అమాయకత్వం
- Lakshmi Sarma B
- May 1, 2023
- 1 min read

'Amayakathvam' New Telugu Story
Written By Lakshmi Sarma Thrigulla
'అమాయకత్వం' తెలుగు కథ
రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
అమీర్‌పేట బస్టాండు అంటే అబ్బా.. ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. బాగా తెలిసిన వాళ్ళైతేనే తప్ప.. తెలియని వారికి చాలా కష్టం. పల్లెటూరి వాళ్ళకైతే మరీ
ఇబ్బంది. పాపం బస్సుకోసం ఎంతోసేపటినుండి చూస్తుంది గంగవ్వ.
ఏ బస్సెక్కాలో తెలియదు ఎక్కడ దిగాలో తెలియక కనిపించిన వాళ్ళందరిని అడుగుతుంది. కొందరు చెబుతున్నారు.
కొంతమంది విసుక్కుంటున్నారు.
“ఓ సారు.. ఈ బస్సు ఏడికి పోతుంది జర చెప్పుసారు, ” చేతిలో చిన్న సంచిపట్టుకుని అటు ఇటు తిరుగుతూ అడిగింది.
“అసలు నువ్వెటు పోవాలో చెప్పవమ్మా ముందు,” ఒకాయన అడిగాడు.
“అదేసారు.. గా దవాఖానకు పోతా, మొలాలు దాటినక వస్తుందట, ఎవర్ని అడిగిన చెప్తరన్నరు సారు, గా బస్సు అడికిపోతుందా”, మాట స్పష్టంగా లేకపోవడంతో ఆమె ఏం చెబుతుందో అర్ధం కావడంలేదు కొందరికి.
“చూడమ్మా.. నువ్వేం చెబుతున్నావో ఒక్క ముక్క కూడా మాకు అర్ధంకావడంలేదు. నువ్వు చెప్పే ఆ అడ్రసు కూడా తెలియడంలేదు. నిన్ను ఒక్కదాన్ని ఎందుకు పంపించారు.. మీ వాళ్ళెవరు రాలేదా? పోని ఆడ్రసన్నా పేపరుమీద రాసివ్వాలి కదా!” అన్నాడు ఓ పెద్దమనిషి.
“అయ్యో నాకు రాసిచ్చిండు సారు, ఇదిగో దీనిలో ఏం రాసిండో సూడు సారు, ” అంటూ తన నడుములో దోపుకున్న చెక్కుడు సంచిలోనుండి నలిగిపోయినట్లున్న పేపరు తీసి ఇచ్చింది.
“బలేదానివే ఇంతమంచిగా రాసిచ్చినారు కదా! నువ్వు ఇది చూపెట్టకుండా నీ నోటికి వచ్చింది చెప్పి అందరిని పరేషాన్ చేస్తున్నావు, అదిగో ఆ బస్సు ఉంది చూడు అదెక్కి కండక్టర్ కు ఈ అడ్రసు చూపెట్టు, ఆయనే దింపుతాడు సరేనా మళ్ళి నీ నోటికి వచ్చింది చెప్పకు, ” అన్నాడు ఆ పెద్దమనిషి. బ్రతుకుజీవుడా అనుకుంటూ అందరిని తోసుకుంటూ బస్సెక్కింది గంగవ్వ.
“టికెట్ టికెట్, ” అనుకుంటూ వచ్చాడు కండక్టర్ బస్సు కొద్దిదూరం వెళ్ళాక. బస్సు నిండా జనం కిటకిటలాడుతూ ఉంది. “ ఓ పెద్దవ్వ.. పైసలితియ్యి ఎక్కడికి ఇవ్వాలి టికెట్, ” అడిగాడు.
“ఇదిగో సారు పదిరూపాయలు, గా దవాఖాన దగ్గర దింపు నీకు పుణ్యముంటది, ” అంది.
