'Akshara' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 18/05/2024
'అక్షర' తెలుగు కథ
రచన : వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కథలు చెబుతా.. కథలు చెబుతా.. . అన్నావంటే బొక్కలు తీసి కుక్కలకేస్తా.. కహానీలు కూడు పెట్టవు.. కవిత్వం కూడు పెట్టదు. అవన్నీ అదేదో మైకం లో పడేసి మనిషిని పిచ్చివాడిని చేస్తాయి.. ఆదర్శాలు, ఆధ్యాత్మికతల వలయంలో కవుల మనసులను పడేసి రఫ్ ఆడుకుంటాయి.. కవులను నిస్సహాయులను చేస్తాయి. మనసున్న కవికి మరణమే శరణం తప్ప మరేం లేదు. ఇటువంటి విషయాల్లో ఎవరి అనుభవం వారిది. నా అనుభవం ఇది.
నిప్పులాంటి నిజం నిప్పు లాగ చెప్పాలంటే కొంచెం ఆలోచించేవాడికి లెక్కల్లో గానీ సైన్స్ లో గానీ ఒక సూత్రం కనిపెట్టాలంటే చాలా చాలా కాలం పడుతుంది. ఇక ఆ సూత్రం వెలుగు లోకి రావడానికి కొన్ని తరాలే పట్టవచ్చు. అదే కొంచెం ఆలోచించేవారికి కవిత్వం వ్రాయడం క్షణంలో పని. అయితే వారు వ్రాసిన కవిత్వం ఎంతమంది చదువుతారు అన్నది తర్వాత విషయం.
ఒకప్పుడు ఎక్కువ శాతం ఎవరు వ్రాసిన కవిత్వం వారే చదువుకునేవారు. చరవాణులు, వాట్సాప్ లు వంటివి వచ్చాక ఒక కవి వ్రాసిన కవిత్వం మరో నలుగురు చదివి లైక్ లు కొడుతున్నారు.. చదువుతున్నారా? లేదా? అనేది తర్వాత విషయం. లైక్ లు మాత్రం అటు నాలుగు ఇటు నాలుగు. అంతే.. అయితే నలుగురు లైక్ లు కొట్టినంత మాత్రాన కవిత్వం వ్రాసిన వానికి నాలుగు వందల రూపాయలు వస్తాయనుకోవడం మాత్రం అవివేకం.
ఈ సత్యాన్ని గమనించని అక్షర, చేతిలో చరవాణిని పెట్టుకుని కథలంటూ, కవితలంటూ టైమంతా వేస్ట్ చేస్తుంది. దానికి టెంత్ ఆఫియర్ ఎగ్జామ్ లో లెక్కల్లో జీరో వస్తే తెలుగు లో రెండు జీరోలు వచ్చాయి.
అది తెలుగు లో దాని పేరు అక్షర అని వ్రాసుకోవడం చేతకాదు. అక్షర వ్రాయమంటే "అక్కా రా" అని వ్రాస్తుంది. అలాంంటిది టెంత్ పబ్లిక్ లో తెలుగు లో 99 మార్కులు, లెక్కల్లో వంద మార్కులు తెచ్చుకుంది. ఇన్ని మార్కులు ఎలా వచ్చాయంటే, మాస్.. మాస్.. ఊరమాస్.. సూపర్ రిజల్ట్ చూడు. రిజల్ట్ వెనుక గ్రౌండ్ చూడకు అంటుంది.
అలాంటిది ఇంటర్ తప్పాక చరవాణిలో చెడామడా కథలు, కవితలు రాసి పారేస్తుంది. ఈ నడుమ రెండు వేలు ఖర్చుపెట్టి అదేదో సాహిత్య సంస్థ దగ్గరకు వెళ్ళి సన్మానం కూడ చేయించుకొచ్చింది. దాని లెక్క అణా కోడికి ఆరణాల మషాల అన్నట్లు ఉంటుంది.
అక్షర తండ్రి రెండు చేతులతో కాస్త బాగానే సంపాది స్తున్నాడు. ఏదో కొంచెం పైరాబడి ఉన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అతని పేరు చలపతిరావు.
చలపతిరావు కు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి అక్షర. రెండవ అమ్మాయి దీప్తి. అక్షర గజనీ మహ్మద్ దండయాత్ర చేసినట్లు ఇంటర్ లో ఒకటికి నాలుగు సార్లు తప్పి చరవాణిని నమ్ముకుని కవిత్వం వ్రాయసాగింది.
