
Agamanam - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy
Published In manatelugukathalu.com On 23/01/2025
ఆగమనం - తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“అమ్మా! నాన్నగారికి వంట్లో బాగులేదనీ, హాస్పిటల్లో ఉన్నారనీ సుధీర్ అంకుల్ ఫోన్‌చేసి చెప్పారు; వెళదామా?” అని అమ్మతో చెప్పాను.
నా మాటలు విని అమ్మ ఆశ్చర్యపోయింది; ఎప్పుడు నాన్నగారి మాట విన్నా కోప్పడే నేను ఆ రోజు హాస్పిటల్ కెళదామా అని అడిగినందుకే ఆశ్చర్యపోయిందని గ్రహించాను;
కొద్దిసేపు అమ్మ మౌనం దాల్చి "ఎప్పుడు మీ నాన్న మాట ఎత్తినా ఒంటికాలు మీద లేచే దానివి; ఇప్పుడేంటి వెళతానంటున్నావు? నువ్వు వెళితే మాధవ్‌కి నచ్చదు. ఆలోచించుకో" అని చెప్పింది. అమ్మ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు.
ఎందుకంటే అమ్మకి నాన్నంటే మొదట్నుంచీ కోపం. అందుకే నేను పుట్టిన రెండేళ్ళకు నాన్నగార్నుంచి విడాకులు తీసుకొని మాధవ్ గారిని పెళ్ళాడింది.
18 ఏళ్ళ వరకూ అమ్మ పెంపకంలోనే ఉండాలన్న కోర్టు ఉత్తర్వు వల్ల నేను అమ్మ దగ్గరే పెరిగాను. ఎనిమిదేళ్ళ వరకూ నేను మాధవ్ గార్ని డాడీ అనే పిలిచేదాన్ని. కానీ ఒకసారి నన్ను చూడటానికి వచ్చిన నా అసలు కన్న తండ్రి రఘురామ్ గారు నాతో తనే నా కన్నతండ్రనీ, మాధవ్ నా తండ్రి కాడనీ, అతన్ని అంకుల్ అని పిలవమనీ చెప్పడంతో నేను ఆ విషయాన్ని తరువాత మా అమ్మతో చెప్పాను.
అమ్మ వెంటనే నా మీద కోప్పడింది. అందుకే నేను అతన్ని రావద్దనీ, వచ్చినా ఇటువంటి మాటలు నీకు చెప్పొద్దనీ ఎన్నిసార్లు చెప్పినా అతను వినటం లేదు. చూడు! ఇప్పుడు నేను, రఘురామ్ గారు విడిపోయాము. కాబట్టి అతను నా భర్త కాడు. ఇప్పుడు మాధవ్ గారే నా భర్త. కాబట్టి మాధవ్ గారే నీకు తండ్రి. ప్రస్తుతం నువ్వు చిన్నదానివి. నీకు ఇంతకన్నా వివరంగా చెప్పలేను. కాబట్టి నువ్వు అతన్ని మాటలను వట్టించుకోకుండా మాధవ్ గార్ని డాడీ అనే పిలుపు. అందరి ముందూ అతన్ని అంకుల్ అని పిలిస్తే బావుండదు. ముఖ్యంగా నీ స్నేహితులు దగ్గర" అని గట్టిగా చెప్పింది అమ్మ.
దాంతో ఇంట్లో మాధవ్ గార్ని డాడీ అని పిలిచినా నాకు లోలోపల ఇష్టం ఉండేది కాదు;
రాను రాను నాకు వయసు పెరిగి పెద్దదాన్నవడంతో అమ్మ నాన్నల విడాకులు, మాధవ్ గారితో ఆమె పెళ్ళి అన్నీ తెలిసాయి. నాకెందుకో అమ్మ మా నాన్నగారితో విడిపోయిందంటే బాధగా ఉండేది. విడిపోయినా పరవాలేదు. కానీ ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు నాకు కోపం కలిగేది. అయినా అమ్మతో ఆ మాట అనే ధైర్యం ఉండేది కాదు నాకు.
