top of page
Writer's pictureBVD Prasada Rao

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 10


'Amavasya Vennela - Episode 10 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.

నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ, శ్రీరమణ కారు కింద పడుతుంది. చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.

మధుసూదన్ కుమార్తె సాగరకు డ్రైవింగ్ నేర్పడం ప్రారంభిస్తాడు శ్రీరమణ.

తన టాక్సీ ఎక్కి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న రంగాను మధ్యలోనే దింపేస్తాడు.

సాగర డ్రైవింగ్ బాగా నేర్చుకుంటుంది.

ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 10 చదవండి


ఇంటికి తిరిగి వస్తున్న తోవన..

"గుడ్ బేబీ. యువర్ డ్రయివింగ్ ఈజ్ నైస్." గొప్పయ్యాడు మధుసూదన్.

డ్రయివింగ్ సీటులోని సాగర పొంగుతుంది.

భార్యను చూసాడు మధుసూదన్.

తను హేఫీగా ఉన్నట్టు గుర్తించాడు.

తమ ఇంటి ముందు సాగర కారు ఆపేక..

"రమణ.. రేపు ఒక మారు ఇంటికి రా. మా అమ్మాయికి కారు కొనడానికి మమ్మల్ని మార్కెట్ కు తీసుకు వెళ్దావు." చెప్పాడు మధుసూదన్.

శ్రీరమణ సమ్మతించాడు. "ఎన్నింటికి రావాలి." అడిగాడు.

"పదిన్నర లోపు వచ్చేయి." చెప్పాడు మధుసూదన్.

***

వరండాలో.. పిల్లలకు ట్యూషన్ చెప్పుతుంది ఇంద్రజ.

ఇంటిలో.. చంద్రిక కుర్చీలో కూర్చోపెట్టబడి ఉంది. ఆసరగా పక్కనే సావిత్రి చిన్న కర్ర బల్ల మీద కూర్చుని ఉంది.

ఆ ఇద్దరికి దరిన శ్రీరమణ మంచం అంచున కూర్చొని ఉన్నాడు.

"డాక్టర్ చెప్పినట్టుగా జావ పడుతున్నారుగా." అడిగాడు శ్రీరమణ.. చంద్రికనే చూస్తూ.

"ఆఁ. రమణ.. తను రెండు పూటలు బాగానే తాగుతుంది." చెప్పింది సావిత్రి.

"ఇప్పుడు తనకు మోషన్ అవుతుందిగా." అడిగాడు శ్రీరమణ.

"రోజు కాక పోయినా.. రెండు.. మూడు రోజులకు అవుతుంది." మెల్లిగా చెప్పింది సావిత్రి.

"డాక్టర్ అన్నారుగా.. ఒక్కొక్కటిగా.. మెల్లి మెల్లిగా.. మార్పులు వస్తుంటాయని." చెప్పాడు శ్రీరమణ.

"అలానే కనిపిస్తుంది. కళ్లు తెరిచి.. తనంతట తను కదిలెస్తే అంతకంటే కావలసింది మాకు ఏమీ వద్దు." ఆశ పడుతుంది సావిత్రి.

"అంతా సక్రమం అవుతుందని హాస్పిటల్ వాళ్లు అంటున్నారుగా. పైగా.. షాక్ తో.. ఎలా సడన్ గా తెలివి కోల్పోయిందో.. అలానే.. సడన్ గానే తెములుకుంటుందని కూడా అంటున్నారుగా." అన్నాడు శ్రీరమణ. అప్పుడు అతడి చూపులు చంద్రిక చెంతనే ఉన్నాయి.

సావిత్రి చిన్నగా తలాడిస్తుంది.

నిముషం తర్వాత..

"రమణ.. నువ్వు చాలా మంచోడివయ్యా. నీలా ఆదుకొనే వాళ్లు ఈ రోజుల్లో తక్కువ." అంది శ్రీరమణనే చూస్తూ.

శ్రీరమణ ఇబ్బందయ్యాడు.

"నీ స్థానంలో మరొకరు ఉంటే.. ఇలా మా పరిస్థితి చక్కబడుతుండేది కాదు." చెప్పుతుంది సావిత్రి.

"సరే అమ్మా. ఆ కబురులు వద్దు." అనేసాడు శ్రీరమణ.

ఆ వెంబడే..

"ఎలాగైనా.. ఎవరిదైనా.. కష్టం కష్టమే. తను తేరుకుంటే మీలానే నేను కూడా సంతోష పడతాను. అంతే." చెప్పాడు.

సావిత్రి.. శ్రీరమణనే చూస్తుంది.

ఇంద్రజ ట్యూషన్ చెప్పడం ముగిసింది.

"గంట దాటింది. చంద్రికను మంచం మీద పడుకుండ పెడదామా." లేచాడు శ్రీరమణ.

"మేము ఆ పని చేస్తాం. నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరు. వేళ మించుతుంది." చెప్పింది సావిత్రి సరళంగా.

