top of page
Writer's pictureSairam Allu

ఆకలేస్తోంది బాబూ!

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'Akalesthondi Babu' New Telugu Story

Written By Allu Sairam

'ఆకలేస్తోంది బాబూ' తెలుగు కథ

రచన: అల్లు సాయిరాం

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది. సాయంత్రం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం తగ్గితే, నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్దామని ఎదురుచూస్తున్నాడు లోకేష్. ఎంతకీ వర్షం తగ్గకపోయేసరికి గొడుగు పట్టుకుని ఆఫీసుకి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చేరిన బురదనీళ్ళలో, రోడ్లు తేలుతున్నట్లుగా ఉన్నాయి. కరెంటుపోయి చిమ్మచీకటిగా ఉంది. వచ్చేదారిలో పక్కనున్న ఓ టిఫిన్ సెంటర్ కి వెళ్లి, ఐదు ఇడ్లీలు టిఫిన్ పార్సిల్ చేయించుకుని గబగబా వస్తున్నాడు.


రైల్వేస్టేషన్ పక్కనున్న బైక్ పార్కింగ్ స్టాండు దగ్గర నైట్ డ్యూటీకి వస్తున్న సతీష్ కనపడితే, కలిసి మాట్లాడుకుంటూ ఆఫీసుకి వస్తున్నారు. సతీష్ తనకి సీనియర్ ఆఫీసర్. పైగా, కొంచెం ఈగో మనిషి. ఏం మాట్లాడినా, ఏదో విధంగా జోకులు వేస్తూ, తానే నవ్వుతుంటాడు. అందుకని, సతీష్ ఏవేవో జోకులు చెప్తూ నవ్వుతుంటే, ముఖం మీద నవ్వుపూసుకుని మౌనంగా వస్తున్నాడు లోకేష్.


లోకేష్ తనతో వస్తున్నాడే కానీ, ఎవర్నో వెతుకుతున్నట్టు చూట్టూ చూడడం గమనించిన సతీష్ "ఏంటి! అంతలా చూస్తున్నావు లోకేష్! యిరోజు ఎవరికైనా అపాయింట్మెంట్ యిచ్చావేంటీ?" అని నవ్వుతూ అడిగితే "అదేం లేదులే అన్నా!" అని లోకేష్ అన్నాడు. యిద్దరూ నవ్వుతూ ఆఫీసురూంలోకి వచ్చి, బయోమెట్రిక్ హాజరు వేశారు.


వెంటనే, టిఫిన్ పార్సిల్ పట్టుకుని బయటకు వస్తుంటే "యిప్పుడే వచ్చావు. మళ్లీ ఎక్కడికి వెళ్లిపోతున్నావు లోకేష్? కాసేపైనా డ్యూటీ చెయ్యబ్బా!" అని సతీష్ అడిగాడు.


"ఐదునిమిషాల్లో వచ్చేస్తా అన్నా!" అని ఆత్రుతగా బయటికి వచ్చేశాడు లోకేష్. అంత ఆత్రంగా లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడని సతీష్ బయటికి వచ్చి చూస్తున్నాడు. లోకేష్ వెతుక్కుంటూ వెళ్లి, పడుతున్న వర్షానికి బాగా తడిసిపోయి, తడి బట్టలతో వణికిపోతూ, మూల కూర్చున్న ఒక పెద్దాయన దగ్గరికి వచ్చాడు. ఆ పెద్దాయనకి కంటిచూపు సరిగా లేకపోయినా, అంత చీకటిలో లోకేష్ రూపం చూడగానే, ఆప్యాయత పూర్వకమైన ముఖంలో నవ్వు వచ్చేసింది.


లోకేష్ తినమని టిఫిన్ పార్సిల్ పెద్దాయన చేతికందించాడు. అదే నవ్వుతో పార్సిల్ తీసుకున్నాడు పెద్దాయన. వారిద్దరి మౌనంతో కూడుకున్న చూపుల్లో, మాటల్ని మించిన భావాలు పంచుకున్నారు. పెద్దాయన పార్సిల్ విప్పి తినడం మొదలుపెట్టిన తర్వాత అక్కడినుంచి ఆఫీసుకి వచ్చేశాడు లోకేష్.


