top of page
Writer's pictureBVD Prasada Rao

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2


'Amavasya Vennela - Episode 2 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు.

అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది.

గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు.

ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.



ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 2 చదవండి..

లంచ్ వేళ కావడంతో..

టాక్సీ స్టాండ్ పల్చనయ్యింది.

"శ్రీరమణ ఉదయం నుండి కనిపించడం లేదు. మంచి బేరం దొరికినట్టు ఉంది." అన్నాడు డ్రయివర్ కాశిం.


"అట్టానే ఉంది." అన్నాడు.. అది విన్న మరో డ్రయివర్ అబ్దుల్.


"అప్పుడే కలగచేసుకుంటూ.. అరె. అదేం కాదు. శ్రీరమణ బండి యాక్సిడెంట్ అయ్యిందట." చెప్పాడు మరో డ్రయివర్ భీమ.


"అట్టానా. ఎక్కడ. ఎప్పుడు. అతడుకు ఏమీ కాలేదుగా." వాకబు చేపట్టాడు అబ్దుల్.


"వివరాలు అంతగా తెలియవు కానీ. స్పాట్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు అతడు కారుతో పోయినట్టు తెలిసింది. అంతే." చెప్పాడు భీమ.


"అరె. ఏమైందో.. పరిస్థితి ఎలా ఉందో. ఒక మారు పోయి చూస్తే బాగుంటుంది." అన్నాడు అబ్దుల్.


"ఎంతైనా మనోడేగా. వెళ్లి చూడాలి." అన్నాడు కాశిం.


"మొదట మీరు పోయి చూసి రండి." చెప్పాడు భీమ.


అబ్దుల్, కాశిం.. తమ కార్లతో హాస్పిటల్ కు బయలు దేరారు.


***

"నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు. ఆ సమయంలో ఆమె స్కూటీకి నీ కారు అడ్డు రావడం నిజమేగా. అలా కాక పోతే.. ఆమెకు యాక్సిడెంట్ అయ్యేది కాదుగా." అన్నాడు ఒక పోలీస్.


శ్రీరమణ ఏమీ అనలేక పోతున్నాడు.

సావిత్రి ఏడుస్తుంది.


"ఊరుకో అమ్మా. మాట్లాడుతున్నాంగా." చిరాకయ్యాడు రెండో పోలీస్.


"మీ అమ్మాయిని చూసారుగా. దెబ్బలు లేవు. కానీ కోమా ముంచింది. అదిన్నూ వైద్యంతో నయం కావచ్చని డాక్టర్ అంటున్నారుగా." చెప్పాడు మొదటి పోలీస్.


ఇంద్రజ తికమకలో ఉంది.

"మగ దిక్కు లేని వాళ్లం బాబు. అది మాకు అందుకు వచ్చిందనే సరికి.. ఇలా అయ్యింది." బెదిరిపోతుంది సావిత్రి.


అక్కడి వాళ్లు ఎవరూ ఏమీ అనలేక పోతున్నారు.

పోలీసులనే చూస్తున్నాడు శ్రీరమణ.


"మమ్మల్ని చూస్తే ఏమవుతుంది. వాళ్లతోనే మాట్లాడు. వాళ్లను కుదుట పర్చడం ముఖ్యం." చెప్పాడు రెండో పోలీస్.


"ఆమెను నేనే హాస్పిటల్ కి తెచ్చాను. నాకు తెలుసు. బాధ పెట్టడం నాకు ఇష్టం కాదు." మాట్లాడుతున్నాడు శ్రీరమణ.. సావిత్రితో.

అంతా అతణ్ణే చూస్తున్నారు.


"వైద్యంతో ఆమె కోలుకుంటుందనుకుందాం. తను కోలుకొనే వరకు నా సాయం మీకు ఇస్తాను." చెప్పేసాడు శ్రీరమణ.


అంతలోనే అతడి ఫోన్ మోగుతుంది.

జేబులోంచి ఫోన్ తీసుకున్నాడు శ్రీరమణ.

కాల్ కలిపి.. "అబ్దుల్ అన్న" అన్నాడు.


"హాస్పిటల్ కు వచ్చాం. నువ్వు ఎక్కడ బాయ్." అడిగాడు అబ్దుల్.


"వార్డు మూడులో.. పదో గదిలో." చెప్పాడు శ్రీరమణ.


అబ్దుల్ కాల్ కట్ చేసేసాడు.

శ్రీరమణ ఫోన్ ను జేబులో వేసుకున్నాడు.


"ఎవరు." అడిగాడు మొదటి పోలీస్.

"మా టాక్సీ డ్రయివర్." చెప్పాడు శ్రీరమణ.


"యూనియన్ అని.. అది అంటూ ఇది అంటూ అనబోకు. నువ్వు మంచోడ్లా ఉన్నావు. సుబ్బరంగా నువ్వే తేల్చుకో." చెప్పాడు రెండో పోలీస్.

