#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AksharaPrabhodam, #అక్షరప్రబోధం, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 13
Akshara Prabhodam - Somanna Gari Kavithalu Part 13 - New Telugu Poems Written By - Gadwala Somanna Published In manatelugukathalu.com On 02/02/2025
అక్షర ప్రబోధం - సోమన్న గారి కవితలు పార్ట్ 13 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
సాధన చేస్తేనే
ఏదైనా సాధ్యము
ఫలించును ఆశయము
సిద్దించును విజయము
పట్టుదల ఉంటేనే
దక్కుతుంది ఫలితము
జగమెరిగిన సత్యము
చేసుకొనుము అర్ధము
మేలు కాదు వైరము
పీడించే జాడ్యము
ఆదిలోన సమాధి
చేస్తేనే నెమ్మది
భగవంతుని నామము
భక్తులకది దుర్గము
కాపాడే కవచము
పరమ పురికి మార్గము

ఇలవేల్పులు పిల్లలు 2
----------------------------------------
చిన్నారుల హృదయాలు
వికసించిన కుసుమాలు
భగవంతునికిష్టమైన
పవిత్రమైన ఆలయాలు
ముద్దులొలుకు పసి పిల్లలు
ముద్దబంతి హారాలు
స్వచ్ఛమైనవి ప్రేమలు
ఆణిముత్యాలు మనసులు
రాగద్వేషాలుండవు
ఇలవేల్పులు పిల్లలు
వేదికిననూ దొరకవు
ఏకోశాన లోపాలు
కల్మషాలు లేని వారు
సాటి ఎవరు కానరారు
బుద్ధిలో బహు శ్రేష్టులు
ఇంటిలో రారాజులు

మనిషిలోనూ ఉంటే!!
----------------------------------------
కుక్కకున్న విశ్వాసము
మొక్కకున్న కృతజ్ఞత
మనిషి మదిలో ఉంటే
అవుతాడు మహనీయుడు!
చీమకున్న శ్రమతత్వము
దానికున్న పొదుపు గుణము
మనిషిలోను కనిపిస్తే
దేశాభివృద్ధి సాధ్యము
తరువుకున్న త్యాగగుణము
చెరువుకున్న ప్రేమగుణము
మనిషిలోన చిగురిస్తే
ఇల వసుధైక కుటుంబము
సింగంలో గుండెబలము
డేగలోని చురుకుదనము
మనిషిలోనూ ఉదయిస్తే
జీవితాల్లో అద్భుతము

ఘనతకు హేతువు
----------------------------------------
కోకిలమ్మ గానంతో
నెమలమ్మ నాట్యంతో
కొనియాడబడును భువిలో
చిలుకమ్మ పలుకులతో
చీమ ముందుచూపుతో
సింహం గుండెబలంతో
కొనియాడబడును భువిలో
కోడిపుంజు కూతతో
తరువు ప్రాణవాయువుతో
రవి వెలుగు కిరణాలతో
కొనియాడబడును భువిలో
కవి తన ఘన కలంతో
నాన్న తన బాధ్యతతో
అమ్మ జోలపాటతో
కొనియాడబడును భువిలో
మనిషి బుద్ధిబలంతో
గురుదేవులు జ్ఞానంతో
చిన్నారులు చదువుతో
కొనియాడబడుదురు భువిలో
పెద్దలు అనుభవాలతో
గౌరవానికి కారణము
ఘనతకు కొలమానము
ప్రతిభాపాటవాలే !!
అక్షరాల నిజము! నిజము!

పరికింపగ అందము
----------------------------------------
కొలనులోని కలువలు
పుడమిలోని మొక్కలు
పరికింపగ అందము
ముద్దులొలుకు బాలలు
సదనంలో వనితలు
గగనంలో తారలు
పరికింపగ అందము
వదనంలో నగవులు
ఆకుపచ్చ పొలములు
కవి కరమున కలములు
పరికింపగ అందము
తరువులోని ఫలములు
తనువుపైన వలువలు
బ్రతుకులోన విలువలు
పరికింపగ అందము
మనసులోని మమతలు
హృదయంలో ప్రేమలు
ఉదయంలో వెలుగులు
పరికింపగ అందము
పసి పిల్లల ముఖములు

విలువైనది ధ్యానము
---------------------------------------
ప్రతి రోజూ ధ్యానము
చేస్తేనే లాభము
మానసిక ఒత్తిడిని
గెలుచుటకిది మార్గము
మనసులోని అలజడి
చేయునోయి కట్టడి
దుర్గుణాలను దిద్ది
బాగు చేయు నడవడి
విలువైనది ధ్యానము
చేసుకున్న క్షేమము
పెంచును ఆరోగ్యము
పంచును ఆనందము
ధ్యానమే అద్భుతము
మార్చునోయ్! జీవితము
క్రమం తప్పకుండా
చేయాలోయ్! దినదినము

పచ్చదనము అందము
---------------------------------------
ఉంటేనే పచ్చదనము
పుడమిలోన చక్కదనము
లేనిచో భూగోళము
అవుతుంది అగ్నిగుండము
నలుదిశలా పచ్చదనము
నవ్వుకుంటూ చూడాలి
పల్లెసీమ అందాలు
కనువిందే చేయాలి
పుడమి తల్లి పచ్చ చీర
కట్టుకుని మురియాలోయ్!
పచ్చికబయల్లో మనము
కలసిమెలసి నడవాలోయ్!
మొక్కలెన్నో నాటాలి
వృక్షాలను పెంచాలి
పచ్చదనంతో అవని
నందన వనం కావాలి

ఉన్న చాలు-ఉంది మేలు
---------------------------------------
నిజాయితీ రథంలో
మహనీయుల పథంలో
పయనిస్తే బహు క్షేమము
భగవంతుని నీడలో
అనురాగపు వాడలో
ఆనందపు మేడలో
జీవిస్తే కడు మంచిది
ఉజ్జీవపు ఓడలో
సత్పురుషుల చెలిమిలో
ఆత్మీయత కలిమిలో
ఓలలాడితే శుభములు
గురుదేవుల బోధలో
కన్నవారి మాటలో
వారు చూపు బాటలో
నిలకడగా ఉన్న మేలు
దీవెనలు వేనవేలు

అమ్మ ప్రబోధం
---------------------------------------
చెట్టు మేలు మరువరాదు
పరుల గుట్టు విప్పరాదు
వయసులో పెద్దవారిని
చులకనగా చూడరాదు
మకిలి పనులు చేయరాదు
అపనిందలు వేయరాదు
ఇరుగుపొరుగు వారితో
తగవులు పెట్టుకోరాదు
చెడును ప్రోత్సహించరాదు
ఎవరిని దూషించరాదు
భగవంతుని దృష్టిలో
సమానమే సృష్టిలో
పతనాన్ని కోరరాదు
ఎప్పుడు వేధించరాదు
చూపించి హుందాదనము
చాటుకొనుము మంచితనము

తల్లి మేలి సూక్తులు
---------------------------------------
కీడు చేయు కక్షలు
పెనుముప్పు కల్లలు
ఆదిలో వదిలితే
కోకొల్లలు మేలులు
గుండెలోని చింతలు
చెలరేగే మంటలు
అణచిన తొందరగా!
చాలా మేలేగా!
పనికిరాని మాటలు
మనసుల్లో బాకులు
పతనం చేయునోయి!
శ్రేష్టమైన బ్రతుకులు
నీచమైన చేష్టలు
జీవితాన నిప్పులు
అత్యంత ప్రమాదము
తెచ్చిపెట్టు ఖేదము
-గద్వాల సోమన్న
Comments