top of page

ఆలస్యం

#DVDPrasad, #డివిడిప్రసాద్, #ఆలస్యం, #Alasyam, #కొసమెరుపు, #TeluguKathalu, #తెలుగుకథలు


Alasyam - New Telugu Story Written By - D V D Prasad

Published In manatelugukathalu.com On 12/04/2025

ఆలస్యం - తెలుగు కథ

రచన: డి వి డి ప్రసాద్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



భాగ్యలక్ష్మి తనకి కళ్ళు తిరుగుతున్నాయంటూ చెప్పేసరికి కంగారు పడ్డాడు బాలరాజు. ఇంతకు ముందు పట్టించు కోలేదు కానీ, ఇప్పుడు తన స్నేహితుడు శంకర్రావు భార్య గురించి తెలిసిన తర్వాత మాత్రం ఆందోళన కలిగింది బాలరాజుకి. శంకర్రావు కూడా తనలాగే అశ్రద్ధ చేసాడు కొన్నాళ్ళు. ఓ రోజు డాక్టర్ వద్దకు వెళ్ళి టెస్టులన్నీ చేసిన తర్వాత, ఆమెకు మెదడులో కంతి ఉందని, అది క్యాన్సర్ గా కూడా మారే ప్రమాదం ఉందని చెప్పాడు డాక్టర్. 


ఆలస్యం చేస్తే ఆమె ప్రాణానికి ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేనని డాక్టర్ తేల్చి చెప్పాడు. లక్షలు ఖర్చుపెట్టి, ఆమెకి ఆపరేషన్ చేయించిన తర్వాత గానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. 


ఆ విషయం గుర్తుకువచ్చి బెంబేలెత్తిపోయాడు బాలరాజు. స్వతహాగా భయస్థుడే కాక, బద్ధకం కూడా జాస్తి బాలరాజుకి. భార్యంటే అంతులేని ప్రేమ ఉంది. ఆమెకే కష్టం వచ్చినా తల్లడిల్లిపోతూ ఉండేవాడు. అందుకే ఇంతవరకూ అశ్రద్ధ చేసినందుకు తనను తాను నిందించుకొని, నగరంలో గల ప్రముఖ వైద్యుల వివరాలు సేకరించి, ఆ రోజు సాయంకాలం ఆరున్నరకి డాక్టర్ ఆనందరావు అపాయింట్మెంట్ తీసుకున్నాడు.


ఆఫీసుకెళ్ళిన బాలరాజు మనసంతా ఇంటిమీద, భాగ్యలక్ష్మి మీదే ఉంది. అయిదు గంటలకల్లా పని తెమల్చుకొని, ఇంటిదారి పట్టాడు. ట్రాఫిక్ రద్దీ మూలాన, ఇంటికి చేరేసరికి ఆరుగంటలు దాటింది. ముందే ఫోన్ చేసి ఉండటం మూలాన భాగ్యలక్ష్మి కూడా తయారుగానే ఉంది. ఇంటికెళ్ళి, ఆదరాబాదరాగా కాఫీ తాగి, క్యాబ్ బుక్ చేసాడు బాలరాజు. 


పదినిమిషాల్లో క్యాబ్ ఎక్కారిద్దరూ. డాక్టర్ ఆనందరావు క్లినిక్ చాలా దూరంగా ఉండటం మూలాన, ట్రాఫిక్ రద్దీవలన అక్కడికి చేరేసరికి ఎనిమిది గంటలు దాటింది. 


వాళ్ళిద్దరు వెళ్ళేసరికి క్లినిక్ లో ఎక్కువమంది లేరు. రిసెప్షన్ లో ఉన్న అమ్మాయికి చెప్తే, డాక్టర్ తో మాట్లాడి లోపలికి పంపిందామె.


బాలరాజు, భాగ్యలక్ష్మి చెప్పిందంతా విన్న డాక్టర్ ఆనందరావు ఆమెని పరీక్ష చేసి, చీటీలో కొన్ని మందులు రాసాడు. రక్త పరీక్ష, మరికొన్ని పరీక్షలు చేసుకొని రమ్మని మరో చీటీ రాసి చేతికిస్తూ, "ఇంతాలస్యం చేసారేం!" అని అడిగాడు.


బాలరాజూ, భాగ్యలక్ష్మీ ఇద్దరూ డాక్టర్ వైపు భయంభయంగా చూసారు. "మరేం పర్వాలేదంటారా డాక్టర్? నయమవుతుంది కదా!" అని అడిగాడు బాలరాజు ఆదుర్దాగా.


