, “ఇంట్లో ఉంటే అంత మంచి డ్రెస్ ఎందుకమ్మా, కొంచెం మామూలువి వేసుకో, ” అని త్రివేణి చెప్పగానే మను డ్రెస్ మార్చేసుకుంది. వాళ్ళమ్మకు మసాలాలు నూరి ఇవ్వడం, వేయించే పదార్ధాలు వేయించడం చేసి, కొద్దిసేపు న్యూస్ పేపర్ చూసి, కొద్దిసేపు చదువుకొని, వాళ్ళ నాన్న కప్ బోర్డు సర్దుకుంటూ ఉంటే కొంచెం హెల్ప్ చేసింది, తరువాత తండ్రీ, కూతుళ్ళిద్దరూచెస్ ఆడారు. ఇదంతా చూస్తున్ననేను “మనూ .. ఈ రోజు సెలవు కదా! మీ ఫ్రెండ్స్ ఎవరూ ఆడుకోవడానికి కలుసుకోరా? “ అన్నాను. “వాళ్ళు పార్క్ లో ఆడుకోవడానికి రమ్మంటారు అత్తయ్యా. అక్కడ అందరూ మగపిల్లలు ఎక్కువగా వుంటారు. అంతమందిలో ఆడుకోవడమెందుకని వీళ్ళను ఇన్డోర్ గేమ్స్ ఆడుకోమంటాను. అలా వాళ్ళకు ఇష్టముండదు. అందులోనూ వాళ్ళు టైట్ గా, ట్రాన్స్పరెంట్ గా వుండే బట్టలు వేసుకుంటారు. అలాంటివి మాకే కాదు మనుకు కూడా ఇష్టముండదు. వాళ్ళ శృతి మేడం ‘వలువలు మన విలువలు పెంచాలి’ అని చెప్తారట, అది మిగతా పిల్లలు వినరు. ఇంకా సాయంత్రాలు వీణ నేర్చుకుంటుంది. పోయిన వారం స్కూల్ డే కు రెండు కీర్తనలు వాయించింది. అందరూ చాలా మెచ్చుకున్నారు, ” అని త్రివేణి జవాబు ఇచ్చింది.
కౌస్తుభ్ ఫ్రెండ్స్ వెళ్ళగానే నా బ్యాగ్ సర్దడానికి హెల్ప్ చెయ్యమనో, నా వర్క్ బుక్స్ వ్రాయాలనో, స్కేల్ కనిపించలేదనో గొడవ చేస్తూనే వున్నాడు. త్రివేణి హడావుడిగా వాడు చెప్పిన పని చేస్తోంది. వాడసలే బొద్దుగా వున్నాడు. చిన్న షార్ట్ వేసుకొని, టైట్ టీషర్ట్ వేసుకున్నాడు. ఒక చిన్న ఏనుగుపిల్లలాగా తిరుగుతున్నాడు. మధ్యాహ్నం నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చింది మను, ఒకసారి చూడమని. అన్నీ నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చి ఉన్నాయి. సైన్స్ లో నైన్టీ టు మాత్రమే వచ్చాయి. ఆ మార్క్స్ చూడగానే నాకు చాలా సంతోషం వేసింది, చాలా చక్కగా చదువుతోంది అని. మధ్యాహ్నం సంతకం చేయమని వాళ్ళ నాన్నకు ఇచ్చింది. శ్రీకృష్ణ మెచ్చుకోలేదు సరికదా, “సైన్స్ లో ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయేంటి? ఇప్పట్నించీ సైన్స్ లో నువ్వు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోకుంటే, నేను నీకు డొనేషన్ కట్టి డాక్టర్ కోర్సేమీ చదివించను. ఫ్రీ సీట్ తెచ్చుకోవలసిందే, ” అన్నాడు సంతకం పెడుతూ. “ ఈ సారి ఎక్కువ తెచ్చుకుంటాను నాన్నా, ” అంది నెమ్మదిగా మను.
