top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

అక్షయ పాత్ర


'Akshaya Pathra' - New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

'అక్షయ పాత్ర' తెలుగు కథ


"కలియుగంలో కూడా అక్షయ పాత్రలు ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి?" అనేది ప్రశ్న.

ఆప్షన్ ఏ). ఒకటి ఆప్షన్ డి). కోటి పైన.

ఖచ్చితంగా ఆప్షన్ ఏ). ఒకటి అనుకున్నాడు సుబ్బారావు.

ఆప్షన్ డి). కోటి పైన అంది అతని భార్య ఒక ఉద్దేశంతో.

ఆప్షన్ డి). కోటి పైన అన్నాడు అతని స్నేహితుడు మరో ఉద్దేశంతో.

ఎవరు కరెక్టో తెలుసుకోవాలంటే మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన అక్షయ పాత్ర కథ చదవండి..


ఉదయం 9 గంటలు దాటినా బద్ధకంగా పడుకొని ఉన్న భర్త సుబ్బారావును, బలంగా కుదుపుతూ లేపింది అతని భార్య సుందరి.

"అబ్బా.. ఏమిటి సుందరీ! ఆదివారం కూడా ప్రశాంతంగా నిద్ర పోనియ్యవా?" ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచాడు సుబ్బారావు.

సంక్రాంతి పండగ దగ్గర్లోనే ఉంది. ఒక్కదాన్నే కష్టపడి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ఆ అటకొక్కటీ కుర్చీ వేసుకున్నా నాకు అందడం లేదు. కాస్త ఓపిక చేసుకుని అటక మీద ఉన్న సామాన్లు కిందికి దింపేసి, మళ్లీ మీ మానాన మీరు పడుకోండి" అంది సుందరి.

"ఏవిటీ..! కుర్చీ వేసుకున్నా అందదా? ఇంతకీ నీ హైట్ ఎంతోయ్? నాలుగా లేక నాలుగున్నరా?" అంటూ ఫక్కున నవ్వాడు సుబ్బారావు.

విననట్లుగా తల అటు వైపుకు తిప్పుకుంది సుందరి.

తను వినలేదనుకొని ఈ సారి కిసుక్కున నవ్వాడు సుబ్బారావు.

"ఫక్కున నవ్వు, కిసుక్కున నవ్వు అయిపోయాయి. గడ్డం పెంచి భేతాళ మాంత్రికుడిలా ఉన్నారు. ఇక మీ బ్రాండు వికటాట్టహాసం మిగిలింది" అంది సుందరి.

"ఈ గడ్డం ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషనోయ్. అయినా మీ వాళ్ళు పిసినార్లని తెలుసుగాని, ఇలా పొడవు పెరిగే విషయంలో కూడా పిసినారితనం చూపిస్తారని ఇప్పుడే తెలిసింది. నిన్ను మరో అడుగు పొడవు చేసుంటే బాగుండేది." అన్నాడు సుబ్బారావు, విషయాన్ని సుందరి పుట్టింటి వైపు మళ్లిస్తూ.

"మీరు నాకంటే బెత్తెడే ఎక్కువ. నేను మరో అడుగు పెరిగుంటే మీకిచ్చి చేసి ఉండేవారు కాదు'" అంది సుందరి ఉడుక్కుంటూ.

"నిజమే సుందరీ! నా అదృష్టం కొద్దీ దొరికావు నువ్వు" అన్నాడు సుబ్బారావు రాజీ పడుతూ.

"కాదండీ! అది నా అదృష్టమే. సరేగానీ ముందు ఆ అటక మీది సామాన్లు దించండి" అంది సుందరి గోముగా.

"తప్పుతుందా మరి" అంటూ సుబ్బారావు అటక మీది సామాన్లు ఒకటొకటిగా దించాడు.

చివరాఖర్న, ఒక గోతం దించుతూ " ఇందులో మా బామ్మ తాలూకు సామాన్లు ఉన్నాయి. ఆవిడ గుర్తుగా ఉంచుకున్నాను. అన్నీ కడిగించి, ఆరిన తరువాత గోతంలో వేసి ఉంచు. మళ్ళీ అటక మీద పెడతాను " అన్నాడు సుబ్బారావు.