డాక్టర్ నవ్వుతూ, "ముందు రాసిన టెస్టులన్నీ చెయ్యండి. ఈలోగా మందులు వాడండి, చూద్దాం!" అన్నాడు.


ఆ క్లినిక్ పక్కనే ఉన్న మెడికల్ షాపు నుండి మందులు కొనుక్కొని ఇంటికి తిరిగివెళ్ళారు వాళ్ళిద్దరూ. ఏం మాత్రం అభయం ఇవ్వకుండా డాక్టర్, 'చూద్దాం!' అనేసరికి బాలరాజుకి భయం పట్టుకొంది. భాగ్యలక్ష్మి కూడా భయపడింది. 'పైగా ఇంతాలస్యంగా వచ్చారేం!' అనడం భయాన్ని రేకెత్తించింది. కొంపదీసి ఆమెకి క్యాన్సర్ కాదుకదా అన్న బెంగపట్టుకొంది బాలరాజుకి.


మరుసటి రోజు ఆఫీసుకు సెలవు పెట్టి, అన్ని టెస్టులూ చేయించాడు. వాటి రిపోర్టులు వచ్చేసరికి రాత్రి ఎనిమిదిగంటలు దాటింది. ఆ రిపోర్టులన్నీ చేతపట్టుకొని డాక్టర్ ఆనందరావు క్లినిక్కి వెళ్ళాడు బాలరాజు. అతను చేరేసరికి క్లినిక్ లో ఎవరూ పేషంట్లు లేరు, ఖాళీగా ఉంది. అతను అందించిన రిపోర్టులన్నీ ఎగాదిగా చూసాడు ఆనందరావు.


స్కాన్నింగ్ రిపోర్ట్, ఎక్స్ రే చూసాడు. డాక్టర్ రిపోర్టులు చూస్తున్నంతసేపూ అతని మొహం వైపే ఆతృతగా చూస్తున్నాడు బాలరాజు ఏం చెప్తాడోనని. అన్నీ చూసిన తర్వాత, "రెండు నెలలకి మందులు రాస్తున్నాను. ఆ తర్వాత కావలిస్తే మళ్ళీ టెస్టులు చెయ్యాలి." అని మందులు రాసిన చీటీ బాలరాజు చేతికిచ్చి, "అది సరే! ఇంతాలస్యం చేసారేం!" అన్నాడు మళ్ళీ.


డాక్టర్ మాటలకు మళ్ళీ భయం వేసింది బాలరాజుకు. తన భాగ్యలక్ష్మికి నిజంగా కాన్సరే! ఈ మందులకు నయం కాకపోతే? అసలు క్యాన్సర్ నయమవుతుందా? లేకపోతే ఇంతాలస్యంగా వచ్చారెందుకని మాటిమాటికీ డాక్టర్ అంటాడు?


"డాక్టర్ గారూ! మా ఆవిడ ప్రాణానికేం భయంలేదు కదా? బతుకుతుంది కదా? ఆమెకి క్యాన్సర్ లాంటిదేమీ లేదు కదా?" భయంభయంగా అతనికేసి చూస్తూ అడిగాడు బాలరాజు.


బాలరాజు మొహంలో భయం చూసి, "ఛ..ఛ! అలాంటిదేమీ లేదు, ఏం ఎందుకలా అనుకుంటున్నారు? కేవలం నీరసం వల్ల, రక్తంలో ఎర్రకణాలు తగ్గడం వల్లా తల తిరిగింది అంతే! రెండునెలలు మందులు వాడితే తగ్గిపోతుంది." అన్నాడు డాక్టర్ చాలా తేలిగ్గా.


నీళ్ళు నమిలాడు బాలరాజు. "మరి...మరి...ఇంతాలస్యం చేసారెందుకు అని వచ్చినప్పుడల్లా అడిగితేను..." అన్నాడు.


ఒక్క క్షణం బాలరాజు ఏం మాట్లాడుతున్నాడో డాక్టర్ ఆనందరావుకి అర్ధం కాలేదు. అర్ధం అయిన తర్వాత ఫెళ్ళున నవ్వేసాడు. మొహం చిన్నబుచ్చుకున్నాడు బాలరాజు.


"అదీ...అదీ... మీరు వచ్చిన ప్రతీసారీ రాత్రి ఎనిమిది గంటలు దాటుతోంది. నా క్లినిక్ ఎనిమిది గంటలకల్లా కట్టేస్తాను. అందుకే ఎందుకింత ఆలస్యం చేసారు?' అని అడిగాను. అంతే!" అన్నాడు.


అసలు విషయం అర్ధమై అతనివైపే తెల్ల మొహం వేసుకొని నిలబడ్డాడు బాలరాజు.


 ******

దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


Comments


bottom of page