సాయంత్రం ఎవరూ లేకుండా వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నప్పుడు చూసి, కౌస్తుభ్ తన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాడు, వాళ్ళ నాన్నకు. అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మాత్రమే వచ్చాయి. ఆ మార్క్స్ చూసి నీరస పడిపోయాడు శ్రీకృష్ణ. "ఏంట్రా ఈ మార్కులు. ఇంజనీరింగ్ సీట్ కు ఇంటర్లో నయినా ఎక్కువ మార్కులు తెచ్చుకో. మార్కులు తక్కువ వస్తే డొనేషన్ ఎక్కువ కట్టాలి. కనీసం ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అవ్వడానికి కూడా ఇంకా బాగా చదవాలి, " అంటూ చిన్నగా కొడుక్కు చెప్తున్నాడు. "అలాగే నాన్నా, చదువుతాలే, " అని వాడు శ్రీ కృష్ణను ఓదార్చినట్లు చెప్తున్నాడు. ఆ మాటలు బయనుండి విన్న విధాత్రి, ఈ తల్లి తండ్రులకు కొంచెం క్లాస్ తీసుకోవలసిందే అని నిర్ణయించుకుంది. ఇద్దరూ తనకు స్వంతం వాళ్ళే కనుక తన మీద కోపం తెచ్చుకొరు. అర్థం చేసుకుంటే సరే. లేదంటే వాళ్ళ అదృష్టమెలా ఉంటే అలా జరుగుతుంది, అనుకుంది. అయితే ఒక పాఠం లాగా కాకుండా రేపటి నుంచే తన ఆపరేషన్ మొదలు పెట్టా లనుకుంది.
ఆ రోజు ఉదయాన్నే అమ్మ, నాన్నమ్మ లతో పాటు మను లేచి తన పనులు తాను చేసుకుంటోంది. కౌస్తుభ్ ఇంకా లేవలేదు. "వాణ్ణి నేను లేపుతాను. ఫరవాలేదు కదా, " అంది విధాత్రి శ్రీ కృష్ణ తో. "గట్టిగా అరుస్తాడేమో పిన్నమ్మా, " అన్నాడు తొట్లల్లో మనీ ప్లాంట్ కు తీగ కడుతూ శ్రీకృష్ణ. చూద్దాం అంటూ విధాత్రి వెళ్ళి, " ఏయ్ కౌస్తుభ్, ఆ చెట్టుమీద చూశావా! ఉడుత జామకాయలు ఎలా తింటోందో. ఇదుగో కిటికీలో కనిపిస్తోంది, " అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ. వాడు వొళ్ళు విరుచుకుంటూ లేచి, మంచం మీద నుంచే కిటికీ దగ్గరకు వచ్చి చూశాడు. స్పీడ్ గా జామకాయ తింటున్న ఉడుత కిటికీ దగ్గర అలికిడి కాగానే జర్రున కొమ్మ మీద పాకుతూ వెళ్ళి పోయింది. కౌస్తుభ్ మొహం లో చిరునవ్వు. అయినా వెంటనే మొహం లో విసుగుతో, " పో నాన్నమ్మా, నాకు నిద్దరోస్తోంది, " అన్నాడు. విధాత్రి మళ్ళీ, "ఒకసారి బయటకు రా, నాన్న ఏం చేస్తున్నదీ చూడు, " అంది. “నీకు అక్కడ హ్యాపీగా ఒక మాట చెప్తాను, ”అంది కూడా. ఆమె వైపు ఒకసారి చూసి మంచం దిగి బాత్ రూమ్ కు వెళ్ళాడు వాడు.