"ఆవిడ, ఫోటోకి దండ వేయించుకొని పదేళ్లు దాటింది. మీ అమ్మగారు, నాన్నగారు ఆవిడ పక్కన చేరి ఏడాదయింది. ఇంకా ఆ పాత వస్తువులు దాచుకొని ఏం చేస్తారు? ఈ పదేళ్లలో ఒక్కసారైనా వాటిని తీసి చూసారా? హాల్ లో షో కేస్ లో పెట్టి రోజూ చూసుకుంటానంటే సరే. లేకుంటే ఏ పాత సామాన్ల వాడికో వేస్తాను" అంది సుందరి.

ఆవిడ చెప్పింది కూడా సబబే అనిపించింది సుబ్బారావుకు.

సర్లే! అలాగే కానీ. అందులో ఒక పెద్ద ఇత్తడి గిన్నె వుంటుంది.

'ఇది అక్షయ పాత్ర. ఇందులో వండితే ఎంత మంది వచ్చినా సరిపోతుంది' అనేది మా బామ్మ. అదొక్కటీ ఉంచు. దానికి ఆ పవర్ లేకపోయినా సరే. అది ఇంట్లో ఉన్నందువల్లనే ఏమో ఏ రోజూ ఈ ఇంట్లో తిండికి ఇబ్బంది రాలేదు" అన్నాడు సుబ్బారావు.

"అది కాస్త పెద్ద గిన్నె కావడంతో ఆలా అని ఉంటుంది. అంతేగానీ అది నిజంగా అక్షయ పాత్ర అయితే ఈ పెంకుటిల్లు కాకుండా మీకు ఒక బంగాళా మిగిలించేది. సర్లెండి, మీ మాట ఎందుకు కాదనాలి? అదొక్కటీ ఉంచుతాను లెండి " అంది సుందరి.

బ్రష్ చేసుకొని వచ్చి, హాల్ లో ఉన్న ఈజీ చైర్ లో కూర్చున్నాడు సుబ్బారావు.

న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉండగా ఒక పెద్ద ఇత్తడి గిన్నెను తీసుకొని వచ్చింది సుందరి.

"ఇదుగోండి, మీరు చెప్పిన అక్షయ పాత్ర. తనివితీరా చూసుకోండి. మీ పేపర్ చదవడం పూర్తి అయ్యాక మళ్ళీ అటకెక్కించండి" అంటూ అతని ఒళ్ళో పెట్టింది.

ఆ గిన్నెను తనివి తీరా తడిమాడు సుబ్బారావు. బామ్మ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అతనికి. చిన్నప్పుడు అమ్మ పక్కనే పడుకుంటానని తను మారాం చేస్తుంటే బామ్మ తన పక్కన పడుకోబెట్టుకొని , చక్కటి కథలు చెప్పేది. భారతం, రామాయణం, భాగవతం తో పాటు పంచతంత్రం, మర్యాదరామన్న కథలు కూడా చెప్పేది. బామ్మ చెప్పిన నీతి కథలు తన వ్యకిత్వం ఎదగడానికి ఎంతో సహాయపడ్డాయి. తను అడిగినప్పుడల్లా తనకిష్టమైన కంది వడలు, చక్కిలాలు చేసి పెట్టేది. పదేళ్లకు ముందు దూరమైన బామ్మను ఆ ఇత్తడి గిన్నెలో చూసుకుంటూ దాన్ని ఆప్యాయంగా నిమిరాడు సుబ్బారావు.

" ఫ్లాష్ బ్యాక్ ఐందట్రా సుబ్బుడూ" అన్న మాటలు ఆ గిన్నె లోనుండి వినబడ్డాయి.

ఉలిక్కిపడి చుట్టూ చూసాడు.

చుట్టుపక్కల ఎవరూ లేరు.

'అంటే....అంటే ఆ అక్షయ పాత్రే ఆ మాటలు మాట్లాడిందా?'

అతని రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

"నువ్వు... నువ్వేనా మాట్లాడుతోంది? మా బామ్మ లాగే సుబ్బుడూ అని పిలిచావా! నాకు మా బామ్మ పిలిచినట్లే ఉంది" అన్నాడు ఆనందంగా.

