top of page
Writer's pictureLakshmi Madan M

అగరు బొట్టు


'Agaru Bottu' New Telugu Story


Written By Lakshmi Madan



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఈరోజుల్లో అగరు అంటే ఎవరికీ తెలుస్తుందో లేదో... అగరు అంటే బొట్టు కోసం వాడే పదార్థం అప్పట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అదే బొట్టు వాడుకునే వాళ్ళము. అదెలా తయారు చేసి పెట్టుకుంటారో చూద్దాం.


ప్రతి ఇంటిలో అగరుబొట్టు బోలెడంత నిల్వ ఉంచుకునే వాళ్ళు. ఒకవేళ ఇళ్లల్లో అయిపోయినా పక్కింట్లోను ఎదురింట్లోనూ తెచ్చుకునే వాళ్ళము కానీ తప్పకుండా ప్రతి ఇంట్లో అగరుబొట్టు మాత్రం ఉండేది.


అగరు అయిపోవస్తుందంటే మా నాయనమ్మ ఆరున్నొక్క రాగం అందుకునేది.


మా అమ్మను పిలిచి "ఓ పిల్ల.. అదే అయిపోయింది చూసుకున్నావా.. పిల్లలకి ఏం పెడతావ్? ఏది సోయే ఉండదు" అని గులిగేది.


"అయ్యో చూసుకోలేదు అత్తా.. తుమ్మకాయ తెచ్చి తయారు చేస్తా" అని సమాధానం చెప్పేది.


ఆ వెంటనే అమ్మ మమ్మల్ని పిలిచి "మామిడి వాళ్ళ ఇంట్లో తుమ్మ చెట్టు ఉంది. కొన్ని కాయలు రాలగొట్టమని చెప్పి ఏరుకొని రండి" అని చెప్పేది. ఇక మేము ఒక బట్ట సంచి తీసుకొని బయలుదేరే వాళ్ళము.


"ఓ మామిడి పెంటయ్య.. మా అమ్మ తుమ్మకాయ తీసుకొని రమ్మన్నది. కొంచెం రాలగొట్టవా" అని అడిగే వాళ్ళము.


అప్పుడు పెంటయ్య "తుమ్మకాయ గావాలే.. రాలగొట్టి ఇత్త తీ మా వొల్లు తలెల గట్క ఏసిండ్రు. గదితిని రాల గొడ్త" అని చెప్పి పెంటయ్య తెల్లగా తోమిన ఒక ఇత్తడిగిన్నెలో పసుపుపచ్చ రంగు ఉన్న మొక్కజొన్న గట్కా వేసుకొని, అందులో ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిరపకాయ పక్కన పెట్టుకొని, దానిలో పచ్చిపులుసు పోసుకొని ఉల్లిగడ్డ మిరపకాయ నంచుకుంటూ తింటుంటే మాకు కూడా తినాలని అనిపించేది.


నిజంగా అప్పటి తిండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని తినేవాళ్లు.. కట్టెల పొయ్యి మీద వంటలు చేసే వాళ్ళు కదా.. వంట అయిన తర్వాత కట్టెలన్నీ తీసివేసి వండిన పదార్థాన్ని అట్లానే పొయ్యి మీద ఉంచేవాళ్ళు. అప్పుడు పొయ్యిలో ఉన్న సెగకి అన్నము లేదా గట్గా పాలు కూరలు అన్ని వేడిగా ఉండేవి.


మా ఇంట్లో అయితే ఆ వేడి పొయ్యిలో నిప్పులన్నీ తీసివేసిన తర్వాత నెయ్యి గిన్నె పెట్టి ఉంచేది అమ్మ. చక్కగా కరిగి అన్నం తినేటప్పుడు బాగుండేది.


అట్లా మేము ఆలోచనలో ఉండగానే పెంటయ్య తలేలో ఉన్న గత్క ను తాగేసి చేతులు కడుక్కొని పెద్ద ఇద్దరు చెంబుతో నీళ్లు గటగట తాగేసి బయటకు వచ్చి బ్రేవ్ మని తేల్చి...


పండ్రి అమ్మలు ! అని పెరట్లో ఉన్న తుమ్మ చెట్టు దగ్గరికి వచ్చి కట్టే తీసుకొని తుమ్మకాయలు అందిన అన్ని రాలగొట్టి.


" సాలా.. ఇంక గావాల్నా" అని అడిగేవాడు..


మేము ఇంకా ఎక్కువ రాలగొడితే అవన్నీ ఏరడానికి బోలెడు సమయం పడుతుందని "చాల్లే పెంటయ్య" అని చెప్పి కాయలన్నిటిని సంచిలోకి ఏరుకునే వాళ్ళము. అక్కడక్కడ ఉన్న పల్లేరు కాయలు కాళ్లకు గుచ్చుకునేవి. ఆ ముళ్ళను తీసేసుకొని మళ్లీ ఆ కాయలను ఏరుకొని ఇంటికి వచ్చేవాళ్ళము. ప్రకృతిలో ఉన్న అన్నిటిని స్పృశించాము ఆ రోజుల్లో.. అందుకని అన్నిటి విలువ తెలిసేది. నడిచేటప్పుడు ముళ్ళు ఉంటాయని, గుచ్చుకుంటే ఎలా తీసుకోవాలని, ఏ చెట్టు ఎలాంటిదని.. ఇలా అన్నిటితో అనుబంధం ఉండేది. నిజంగా ఆ రోజులు తిరిగి రావేమో...


