top of page

అల్లుడా మజాకా!



'Alluda Majaka' - New Telugu Story Written By Uddagiri Tulasi Rajeswari

Published In manatelugukathalu.com On 20/08/2024

'అల్లుడా మజాకా!' తెలుగు కథ

రచన: ఉద్ధగిరి తులసి రాజేశ్వరి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



”ఒసేయ్ బుర్ర తక్కువ దానా నీకేమైనా బుద్ధి ఉండి చచ్చిందటే!” మంచినీళ్ల బిందెతో గుమ్మం లోపలికి అడుగుపెడుతున్న భార్యామణిని ఛడమడ దులిపేస్తున్నాడు రామనాథం ఒకపక్క పూజ చేస్తూనే..

”అబ్బ మొదలెట్టారూ… మీ తిట్ల దండకం.. ఇప్పుడు ఏమైందని!?” కాస్త పెద్ద గొంతుతో ప్రశ్నించింది సుశీలమ్మ నీళ్ల బిందెను దింపుతూ.. 


“ఏమైందా! నువ్వు బిందె తో బయటికి వెళుతుంటే నల్లపిల్లి ఎదురొచ్చింది కదా!... నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా కొంపలు అంటుకుపోతున్నట్లు అలాగే పోయావు ఆ మాత్రం  శకునం చూసుకోవద్దటోయ్” గద్దించాడతడు.. 


“హా ఇప్పటికే మంచినీళ్లు రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయి అది కూడా 10 నిమిషాలకు మించి రావట్లేదు, శకునాలు చూస్తూ కూర్చుంటే ఆ నీళ్లు కాస్త అయిపోతే తూర్పుకు తిరిగి దండం పెట్టాలి” ఏ మాత్రం సంకోచించక బదులిచ్చిందామె.. రామనాథం గొనుక్కుంటూనే పూజ ముగించాడు.


రామనాథానికి చాదస్తం బాగా ఎక్కువ చిన్న చిన్న విషయాలకు కూడా తిధులు ముహూర్తాలు శకునాలు అన్ని చూసే ముందడుగు వేస్తాడు, అతడేయడమే కాదు అందరినీ అదే దారిలో నడిపిస్తాడు.. దానివల్ల ఎన్ని సార్లు క్షవరం అయినా అతగాడు పట్టించుకోడు.. పోయినేడు ఇలాగే పదో తరగతి పబ్లిక్ పరీక్షకి వెళుతున్న కొడుకుపై బల్లి పడిందని అతన్ని ఆపి తలస్నానం చేసి గాని వెళ్ళటానికి వీల్లేదని ఆర్డర్ వేస్తే పాపం ఆ పిల్లాడు మరల తల స్నానం చేసి బస్సు మిస్ చేసుకుని మరో బస్సు ఎక్కి పరీక్ష హాలికి వెళ్లేసరికి బాగా లేట్ అయిందని పరీక్ష కూడా రాయనివ్వలేదు.. అప్పటినుండి క్లాస్ ఫస్ట్ వచ్చే పిల్లాడు కాస్త బల్లి కనిపిస్తే చాలు దాన్ని చంపి తీరుతానంటూ చేతికి అందిన దాన్నల్లా పుచ్చుకొని దానిపై దాడికి దిగుతున్నాడు (తండ్రిని ఏమీ అనలేక).


“ పెదనాన్నగారూ ‘శుతి’ ఏం చేస్తుందండి?” అంటూ వచ్చింది పక్కింటి పరమేశ్వరం గారి అమ్మాయి విశాలాక్షి.. 


మీరు సరిగ్గానే విన్నారు, శుతి  రామనాథం గారి కూతురు. సుశీలమ్మ ప్రసవించిన తిథి బాగాలేదని ఇతగాడు కల్లు తాగిన కోతిలా గంతులు వేస్తుంటే…”తొలిచూరి ఆడపిల్ల పుట్టిన తిథే మంచి తిథి రా బడుద్దాయి.. ‘శుభ తిథి’అని ఊరుకో బెట్టింది మహాతల్లి రామనాథం నాయనమ్మ కాంతమ్మ గారు... 


అలాగే నామకరణం చేసి రెండు పదాలలోని మొదటి అక్షరాలు తీసుకుని ముద్దుగా శుతి అని పిలుచుకుంటున్నారు.. 


పాపం ఆ అమ్మాయి పేరు రాసినప్పుడల్లా ‘పేరు రాయడం కూడా రాదా!’ అని కొందరు, తన పేరు పైకి చెప్పినప్పుడు ‘నత్తి వల్ల సరిగ్గా పేరు చెప్పలేకపోతుందేమో!’ అని కొందరు ఆమెను ఏడిపిస్తూ ఉంటారు.. తండ్రి చాదస్తానికి ఆమె తలబాదుకోని రోజు లేదు. 


‘ఆడపిల్లవు ఒక ఇంటికి వెళ్లి పోతావు కదేంటే, అప్పుడు నీకు ఈ బాధ తప్పిపోతుందిలే’ అని ఊరుకోపెట్టేది తల్లి. ఆరోజు శుతికి పెళ్లిచూపులు అందుకే అలంకరణలో సాయం చేద్దామని వచ్చింది పక్కింటి విశాలాక్షి. 


పెళ్లి కొడుకు పక్క ఊరి కరణం కృష్ణమూర్తి గారి అబ్బాయి ‘అరవింద్’. పేరుకు తగ్గట్టుగానే అరవిందస్వామి లాగా దబ్బపండు రంగులో అందంగా ఉంటాడు.. హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటు కృష్ణమూర్తి గారు కూడా ఎటువంటి చాదస్తం లేని ఈ తరం మనిషి, మంచి కుటుంబం స్థితి మంతులు అని తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్న సుశీలమ్మ పిల్లకు ఎలాగైనా ఆ సంబంధం కుదిర్చితీరాలని గట్టి పట్టుదలతో ఉంది.. అటు శుతి కూడా అతగాడి ఫోటో చూసినప్పటినుంచి అతడి పై మనసు పడేసుకుని కలల లోకంలో విహరిస్తుంది.


 పెళ్లి వారు రానే వచ్చారు.. అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చడంతో సంబంధం ఖాయం చేసేసుకుని నిశ్చయి తాంబూలాలు కూడా పుచ్చేసుకున్నారు. పద్ధతులు ఆచారాలు పెద్దగా లేని కృష్ణమూర్తిని చూస్తే రామనాథానికి అస్సలు నచ్చలేదు కానీ మెజారిటీ ఓట్లు అటుపక్క పడిపోయినప్పుడు అతడికి ఒప్పుకోక తప్పలేదు. పుట్టినప్పటినుంచి తండ్రి చాదస్తంతో విసిగిపోయిన శుతి ఇక తనకు ఆ ఇబ్బందులన్నీ తప్పాయని తెగ సంబరపడిపోతోంది.. ఓ మంచి ముహూర్తంలో శుతి అరవింద్ ల వివాహం ఘనంగా జరిగింది.


“అమ్మా …అమ్మా…” అంటూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది శుతి.. “అయ్యయ్యో శోభనం పెళ్లికూతురు అలా పెద్దగా మాట్లాడుతూ బయటకి వచ్చేయకూడదమ్మా వెళ్లి తల స్నానం చేసి రా” అంటూ కాస్త మందలింపుగా చెప్పింది సుశీలమ్మ. 


“శోభనమా నా బొంద! ఇతగాడు నాన్నగారికి మించిన చాదస్తపు పురుషుడు, నాకన్యాయం జరిగిపోయిందే అమ్మా…నా కొంప కొల్లేరు అయిపోయింది!” అంటూ గగ్గోలు పెట్టింది శుతి. 

“కాస్త వివరంగా చెప్పి చావవే నాకు కంగారు వస్తోంది…”కసిరింది సుశీలమ్మ. 


“అతగాడికి అచ్చం వాళ్ళ తాత గారి పోలికలు వచ్చాయంట.. వర్జాలు దుర్ముహూర్తాలు మూఢనమ్మకాలు చాదస్తాలు ఆచారాలు జాతకాలు వాస్తు… అబ్బో ఒకటి ఏంటి ఒక పెద్ద లిస్టే చెప్పాడు.. ఇప్పుడు వచ్చే జీతం కంటే రెట్టింపు జీతం వచ్చే ఉద్యోగం వచ్చినా ఆ ఆఫీసు బిల్డింగు వాస్తు బాగోలేదని ఆ ఉద్యోగంలో కూడా చేరలేదంట, మరోచోట ఆఫీస్ కోటర్స్, ఇంక్రిమెంట్స్ బోనస్ లు అన్ని ఉండే మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చినా ఆ లేడీ బాస్ కి బొట్టు లేదట, అసలు నేను కాదు నాన్నగారు నచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారట, రాత్రి శోభనం గదిలోకి వచ్చేటప్పుడు ఎవరో తుమ్మారట అందుకు ఈరోజు శోభనం వద్దు మరో మంచి ముహూర్తం చూద్దాం లే అన్నాడమ్మా!” అంటూ వాపోయింది కొత్త పెళ్లికూతురు. 


నోరెళ్ళ పెట్టి వినడం సుశీలమ్మ వంతయితే …తనకి తగ్గ అల్లుడు వచ్చాడని ‘అల్లుడా… మజాకా!’ అనుకుంటూ తెగ మురిసిపోతున్నాడు తలుపు చాటున దాగి వింటున్న రామనాథం గారు.

***

ఉద్ధగిరి తులసి రాజేశ్వరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/uddagiri

తెలుగు కథలు గ్రూప్ కి నమస్తే, 

నా పేరు ఉద్ధగిరి తులసి రాజేశ్వరి, రాజమహేంద్రవరం 

సాహిత్యం పై మక్కువతో కవితలు చిన్న చిన్న ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను, కొన్ని ఆన్లైన్ మ్యాగజైన్స్ లో నా ఆర్టికల్స్ ఇంకా కవితలు ప్రచురించబడ్డాయి కూడా! సాహిత్యం లో అన్ని ప్రక్రియల రుచిని ఆస్వాదించాలని మొదటిసారి తెలుగు కథలు. కామ్ కి 'అల్లుడా మజాకా!' అనే హాస్య కథ ను రాసి పంపించాను...

నూతన రచయిత్రి నైన నన్ను ప్రోత్సహించి సవరణలు ఉంటే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 

ధన్యవాదములు...



127 views1 comment

1 commentaire



@jayakumari7490

• 20 hours ago

కంగ్రాట్స్ రా chinni

J'aime
bottom of page