top of page
Writer's pictureBVD Prasada Rao

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 1

'

'Amavasya Vennela - Episode 1 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శిరిడి సాయిబాబా గుడి ముందుకు రాగానే.. కారు ఆపి.. దిగాడు యువకుడు.. శ్రీరమణ.


చెప్పులు వదిలి.. పక్కకు జరిగి.. గుడి వైపు తిరిగి.. కళ్లు మూసుకున్నాడు.. రెండు చేతులు జోడించాడు. మదిలో సాయిని శరణ కోరాడు.


పిమ్మట టాక్సీ స్టాండ్ వైపు కదిలాడు శ్రీరమణ.. తన కారుతో.

కారును సాఫీగా ముందుకు పోనిస్తున్నాడు.


అతనిలో ఒకటే ఆలోచన.. మళ్లీ మళ్లీ చక్కెర్లు కొడుతుంది.

ఈ రోజు సరైన ట్రిప్పులు రావాలని అతను తెగ ఆశిస్తున్నాడు. అతను వెళ్తున్న రోడ్డు రద్దీగానే ఉంది.

వాహనాలు సర్రు సర్రున పోతున్నాయి.


నడిచే వారు నడుస్తున్నారు. శ్రీరమణ కారు ముందుకు చరచరా జరుగుతోంది.


అంతలోనే..

పక్క సందుల్లోంచి జర్రున రోడ్డు మీదికి వచ్చిన స్కూటీ ఒకటి.. శ్రీరమణ కారుకు టక్కున ఎదురయ్యింది.

అతను జర్కయ్యాడు.

ఐనా.. తన కారుని నియంత్రించాడు..


కానీ..


అప్పటికే.. ఆ స్కూటీ భళ్లున.. ఆ కారుని ఢీ కొట్టేసింది.

ఆ స్కూటీ మీది యువతి.. చంద్రిక.. తుళ్లి.. టఫీన కింద పడింది.


అప్పటికే.. చంద్రిక వెంట పరుగు పరుగున వచ్చి.. ఆ సందు చివరన ఆగిపోయిన నడి వయస్కుడు కామేశం..

కింద పడ్డ చంద్రికకు ఆమడ దూరంకి గబగబా చేరాడు.

చంద్రికలో చలనం లేదు.


అది గుర్తించిన కామేశం మెల్లిగా నవ్వుకున్నాడు.

ఆ వెంబడే.. 'హమ్మయ్య' అనుకున్నాడు. తన గుండె వైపు ఛాతీని తన కుడి అర చేతితో పాముకుంటున్నాడు.


***


"నీకు జాబ్ కావాలంటే.." ఆగాడు కామేశం.

ఆబగా చంద్రికను చూస్తున్నాడు.


చంద్రిక చూపు మార్చుకోలేదు.. "జాబ్ కావాలంటే.." అడగ్గలిగింది.


"నువ్వు నాకు కావాలి." అంటూనే చంద్రిక కుడి అర చేతిని.. తన రెండు అర చేతుల్లోకి తీసుకోబోయాడు కామేశం.


చంద్రిక చటుక్కున రియాక్టయ్యింది. కుర్చీలోంచి లేచింది. దానిని విసురుగా వెనుక్కు తన్నింది. అంతే అదునుగా కామేశం చెంప మీద తన కుడి అర చేతితో చెళ్లున చరిచింది.


కామేశం కంగారయ్యాడు.


"రిటెన్ టెస్ట్ పాసయ్యాను. ఇంటర్వ్యూ అన్నావ్.. బాగుంది. అది కానివ్వక.. ఇదేం పైత్యం. ఇంటర్వ్యూ అంటే ఇదా.. ఇలానా. ఆఁ." కసురుకుంటుంది చంద్రిక.


కామేశం తంటా పడుతున్నాడు.


"నిన్ను.. నీ లాంటి వాడిని రోడ్డున పడేయాలి. నీ సంగతి ఇలా కాదు.. పోలీస్ లను తెచ్చి.." అంటూనే జరజరా బయటికి నడిచేసింది చంద్రిక.