ఇక సంచి పట్టుకొని ఇంటికి రాగానే నాయనమ్మ ఎదురుగానే ఉండేది..


"తెచ్చినార్ర తుమ్మ కాయలు" అని అడిగేది.

" ఆ ఆ.. తెచ్చినం " అని సంచి ఇచ్చేవాళ్ళం.


"ఇంతేనా.. ఇంకా కొంచెం తేవద్దా? ఆ పెంటయ్య రాలగొట్టలేదా.. అడుగుతా ఉండు" అని అనేది నాయనమ్మ.


మేమే చాలు అన్నమంటే ఎక్కడ తిడుతుందో అని "ఆ కాదే నాయనమ్మ.. ఆయన బాయి దగ్గరకు వెళ్తున్నాడు. అందుకనే కొంచెం రాలగొట్టేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం కావాలంటే ఇస్తా అన్నాడు” అని చెప్పాము.


"అట్లనా.. అయితే కానీలే.. మల్లోపారి చేసుకుందాం" అన్నది నాయనమ్మ.


హమ్మయ్య అని అనుకొని మేము ఆటల కోసం బయటపడే వాళ్ళము. సాయంత్రం అన్ని పనులు అయ్యాక అమ్మ తుమ్మకాయలను చక్కగా కడిగి ఆరబెట్టేసి రోలు దగ్గరికి తెచ్చి పెట్టేది. తను దంచడం మొదలు పెట్టగానే మేము వెళ్లి కూర్చున్న వాళ్ళము. మమ్మల్ని కూడా కొంచెం కొంచెం సేపు దంచమని చెప్పేది.


దంచుతుంటే వాటి నుండి రసం వచ్చేది. అలా వాటిని మెత్తగా దంచిన తర్వాత ఆ రసమంతా పిండేసి దాన్ని మొత్తం వడకట్టేసి అంతా రసాన్ని చిన్న చిన్న గిన్నెలో పోసి పెట్టేది అమ్మ సాంచాలు అన్నమాట.


ఆ రసం పోసి పెట్టిన గిన్నెలన్నిటిని ఎక్కువగా వాడని ఒక గదిలో మంచం కింద పెట్టేసి వచ్చేవాళ్ళము. ఆ తర్వాత మూడు రోజుల వరకు వాటిని ముట్టకూడదని చెప్పేది నాయనమ్మ. మూడు రోజుల తర్వాత ఆ గదిలోకి వెళ్లి ఆ గిన్నెలు అన్నిటినీ తీసుకొని వస్తే చక్కగా గట్టిపడి నల్లగా అయ్యేది.


ఎంత సంతోషంగా అనిపించేదో.. తుమ్మ కాయలు ఇలా అవుతాయా అని ఆశ్చర్యం వేసేది... దాచిపెట్టి ఒక గిన్నె మాత్రం రోజు బొట్టు పెట్టుకునే అద్దం దగ్గర పెట్టేది అమ్మ. కొన్ని గిన్నెలు తెలిసిన వాళ్ళకి బంధువులకి ఇచ్చేది.


ఇక అగర బొట్టు పెట్టుకోవాలని మాకు ఆత్రం.. అదిరి మీద కొంచెం నీళ్లు పోసి వేలుతో ఇలా రంగరిస్తే చక్కగా నల్లటి పేస్ట్ లాగా వచ్చింది. దాన్ని గుండ్రంగా ఉండే పుల్లతోటో లేక పొడుగు కావాలంటే సన్నగా ఉండే పుల్ల అలా తీసుకొని ఇష్టం ఉన్న రకాలుగా బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఆగరుబొట్టు చక్కగా మెరుస్తూ ఉండేది. శరీరానికి కూడా ఏ విధమైన నష్టం జరిగేది కాదు. స్నానం చేసేటప్పుడు ఇలా నీళ్ళు పోసి రుద్దేసినా కూడా ఈజీగా పోయేది. ఏ విధమైన రసాయనాలు లేని ఈ బొట్టు మళ్లీ తయారు చేసుకోవాలని అనిపిస్తుంది.


ఇప్పుడు కొనే తిలకం లో ఎన్ని రసాయనాలు కలుపుతారు? ప్రకృతిలో దొరికే వస్తువులతో ఇలాంటివి తయారు చేసుకునే వాడితే ఎంతో బాగుంటుంది కదా! ఇది చదివిన వాళ్లు మీరూ ప్రయత్నం చేయండి. నేనూ తయారు చేసుకోవాలని అనుకుంటున్నాను...

❤️❤️శుభం ❤️❤️


లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు



53 views0 comments

Kommentare


bottom of page