" అవునురా మనవడా. పాతకాలం గిన్నెను కదా. నేను నీకు బామ్మలాంటి దాన్నే" అందా ఇత్తడి పాత్ర....సారీ...అక్షయ పాత్ర.

"మరి నేను అడిగినవన్నీ ఇస్తావా?" అన్నాడు సుబ్బారావు.

"చెప్పరా మనవడా. ఏం కావాలి? జంతికలా లేక చక్కిలాలా? కంది వడలు ఓ రెండు వాయలు వేయమంటావా?" అంది అక్షయ పాత్ర.

" నేనంత అమాయకుడిని కాదులే. అక్షయ పాత్ర కథ కూడా చెప్పింది మా బామ్మ. కోరింది ఏదైనా ఇస్తావటగా" అన్నాడు సుబ్బారావు.

"తెలివైన వాడివే. అన్నీ బామ్మ పోలికలు వచ్చాయి. సరే అడుగు" అంది అక్షయ పాత్ర.

"ఎన్నైనా అడగ వచ్చా?" ఆశగా అడిగాడు సుబ్బారావు.

"లేదు. ఒక్క కోరికే అడగాలి" అంది అక్షయ పాత్ర.

"అదేమిటి? కనీసం మూడు కోరికలు తీర్చాలి కదా” ధర్మ సందేహం వెలిబుచ్చాడు సుబ్బారావు.

"అది త్రేతా యుగంలో. ద్వాపర యుగం వచ్చేసరికి రెండు కోరికలు, కలియుగం వచ్చేసరికి ఒకటే కోరిక" అంది అక్షయ పాత్ర.

కాస్త ఆలోచించాడు సుబ్బారావు. తరువాత "సరే. ఒకే కోరిక కోరుకుంటాను" అన్నాడు.

"సాధ్యమయ్యే కోరికే అడగాలి" అంది అక్షయ పాత్ర.

"ఈ ఫిటింగేమిటి మళ్లీ?" అన్నాడు సుబ్బారావు.

"నీ అతి తెలివి తేటలు నాకు తెలుసు కాబట్టి ఈ ఫిటింగ్ పెట్టాను.. ముందు కోరిక అడిగి చూడు. నీకే తెలుస్తుంది." అంది అక్షయ పాత్ర.

"నువ్వు కనిపెట్టేసావుగా. అయినా అడుగుతాను. నీలాంటి అక్షయ పాత్రలే మరో వెయ్యి కావాలి"

అన్నాడు సుబ్బారావు.

"మా నాయనే! ఎంత ఆశో! అంతా మీ బామ్మ పోలికే" అంది అక్షయ పాత్ర.

"అంటే ఈ కోరిక సాధ్యమయ్యేది కదా?" అన్నాడు సుబ్బారావు.

"సృష్టిలో ఏ జీవి అయినా తనలాంటి జీవిని ఎలా సృష్టిస్తుంది? తనకో తోడు ఉంటేనే కదా. నాలాంటి మరో అక్షయ పాత్రను తెస్తేనే కదా మరిన్ని పాత్రలు పుట్టేది?" అంది అక్షయ పాత్ర నవ్వుతూ.

"ఆలా అయితే వేరే కోరిక కోరుతాను" అన్నాడు సుబ్బారావు.

"నీ ఛాన్స్ అయిపొయింది" అంది అక్షయ పాత్ర.

"ఇది తొండి ఆట. నేను అడిగింది తీర్చలేదు కదా" అని వాపోయాడు సుబ్బారావు.

"నీ ముఖం చూస్తే జాలి వేస్తోంది. అందుకని మరో అవకాశం ఇస్తాను. నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఇస్తే నువ్వు అడిగిన కోరిక తీరుస్తాను" అంది అక్షయ పాత్ర.

"ఇంకో ఫిటింగ్ అన్నమాట. చేసేదేముంది? కానివ్వు" అన్నాడు సుబ్బారావు.

"అయితే ప్రశ్న శ్రద్ధగా విను. మన దేశంలో ఎన్ని అక్షయ పాత్రలు ఉన్నాయి?" అడిగింది అక్షయ పాత్ర.

"ఇదేం ప్రశ్న? దీనికి సమాధానం ఏమని చెప్పాలి?" అయోమయంలో పడ్డాడు సుబ్బారావు.


"నక్షత్రాలెన్నో లెక్క పెట్టి చెప్పమన్నట్లు ఏమిటా బోడి ఫీలింగు? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. పైగా మూడు లైఫ్ లైన్స్ కూడా ఉన్నాయిలే" అంటూ అభయమిచ్చింది అక్షయ పాత్ర.

"హమ్మయ్య. కోవిడ్ పేషేంట్ కి ఆక్సిజన్ సిలిండర్ దొరికినట్లయింది. ముందు ఆప్షన్స్ చెప్పు" అన్నాడు సుబ్బారావు.

"ఏ). ఒకటి బి). రెండు సి ). మూడు డి ). కోటి పైన " ఆప్షన్స్ చెప్పింది అక్షయ పాత్ర.

" ఆప్షన్స్ డి మాత్రం ఖచ్చితంగా కాదు. మొదటి మూడిట్లో ఎంచుకోవాలి" మనసులో ఆలోచించుకుంటూ పైకే అన్నాడు సుబ్బారావు.

"ప్రశ్న ఒకటే అయినా మూడు లైఫ్ లైన్స్ ఇచ్చాను. అన్నీ వాడుకొని సరైన సమాధానం చెప్పు" అంది అక్షయ పాత్ర.


"ముందుగా 50 : 50 వాడుకుంటాను" అన్నాడు సుబ్బారావు.

"ఆప్షన్స్ బి, సి లు మాయం చేశాను" అంది అక్షయ పాత్ర.

"ఇక మిగిలింది ఆప్షన్ ఏ). ఒకటి ఆప్షన్ డి). కోటి పైన. .సందేహం లేకుండా 'ఆప్షన్ ఏ' ని లాక్ చెయ్యి" అన్నాడు సుబ్బారావు.

"తొందరపడకురా సుందరవదనా! ఇంకా రెండు లైఫ్ లైన్స్ ఉన్నాయి" అంది అక్షయ పాత్ర.

"అవునులే. ఫ్రీగా వచ్చే లైఫ్ లైన్స్ వదులుకోవడం ఎందుకు? అయితే ఫోన్ ఏ ఫ్రెండ్ లైఫ్ లైన్ వాడుకుంటాను" అంటూ తన ఫ్రెండ్ నాగరాజుకి ఫోన్ చేసాడు సుబ్బారావు.

నాగరాజు ఒక బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు.

ప్రశ్న శ్రద్ధగా విన్న నాగరాజు " డి ). కోటి పైన అనే ఆప్షన్ లాక్ చెయ్యి" అన్నాడు.

"అదేమిటి? మన దేశంలో అన్ని కోట్ల అక్షయ పాత్రలు ఉన్నాయా?" అని ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.

" ఈ రోజుల్లో బ్యాంకు పాస్ బుక్ లే అక్షయ పాత్రలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాయి. మీరు ఈ రోజు డబ్బులు డ్రా చేస్తే, రేపటికల్లా మరో పథకం తాలూకు డబ్బులు మీ ఖాతాలో జమ అయినట్లు మెసేజ్ వస్తుంది. మరి అలాంటి అకౌంట్స్ కోటి పైన కాదు, పాతిక కోట్ల పైనే ఉంటాయి. అందుకే డి ). కోటి పైన అనే ఆప్షన్ లాక్ చెయ్యి" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాగరాజు.

కానీ ఆ డబ్బులు ఎక్కడినుండి వస్తున్నాయి? ప్రజల దగ్గర వసూలు చేసిందే కదా! వాళ్ళ డబ్బు వాళ్ళకే ఇవ్వడం లో అక్షయ పాత్ర గొప్పదనం ఏముంది?" సందేహం వెలిబుచ్చాడు సుబ్బారావు.

"ఆ ఒక్కటీ అడక్కు. మూడో లైఫ్ లైన్ ఆడియన్స్ పోల్ వాడుకో" సలహా ఇచ్చింది అక్షయ పాత్ర.

"ఆడియన్స్ ఎవరున్నారు?" అడిగాడు సుబ్బారావు.

"మీ ఆవిడనే అడుగు. ఆవిడ ఒక్కతే వందమంది పెట్టు కదా" అంది అక్షయ పాత్ర.

నిజమేననుకుంటూ సుందరిని పిలిచాడు సుబ్బారావు.

" సుందరీ! ఒక ప్రశ్న అడుగుతాను. తింగర సమాధానాలు కాకుండా సరైన సమాధానం చెప్పు." అన్నాడు ముఖం సీరియస్ గా పెట్టి.

"వంకరగా అడిగితే తింగర సమాధానాలే వస్తాయి. సక్రమంగా అడిగి సరైన సమాధానం పొందండి" అంది సుందరి నాటకీయంగా.

"సరే. సరిగ్గానే అడుగుతాను.

మన దేశంలో ఎన్ని అక్షయ పాత్రలు ఉన్నాయి?"

ఆప్షన్ ఏ). ఒకటి ఆప్షన్ డి). కోటి పైన

అని ప్రశ్న అడిగాడు సుబ్బారావు.

"డి). కోటి పైన లాక్ చేయండి" అంది సుందరి.

'అదేమిటి సుందరీ? ఇలాంటి అక్షయ పాత్రలు కోటి పైన ఉన్నాయా?" ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.

"అక్షయ పాత్రలంటే ఇలాంటి ఇత్తడి గిన్నెలు కాదండీ. మీ బామ్మే మీకు అక్షయ పాత్ర" అంది సుందరి.

"బామ్మా?" మరింత ఆశ్చర్య పోయాడు సుబ్బారావు.

"అవునండీ. మీకు చిన్నప్పుడే ఏది మంచో, ఏది చెడో తెలియజెప్పింది. పురాణాలూ,నీతి కథలూ నూరి పోసింది. మీరు మంచి వ్యక్తిగా ఎదగడానికి ఎంతో కష్టపడింది. మన పిల్లలకు మీ అమ్మానాన్నలు మంచి చెడ్డలు చెప్పారు. ఇలా మంచిని నేర్పే బామ్మాతాతలే అక్షయ పాత్రలు. ఇలాంటి వారు ఇప్పటి వరకైతే కోట్లలోనే వున్నారు. ఇప్పుడిప్పుడే మీలాంటి వాళ్ళు తాతగారి స్మృతులు, పుట్టి పెరిగిన వూరు అంటూ ఉన్న ఇంటినే పట్టుకొని ఉన్నారు.

బామ్మాతాతలను తలుచుకోవడం కాదు. బామ్మాతాతలుగా మన బాధ్యతను తీర్చుకోవాలి. కొడుకు, కోడలు ఉద్యోగాలకు వెళుతున్నారు. మాట్లాడే దిక్కు లేక మనవడు రోజంతా మొబైల్ గేమ్స్ ఆడుకుంటూ పిచ్చివాడిలా తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీ బామ్మ మీకు అక్షయ పాత్ర అందించింది. కానీ మనం మన మనవడికి దాన్ని అందించలేదు" అంది సుందరి.

సుందరి చెప్పింది శ్రద్ధగా విన్నాడు సుబ్బారావు.

లాక్ డి). కోటి పైన ...లాక్ డి). కోటి పైన... అంటూ గట్టిగా అరుస్తున్నాడు.

"ఏమిటండీ? ఈ గిన్నెను బొజ్జ పైన పెట్టుకొని కల గంటున్నారా?" సుబ్బారావును కుదుపుతూ అడిగింది సుందరి.

మెలకువ వచ్చింది సుబ్బారావుకి.

"సుందరీ! బాగ్ సర్దు. వెంటనే అబ్బాయి దగ్గరకు వెడదాం" అన్నాడు సుబ్బారావు.

"ఈ అక్షయ పాత్రను కూడా తీసుకొని వెడదామా?" అడిగింది సుందరి.

"వద్దు. మనమే మన మనవడికి అక్షయ పాత్రలుగా మారుదాం " అన్నాడు సుబ్బారావు దృఢ నిశ్చయంతో.

శుభం

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



























272 views0 comments

Comentários


bottom of page