'Akasamantha Samudramantha Viswamantha' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 09/05/2024
'ఆకాశమంత.. సముద్రమంత.. విశ్వమంత..' తెలుగు కథ
రచన: మల్లవరపు సీతారాం కుమార్
కథా పఠనం: మల్లవరపు మనోజ్ కార్తీక్
"రేపే గురువుగారు మన ఊరికి వచ్చే రోజు" గుర్తు చేసాడు మోహన రావు.
"గుర్తుంది. మన సమస్యను వారికి ఎప్పుడు వివరిద్దాం?" అడిగాడు గురుమూర్తి.
రాధాకృష్ణ మూర్తి గారు మంచి ప్రవచన కర్త, దైవ భక్తులు. నెల్లూరులోని అయన భక్త బృందంలో మోహన రావు, గురుమూర్తి సభ్యులు. అందువల్ల ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
"గురువుగారు రేపు ఉదయం ఎనిమిదింటికి మన వూరు చేరుకుంటారు. మన భక్త బృంద సభ్యులు రామచంద్రంగారి ఇంట్లో బస. ఎల్లుండి నుంచి టౌన్ హాల్ లో ప్రవచనాలు.
రేపు మాత్రం రామచంద్రం గారి ఇంట్లో మన సభ్యులకు ప్రత్యేకంగా ప్రసంగం. మధ్యాహ్నం భోజనాలయ్యాక కాస్సేపు సభ్యులతో మాటా మంతీ. అందరూ వెళ్ళాక వీలు చూసుకొని వారిని కలుద్దాం. రామచంద్రం గారితో చెప్పి ఉంచాను" చెప్పాడు మోహన రావు.
అయన ఏం చెప్పినా శిరసా వహిద్దాం. మన ఇద్దరికీ అయన మాటే వేదవాక్కు కదా" అన్నాడు గురుమూర్తి.
***
మిత్రులిద్దరూ మర్నాడు రామచంద్రం గారి ఇంట్లో గురువు గారి ఉపన్యాసానికి వెళ్లారు..
మన దేశంలో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థల ఔన్నత్యం గురించి రాధాకృష్ణ మూర్తి గారు అనర్గళంగా ఉపన్యసించారు. అయన వాగ్ధాటి చూస్తుంటే సరస్వతీదేవి అయన నాలుక మీద నృత్యం చేస్తున్నట్లు అనిపించింది.
ప్రసంగం ముగిశాక భోజనానంతరం సభ్యులతో కాసేపు ముచ్చటించారు రాధాకృష్ణ మూర్తి గారు. భక్త బృంద సభ్యులడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు.
తరువాత అయన హఠాత్తుగా మోహన రావు గారి వంక చూసి "మీకేమీ సందేహాలు లేవా?" అని అడిగారు.
మోహన రావు కాస్త తటపటాయించి, " సందేహం కాదు. ఒక వ్యక్తిగత సలహా కావాలి. తరువాత మీకు వీలుంటే అడుగుదామని.. " అన్నాడు.
"అబ్బాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు. ఆ విషయమేనా.. అలాగే.. అందరూ వెళ్ళాక కలవండి" అన్నారు గురువుగారు ప్రశాంత వదనంతో.
"మనసులో ఉన్నది కనిపెట్టేసారు. మీ శక్తి అమోఘం" అంటూ చేతులు జోడించాడు మోహన రావు..
"మరీ ఆకాశానికెత్తేయ్యకండి. కిందికి పడిపోగలను. మీరేదో మాట్లాడాలనుకుంటున్నట్లు రామచంద్రం గారు చెప్పారు. అంతే" అంటూ చిరు నవ్వుతో ప్రతి నమస్కారం చేశారు రాధాకృష్ణ మూర్తి గారు.
***
అందరూ వెళ్ళాక గురువుగారు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటలప్పుడు రామచంద్రం కాఫీ గ్లాసుతో గురువు గారిని సమీపించాడు.
గ్లాసును టేబుల్ పైన ఉంచి గురువుగారి పాదాలకు నమస్కారం చేయబోయాడు.
అతన్ని ఆపి ఇదేమిటని ప్రశ్నించారు గురువు గారు.
"నేను మోహన రావు గారి గురించి మీకేమీ చెప్పలేదు. మీకు మనసు చదవగలిగే శక్తి ఉంది. అందుకే ఆ విషయం కనిపెట్టారు. కానీ నలుగురిలో సామాన్యుడిగా ఉండాలని నేను చెప్పినట్లు చెప్పారు" అంటూ మళ్ళీ వారి పాదాలు స్పృశించబోయాడు.
