top of page
Writer's picturePandranki Subramani

ఆకాశం వర్షించదు అందరి కోసం!


'Akasam Varshinchadu Andari Kosam' written by Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి

అతణ్ణి అంతకుముందెక్కడా చూసినట్టు కరుణాకరానికి జ్ఞాపకం రాలేదు. ఎప్పుడో ఎక్కడో చూసి ఉన్నా అతణ్ణి గుర్తుంచుకోవలసినంత అవసరమూ అతడికి కలగలేదు. కాని, ఆ రోజు ఉదయం శ్రావణ శుక్రవారం నాడు బ్రాహ్మణవాడలోని వీరాంజ నేయస్వామి ఆలయ దర్శనం చేసుకొని గుడి మెట్లు దిగుతున్నప్పుడు తారసిల్లాడతను.

కార్టూన్ బొమ్మలాంటి బ్రాడ్ స్మైల్ చేస్తూ- “నాపేరు భూమారావు. నేను మీకు గుర్తుండక పోవచ్చేమో గాని, మీరు నాకు బాగానే గుర్తు. ఆ మాటకు వస్తే మీరు నాకు దూరపు బంధవులు కూడాను-- టూకీగా చెప్పాలంటే- మనిద్దరం షడ్ఢకులం”అని తనను తను పరిచయం చేసుకున్నాడు.

అప్పుడప్పుడు కొన్ని ఎదుర్కోళ్ళు అలానే ఉంటాయి మరి బుర్ర గిర్రున తిరిగేలా-- అంచేత అదెలా సాధ్యం అన్నట్టు కళ్లు మిటకరించి చూసాడు కరుణాకర్. అప్పుడు భూమారావు గతంలోకి రంగ ప్రవేశం చేసాడు- ’ఎలాగంటే- ‘అంటూ ఆరంభించి-- అదెక్కడో గాజువాక వాగునుండి గీత గీస్తూ వచ్చి, కంచెరపాలెం జీడి మాఁవిడి తోటవరకూ లాక్కొచ్చి, అతడి వంశ వృక్షపు వ్రేళ్ళ ను అక్కడక్కడా తట్టు తట్టున తాకుతూ ఇద్దరు భార్యల భర్త తన దివంగత మేనమామ చింతల పైడిరాజు వద్దకు వచ్చి ఆగాడు. ఆ దీర్ఘమైన ఉపోద్ఘాతంతో చలితుడైన కరుణాకర్ ఇక కాదనలేక పోయాడు.చేతులు కలిపాడు. ఔనన్నంత మాత్రాన పుట్టేదీ మునిగి పోయేది లేదుగా! ఆ ఊపున ఇద్దరు తోడళ్లులూ హుషారు పుంజుకుని అక్కడికక్కడే కబుర్లలో దిగి దేవస్థానం వారు అందిచ్చిన పులిహోర ప్రసాదం తింటూ బైటకు వచ్చి మోదుగు చెట్టు క్రింద ఉన్న బడ్డీనుండి టీ కప్పులు అందుకున్నారు.

ఆ రీతిన నానా విషయాలు కలబోసుకుంటున్నప్పుడు భూమారావు కరుణాకర్ యేమాత్రమూ ఎదురు చూడని ప్రశ్న పేల్చాడు- “ ఇప్పుడు మీ కోడలు పిల్ల ఎలా మెసలుకుంటుంది?”

ఆ ప్రశ్నకు బదులు వెతకడానికి క్షణాలు పట్టాయతనికి. తన కొడుకు పెండ్లికి హాజరయే మాట అటుంచి వాడి ముఖమే చూసెరగడు ఈ కొత్త షఢ్ఢకుడు. అటువంటప్పుడు కోడలు పిల్లను చూసే అవకాశం ఎక్కడిది? మాటలాడుకునే సందర్భాన తనకు తెలియకుండానే తన కుటుంబ వృత్తాంతం గురించి తనేదో చెప్పుంటాడు. ఇప్పుడా పురి కొసను అంది పుచ్చుకుని ఉంటాడు భూమారావు. నోరు తెరవకుండానే-“అంటే?”అన్నట్టు కళ్ళెత్తి చూసాడు కరుణాకర్.

“మరేమీ లేదోయ్. మీ ఇంట ఇమిడిపోయిందా- లేక ఇంకా పుట్టింటి వాసనలతోనే అంటీ అంటనట్టు కాలం వెళ్ళబుచ్చుతుందా-అని?”