ఆఫీసు దగ్గర్నుంచి నిల్చుని యిదంతా చూస్తున్న సతీష్ కి ఏం అర్ధంకాక "అంత ఆత్రంగా ఆయనకి పార్సిల్ యిస్తున్నావేంట్రా? ఆ పార్సిల్ నువ్వు తినడానికి తెచ్చుకోలేదా? ఏం పార్సిల్ కట్టించావ్?" అని గ్యాప్ లేకుండా అడుగుతున్నాడు.


"ఐదు ఇడ్లీలు!" అని ఆఫీసు లోపలికివస్తూ చెప్పాడు లోకేష్.


"ఐదు ఇడ్లీలంటే 30 రూపాయిలు కదా! నాకు ఓ పదిరుపాయిల టీ యిప్పించడానికి గంట ఆలోచిస్తావు. ఖర్చుపెట్టుకుని, అక్కడ్నుంచి మోసుకుని, ఆయన అడగకుండా, నువ్వే వెతుక్కుని మరీ, యిచ్చి వస్తున్నావు. యిటువంటి దానాలు చేస్తే మంచి పెళ్ళాం వస్తుందని ఎవరైనా చెప్పారేంటి! నీకింకా ఇరవైఎనిమిది సంవత్సరాలే కదా. వెతికితే, మంచి పెళ్ళాం వస్తుందిలే! భయపడిపోకు!!" అని సతీష్ కూసింత వెటకారపు స్వరంతో నవ్వుతూ లోకేష్ ని ఆటపట్టిస్తుంటే, ఆఫీసులో మిగతావాళ్ళందరూ తమ పనిచేసుకుంటూ నవ్వుతూ చూస్తున్నారు.


సతీష్ గురించి తెలిసినదే కదా, గట్టిగా ఏమైనా అడిగితే, అర్రే జోక్ చేస్తున్నా అంటాడు. అలాగని అడగకపోతే, యింక అవకాశం దొరికింది కదా అని ఆపకుండా వెకిలిచేష్టలతో వెటకారంగా మాట్లాడతాడు. అడిగితే చిరాకు! అడగకపోతే పరాకు! అందుకే, ఏం పట్టించుకోకుండా, లోకేష్ మౌనంగా తన పని తాను చేసుకుంటున్నాడు.


సతీష్ వెటకారాన్ని కొనసాగిస్తూ "తెచ్చుకున్న పార్సిల్ ఆ పెద్దాయనకి యిచ్చేశావ్! యిప్పుడు నువ్వేం తింటావురా?" అని నవ్వుతూ అడిగాడు.


"నేను రూం లో తినేసి వచ్చాను. ఆ పెద్దాయనకి యివ్వడం కోసమే పార్సిల్ తీసుకున్నాను!" అని లోకేష్ చెప్పిన సమాధానానికి సతీష్ ఆశ్చర్యపోతూ "అబ్బా! యిది హైలైట్. ఆయనకి యివ్వడానికి తీసుకోవడమేంటి? ఐదు ఇడ్లీలు పార్సిల్ కట్టించి యివ్వమని, నిన్ను ఏమైనా అడిగాడా ఆయన? లేకపోతే ఫోన్ చేసి చెప్పాడా?" అని నవ్వుతూ అన్నాడు సతీష్.


"అదేం లేదు. నాకు యివ్వాలనిపించి తీసుకొచ్చాను. యిచ్చాను! నేను చాలా రోజుల నుంచి యిస్తున్నాను. మీరే యీ రోజు చూశారు!" అని చెప్పాడు లోకేష్.


"ఓహో! మంచిది! నన్ను కుడా చాలాసార్లు అడిగాడు. అడిగితే, ఐదో పదో రుపాయిలు యివ్వాలి గాని, అంత గుర్తుపెట్టుకుని, ఖర్చుపెట్టుకుని, ప్రతిరోజూ పార్సిల్ తీసుకొచ్చి, వెతుక్కుంటూ మరీ యివ్వాలా!" అని ఉండబట్టలేక అడిగాడు సతీష్.


