top of page
Writer's pictureB Sathyavani

అలసిన చిరు కెరటం



'Alasina Chiru Keratam' - New Telugu Story Written By B. Sathyavani

Published In manatelugukathalu.com On 18/07/2024

'అలసిన చిరు కెరటం' తెలుగు కథ

రచన: బి. సత్యవాణి


కర్నూలు జిల్లాలో ఒక కుగ్రామం. ఆ గ్రామంలో ప్రసాద్, మంగ దంపతులకు వివేక్ అనే కొడుకు. అతనే మన కథలో ప్రధాన పాత్రధారి. మంగకి కొడుకుని ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చూడాలని ఆశ. పాపం ఆ ఆశతోనే ఆ మహాతల్లి క్యాన్సర్ని సైతం జయిస్తూ చావుకి బ్రతుకుకి మధ్య నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. తండ్రి పచ్చి తాగుబోతు. బాధ్యత అనేది లేని తండ్రి. 


పూర్వకాలంలో వ్యాపారానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు చదువులకు కూడా పెట్టవలసి వస్తుంది. చదువు"కునే" దశ నుండి చదువు"కొనే"దశ వరకు విద్యారంగంలో మార్పు వచ్చింది. ఈ మార్పు పేదవాడికి శాపంగా మారింది. వివేక్ చిన్నతనం నుండే చదువులలో ముందుండేవాడు. ఎన్నో బహుమతులు గెలుచు కునేవాడు. 


ఎంతో మంది ప్రశంసలు పొందేవాడు. అదే ఆ తల్లికి మంచి మందు. అందరూ మన వివేక్ ని "మట్టిలో మాణిక్యం" అనగలిగేరే గాని ఆ మాణిక్యాన్ని వెలికితీయడానికి చేయూత కాదు కదా మాట సాయం కూడా చేయలేకపోయారు. ఇంటర్ నుండి డిగ్రీ వరకు దగ్గరలో ప్రభుత్వ కళాశాల లేనందున మంగ "ధన మూలం ఇదం జగత్" అనే సిద్ధాంతం నడుస్తున్న ఈ కాలంలో "విద్యాధనం సర్వ ధన ప్రధానం" అనే సిద్ధాంతంతో ప్రైవేట్ కళాశాలలో చదివించడం కోసం ఇంటి పట్టాలను సైతం తృణప్రాయంగా వదిలిన త్యాగశీలి. 


దానికి తగ్గట్టుగానే వివేక్ కూడా కష్టపడి చదువుకున్నాడు. డీఎస్సీ నోటిఫికేషన్లు, పోస్టులు గత నాలుగు సంవత్సరాలుగా లేవు. కానీ తల్లి కోరిక, ఉపాధ్యాయ వృత్తి పట్ల మక్కువ, ప్రభుత్వం ఏదో రోజు వదులుతుందని ఆశతో బిఈడి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ ను సాధించాడు కానీ తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకే తనకన్నా మంచిర్యాంకు వచ్చింది ఏంటి ఇదంతా? అని బాధపడ్డాడు. 


అంతా రిజర్వేషన్లు మహిమ అనుకున్నాడు. రేపు ఉద్యోగంలో కూడా ఇలా జరిగితే నా కుటుంబం పరిస్థితి నా పరిస్థితి ఏం కావాలి! అని కొంచెం దిగులు చెందాడు. మళ్ళీ "రాజ్యాంగాన్ని గౌరవించాలి" అనే మాటకి కట్టుబడి పోయాడు. రెండు సంవత్సరాలు కష్టపడి చదువుకున్నాడు. 


తీరా చదువు పూర్తయ్యాక ప్రభుత్వం ఇప్పుడప్పుడే డీఎస్సీ జాబ్స్ వదిలేలా లేదు అయినా కోటి ఆశలతో "విద్యా తురాణం న సుఖం న నిద్ర "అన్నట్లు సుఖాన్ని నిద్రని విడిచిపెట్టి మరి ప్రిపేర్ అవుతున్నాడు కానీ ఏం లాభం? 


ప్రభుత్వమే ఉద్యోగాలు వదలక పోతే చివరికి ఒకపక్క జీవనాధారం లేదు, మరోపక్క తల్లికి ముదురుతున్న జబ్బు, తండ్రిని చూస్తే మరింత బాధ్యత రహితంగా తయారయ్యాడు. ఇలా కాదని కనీసం జీవనాధారం కోసమైనా ప్రైవేట్ పాఠశాలలో చదువు చెబుదామని వెళ్తాడు.