ఆ పని చేపట్టాడు శ్రీరమణ.

***

డోర్ బెల్ తో తలుపు తీసింది సాగర.

శ్రీరమణని చూస్తూ.. "వుయ్ ఆర్ లుకింగ్ ఫర్ యు. కమ్ ఇన్. అన్ధర్ షార్ట్ మీటింగ్ విత్ యు." నవ్వుతూ లోనికి నడిచింది.

శ్రీరమణ అనుసరించాడు.

ఆ నలుగురు.. ఆ హాలులో సమావేశం అయ్యారు.

"రమణ.. రాత్రి మేము మాట్లా.." మధుసూదన్ చెప్పుతున్నాడు.

"డాడీ.. ఇంగ్లీష్.." అంది సాగర.

మధుసూదన్ మాటలు ఆపి.. "బేబీ.. రమణాస్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. యువర్ స్కిల్ ఈజ్ సూపర్." అన్నాడు.

ఆ వెంబడే..

"ఐ యామ్ సాటిస్ఫైడ్. అండ్ నో నీడ్ టు టెస్ట్ ఎగేన్ అండ్ ఎగేన్. ఓకే బేబీ." చిన్నగా నవ్వేడు.

సాగర సంతృప్తయ్యింది.

"రమణ.. రాత్రి మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఇక్కడ కారు కొని పంపే బదులు.. మేము ఢిల్లీ వెళ్తున్నాం. అక్కడే అమ్మాయికి కారు కొని ఇద్దామనుకున్నాం." చెప్పాడు మధుసూదన్.

"అదే బాగుంటుంది." చెప్పాడు శ్రీరమణ.

"అలానే నీ గురించి బాగా మాట్లాడుకున్నాం." చెప్పాడు మధుసూదన్.

విస్మయమవుతున్నాడు శ్రీరమణ.

"అదే.. నీకు ఒక సెకెండ్స్ లో కారు ఒకటి కొని ఇవ్వాలనుకున్నాం." చెప్పాడు మధుసూదన్.

"నాకా.. ఎందుకు సార్." తడబడుతున్నాడు శ్రీరమణ.

"నువ్వు అమ్మాయికి బాగా సాయ పడ్డావు. నువ్వు ఇబ్బంది పెట్టే వాడివి కాదు.. అడిగే వాడివి కాదు. నీ తీరుకు ధర చెల్లించలేం కానీ.. చిన్న మొత్తం.. నీకు కారు రూపంలో.. ముట్ట చెప్పాలనుకున్నాం." చెప్పాడు మధుసూదన్.

శ్రీరమణ ఏదో అనబోతుండగా..

"డోన్ట్ గెట్ ఇన్ ద వే. లిజన్ టు డాడీ. థట్స్ ఇట్." అనేసింది సాగర.

శ్రీరమణ బిత్తరయ్యాడు.

"నీకు చెప్పి ఉన్నానుగా.. నీకు నేను సాయం చేసి పెడతానని. అదే ఇలా కూడా అనుకో. మేము వారం రోజుల్లో అమ్మాయితో కలిసి ఢిల్లీ వెళ్తున్నాం. ఈ లోగా.. ముఖ్యంగా అమ్మాయి ఉండగా.. ఓ సెకెండ్స్ కారు చూసి పెట్టు.. ఎంచేతంటే.. నువ్వు ఆ తోవన ఉన్నావు కనుక.. నీకు తెలుస్తుంది." చెప్పాడు మధుసూదన్.

లక్ష్మి కూడా భర్తకు వంతు పాడింది.

అలానే.. సాగర కూడా వత్తిడి తెల్పింది.

శ్రీరమణకు ఒప్పుకోక తప్పలేదు.

"మంచిదే చూసుకో. మొత్తంకి పర్వాలేదు. మేము సర్ది పెడతాం." చెప్పాడు మధుసూదన్.

ఆ వెంబడే..

"తిప్పుతున్న అద్దె కారును వదులుకో. నీ పనితనంకి మిగులు ఉండేలా తెములుకో." చెప్పింది లక్ష్మి.

***

రెండు రోజులు తర్వాత..

టాక్సీ స్టాండ్ లో..

అబ్దుల్ తో పాటు.. టీ తాగుతూ.. అక్కడి బల్ల మీది దిన పత్రికను చూసాడు శ్రీరమణ.

దాని మొదటి పేజీలోని ఫోటో అతడిని కంగారు పర్చింది.

ఆ ఫోటో లోని ఇద్దరిలోని.. రంగను పోల్చుకున్నాడు.

"అబ్దుల్ అన్న.. ఇక్కడ ఏం రాసుంది." ఆ పేపరు అందిస్తూ.. ఆ ఫోటో కింది వార్తను అతనికి చూపాడు శ్రీరమణ.

అబ్దుల్ ఆ పత్రికను తీసుకన్నాడు. ఆ వార్తను చదివాడు.