“త్రివేణీ కాఫీ ఇస్తావా?”అంది లోపలి చూస్తూ. “ అయ్యో అత్తయ్యా, కాఫీ తాగకుండా ఎక్కడున్నావు?” అంటోంది త్రివేణి. “ నీ కొడుక్కు కూడా, ” అంది విధాత్రి. “లేచాడా!” అంటూ ఆశ్చర్యంగా చేతిలో గరిటెతో హాల్ లోకి తొంగి చూసింది, త్రివేణి. “ ఆ.. నువ్విచ్చే పానీయం తాగి మేము వేరే పని కివెళ్ళాలి. వాడి మూడ్ మారక ముందే ఇవ్వు మరీ, ” అంది విధాత్రి నవ్వుతూ. ఈ లోపు కౌస్తుభ్ రావడంతో త్రివేణి ఇచ్చిన గ్లాసులు తీసుకొని ఇద్దరూ వాళ్ళ నాన్న దగ్గరకొచ్చారు. వాళ్ళ నాన్న చేసే తోట పనిని చూస్తున్న మనవడితో “నువ్వూ ఆ పనిలో జాయిన్ అవుతావా? “అందామె. “ఛీ, చేతులకు మట్టి అవుతుంది, ”అన్నాడు వాడు మొహం అదోలా పెట్టి. తాగడం పూర్తవగానే “ఏం ఫరవాలేదు ఇటురా. నువ్వీ కనకాంబరం మొక్కను ఈ చిన్నతొట్టిలో నాటి, నీళ్ళు పొయ్యి. రేపు రాఖీ పండుగకు నీకు రాఖీ కట్టగానే నీ చెల్లెలికి నువ్వు స్వీట్ బదులు ఈ మొక్కను చేతిలో పెట్టు బాగుంటుంది, ” అంటూ వాడి చేత మొక్క నాటించింది. చల్లటి గాలి వస్తోంది వాడి మొహం కూడా ప్రశాంతంగా వుంది. కొద్దిసేపు ఎక్సర్ సైజులు చేయించింది. ఆ పని అవ్వగానే వాణ్ని లోపలి తీసుకొని వెళ్ళి, “ఏదీ, నీ బ్యాగ్ ఎలా సర్దుకున్నావో చూద్దాం, ” అంది. బ్యాగ్ లో అనవసర వస్తువులు తీసి వేయించి, “నీ ఇంగ్లీష్ బుక్ లో ఫస్ట్ రెండు లెసన్స్ ఈ రోజు చదువుతావా, తరువాత స్నానం చేసి టిఫన్ తిందాము. ఈ రోజు పూరీ, కూర, ”అంది హుషారుగా. ఆమె వైపు ఒకసారి చూసిఇంగ్లీష్ పుస్తకం తీశాడు కౌస్తుభ్. విధాత్రి స్నానానికి వెళ్ళింది.
వచ్చిన తరువాత టిఫన్ చేసేటప్పుడు పిల్లలిద్దరినీ చెరో పక్కనా కూర్చోబెట్టుకొంది. ఒక్క పూరీతో చాలన్న కౌస్తుభ్ తో “ మా పెద్దలు ‘మేము నేతిలో పూరీల కాల్చుకొని తిన్నాము. ’అని గర్వంగా చెప్పేవాళ్ళు. మీరంత కాకున్నా వయసుకు తగ్గట్టు తింటే కదా మెదడు చైతన్యంగా ఉండి బాగా చదువుకుంటారు, ” అంటూ ఇంకో పూరి వాడి ప్లేట్ లో వేసిందామె. విధాత్రి “మనూ నిన్న వచ్చిన ఇస్త్రీ బట్టలుఇంకా కుర్చీలో అలాగే ఉన్నాయి. సర్దినట్లులేదే ?” అనింది. “ఇప్పుడు సర్దేస్తా నాన్నమ్మా, ” అంది మను. ” నువ్వొక్కదానివే ఎందుకు సర్దడం? అన్నయ్య తన బట్టలు తను సర్దుకుంటాడులే, ” అని ఆమె అంటూ ఉండగా “నాకు సర్దటం తెలియదు, ” అన్నాడు వాడు, తినేసి చెయ్యి కడుక్కుంటూ. “నువ్వు తిన్న ప్లేట్ సింక్ లో పెట్టు నాన్నా, ” అంది విధాత్రి, గొంతులో కొంచెం గంభీరత కూడా వినిపించి వాడు మను వైపు ఒకసారి చూసి, ప్లేట్ సింక్ లో పెట్టాడు. “ మను కూడా చదువుకోవాలికదా. మన పని మనం చేసుకుంటే ఒకరికి రుణపడి ఉండము. అర్ధమయ్యింది కదా!” అందామె. అవునన్నట్లు తలవూపాడు వాడు కుడా అంగీకారంగా.
“సరే పదండి. కౌస్తుభ్, బట్టలు సర్దుకోవడానికి వచ్చేదేముంది? ఒకసారి చూస్తే చేసేసుకుంటావు. ” అంటూ ఇద్దరినీ తీసుకు వెళ్ళి ఎవరి బట్టలు వాళ్ళ చేత సర్దించేసింది. ఇంకా కౌస్తుభ్ అరలో ఉన్న పొట్టి షార్ట్స్, స్లీవ్ల్స్ లేని బనియన్స్ వేసుకుంటే బాగుండదని తీసివేయించింది. వాడు అర్ధం చేసుకున్నాడు. ” మీరు ఈరోజు పేపర్ చదివారా? పోనీ ఈ మధ్య వార్తలు వింటున్నారా?” అంది సోఫాలో కూర్చుంటూ. పిల్లలకు కూడా ముఖ్యంగా కౌస్తుభ్ కు నాన్నమ్మ ఇలా వెంట వుండి మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండటం చాలా బాగుందనిపిస్తోంది. అందుకేనేమో ఇంట్లో పెద్ద వాళ్ళుంటే, పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉంటుందని అంటారు. ఉమ్మడి కుటుంబాల వల్ల పిల్లలకు మానసిక ధైర్యం కూడా వస్తుందనేది నిజమేనా! ఇద్దరూ “లేదు నాన్నమ్మా, టైం లేదు, ” అన్నారు. “కౌస్తుభ్ అలా అనకు. మీరిద్దరూ టీనేజ్ లోకి వచ్చారు. మీ చుట్టూ జరిగే విషయాలు కొంతయినా తెలుసు కోవాలి. ఇంటికి ఇంగ్లీష్ పేపర్ వస్తోంది కదా. మీరు కనీసం ఒక పది నిముషాలు హెడ్లైన్స్ చూడండి. మీ కిష్టమైన స్పోర్ట్స్ కాలం చూడొచ్చు కదా. ఈ మధ్య కామన్వెల్త్ క్రీడలు జరిగాయి చూశారా?” అంది. “ఆ నేను కొంచెం టి. వి. లో చూశాను. బెంగాల్ కు చెందిన ‘అచింత’ బంగారు పథకం గెలిచాడుగా!” అన్నాడు కౌస్తుభ్. “పుల్లెల గోపీచంద్ కూతురు మహిళల డబుల్స్ లో కాంస్యం గెలిచిందని మా టీచర్ చెప్పారు, ” అంది మనస్విని. “అమ్మో, చూశారా! మీకు క్రీడల్లో నాలెడ్జి వస్తోంది. అవును. మన ప్రధాని గారు కూడా క్రీడాకారులను “ఐక్య శ్రేష్ఠ భరతావని పతాకధీరు”లని అభివర్ణించారు. అల్లాగే మీరు కొంచెం రాజకీయాలు కుడా తెలుసుకుంటారు. పేపర్ చదవలేకుంటే బుక్స్ సర్దుకుంటూ అయినా రోజూ వార్తలు వినండి, ” అంది విధాత్రి ఇద్దరినీ మెచ్చుకుంటూ.
ఉదయం నుంచీ ఇదంతా చూస్తున్న వాళ్ళ తల్లితండ్రులకు కూడా పిల్లలు నాన్నమ్మ వెనుకే తిరుగుతూ పనులు చేసుకుంటూ, ఎంతో కొంత కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే చాలా సంతోషంగా వుంది. ఆ తరువాత రెండు రోజులు కుడా మనస్వినికి గూగుల్లో తాను చూడవలసిన సబ్జక్ట్స్ అంటే క్లాస్ విషయాలు కాకుండా జి. కే. , ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఆడపిల్లల జాగర్తల గురించి వినవలసి ఇంటర్వూస్ మొదలైన విషయాలు తెలిపింది. కౌస్తుభ్ తో లేజీ గా ఉంటే వచ్చే ఊబకాయం గురించీ, తాను అల్లరి పిల్లవాడిగా ఉంటే వచ్చే చెడ్డపేరు గురించీ, మార్క్స్ తక్కువ వస్తే వచ్చే నష్టం గురించీ వివరిస్తూ, వాడితో వాడి పనులే కాక ఇంటి పనులు కూడా వాషింగ్ మెషిన్ వెయ్యడం, కూరలు తరగడం లాంటి పనులు ఆడుతూ పాడుతూ చేయించింది. వాడిచేతే వాడి డిబేట్ కు కావలసిన మాటర్ ను తయారు చేయించింది.
