top of page

ఆమె అతడిని జయించెను

#KiranJammalamadaka, #జమ్మలమడకకిరణ్, #AmeAthadiniJayinchenu, #ఆమెఅతడినిజయించెను, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు, #TransGenderStoryInTelugu


Ame Athadini Jayinchenu - New Telugu Story Written By Dr. Kiran Jammalamadaka Published In manatelugukathalu.com On 25/02/2025

ఆమె అతడిని జయించెను - తెలుగు కథ

రచన: డా: కిరణ్ జమ్మలమడక 

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



"పుత్రేణ లోకాంజయతి, పౌత్రేణానంత్యమశ్నుతే 

అథ పుత్రస్య పౌత్రేణ బ్రధ్నస్యాప్నోతి విష్టపం -

అని మనుస్మృతి శ్లోకం 9. 137 లో చెప్పారు.


అంటే దానర్థం మనిషి పుత్రుని ద్వారా లోకాలను జయిస్తాడు, మనుమడి ద్వారా అమరత్వాన్ని పొందుతాడు. కొడుకు, మనుమడి ద్వారా బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇహ పర లోకాల్లో కొడుకును మించినవాడు ఎవడూ లేడు, సరిపోడు.. " అనే మాటలు ఎవరో గురువు గారు టీవీలో భోదిస్తూవుంటే అవి లీలగా వినపడుతున్నాయి రాంమూర్తి కి. ఒక్క క్షణం రాంమూర్తి అటువైపు చూసాడు. 


సముద్ర తీరంలో కాలిని స్పృచించిన అలలాగా, ఒక చిన్న చిరునవ్వు రాంమూర్తి పెదాలను తాకి వెళ్ళిపోయింది. ఆ నవ్వులో నిస్పృహలేదు, నిగూఢమైన అర్థం తెలిసిన వేదాంతి నవ్విన నవ్వులా వుంది. అంతలోనే తన ఫోన్ మోగింది. 


"నాన్నా ! ఆధార్ కార్డు లో పేరు రాయిపిస్తునా, ఏదైనా మంచి పేరు చెప్పు నాకు ?"


"అపరాజిత " అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రాంమూర్తి. 


జ్ఞాపాకాల జాతరలో జారిపోయిన ఎన్నో జ్ఞాపాకాలు రాంమూర్తి కి జ్ఞప్తికి రాసాగాయి. 

***

“ఏమైనా చెప్పండి అన్నయ్య గారూ, మీ అబ్బాయీ, మా అబ్బాయీ.. మన ఇంటిపేరు నిలబెట్టాలి అంతా వీళ్ళ చేతుల్లోనే వుంది " అన్నాడు రాంబాబు బాబాయ్, చిన్నప్పటి రామూర్తిని చూపిస్తూ..


"అదేమిటి, మిగిలిన వాళ్ళకీ పిల్లలు ఉన్నారుగా ?" అమాయకంగా అడిగాడు రాంమూర్తి వాళ్ళ నాన్న రామనాథం. 


" అదేమిటి అన్నయా! అబ్బాయి.. అబ్బాయిలు ఎవరికి వున్నారు? మనకి తప్ప, మిగిలిన అందరకీ ఆడపిల్లలేగా, వాళ్ళా వంశాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి అంతే. మన కుటంబాల్లో మన తాతాగారి వంశమే నిలబడింది, దీనిని ఇంకా ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత, మా వాడి పైన, మీ వాడి పైనే వుంది " అన్నాడు ఇంకా గట్టిగా.. 


"ఆ ! ఈ రోజుల్లో కూడా ఏమిటయ్యా, నీ చాదస్తం కాకపొతే " అన్నాడు రామనాథం, కొంచెం విసుగ్గా, అయినా రాంబాబు బాబాయ్ వదల్లేదు.

 

"అబ్బే ! అన్నయా.. ఇహం లోను పరంలోను వీళ్ళే కదా మనల్ని కాపాడేది, అంతెందుకు మన సైన్స్ కూడా అదే చెపుతోంది, అదేమిటబ్బా ఆ! క్రోమోజోమ్స్.. X, Y అంటే ఏమిటి? XX అమ్మాయీ, XY మగాడు, ఈ Y నే వంశం అంటారు, ఈ Y ని, మగ సంతానమే ముందుకు తీసుకెడుతుంది, నిలబెడుతుంది ! ". 


రామనాథం కి ఆ విషయం ఇంకా పొడిగించటం ఇష్టంలేక "సరేలే, ఇంకేంటి విశేషాలు ?" అని మాట మార్చినా, రాంమూర్తికి మాత్రం రాంబాబు బాబాయ్ మాటలు మెదడు లో బాగా నాటుకుపోయాయి, జీవిత పరమావధి మగ సంతానమే తప్ప ఇంకేమి లేదు అనే భావన అతని మనసులో బాగా పాతుకుపోయింది, అది అతని వయసుతో పాటే పెరిగి పెద్దదయ్యింది. 

జీవితం లో రాంమూర్తి కి వాళ్ళ తల్లి తండ్రి పోయారన్న చిన్న బాధ తప్ప మిగిలినదంతా, సాఫీగా సాగిపోయింది.


రాంమూర్తి ఎంతోకాలంగా వేచివున్న క్షణం వొచ్చింది. అదే రాంమూర్తి తండ్రి కాబోతున్నాడు అని తెలియడం. అది తెలిసిన క్షణం నుండి రాంమూర్తి ఆనందానికి అవధుల్లేవు. తనకి మగ సంతానమే కావాలని ప్రదక్షిణ చెయ్యని చెట్టులేదు, మొక్కని దేవుడు లేడు. రాంమూర్తి ఆశపడ్డట్టుగానే, పండంటి మగపిల్లవాడు పుట్టాడు. తన మొక్కులన్నీ తీర్చుకొని, పిల్లాడికి అజయ్ అనే పేరు పెట్టి, తాపీగా ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు.


అదేమిటి అని అడిగిన జానకికి, 

"ఎందుకే.. మగ పిల్లవాడు పుట్టేసాడుగా " అని చిద్విలాసంగా సమాధానమిచ్చాడు రాంమూర్తి. 

అజయ్ ని రాంమూర్తి జానకిలు అల్లారు ముద్దుగా, ఎండకన్నెరుగకుండా పెంచసాగారు. 

అజయ్ కి, ఆరేడేళ్లు వచ్చేవరకు ఆడుకోవడానికి చాలా మంది పిల్లలు వొచ్చేవారు. అజయ్ అసలు ఇంటిలోనే ఉండేవాడు కాదు, అంతా బానేవుంది. రాంమూర్తి కి జీవితం అంటే రైలుపట్టాలపైన రైలుబండి లాగ సాగేదికాదని, సముద్రంలో తెరచాపకట్టిన పడవలాంటిదని అడుగడుగునా ఎన్నో అలలు చిన్నవి పెద్దవి కాచుకోవాలని తెలియడానికి ఎక్కువ ఏళ్ళు పట్టలేదు. 


అజయ్ ని మొదటిసారి లక్కపిడతలతో ఆడుకోవటం చూసినప్పుడు రాంమూర్తి, జానకి మీద ఎగిరిపడ్డాడు, అజయ్ ని బలవంతంగా క్రికెట్ కి పంపించాడు అది అజయ్ కి ఎంత యిష్టం లేదని చెప్పినా రాంమూర్తి వినలేదు. రాంమూర్తి కి మగపిల్లలు ఆడాల్సిన ఆటలు ఇవి, పనులు ఇవి అని, ఆడపిల్లలు ఆడాల్సినివి, చెయ్యాల్సిని ఇవి అని వేరు చేసిపెట్టుకున్నాడు, పోనీలెండి చిన్నపిల్లాడు అని జానకి యెంత చెప్పినా వినేవాడు కాదు రాంమూర్తి. 


అజయ్ కి, పది పన్నెండు యేళ్ళురాగానే, తనకి తెలియకుండానే, స్నేహితులు దూరం అవ్వసాగారు, తన నడక మారింది, తన ఆలోచనలు మారాయి, తన తోటి మగపిల్లలు అంతా ఫుట్బాల్, క్రికెట్, హాకీ ఆడుతుంటే తనుమాత్రం, వేరేగా ఉండేవాడు. తన నడకని, ముఖ కవళికలని తోటి వారు ఎందుకు ఎగతాళి చేస్తున్నారో ? టీచర్లు కూడా వెకిలిగా ఎందుకు నవ్వుతున్నారో తెలీదు, ఇటు ఆడపిల్లలు, అటు మగపిల్లలు ఎవరు వారి స్నేహితుల్లా అజయ్ ని ఎందుకు గుర్తించటం లేదో.. మఖానా అని, పాయింట్ ఫైవ్ అని, చెక్కా.. అని, ఎందుకు సంబోధిస్తున్నారో అర్థం అవ్వటంలేదు అజయ్ కి. వీటన్నీటి సంగతి ఒక యెత్తు అయితే, వాష్ రూమ్ కి వెళ్లాలంటే అదొక పీడకలే అజయ్ కి, అక్కడ వున్న పిల్లలు, ఎక్కడెక్కడో చేతులు వేస్తారు, మెల్లిగా తడతారు, నవ్వుతారు అది భరించటం నరకం, వీటికి తోడు టీచర్లు కూడా అజయ్ ని నడక, నడత మార్చుకోమనే తిడుతున్నారు. 


అజయ్ కి ఏమైనా ప్రశాంత క్షణాలు వున్నాయి అంటే అవి నిద్రలో వున్నవే, అవి కూడా పిచ్చి పిచ్చి కలలతో కలుషితమవుతున్నాయి. అప్పుడపుడు అజయ్ కి ఈ నిద్ర శాశ్వతంగా ఉంటే యెంత బాగుండునూ అని అనిపించసాగింది, అదీ ఈ మధ్య ఇంటా బయటా ఈ వేధింపులు ఎక్కువ అవుతున్న కొద్దీ, ఆ కోరికే మరింత బలంగా కలగసాగింది. 


పంటి బిగువున ఆ అవమానాలను భరిస్తూ పదిహేను ఏళ్ళు బతుకు వెళ్లదీశాడు అజయ్, ఆవేశం ఆక్రోశం, కలగలిపి వొస్తున్నాయి అజయ్ కి. 


 'అసలే చీకటి, చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది, దారంతా గోతులు, గమ్యమేమో దూరం చేతిలో దీపం లేదు, తెగింపే ఆయుధంగా.. అని తిలక్ చెప్పిన ఆ ధెర్యంతోనే, ఒక రోజు జానకి తో మాట్లాడాలని గదిలోకి తీసుకెళ్లాడు. 


"అమ్మా ! నాకు ఏదో తెలియని ఇబ్బంది, నాకు పన్నేడేళ్లు వొచ్చేవరకు నేను అమ్మాయినే అనుకున్నాను, కానీ నేను అబ్బాయిననే విషయం నాకు అవగతం అవ్వటం లేదు, ఈ శరీరం నాది కాదు అని అనిపిస్తోంది, ఏంటో తప్పుడు శరీరంలో బంధించబడిన బుర్రలాగ వుంది నా పరిస్థితి " అని అంటూవుండగానే ఆశ్చర్యంతో జానకి

"అంటే నువ్వు 'గే ' అంటారు అదా?" అని అడిగింది. 


ఆ విషయం అజయ్ కి కూడా తెలీదు, కానీ తనకి ఏదో తేడా వుంది అన్నవిషయం మాత్రం అర్థం అయ్యింది, మౌనంగా తలదించుకున్నాడు అజయ్. 


వెంటనే జానకి అజయ్ ని దగ్గరకు హత్తుకుంది, అది ఊహించని పరిణామం అజయ్ కి. 

"బాధ పడకు ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం నేను వున్నాను " అంది జానకి. 


తన పరిస్థితి జానకి కి అర్థం అయ్యింది. ఇన్ని ప్రతికూల అంశాలలో, ఒకే ఒక్క సానుకూల అంశం, అర్థం చేసుకునే అమ్మ. అది కొండంత బలం ఇచ్చింది, చీకటిలో కాగడాల అమ్మ అండ దొరికింది. చాలా కాలానికి, ఆరోజు కాస్త నిద్రపోయాడు అజయ్. 


మర్నాడు, జానకి మెల్లిగా వొచ్చి స్కూల్ కి, తానూ వొస్తానని దూరంగా వున్న ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది అజయ్ ని, దగ్గరగా ఉంటే ఎవరైనా చూస్తారని భయమూ వుంది జానకికి. 

అజయ్ చెప్పిన మాటలు విన్న, ఆ వైద్యుడు ఒక్క క్షణం ఆలోచించి 

"దీనినే జెండర్ డిస్ఫొరియా అంటారు "


అది వినగానే, జానకి కి ఏమి అర్థం కాలేదు కానీ అజయ్ మోహంలో మాత్రం ఒక వెలుగు కనిపించింది, ఇంతకాలం తాను ఒక ఎలియాన్ లాగ ఒక్కడే అని అనుకున్నాడు, ఆ వైద్యుడు చెప్పేది ఏమిటి? ఏం చెయ్యాలని అజయ్ కి ఆలోచనలేదు, కానీ తన స్థితికి ఒక పేరు వుంది, అంటే సమస్య తానొక్కడిదే కాదు, తనలాగా చాలా మంది వున్నారు, వుంటారు అనే భావన అజయ్ కి ఆనందాన్ని కలిగించింది. తానూ ఇంతకాలం చదివిన రామాయణ భారత, భాగవతంలో వీటి ప్రస్తావన గుంరించి అప్పుడు అర్థం అయ్యింది. అజయ్ కి ఒక్కసారిగా తన తల మీదనుండి వెయ్యి ఏనుగుల బరువు దించినట్లు అనిపించింది అజయ్ కి. 


మర్నాడు ఆనందంగా కళ్లుతెరిచిన అజయ్ కి ఎదురుగా నాన్న రాంమూర్తి నిబడి వున్నాడు, అంతే ఒక్కఉదుటున లేచి నిలబడ్డాడు. 


“ఏంటి ఈ పాశ్చాత్య పోకడలు, మన ఇంటా వంటా ఉన్నాయా ఇలాంటివి ? వెధవలందరితోటి తిరిగి ఇలాంటివి నేర్చుకో ? ఆ ఇంగ్లీష్ సినిమాలు, యూట్యూబ్ వీడియోలు చూడటం ఆపు. నీ తక్కువ మార్కులకు ఇది సాకుగా చూపిద్దామని, నీ ఆలోచనైతే అది మానుకో.. అర్థం అయిందా?”. 


అని వన్ వే లో వెడుతున్న ఎక్స్ప్రెస్ బండిలాగా తిడుతూనే వున్నాడు రాంమూర్తి. 

అజయ్ ఒక చెవితో వింటూనే, ఆలోచిస్తున్నాడు, దూరంగా నిలబడి వున్న అమ్మని చూసాడు, ఆమె కళ్ళలో నిస్సహాయత ఉబికి వొస్తోంది. ఇప్పుడు కనక తాను మౌనంగా ఉంటే మాత్రం తనని ఎవరు రక్షించలేరు అన్న విషయం అర్థం అయ్యింది అజయ్ కి. 


"నాన్నా ! ఇది పాశ్చాత్య పోకడ కాదు నాన్నా.. ఇది మనకు కొత్తకాదు, మీరనుకునే పాశ్చాత్య సంస్కృతి కానే కాదు !" అజయ్ గొంతు స్థిరంగా వుంది, ఒక్క క్షణం రాంమూర్తి కి ఏమి అర్థం కాలేదు ఇంకా అలా చేష్టలుడిగి వింటున్నాడు. 


"మీరు రోజూ చదివే పురాణాలు, చూసే భక్తి కార్యక్రమాల్లో కూడా మా గురించి చెప్పారు నాన్నా " అజయ్ కి తెలియకుండానే తనని వేరు చేసుకున్నాడు 'మా గురించి ' అని చెప్పి. 


అజయ్ ఒక్క క్షణం ఊపిరి పీల్చుకొని "అర్జునుడు- బృహున్నల, అర్ధనారీశ్వర, ఆఱవన్, విష్ణువు మోహినీ అవతారం, ఇల్లే, అంబికా ఇలా చెప్పుకుంటూ పొతే మన పురాణాల్లో మాలాంటి వారి గురించి మీకు అర్థం అవటానికి అప్పుడే చేప్పారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇది నీ తప్పో.. నా తప్పో.., అమ్మ తప్పో.. కాదు నాన్నా ఇది సహజం, ఆడ ఎలాగో, మగ ఎలాగో, తృతీయ ప్రకృతి అంతే " అన్నాడు అజయ్. 


రాంమూర్తి మెదడు మొద్దుబారిపోయింది, అక్కడ ఎక్కువ సేపు ఉండలేక, తన మెదడులో జరిగే లక్ష విస్ఫోటనాలను భరిస్తూ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జానకి మాత్రం అజయ్ ని మరోసారి హత్తుకొని ఉండిపోయింది, అజయ్ కి చాలా శాంతంగా వుంది, అమ్మ ఆరోజు ఆ ధైర్యం ఇవ్వకపోయినా.. తనని ఆ వైద్యుడు దగ్గరకి తీసుకెళ్లక పోయిన.. ఈ రోజు ఇంత విశ్వాసంతో నాన్నా ముందు మాట్లాగలిగే వాడు కాదు అజయ్. ఆ కృతజ్ఞత తన కళ్ళ నీళ్లతోనే చెప్పాడు జానకికి అజయ్. 


నెలలు భారంగా గడుస్తున్నాయి.. నాన్నతో పెద్దగా మాటల్లేవు, కానీ అజయ్ మరింత ఆత్మా విశ్వాసం తో ఉండసాగాడు. రాంమూర్తి అన్యమస్కంగానే వున్నాడు, తిండి సరిగా ఎక్కటం లేదు, తనకే ఎందుకు ఇలా.. అని తెగ మధన పడిపోసాగాడు, తనకు బాధ, భయము ఎక్కువయ్యాయి, చాలామంది లాగే భయం వేయగానే దేవుడి గుడికి మరిన్నిసారులు వెళ్ళసాగాడు, చాలా సేపు అక్కడే గడిపేవాడు దేవుడి పై, అరిచేవాడు, అర్థించేవాడు తనని ఈ సమస్యా సాగరం నుంచి గట్టెక్కించమని, మళ్ళీ తన జీవితం రైలు పట్టాలు ఎక్కించమని. 


కొడుకుని చూసినప్పుడు చాలా జాలి వేసేది ఎంత కాదన్న కనీ, పెంచాడు. కానీ ఇంతలోనే అజయ్ పరిస్థితి గుర్తుకువొచ్చి అజయ్ ని దూరం పెట్టేవాడు. 


ఒకరోజు, గుడికి వెడుతూ ఉంటే, రాంమూర్తి, గుడి మెట్ల ముందు స్పృహ తప్పి పడిపోయాడు. 

కొంత సేపటికి రాంమూర్తి కి మెలుకవ వొచ్చింది, పక్కనే ఒక హిజ్రా చేతిలో డబ్బులు లెక్కపెట్టుకుంటూ వుంది, ఆ మొహాన్ని రాంమూర్తి చాలా సార్లు చూసాడు కానీ.. చేయి చాచగానే, ఆ చెయ్యి తనను ఎక్కడ తాకుతుందో అని, అక్కడి నుండి వడివడిగా తప్పుకు పోయే వాడు. 


"ఓహ్! మెలుకువ వొచ్చిందా సార్! కొంచెం మంచినీళ్లు తాగుతారా ?" అని ఆ హిజ్రా అడిగింది. 


మొదట ఏమీ అర్థం కాలేదు రాంమూర్తి కి, వెంటనే తేరుకొని.. అసహ్యించుకోబోయి.. ఒక్క క్షణం అజయ్ గుర్తుకు వొచ్చి ఆగిపోయాడు. 


"మంచి నీళ్లు తాగుతారా సార్, అఫ్ కోర్స్ మినరల్ వాటర్ " అంది ఆ హిజ్రా. 


ఇప్పుడిప్పుడే ఈ లోకంలోకి వొస్తున్న రామ్మూర్తి కి, ఆ హిజ్రా సంస్కారం, బాషా, ఇంగ్లీష్ పదాలు పలికే తీరు ఆశ్చర్యం కలిగించాయి, వారు మనుషులే అనే సంగతి మెల్లిగా గుర్తుకువొస్తోంది. 

"సరే నమ్మా! తాగుతాను " అన్నాడు. ఆమె చేతులతో ఇచ్చిన నీళ్లు తాగటం రాంమూర్తి కి చాలా పెద్ద విషయం, పాత రాంమూర్తి ఐతే వెంటనే విసుక్కోని అక్కడి నుండి వెళ్లిపోయేవాడు. 

ఇచ్నిన మంచి నీళ్లు తాగుతూ "చూస్తే చదువుకున్నట్టు వున్నావు, మరి ఇలా, నువ్వు ఏమీ అనుకోకపోతే.. " అని మాటలను మింగేశాడు. 


"అనుకోడానికేముంది సార్! మేమూ ఎవరయినా అడగాలని అనుకుంటాం, యెంత సేపు మేము అడగటమే కానీ, మమ్మల్ని ఎవరూ ఎప్పుడు ఏదీ అడగరు, ఓటు తో సహా “ అని విరక్తితో కూడిన నవ్వు ఒకటి నవ్వింది. 


"నేను, ఒక మంచి కుటుంబం లో పుట్టాను, పదిహేనుయేళ్లు వొచ్చేవరకు మంచి స్కూల్లోనే చదువుకున్నాను, ఆతరువాత మా ఇంట్లో నా విషయం తెలిసింది, బయటకు పంపించేశారు "

అని క్లుప్తంగా చెప్పింది ఏదో చిన్న విషయం లాగ. 


"పంపించేసారా? ఎందుకు ?"


"సంతోషించండి, చంపేయలేదు, అలా చంపేసినవారు కూడా వున్నారు, పరువు సార్! పరువు.. సొంత కూతురు తనకు ఇష్టంలేని వాడిని పెళ్లాడితేనే చంపేస్తుంటారు, మాలాంటి వాళ్ళు ఒక లెక్కా? ఈ జనాలు, బతికేదీ జనల కోసం, అనుక్షణం తన చుట్టూ వున్న వాళ్ళని ఆనందపరచటానికే ఆలోచిస్తారు తప్ప తమకి ఏది ఆనందం అని కాదు. "


"ఆ తరువాత ?" అన్నాడు. తన కళ్ళలో పేరుకున్న సన్నటి నీటి పొరతో అప్పటికే రాంమూర్తి చూపు మసగబారింది. 


"ఇంకేముంది, నేను రోడ్డున పడ్డాను, మాలాంటి వాళ్లకు పనులు ఎవరిస్తారు, ఇచ్చినా ఆ వేధింపులు తట్టుకోలేము, అందుకే కలిసికట్టుగా మేము ఇలా రోడ్డు మీద, గుడి దగ్గర అడుక్కుంటూ ఉంటాము. "


రాంమూర్తి కన్నీటి పొర చిరిగి ధారగా రావటం గమనించిన ఆమె "ఏమైంది సార్, ఇంత, వివరంగా మా గురించి అడుగుతున్నారు, మీ ఇంట్లో ఎవరైనా మా లా.. ? ఏమీ అనుకోకండి సార్ అలా అనిపించింది. "


అలా ఎలా తాను కనిపెట్టిందో రాంమూర్తికి అర్థం కాలేదు. 


"అవును, మా అబ్బాయీ ! తాను అబ్బాయిని కాదంటున్నాడు.. నేను ఒక తండ్రిగా విఫలం అయ్యాను వాడిని ఒక మగ వాడిలాగా కన్నాను కాని పెంచ లేక పోయాను! ఇప్పుడు వాడిని ఎలాగైనా మళ్ళీ మార్చాలని నా బాధంతా.. " అని ఆకాశం వైపు చూస్తూ వుండిపోయాడు. 


"అవును సార్ ! మీరు నిజంగా విఫలం అయ్యారు.. మీ అబ్బాయిని, మగ పిల్లాడిలాగా పెంచలేనందుకు కాదు, మీ అబ్బాయిని అర్థం చేసుకోనందుకు మీరు నిజం గానే విఫలం అయ్యేరు. ఇంకా అవుతున్నారు కూడా.. ఇంకా ఎలా మార్చాలి అని ఆలోచిస్తున్నారే తప్ప, ఎలా నిజాన్ని అంగీకరించాలని ఆలోచించటంలేదు చూడండి, ఇప్పుడు మీరు నిజంగానే విఫలం అయ్యారు. తండ్రిగా, కొడుకును ప్రేమించడం, ఆదరించడం మీ ధర్మం, కర్తవ్యం. చూస్తే పెద్ద పెద్ద చదువులూ, శాస్త్రాలు చదువుకున్నవారిలాగా వున్నారు మీరే ఆలోచించండి.. " అని అక్కడనుండి ఆమె వెళ్ళిపోబోతుండగా, తన చేతిలో ఒక ఐదు వొందల నోటు పెట్టబోయాడు రాంమూర్తి.


దానిని సున్నితంగా తిరస్కరించి, ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయింది ఆ హిజ్రా. 

 కానీ.. ఆ నవ్వు, రాంమూర్తి చెంపను తాకింది. ఆ స్పర్శ.. చివుక్కుమంది, హిజ్రా లు అంటే డబ్బులు అడుక్కోవడమే నా ? అన్నట్టు ప్రశ్నించింది. తాను గుంపులో కైతే వెళ్ళిపోయింది కానీ, తన మాటలను రాంమూర్తి దగ్గరే ఉంచేసింది. 


ఆరోజు చాలా సేపు ఏవేవో ఆలోచనలు రాంమూర్తి కి. తప్పనిసరై ఇంటికి వెళ్ళాడు. 

ఇంకా భారంగా ఇంకొన్ని రోజులు గడిచాయి.. 

ఒక రోజు, అజయ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే, రాంమూర్తి అజయ్ కోసం హాల్లో ఎదురుచూస్తున్నాడు. 


ఎప్పటిలాగే అజయ్, తలదించుకుని వెళ్లిపోతుండగా 

"అజయ్, నువ్వు అలా తల దించుకోవాల్సిన పని లేదు, అని నాకు కొంచెం మెల్లిగా అర్థం అయ్యింది, ఎంతైనా మీ అమ్మంత తెలివైన వాడిని కాదు కదా " అని నవ్వేసాడు వాతావరణాన్ని తేలికపరచటానికి.


అజయ్ ను దగ్గరకు తీసుకొని, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. రాంమూర్తి, తన చేతిలోకి అజయ్ చెయ్యి తీసుకొని "చెప్పు అజయ్, నీ కోసం, నీ ఆనందంకోసం మేము ఏమిచెయ్యటానికైనా సిద్దమే ? మాకు వేరే ప్రపంచం తో కానీ వేరే లోకంతో కానీ పనిలేదు, నీ సంతోషమే మా లోకం, నీ ఆనందమే మా ప్రపంచం " అన్నాడు రాంమూర్తి కళ్ళలో వొస్తున్న నీటిని ఆపుకుంటూ.


ఆ మాట వింటూనే జానకి రాంమూర్తి పక్కకు వొచ్చి కూర్చుంది ఆనంద భాష్పాలతో. తల్లీదండ్రీ మద్దతును ఉంటే ముల్లోకాలను ఎదిరించవచ్చు అని అజయ్ కి ఆ క్షణం అర్థం అయ్యింది. 

 ఆ మర్నాడు దగ్గర్లోని బ్యాంకు మేనేజర్ గదిలో రాంమూర్తి, అజయ్. 


"రాంమూర్తి గారు, మీరేమిటండి ఎవరైనా పిల్లాడి చదువుకో, మరోదానికో లోన్ అడుగుతారు కానీ ఇలాంటి ఆపరేషన్ కి లోన్ అడుగుతారా అన్నాడు బ్యాంకు మేనేజర్ యధాలాపంగా నవ్వేస్తూ. ఆ మాటకి రామూర్తికి మనస్సు చివుక్కుమంది. అజయ్ రోజు ఇలాంటివి ఎన్ని అనుభవిస్తున్నాడో అనుకున్నాడు.


అప్పటికే అజయ్ కొంచెం కోపంగా. 


"సార్ ! 140కోట్ల భారతీయ జనాభాలో, కేవలం 5 లక్షల మంది మాత్రమే ట్రాన్స్‌జెండర్లుగా వున్నారు. వారిని ఓటర్లుగా గుర్తించాడనికే స్వతంత్రం వొచ్చినప్పటి నుండి 45 సంవత్సరాలు పట్టింది, ఇంకా వీరు మనుషులే, వీరికి మానసిక, శారీరక అవసరాలు ఉంటాయి అని సుప్రీమ్ కోర్ట్ కి 2023 వరకూ తెలియలేదు, మీకు తెలియటానికి ఇంకా సమయం పడుతుంది లెండి " అని అజయ్ లేచి నిలబడ్డాడు. 