నేను ఇంటర్లో చేరిన దగ్గర్నుంచీ నాన్న రావడం తగ్గించేసారు. అంతవరకు ప్రతీ ఆదివారం మా స్కూలుకి వచ్చి నాతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నా చదువు గురించి, ఆరోగ్యం గురించి అడిగేవారు తప్పా అమ్మ గురించి అస్సలు అడిగేవారు కాదు.
నాకు మా నాన్నగారిని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అతను మా అమ్మతో విడాకులు తీసుకున్నారు అంటే ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వుండబట్టే కదా? కానీ అమ్మ గురించి ఒక్కనాడు కూడా తప్పుగా చెప్పేవారు కాదు.
అమ్మ మాత్రం నాన్న గురించి చాలా చెడ్డగా చెప్పేది. తనను శారరీకంగా, మానసికంగా ఎంతో హింసించే వాడనీ, ఒక్కోసారి చేయి కూడా చేసుకునేవాడనీ, అయినా తాను ఎంతో సహించి ఐదు సంవత్సరాలపాటు కాపురం చేసాననీ, కానీ రానురాను హింస మితి మీరడంతో తప్పక విడాకులు తీసుకున్నాననీ, పెళ్ళైన తరువాత ఇంక రెండో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాననీ, కానీ వంటరి ఆడది ఈ సమాజంలో బతకడం కష్టం అని తెలుసుకొని తప్పక మాధవ్‌ని పెళ్ళి చేసుకోవలసి వచ్చిందని ఏడుస్తూ చెప్పేది.
అలా చెబుతున్నప్పుడు మాత్రం నాకు మా అమ్మ అంటే ఎంతో జాలి కలిగేది. మా అమ్మను ఎన్నో బాధలు పెట్టి విడాకులు తీసుకున్న మా నాన్నంటే బాగా కోపం వచ్చేది.
అమ్మ ఎప్పుడూ మాధవ్ గారు చాలా మంచి మనిషనీ, నన్ను తన స్వంత కూతురిలా చూసుకుంటున్నాడనీ చెప్పేది.
కానీ నాకెందుకో అతన్ని చూస్తే నచ్చేది కాదు. అతను ఎప్పుడూ అమ్మని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉండేవాడు. నాన్నతో సమాన హక్కులు గురించి పోట్లాడి విడాకులు తీసుకున్న అమ్మ మాధవ్ అంకుల్‌తో మాత్రం రాజీపడిపోయి అతను ఏది చెబితే అది చేసేది.
అతను తరచూ నా విషయంలో జోక్యం చేసుకుంటూ ఉండేవాడు. నేను ఇంటర్లో ఏ గ్రూపు తీసుకోవాలన్న దగ్గర్నుంచీ ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ చదవాలన్న వరకూ అతని జోక్యం ఉండేది. నా విషయంలో మా అమ్మ తప్ప అతని జోక్యం నాకు నచ్చేది కాదు.
మా అమ్మ తరచు అతను నా తండ్రి అనీ, అతనికి నేనంటే ఎంతో ప్రేమనీ కాబట్టి అతని మాట వినాలనీ చెబుతుండేది; కానీ వాస్తవంలో అతని ప్రవర్తన అమ్మ చెప్పేదానికి విరుద్ధంగా ఉండేది; అతను నన్ను చూసే చూపు నాకు తండ్రి భావన కలిగించేది కాదు.
నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ రేణుక ద్వారా ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మా అమ్మ రెండవ వివాహం చేసుకున్న మాధవ్‌కి ఇదివరకే పెళ్ళి అయిందనీ, అతనికిద్దరు పిల్లలు కూడా ఉన్నారనీ, అమ్మకి ఆ విషయాలేవీ చెప్పకుండా వివాహం చేసుకున్నాడనీ ఆమె చెప్పింది.
బహుశా అమ్మకి ఆ తరువాత అతని పెళ్ళి విషయం తెలిసి ఉండొచ్చు. అయినా ఏమీ చెయ్యలేని నిస్సహాయత అమ్మది.
అమ్మ మా ఊరి కాలేజిలోనే లెక్చరర్‌గా పనిచేస్తోంది. మాధవ్ గారు కూడా మా అమ్మ పనిచేస్తున్న కాలేజీలోనే లెక్చరర్‌గా చేస్తున్నారు. మా నాన్నగారు ఆ కాలేజీలోనే మొదట్లో పనిచేసినా అమ్మతో విడాకుల తరువాత ప్రొఫెసర్‌గా యూనివర్సిటీలోకి మారిపోయారు.
మాధవ్ గారు కాలేజీలో లెక్చరర్‌గా చేరిన తరువాత అమ్మ నాన్నగారితో విడాకులు తీసుకుంది. దానికి కూడా మాధవ్ గారే కారణమట. నాన్నగారి మీద లేనిపోనివి చెప్పి అమ్మ మనసుని విరిచేసాడట. ఆతరువాత అమ్మవాడి వలలో చిక్కుకొని పెళ్ళిచేసుకుంది. ఇవన్నీ నాకు రేణుకే చెప్పింది.
ఆలోచనల్లోంచి బయటపడి ఏం చెయ్యాలోనని ఆలోచించసాగేను. నాకు మాత్రం నాన్నగారిని చూడాలనే ఉంది. మా నాన్నగారిని చూడాలంటే మధ్యలో మాధవ్‌గారి అనుమతి దేనికి? అతనికేం సంబంధం? అతనికి నేనెందుకు చెప్పి వెళ్ళాలి? కన్నకూతురిగా తండ్రికి వంట్లో బాగులేనప్పుడు వెళ్ళడం నా ధర్మం. దీనికి ఎవ్వరి అనుమతీ అక్కర్లేదు. ఈ ఆలోచన రాగానే నా మనస్సు కుదుట పడింది.
పది నిముషాల తరువాత నేను బాత్‌రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెషప్ అయి ఫ్రెండు దగ్గరకు వెళతానని చెప్పి హాస్పిటల్ దగ్గరికి ఆటోలో బయలుదేరాను.
అరగంటలో అక్కడికి చేరుకొని నాన్నగారు ఉంటున్న గదిలోకి వెళ్ళాను.
నాన్న బెడ్ మీద నీరసంగా కనిపించారు. వారం రోజుల నుంచీ జ్వరం తగ్గకపోవడంతో హాస్పిటల్లో చేరవలసి వచ్చిందనీ, రేపు డిశ్చార్జి చేస్తామనీ డాక్టరుగారు చెప్పారు.
మా నాన్న నన్ను చూసి ఎంతో సంతోషించారు. అతని కళ్ళల్లో ఒక వెలుగు కనిపించింది. నన్ను బెడ్‌మీద కూర్చోపెట్టుకొని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంతలో నాన్నగారి స్నేహితుడు వెంకటరమణ గారు అక్కడికి వచ్చారు. అతను కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
నన్ను చూసి అతను చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఇంతలో నర్సు ఇంజక్షన్ చెయ్యాలని చెప్పడంతో నేను, అంకుల్ వెంకటరమణ గారు బయటకు వచ్చాము.
అప్పుడు అంకుల్ నాతో నాన్న గురించి చెప్పడం మొదలు పెట్టారు.
