top of page

 (ఆ) కలి కాలం పిల్లలు

Writer's picture: Penumaka VasanthaPenumaka Vasantha

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #AkaliKalamPillalu, #ఆకలికాలంపిల్లలు, #TeluguHeartTouchingStories


Akali Kalam Pillalu - New Telugu Story Written By - Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 09/02/2025

ఆకలి కాలం పిల్లలు - తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"బాబయ్యా..! ధర్మం సేయండి..! పున్నెం వత్తది బాబయ్యా..!” అన్న మాటతో ‘ఎక్కడో ఈ గొంతు విన్నట్లు వుందే’.. అనుకుంటూ గుడి మెట్లు ఎక్కుతున్న భగత్ తల తిప్పి అక్కడ అడుక్కుంటున్న వాళ్ల వైపు చూసాడు. 


'వీళ్లు పోయిన వారం స్టేషన్ కు వచ్చిన వృద్ద దంపతులు. అదేంటి? వాళ్ళ కొడుకును తిట్టి వీళ్ళను చూసుకోమని చెప్పి పంపాను. మళ్ళీ ఇక్కడ వున్నారు' అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి "అదేంటి తాత..! ఇక్కడ వున్నారు ఏంటి? మీ అబ్బాయితో మిమ్మల్ని ఇంటికి పంపాగా. " అని అడిగాడు. 


పోలీసు డ్రెస్సులో లేకపోవటం వల్ల భగత్ ను గుర్తు పట్టలేదు ఇద్దరూ. కొంచం కిందకు వంగి వాళ్ల వైపు చూస్తూ..! "నేను పోలీస్ ఇనస్పెక్టర్ ను. ఈ గుడి మెట్ల మీద ఎందుకు? 

అడుక్కుంటున్నారు.. పదండి మిమ్మల్ని ఇంటిదగ్గర దింపుతాను. "

 

"ఓ నువ్వా బాబు..! దండాలు బాబు. మా కొడుకు తీసుకెల్లాడు కానీ, మల్లా మామూలే. కూడు పెట్టరు. పోనీ మా పల్లెకు పోదామంటే.. ఆడ వున్న ఇల్లమ్మి వీడికే డబ్బు ఇచ్చాము. 

మమ్మల్ని సూత్తాడని వీడి కాడికి వత్తే.. తిండి బెట్టక సంపుతున్నాడు. మా వూరికి పోలేక ఈడనే ఏదోకటి సెద్దామంటే మా కాడ బలం లేదు. 


మా పక్కింటి ముసలామె మమ్ముల్ని ఈడకు.. తెచ్చింది. తిట్లు, ఈసడింపులు లేవు ఈడ అడుక్కుంటే. వచ్చిన సిల్లర డబ్బులతో బతుకుతున్నాము. ఈడనే హాయిగా వుంది. పెసాదాలు పెడతారు. ఏదో పొట్ట గడిసిపోతన్నాదిలే.. సార్..! 


మా కొడుకు ఇంటికన్నా గుడి కాడనే బాగుంది. మేము మీతో రాలేమయ్య..!" అంది సుబ్బమ్మ. 


తన జేబులో నుండి వంద కాగితం వాళ్ళ బొచ్చెలో వేసి బాధగా గుడిలోకి వెళ్ళాడు. 


మరుసటి రోజు సుబ్బమ్మ కొడుకు నాగబాబును స్టేషన్ కు పిలిపించాడు భగత్. 


"ఏంది సార్ పిలిపించారు?" అన్నాడు నాగబాబు. 


"మీ అమ్మా నాన్న ఇంట్లో వున్నారా?"


"ఆ ఇంటి కాడ వుండారు. ఎందుకు సార్.. ?" సందేహంగా భగత్ వైపు చూస్తూ అన్నాడు. 


అప్పటికే అక్కడికి టివి రిపోర్టర్ ఆసక్తిగా తీస్తుంటే.. “ఇలాంటివి టివిలో చూపిస్తే కొంతమందికైనా బుద్ధి వస్తుంది. మీరేమో వీటి బదులు సినిమా యాక్టర్స్ తుమ్మారు, దగ్గారు ఇలాంటివి చూపిస్తారు” అని నాగబాబు వైపు చూపిస్తూ “వీళ్లు అమ్మాఅయ్యకు తిండి పెట్టకపోతే..! గుడి దగ్గర ఆడుక్కుంటున్నారు. ఇలాంటివి మీ టివిలో చూపించండి”. 