కరుణాకర్ సర్దుకుని బదులిచ్చాడు-“ఎందుకిమిడి పోదూ? ఆపిల్లది సరళ స్వభావం- సర్దుకుపోయే మనస్తత్వం. మా భార్యాభర్తలిద్దరినీ మన్ననతో చూసుకుంటుంది”

ఆ బదులు విని భూమారావు స్పందించలేదు. రవంత మౌనం వహించి పిదప నవ్వేందుకు ప్రయత్నిస్తూ అడిగాడు-“కోడలు పిల్ల కడుపు పండిందా?”

”ఇంకాలేదు. ఐనా నువ్వేదో ఊహించుకుంటూ క్వరీలు లేవదీస్తున్నట్టున్నావు. ఆ మాటకు వస్తే మా కోడలు పిల్లకు బిడ్డాపాపా కలిగితే మట్టుకు ఏమవుతుందట? ఏమీ కాదు. మనం ఎలా ఉంటామో ఎదుటి వారు కూడా అలాగే మసలుకుంటారన్నది మరచిపోకు” .

కొన్ని క్షణాల పాటు తలపంకిస్తూ ఉండిపోయి స్పందించాడు భూమారావు- “ఔను వాస్తవమే!మనం న్యాయంగా ఉంటే ఎదుటి వారు కూడా అలానే న్యాయంగా ఉంటారు. ఉండాలి కూడాను. ఐతే అది ఎంతవరకన్నదే ప్రశ్న” ఈమాటంటూ భూమారావు కరుణాకర్ భుజంపైన ఒకతట్టు తట్టి అక్కణ్ణించి కదులుతూ బ్రాహ్మణవాడ రైలుపట్టాలు దాటుకుంటూ అటు సాగిపోయాడు.

ఇప్పుడు కరుణాకర్ వింత వింత ఆలోచనల జడిలో తడవ నారంభించాడు. వెళ్తూ వెళ్తూ రంగుల పండగ వంటి వాతావ రణంలో షఢ్ఢకుడు నలువైపులా నలుపు పొడి చల్లి వెళ్ళిపోయినట్టున్నాడు. ఎక్కడో ఎప్పుడో భూమారావుకి ఏదో చేదు అనుభ వం ఎదురై ఉంటుంది. అటువంటిదే అందరికీ వాటిల్లుతుందనుకుంటున్నాడేమో! తన ఎరుకలో కొందరున్నారు. తమకు తాము అంతా తెలిసిన జ్ఞాన సంపన్నులమనుకుంటుంటారు. ఎదుటివారి ప్రేగులు మెలిపెట్టేస్తుంటారు. భూమారావు ఆ కోవకు చెందిన వాడేమో! ఏమైందో ఏమో- భూమారావు మళ్లీ ఆ ఛాయలకు రాలేదు. కనిపించనూ లేదు. ఐనా ఒకసారి చూడాలనిపించి అతడు వీరాంజనేయ స్వామి గుడి మెట్ల వద్ద, అంబ మైసమ్మవారి ఆలయ ప్రాంగణంలో రెండు మూడు సార్లు వెతికాడు. ఐనా అతడి జాడ లేదు. ఊళ్ళూ దొరువులూ మారే వలస పక్షిలా ఇంకెక్కడికో ఎగిరిపోయినట్టున్నాడు షఢ్ఢకుడు. ఇక కనిపిస్తాడో లేదో!