"గుర్తుపెట్టుకోవడం కాదు. మర్చిపోలేకే, తీసుకొస్తున్నాను!!" అని తన పనిచేసుకుంటూ బదులిచ్చాడు లోకేష్.


"మర్చిపోలేనంతగా ఏం జరిగింది? పెద్దాయన ఏం చేశాడు?" అని సతీష్ అడిగాడు. కొంచెం ఖాళీసమయం దొరకడంతో ఆఫీసులో ఉన్న మిగతావాళ్ళందరూ ఆసక్తిగా వింటున్నారు.


"మీకు తెలుసు! నేను యి రైల్వేస్టేషన్లో నాలుగు సంవత్సరాలగా టికెట్ బుకింగ్ ఆఫీసులో పనిచేస్తున్నాను. యింతవరకు ఆఫీసుకి వచ్చామా, డ్యూటీ చేశామా అన్నట్టుండేది! కానీ, గత నాలుగురోజులుగా, డ్యూటీ అని ఆలోచన వస్తే, వెంటనే ఆ పెద్దాయనే గుర్తుకొస్తున్నాడు!" అని అన్నాడు లోకేష్.


"ఆయన గుర్తుకొస్తున్నాడా! టిఫిన్ తీసుకురాకపోతే, నిన్ను ఏమైనా చేస్తానని భయపెట్టాడేంట్రా బాబూ! ఆయన కట్టుకున్న తెల్లని లుంగీపంచె, మెడలో పచ్చరంగు తువ్వాలు, జడలు చుట్టేసిన జుట్టు, చూడడానికి ఆయన అవతారం కుడా అలానే ఉంటుందిలే!" అని సతీష్ నవ్వుతూ అంటుంటే, అందరూ నవ్వుతున్నారు.


లోకేష్ వ్యక్తిత్వం గురించి తెలిసిన సుభాష్ వచ్చి "ఏమైందిరా లోకేష్!" అని అడిగాడు.


"నువ్వు మరీన్ను రా సుభాష్! ఆ పెద్దాయన ఏదో అడిగి ఉంటాడు. వీడు మొహమాటానికి పార్సిల్ పట్టుకొచ్చేసుంటాడు!" అని ఏదో జరిగినది దగ్గరుండి చూసినట్లు, సొంత క్రియేటివిటీతో చెప్పేశాడు సతీష్.


"అలా అడిగితే బాగానే ఉండేది నాయనా! నేను ఎందుకింత టెన్షన్ పడతాను చెప్పడానికి. మీలాగే ఐదో పదో యిచ్చేసి, యిక్కడ నేను నవ్వేసేవాడ్ని! కానీ, ఆయన ఆకలి తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్నాడు!" అని అసలు విషయం లోకేష్ చెప్పేసరికి అందరూ కంగుతిన్నారు.


"చచ్చిపోవడమేంట్రా! ఆయనకి బుర్రపోయిందా ఏంటి?" అని సుభాష్ అడిగితే "చెప్తే నమ్మరు గాని! ఆయన చేసింది చూస్తే, చేసుకున్నాక ఆయన పోతాడో లేదో తెలియదు గాని, చూసిన నేను పోయినంతపనైంది! న్యూస్ లో ఆత్మహత్య వార్తలు చూస్తేనే మనకి ఏదోలా ఉంటుంది. మన కళ్ళముందు, ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, యింకా ఏలా ఉంటుందో, మీ ఊహకే వదిలేస్తున్నాను! నాకు యిప్పటికీ, కళ్ళముందు మెదులుతూనే ఉంది!" అని తడబడుతూ చెప్పాడు లోకేష్.


"చచ్చిపోవడమా! ఆత్మహత్య చేసుకున్నాడా?" అని అందరూ ప్రశ్నలవర్షం కురిపించారు.