"వెరీ ఇంట్రస్టింగ్..!” అంటూ మళ్ళీ కెమెరాను నాగబాబు వాళ్ళ వైపు తిప్పింది సుమభాను. 


"అవునా.. వీళ్లు ఎవరూ?" అంటూ నిన్న సుబ్బమ్మ దంపతులను గుడిమెట్ల మీద తీసిన ఫోటోను సెల్ లో చూపించాడు. 


"అదా.. గుడి సూత్తామంటే మా పక్కింటి చిన్నమ్మతో పంపాను. " 


"మరి రాత్రి ఇంటికి వచ్చారా?"


"ఆ వచ్చి ఇంట్లోనే వుండారు" అంటూ నాగబాబు నీళ్ళు నములుతుంటే.. 


"కానిస్టేబుల్ లాఠీ తీసుకురా..!" అన్న భగత్ మాట విని "రేత్రి రాలేదు. ఇపుడు పోయి తీసుకొస్తా..!"


"ఇపుడు నువ్వేమీ తీసుకురావక్కరలేదు. నువ్వున్న ఇల్లు ఖాళీ చెయ్యి. మీ అమ్మవాళ్ళు వచ్చి వుంటారు అందులో. నువ్వు వెళ్ళి అద్దె కొంపలో వుండు. "


"పిల్లలు గలవాడిని. ఈ పట్నంలో అద్దెలు బరాయించలెను. వాళ్ళను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాను" అన్నాడు భయంగా. 


"నువ్వింత త్యాగం చేయనక్కర్లేదు. ఇల్లు ఖాళీ చేయి. ముందు వాళ్ల ఆధార్ కార్డు తెచ్చివ్వు. రేపటిలోగా ఇల్లు ఖాళీ చెయ్యకపోతే మేమే వచ్చి నీ ఇంట్లోని గిన్నె, చెంబు బయట పడేస్తాము. "


"అసలు ఆ ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు మీ అయ్య ఇచ్చినవే కదా? ఆయన డబ్బు కావాలి కానీ వాళ్ళకు తిండి పెట్టవు? ఇల్లు అయినా ఖాళీ చేయి, లేదా నీకు ఎంత డబ్బు ఇచ్చారో.. అంతా వాళ్లకివ్వు" అన్నాడు భగత్. 


"ఆ..! మా ఆయన కూలి పని, నేను పాచి పని చేసి సంపాదించి కొనుకున్నఇంటిలో వాళ్ళెవరూ? వుండటానికి" నాగబాబు పెళ్ళాం కుమారి గొంతు పెద్దది చేసి అంది. 


"మరి మీ అత్తామామ, పల్లెలో ఇల్లు అమ్మి మీకు డబ్బులు ఇచ్చారు కదా? మీకు ఇక్కడ ఇళ్లు కొనుక్కోవడానికి" అన్నాడు భగత్. 


"మాకు ఏడ ఇచ్చారు. అన్నీ వాళ్ళ కూతుళ్ళకు ఇచ్చారు. మాకు పైసా ఇవ్వలేదు" అంది అక్కసుగా కుమారి. 


"సరే ఆ లాఠీ ఇటు తీసుకురా కానిస్టేబుల్” అన్న భగత్ తో.. “మీరు లాఠీ తెచ్చి బయపెట్టినా ఈడ ఎవరు బయపడేది లేదు. మేము అద్దెకు పోము, ఇల్లు ఖాళీ చేయం" అన్న పెళ్ళాం వైపు చూసి.. "ఆ.. ఏమి చేస్తారో? సేసుకోండి, మేము ఆడ నుండి పొయ్యేది లేదు" అన్నాడు నాగబాబు. 


"సరేలే.. ఇపుడు కొత్త చట్టం వచ్చింది తల్లితండ్రులకు అన్నం పెట్టని పిల్లలను జైల్లో వెయ్యమని. జైల్ కెళతారో లేక ఇళ్లు ఖాళీ చేస్తారో..!" ఆలోచించండి" అన్నాడు భగత్. 


నాగబాబు, కుమారి ఆలోచించి "మేమే బయటకు పోతాం. ఆ ముసలోల్లను దానిలో వూరేగమనండి, దా దిక్కులు సూత్తావే..!" అంటూ మొగుడ్ని తీసుకుని బయటకు వెళ్ళింది కుమారి. 