ఎట్టకేలకు ఒకరోజు పాడ్యమినాడు ఆలయ ప్రాంగణంలో కనిపించాడు భూమారావు; నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని మెడ చుట్టూ కాషాయ ఉత్తరీయాన్ని కప్పుకుని. ఇంతకూ అతడి ఉనికి ఎన్నాళ్ల తరవాతని— సంవత్సరం పైమాటే! కొన్ని క్షణాలపాటు కనురెప్పల్ని అల్లాడిస్తూ దిగ్భ్రాంతితో చూసాడతను. భూమారావు మళ్ళీ కనిపిస్తాడనుకోలేదు. కాని అతడు మాత్రం అటువంటి అతిశయ భావాలకు తను అతీతుడైట్టు చూస్తూ, చెక్కు చెదరని ముఖభావంతో ఎదురొచ్చి అదే బ్రాడ్ స్మైల్ చేస్తూ-“నేనూ మా ఆవిడా తీర్థ యాత్రలకెళ్ళామోయ్. ఋషికేశ్ కి వచ్చేటప్పటికి న్యుమోనియ బారిన పడ్డది ఆ మహాతల్లి. అంచేత అక్కణ్ణించి అలా తిన్నగా వైజాగ్ తీసుకెళ్ళాల్సి వచ్చింది. అది సరేగాని, నీ కోడలు ఏం చేస్తుంది? హౌ ఈజ్ షి నౌ?”అని తన కష్టసుఖాల గురించి తనే చెప్పుకుంటూ అలవాటు ప్రకారం చివరన ప్రశ్నను సంధించాడు. కోడలు పిల్ల గురించి తప్పకుండా ప్రస్తావిస్తాడని ఊహించిన కరుణాకర్ రెడీ మేడ్ ఆన్సర్ తో పెదవి విప్పాడు- “ఉఁ- షి ఈ జ్ ఓకే!”

“అదేంటోయ్ అంత కోల్డ్ గా ఉంది నీ జవాబు?” కరుణాకర్ కి తెలుసు షడ్ఢకుడు అంత త్వరగా విషయాన్ని దాటి పోనివ్వడని-

“విషయం కోల్డ్ వ్యవహారంగా మారినప్పుడు బదులు కూడా కోల్డ్ గానే కదా ఉంటుంది!” ఆ జవాబు విన్నంతనే చేతి వ్రేళ్ళను విన్యాసంగా గాలిలోకి లేపి ఛట్ మనిపించాడు భూమారావు. -“పురుడు పోసుకోవడానికి పుట్టింటికి వెళ్ళిన కోడలు పిల్ల ఊరింకా చేరి ఉండదు, భేతేళుడిలా చెట్టెక్కిన కోడలు దిగిరానంటుంది. ఓ విధమైన వ్యవహార దక్షతతో ముందుకు సాగుతుంది యెడ ముఖం పెడముఖం చేసుకుని-- అంతేకదూ!”

కరణాకర్ ఔనన్నట్టు తలుపాడు.

“మగబిడ్డనే కదూ కన్నది?”ఈ ప్రశ్న విన్నంతనే కరుణాకర్ రెండు కళ్లూ విస్మయాత్మకంగా పెద్దవయాయి-“అంత రూఢిగా ఎలా చెప్పగలుకుతున్నావోయ్?”

“అనుభవం-స్వానుభవం. మా ఇంటి కోడలు కూడా అచ్చు మీ ఇంటి కోడలు మల్లే పెళ్ళి కొత్తలో సరళంగా మాట్లాడుతూ అణగి మణకి ఉండేది. కాస్త ప్రాతబడ్డ తరవాత గతకాల పుట్టింటి వాసనలు తాకిన తరవాత తన అసలు రూపం చూపించింది. ముఖ్యంగా మగబిడ్డకు తల్లయిన తరవాత—మొగుణ్ణి కొంగున కట్టి పడవేసి, మేం అడ్డువస్తున్నామన్న ఆక్రోశంతో మమ్మల్ని నానా విధాల హరాస్ చేసి వేరు కాపురం పెట్టుకునేందుకి విడిపోయి వెళ్లిపోయింది. ఇందులో మావాడు కూడా తక్కువ తినలేదు.పెళ్లాం కొంగు పట్టుకుని చిద్విలాసంగా గడప దాటాడు. ఇప్పటి యువతీ యువకుల మధ్య కనిపించే ఆనవాయితీ ఇదేగా!

ఇక నా సంగతికేం గాని కరుణాకరా --మా ఇంట్లోలాగానే మీ భార్యాభర్తలిద్దరినీ కోడలు పిల్ల తెగ యాగీ చేసుంటుంది. ఇంటిని కార్గిల్ యుధ్ధ శిబిరంలా మార్చి ఉంటుంది. మీ అబ్బాయి కూడా తోకముడిచిన నక్కలా వెన్నంటి వెళ్ళుంటాడు. పోనీలే, ప్రాత సంగతుల్ని పదేపదే తోడుకోవడం ఎందుకు గాని- గతం గత: మీ చిన్నోడికి పెళ్లి చేసావా? లేక పెండ్లి సంబంధాలు యింకా కుదరలేదా?”

కరుణాకర్ నిదానంగా చెప్పాడు- “మనం హనుమంతుడి గుడి ఆవరణలో కలుసుకున్న మరుసటి నెలే పెళ్ళి చేసాను. పెళ్లికార్డు ఇవ్వాలంటే నువ్వు కనిపించ లేదుగా!”

భూమారావు నవ్వి షడ్ఢకుడి భుజాన చేతులుంచి అన్నాడు-”తీర్థ యాత్రలకెళ్ళేటప్పుడు మధ్యలో ఏమి జరిగిందో చెప్పాగా! ఇక అసలు విషయం చెప్పి నేను బయల్దేరుతాను- చిన్న కోడలు మొన్న మొన్ననే వచ్చింది కాబట్టి మంచీ మర్యాదల్ని పన్నీటి చినుకుల్లా చిలకరిస్తుంటుంది. వాటిని ఫేస్ వేల్యూతో స్వీకరించి ఇద్దరూ గుంటలో పడబోకండి. ఈ రోజుల్లో పెటాకుల్ని టి వీ సీరియల్ ఎపిసోడ్స్ లా ట్రీట్ చేసే ఇప్పటి తరం వాళ్ళు నిన్నకాక మొన్న ముఖాలు చూసుకున్న మెట్టింటి వాళ్ళ మనోభావాలు గుర్తిస్తారన్న గ్యారంటీ ఏముంది? దెబ్బపైన దెబ్బ తగలకముందే మీ జాగ్తత్తలో మీరుండండి. ఎందుకైనా మంచిది ఎడంగా ఉండండి! సరేనా!” అంటూ భూమారాపు బ్రాహ్మణవాడ రైలు పట్టాలు వేపు నడిచి వెళ్లిపోయాడు. కరుణాకర్ సాగిపోతూన్న షడ్ఢకుడి వేపు తదేకంగా చూస్తూ నిల్చున్నాడు.

ఈసారి తోడళ్ళుల్లిద్దరూ సుమారు పదినెలల ఎడబాటు తరవాత బ్రాహ్మణవాడ అంగడి వీధిలో కలుసుకున్నారు.

కరుణాకర్రావు సంగతేమిటని అడక్కముందే భూమారావు తన తరపు సమాచారాన్ని అరటి పండులా ఒలిచి అందించాడు- “మొన్నటితో ఇసుక తోటలోని జీడి మాఁవిడి తోట తగాదా తీరిపోయిందోయ్! మళ్లీ మళ్లీ వెళ్ళి రావడానకి వీలుపడటం లేదు. అందులో మా ఆవిడకు కూడా ఒంట్లో పొందికగా లేదాయె. అందుకుని ఒన్ టైమ్ ఫైనల్ పరిష్కారంగా తోటనమ్మేసాను.ఇకపైన ఇక్కడకు పర్మినెంటుగా తరలి వచ్చి మా ఆవిడ ట్రీట్మెంట్ కొనసాగించాలని తీర్మానించాను. ఐనా— ఈ గొడవలన్నీ మనకెప్పుడూ ఉన్నవేగా! ముందిది చెప్పు. మీ చిన్న కోడలుపిల్ల ఎలాగుంది? కడుపు పండిన వెంటనే చెట్టెక్కేసి ఉంటుందే—“

షఢ్ఝకుడు ఈసారి కూడా తన చిన్నకోడలు పిల్ల ఊసు ఎత్తుతాడని కరుణాకర్ కి తెలుసు. ఆ పాటి ఊహజ్ఞానం తన కుండదా—నీరు పల్లమెరుగన్నట్టు.

”ఔనోయ్. మా చిన్నకోడలు పిల్లకు కడుపు పండింది. ఆమెకు కూడా మగపిల్లాడే— “

ఆ మాటతో భూమారావు తన ఊహాగానాల పొదరిల్లు పట్టున విప్పాడు-

“పుట్టింట్లో పురుడు పోసుకుని వచ్చింతర్వాత కోటలో పాగా వేసుంటుందే—ఈపాటికి అందర్నీ ఎడాపడా ఎమోషనల్ బ్లాక్ మైల్ కి గురిచేసి, నీ చిన్నకొడుకుని కొంగున కట్టేసుకుని దూరతీరాలకు ఎగరేసుకుపోయుంటుందే—“

అప్పుడు అదే సమయమనుకుని షఢ్ఢకుడి ఊహాగానాలకు చప్పున అడ్డుకట్ట వేసాడు కరుణాకర్-“లేదు. అలా జరగలేదు. ఆ పిల్ల ముమ్మాటికీ అలా ప్రవర్తించలేదు. ఇంకా చెప్పాలంటే కథ మాకు అడ్డంగా తిరిగింది”

అంటే-అన్నట్లు కనుబొమలు ఎగరేసి చూసాడు భూమారావు.

”పూర్తిగా చెప్తాను విను. మా పెద్ద కోడులు పిల్ల లాగే చిన్నకోడలు కూడా అదను చూసి పదునుగా పంజా విప్తుందని- వేరే కుంపటి పెట్టుకునే ప్రయత్నంలో ముందుస్తుగా మా మనోభావాలతో రాంపాడి యాగీచేసి ఘర్షనాత్మకమైన వాతావరణం సృశ్టిస్తుందనేగా మనం అనుకున్నాం. అది రీతిన మేం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. కాస్తంత ఇలా యిటు జరిగి చూడు- అదిగో—అక్కడ బ్రాహ్మణవాడ బజారు వీధి కనిపిస్తుంది చూడూ! దాని ప్రక్కన రామాలయం నిటారుగా కనిపిస్తుంది. దాని ప్రక్కన మాకొక టూ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంది. అందులో ఉంటూన్న టెనెంటుని ఖాలీచేయించి దాని తాళం చెవిని మా చిన్నకోడలు రేవతికి అందిచ్చి ఇద్దరమూ ఇలా అన్నాం- ‘ఇకపైన మీరిద్దరూ స్వేఛ్ఛగా ఉండవచ్చు. ఒకరికొకరం ప్రత్యర్థులుగా మారకముందే, మనందరి పరువూ రచ్చకెక్కకముందే మనకు మనం సర్దుకు పోవడం మంచిది కదా! అందులో మీకేమో-చాలా మంది ఆఫీసు ఫ్రెండ్స్ వస్తూ పోతుంటారు. మహిళా మండలి కార్యకర్తలు కూడా వస్తుంటారు. అప్పుడప్పుడు పార్టీలు కూడా చేసుకుంటుంటారు. అప్పుడు మా ఇద్దరి ఉనికీ మీకు అంతరాయంగా ఉండ వచ్చు. మీకెప్పుడు వీలు కలుగుతుందో అప్పుడు మమ్మల్ని చూసి వెళ్ళవచ్చు’ అని వెనుదిరిగాం భార్యాభర్తలిద్దరుమూను”

ఆమాట విన్నంతనే భూమారావు ముఖం విప్పారింది- “మనం అనుకున్నట్టే చేసావన్నమాట!భళరే భళా! మీరు చేసిన ఆఫర్ కి మీ చిన్నకోడలు పిల్ల ఉక్కిరి బిక్కిరయి ఉంటుందే--”

“లేదు. మనిద్దరి గెస్సింగూ ఇంటి పైకప్పు పైకి ఎగిరి కూర్చుంది. అలా తప్పుడు గెస్సింగ్ చేసి మేం పప్పులో-- కాదు- తప్పులో కాలేసి ఉన్న పరువు తీసుకున్నాం” .

ఆమాటకు భూమారావు తెల్లబోయి చూసాడు-“పరువు తీసుకున్నారా! అదెలా?”

“చెప్తున్నాగా! తినబోయి రుచి అడగడం దేనికి? మేం చేసిన ఏర్పాటు చూసి రేవతి సంతోషించలేదు సరికదా—మమ్మల్నిద్దరినీ ఉతికి ఆరబెట్టేసింది. మా ఇద్దరికీ దిమ్మతిరిగినంత పనయిందనుకో!”

“ఎలా? ఎలా! కమ్మౌట్ క్విక్!” భూమారావు ఆసక్తి ఆపుకోలేక పోతున్నాడు.

“ఆ పిల్ల మాటల్లోనే చెప్తాను. ’ఢిల్లీలో పుట్టిపెరిగిన నన్ను మా అమ్మానాన్నలూ దూరభారం చూడకుండా మీ అబ్బాయికి ఎందుకు కట్టబెట్టారని— ఏది చూసి కట్టబెట్టారని— కేవలం మీ అబ్బాయినీ మీ అబ్బాయి చేస్తూన్న ఉద్యోగం చూసి మాత్రమే మీ ఇంటి కోడలుగా పంపారను కుంటున్నారా! కానే కాదు శ్రీమాన్ మామగారూ! మీ భార్యా భర్తల పట్ల, మీ పెద్దరికం పట్ల విశ్వాస ముంచి అంత దూరం నుంచి పంపించారు. అలా పంపించేటప్పుడు మా అమ్మానాన్నా ఏమని చెప్పి పంపించారో తెలుసా? ఇకపైన నీ బాధ్యతంతా మీ అత్తా మామలదే— అని దివ్య ధీమాగా భాగ్యనగరం పంపించారు. తీరా ఇప్పుడు తిరిగి చూస్తే— నాకు తల్లి దండ్రుల స్థానంలో ఉండాల్సిన మీరు నా గురించి ఏవేవో ఊహించుకుని ఇంకెవరితోనో పోల్చుకుని నన్ను పొరుగింటికి గెంటేస్తున్నారా! ఈ ఊరుకాని ఊళ్ళో నాకూ నా బిడ్డకూ మీరు కాక మరెవ్వరు బాసటగా నిలుస్తారు చెప్పండి? అసలు మీరు నాకు తోడుగా నీడగా ఉంటారనే కదా—రాత్రింబవళ్ళు చదివి బ్యాంకు ఉద్యోగానికి సెలెక్టయి ధైర్యంగా పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నదీ--ఇప్పుడు దీనికి బదులివ్వండి. పిల్లాడికి తల్లిని నేను కావచ్చు. కాని వీడు మీ ఇంటవాడే కదా--తాతయ్యగా బామ్మగా మీ పేర్లు చెప్పుకునేగా చివరి వరకూ మనుగడ సాగించాలి. ఇదిలా ఉంచండి. ఇక అసలు విషయానికే వస్తాను. నేను ఉద్యోగం చేయడం మీకు గాని ఇష్టం లేకపోతే సరా సరి నా ముఖాన చెప్పేయండి. వెళ్ళడం మానేస్తాను. అంతేగాని— నన్నూ నా బిడ్డనూ పరాయి వాళ్ళను చేయకండి. ఒక వేళ నా వల్లగాని మా వారి వల్లగాని ఏదైనా పొరపాటు జరిగుంటే మా ముఖాన చెప్పండి. మీ ఇద్దరి కాళ్లూ పట్టుకుని క్షమాపణ కోరుకుంటాం”

కరుణాకర్ చెప్పడం ఆపాడు. ఆపి ముఖం తిప్పి చూసాడు. భూమారావు నేలపైన చూపులు నిలిపి నిశ్శబ్దంగా నిల్చున్నాడు. కరుణాకర్ ఊరుకోలేదు. “అదేమిటోయ్!కాసేపు నేలలోకి, మరి కాసేపు నలుపు దేరుతూన్న ఆకాశంలోకి అంత తదేకంగా చూస్తున్నావు! తోక చుక్కగాని కనిపించడం లేదు కదా!”

“లేదు నేను తోక చుక్కను చూడటం లేదు. మనసున్న ఆకాశాన్ని చూస్తున్నాను”

దానికతడు అర్థం కానట్లు తల ఆడించాడు.

“చెప్తాను. ఋతువులను బట్టి-మాసాలను బట్టి ఎన్నోవర్షాలు వచ్చి పోతుంటాయి. భూమితల్లిని తడిపి పోతుంటాయి. కాని అన్ని వర్షాలూ రేవతి వర్షానికి సమానం కాజాలవు కదా! ఈ వాస్తవం గుర్తించక అంతా నాకు మాత్రమే తెలిసిన వాడిలా ఏదేదో వాగేసి ఉంటాను. ఐయామ్ రియల్లీ సారీ!” అంటూ వెనుతిరగబోయాడు భూమారావు.

కరుణాకర్ అతణ్ణి ఆపాడు-“అంతగా ఫీలవాల్సిన అవసరం లేదు గాని- ఇంతకీ నువ్వు చెప్పబోయేదేమిటి? మనసు విప్పి చెప్పు “

“నాకు చెట్టెంత కొడుకున్నాడు. కాని రేవతి వంటి కూతురు లేకుండా పోయింది కదానని--” అంటూ ముందుకు నడవసాగాడు రైలు పట్టాల వేపు.

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


47 views0 comments

Comments


bottom of page