top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

ఆఖరి కోరిక




'Akhari Korika' Written By Srinivasarao Jidigunta

రచన : జీడిగుంట శ్రీనివాస రావు

'కంది పచ్చడిలోకి నెయ్యి బాగా వేసుకొని తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాము.

ఇక అందులోకి అనుపానంగా పచ్చి పులుసు కూడా వుంటే ఆ బెత్తెడు దూరం కూడా ఉండదు.' అనేది కృష్ణమూర్తి ఫిలాసఫీ.

కానీ అనుకోకుండా గుండె జబ్బు వచ్చిందతనికి. అప్పట్లో నెయ్యి తింటే గుండెకు మంచిది కాదనే అపప్రధ ఉండేది. దాంతో తనకిష్టమైన కంది పచ్చడి+నెయ్యి+పచ్చి పులుసు కాంబినేషన్ కు దూరం అయ్యాడతను. చివరి రోజుల్లో అయినా అతని కోరిక తీరిందేమో ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన 'ఆఖరి కోరిక' హాస్య కథ చదివితే తెలుస్తుంది.


33 సంవత్సరాలు సర్వీస్ విజవంతం గా పూర్తిచేసుకుని హాయిగా రిటైర్మెంట్ జీవితం గడుపుతున్నాడు కృష్ణమూర్తి. ఒక్కగానొక్క కొడుకు బెంగళూరు లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. తను సర్వీస్ లో వుండగానే, తనతోనే పని చేస్తున్న, తన స్నేహితుడి ఒక్కగానొక్క కూతురు తో కొడుకు పెళ్లి చేసి, హాయిగా వుండండి అని బెంగళూరు పంపించేశాడు.

యిప్పుడు మిగిలింది తను, నేను. మొదటినుండి యింటి బాధ్యతలు తనే చూసుకునేది. పిల్లాడు చదువు దగ్గర నుంచి, వాడికి ఒంట్లో బాగుండకపోతే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళటం వరకు తనే చూసుకునేది. ఎప్పుడు మీరేమి పట్టించుకోవడం లేదని అనలేదు. నా ఉద్యోగం అలాంటింది మరి.

టంచనుగా, 10 గంటలకల్లా నవకాయ పిండి వంటలతో నాకిష్టమైన కందిపప్పు పచ్చడి తో సహా భోజనం పెట్టి నన్ను ఆఫీస్ కి పంపించటం లో తనకి అభినందనలు చెప్పకతప్పదు. అదేమిటో తను ఏ వంట చేసినా మారు వడ్డించుకోకుండా లేచింది లేదు.

రిటైర్మెంట్ ఫంక్షన్ కి వచ్చిన కొడుకుని చూసి, కోడలు ఏదిరా అన్న తండ్రి తో తనకి యిటువంటి ఫంక్షన్స్ నచ్చవు, అదికాక నేను ఆఫీసియల్ పనిమీద వచ్చినట్టుగా వచ్చాను, నా టికెట్ కంపెనీ యిస్తుంది అన్నాడు. అంత నచ్చనిది, వాళ్ళ నాన్న రిటైర్ అయినప్పుడు ఎలా వచ్చింది అంటున్న, తల్లిని వదిలేయమ్మా, నేను వచ్చాను గా అని విసుక్కోవటం గమనించాడు కృష్ణమూర్తి.

ఫంక్షన్ అయినా రెండవ రోజు "నాన్నగారు, నేను బెంగుళూరు వెళ్తున్నాను, తను ఒక్కతే వుంది అంటూ, మీరు, అమ్మా కూడా వీలుచూసుకుని అక్కడకి వచ్చేయండి, యిక్కడ ఇల్లు అద్ధికి యిచ్చి" అని వెళ్ళిపోయాడు.

'ఏమంటావు' అని తనని అడిగితే, 'మనకి ఇంకా వంట్లో ఓపిక వుందిగా, యిప్పుడు అక్కరలేదు తరువాత ఎలాగో తప్పద'ని రూలింగ్ యిచ్చింది.

పాత విషయాలు తలుచుకుంటూ పడుకున్న కృష్ణమూర్తి తన కేక తో ఉలిక్కి పడి, యిదిగో వస్తున్నాను వడ్డించేయి అన్నాడు.

"మన పెళ్లినాడు తప్పా, మళ్ళీ నాతో ఎప్పుడు కూర్చుని కలిసి నువ్వు భోజనం చేయలేదు,, రా నువ్వు కూడా వడ్డించుకో" అన్న భర్తతో, "బలేవారే! మీకు స్వయంగా నేను వడ్డిస్తూ వుంటే వచ్చే ఆనందం, నేను కూడా తినేస్తువుంటే ఎక్కడ వస్తుంది అంటున్న తన మాటలు వినగానే కళ్ళు నీళ్లు తిరిగాయి కృష్ణమూర్తి కి.

అలా హాయిగా గడిచిపోతున్న జీవితం లో ఒక్క కుదుపు, కృష్ణమూర్తి కి సడన్ గా హార్ట్ ఎటాక్ రావటం, పక్కవారి సహాయం తో హాస్పిటల్ లో చేరటం జరిగిపోయింది.

పరిస్థితిని పరిశీలించి, కృష్ణమూర్తికి రెండు స్టంట్ లు వేయటం, పరుగెత్తుకువచ్చిన కొడుకు కు డాక్టర్ గారు, మీ నాన్నగారికి ఇంకోసారి ఎటాక్ వస్తే కష్టం అనటం జరిగింది.

విషయం చూచాయి గా గ్రహించిన తను, భర్త పక్కన కూర్చొని, వద్దు అన్నా వినకుండా, "ఆ కంది పప్పు పచ్చడి, పచ్చిపులుసు దోసెడు నెయ్యి వేసుకుని తిన్నారు, చూడండి.. చివరికి స్టంట్ వేయించుకోవాలిసి వచ్చింది. యిహ, నెయ్యి వేసుకోకూడదు, కావాలంటే నెయ్యి వేసుకోకుండా కంది పచ్చడి తినండి" అంది.

"నెయ్యి లేకుండా కంది పచ్చడి ఏమిటే? యిహ తిననులే" అన్నాడు.

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవగానే,, ఇంటికి తాళం వేసి కొడుకు తో పాటు బెంగళూరు చేరుకున్నారు..

కాలం గడుస్తోవుంది, యిక్కడ కూడా తనే వంట, అయితే వాళ్ళు చెప్పినట్టు గా.

కొద్దిగా ఓపిక వచ్చిన తరువాత, పెళ్ళాం తో "నాకు నోరు చచ్చిపోయింది ఈ నిరుచప్పిడి వంటలతో, ఈ రోజు కొద్దిగా కంది పచ్చడి, వంకాయ పచ్చిపులుసు చేస్తావా, మందులు వేసుకుంటున్నాగా" అన్నాడు కృష్ణమూర్తి.

"ఏమో! మీ కోడలిని అడగాలి ఈ రోజు వంట ఏమిచెయ్యమంటుందో," అంటూ కోడలిదగ్గరకి వెళ్ళి, "మీ మామగారికి కందిపప్పు పచ్చడి అంటే యిష్టం, తినాలని ఉందిట, ఈ రోజు కొద్దిగా కందిపప్పు పచ్చడి, పచ్చిపులుసు చేస్తాను, మీకు చప్పిడిగా వేరే కూర చేస్తాను" అంది.

"అదేంటి అత్తయ్యా! మామయ్య గారికి లేకపోతే, మీరేనా ఆలోచించద్ధా? అంత జబ్బు చేసి బ్రతికి బట్ట కట్టారు, యిక్కడ హాస్పిటల్స్ కూడా దగ్గర లేవు, మామూలు వంట చేయండి చాలు" అంది కోడలు.

ఏమిచేయాలో పాలుపోక, బీరకాయ పోపు, గోంగూర పప్పు చేసి, మొగుడితో, "వెల్లుల్లి లేవు కందిపప్పు పచ్చడి చేయటానికి, అవి లేకపోతే పచ్చడి రుచిగా వుండదు అంటారు మీరే, రేపు తెప్పించి చేస్తాను" అంది. అయితే కోడలు అన్నమాట విన్న కృష్ణమూర్తి, "పరవాలేదు, రేపు చేద్దువుగానిలే" అని, నాలుగు మెతుకులు తిని పడుకున్నాడు.

సాయంత్రం నాలుగు అయినా ఈ పెద్దమనిషి లేవలేదు ఏమిటో ఈ మధ్య నడక కూడా తగ్గించారని అనుకుంటూ భర్త ని లేపటానికి వెళ్ళి కెవ్వు న కేక పెట్టింది. ఏమైంది అంటూ వచ్చి చూస్తే, మామగారు మంచం కింద పడివున్నారు. బట్టలు తడిసి వున్నాయి. కంగారు పడుతూ భర్త కి ఫోన్ చేసి, పక్కన వీధిలో వున్న డాక్టర్ ని పిలుచుకువచ్చింది. డాక్టర్ గారు నాడి చూసి, 'సారీ అండి, he is no more' అని వెళ్ళిపోయాడు.

అప్పటివరకు చేష్టలుడిగి చూస్తున్న, అత్తగారు గొల్లు మనటం, ఇంతలో తండ్రి కి ఎలా వుందో అనుకుంటూ వచ్చిన కొడుకు కి తల్లిని, పడిపోయి వున్న తండ్రి ని చూడగానే బావురు మంటూ తల్లిని పట్టుకున్నాడు.

జరగాలిసిన తతంగం జరిగింది. అతి కష్టం మీద ఏడాది గడిచింది.

యింటి నిండా తన మరుదులు, వాళ్ళ కుటుంబాలతో నిండిపోయింది. ఆ రోజు ఆయనది మొదటి తద్దినం. తడి బట్టలు తో కొడుకు ని చూడగానే కడుపు తరుక్కుపోయింది.

కోడలు వచ్చిన వారికి కావలిసిన ఏర్పాటు చేస్తో బిజీ గా వుంది. ఒక నిట్టురుప్పు విడిస్తో, వంటగది లో కి వెళ్ళింది పెద్దావిడ.

భోక్తలు భోజనం కి కూర్చున్నారు. అప్పటి వరకు అటువైపు కి రాని తల్లి సడన్ గా కార్యక్రమం జరుగుతున్న గది లో కి వచ్చి, తన తండ్రి రూపం లో వచ్చిన భోక్త విస్తరి లోఏదో వడ్డించింది.

విస్తరి లో పడ్డ కందిపప్పు పచ్చడి, పచ్చిపులుసు ని చూసి కంగారు పడుతూ, "తల్లీ ఈ రోజు ఈ పదార్ధాలు నిషేధం" అన్నాడు భోక్త.

"మా వారికి కందిపప్పు పచ్చడి, పచ్చి పులుసు యిష్టం, ఆయన చివరిగా అడిగింది కూడా వీటిని చేయమని, దయచేసి తినండి, ఏదైనా పాపం వస్తే అది నాకు" అంది.

"సంతోషం తల్లి, కడుపునిండా తింటాను" అన్నాడు భోక్త.

విచిత్రం, పిండాలు ఆవురు ఆవురు మని తింటున్న కపిల ఆవుని, గోడ మీద పెట్టి పెట్టగానే కాకి ముద్దని ఎగరేసుకుపోయిన కాకిని చూస్తో వుండిపోయారు తల్లి, కొడుకు, కోడలు.

తినాలనుకున్నప్పుడు తినేయండి. తరువాత రోజులు మనవి కాకపోవచ్చు.

శుభం

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


103 views0 comments

Comentários


bottom of page