దీప్తి అక్షరకున్నంత అక్షర జ్ఞానం కూడ లేదు కానీ పరులను నమ్ముకుని మెడిసిన్ వరకు వచ్చేసింది.
చలపతిరావు అక్షర కు పెళ్లి సంబంధాలు వెదకటం ముమ్మరం చేసాడు. కానీ ఏ సంబంధం కుదరలేదు. అందుకు ఒక కారణం అక్షర కవిత్వం.
కవిత్వం వ్రాసే మగాడికి పిల్లనివ్వడం, ఆడదాన్ని కోడలుగ తెచ్చుకోవడం కోరి కోరి కొరివిని తెచ్చు కోవడమే అవుతుంది.
ఎందుకంటే కవిత్వం వ్రాసేవారి కొందరి హృదయాలు సున్నితంగా ఉంటాయి. ప్రతి చిన్న దానికి విపరీతంగా స్పందిస్తారు. వారి దృష్టి మనీ మీద కంటే వారు వ్రాసే కవిత్వం మీదనే ఉంటుంది. అలాంటి వారిని బయటవారే కాదు బంధువులు కూడ మోసం చేయడం సులభం.
అయినా ఈ రోజుల్లో మంచి కవిత్వం వ్రాసేవారికి ఏపాటి ఆదాయం వస్తుంది? వారి ఆదాయం వారి సెల్ఫోన్ ఛార్జింగ్ కు కూడా సరిపోదు. ఇక మరి కొందరు సరస సాహిత్యం, యువ సాహిత్యం అంటూ శృతి మించని శృంగారం అంటూ అంగాంగ వర్ణన చేస్తూ వారి మెదడుని ఆడదాని అంగాల దగ్గరే ఉంచుతారు.
అలాంటి వారు వారి వారితో కాపురం చేసేదానికంటే ఎక్కువ వారి కవిత్వం తో కాపురం చేస్తారు. అవసరమైతే కాముని కోసం వావివరుసలు మరిచి పోతారు. అదేమిటంటే పురాణాల్లోని మాధవి కథలు, చిత్రాంగి కథలు చెబుతారు. మన పురాణ కథల ఉదాహరణలు చెడ్డ వారిని సపోర్ట్ చేసినంతగ మంచి వారిని సపోర్ట్ చేయలేకపోతున్నాయి.
దీప్తి లవ్ లో పడింది. కడకు ప్రేమించినవానినే పెళ్ళి చేసుకుని ఓ యింటిది అయ్యింది. ఇంకా అక్షర పెళ్ళి కాలేదు.
ఒకసారి అక్షర దీప్తి ఇంటికి వెళ్ళింది. అప్పుడు దీప్తి, " అక్కా.. నువ్వు మా యింటికి వచ్చెటప్పుడు బాగా మేకప్ అయ్యి రాకు. మా ఆయన కొన్ని విషయాల్లో కొంచెం వీక్.. నీ కథల్లో మనుషులు వేరుగా ఉంటారు. వాస్తవ జీవితంలో మనుషులు వేరుగ ఉంటారు. " అని అంది.
అప్పటినుండి అక్షర దీప్తి ఇంటికి వెళ్ళడం మానేసింది.
కవితలు కథలు కవితలు కథలు అవి వ్రాయడంలో పడి అక్షర తన పెళ్ళి ఆలోచనలను పక్కకు నెట్టేసింది.
దీప్తి ఆస్తుల పంపకం గురించి తండ్రితో మాట్లాడింది. చలపతిరావు ఇద్దరు కూతుళ్ళకు సమానంగ ఆస్తి పంచాడు.
దీప్తి తన భర్త తో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టించింది. వ్యాపారం బాగానే సాగుతుంది. మూడు సంవత్సరాల అనంతరం అక్షర అనారోగ్యంతో, ప్రసవ వేదనతో మరణించింది.
అక్షర తో పాటు అక్షరకు పుట్టిన శిశువు కూడ మరణించింది.
అక్షర మరణానికి ప్రధాన కారణం నేనని చాలా మంది అంటారు. రాస్కేల్స్.. నోరుందికదా అని తెగ వాగేస్తుంటారు.