ఆ రోజు స్కూల్ లో డిబేట్ లో వీళ్ళ టీం గెలిచిందన్నప్పుడు శ్రీకృష్ణ కూడా ఆశ్చర్య పొయ్యాడు. స్వయం కృషితో గెలిచిన సంతోషం కౌస్తుభ్ మొహం లో కనిపిస్తోంది. ఇక వాడు తప్పకుండా బాగా చదువుతాడు అనిపించింది. అనిపించడమేమిటీ, సాయంత్రం ఫ్రెండ్స్ వస్తే ఆడుకోవడానికి వెళ్లకపోవడమే అందుకు నిదర్శనం. విధాత్రి ‘అమ్మయ్య’ అనుకుంది. పిల్లల పని అయిపోయింది. ఇక పెద్దల పని చూడాలి అనుకుంది.
శ్రావణ మాసం లో వంటలు, పూజలు అంటూ త్రివేణి ఆఫీస్ నుంచి రాగానే రాత్రి పది వరకూ బొంగరం లాగా తిరుగుతూ పని చేసుకుంటూనే ఉంటోంది. ఒక రోజు ఉదయం “కృష్ణా, స్నానం చేసి కొంచెం కుక్కర్ కు రెడీ చేసి స్టవ్ మీద పెడతావా?” అంది విధాత్రి. “నేనా? నాకంత బాగా వంట రాదే!” విస్మయంగా అన్నాడు కృష్ణ. “అవును. నువ్వే. మేమిద్దరం పూజ దగ్గర వున్నాము. పిల్లలు చదువుకోవాలి. ‘నా భార్య బంగారం. నన్నేమీ పని చేయనివ్వదు. అన్నీ తనే చేసుకొని, మాకు అందిస్తుంది. త్రివేణి దొరకడం నా అదృష్టం’ అని ప్రేమగా పొగుడుకోవడం కాదు. నిజమైన ప్రేమ ఉంటే కనపడుతున్న పనులు చేసి, సహాయం చెయ్యాలి. వంట రాకపోవడమేముంది? మనం చేస్తుంటే అదే వస్తుంది. రా. నేను చెప్తుంటాను, ”అంది తను మిక్సీ లో పూర్ణం తయారు చేస్తూ. “ముందు మంచి నీళ్లు వంట కోసం ఈ కాన్ లో నింపు, ” అంటూ వివరంగా అన్నీ చెబుతూ కృష్ణ తో వంట చేయించింది. టి. వి. చూడటం పేపర్ చదవడం, ఫోను మాట్లాడుకోవడం. ఇవే ముఖ్యమైన పనులు గా భావించే కృష్ణకు ‘వంటింట్లో ఇంత పని ఉంటుందా’ అనిపించింది. పనిమనిషి వుంది కదా, అనుకున్నాడే కానీ ఇంటి మనుషులకు ఎంత పని ఉండేదీ ఇప్పుడే అర్ధం అయ్యింది. “వంట మనం చేసుకుందాంలే అత్తయ్యా, ” అంది మొహమాటంగా త్రివేణి. “మనము కూడా చేద్దాం. ఇవిగో ఈ పూర్ణంతో పూర్ణం కజ్జికాయలు చెయ్యాలి గా, ” అంది, బొంబాయి రవను కజ్జికాయల కోసం నానబెడుతూ.
అలా వంట చేసుకొని భోజనం చేసిన తరువాత సాయంత్రం కృష్ణ తో ఫ్రిడ్జ్ సర్దించింది. త్రివేణి స్నాక్స్ తయారు చేసింది. ఫ్రిడ్జ్ లోనుంచి ఏదో ఒకటి తియ్యడమే తప్ప ఇంత వివరంగా కూరలు, పాలు, సరుకులు ఎక్కడ ఏవి పెట్టాలి అని కృష్ణకు అసలు తెలియదు. ఎంత పని ఉందీ అనుకున్నాడు. మొహరం సెలవు రోజు వంటింట్లో కప్ బోర్డ్ లో వస్తువులన్నీ తీయించి పిల్లలు పెద్దలూ అందరి చేతా సర్దించింది. “ఇవన్నీ ఇంతకు ముందు అమ్మ ఒక్కతే చేసుకునేది, ” అన్నారు పిల్లలు. “అమ్మ ఒక్కతే చేసుకోవాలంటే ఇబ్బంది కదా? అందుకే ఇంక నుంచి అందరూ అన్ని పనులూ చేయండి. అప్పుడు అమ్మ నాలాగా మీతో ఎక్కువ విషయాలు మాట్లాడే దానికి టైం ఉంటుంది, ” అంది విధాత్రి. “ అవును నాన్నమ్మా, ”అన్నారు పిల్లలు సంతోషంగా. కౌస్తుభ్ ఇప్పుడు విసుక్కుంటూ మాట్లాడకుండా చక్కగా మాట్లాడుతూ, పనులు చేసుకుంటూ, చదువుకుంటూ వున్నాడు.