అంతా పూర్తయ్యాక జీతం గురించి అడుగుతాడు. జీతం గురించి విన్నాక జీవితం మొత్తం కళ్ళ ముందు మెదులుతుంది. కనీసం తను చదువుకై ఖర్చుపెట్టిన డబ్బులు 10% కూడా కాదు వాళ్ళు ఇచ్చేది. ఏం చేస్తాడు ? కనీసం పిల్లలకైనా చదువు చెప్తున్నాననే తృప్తితో ఆ ఎనిమిది వేల జీతానికి ఒప్పుకున్నాడు. అదే ప్రైవేట్ పాఠశాలలో ఒక విద్యార్థి చదవడానికి 50 వేల పైనే ఫీజులు తీసుకుంటున్నారు. కానీ వారికి చదువుని అందించే ఉపాధ్యాయులకు మాత్రం కనీసం జీతం కూడా ఇవ్వడానికి వాళ్లకి మనసు వప్పడం లేదు. 


ఎదురు తిరగాలని ఉంది కానీ లాభం లేదు. ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పని చేయడం కంటే కూలీగా పని చేసుకోవడం నయం. కనీసం జీవనోపాధి అయినా లభిస్తుంది.. అని బాధపడుతూ చేసేదేమీ లేక ఉపాధ్యాయ వృత్తి పట్ల మక్కువతో ఒప్పుకుంటాడు. వివేక్ తో పాట చదువుకున్న అతని స్నేహితులు సగం మందికి పైగా కార్మికులుగా మారిపోయారు కేవలం ఉపాధ్యాయ వృత్తిని ధ్యేయంగా భావించిన వారు జీవనం గడవక ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు ఇచ్చె తక్కువ జీతానికి పనిచేయలేక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసి చూసి అలసి ఇలా కాదని జీవనోపాధి కోసం కూలీలుగా కార్మికులుగా జీవనం గడుపుతున్నారు. 


ఎవరూ పట్టించుకునే నాధులు లేరు. పైగా సమాజం వేలెత్తి చూపి మరి వెక్కిరిస్తుంది ‘ఏం చదివి వెలగబెట్టావ్?’ అని. పాపం వాళ్లకేం తెలుసు ! ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వడం లేదని, వదలడం లేదని అంటూ వాళ్ళ స్నేహితులు ఎప్పుడూ మన వివేక్ లాగే బాధపడేవారు. జీవితం భారంగా మారింది. తల్లికి కొడుకును చూసి బెంగ మరింత ఎక్కువైపోయింది. అనుకోకుండా ఒక రోజు మంగకి చాలా సీరియస్ అవుతుంది. హాస్పటల్లో పెడతారు. అక్కడ ఉన్న డాక్టర్లు చెప్తారు "సరైన మందులు తీసుకోకపోవడం వలన మీ అమ్మగారికి క్యాన్సర్ బాగా ముదిరిపోయింది బ్రతకడం కష్టం" అని చెప్తారు. 


వేక్ ఒక్క సారి గా కూలబడిపోతాడు. ఇదంతా నా వల్లే, ఇదంతా నా వల్లే జరిగింది.. అని మదన పడిపోతూ నా చదువు కోసం తన క్యాన్సర్ మందుల్ని వదిలేసింది. తన జీవితాన్నే పణంగా పెట్టి చదివించింది. కానీ నేను నా తల్లి కోరికను తీర్చలేకపోయాను. ఆ ప్రైవేట్ విద్యా రంగం నా తల్లి రక్తాన్ని పీల్చేసింది. ఇప్పుడు దిక్కులేని వాళ్ళం అయిపోయాం అని బాధపడతాడు. ఏదో తెలియని కక్ష, ఎవరి మీద కూడా తెలియని ద్వేషం.. ఇది ఎటువైపు దారి తీస్తుందో కూడా చెప్పలేం. 


చివరికి ఆశ తీరకుండానే అశువులు బాసింది. మన వివేక్ బాధ వర్ణనాతీతమైంది. మన వివేక్  కి జీవితమంతా అంధకారమైనట్టు అనిపించింది అసలు ఏమీ అర్థం కాలేదు. యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు అని తెలుసుకుని ఎడ్యుకేషనల్ ఛానల్ ని మొదలుపెట్టాడు మన సమాజం వినోదాన్ని పనికిరాని విషయాల్ని ఆదరించినంతగా విద్యని ఆదరించదు, కనీసం ప్రోత్సహించదు అనే భావన ఉండే కొలది మరింతగా పెరిగసాగింది. 

ఎవరో పాడిన పాటకు, ముఖ కవళికలు తిప్పి, నాలుగు ఊపులు ఊపితే చాలు! వారి జీవితానికి జీతానికి ఇంక యూట్యూబ్లో తిరిగే ఉండదు. వద్దన్నా ఆదాయం వస్తూనే ఉంటుంది కానీ "విద్యాపరంగా నేను గొంతు తీర్చుకుని చించుకొని చెబుతున్నా, నా గొంతు పోవడం తప్ప ప్రయోజనం లేదు" అని వాపోతాడు. 


ఇరుగుపొరుగు వాళ్లలో సాయం చేసే వాళ్ళు లేరు గాని చాడీలు చెప్పుకునే వాళ్ళు కోకోలలు. రైతు కోటి ఆశలతో తన పంట బంగారు పంట కావాలని వాన చుక్క కోసం ఆకాశంలోకి ఎలా చూస్తాడో అలా నేటి యువత తమ చదువులకి తగ్గ ఫలితం రావాలని ప్రభుత్వ ఉద్యోగాల కోసం అలా ఎదురుచూస్తున్నారు. ఎలా అంటే చకోర పక్షి వాన కోసం ఎలా ఎదురు చూస్తుందో అలా ఆశగా ఎదురుచూస్తున్నారు.


 కోటి ఆశలతో చదువు పూర్తి చేసుకుని ఏదో సాధించేయాలని ఉత్సాహంతో ఉధృతంగా ప్రవహించిన నది లాగా సముద్రంలోకి చేరి, చేసేది ఏమీ లేక "అలసిన చిరు కెరటాల" వలె ఎందరో పేద మధ్యతరగతికి చెందిన యువత మారుతున్నారు. కానీ ఏదో ఒక రోజు "వివేకానందుడు" చెప్పినట్లు "ఉవ్వెత్తున పైకి లేచే కెరటంలాగా మారి ఉన్నత శిఖరాలని అధిరోహించాలి" అనే ఆశల పునాది మీద సౌధ నిర్మాణానికై ఎదురుచూస్తున్నారు. 


ఇలాంటి వివేకులు మన సమాజంలో ఎంతో మంది ఉన్నారు నిరుద్యోగం అనేది ఒక వ్యక్తిని కాదు ఒక రాష్ట్రాన్ని కాదు మొత్తం దేశాన్ని పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య ఈ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి. కేవలం చదువునే కాక వృత్తి విద్యను కూడా నేర్పించాలి ఇతర రంగాల గురించి కూడా తెలియజేసి ప్రోత్సహించాలి. వారి నైపుణ్యాలకు గుర్తించి గుర్తించి మరింత శిక్షణ ఇవ్వాలి. ఎలా అయినా బ్రతకాగలిగేలాగా విద్యార్థికి నైపుణ్య శిక్షణను దేనిని అయినా ఎదుర్కొనే లాగా విద్యను అందించాలి. చదువుకు తగ్గ జీవన ఉపాధి కల్పించాలి. ప్రభుత్వమే ఈ నిరుద్యోగానికి చరమగీతం పాడాలి మన కథకు సుఖవంతమైన శుభవంతమైన ముగింపు ప్రభుత్వమే ఇవ్వాలి అంటూ ఒక ఉత్తమ పాత్రికేయుడు వివేక్ జీవితాన్నే ఒక కథలాగా మలచి పత్రికలో ప్రచురించాడు. 


దీనివల్ల పత్రికకు మంచి పేరు వచ్చింది. పాత్రికేయుడికి మంచి పేరు వచ్చింది జీవనోపాధి లభించింది. కానీ వివేక్ అలాగే ఉండిపోయాడు. నిరుద్యోగం సమస్య కూడా అలాగే ఉండిపోయింది. 

***

బి. సత్యవాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: బి. సత్యవాణి

హాబీస్ చదవడం, కథలు నవలలు రాయడం, కార్టూన్స్ గీయడం.


33 views0 comments

Commentaires


bottom of page