"ఆగవయ్యా రామచంద్రా! నువ్వు శ్రీరామచంద్రుడివీ, నేను వశిష్ఠుడినీ కాదు, ఇలా మాటిమాటికీ పాదాలకు నమస్కారం చెయ్యడానికి. ఆ మోహన రావు గారు పదేపదే మీ వంక చూడడం, మీరు ఆగమన్నట్లు సైగ చెయ్యడం నేను గమనించి అలా అన్నాను. అంతేగానీ నా మహాత్మ్యమేమీ లేదు. వాళ్ళిద్దరినీ లోపలికి పంపండి" అన్నారు గురువు గారు.
మళ్ళీ తనవంక ఆశ్చర్యంగా చూస్తున్న చూస్తున్న రామచంద్రంతో "ఇద్దరని నాకెలా తెలుసని ఆశ్చర్యపోకండి. బయటనుంచి వాళ్లిద్దరూ లోపలికి తొంగి చూస్తూ ఉండటం గమనించి చెప్పాను లెండి" అన్నారు నవ్వుతూ.
లోపలికి వచ్చిన మోహనరావు, గురుమూర్తి గురువుగారికి నమస్కరించి, ఆయన అనుమతితో కూర్చున్నారు.
అయన తాగిన కాఫీ గ్లాసు అందుకుని బయటకు నడిచాడు రామచంద్రం.
"ఇక నింపాదిగా విషయం వివరించండి. నాకు తోచిన సలహా చెబుతాను" అన్నారు రాధాకృష్ణమూర్తి గారు.
మోహన రావు సమస్యను వివరంగా ఇలా చెప్పాడు.
మోహనరావు అబ్బాయి సుదీప్ కి, గురుమూర్తి కూతురు సుష్మకి పెళ్లి నిశ్చయించారు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారు. పెద్దలు కూడా అంగీకరించారు.
తీరా జాతకాలు చూపిస్తే వివాహం జరిగితే ఇద్దరి మధ్య సఖ్యత ఉండదనీ, రాహు కేతువుల ప్రభావం వల్ల తరచూ కలహాలు వస్తూ ఉంటాయనీ తెలిసింది.
ఏంచెయ్యాలో తోచక గురువుగారి సలహా కోసం వచ్చారు.
"నిస్సంకోచంగా వివాహం జరిపించండి. అంతగా రాహుకేతువుల వల్ల ఏదైనా సమస్య వస్తే అప్పుడు చూసుకుందాం. వివాహానికి వధూవరుల పరస్పర అంగీకారమే ముఖ్యం. మిగిలిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వ వలసిన అవసరం లేదు" అని సలహా ఇచ్చారు రాధాకృష్ణమూర్తి గారు.
అయన దగ్గర సెలవు తీసుకొని బయటకు నడిచారు ఇద్దరూ.
వాళ్ళు వెళ్ళాక లోపలికి వచ్చిన రామచంద్రం, గురువుగారిని సమీపించి "నిజంగా రాహుకేతువుల ప్రభావం ఉంటుందా?" అని అడిగాడు.
"ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే రాహువు, కేతువు అనే గ్రహాల వల్ల కాదు. ఎవరైతే వాళ్ల మధ్య స్పర్ధలకు కారణమో వాళ్లే రాహుకేతువులు. వాళ్ళ ప్రభావం తొలగితే ఏ గొడవలూ ఉండవు " అన్నారు గురువుగారు.
***
సరిగ్గా మూడు నెలల తరువాత మళ్ళీ రాధాకృష్ణమూర్తి గారు నెల్లూరు వచ్చారు.
ఎప్పటిలాగే సాయంత్రం ఐదు గంటలకు కాఫీ తీస్కొని అయన దగ్గరకు వచ్చాడు రామచంద్రం.
"వాళ్ళను రమ్మను" అన్నారు రాధాకృష్ణమూర్తి గారు.
"ఎవరిని?" అర్థం కానట్లు అడిగాడు రామచంద్రం.
"అదే.. ఆ రాహు కేతువులను రమ్మను" చెప్పారాయన.
'ఇంకా మోహనరావు, గురుమూర్తి వచ్చి తమ పిల్లల మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పనే లేదు. అప్పుడే అందుకు కారణమైన రాహు కేతువులు పెద్దలే అని గురువుగారు ఎలా చెబుతున్నారు?' అని మనసులో అనుకుని వాళ్ళను లోపలికి రమ్మన్నాడు రామచంద్రం.