ఒక సారి 80 ఏళ్ల నా దగ్గరకు దీప్తి భర్త వచ్చాడు. ప్రశాంతంగా ఒంటరిగా బతుకుతున్న నన్ను తన బిజినెస్ లో పెట్టుబడి పెట్టమన్నాడు. ఆలోచిస్తానన్నాను. పెళ్ళాం పోయి ఇరవై ఏళ్లు దాటిపోయింది. బిడ్డలంతా విదేశాల్లో సెటిలైపోయారు. లైఫ్ ను రిచ్ గా ఎంజాయ్ చెయ్యడానికి కావల్సిన దానికంటే పదిరెట్లు ఎక్కువ ఉంది. ఇప్పుడు మరలా బిజినెస్ లు ఎందుకు అనుకున్నాను.
అప్పుడే అతగాడు తన వదిన అక్షర ను నాకు పరిచయం చేసాడు. బుక్స్ చదివే అలవాటు ఉన్న నాకు అక్షర కవిత్వం చదవబుద్ధి అయ్యింది. అక్షర ముఖం చూస్తూ బిజినెస్ విషయం లో "సరే" అన్నాను.
అక్షర ప్రతిరోజూ మా యింటికి వచ్చి తన కవిత్వం చదివి వినిపించేది. మహా యిష్టంగా వినేవారికి తన కవిత్వం చదివి వినిపించడమంటే అక్షరకు మహా యిష్టం.
ఒకప్పుడు కవులు పచ్చి శృంగారాన్ని రాజులకు పద్యాలలో చదివి వినిపించి పొలాలు, బంగారు నాణేలు అవి ఇవి ఆ సుకవులు రాజుల దగ్గర నుండి బహుమతులుగ తీసుకునేవారు.
అక్షర తన కథలు చదివి వినిపించేటప్పుడు ఆమె కథలలోని ఆడ పాత్రల అంగాంగ వర్ణనల మూలాల గురించి అక్షర నే అడిగేవాడిని. అలాంటి సమయంలోనే నేను అక్షరను లొంగ తీసుకున్నాను.
ఛీ.. పాడు.. ఇంత వయసు వచ్చింది. నీకు బుద్ది, సిగ్గు లేదా? అని కొందరు నన్ను తిట్టవచ్చు. అలా తిట్టేవారి నోట్లో మట్టికొట్టా.. అసలు ఇలాంటి కథలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయి? నేనేం వంద సంవత్సరాలు నిండిన వాడిని కాదే.. కన్యాశుల్కం లో లుబ్దావధానులుకంటే మహా అయితే నాలుగైదు ఏళ్ళు ఎక్కువ ఉంటాయి. అంతే కదా? అందరికి 80 ఏళ్ళవాడిని అనే చెబుతాను కానీ కొంచెం ఎక్కువ ఏజే ఉందిలే.. అయిన కండపుష్టి కలవాడిని. ఉప్పూకారం ఇబ్బడి ముబ్బడిగా తినేవాడిని.
అయినా ఈ కాలం పిల్లల్లా నేనేం అక్షరకు లైన్ వెయ్యలేదు. పక్కలోకి రాకపోతే యాసిడ్ పోస్తా అనలేదు. నేనేం బ్రహ్మర్షిని, మహర్షిని అని అనలేదు. అయితే తప్పంతా అక్షరది అని అనను. అలాగని నాది తప్పంటే అసలు ఒప్పుకోను. నన్ను చంపుతాను అన్న సరే నాది తప్పుకాదు.
అయితే అక్షర చనిపోయాక మాత్రం ఎవరన్నా కథలు, కవితలు అంటే మాత్రం వారి బొక్కలు ముక్కలు చేసి కుక్కలకు వెయ్యాలనిపిస్తుంది. అనిపించడం వేరు. ఆచరించడం వేరు. అనిపించేదే చెబుతుంది కథ కవిత్వం. ఆచరించేది చెప్పేస్థాయికి ఈ కవిత్వం కథ ఎప్పుడు వస్తుందో?
అన్నట్లు చెప్పడం మరిచాను. దీప్తి భర్త దీప్తికి హ్యాండ్ ఇచ్చాడు. మొత్తం సొమ్మును తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు.
దీప్తి మాత్రం కవిత్వం వ్రాయదు. తన ముందు నిలిచినవారు తనకు తేడా అనిపిస్తే ఆఫ్ రేషన్ పేరుతో తనకేది కట్ చేయాలనిపిస్తే, అది కట్ చేసేస్తుంది.
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments