'Agani Varsham' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 13/04/2024
'ఆగని వర్షం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"మనకి వేరే మార్గం లేదు అమృత.. ఏమంటావు.. ?" అన్నాడు ఆనంద్
"మీరు ఏమంటే అదే చేస్తాను.. చెప్పండి.. !"
"మన జీవితాలు ఇక మారవు. నాకు ఈ కష్టాలు ఎలాగో తప్పవు. ముందు నేను విషం తీసుకుంటాను. ఆ తర్వాత నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో.. కన్నకూతురు భర్త లేని పరిస్థితి లో ఇంటికి వస్తే, పాత గొడవలు అన్నీ మరచి తప్పక ఆదరిస్తారు అమృత.. "
"అదేంటండీ అలా అంటారు.. ? మీ తోనే నా జీవితం.. మీరు ఎక్కడ ఉంటే నేనూ అక్కడే. నేను మా పుట్టింటికి వెళ్తానని ఎలా అనుకున్నారు.. ?" అంది అమృత బాధతో
"నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు.. ! అనాధ అయిన నన్ను ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా.. నా కోసం వచ్చేసావు. ఇప్పటికి రెండు సంవత్సరాలు కావొస్తోంది.. ఇంకా మనకోసం ఎవరూ రాలేదు. మీ ఇంట్లో నన్ను ఇంకా అల్లుడుగా ఒప్పుకోవట్లేదు.. నేను చనిపోవడమే కరెక్ట్. ఆ తర్వాత నిన్ను మీ ఇంటికి పిలుస్తారు.. వెళ్ళు"
"మీరు లక్ష చెప్పండి.. నేను ఒప్పుకోను.. " అంది అమృత
"పెళ్ళైన కొత్తలో మనం చాలా హ్యాపీ గా ఉన్నాం. ఆ తరువాత నాకు ఈ మాయదారి రోగం రావడం.. ఇప్పుడు నేను ఈ వీల్ చైర్ కే పరిమితం కావడం నా దురదృష్టం. ఏ పనీ చెయ్యడానికి లేదు. నా కోసం వచ్చిన నీకు.. కనీసం రెండు పూటలా తిండి కూడా పెట్టలేకపోతున్నానన్న బాధ నన్ను దహించి వేస్తోంది.. "
"అంత బాధ పడకండి.. తీసుకుంటే, ఇద్దరం విషం తీసుకుందాం.. చావులో కూడా నేను మీ వెంటే వస్తాను.. మీరు లేని జీవితం నాకూ వద్దు.. " అంది అమృత ఆనంద్ చేయి పట్టుకుని
"నా మీద నీకున్న ప్రేమకు ఆనందపడాలో లేక బాధపడాలో నాకు అర్ధం కావట్లేదు. పోనీ, అలాగే కానీ.. ఆ తలుపు వేసి, ఇక్కడకు రా. ఆఖరి సారిగా ఆ దేవుడిని తలచుకుని.. ఇద్దరం విషం పుచ్చుకుందాం.. " అన్నాడు ఆనంద్
తలుపు వేసి వచ్చిన తర్వాత.. ఎవరో తలుపు కొట్టిన శబ్దం వచ్చింది..
"బయట నాలుగు రోజుల నుంచి బోరున వాన కురుస్తోంది. ఎక్కడ చూసినా నీళ్లు, బురద.. గాలితో చెట్లు కూడా పడిపోయాయి. ఈ సమయంలో ఎవరు వచ్చినట్టు?" అన్నాడు ఆనంద్
"ఏమోనండి.. ! తెలియట్లేదు.. " అని వెళ్లి తలుపు తీసింది అమృత
తలుపు తీసిన అమృత.. వచ్చిన మనిషిని చూసి.. వెంటనే భర్త ను పిలిచింది..
"ఏవండీ.. ! ఒకసారి ఇటు రండి.. ఈ మనిషి ఎవరో చాలా విచిత్రంగా ఉన్నాడు.. " అని మెల్లగా భర్తను పిలుచుకుని వచ్చింది అమృత
"ఎవరు మీరు.. ?" అని అడిగాడు ఆనంద్ ఆ మనిషిని చూస్తూ..