“ఏందమ్మా ఇది.. పదిరూపాయలకు టికెట్ ఎక్కడుందనుకున్నావు, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే గా దవాఖాన అంటే నాకేం తెలుసు, దిగు దిగు ఇంకో బస్సు ఎక్కుపో, ” కసురుతూ బస్సాపించి గంగవ్వను దింపేసాడు కండక్టర్.
ఎటు వెళ్ళాలో తెలియక మళ్ళి కనిపించిన వాళ్ళందరిని అడగడం మొదలుపెట్టింది. ఇంతలో ఇంకో బస్సు రావడంతో ఎవరు చెప్పారు ఎక్కమని. కండక్టరు వచ్చి” ఆ చెప్పమ్మా ఎక్కడికి, ”
అడిగాడు. చెప్పింది నోరు తరగడంలేదు ఆ పేరు చెప్పడానికి.
“అరే ఎక్కడికి వెళతావో చెప్పమంటే ఏదేదో చెబుతున్నావు, నువ్వు ఒక్కదానివే వచ్చావా.. నీక్కూడా ఎవరు లేరా? నువ్వు మాట్లాడేది తెలుగేనా, ” అడిగాడు.
“అయ్యో సారు .. అదికాదు సారు నా కొడుకు గా దవాఖానకు రమ్మన్నాడు, నా కొడుక్కు
అప్రేషన్ చేసారు మావోని దగ్గర ఎవరులేరు, గందుకని నేను వచ్చిన ఉండు సారు మావోడే ఫోన్ చేస్తున్నాడు", అంటూ “ ఒరే బాలిగా ఇదో కండక్టరు సారుతో మాట్లాడు, నాకు ఏడికి రావన్నో తోవ దొరుకుతలేదు జర చెప్పు, ” అంది ఫోన్ కండక్టరుకు ఇస్తూ.
“ఆమెకు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు ఎందుకు పంపిస్తారయ్యా తెలియని వాళ్ళను, అసలు ఆమెకు దవాఖాన పేరుకూడ చెప్పడానికి రావడంలేదు, ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తారు, “ చెడామడా అనేశాడు.
“గట్ల తిట్టకు సారు.. పాపం వాడికే పాణం మంచిగలేదు, ఈ పదిరూపాయలు తీసుకుని
నన్ను నా కొడుకు చెప్పిన దగ్గర దించు నీ కాళ్ళు పట్టుకుంటను, ” అంది దుఃఖంతో గొంతు పూడుకపోయింది.
“ఆ ఇక మాకు ఆదేపని నీలాంటి వాళ్ళందరిని దింపుకుంటూ కూర్చుంటే మేము డ్యూటీ చేసినట్టేగాని, ఈ పది రూపాయలకు టికెట్ లేదు. ఇరవైరూపాయలు అయితుంది తియ్యి, ” అంటూ కఠినంగా మాట్లాడుతూ టికెట్ తీసి చేతిలో పెట్టాడు.
“గదేంది మావోడు పదిరూపాయలకే అందాక వస్తవు అన్నాడు, నువ్వేంది సారు ఇరవైరూపాయలంటున్నవు, దబాయింపుగా అడిగింది.
“ఆ ఆ నువ్విచ్చే పైసలతో మా ఆవిడకు పట్టుచీర కొందామని అడుగుతున్న, బలే బేరం దొరికింది పొద్దున పొద్దున్నే ఇయ్యమ్మా విసిగించకుండా, ” హేళనగా మాట్లాడుతూ అడిగాడు.
“ఏమ్మా ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, పోని మీ వాళ్ళేమైన పేపరుమీద రాసిచ్చారేమో చూడు, కండక్టర్ ..పాపం అమాయకురాలిలా ఉంది కోపం చెయ్యకుండా మెల్లిగా అడగండి చెబుతుంది, కొడుకుకు ఆపరేషన్ అయిందన్న బాధలో ఉంది, ” చెప్పింది, గంగవ్వ పక్కనే కూర్చున భారతి.