ఇదంతా సిటి కేబుల్ లో వేస్తే అందరూ.. చూసి ఆశ్చర్యపోయారు. 


"ఆస్తులు, తీసుకుంటారు. తల్లి తండ్రులకు కూడు పెట్టరు. ఇలాంటి వాళ్ళను జైల్లో పెడితేనే బుద్ధి వస్తుంది. మిగతా వాళ్ళు ఇది చూసన్నా.. బాగుపడతారు. కలి కాలం ఇది" అని 

అందరూ..! నాగబాబును దుమ్మెత్తి పోశారు. 


వారంలోపు నాగబాబు ఇళ్లు ఖాళీ చేస్తే.. ఆ ఇంట్లోకి సుబ్బమ్మను, నారయ్యను తెచ్చి చేర్చాడు భగత్. 


ఆ రేకుల ఇళ్లు రెండు పోర్షన్ లు అవ్వటం వల్ల ఒక పోర్షన్ అద్దెకి ఆ డబ్బులు సుబ్బమ్మకు ఇవ్వమని చెప్పాడు. నెలకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేట్లు చేస్తానన్నాడు వాళ్లతో భగత్. 


"మీ కూతురు రాజమ్మ ఇక్కడికి దగ్గరలోనే కదా వుండేది. మిమ్మల్ని వచ్చి చూస్తుంది. ఏమి దిగులు పడకండి" అన్నాడు భగత్. 


"అవును బాబు. అది వాళ్ళింట్లో వుండమంటది. దానికి ఒక్క పైసా ఇచ్చింది లేదు. దాని ఇంట్లో కూకొని తినాలంటే బాగోదని కూకున్నాము బాబు. 


బాబు.. నీ మేలు మర్సిపోలేము. ఏ తల్లి నిన్ను కన్నదో ఆమె సల్లంగ వుండాలే. మాకు నాయం సేసావు. మాకింత, గూడు, కూడు ఏర్పాటు సేసావు. మా ఆయుసు పోసుకుని నువ్వు సక్కగా వుండాలే..! బాబు" అన్నారు ఇద్దరూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ. 

 

"ఇది మా డ్యూటీ. మళ్ళీ నీ కొడుకు వచ్చిగోల చేస్తే మాకు ఫోన్ చెయ్యండి. లేకపోతే మీ అమ్మాయికి చెప్పినా నాకు చెప్తుంది..!" అన్నాడు టోపీ సరి చేసుకుంటూ భగత్. 


మళ్ళీ సుమ భాను వచ్చి అంతా వీడియో తీసుకెళ్ళింది. 


జీప్ డ్రైవర్ స్టార్ట్ చేస్తూ "చాలా మంచి పని చేసారు సర్" అన్నాడు. 


"అదేమీ లేదు రమేష్. మా అమ్మా నాన్న చిన్నప్పుడే.. పోయారు. అందుకని ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే.. మనసుకు ఏదో తృప్తి. 


మా అమ్మ పూలుమాలలు కట్టి అమ్మేది. మా నాన్న కూరగాయలు అమ్మేవాడు. మా నాన్న ఎపుడు అందరికీ మావోడు పోలీస్ ఇనస్పెక్టర్ అవుతాడని చెప్పేవాడు. మానాన్న కోరిక తీరేసరికి వాళ్ళు లేరు. తిరుపతిలో మా అక్కకు పెళ్లి చేసుకుని వస్తున్న కారుకు ఏక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు. నేను కార్లో ఖాళీ లేకపోతే.. వెనుక కార్లో వున్నాను. నా ముందే కారు కొండ లోయలోకి జారిపోయి తగలబడి పోవటం చూసాను. 


అపుడు నేను ఇంటర్ మీడియట్ చదువుతున్నా. తర్వాత మా నానమ్మ నన్ను చూసింది. అపుడు పోలీసు పోస్టులు పడితే అప్లై చేసి కానిస్టేబుల్ గా ఎన్నికయ్యి ఇపుడు ఈ స్థితికి వచ్చాను. ఇక్కడికి దగ్గరలో మా వూరు వుంది. అపుడప్పుడు వెళ్ళి మా ఇంటిని చూసుకుని వస్తుంటా. ఇలాంటి వాళ్ళలో మా అమ్మానాన్నను చూసుకుంటాను. 


