top of page
Writer's pictureKottha Priyanka

ఆమె ఆశయానికి కంచె



'Ame Asayaniki Kanche' - New Telugu Story Written By Bhanupriya

Published In manatelugukathalu.com On 19/07/2024

'ఆమె ఆశయానికి కంచె' తెలుగు కథ

రచన: భానుప్రియ


సత్యనారాయణ, లక్ష్మిలది మద్య తరగతి పల్లెటూరి కుటుంబం. ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు ఒక ముద్దుల కూతురు. మయూరి పేరుకు తగ్గట్టుగానే నాట్యాన్ని అభ్యసించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆరాటం తనది. పల్లెటూరు.. ఇంకా చాలిచాలని జీతంతో చాలా కష్టంగా జీవనం సాగేది. నాట్యం నేర్చుకోవాలనే మయూరి కోరికను తల్లి కూడా ఎలాగైనా సరే నెరవేర్చాలని అనుకునేది.. 


నాట్యం నేర్చుకోవాలంటే బస్సు సౌకర్యం లేని మూడు కిలోమీటర్లు దూరంలో గల మండలం ప్రాంతానికి వెళ్ళాలి. నేర్చుకోవాలనే మయూరి సంకల్పం ముందు నడక ఆటంకం కాలేదు. రోజు అలా వెళ్ళి చాలా కష్టపడి నేర్చుకునేది. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మెదటి బహుమతి అందుకునేది. ఊర్లో మాత్రం కొందరు ఆడపిల్లలకు అవసరమా ఈ డాన్సులు అన్నప్పుడు మయూరి 


"ఆడపిల్ల కు అడుగడుగున ఆంక్షలేనా? 

అవని అంత తన ప్రేమను పంచే ఆమె కు, ఆమె ఆశయానికి కంచె వేస్తున్నారు ఎందుకు?” అని బాధ పడేది. 

నేను మాత్రం పెద్దయ్యాక ఈ కంచె నుంచి విముక్తి చెంది నా ఆశయాన్ని నెరవేర్చుకుంటా అని మనసులో సంకల్పం చేసుకున్నది.. 


కొందరు తన పట్టుదల, కృషి కి పోగిడేవారు. కొందరు అవహేళన చేసేవారు.. 


కాని మయూరి వారి ఇంటి సభ్యులు అవేవి పట్టించుకునేవారు కాదు.. 


పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని సార్లు వచ్చినా ఆర్థిక స్థోమత లేక, వెళ్ళలేక తన పరిధి మేరకు నాట్యం చేస్తూ పేరు కు తగ్గట్టుగా నాట్యమయూరి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. 

అలా ముందుకు సాగుతుండగానే యుక్త వయస్సులోకి అడుగు పెట్టింది.. 


తన తండ్రి పరిస్థితి బాగోలేక తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నది. అలా తన ఆశయం మధ్యలోనే అంతారాయం ఏర్పడింది.. 


కాని తాను మాత్రం వివాహం అనంతరం తన భర్త ద్వారా తన ఆశయాన్ని సాధించాలని అనుకుంది. 


నగరం లో తను భర్త కార్తీక్ అత్తారింటికి, అత్త మామలతో వారికి సరిపడే ఒక చిన్న సొంత ఇంటి లో మయూరి కాపురం ఆరంభమైంది.. 

కార్తీక్ మృదు స్వభావి. ఒక కంపెనీ లో మేనేజర్ గా పని చేసేవాడు.. తనకు ఇష్టమైన నాట్యం వైపు మయూరి మనసు మళ్ళింది.. 


తన భర్తతో మాట్లాడి చిన్న పిల్లలకు నాట్యం నేర్పించాలని అనుకుంది. సాయంత్రం కార్తీక్ రాగానే తన మనసులోని మాటను చెప్పింది. 


అది విన్న కార్తిక్ “నాట్యమా? ఎక్కడ నేర్పిస్తావు.. ఎలా ? ఎందుకు రిస్క్.. నువ్వు హ్యప్పి గా వుండు. అమ్మ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి” అని చెప్పాడు, 


మయూరి “కేవలం రెండు గంటలు మాత్రమే పిల్లలకు నాట్యం నేర్పిస్తాను. నాకేమి రిస్కు లేదండి. నాకిష్టమైన నాట్యాన్ని పదిమందికి పంచాలని నా చిన్నతనం నుంచి ఎన్నో కలలు కన్నాను” అని బేల మొఖం వేసుకొని భర్తతో చెప్తుంది. 


