top of page
Writer's pictureBVD Prasada Rao

అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 6


'Amavasya Vennela - Episode 6 - New Telugu Web Series Written By BVD Prasada Rao

'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్లి సావిత్రి, చెల్లెలు ఇంద్రజ హాస్పిటల్ కి వస్తారు.

నిజానికి ఇంటర్వ్యూ కోసం వెళ్లిన చంద్రికతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు కామేశం. అతన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే ఆమె నడుపుతున్న స్కూటీ శ్రీరమణ కారు కింద పడుతుంది.

చంద్రిక వైద్యం ఖర్చులు తను భరిస్తానని చెబుతాడు శ్రీరమణ.

మాజీ రూమ్ మేట్ వెంకట్ ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని తెలిసి పరామర్శిస్తాడు.

పార్వతమ్మకు తన గతం చెబుతాడు శ్రీరమణ.


ఇక అమావాస్య వెన్నెల ధారావాహిక ఎపిసోడ్ 6 చదవండి

తను ఒక బిడ్డను కని.. సోములు చేతిలో పడేసింది. అంతే లాఘవముగా పరాన్నజీవిలా పరారయ్యింది. తన చేతుల్లో ఒదిగిన బిడ్డను ఏడిపించలేక.. తను ఏడుస్తూ.. ఆ బిడ్డ బతుకై యాతనలతో ప్రాకులాడేడు సోములు.


ఆ బిడ్డ పెద్దవుతుండగా.. సోములు జబ్బు పడ్డాడు. ఒక పక్క బిడ్డ.. మరో పక్క జబ్బు.. తో తన బతుకు కాడిని ఈడ్చలేక.. విడవలేక.. తుదికి జబ్బు వైపు ఒరిగి పోయాడు. సోములు మళ్లీ ఓడిపోయాడు.. చచ్చిపోయాడు."


శ్రీరమణ చెప్పడం ఆపేసాడు.

కారుతున్న కన్నీళ్లను తుడవక తల వాల్చేసి అలానే కూర్చున్నాడు.

పార్వతమ్మ గుండె బరువెక్కిపోయి ఉంది.

అతడినే చూస్తూ ఉంది.

కొద్ది నిముషాలు పిదప..

తిరిగి శ్రీరమణ చెప్పడం చేపట్టాడు.


"ఆ బిడ్డను.. నేనే..

ఆ సోములే నా నాన్న..

నాన్న చనిపోతూ.. చనిపోతూ.. రోజువారీగా నాకు ఇవన్నీ తెల్పాడు.

నాలో ధైర్యాన్ని నింపాడు.

బతుకు వన్నెలకు పాఠాలు నేర్పాడు.

నన్ను చాలా మటుకు నిలిపాడు.

నా అంతట నేను నడిచేలా ఊతం ఇచ్చాడు.

నేను కారును అద్దెకు సమకూర్చుకోగలిగాను.

నేను ఏమీ చదవక పోయినా.. నాన్న నేర్పిన బతుకు అభ్యాసాలు.. నాకు ఆసరా అయ్యాయి."

మళ్లీ చెప్పడం ఆపాడు శ్రీరమణ.


ఈమారు కూడా పార్వతమ్మ ఏమీ మాట్లాడలేక పోయింది.

ఆ వెంబడే..

"ఇది అమ్మ.. నాది. చాలా." అడుగుతున్నాడు శ్రీరమణ.


తననే చూస్తూ ఉన్న శ్రీరమణను చూస్తూ ఉండిపోయింది పార్వతమ్మ.

కొద్దిసేపు పిమ్మట..

"పడుకో." అని అక్కడ నుండి లేచి తన పడకకై వెళ్లిపోయింది.


శ్రీరమణ పక్క పర్చుకొని.. దాని మీద నడుము వాల్చాడు.

***

మర్నాడు..

మధ్యాహ్నం భోజనం అయ్యాక..

పనికి కదలబోతూ..

"నిన్నటి నేను తెచ్చిన పులిహోర బాక్సును కడిగి పెడతానన్నావు. అది ఏడ అమ్మ." అడిగాడు శ్రీరమణ.


పార్వతమ్మ వెళ్లి.. ఆ బాక్సును తెచ్చి.. శ్రీరమణకి అందించింది.

"ఈ పులిహోర కథ ఏంటి. రాత్రి ఇదీ చెప్పుతావనుకున్నాను." అంది.


చిన్నగా నవ్వేసాడు శ్రీరమణ.

"ఇదే మరో కథలే అమ్మా." అన్నాడు.


"చెప్పవా." ఆశ పడుతుంది పార్వతమ్మ.


"ఇదేం అంతటది కాదమ్మా." అనేసాడు శ్రీరమణ.


"నీకు కాకవచ్చు. నాకు చెప్పొచ్చుగా." కుతూహలం పడింది పార్వతమ్మ.

టూకీగా చంద్రిక వాళ్ల కబుర్లు చెప్పేడు శ్రీరమణ.


"అవునా. అయ్యో. నువ్వు ఉన్నావే.. మరీ ఇంత మంచోడివా." నోరు నొక్కుకుంటుంది పార్వతమ్మ.

శ్రీరమణ ఏమీ అనలేదు.

బాక్సుతో అక్కడి నుండి వెళ్లి పోయాడు.. తన కారు వైపు.


***

ఆ సాయంకాలం..

ఇంద్రజ.. పిల్లలకు ట్యూషన్ చెప్పుతుంది.. ఆ ఇంటి వరండాలో.

ఆ ఇంటి మధ్య హాలులాంటి గదిలో..

మంచం మీద ఎప్పటిలాగే చంద్రిక ఉంది.

ఆ మంచం అంచున సావిత్రి కూర్చుని ఉంది.

వాళ్లకి దగ్గరనే బల్ల మీద శ్రీరమణ కూర్చుని ఉన్నాడు.

సావిత్రి ఇచ్చిన టీని తాగుతున్నాడు.

"మళ్లీ చంద్రికలో కదలికలు కనబడుతున్నాయా అమ్మా." అడిగాడు.


"అగుపిస్తున్నాయి రమణ. రెండు రోజులు లగాయితు దడిదడిగా ఉన్నాయి కూడా." సావిత్రిలో స్థిమితం తెలుస్తుంది.


ఆ వెంబడే..

"నర్సు అంటుంది.. ఒక మారు డాక్టర్ కు చూపిస్తే బాగుంటుంది అని." చెప్పింది.


"అలానా. ఐతే తీసుకు వెళ్లి చూపుదామా." అడిగాడు శ్రీరమణ.


"చూపిస్తే బాగుంటుందిగా." అంది సావిత్రి.


"రేపు తీసుకు వెళ్దామా." అడిగాడు శ్రీరమణ.

"అలానే. రేపు ఉదయం రా రమణ. రేపు ఇంజక్షన్ ఉంది. అది కాగానే.. మనం హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చూపిద్దాం." చెప్పింది సావిత్రి.


"సరే" అన్నాడు శ్రీరమణ.


నిముషం మేరకు గడిచాక..

"రమణ.. నువ్వు ఇచ్చిన డబ్బుల్లో.. ఇంకా ఆరు వందల ముప్పై ఉంది." చెప్పింది సావిత్రి.


"లెక్కలెందుకమ్మా. నేను వైద్యంకై సర్దుతానుగా." చెప్పాడు శ్రీరమణ.


"నేనూ నువ్వు ఇస్తుంది మొత్తం వైద్యంకే వాడుతున్నాను." చెప్పింది సావిత్రి.


"అయ్యో. ఏమిటమ్మా.. నేనేమైనా అన్నానా.. అడిగానా." ఇబ్బందయ్యాడు శ్రీరమణ.


సావిత్రి సర్దుకుంది.

"అబ్బే. అలా కాదు. చెప్పుతున్నాను. అంతే." అంది.


శ్రీరమణ తన చేతి లోని ఖాళీ టీ కప్పును కింద పెడుతున్నాడు.

అప్పుడే అంది సావిత్రి..

"చూడు చూడు రమణ.. చంద్రిక కుడి చేతి కదిలిక." అంది గబగబా.


శ్రీరమణ అటు చూపు తిప్పాడు.

చంద్రిక కుడి చేతి వేళ్లు ఉండుండి కదలాడడం చూసాడు.

'హమ్మయ్య.' అనుకున్నాడు.


***

ఆ రాత్రి..

భోజనం వడ్డన చేస్తూ..

"నా ఒళ్లు బాగుంది. ఇంకా ఆ మాత్రలు మింగాలా." అడిగింది పార్వతమ్మ.


"వేసేయాలి అమ్మా. కోర్స్ అన్నాడుగా డాక్టర్. తగ్గినా వేసుకో." చెప్పాడు శ్రీరమణ.. అన్నంలో చారు పోసుకుంటూ.


"అబ్బా.. మింగలేక పోతున్నాను. పెద్ద మాత్రలు." నసిగింది పార్వతమ్మ.


శ్రీరమణ చిన్నగా నవ్వేసాడు.


"అన్నట్టు.. ఆ పిల్లకు ఎలా ఉంది. ఇంకా తెలివి వచ్చేలా లేదా." అడిగింది పార్వతమ్మ.


"ఈ మధ్య చేతుల్లో.. కాళ్లలో కదిలికలు తరుచు అగుపడుతున్నాయట. పూర్తి తెలివి ఇంకా లేదు." చెప్పాడు శ్రీరమణ.


నిముషం తర్వాత..

"ఎంత నీకు అవుతుందేమిటి." ఆరా చేపట్టింది పార్వతమ్మ.


"లెక్క వేయలేదు అమ్మా." చెప్పాడు శ్రీరమణ.


"ఆ ఖర్చు కోసమేనా.. రాత్రి పని కూడా చేస్తుంది." అడిగేసింది పార్వతమ్మ.


"అంతేనమ్మా. చంద్రిక తెమిలితే.. నాకు రాత్రి పని తప్పుతుంది." చెప్పాడు శ్రీరమణ.


"ప్చ్. రోజు రాత్రులు అంత సేపు అంటే కష్టమే నీకు నాయన. నిద్ర చాలా ముఖ్యం." అంది పార్వతమ్మ.

ఆ వెంబడే..

"ఆరోగ్యం పాడు కానిచ్చుకోకు నాయనా." చెప్పింది.


తలాడించేసాడు శ్రీరమణ.

కొద్దిసేపు తర్వాత..

"ఈ కారు పని చాలా బడలిక అవుతుంది." తనలో తాను అనుకున్నలా అన్నాడు శ్రీరమణ.


పార్వతమ్మ జంకింది.

"మరో పని పట్టాలన్నా అంత ఈజీ కాదుగా నాయనా." అనేసింది.


"అవునమ్మా. అంతంతే." అనేసాడు శ్రీరమణ.

ఆ తర్వాత..

"నా డ్రయివింగ్ నచ్చిన కొద్ది మంది.. కోరి నా బండే ఎక్కుతున్నారు. అలా ఇద్దరు ముగ్గురు బాగా చనువు అయ్యారు. వాళ్ల మాటలు బట్టి.. నాకు మంచి చేయాలని వాళ్లు చూస్తున్నారు. అదే ఐతే.. నాకు బాగుంటుంది." చెప్పాడు శ్రీరమణ.


"నువ్వు మంచోడివి. నీకు మంచి జరుగుతుందిలే." ధీమా పడుతుంది పార్వతమ్మ.


చిన్నగా నవ్వేసాడు శ్రీరమణ.


***

మర్నాడు..

చంద్రికను చూసేక..

"గుడ్.. ఈవిడ బ్రైన్ లో స్టిమ్యూలేట్ తెలుస్తుంది. త్వరలోనే తేరుకుంటుంది. తెలివి వస్తుంది." చెప్పాడు డాక్టర్.


సావిత్రి, ఇంద్రజ పొంగారు.

శ్రీరమణ కుదురవుతున్నాడు.


"మందులు మార్చ నవసరం లేదు. కంటిన్యూ చేయాలి." చెప్పాడు డాక్టర్.


"సరే డాక్టర్." ముందుగా శ్రీరమణే అన్నాడు.


"అలాగే." తర్వాత అంది సావిత్రి.


"ఇంటిలో పరివేక్షణ బాగుంది. అన్నట్టు.. నేను పంపిస్తున్న స్టాప్ తో చెప్పాను. వాళ్లు ఈమెను వెనుక ఆసరాతో కూర్చుండబెట్టే పద్ధతిని మీకు నేర్పారుగా." అడిగాడు డాక్టర్.


"చెప్పారు డాక్టర్. వాళ్లు అన్నట్టే రోజుకు రెండు మూడు మార్లు కూర్చుండ పెడుతున్నాం." చెప్పింది సావిత్రి.


"మన వంతు ప్రయత్నాలు ముఖ్యం.. అవసరం." అన్నాడు డాక్టర్.


ఆ వెంబడే..

"ఈ మారు.. ఇక మీదట.. ఈమెను కొద్ది సేపు కుర్చీలో కూర్చుండ పెట్టే పని చేస్తుంటే బాగుంటుంది.. చేయగలరా." అడిగాడు డాక్టర్.


ఇంద్రజను చూసింది సావిత్రి.

"చేస్తాం డాక్టర్." చెప్పింది ఇంద్రజ.


"గుడ్. గుడ్. ఉఁ. ఇంటికి తీసుకు వెళ్లొచ్చు." చెప్పేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్లి పోయాడు.


సావిత్రి, ఇంద్రజ సాయ పడగా.. శ్రీరమణ.. చంద్రికను చేతులతో మోస్తూ కారు లోకి చేర్చాడు.

========================================================================

ఇంకా వుంది..

========================================================================


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









113 views0 comments

Comments


bottom of page