మా ఇంట్లో పని చేసే.. రాజమ్మ వీళ్ల అమ్మాయి. వీళ్ల గురించి చెప్పింది. మా అమ్మాఅయ్యను, మా తమ్ముడు పట్టించు కోవడంలేదు. నేను మా అమ్మాఅయ్యను తీసుకెళ్ళి 'ఏందిరా నాగు.. అమ్మాఅయ్యకు కూడు పెట్టకుండా సంపుతున్నావు' అంటే.. 'నా కాడ వీళ్ళను మేపటానికి డబ్బులు ఏడ వుండాయి' అన్నాడు సార్. వాళ్ళను, ఇంట్లోకి రానీయకుండా బయట ఎండలో అరుగుమీద కూర్చోబెట్టాడు. కాస్త మీరు వాడికీ ఎట్లాగైనా బుద్ధి చెప్పండి సార్..!" అని బతిమాలింది రాజమ్మ. 


"సరే మీ అమ్మానాన్నను తీసుకుని స్టేషన్ దగ్గరికి రా..! అంటే రాజమ్మ వాళ్ళను తీసుకొచ్చింది. ఇక తర్వాత సంగతి నీకు తెల్సు కదా?" 


"ఆ తెల్సు సార్" అన్నాడు రమేష్. 


"ఆస్తులు కావాలి. తల్లి తండ్రి అవసరం లేదు వీళ్ళకు..!" అంటూ విసుక్కున్నాడు భగత్. 


ఇంటికి వెళ్ళిన తర్వాత భగత్ నానమ్మ "ఏందిరా భగత్..! ఇంత ఆలస్యంగా వస్తున్నావు ఇంటికి" అంది. 


"ఏమి లేదు నానమ్మ..! ఇవ్వాళ అదే.. మన పని మనిషి రాజమ్మ అమ్మానాన్నను వాళ్ళ ఇంటిలో వదిలి పెట్టీ వచ్చాను. "


"నాకు ఆ వార్త రాజమ్మ చెప్పిందిలే. మా అమ్మాఅయ్యకు బాబుగారు న్యాయం చేసారని ఇప్పటి దాకా ఇక్కడనే ఉండి నిన్ను పొగిడి వెళ్ళింది. అక్కడిదాకా వెళ్ళావు. నాకు ముగ్గురు కొడుకులు, అందులో మీ నాన్న పోయినా ఇద్దరు బతికే వున్నా నాకెవరూ? తిండి పెడుతున్నారు. నువ్వు

 పెడుతున్నావు. ఇపుడు కాలం ఏంటి కలికాలం? 


అవన్నీ ఎమో కానీ, నిన్ను ఒకింటి వాడిని చేసేదాకా నేను బతికుంటే అదే పదివేలు..!" అంది మనవడ్ని మురిపెంగా చూస్తూ రమణమ్మ. 


"నాకు మనవళ్లు పుట్టేదాక వుంటావు కానీ, నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు..!" అన్న భగత్ ను చూస్తూ.. 

 

"ఆ.. నీకు మనవళ్లు పుట్టేదాకా ఇక్కడే.. శిలేసుకుని వుంటా. ముందు వెళ్ళి కాళ్లు చేతులు కడుక్కురా..!" అంది నవ్వుతూ రావమ్మ. 


అన్నం తింటూ టివి చూద్దామని భగత్ ఆన్ చేస్తే.. సుబ్బమ్మ దంపతులను కొడుకు ఇంటికి చేర్చి వాళ్లకు, వుండటానికి నీడ కల్పించిన ఇనస్పెక్టర్ భగత్..! దీనికి సిటీలోని ప్రజలు భగత్ ను అభినందిస్తున్నారని.. సుబ్బమ్మ, నారయ్య దంపతులను భగత్ నాగబాబు ఇంట్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలను చూపించింది. 


"ఇవాళ అంతా ఇదే చూపిస్తారని" విసుగ్గా రిమోట్ తో భగత్ అపబోతుంటే.. తన చేతిలోకి తీసుకుంది "నేను చూస్తాను..!” అంటూ మనవడికి దిష్టి తగలకుండా మెటికలు విరుస్తూ అంది రమణమ్మ. 


సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


25 views0 comments

Comments


bottom of page