"వినీలా! మీ నాన్న వంటరితనంతో బాధపడుతునాడు. అది సంవత్సరం నుంచి బాగా ఎక్కువైంది. ఇప్పుడు హాయిగా భార్యా, పిల్లలతో ఇంట్లో ఆనందంగా గడపవలసిన సమయం. కానీ మీ అమ్మ తొందరపాటు వల్ల వాడి చెయ్యి దాటిపోయింది. పోనీ నిన్నైనా తరచు చూడాలని వస్తే కోర్టు ద్వారా ఎన్నో అడ్డంకులు సృష్టించింది. అందుకు ఆమెకు తెలియకుండా స్కూలు దగ్గరకొచ్చి నిన్ను కలిసేవాడు. కోర్టు నీకు పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు తల్లి సంరక్షణ అని చెప్పింది. ఇప్పుడు నువ్వు మేజర్ వి; ఎక్కడ ఉండాలో అన్నది నీ ఇష్టం. ఆమె అనుమతి అవసరం లేదు" అని చెప్పాడు అతను.
అతని మాటలు నాకాశ్చర్యం కలిగించాయి.
"అంకుల్! మా అమ్మా నాన్న ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఎవరిది తప్పు? అమ్మ మాత్రం మా నాన్న ఆమెను చాలా బాధలు పెట్టారని చెబుతూ ఉంటుంది" అని అడిగాను.
నా మాటలకు అతను కొద్దిసేపు మౌనం దాల్చి "అది అబద్ధం వినీలా! మీ నాన్న నాకు చిన్ననాటి స్నేహితుడు. వాడి సంగతి నాకు బాగా తెలుసు. మంచితనానికి వాడు పెట్టింది పేరు. విడాకులకు మీ అమ్మే కారణం. మీ అమ్మ అలా ప్రవర్తించడానికి ఆ మాధవ్ గాడే కారణం. వాడు కాలేజీలో చేరిన తరువాతే మీ అమ్మ నాన్నలకు గొడవలు పెద్దవయ్యాయి. వాడు మీ అమ్మని వల్లో వేసుకొని మీ నాన్న మీద లేనిపోని చాడీలు చెప్పి ఆమె మనసు విరిగిపోయేటట్లు చేసాడు. వాడి గురించి సరిగ్గా తెలియని మీ అమ్మ వాడి మాటలు నమ్మి మీ నాన్నతో గొడవలు పెట్టకుంది. ఆ తరువాత వాడితో సంబంధం పెట్టుకొని మీ నాన్నని ద్వేషించడం మొదలు పెట్టింది. మీ నాన్న అన్నీ సహించాడు కానీ వాడితో సంబంధాన్ని మాత్రం తట్టుకోలేక పోయాడు. గొడవలు పెద్దవైతే నీ పెంపకం మీద దాని ప్రభావం పడుతుందన్న భయంతో విడాకులు తీసుకున్నాడు. ఎన్నోసార్లు వాడిని మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని చెప్పేను కానీ అలా పెళ్ళి చేసుకుంటే నా కూతురుకి ముఖం చూపించలేను; అటువంటి తప్పు పని చెయ్యను అని చెప్పేవాడు" అని చెప్పాడు ఆయన.
"అంకుల్! మాధవ్ గారికి ఇదివరకే పెళ్ళైందట! నిజమేనా" ? అని ఆయన్ని అడిగాను.
"నిజమనమ్మా! మాకెవ్వరికీ తెలియదు. వేరే ఊరి నుంచి వచ్చి కాలేజీలో చేరడంతో అతని గురించి ఎవ్వరికీ తెలియదు. తన పెళ్ళి విషయం మీ అమ్మ దగ్గర దాచిపెట్టి మీ అమ్మని పెళ్ళి చేసుకున్నాడు. మీ అమ్మ వాడిని నమ్మి తన దగ్గర ఉన్న డబ్బు అంతా వాడికే ఇచ్చేసింది. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మీ అమ్మ తన డబ్బుతోనే వాడిపేరు మీద కొన్నది. రేప్పొద్దున వాడు గానీ మోసం చేస్తే మీ అమ్మ రోడ్డు మీద పడుతుంది. ఇవన్నీ సరేనమ్మా! నువ్విప్పుడు మేజర్‌వి. మీ నాన్న నీ కోసం ఎంతో బాధపడుతునాడు. ఇప్పుడు వాడిని చూడవలసిన బాధ్యత నీదే. ఆలోచించుకో" అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.