"అసలు ఏం జరిగింది. చెప్పురా!" అని అడిగాడు సుభాష్.


"నాలుగురోజుల ముందు, నేను నైట్ డ్యూటీకి వస్తున్నప్పుడు, యిరోజులాగే వర్షం కురవడం వల్ల కరెంటుపోయి, అంతా చీకటిగా ఉంది. నేను బైక్ పార్క్ చేసి, నాలుగో నెంబర్ ప్లాట్ ఫాం మీద నడుచుకుని ఆఫీసుకి వస్తున్నాను. ప్యాసింజర్స్ అంతగా లేకపోవడం వల్ల ప్లాట్ ఫాం ఖాళీగా ఉంది. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి, యి పెద్దాయన చేస్తున్న పనిచూసి, నా గుండె జారిపోయింది!"


అని గుర్తుచేసుకుంటూ లోకేష్ చెప్తుంటే, "ట్రైన్ కిందపడి చనిపోవాలనుకున్నాడా? నువ్వు అది చూసి కాపాడావా? నువ్వు గ్రేట్ రా!" అని మధ్యలో కలుగజేసుకుని ఆత్రంగా ఎవరికి వారు ఊహించుకుని అడుగుతున్నారందరూ.


"అలా కాదు! అక్కడ పదడుగుల ఎత్తులో ఉన్న స్లాబ్ రాడ్ ఐరన్ పైపులకి, తాను కట్టుకునే తెల్ల లుంగీపంచె కడుతున్నాడు. చూడడానికి వర్షంలో తడిసిపోయిన బట్టలు పిండుతున్నట్లు అనిపిస్తోంది. చీకటిలో ఆకాశం మెరిసేటప్పుడు నేను చూస్తూ వస్తున్నాను. మీదున్న రాడ్డుకి లుంగీపంచె కట్టాక, కింద తన మెడ చూట్టూ వేసుకున్నాడు. ప్లాట్ ఫాం మీద నడుచుకుంటూ దగ్గరికి వస్తున్న నాకు, ఈయన ఏదో చేసుకోబోతున్నాడని డౌట్ వచ్చింది!


ఆయన కుడా నన్ను చూసి, మొదట కంగారుపడినా, మెల్లగా తన పని తాను చేసుకుంటున్నాడు. ఒకవేళ ఆయన దగ్గరకెళ్లి, ఏం చేస్తున్నావని అడిగితే, మాట మార్చేసి, మనల్ని దబాయించేసే మనిషి ఆయన! ఏం చేయాలో తెలియక, ఆయన్ని చూస్తూ, భయమేసి వేగంగా నడుస్తున్నాను. ఆయన మెడ చుట్టూ గట్టిగా బిగించి కట్టుకుంటున్నాడు. కొంచెం ముందుకి వేలాడాడంటే, ఆయన కథ ముగిసిపోయినట్లే! తడిబట్ట బిగుసుకుందంటే, మనిషి నరాలు బిగుసుకుపోయి ఊపిరిపోవడానికి పెద్దగా టైం కుడా పట్టదు కదా!


లాభం లేదనుకుని, ఐదోనెంబర్ ప్లాట్ ఫాం మీద సమోసాలు, టిఫిన్లు అమ్మేవారి దగ్గరికి పరుగెత్తాను. అన్నా! అక్కడ ఒక పెద్దాయన యిలా చేస్తున్నాడని, నాకు భయంగా ఉందని చెప్పగానే, వాళ్ళు వెంటనే, నాతో పరుగెత్తుకొచ్చారు.


ఆపడానికి వస్తున్నామని మమ్ముల్ని చూసిన పెద్దాయన, కావాలనే గాల్లోకి వేలాడి కాళ్ళుచేతులు కొట్టుకుంటున్నాడు. గబుక్కున, మేం వెళ్లి పట్టుకున్నాం. క్షణాల్లో అందరం కలిసి, పెద్దాయన కట్టిన కట్లు విప్పి, కిందకి దింపి, కూర్చోబెట్టి, తాగడానికి వాటర్ బాటిల్ తో నీళ్లు యిస్తే, పెద్దాయన పొలమారుతూ మెల్లగా తాగుతున్నాడు. ఇంత బిజీగా ఉండే స్టేషన్ మధ్యలో, యిటువంటి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈయన్ని, యిలాగే వదిలేస్తే, అదును చూసుకొని, ఏ ట్రైన్ కిందో తలపెట్టినా పెట్టేస్తాడు అని కొందరు అంటున్నారు.


ఇటువంటివాళ్ళని మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలి అని కొందరు, పెద్దాయన చేసిన పనిని తిడుతూ చెరో మాట అంటున్నారు. నా చావు కూడా నన్ను ప్రశాంతంగా చావనివ్వరా అన్నట్టుగా పెద్దాయన ముఖం పెట్టుకొని, ఆయన ప్రయత్నాన్ని ఆపి నేనేదో తప్పుచేసినట్లు, నన్ను గుర్రుమని చూస్తున్నాడు. నాకు భయమేసి దూరంగా నిల్చున్నాను.


ఒకాయన వచ్చి "అసలు ఎందుకు నువ్వు యిలా ఆత్మహత్య చేసుకోవడానికి చూస్తున్నావు పెద్దాయన?" అని అడిగాడు.


పెద్దాయన దగ్గుతూ "ఆకలేస్తోంది బాబూ!" అని చెప్తే, చూట్టు ఉన్నవారందరికి నోట మాట రాలేదు!" అని లోకేష్ చెప్తూ చూట్టూ చూస్తే, దాదాపుగా యిక్కడ కుడా అందరూ మౌనంగా ఉండిపోయారు.


"పాపం! ఎంత ఆకలేసిందిమో!" అని అంటూ ఆఫీసులోనుంచి బయటికివచ్చి దూరంగా ఉన్న పెద్దాయన వైపు జాలిగా తొంగిచూస్తున్నారు.


"అలా ఆయన వైపు చూడొద్దు! యి విషయం అందరికి తెలిసిపోయిందని పెద్దాయనకి తెలిస్తే, మళ్ళీ ఏదోక అఘాయిత్యానికి పూనుకుంటాడు! అందుకే, యి విషయం ఎవరికీ చెప్పలేదు!" అని లోకేష్ చెప్తే అందరూ లోపలికి వచ్చారు.


"తర్వాత ఏం జరిగింది?" అని ఆసక్తిగా అడిగాడు సుభాష్.


"ఆకలేస్తుందన్న పెద్దాయన మాటలకి, మనసు చలించిపోయి, ఒక్కొక్కరు తమ తమ దగ్గరున్న టిఫిన్ పార్సిల్, బిర్యానీ పార్సిల్, సమోసాలు తినమని యిస్తున్నారు. అది చూసి, పెద్దాయనకి ఏమనిపించిందో మరి, వర్షం పడుతున్న ఆకాశంలో మెరుస్తున్న మెరుపులకి పోటాపోటీగా ఆపకుండా గట్టిగా నవ్వుతున్నాడు. అందరికి అర్ధంకాక విస్తుపోయి ముఖాలు చూసుకుంటున్నారు. ఎంతకీ పెద్దాయన నవ్వడం ఆపకపోయేసరికి, వచ్చి చాలాసేపు అయిందని, ఎవరి వ్యాపారాల దగ్గరికి వారు వెళ్తున్నారు. వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పి, నేను కూడా ఆఫీసుకి వస్తున్నాను.


అది చూసి పెద్దాయన యింకా పగలబడి నవ్వుతున్నాడు. బహుశా, యిన్ని రోజులు తనని ఆకలితో పడిపోయినా పట్టించుకోకుండా, అందరూ పక్కనుంచి వెళ్లిపోయేవారు. ఇలా చావడానికి ప్రయత్నిస్తే కానీ, మనిషిని పట్టించుకుని నోటికి యింత ముద్ద పెట్టరన్నమాట! ఈరోజుకి తినలేనంత యిచ్చారు. రేపు ఆకలి వేస్తే, యివ్వడానికి ఎవరు ఉండరురా! నాకు తెలియదా మీ గురించి! అనే ఫీలింగ్ అయ్యిండొచ్చని, పెద్దాయన ముఖంలో నవ్వు చూస్తే నాకు అనిపించింది. అందుకే, యిలా గుర్తుపెట్టుకుని, పెద్దాయనకి తినడానికి యిస్తున్నాను! " అని చెప్పి ముగించాడు లోకేష్.


ఆఫీసులో అందరూ ఏదో తెలియని ఆలోచనలోపడి, ఎవరి ఊహాశక్తి మేరకు వాళ్ళు ఊహించుకుంటూ ఉండిపోయారు.


కాసేపు మౌనం తర్వాత "ఇంత జరిగిందా? నిజంగా మంచిపని చేశావురా! ఏదో సరదాకి చేస్తున్నావని అనుకున్నాను!" అని ముందుకి వచ్చి లోకేష్ భుజం తట్టాడు సతీష్.


అందరూ కుడా వచ్చి "నువ్వు గ్రేట్ రా లోకేష్! ఒక మనిషి ప్రాణం కాపాడావు!" అని అభినందిస్తున్నారు.


"నిజానికి, మనం ఏం ప్రాణం కాపాడలేదు. ఆరోజు ఏదో మనం చూసినప్పుడు జరిగింది. స్పందించగలిగాం! ఆయన తలుచుకుంటే, వేరే ఏ మార్గంలోనైనా, మళ్లీ యిటువంటి అఘాయిత్యాలు చేసుకునే అవకాశం ఉంది. ఆయనకి బతకాలని ఉంది. కానీ, ఆకలి ఆయన్ని చచ్చిపోవడానికి ప్రేరేపిస్తుంది. ఆకలి మనిషిని యింతలా కలిచివేస్తుందా! తిన్నా చచ్చిపోతాం. తినకపోయినా చచ్చిపోతాం. ఏంటో యి మనిషి బతుకు!" అని అన్నాడు లోకేష్.


"సరేరా! యిప్పట్నుంచి నేను కుడా, ఆ పెద్దాయనకి నీలాగే సాయం చేస్తాను!" అని అన్నాడు సతీష్.


"అదే వద్దు అన్నా! మనకి తెలిసివచ్చింది యీ పెద్దాయన కథ. యింకా, మనకి తెలియని ఎంతోమంది కథలు ఉన్నాయి. కంటికి కనిపించిన దగ్గరే, మొత్తం పెట్టేయడం సరికాదు!" అని అన్నాడు లోకేష్.


"అయితే! నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు లోకేష్!" అని అడిగాడు సుభాష్.


"ఈ పెద్దాయన ఒక్కడే కాదు, రైల్వేస్టేషన్లో, బస్టాండ్లలో, దేవాలయాల దగ్గర, రోడ్లమీద, యిలా ఎంతమంది ఉన్నారో! ఎంతమంది నిరంతరం ఆకలితో చేస్తున్న జీవితయుద్ధంలో వీరమరణం పొందుతున్నారో తలుచుకుంటే భయమేస్తోంది! ముఖ్యంగా, యి కరోనా కాలంలో వారి పరిస్థితి మరి దారుణంగా మారిపోయింది. అంతకుముందు, దేవాలయాల దగ్గర భక్తులు యిచ్చే ప్రసాదాలో, దానాలో, కనీసం కొబ్బరిముక్కలైనా తినడానికి దొరికేవి. జనాలు బయట తిరిగితే, అంతో యింతో చేతిలో పెట్టి సాయం చేస్తే, ఏదోలా ఆ పూటకి తినేసి, నీళ్ళుతాగి కడుపు నింపుకునేవారు.


కరోనా లాక్డౌన్ సమయంలో ఎవరు బయటికి రాకపోయేసరికి, వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరమైపోయింటుందో ఆలోచించండి! ఏం మనమేనా మనుషులం? మనకేనా కరోనా? వాళ్ళకి లేదా! వాళ్ళకి రాదా!! మరి వాళ్ళు ఏమైపోయింటారు?" అని లోకేష్ లోలోపల మధనపడుతున్న బాధంతా బయటపెడుతూ అడుగుతున్న ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానాలు లేక మౌనంగానే ఏకీభవిస్తున్నారు.


లోకేష్ కొనసాగిస్తూ "ఆరోజు పెద్దాయన చెప్పిన ఆకలేస్తోంది బాబూ అనే ఒకే ఒక్కమాట నన్ను ఎంతలా ప్రభావితం చేసిందంటే, లోకాన్ని కొత్తగా చూసేలా చేసింది. దీనమైన పరిస్థితుల్లో ఉన్నవారిని చూశాక, మన చుట్టూ యింత జరుగుతుందని అర్థమైంది. అప్పుడే నిర్ణయించుకున్నాను. మనకి వీలైనంతవరకు ఏదోలా సాయం చేయాలి. కుదిరినంతవరకు ఆకలి తీర్చడానికి ప్రయత్నించాలి!" అని అన్నాడు లోకేష్.


"ఒకట్రెండుసార్లంటే యిచ్చేస్తాం. రోజూ అడిగితే ఏలా యివ్వగలం?" అని అడిగాడు సతీష్.


"ఇవ్వాలి అన్నా! తప్పదు! పెద్దాయనలా ఆకలి తట్టుకోలేక చనిపోవాలనుకునేవారికి, మనం చేసే సాయం, పార్సిల్ లో డైరెక్ట్ గా ప్రాణాన్ని రీచార్జ్ చేయిస్తున్నట్లే! ఏదో దేవుడి దయవల్ల, మనం సంపాదిస్తున్నాం. మన నెలజీతంలో మరీ పావాలా వాటా, పదిశాతం వాటాలు ఖర్చు పెట్టేయక్కర్లేదు. ఒక్కశాతం పెడితే చాలు. నా జీతం 30000 వస్తుందంటే, ఒక్కశాతం 300 ఖర్చుపెడితే చాలు! ఎంతోమంది ఆకలి తీర్చొచ్చు!" అని లోకేష్ చెప్తుంటే అందరికి నచ్చి చప్పట్లుకొట్టి అభినందించారు.


సతీష్ ఒక బాక్స్ తీసుకొచ్చి, దాని మీద ‘ఆకలేస్తోంది బాబూ’ అని రాసి "ఒకొక్కరు చేస్తే, అది ప్రయత్నం! అందరూ కలిసి చేస్తే, అది యజ్ఞం! మన ఆఫీసు తరపున, యిలా సాయాలు చెయ్యడానికి విరాళాలు యిందులో వేసుకోవచ్చు. ‘ఆకలేస్తోంది బాబూ’ అని పేరు చూశారుగా, దీనికి ఆకలి చాలాఎక్కువ! మనం దీని కడుపునింపితే, యిది అవసరమైన వారికి కడుపునింపుతుంది!


ఆ పెద్దాయన చెప్పిన ఒక్కమాట నిన్ను అంత ప్రభావితం చేస్తే, నీ మాటలు మమ్ముల్ని ఎంతో ప్రభావితం చేశాయి!" అని లోకేష్ వైపు చూస్తూ అంటూ "ఈ బాక్స్ కడుపు నేనే ముందు నింపుతాను. లోకేష్! నీది 300 అయితే, నేను 500 వేస్తున్నాను. నా 50000 జీతంలో ఒక్కశాతం. పెద్దోడికి పెద్ద దెబ్బే తగులుతుందిరా!" అని నవ్వుతూ బాక్స్ లో డబ్బులు వేశాడు.


అందరూ నవ్వుతూ, సదుద్దేశంతో చేపట్టిన ఆలోచనకి తమ వంతు సహకారంగా, వారివారి విరాళాలు బాక్స్ లో వేయడానికి ముందుకు నడుస్తున్నారు.


అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.







259 views1 comment

1 Comment


Maradana Satyavathi • 1 hour ago

Good job

Like
bottom of page