అది విన్న కార్తీక్ “చూద్దాంలే, బాధపడకు. అమ్మానాన్నను కూడా ఒక మాట అడుగుదాం”అని తనను ఓదారుస్తాడు.


వంట గదిలో పని చేస్తు మయూరి ఆలోచనలో పడుతుంది "వివాహం అనే బంధంతో కట్టుబాట్లు సాంప్రదాయాలు స్త్రీ తన జీవితంలోని ఆశయాలను కోరికలకు ప్రతిబంధకమై తన చుట్టూ ఒక ‘కంచె’ ఏర్పాటు అవుతుంది కదా" అని తన మనసులో అనుకొని చిన్న నిట్టూర్పు తో బాధపడుతుంది.. 

అలాగే వారం రోజులు గడిచింది.


 కార్తీక్ తో మయూరి మరొకమారు “ఏమైంది? మీరు మీ అమ్మగారితో మాట్లాడారా? ఏమన్నారు అత్తయ్య గారు? నాట్యం నేర్పించడానికి ఒప్పుకున్నారా..” అని అడగగా

“అయ్యో మయూరి.. నేను ఆ సంగతి మర్చిపోయాను. రోజూ నేను వచ్చేసరికి రాత్రి అవుతుంది కదా. సరేలే రేపు అడుగుతానులే..” అన్నాడు.


మరునాడు మయూరి ఇంటి దగ్గర దేవాలయానికి వెళ్ళగా అక్కడ కూర్చున్న తనకు గుడి కింది ఒక విశాలమైన ప్రాంగణం కనబడగా ఇక్కడ తన నాట్య తరగతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి పూజారి గారికి తన మనసులోని కోరికను చెపుతుంది..


అది విన్న పూజారి “చాలా మంచి ఆలోచన తల్లి” అని “మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు సంతోషంగా తరగతులు ప్రారంభించుకో” అని చెప్పగా మయూరి మదిలో అవధులు లేని సంతోషంతో మునిగిపోతుంది. 


మయూరి ఎంతో కష్టపడి 20 రోజులపాటు ప్రచారం చేసి కొంతమంది విద్యార్థులను రప్పించుకోగలిగింది.. ఇంట్లో వాళ్ళని ఒప్పించి నాట్యాన్ని ప్రారంభించింది. ఇంట్లో పని చేసుకుని అత్తయ్య మామయ్య విశ్రాంతి సమయంలో తాను తరగతులకు వెళ్ళేది. అలా నెల రోజులు గడిచాక మయూరి కి రెండు రోజులు ఆరోగ్యం బాగోలేక డాక్టర్ని సంప్రదించగా మయూరిని పరీక్షించి డాక్టర్ తను తల్లి కాబోతుందనే శుభవార్త చెప్తుంది.. 


ఆ శుభవార్తతో మయూరి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంతో సంబరాలు జరుపుకుంటారు. మయూరి మాత్రం తన రూమ్ లో కూర్చొని తన మనసులో ఒకవైపు సంతోషంతో మరోవైపు తన నాట్య తరగతులు ఎలాగూ అని బాధ తో "ఆడపిల్ల అంటే వివాహం అనంతరం బాధ్యతలు, కట్టుబాట్లు, అనే కంచె లో బంది అయ్యి తన ఆశలను, ఆశయాలను చంపుకొని మనస్సాక్షి తో నిరంతరం యుద్ధం సల్పుతూ అలుపెరుగని పోరాట సమరమే కదా ఆడదాని జీవితం.. " అని అంతర్మథనంలో తన బాధ ను తలుచుకొనే లోపే అమ్మ అనే పిలుపు నా దరి చేరునులే అని మనసు లో సంతోషం పడుతు కన్నీరు తుడిచుకుంది.. 


ఇది ఒక్క మయూరి కథ నే కాదు ఏదో సాధించాలని కలలు కన్నా లక్ష్యాన్ని అందుకోవాలని ఎంతో సాధన చేసి అనుబంధానికో, సాంప్రదాయానికి, కట్టుబాట్లకో, బంది అయ్యి కంచె లో పడిన లేడిపిల్లలా అనునిత్యం విలపించే ఎందరో పడతుల యదార్థ సంఘటన.. 

***

భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/priyanka

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




61 views0 comments

Kommentare


bottom of page