సావిత్రి ఏదో అనబోతుంది..


"అమ్మా జరగరానిది జరిగింది. సాగుడు వద్దు. మంచిగా తేల్చుకోండి." చెప్పాడు మొదటి పోలీస్.

అప్పుడే అబ్దుల్, కాశిమ్ అక్కడికి వచ్చారు.


వాళ్లని చూస్తూనే.. "మీ వాడ్ని మీరు కరాబు పర్చకండి. అతడు బాగానే చెప్పాడు. ఆమె వైద్యంకు సాయం చేస్తానన్నాడు. అది కానీయండి." చెప్పాడు రెండో పోలీసు.


వచ్చిన ఆ ఇద్దరూ.. శ్రీరమణనే చూస్తున్నారు.

"అవునన్నా. జరిగిన దాంతో ఆమె అవస్థకు గురయ్యింది. మనిషిగా సాయ పడా లనుకుంటున్నాను. నాకు చేతనైనంత మేరకు ఆమెకై చేస్తాను. మీ అందరి దగ్గరా ఒప్పుకుంటున్నాను." చెప్పేసాడు శ్రీరమణ.


"బాగుంది. మరి వాళ్లేమంటున్నారు." అడిగాడు అబ్దుల్.. సావిత్రి వంక చూస్తూ.

ఆమె ఇంకా బెక్కుతూనే ఉంది.


"అమ్మా.. డాక్టర్ గారు చెప్పారుగా. ఆమెను ఇక్కడ ఉంచనక్కర లేదట. ఆమెను ఇంటికి తీసుకుపోయి మీ సంరక్షణలో ఉంచుకోండి. ఇతడు వైద్యం చూసుకుంటాడు." చెప్పాడు మొదటి పోలీస్.


"మీకు సమ్మతమైతేనే కానీయండి. లేదంటే.. మా పనిని మేము చేపడతాం." తేల్చేసాడు రెండో పోలీస్.


"ఏమైనా ఆమె బాగు అవ్వాలి. అందుకు సరైనది.. మంచిగా.. వెంటనే.. అందితేనే నయం." చెప్పాడు మొదటి పోలీస్.


అంతా సావిత్రినే చూస్తున్నారు.


***


కామేశం ఇంకా కుదుట పడడం లేదు.

ఉదయం లగాయతు అతడు తచ్చాడుతూనే ఉన్నాడు.


'చంద్రిక ఉందా..'

'తను.. తనను రచ్చ కీడ్చలేదుగా..'


'యాక్సిడెంట్ తర్వాత.. తనలో చలనం లేదు.'

'తను చనిపోయి ఉంటుందనే అంతా అన్నారు..'


'అంతే.. అదే అయ్యి ఉంటుందిగా..'

ఇలా సాగుతున్నాయి కామేశం తర్కాలు..


దాంతో సరిగ్గా లంచ్ కూడా చేయలేకపోయాడు.

ఒక పక్క అతడిని ఆకలి తెగ ఇబ్బంది పెట్టేస్తుంది..


మరో పక్క చంద్రిక గురించి పూర్తిగా తెలియక అతడు తెగ తికమక అవుతున్నాడు.

ఒక మారుగా తల విదిలించుకున్నాడు.


కుర్చీలోంచి లేచాడు.

తన బైక్ తో గవర్నమెంట్ హాస్పిటల్ వైపు కదిలాడు.


***

"మీ అమ్మాయి బాగుకు నా వల్ల అయ్యేది అంతా అందిస్తాను. నన్ను నమ్మండి." కలగ చేసుకున్నాడు శ్రీరమణ.


"ఇంకేమమ్మా. మేము ఎలానూ ఉంటాం. అతణ్ణి నమ్మండి." చెప్పాడు మొదటి పోలీస్.


"ఇంత మంచి వాడు మరోడు ఉండడు. రమణతో పాటు మా వంతు సాయం కూడా మీకు ఉంటుంది." చెప్పాడు అబ్దుల్.


తలాడించాడు కాశిం.

ఇంద్రజ తల్లినే చూస్తుంది.


"ఇంట్లో అమ్మాయికి నయం కాగలదా." సంశయం వ్యక్తపరిచింది సావిత్రి.


"డాక్టర్ చెప్పారు కదమ్మా. వాళ్ల మాట మేరకే ఆమెను ఇంటికి తీసుకు వెళ్లమని చెప్పగలుగుతున్నాం." చెప్పాడు మొదటి పోలీసు.


"మరో మారు డాక్టర్ ని పిలిచి చెప్పిద్దాం." కలగ చేసుకున్నాడు రెండో పోలీసు.


"మనం చెప్పించడం ఏమిటి. డాక్టరే చెప్పారుగా." టక్కున అన్నాడు మొదటి పోలీసు.

ఆ వెంబడే..

"వెళ్లి.. ఓ మారు డాక్టర్ ని తీసుకురా." చెప్పాడు కూడా.


రెండో పోలీసు వెళ్లి.. డాక్టర్ ని తోడ్చుకు వచ్చాడు.

"సర్.. విసుక్కో వద్దు. వీళ్ల అమ్మాయికి ఇంటిలో ఉంచి వైద్యం అందించడం సబబే కదా. ఏ రిస్కు రాదుగా." అడిగాడు మొదటి పోలీసు.


అక్కడి సావిత్రి, ఇంద్రజ, కాశి, అబ్దుల్, రెండో పోలీసుతో పాటు శ్రీరమణ.. డాక్టర్ చెప్పేది వినుటకు సవ్యంగా ఉన్నాడు.


"ఓ. చెప్పాగా. ఇంటిన ఉంచి వైద్యం కొనసాగించ వచ్చు. రోజు తప్పించి రోజు సూచించిన ఇంజక్షన్ ఇస్తుండాలి. దాంతో పాటు ప్రతి రోజు.. ఒక మారు.. ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండాలి. అందుకు మా వైపు నుండి సహకారం ఉంటుందని చెప్పాంగా. ఇక మీరు చేయ తగ్గవి.. ఆమెకు రోజూ తప్పక మీ నుండి అందవలసినవి.. రెండు పూటల తడి లేదా డెట్టాల్ వేసిన నీటి క్లాత్ తో ఆమె ఒళ్లు, నోరు తుడుస్తుండాలి. రోజుకు.. కనీసం పది నిమిషాల చొప్పున.. రెండు మార్లు అటు ఇటు ఒత్తిగిల్లిస్తుండాలి." మళ్లీ చెప్పుతున్నాడు డాక్టర్.


ఆ అంతా వింటున్నారు.

"ఇవే ఆమెకు అంద వలసినవి. అవి ఇక్కడైతే మీకు శ్రమ పెరుగుతుంది కనుక.. 'ఇంటిన పెట్టుకోండి' అని చెప్పడం ఐంది. పైగా మీ పరిస్థితి బట్టే ఇలా చెప్పడం ఐంది." ముగించాడు డాక్టర్.


ఆలకించిన వారంతా మౌనం అయ్యారు.

డాక్టర్ వెళ్లి పోయాడు.


సావిత్రి, ఇంద్రజ మొహాం లోకి చూసేక.. చూపు మార్చి.. శ్రీరమణని చూస్తూనే.. "ఇతడే ఖర్చు భరిస్తానంటున్నాడుగా. మరి ఇక్కడే ఉంచితే బాగుంటుంది." అనేసింది.


మొదటి పోలీసు.. వెంటనే.. "సరే. అతడు వైద్యం ఖర్చే భరిస్తాడు. మీరు రోజంతా ఆమె తోనే ఇక్కడే ఉండాలి. ఆమె మిగతా పనులన్నీ మీవే." చెప్పాడు.


మళ్లీ సావిత్రి.. ఇంద్రజ మొహంలోకి చూస్తుంది.

ఇంద్రజ తికమకలో ఉంది.


"ఇంట్లో ఐతే.. మీ కళ్ల ముందే.. అందుబాటున.. మీ అమ్మాయి ఉంటుంది. ఇంటిన పెట్టుకోండి. మీ పనులు మీరు చేసుకోండి. ఆమె వైద్యం మా వాడు చూసుకుంటాడు." కలగ చేసుకున్నాడు అబ్దుల్.


అప్పుడే.. "అవునమ్మా. ఆలోచన వద్దు. ఇంటికి తీసుకు వెళ్లడమే మీకు మేలు." అన్నాడు రెండో పోలీసు చొరవగా.


సావిత్రి అడుగుతుంది ఇంద్రజను చూస్తూ.. "నువ్వు అక్క కింది నాకు సాయ పడతావా." అని.

ఇంద్రజ వెంటనే ఏమీ అనలేదు.


"అదేమిటి. తను మీ ఇంటిదిగా. సాయపడకపోతే ఎలా. తప్పక తన చేదోడు వాదోడు ఉండాలి." చెప్పాడు మొదటి పోలీసు.


ఆ వెంబడే.. ఇంద్రజను చూస్తూ.." ఏం అమ్మాయి.. కాదంటావా." అడిగాడు.


మిగతా వారంతా ఆమె పైనే చూపులు నిల్పారు.

అది గమనించిన ఇంద్రజ.. 'సరే' అన్నట్టు తలాడించేసింది.


"ఇంకా నేను చెప్పేది.. అడిగేది.. అనేది ఏముంది. నా బిడ్డకు నయమయ్యి.. అది మాకు అందుకు వస్తే చాలు." చెప్పేసింది సావిత్రి.


అంతా మెల్లి మెల్లిగా స్తిమితపడగలుగుతున్నారు.


========================================================================

ఇంకా వుంది..



========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








126 views0 comments

Commentaires


bottom of page