అంతే వేగంతో తన స్కూటీని తీసేసింది. జోరుగా ముందుకు దానిని పోనిస్తుంది. కామేశం గడబిడ అయ్యాడు. తొందరిగా కదిలాడు. చంద్రికను ఆపే ప్రయత్నం కొనసాగిస్తూ.. హడావిడిగా ఆమె వెంట పడ్డాడు.


***

చంద్రిక పడి ఉన్న చోట..

జనం పొగ్గై ఉన్నారు.

శ్రీరమణ హైరానా పడుతున్నాడు.

చంద్రిక స్పృహలో లేదు.


"నూరుకు ఫోన్ కొట్టండి." ఎవరో అంటున్నారు.


"ఒన్ నాట్ ఎయిట్ కు కాల్ చేయడమే మేలు." మరొకరు చెప్పుతున్నారు.


అక్కడ గందరగోళం గందికవుతోంది.

కామేశం మాత్రం చాలా కూల్ గా అక్కడ దానిని చూస్తూ పక్కగా నిలబడ్డాడు.


శ్రీరమణ ఆత్రమవుతున్నాడు.


"ఆలస్యం వద్దు.. నేనే.. నా కారులో.. ఈమెను గవర్నమెంట్ హస్పిటల్ కు తీసుకు పోయి చేరుస్తాను. అందుకు ఎవరైనా సహకరించండి." అంటున్నాడు.


అతడు చంద్రిక చెంతనే ఉన్నాడు.

"రండి.. ఈమెను ఒక వైపు ఎత్తి పట్టండి. నా కారులోకి చేర్చుదాం." తల్లడిల్లుతున్నాడు. చంద్రికను ఎత్తే ప్రయత్నాన్ని చేస్తున్నాడు.


ఎవరో కలగచేసుకున్నారు.

చంద్రికను తన కారు బేక్ సీట్ లోకి చేర్చ గలిగాడు శ్రీరమణ.

తర్వాత.. తనే.. చంద్రిక స్కూటీని ఎత్తి.. రోడ్డు పక్కగా నిలిపాడు. దాని తాళం తన జేబులో వేసుకున్నాడు. అక్కడే కింది పడి ఉన్న చంద్రిక హేండ్ బేగ్ ను తీసుకున్నాడు.

శ్రీరమణ తన కారును స్టార్ట్ చేసాడు. ఎకఎకీన అక్కడ నుండి కదిలాడు.


అక్కడ చేరిన వారు చెల్లాచెదురయ్యారు.

కామేశం నిశ్చింతై వెను తిరిగాడు.


***

"రమణగాడు నీకు ఫోన్ చేసాడా." ఫోన్ కాల్ తో అడిగాడు సుబ్బారావు.


"లేదురా." ఫోన్ కాల్ లో చెప్పాడు గిరి.


"నాకు ఇప్పుడే చేసాడు. యాక్సిడెంట్ ట. నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కు రమ్మన్నాడు." చెప్పాడు సుబ్బారావు.


"అలానా." అనేసాడు గిరి.


"నువ్వూ రారా." కోరాడు సుబ్బారావు.


"నేనా. యాక్సిడెంటా. అయ్యో.. నేను పనిలో ఉన్నాను. నువ్వు వెళ్లు నేను తర్వాత వస్తాలే." చెప్పేసాడు గిరి.


ఆ కాల్ కట్ చేసి.. వెంకట్ కు ఫోన్ చేసాడు సుబ్బారావు.

శ్రీరమణ కబురు చెప్పాడు.


"అరె. ఏమైందో. నువ్వు పద. నేను హాస్పిటల్ కు వస్తాను." చెప్పాడు వెంకట్.


పావు గంట లోపే..

సుబ్బారావు హాస్పిటల్ చేరాడు.


శ్రీరమణను కలిసాడు.

"డాక్టర్లు చూస్తున్నారు. ఏమవుతుందో ఏమో." వర్రీ అవుతున్నాడు శ్రీరమణ.


సుబ్బారావు అడిగాడు. "ఇంతకీ ఏమైంది." అని.


"నా అంతట నేను వచ్చేస్తున్నాను. తన స్కూటీతో సడన్ గా సందు మలుపు తిరిగి.. తనే.. నా కారును గుద్దేసింది." చెప్పాడు శ్రీరమణ.


"అంతే అంటావా." అడిగాడు సుబ్బారావు.


"అంతేరా. ఒట్టు. జరిగింది ఇదే." గాభరా పడుతున్నాడు శ్రీరమణ.


"ఏమైనా పోలీస్ కేస్ వరకు పోతోంది." నసిగాడు సుబ్బారావు.

బెదిరాడు శ్రీరమణ.


"కానీ. ఆమెకు ఏమీ కాకపోతే చాలు." రెండు నిముషాల పిమ్మట అన్నాడు.


తలాడిస్తూనే.. "వెంకట్ గాడు వస్తానన్నాడు." రోడ్డు వైపు చూస్తూ చెప్పాడు సుబ్బారావు.


"ఏమీ కాకపోతే బాగుణ్ణు." లొడుగుతున్నాడు శ్రీరమణ.


రమారమీ పది నిముషాలు తచ్చాడేక.. హాస్పిటల్ ముందు పోలీస్ జీపు ఆగడంతో..

"వీడు ఇంకా రాలేదు. నేను వెళ్లి.. వెంకట్ గాడ్ని తెస్తాను." అంటూనే అక్కడ నుండి వెళ్లిపోయాడు సుబ్బారావు.


శ్రీరమణ కదల్లేకపోయాడు.

ఇద్దరు పోలీసులు అతన్ని దాటుకొని హాస్పిటల్ లోనికి వెళ్తున్నారు.


అప్పుడే ఒక నర్స్ వచ్చి.. శ్రీరమణకు ఒక సంచి అందిస్తూ..


"ఆమె బట్టలు.. ఆమె వాచీ.. ఆమె జాకెట్టులోని సెల్ఫోన్, మూడొందల ఇరవై రూపాయిలు.. సంచిలోనే వేసాం. చూసుకోండి. ఇక్కడ సంతకం చేయండి." అంది.


ఆ నర్స్ చేతిలోని పుస్తకంలో సంతకం చేసి.. ఆమె నుండి ఆ సంచిని అందుకున్నాడు శ్రీరమణ.


కానీ.. 'ఇదేమిటి.. నా కెందుకు..' ల్లాంటివేమీ అడిగే స్థితిలో అతడు ఇంకా లేడు.


***

"మధ్యాహ్నంకి నా వంటయ్యి.. గంట పైనే కావస్తుంది. కానీ ఇంటర్వ్యూకు వెళ్లింది ఇంకా రాకపోవడమేమిటే." ఆరా తీస్తుంది చంద్రిక తల్లి సావిత్రి.


దానికి ఏమీ అనలేదు చంద్రిక చెల్లి ఇంద్రజ. తన పనిలో తాను తెములుతుంది.


"దానితో.. తోడుగా పొమ్మన్నాను. ఛ. ఇంట్లో మగ్గుతావు. కదలవు." విసుక్కుంటూనే..


"కనీసం దానికి ఫోన్ చేయ రాదే." సావిత్రి ఆరాటం కొనసాగిస్తుంది.


"చేయలా." ఫోన్ లో గేమ్ ఆడుతున్న ఇంద్రజ విసుగు చూపుతుంది.


"చేయమనే అంటున్నా." అరిచింది సావిత్రి.


ఇంద్రజ కోపంతోనే చంద్రికకు ఫోన్ చేస్తుంది.


***

ఫోన్ రింగింగ్ కి చలించాడు శ్రీరమణ. అది తన చేతిలోని సంచి లోంచి కావడంతో మరింత జలదరించాడు. గమ్మున సంచిలోని ఫోన్ ను తీసాడు.


ఫోన్ స్క్రీన్ మీద 'ఇంద్ర' అని కనిపిస్తుంది.


'ఎవరై ఉంటారు.' అనుకుంటూనే.. ఆ కాల్ కు కలిసాడు.


"హలో." అన్నాడు బెరుకు బెరుకుగా.


"ఎవరు. చంద్రిక ఏది." ఇంద్రజ అడుగుతుంది విస్మయంతో.


"నేను.. మీ చంద్రిక.. చంద్రిక.." తడబడిపోతున్నాడు శ్రీరమణ.


ఆ వెంబడే.. "మీ చంద్రిక.. కి.. యాక్సిడెంట్ ఐంది." అవస్త అవుతున్నాడు.


"యాక్సిడెంటా.. అక్కకు యాక్సిడెంటా.. ఎక్కడ.. ఎప్పుడు.." ఇంద్రజ కంగారు పడుతుంది.


ఇంద్రజ మాటలు విన్న.. అక్కడే ఉన్న సావిత్రి బెంబేలు పడుతుంది.


"అక్క ఎలా ఉంది. మీరు ఎవరు." గబగబా అడిగేస్తుంది ఇంద్రజ.. తల్లిని పట్టించుకోక.


"హాస్పిటల్ లో చేర్చాం.." చెప్పుతున్నాడు శ్రీరమణ.


"ఏ హాస్పిటల్." టక్కున అడిగింది ఇంద్రజ.


"గవర్నమెంట్ హాస్పిటల్ లో. రండి. నేను ఇక్కడే ఉంటాను." చెప్పాడు శ్రీరమణ.


ఇంద్రజ కాల్ కట్ చేసేసింది.

సంచిలో చంద్రిక ఫోన్ ను పడేసాడు శ్రీరమణ.

పిమ్మట.. తన ఫోన్ తో.. సుబ్బారావుకు ఫోన్ చేస్తున్నాడు శ్రీరమణ.


సుబ్బారావు ఫోన్ ఎత్తడం లేదు.

చిరాకయ్యిపోతున్నాడు శ్రీరమణ.

వెంకట్ కు ఫోన్ చేసాడు.

వెంకట్ కూడా ఎత్తడం లేదు.


అంతలోనే నర్సు వచ్చింది. శ్రీరమణను పిల్చుకొని.. డాక్టర్ వద్దకు అతడ్ని తీసుకు వెళ్లింది.


కాల్ కట్ చేయకనే.. శ్రీరమణ తన ఫోన్ ను జేబులోకి కుక్కేసుకున్నాడు.


"ఆ అమ్మాయికి దెబ్బలు పెద్దగా తగల లేదు. కానీ.. సడన్ షాక్ తో.. స్పృహ తప్పింది. తెలివి తెప్పించుటకు వీలు కాలేదు. రమారమీ కోమా స్థితి అనుకోవచ్చు." డాక్టర్ చెప్పేసాడు.

శ్రీరమణ డంగు అయ్యాడు.


"యాక్సిడెంట్ కనుక పోలీసులకు తెల్పాం. వాళ్లు ఉన్నారు. కలవండి." డాక్టరే చెప్పాడు.


"ఆమె వాళ్లకు తెలిసింది. వాళ్లు వస్తున్నారు." చెప్పగలిగాడు శ్రీరమణ.


డాక్టర్ ఏమీ అనలేదు.

శ్రీరమణ.. తనను తాను అణుచుకుంటున్నాడు. నిలకడను కూడతీసుకుంటున్నాడు.


కదిలి.. హాస్పిటల్ మెయిన్ గేట్ వద్దకు వచ్చాడు. పక్కగా నిల్చున్నాడు.

చాలా సేపు తర్వాత..


హాస్పిటల్ ముందు ఒక ఆటో ఆగింది. అందులోంచి ఇద్దరు ఆడవాళ్లు అస్తవ్యస్తంగా దిగడం చూసాడు శ్రీరమణ.


వాళ్ల దగ్గరకు వెళ్లాడు.

"మీరు.. చంద్రిక వాళ్లా." అడిగాడు.


"అవునవును." అంది ఇంద్రజ.


"నాతో రండి." అంటూ వాళ్లను తీసుకొని హాస్పిటల్ లోకి నడవగలిగాడు శ్రీరమణ.


========================================================================

ఇంకా వుంది..



========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






155 views2 comments

2 Comments


sudershanap44
Aug 02, 2023

ఇప్పటి వరకు కథ బాగున్నది-అభినందనలు

Like
BVD Prasadarao
BVD Prasadarao
Aug 07, 2023
Replying to

ధన్యవాదాలండీ..


Like
bottom of page