ఆరోజు సాయంత్రం పిల్లలిద్దరూ వాళ్ళ రూముల్లో చదువుకుంటూ ఉండగా విధాత్రి ఇలా అంది. “కృష్ణా, మా పెద్ద పెద్దప్ప అంటే కృష్ణారావు తాతా వాళ్ళ ఇంట్లో నువ్వు చిన్నప్పుడు గమనించావు కదా ఆయనే ఎక్కువ భాగం కుంపట్లో వంట చేసేవాడు. ఆ అమ్మమ్మ ను ‘నువ్వు వేరే పని చేసుకో’ అని చెప్పేవాడు. భార్యను గౌరవంగా చూస్తూ ‘మేడం’ అని తమాషాగా పిలవడం చేసే మా జగన్నాధం మామయ్య ను చూసి, మా బంధువుల్లో చాలా మంది పెళ్లి కావలసిన మగపిల్లలు ఇన్స్పైర్ అయ్యేవారు. తనకు ఇంట్లో ముగ్గురూ ఆడ పిల్లలయినా వాళ్ళ పనులన్నీ ఆయనే చూసేవాడు. అన్ని పనులు చేసేవాడు. మగవాడిని, నేను చెయ్యడమేమిటీ అనుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను మీ ఇంట్లో ఆడా, మగా వివక్షతను బాగా చూశాను. అమ్మాయిని హద్దుల్లో ఉంచాలని అనుకుంటున్నారే గానీ, మగ పిల్లవాణ్ణి హద్దులు లేకుండా పెంచుతున్నామని మరిచిపోయారు.
మీరిద్దరూ ఒకే నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. మగవాళ్ళ పని చేయవలసిన పని లేదు. ఆడవాళ్లే పని చెయ్యాలి అని ఆడవాళ్ళకే ఎక్కడ లేని రూల్స్ ఆపాదించి మగవాళ్ళను సోమరిపోతులుగా, ఈ మాట అన్నానని బాధపడకు. నిజంగా జరిగిందదే. మీరు సోమరిపోతు లయ్యారు. ‘నేను మగవాడిని ఇంట్లో పనులేవీ చేసే పని లేదు. అవన్నీ ఆడవాళ్ళ పనులు. ఆడవాళ్ళ పనులు మనమేంటి చెయ్యడం ‘అనే రీతి నుంచి నువ్వింకా బయట పడలేదు. అప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళూ బయట కొచ్చి ఉద్యోగం చేస్తున్నారు. రెండు పనులు వాళ్ళు ఎలా చెయ్యాలి? వాళ్ళ ఆరోగ్యం సంగతేంటి? ఇగో అనిపిస్తే పోట్లాటలు వస్తాయి. నీకైనా అది ఆరోగ్యం కాదు. ఇంటి పనుల్లో చెయ్యి పెట్టకుండా ఉంటే కౌస్తుబ్ కూడా అలాగే తయారవుతాడు. త్రివేణి చేసే ప్రతి పనీ నువ్వు కూడా చెయ్యి. అందరూ అన్ని పనులు చేస్తేనే రోజులు ఆనందంగా ఆరోగ్యంగా గడుస్తాయి, ” అంది.
“నేను కూడా నెమ్మదిగా పనులు నేర్చుకుంటాను పిన్నమ్మా. నేను ఇంతగా ఆలోచించలేదు. అన్నాడు సిన్సియర్ గా కృష్ణ. ‘నేను చేసుకుంటాలే అత్తయ్యా, ’ అంది త్రివేణి కంగారుగా. “నీ మొహం చేస్తావు. కొంచెం పని భారం తగ్గితే పిల్లల గురించి ఆలోచిస్తావు. మను తో నువ్వు ఎప్పుడైనా పది నిముషాలు గడిపావా? ఆ పిల్ల భయం తో మీరేం చెప్తే అది చేస్తోంది. కానీ ఎప్పుడైనా కొద్దిరోజులకు కోపమొచ్చి ఎదురు తిరిగితే మీ పనేంటి? పిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు. మనమెలా మలిస్తే అలా వస్తారు. ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు మంచి ఫ్రెండ్స్ గా ఉండాల్సిన అవసరం వుంది.