"ఆ మధ్య మత్తు మందు గోల ఐందిగా. అక్కడ తీగకి మన ఊరిలోనే డొంక కదిలిందట. ఈ ఇద్దరే సూత్రధారులట. పోలీసులు ఒడిసిపట్టుకున్నారట." చెప్పాడు అబ్దుల్.

"అలానా." తలాడించాడు శ్రీరమణ. అంతే కానీ.. మరేమీ అనలేదు. కానీ.. అతనిని ఒక విధమైన ఆనందం కుదుట పెడుతుంది.

***

ఆరు రోజుల పిమ్మట..

పార్వతమ్మ చేత.. కారు ముందు కొబ్బరి కాయ కొట్టించాడు శ్రీరమణ.

"ఏంటి నాయనా.. కారు మారిందా. ఇది కొత్తదిగా ఉంది." అడిగింది పార్వతమ్మ.

"అవునమ్మా. చెప్పాగా.. ఒక సార్.. కారు కొని పెడుతున్నారని. ఆయనే ఇది కొని ఇచ్చారు." చెప్పాడు శ్రీరమణ.

"మంచోళ్లు ఇంకా ఉన్నారు. మంచికి మంచి తప్పక అందుతుంది." ముచ్చటవుతుంది పార్వతమ్మ.

శ్రీరమణ ఆనందపడుతున్నాడు.

"రా. నోరు తీపి చేస్తాను." శ్రీరమణ చేయి పట్టుకొని.. ఇంటిలోకి కదులుతుంది పార్వతమ్మ.

***

మరో నాలుగు రోజుల తర్వాత..

రోడ్డు వెంబడి సైకిల్ మీద పోతున్న గిరిని చూసిన శ్రీరమణ..

స్లో చేస్తూ.. అతడి పక్కన కారు ఆపాడు.

ఆ వెంబడే..

"గిరి ఆగు." అన్నాడు.

శ్రీరమణని చూస్తూనే గిరి ఆనందమయ్యాడు.

"చాన్నాళ్లకు." అన్నాడు.

"ఏంటి.. ఈ టైం అప్పుడు ఇటు ఎటు వెళ్తున్నావు." అడిగాడు శ్రీరమణ. అప్పటికి అతడు కారు దిగేసాడు.

సైకిల్ కు స్టాండ్ వేసి.. దానిని ఒక పక్కన నిలిపి.. శ్రీరమణ దరిన నిలిచాడు గిరి.

"నా యజమాని పని చెప్పాడు. అందుకే ఇటు వెళ్తున్నా." నవ్వేడు గిరి.

"ఎలా ఉన్నావు. సుబ్బారావు బాగున్నాడా." అడిగాడు శ్రీరమణ.

"మేము బాగున్నాం. నువ్వు బాగున్నావుగా." గిరి మాట్లాడుతూనే..

"ఏంటి. ఇది మరో కారుగా. ఓనర్ మార్చాడా.. లేదా నువ్వే మరో చోటుకు మారావా." అడిగాడు.. శ్రీరమణ కారును చూస్తూ.

"ఆ కారును.. ఆ ఓనర్ కే వాపసు చేసేసాను." చెప్తూనే..

కొద్దిగా తిరిగి.. తన కారును ఆపేక్షగా చూస్తూ..

"ఇది నా సొంతం." చెప్పాడు.

"అదెట్టా." విస్మయమయ్యాడు గిరి.

"ఒక మహా మనిషి చేయూతతో." చెప్పుతున్నాడు శ్రీరమణ.

అడ్డై..

"ఒక మహా మనిషా. ఎవరబ్బా." ఇంకా విస్మయంలోనే ఉన్నాడు గిరి.

"నిజానికి ఒక కాదు.. ముగ్గురు ఆత్మీయతలతో నేను దీనికి ఓనర్ అయ్యాను." చెప్పాడు శ్రీరమణ.

ఆ వెంబడే.. క్లుప్తంగా జరిగింది చెప్పాడు.

"బాగుంది. భలే అదృష్టవంతుడువు." అనేసాడు గిరి.

చక్కగా నవ్వుకున్నాడు శ్రీరమణ.

"మరేం. గాడీన పడ్డావు. పెళ్లాన్ని కూడా కూడదీసేసుకో." నవ్వేడు గిరి.

"అబ్బే. ఇంకా నిలదొక్కుకోవాలి. ఆ పిమ్మటే పెళ్లాం.. పిల్లల ముచ్చట్లు." నికరంగా చెప్పేసాడు శ్రీరమణ.

"ఏంటో.. నీ వాలకం ఇలా ఉంది. వాడి వాటం మరోటి." నసిగాడు గిరి.

"వాడంటే." టక్కున ప్రశ్నించాడు శ్రీరమణ.

"అదేరా. మన సుబ్బారావు." చెప్పాడు గిరి.

"సుబ్బారావా.. వాడి వాటం ఏంటి." గమ్మున అడిగేసాడు శ్రీరమణ.

========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








111 views0 comments

Comments


bottom of page