అతని మాటలు నన్ను ఆలోచనల్లో పడేసాయి;. ఏం చెయ్యాలో తోచలేదు.
*** *** ***
రెండు రోజుల తరువాత నాన్నని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసారు. నాన్నతో పాటు నేను కుడా అతనుంటున్న ఇంటికి వెళ్ళాను. నాన్న నేను అక్కడికి వెళ్ళినందుకు సంతోషించేరు కానీ మా అమ్మ ఏ గొడవ పెడుతుందోనని భయపడ్డారు.
కానీ మర్నాడు అమ్మతో కొన్నిరోజులు నాన్నగారి దగ్గరకి వెళ్లి ఉంటానని చెప్పాను.
అమ్మ తనను విడిచి వెళ్ళొద్దని ఏడుస్తూ చెప్పింది కానీ నాకెందుకో ఆ మాధవ్ ఉన్న ఇంట్లో ఉండబుద్ధి కాలేదు.
అమ్మతో గొడవ పెట్టుకొని మా నాన్నగారి దగ్గరికి వచ్చేసాను.
ఇప్పుడు నాకు హాయిగా, ఆనందంగా ఉంది. నాన్నగారికి ఎంతో ఇష్టంగా, ప్రేమతో సేవలు చేస్తున్నాను. ఇప్పుడు నాన్న ఎంతో ఆరోగ్యంగా తయారయ్యారు. అమ్మ అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తోంది. నేను అమ్మని కూడా మా దగ్గరకి రమ్మనమని చెప్పాను.
అమ్మకు నేను కావాలి. నాకు మా నాన్న దగ్గర ఉండటం ఇష్టం. అమ్మ మాధవ్ గారితో ఉండటం నాకు ఇష్టం లేదు. అతన్ని వదిలి నాన్న దగ్గరకు రమ్మనమని అమ్మకు చెప్పాను. కానీ అది అంత సులభం కాదని, మా నాన్న గారు ఒప్పుకోరని అమ్మ చెప్పింది. నేను నాన్న గారితో చెబుతానని అమ్మకి చెప్పాను.
అమ్మ నా మాటలకు మౌనం దాల్చింది. ఆమె మౌనంలో నాకు ఎన్నో అర్ధాలు తోచాయి. ఆమె తిరిగి నాన్న దగ్గరకు వస్తే సమాజం హర్షించదని, నాన్నకూడా ఒప్పుకోరని ఆమె భయం. ఇప్పుడామె ఒక వలయంలో చిక్కుకుంది. దాన్నుంచి బయటకు రావడం కష్టం. ఏదైనా కాలమే అన్నింటికీ సమాధానం చెప్పాలి.
ఆరు నెలల తరువాత మాధవ్ గారు ప్రమాదంలో చనిపోయారన్న కబురు తెలిసింది. నేను వెళ్లి అమ్మను చూసి వచ్చాను. అమ్మ ఇప్పుడు ఆ ఇంట్లో వంటరిగా ఉంటోంది. నాకు మా అమ్మ ని చూస్తే జాలి వేసింది. నాతో నాన్న దగ్గరకు వచ్చెయ్యమని చెప్పాను. మీ నాన్న ఒప్పుకోరని అమ్మ ఏడుస్తూ చెప్పింది. నేను నాన్నకు చెబుతానని చెప్పి నాన్న దగ్గరకు వచ్చేసాను.
అప్పట్నుంచి రోజూ మాఅమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నాను.
నాకైతే అమ్మ ఎప్పటికైనా వస్తుందనే ఆశ వుంది. కాల చక్రం తిరుగుతూ వుంది. అమ్మ ‘ఆగమనం’ కోసం నా నిరీక్షణ కొనసా.. గుతూనే వుంది.
(సమాప్తం )
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments