
'Akkaraku rani bandhalu' - New Telugu Story Written By Vemuri Radharani
'అక్కరకు రాని బంధాలు' తెలుగు కథ
రచన, కథా పఠనం: వేమూరి రాధారాణి
బంధాలు అంగట్లో సరుకు ఐన కాలం. డబ్బు తప్ప ఏదీ ముఖ్యం కాదు. ఊరి మధ్యలో చిన్న పూరిల్లు. పూరిల్లు అనేకంటే గుడిసె అంటే సరిపోతుంది. దానిలో ఓ 90 ఏళ్ళ ప్రాణం చావు కోసం ఎదురు చూస్తోంది. ముతక చీర, నడుము వంగి కర్ర సాయంతో మెల్లగా బయటకు వచ్చింది హేమ.
“కోడి కూయక ముందే లేచి ఏం చేయాలో, ఎవరిని ఉద్దరిద్దామని? తను పడుకోదు.. ఇంకొకళ్ళని పడుకోనియ్యదు”.. పొద్దున్నే వినపడేటట్లు మాటలు.
కొంతమందికి దేవుడిచ్చిన వరం చెవులు వినపడక పోవడం. పెద్దవయసాయే. ఎవరేమనుకున్నా తనకు వినపడవు. మెల్లగా కర్ర సాయంతో రెండు బకెట్ల నీళ్ళు తెచ్చుకుని కాస్త వండుకుని తిన్నాను అనిపించింది హేమ. ఇంటిలో పలకరించే వాళ్ళు వుండరు. తనే పక్కింటికి వెళ్లి కాసేపు కూర్చుని వస్తుంది. ఇంటికంటే కనీసం అక్కడ మనుషులు కనిపిస్తారని. ఎవ్వరు ఏమిచ్చినా తినదు. ఆత్మభిమానం అడ్డు వస్తుంది.
హేమది మధ్యతరగతి కుటుంభం. ముగ్గురు పిల్లలు. పెద్ద చదువులు ఏమీ లేవు పిల్లలకి. వున్న నాలుగు ఎకరాలలో పండించుకుని ఉన్నంతలో బాగానే బ్రతికారు. హేమ భర్త ఏనాడూ హేమకి ఎదురు చెప్పలేదు. తనకు వున్నది తమ్ముళ్ళకి, అక్కలకి వాళ్ళ పిల్లలకు వడ్డించేది. తనకంటూ దాచుకోకుండా. పిల్లలు పెళ్లి ఈడు వచ్చాక కూతురు విమల ని పక్క ఊరులోనే సూరి కి ఇచ్చి పెళ్లి చేశారు. సూరి కుటుంబం బాగా వున్న కుటుంబమే. పెద్ద వాడికి లక్ష్మి ని ఇచ్చి పెళ్లి చేశారు.
పిల్లల పెళ్లిళ్లు అయినా తన చేతి వాటం తగ్గలేదు. చుట్టాలికి దోచి పెట్టడం. కోడలికి అత్తగారు అలా పెట్టడం ఇష్టం లేదు. గొడవపడి వేరు కాపురం పెట్టింది. అప్పటికీ ఆస్తి పంపకాలు అయ్యాయి. హేమ హేమ భర్తకి ఒక ఎకరం వచ్చింది. ఎంత వున్నా పుట్టింటి మీద ఆశ తీరదుగా! విమలకి ఏం కొరత లేక పోయినా వచ్చినప్పుడల్లా అమ్మ దగ్గర దాచుకున్న డబ్బు తీసుకు వెళ్ళేది.
ఇక మిగిలింది చిన్న వాడు. వాడి పెళ్లి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ మిగలలేదు. ఏదో పేదింటి పిల్లని తెచ్చి పెళ్లి చేశారు. చిన్న కోడలి అమాయకత్వం వల్ల గొడవలు లేవు కానీ అత్తగారు అంతా ఊడ్చి పెడుతుంటే తన పిల్లలకి ఏమీ లేదే అనే బాధ మాత్రం ఉండేది చిన్న కోడలు సుమతికి. ఇంతలో హేమ భర్త కాలం చేశారు. చిన్న కొడుకు వేరు కాపురం పెట్టాడు. తను ఒంటరి అయ్యింది. ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లు తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరూ కంటికి కనిపించడం మానేశారు.
కూతురు విమల కారుల్లో తిరుగుతుంది కానీ అమ్మని ఒక్కనాడూ తన దగ్గరకి రమ్మని అడగలేదు. తనకున్న ఎకరం చిన్న కొడుకుకి కౌలు కి ఇచ్చి నాలుగు బియ్యం గింజలు తీసుకునేది. రెండు గేదల్తో తన ఖర్చులకు సంపాదించుకునేది. వయసు పెరుగుతుంది. కళ్ళు కనపడడం లేదు. ఒక్కతివి వండుకోడం దేనికీ ఏదో ఒక కొడుకు దగ్గర వుండొచ్చుగా అనేవాళ్ళు చూసిన వాళ్లంతా.
చిన్న కొడుకు ఏది చేసినా కలిసి వచ్చేది కాదు. ఇద్దరు పిల్లలు వాళ్ళ చదువులు. పెద్ద కొడుకు పిల్లలు పెళ్లి ఈడు కొచ్చారు. అందుకే ఎవరికి భారం కా దలచుకోలేదు. ఆమె కష్టాన్ని చూడలేక చిన్న కొడుకు తన దగ్గరకు తెచ్చుకున్నాడు.
“అమ్మా! ఆ పొలం ఏదో రాసిస్తే బావుంటుందిగా.. నేను నిన్ను చూసుకుంటాను” అన్నాడు.
తను మాత్రం ఈ వయసులో ఒంటరిగా ఎందుకు అనుకుంది. ఇంకేమి.. రాసిచ్చేసింది. అప్పుడు మొదలయ్యింది అసలు కష్టం.
సూటి పోటీ మాటలు, ‘తిండి పెట్టడమే దండగ నీకు’.. ‘మాకేమిచ్చావ్? వున్నదంతా ఊడ్చి పెట్టావుగా.. వాళ్ళ దగ్గరికి వెళ్లి వుండొచ్చుగా’ అంటూ రోజూ ఈటల్లాంటి మాటలు.
అన్నీ సహించింది. మాటలు వినపడవు గానీ చూపులు, చేతలు మనుషులేంటో చెప్తాయిగా. బాగా వున్న రోజుల్లో లేదు అనకుండా అందరికి పెట్టింది. ఇప్పుడు తనకి ఎవరూ సాయం చేసేవాళ్ళు లేరే అనే బాధ నిలనీ యడం లేదు. చిన్న కొడుకు కొడుకు చేతికి అంది వచ్చాడు. మంచి ఇల్లు కడదామని ముసలమ్మని చావిడిలో గుడిసెలోకి మార్చారు.
ఇల్లు అయిపోయింది. పిల్ల పెళ్లి అయిపోయింది. కానీ గుడిసె లో నుంచి ముసలమ్మ కదలలేదు. రమ్మని పిలిచే వారు లేరు. వున్న ఇంట్లో నీళ్ళు కూడా ముట్టుకోడానికి లేదు. నడుం వంగి నడవలేక నడవలేక దూరం నుండి మోసుకొచ్చుకునేది. చూసే వాళ్లకి జాలి కానీ ఇంట్లో వాళ్లకి జాలి లేకపోయే. జ్వరం వచ్చి మంచం ఎక్కితే పలకరించే దిక్కు లేరు. పక్క వాళ్ళు ఇంత ఇస్తే తినేది. కానీ ఎవరైనా సాయం చేస్తాను అంటే ఒప్పుకునేది కాదు.
అలా కాలం వెళ్ళదీస్తుంది. తనకి వచ్చే గవర్నమెంటు పెన్షన్ తో. అందరూ వున్నా ఎవరూ లేని ఒంటరి తను. అన్నీ పోగుట్టుకున్న దీనురాలు. ఆస్తులతో అనుబంధాలను బేరీ జు వేసే రోజులు. బంధాలకు అర్థం లేకుండా పోయింది. కని పెంచిన అమ్మ పనికి రానిది అయ్యింది. ఇది హేమ కథ.
ఇలాంటి అభాగ్యులు ఎందరో.
***
వేమూరి రాధారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ వేమూరి రాధారాణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
రాధా రాణి. వేమూరి
స్కూల్ ప్రిన్సిపాల్
కవితలు, కథలు వ్రాస్తాను. ఇంతకు ముందు వేరే మాధ్యమాలలో వ్రాసాను.
Comentarios