“భలేదానిమ్మా నేనేదో ఆమెను హడావుడి చేస్తున్నట్టు చెబుతున్నావు, ఆమె చెబుతున్నది నీకేమైనా అర్ధమైందా? అయినా మాకు పనిపాటలేం లేవనుకున్నారా? ఇలాంటి వాళ్ళతోని వాగడానికి మేమేం ఊరికే కూర్చోవడంలేదు, ఒక్క టికెట్ సరిగా ఇవ్వకపోయామంటే మా ఉద్యోగాలకే ఎసరుపడుతుంది, ” అన్నాడు విసుగ్గా భారతివైపు చూస్తూ.
“ఇంద ఈ కాయితంలో నా కొడుకు రాసిండు, నేను పట్నం వచ్చుడు ఇదే మొదలు నాకేం తెలియదమ్మ జర మంచిగ చూసి చెప్పు, ” అంది తన చేతిలో ఉన్న కాగితం ముక్కను భారతి చేతిలో పెడుతూ.
జాలిగా గంగవ్వను చూస్తూ పేపరు తీసి చూసింది. కండక్టర్ ఇది చూడండి ఆమె చెబుతున్న అడ్రస్ ఇందులో ఉంది, మౌలాలి స్టేజి రాగానే ఆమెను దింపండి, పాపం పేరు అనరాక ఏదేదో చెబుతుంది, చూడమ్మా.. నువ్వు ఎక్కడ దిగాలో కండక్టర్ చెబుతాడు. అప్పుడు దిగు సరేనా, ” అడిగింది. సరేనంటూ తలవూపింది బాధతో కళ్ళుతుడుచుకుంటూ. ఆమెను చూస్తే భారతికి చాలా బాధేసింది.
“చూడమ్మా.. ఇంత రద్దిగా ఉన్న బస్సులో ఈమెను పట్టించుకుని చూసుకోవడం నావల్ల కాదుగానీ.. నీకంతగా బాధనిపిస్తే ఈమెను ఆ హాస్పిటల్ ఏదో నువ్వే దగ్గరుండి తీసుకపో, లేనిపోని తలకాయ నొప్పులు నాకంటగట్టకు, ” అంటూ గంగవ్వను చూస్తూ విసురుగా అన్నాడు.
భారతికి చాలా కోపం వచ్చింది. “హలో కండక్టర్ .. ఏం నీ చెల్లో నీ తల్లో ఇదే పరిస్థితిలో ఉంటే ఇలా అనేవాడివా? వేలకు వేలు డబ్బులు తీసుకుని ఉద్యోగం చేస్తున్నది సాటి మానవులకు చేయుతనివ్వడానికి గానీ నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి కాదు, సంపాదన ఉండగానే గొప్పకాదు. సంస్కారం కూడా ఉండాలి, తెలియని వారికి దారి చూపడం నేర్చుకోవాలి గాని అడ్డదారిన వదిలివేయడం మానవత్వం అనిపించుకోదు, ” అంటుండగానే గంగవ్వ దిగే స్టేజి రావడంతో ఆమె చెయ్యిపట్టుకుని బస్సు దిగింది భారతి.
“బిడ్డా .. నిన్ను చూస్తుంటే మంచిదానిలా ఉన్నావు, నీకు పున్నెముంటది నన్ను దవాఖానకు తీసుకపోతావా, ” అడిగింది రెండుచేతులతో దండం పెడుతూ.
“అయ్యో .. నేను బస్సు దిగింది నీ కోసమే, నిన్ను హాస్పిటల్ కు తీసుకవెళ్ళి నీ కొడుకుకు అప్పచెప్పి వెళతాను పద, ” అంటూ ఆమె చెయ్యి పట్టుకుని నడిచింది. కళ్ళల్లో ఆనందం పొంగివచ్చింది గంగవ్వకు. తన కొడుకును చూడబోతున్నందుకు మనసంతా సంతోషంతో నిండిపోయింది.
****** ***** ***** ****** *****
|
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

Comentarios