top of page

అలవాటులో పొరపాటు


'Alavatulo Porapatu' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

'అలవాటులో పొరపాటు' తెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


రామయ్య గారు ఒక పెద్ద 'హోల్సేల్ వ్యాపారి'. ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఎంత సంపాదించినా డబ్బు దగ్గరే చాలా పొదుపు చేస్తూ ఉంటారు. ఆయన వ్యాపార వ్యవహారాలు అన్ని విధాల లాభాలు తెచ్చుట వలన, అనతి కాలంలోనే విశాఖపట్నంలో అత్యంత ఐశ్వర్యం కలిగినవాడిగా పేరు పొందారు.


ప్రతిరోజు ఎంతోమంది చిన్న వ్యాపారులు, ఆయన కోసం ఇంటికి వచ్చి, ఆయనతో సంప్రదించి వ్యాపారం మెళుకువలు తెలుసుకొని, ఆయనతోనే వ్యాపారం చేస్తూ, లబ్ధి పొందుతున్నారు. రామయ్య గారు కూడా వ్యాపార విషయాలు చెబుతూ, అతి తెలివిగా తన వ్యాపారంలోనే వాళ్లు వస్తువులు కొనేటట్టు చేసి, సునాయాసంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు. రామయ్య గారు ఎంత పిసినారితనంగా ఉంటారో, వారి కుటుంబీకులకు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైనా ఖర్చు పెట్టాలన్న వార్త వినగానే ఆయన గుండె ఆగినంత పని అవుతుంది, ఆయన దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న నౌకరు' ప్రసాద్ ' అత్యంత నమ్మకంగా ఉంటూ, రామయ్య గారికి ఇంట్లో ప్రతి విషయంలోనూ, సాయం చేస్తూ ఆయన ఇచ్చే 2000 రూపాయల కోసం 10 ఏళ్లుగా పనిచేస్తున్నాడు.

ఎందుకంటే చదువు రాని నాకు ఇంత తిండి పెట్టి, ఆ ఇంట్లో ఒక మూల పడుకోడానికి జాగా ఇచ్చి, చూసుకుంటున్న రామయ్య గారంటే, ఆయనకు అభిమానం ఉన్న, లోలోపల ఆయన పిసినారితనానికి తిట్టుకుంటూనే ఉంటాడు.


"ఒరేయ్ ప్రసాదు, ఇలా రా! కాస్త కొబ్బరి నూనె నా తలకు రాసి మర్దన చెయ్యి, ఈ వ్యాపార ఆలోచనలతో తల పగిలిపోతుంది” అనగానే “అలాగే అయ్యా!” అంటూ చేతినిండా కొబ్బరి నూనె రాసుకొని సగం బట్టతల ఉన్న రామయ్య గారి తల మీద మర్ధనా చేయసాగాడు ప్రసాద్.


“ఒరేయ్ !ఇవాళ ఆదివారం మన షాపులన్నిటికీ సెలవు, అయినా నా సలహాల కోసం, వ్యాపారాల కోసం జనాలు వస్తూనే ఉంటారు ఇంటికి. మనకు వచ్చిన వాళ్ళకి మర్యాద చేయలేదని బాధపడతారు. కనుక ఎవరైనా రాగానే నేను నిన్ను పిలిచి 'ఒరేయ్ ప్రసాదు! వచ్చే అతిధులను వాళ్లకు కాఫీ కావాలా, డ్రింక్ కావాలా? అని అడుగు. వాళ్ళు ‘కాఫీ’ అనగానే ‘సార్! నీలగిరి డికాషన్తో చేసినది కావాలా, అరకు స్ట్రాంగ్ కాఫీ కావాలా, లేక బ్రూక్ బాండ్ తో చేసిన కాఫీ కావాలా ? అని అడుగుతూ వారిని విసిగించు.


ఏదో ఒకటి చెప్పగానే ‘కాఫీ వేడిగా ఉండాలా? పంచదార ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా?’ అంటూ వాళ్ళని పదేపదే అడుగు. విసుగు వచ్చి ‘మాకేం వద్దు బాబు నువ్వు పో!’ అంటారు. అప్పుడు మనకి చాలా ఖర్చు మిగులుతుంది, మర్యాద దక్కుతుంది.వాళ్లు వ్యాపారాలు చేసుకుని వెళ్లిపోతారు.


అలాగే మరి కొంతమంది వచ్చినప్పుడు మనం- ‘సార్ మీరు ఏం తీసుకుంటారు టిఫిన్.. ఇడ్లీ, వడ, ఉప్మా, దోశ’ అనగానే వాళ్ళు ఆశపడి దోస అన్నారనుకో.. ‘ఏ దోశ కావాలి ?ఉల్లి దోశ, కారం దోస, మసాలా దోశ, పేపర్ దోశ’ అన్న ప్రశ్నలతో విసిగించేయి. అలాగే వ్యాపార విషయాలలో జాప్యం చేస్తున్నందుకు మాకేం వద్దు రా బాబు!! నువ్వు వెళ్లు ఇక్కడి నుంచి, అంటూ వాళ్ళు కసిరేస్తారు. అలా చాకచక్యంగా పనిచేస్తూ వచ్చిన వాళ్ళకి మంచినీళ్లు తప్ప మరి ఏమి ఇవ్వకుండా ఖర్చు మిగిల్చావంటే నీకు జీతం పెంచుతాను జాగ్రత్త!!” అంటూ ఆ పిసినారి రామయ్య గారు తన వ్యాపార తెలివితేటలను చివరికి నౌకర్ ప్రసాద్ మీద కూడా ప్రయోగించారు.


“అలాగే అయ్యా! మీరు చెప్పినట్లు చేస్తాను. నా జీతం మాత్రం పెంచండయ్యా!” అంటూ తల మీద కొంచెం గట్టిగా రుద్దాడు.


“ఆపరా వెధవ, నీ బలమంతా చూపిస్తున్నావు కదరా! నాకు తల వాచిపోతుంది” అంటూ పంపించేశాడు వ్యాపారి రామయ్య గారు.


యజమాని అన్నట్లే ఎంతోమంది రామయ్య గారు ఆదివారం ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా! అని రావడం, నౌకరు ప్రసాదు వాళ్లకి మర్యాదకి లోటు లేకుండా, వాళ్ళని అడగడం విసిగించడం అలవాటైపోయింది. ఎంతోమంది వచ్చి శెట్టి గారి వ్యాపార రహస్యాలు తెలుసుకొని ఆయన దగ్గరే వస్తువులు కొంటూ ఒక్క మంచి నీళ్లు తప్ప ఏమీ తీసుకోకుండా వెళ్లిపోయేవారు.


ఆరోజు చివరగా మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు రామయ్య గారి వ్యాపారాలు లో ఏదో ఒకటి కొంటూ, ఎంతో వినయంగా మాట్లాడుతున్న సమయంలో, “అరే! మీరందరూ భోజన సమయానికి వచ్చారు, భోంచేసి వెళ్దురు గాని” అంటూ, “ఒరేయ్ ప్రసాద్! ఇలా వచ్చి వారిని అడుగు ఏం కావాలో?” అని అనగానే వారిని ఉద్దేశించి, “సార్! మీకందరికీ భోజనాలలో ఏం చేయమంటారు” అని అడగగానే, “ఏముంది శెట్టి గారు ఏం తింటే అదే తింటాం!” అనగానే


“లేదు, లేదు సార్, యజమాని ఒక్క ఆవకాయ ముక్కతో పెరుగన్నం మాత్రమే తింటారు, మీరు మీకు ప్రత్యేకంగా చేయాలి? వంకాయ కూర చేయమంటారా? ముద్దపప్పు వండమంటారా, మంచి సాంబారు చేయాలా? కొత్తిమీర పచ్చడి కావాలా, టమాటా పచ్చడి కావాలా, అప్పడాలు, వడియాలు కావాలా? ఏం చేయమంటారు” అని వాళ్ళని విసిగిస్తుండే సరికి, “అయ్యో శెట్టి గారే తిననప్పుడు, మనం ఎందుకు.. లేదు సార్! మేము వెళ్తాము, మాకు భోజనాలు వద్దు, ఈ వ్యాపార అగ్రిమెంట్ల మీద మీ నాన్నగారి సంతకాలు చేస్తే రేపటి నుంచే మేము వ్యాపారం ప్రారంభిస్తాము, అంటూ లేచి నిలబడ్డారు ఆ వచ్చిన వ్యాపారులు.


“అయ్యో అలాగే ఏం చేస్తాం! ఒరేయ్ ప్రసాదు మేడ మీద ఉన్న నాన్నగారిని పిలుచుకొనిరా.. కొన్ని సంతకాలు చేయాలి, పాపం వీళ్లు కూడా ఇంటికి వెళ్లి భోజనం చేయాలి” అని యజమాని రామయ్య గారు అనగానే,

అలవాటులో పొరపాటుగా “అయ్యా! విజయవాడ నాన్నగారిని పిలవాలా? హైదరాబాదు నాన్నగారిని పిలవాలా? చెన్నై నాన్నగారిని పిలవాలా?” అంటూ ఆ ఊపులో అందరి ముందు ఆ నౌకరు ప్రసాద్ అనేసరికి, రామయ్య గారికి గుండె ఆగినంత పని అయి, 'ఓరి వెధవ ఏం మాట్లాడుతున్నావ్ రా?, నీకు మతి పోయిందా! అంటూ గట్టిగా అరిచారు పరువు పోయిన వ్యాపారి రామయ్య గారు.


అక్కడున్న వ్యాపారులందరూ మనసులోనే నవ్వుకుంటూ, ఈయనకి ఇంతే కావాలి నౌకర్ గాడు, ఎవ్వరికి మర్యాదలు చేయలేని శెట్టి గారి పరువు తీసాడు, ఆయన కోపం చూసి వాళ్ళు వెళ్ళిపోతు, సార్ రేపు నాన్నగారి సంతకం పెట్టి పంపించండి అగ్రిమెంట్లను, అంటూ బయటికి వచ్చి కడుపుబ్బ నవ్వుకున్నారు.


నౌకరు ప్రసాదు “అలవాట్లో పొరపాటుగా అనేసాను, సార్ నన్ను క్షమించండి!” అంటూ ప్రాధేయపడినా, తల తిరిగి పోతున్న వ్యాపారి రామయ్య గారు కోపంగా తన గదిలోకి వెళ్లిపోయారు.

నీతి: ( చెరపకురా చెడేవు )అన్న నానుడి రామయ్య గారికి సరిగ్గా సరిపోయింది.

**************

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.




Comments


bottom of page