అమ్మాయిలకే కాదు అబ్బాయిల కు కూడా మంచి బుద్ధులు చెప్పాలి. బయట చూసే అమ్మాయిలను ఎగతాళిగా అమర్యాదగా మాట్లాడకూడదనీ, వాళ్ళు నీ చెల్లి లాంటి వాలీ ననీ, వాళ్లను గౌరవంగా చూడాలనీ చెప్పాలి. ఎంతసేపు అమ్మాయిలకు మాత్రమే బయటకు వీలైతే జాగ్రత్త గా వుండు. గౌరవంగా వుండే బట్టలు వేసుకో. అని చెప్తున్నాము. కానీ మగపిల్లలు స్లీవ్స్ లేని బనియన్, తొడలు కనిపించే షార్ట్ వేసుకుంటే బాగుండదని చెప్పడం లేదు. అంటే ఆడపిల్లలకు మాత్రమే ఎన్ని రోజులు బుద్ధులు చెప్తాము? అంటే ఆడపిల్లలు బిగుతుగా, పల్చగా ఉండే బట్టలు వేసుకోవచ్చని కాదు. మగపిల్లలు ఇంటి పని చెయ్యాలనే, మంచి బట్టలు వేసుకోవాలనీ, ఆడవారిని గౌరవించి మాట్లాడాలనీ మనం చెప్పాలి. ఎప్పుడు ఆడపిల్లలకేనా చెప్పడం? ముఖ్యంగా తల్లే వీళ్ళకు చెప్పాలి. టైం లేదనకు. టైంకల్పించుకో. వాళ్లకు ఒక స్వీట్ చేసే టైం లో వాళ్లకు నువ్వు చెప్పే మంచి మాట వాళ్లకు స్వీట్ తిన్నంత ఆరోగ్యంగా గా ఉంటుంది. సినిమాల వాళ్ళ, ఫ్రెండ్స్ ప్రభావం వల్ల వాళ్ళు ఆడవారిని నిర్లక్ష్యం చేసి మాట్లాడవచ్చు.
కౌస్తుభ్ ఇప్పటికే ఇంట్లో నిన్నూ, మను ను అలా లెక్కలేని తనం గా మాట్లాడుతూ వున్నాడు. ఆడపిల్లను హద్దుల్లో ఉంచడం కంటే మగ పిల్లవాడికి హద్దులు నేర్పించడం ఇప్పుడు ఎంతో అవసరం. స్త్రీలకు శారీరక బలం తక్కువైనా మనో బలం చాలా ఉంటుంది. చక్కగా అర్ధం చేసుకుంటారు. మనుకు నాలెడ్జి పరంగా నువ్వు ఎన్నో విషయాలు ఫోన్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఆడపిల్లను, మగ పిల్లవాణ్ణి వేరుగా చూడొద్దు. ఇద్దరూ సమానమే. ఇంకా మనం మగ పిల్లవాడికి బుద్ధులు ఎక్కువగా చెప్పాలి. మగపిల్లవాడు బయటకెళ్ళి ఆడుకోవాలి, ఆడపిల్ల ఇంట్లో నే ఆడుకోవాలి అనే రోజులు కాదు. ఆడపిల్లలకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పాలి కానీ, ఆంక్షలన్నీ ఇంకా ఆడపిల్లలకేనా? మనం మన పిల్లలను సంస్కారం తో పెంచితే సమాజం లో ఈ దౌర్జన్యాలు ఉండవు కదా. అక్కడి మగ పిల్లవాడు కూడా ఒక తల్లి బిడ్డే కదా. ఆ తల్లి వాడికి సరిగా బుద్ధులు చెప్పకుంటే వాడు నిర్లక్ష్యంగా పెరుగుతాడు. దానికి బాధ్యత తల్లే వహించాలి. ఆడపిల్లలకు సంకెళ్ళు వేసి, మగపిల్లవాణ్ణి ఆంబోతులుగా వదిలి వేస్తున్నాము. అన్నానని మనసు కష్టపెట్టుకోకు త్రివేణీ. టెన్త్ క్లాస్ దాటి కాలేజ్ కు వెళితే నీ కొడుకు ప్రవర్తన మంచిగా ఉండేట్టు ఇప్పటి నుంచే వాణ్ని మలచుకోండి. అందరూ అన్ని విషయాలు చర్చించుకోండి. అప్పుడు పిల్లలకు కూడా బాధ్యతలు తెలుస్తాయి. వాళ్ళు కూడా డబ్బు విషయం గానీ, ఇంట్లో పనుల విషయం గానీ బాధ్యతగా వుంటారు.