లోపలికి వచ్చిన మోహనరావు, గురుమూర్తి గురువుగారికి నమస్కరించారు. గురువుగారు తాగిన కాఫీ గ్లాసు తీసుకొని బయటకు నడిచాడు రామచంద్రం.
మోహనరావు మాట్లాడుతూ “పిల్లల వివాహం పోయిన నెలలో జరిగింది. మీకు పెళ్లి పత్రిక పంపాము. ఫోన్ లో మీ ఆశీస్సులు తీసుకున్నాం కూడా" అని చెప్పాడు.
"పిల్లల మధ్య అంతగా సఖ్యత ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. అందుకు కారణమేమిటో తెలియడం లేదు" అన్నాడు గురుమూర్తి.
“నిస్సందేహంగా రాహుకేతువులు ప్రభావమే. ముని శాపాన్ని నిజం చేయడానికి తక్షకుడు రంగంలోకి దిగినట్లు రాహుకేతువుల ప్రభావాన్ని నిజం చేసే బాధ్యతను మీ రెండు కుటుంబాలూ తీసుకున్నాయి" చెప్పారు రాధాకృష్ణమూర్తి గారు.
"ఎంత మాటన్నారు గురువుగారూ! మా వేళ్ళతో మా కళ్ళనే పొడుచుకుంటామా.. ఇది మేము సమ్మతించి కుదిర్చిన వివాహమే కదా! మాకు వాళ్ల మీద ద్వేషం ఎందుకుంటుంది.. " అన్నాడు గురుమూర్తి బాధగా.
"ద్వేషం కాదు. మితిమీరిన ప్రేమ ఉంది. అధికమైన ఆహరం ఎలా అజీర్ణాన్ని, తద్వారా అనారోగ్యాన్ని కలిగిస్తుందో ఎక్కువ ప్రేమను చూపించాలనుకోవడం కూడా అలాగే సమస్యలకు దారి తీస్తుంది.
పెళ్ళికి ముందు పిల్లల మీద చూపించే ప్రేమకి, పెళ్లి తరువాత చూపించాల్సిన ప్రేమకి సున్నితమైన తేడా ఉంటుంది.
పెళ్ళికి ముందు అమ్మాయి సోదరుడు తన సోదరి వంక ఎవరూ కన్నెత్తి చూడకుండా కాపాడుతాడు.
అదే వ్యక్తి పెళ్లి సమయంలో కాబోయే బావగారిని, కాశీయాత్ర విరమించుకొని తన సోదరితో సంసారిక జీవనం గడపమని కోరుతాడు. ఇన్నాళ్లు సోదరికి తోడుగా, రక్షగా ఉన్న తన బాధ్యతను బావగారికి అప్పగిస్తాడు.
వివాహ కార్యక్రమంలో అమ్మాయి తలిదండ్రులు కాబోయే అల్లుడి కాళ్ళు కడగడంలోనే అతనికిచ్చే గౌరవం వ్యక్తమవుతుంది. తాము నిర్వర్తిస్తున్న అమ్మాయి పోషణ, సంరక్షణ బాధ్యతలు అల్లుడికి అప్పగిస్తారు.
ఇక శోభనానికి కూడా ముహూర్తం నిర్ణయించి పెద్దలు అమ్మాయిని గదిలోకి నెడతారు.
ఈ వివాహ తంతు యావత్తు అమ్మాయిని అబ్బాయిని కలపడానికి జరుగుతుంది.
కానీ వివాహం జరిగాక తమ ప్రాధాన్యత తగ్గుతున్నట్లు ఇరువైపులా పెద్దలూ భావిస్తారు. అమ్మాయి, అబ్బాయి హాయిగా కాలం గడుపుతుంటే తమను మర్చిపోతోందని భావించి ప్రతిక్షణం గుర్తు చెయ్యడానికి ప్రయత్నిస్తారు. నిజానికి తాము గుర్తుకు రానంతగా వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని సంతోషించాలి.
ఒక్కటి గుర్తుంచుకోండి. అమ్మాయి తలిదండ్రుల ప్రేమను, తోబుట్టువుల ఆదరణను భర్త ఆందించగలడు కానీ భర్త ప్రేమానురాగాలను, అతని స్థానాన్ని ఎవరూ భర్తీ చెయ్యలేరు.
అమ్మాయి పట్ల ఆమె తలిదండ్రులది ఆకాశమంత ప్రేమ. అయితే మిన్ను విరిగి మీద పడితే ఏమౌతుంది? తాము దూరంనుంచే ప్రేమను చూపించి అబ్బాయికి అమ్మాయిని దగ్గర చెయ్యాలి.
ఇక అబ్బాయి తలిదండ్రులు..
తమను నమ్ముకుని, అందరినీ వదిలి వచ్చిన అమ్మాయికి తామున్నామనే ధైర్యాన్ని కలిగించాలి. వారు హాయిగా కలిసుండాలని చూడాలేగానీ, తమ ప్రాముఖ్యత తగ్గుతుందని అనుకోకూడదు. అబ్బాయి తమ చేజారి పోతున్నాడని అనుకోకూడదు. అబ్బాయికి ఒక కుటుంబం ఏర్పడిందనీ, అబ్బాయి యజమాని అయితే కోడలు యజమానురాలని గుర్తించాలి. అప్పుడే వాళ్ల బాధ్యతలు పిల్లలు సక్రమంగా నెరవేర్చగలరు.
అబ్బాయి తలిదండ్రుల ప్రేమ సముద్రమంత. సముద్రపు లోతు కొలవడం ఎంత కష్టమో వీరి ప్రేమ లోతు తెలుసుకోవడం అంతే కష్టం. సముద్రం తన గాంభీర్యాన్ని, స్థిరత్వాన్ని కోల్పోతే అల్లకల్లోలమై పిల్లల కాపురంలో సునామీ పుడుతుంది. భర్త జీవితానికి పరిపూర్ణత చేకూర్చే భార్య పాత్రను అతడి తలిదండ్రులు పూరించలేరు.
ఇక భార్యాభర్తల మధ్య ప్రేమ విశ్వమంత విశాలమైనది. విశ్వంలో భగభగ మండే సూర్యుడు, చల్లటి వెన్నెలనిచ్చే చంద్రుడు, అగ్ని పర్వతాలు, మంచు కొండలు అన్నీ ఉంటాయి. సుఖ సంతోషాలను, మంచి చెడ్డలను అనుభవిస్తూ పంచుకుంటూ సాగేది వైవాహిక జీవితం.
రేపటినుండి నేను చెప్పబోయే ప్రవచనల్లో మీకు చెప్పింది ఆవగింజంత భాగమే. నేను చెప్పిన లోపాలు మీలో ఉన్నాయని నేను చెప్పడం లేదు. ఏవైనా వుంటే వాటిని సవరించుకోండి. ఒక్క విషయం చెప్పండి. ఎవరి పిల్లల్ని వాళ్ళింటికి తెచ్చేసుకోవాలనుకుంటున్నారా లేక వాళ్ళను కలిపి ఉంచాలనుకుంటున్నారా ?
వాళ్ళు కలిసి ఉండాలంటే ప్రతి విషయం తెలుసుకుంటూ ప్రతి విషయంలో మీ సలహాలు పాటించాలని కోరుకోవడం మానండి. మీరెలాగయితే భార్యాపిల్లలతో మీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకున్నారో వాళ్ళని కూడా ఒక కుటుంబంగా ఎదగనివ్వండి. అంతేగానీ మీ కుటుంబమనే చెట్టులో ఒక చిన్న కొమ్మగా ఉంచాలనుకోకండి"
చెప్పడం ముగించారు రాధాకృష్ణ మూర్తి గారు.
"పిల్లల మీద ఉన్న అభిమానంతో కాస్త అతిగా ప్రవర్తించాము. తప్పు తెలిసింది. సరి దిద్దుకుంటాం" అన్నారు మోహనరావు, గురుమూర్తి.
"శుభమస్తు" అంటూ దీవించారు రాధాకృష్ణమూర్తి గారు.
వాళ్ళు వెళ్ళాక గురువుగారిని సమీపించి "ఇప్పుడైనా ఒప్పుకోండి మీరు మనసులు చదవగలరని" అన్నాడు రామచంద్ర.
"అదేమీ లేదు రామచంద్రం గారూ! కొత్తగా పెళ్ళైన దంపతుల్లో కలహాలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒక పదిశాతం నూతన దంపతుల్లో ఎవరో ఒకరికి ఇతరత్రా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. మరో పదిశాతం కలహాలకు కారణం వరకట్నం, పెట్టుపోతలు మొదలనవి. ఇతర కారణాలు మరో ఐదు శాతం ఉండవచ్చు. కానీ డెబ్భై ఐదు శాతం కలహాలకు కారణం వారి కుటుంబ సభ్యులే. వీరి పిల్లల విషయంలో వేరే కారణాలు లేవనిపించింది కాబట్టి పెద్దల్లోనే లోపముందని ఊహించాను." చిరునవ్వుతో చెప్పారు రాధాకృష్ణ మూర్తి గారు..
సమాప్తం
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము.
(అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comentarios