"ఈ వర్షం లో.. నా ఇల్లు కొట్టుకు పోయింది. చుట్టుపక్కల మీ ఇల్లు ఒక్కటే కనిపించింది. ఈ వర్షం తగ్గేవరకూ మీ ఇంట్లో కాస్త చోటు ఇస్తారేమోనని వచ్చాను.. " అన్నాడు ఆ మనిషి
అమృత.. భర్తను పక్కకు పిలిచి.. "మనం చనిపోయేముందు, ఒక మనిషికి ఉపయోగపడితే అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి.. అతనిని ఇంట్లోకి పిలవండి. మనం తినకపోయినా, అతనికి పెడితే పుణ్యమైనా వస్తుంది.. " అని చెప్పింది
"అలాగే అమృత.. " అని ఆ మనిషిని ఇంట్లోకి పిలిచి.. తినడానికి ఉన్నది ఇచ్చారు..
"మిమల్ని చూస్తే చాలా బాధగా ఉంది.. మీకు ఏమైంది.. ?" అని అడిగాడు ఆ మనిషి
"నేను బాగున్న రోజుల్లో, బాగా సంపాదించి మేము చాలా ఆనందంగా ఉండేవాళ్ళము. కొన్నాళ్ల క్రితం, ఒక యాక్సిడెంట్ లో నా వెన్నెముకకు దెబ్బ తగిలి.. నేను పూర్తిగా ఈ వీల్ చైర్ కు పరిమితం అయ్యాను. వైద్యం కోసం డబ్బులు లేవు. నన్నే నమ్ముకుని వచ్చిన నా భార్య ను కూడా సుఖ పెట్టలేకపోతున్నాను. అందుకే.. " అని చెప్పడం ఆపేసాడు ఆనంద్
"విషం తీసుకుందామని నిర్ణయించుకున్నారు.. " అని పూర్తి చేసాడు ఆ మనిషి
"మీకెలా తెలుసు.. ?" అని అడిగింది అమృత
"ఆ విషం సీసా చూస్తే తెలిసింది.. " అని జవాబు ఇచ్చాడు
"వర్షం తగ్గేవరకూ మీరు ఇక్కడే ఉండవచ్చు. మాకు ఉన్నదానిలో మీకు పెడతాం.. " అన్నారు ఆ దంపతులు
అలా రెండు రోజులు గడిచాయి. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. మనం ఎలాగో చనిపోతాము.. మనం తినకపోయినా పర్వాలేదు.. అతిధికి పెట్టడం ముఖ్యం.. అని భార్యాభర్తలు ఇద్దరు పస్తులు ఉండి.. ఆ మనిషికి తిండి పెట్టారు. ఇదంతా గమనించిన ఆ మనిషి మనసు చలించిపోయింది.
మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి.. ఆ మనిషి ఎక్కడా కనిపించలేదు. ఎదురుగా టేబుల్ మీద ఒక ఉత్తరం గాలికి రెప రెప లాడుతూ కనిపించింది. దానిని తీసి చదివింది అమృత..
"మీకు తినడానికి లేకపోయినా.. నా కోసం తినడానికి పెట్టారు. మీరు చాలా మంచివారు. ఈ ఆగని వర్షం మీ జీవితాలను మార్చబోతున్నాది. నేను ఒక దెయ్యాన్ని. అలా చెబితే,మీరు భయపడి ఇంట్లోకి రానివ్వరని చెప్పలేదు. నేను నివసించే చెట్టు ఈ వర్షానికి కూలిపోయింది. ఈ వర్షం లో ఎక్కడికీ వెళ్ళడానికి లేక, తగ్గేవరకూ ఊరి చివర ఉన్న మీ ఒక్క ఇల్లు మాత్రమే ఉండడానికి కనిపించింది. ఇక్కడకు వచ్చిన తరవాత, మీ పరిస్థితి చూసి ఏదో సహాయం చెయ్యాలనిపించింది. నేను ఉండే చెట్టు కింద భూమిలో, దొంగలు దాచుకున్న నగలు చాలా ఉన్నాయి. నాకు ఉపయోగపడని ఆ నగలు, మీలాంటి మంచివారికి ఉపయోగపడగలవని రాత్రి వెళ్లి తీసుకుని వచ్చి ఇక్కడ ఉంచుతున్నాను. ఈ బంగారం తో, మీ జీవితాలు బాగుచేసుకోండి. మీ మంచితనమే మిమల్ని ఎప్పుడూ కాపాడుతుంది. సెలవు.. మీ అతిధి దెయ్యం.. "
ఉత్తరం చదివిన తరువాత.. మనసులోనే ఇద్దరూ ఆ మనిషికి ధన్యవాదాలు చెప్పుకున్నారు.
*******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Kommentare