సౌకర్యంగా వుండే బట్టలు ఎవరైనా వేసుకోవచ్చు. కానీ ఆ బట్టల వల్ల అవతలి వాళ్ళకు మనము చీప్ గా కనిపించకూడదు. బట్టలు బాగా వేసుకున్న అమ్మాయిలను కూడా అబ్బాయిలు వెక్కిరిస్తారు కదా అని మనం మొండిగా అనుకోకూడదు. కాన్సర్ కలిగించే వాటిలో ప్లాస్టిక్ ఒకటనే కదా ప్రభుత్వాలు ఒక రకమైన ప్లాస్టిక్ ను నిషేధించాయి. అలాగే మగపిల్లలు అల్లరి చేయడానికి ఆడపిల్లలు వేసుకునే బట్టలు కూడా ఒక కారణం అని మనం అర్ధం చేసుకొని వాటిని నిషేధించుకుందాము. మనం జాగ్రత్తగా వుంటూ మగపిల్లవాడికి ఆడపిల్లలను గౌరవించమని నేర్పించాలి. ‘ఆడవారిని గౌరవించాలి’ అని చెప్పి ఈ రోజు కౌస్తుభ్ గ్రూప్ లో డిబేట్ లో గెలిచాడు. అదే భావాన్ని వాడి మనసులో బాగా నాటుకునే లాగా మీరు ప్రయత్నం చేయండి. వాడు వింటాడు. ‘మొక్కై వంగనిది మానై వంగదు కదా!’ ‘తల్లే మొదటి గురువు’ కనుక నువ్వు జాగ్రత్తగా, ఆడపిల్ల కంటే ఎక్కువగా వాడి మీదే ఒక కన్నేసి వుండు. ” అంది నచ్చచెపుతూ.
త్రివేణి మొదట కొంచెం కంగారుపడినా, నేను నా కొడుకు ను సమాజంలో గౌరవంగా ప్రవర్తించేట్లుగా పెంచుతానని ధైర్యంగా అనుకుంది. ఇన్ని రోజులూ ఆడపిల్లలకే హద్దులు చెప్పి పొరపాటు చేశానని కూడా తెలుసుకుంది. ఇంత చదివీ ఎలా పొరపాటు చేశానా అని కూడా అనుకుంది. నిజమే శ్రీకృష్ణ ఇంట్లో ఎక్కువగా పని చేయకున్నా తను పట్టించుకోలేదు. కానీ రేపు తన కొడుకు పనిచేయకుంటే కోడలు సర్దుకుంటుందనే గ్యారంటీ ఏముంది? రేపటి రోజులను గుర్తుంచుకొని తను ఇప్పుడు తన కొడుకును పెంచాలి.
శ్రీకృష్ణ కూడా ఈ విషయంలో తన ఆలోచనలను మార్చుకున్నాడని త్రివేణి కి ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ మీద మంచినీళ్ళ గ్లాసులు అతను సర్డుతున్నప్పుడు అనిపించింది. ఆ తెల్లవారి ఉదయం పనివాళ్ళు కడిగిన గిన్నెలను ర్యాక్ లల్లో సర్దుతున్న శ్రీకృష్ణ ను చూసి, ఇక ఈ ఇంట్లో పనుల్లో ఆడ పని, మగ పని అనే తేడా ఉండదు. అంతా మమేకమైపోయ్యారు. మగవారికి ఆడవారు సహాయపడతారు. ఆడవారు గౌరవించబడతారు. అందరూ సంతోషంగా వుంటారు. ఆడవారిని గౌరవించిన చోట సంతోషం వెల్లివిరుస్తుందని రుజువవుతోంది అనుకొని విధాత్రి హాయిగా ఊపిరి పీల్చుకుంది.
***
కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
Podcast Link
Twitter Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.
నెల్లూరు లో ఉంటాను.
నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.
ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.
జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.
యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.
Comments