కొంచెం తత్తరపాటు పడిన మేనేజర్, కొద్దిగా సర్దుకొని, అజయ్ ని కూర్చోమని సైగ చేసాడు 

"అంటే రాంమూర్తి గారు, ఈ సర్జరీ కి అని వేరే లోన్ ఏమీ లేదు. మీరు పర్సనల్ లోన్ తీసుకోండి. కానీ వడ్డీ కొంచెం ఎక్కువ “, అన్నాడు మెల్లిగా. బ్యాంకు మేనేజర్ రాంమూర్తి ని చూసి మాట్లాడుతున్నాడు కానీ, ట్రాన్స్‌జెండర్ల అప్లికేషన్ చూసే రిజెక్ట్ చేసే బ్యాంకులు చాలా వున్నాయి, చాలా సందర్భాలు జరిగాయి. ఇప్పటికి వారు పోరాడుతూనే వున్నారు. 

రాంమూర్తి సరే అని, సంతకాలు చేసి బ్యాంకు బయటకు వొచ్చాడు. 


నాన్న, మీరు వెళ్ళండి, నేను కాలేజీకి వెళ్లి ఇంటికి వొస్తా అన్నాడు అజయ్. 

రాంమూర్తి ఇంటిదారి పట్టాడు. మదిలో ఎన్నెన్నో ఆలోచనలు, అసలు మనిషి లింగానికి ఎందుకు ఇంత ప్రాధ్యాన్యత ? ఎందుకు ఈ పత్రాల్లో ఉంచాలి ? దానికి, గుర్తింపుకి ఏమిటి సంబంధం ?. సర్టిఫికెట్ లో సన్ అఫ్ ఎందుకు ఉండాలి?. ఎవరి జెండర్ వారే నిర్ణయించుకునే హక్కు ఉండాలి. పుట్టగానే వేరే వాళ్ళు నిర్ణయించకుండా, పద్దెనిమిది ఏళ్ళు వొచ్చాక ఓటుహక్కుతో పాటు వాళ్ళ జెండర్ ని కూడా నిర్ణయించుకునే హక్కు వారికే వదిలెయ్యాలి. అలంటి ఆలోచనలతో ఇంటికి చేరుకున్నాడు రాంమూర్తి. 


ఆ రోజునుంచి ముగ్గురూ కలసి వారికి ఎదురెయ్యి అన్ని సమస్యలను ఎదుర్కొసాగారు. తలుపు తెరిచిన శబ్దానికి, ప్రస్తుతానికి వచ్చాడు రాంమూర్తి. 

***

చక్కని చీరకట్టుతో, నుదిటిపైనా వున్న బొట్టు చెరగకుండా చెమటను, మణికట్టుతో తుడుచుకుంటూ, వొస్తున్న తన పిల్లాడిని, కాదు.. పిల్లని.. కాదు, తన 'బిడ్డని' చూస్తున్న రాంమూర్తికి గర్వంగా వుంది. తృప్తిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వదిలాడు అరకొరగా మిగిలిన తనలోని కరడుగట్టిన భావాల్ని కూడా. 


“జనిత కోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్ఛతి |అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతః -అంటే, జన్మనిచ్చేవాడు, దీక్ష చేసేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, అన్నం పెట్టేవాడు, భయం నుండి రక్షించేవాడు. ఈ ఐదు, తండ్రి యొక్క లక్షణాలు” అని అదే గురువుగారు, అదే టీవీ లో చెపుతూ ఉండగానే రాంమూర్తి ‘జెండర్ డిస్ఫొరియా ’ మీద ఉపన్యసించడానికి యూనివర్సిటీ కి బయలుదేరాడు. 


ఇహ, పరలోకల్లో మనల్ని ఎవరు ఆదుకుంటారూ? అనే దానికంటే మనం ఎవరిని ఆదుకున్నాము అన్నదే ముఖ్యం. మన చేష్టలు ఇహములో మిగలాలి కానీ మన అంశలు కాదు అని అర్థం అవ్వనివారు, అజ్ఞానానికి- జ్ఞానానికి, సున్నాకి-ఒకటికి మధ్య త్రిశంకుములో కొట్టుమిట్టులాడుతూనే వుంటారు, అపరాజిత వంటివాళ్లను గేలి చేస్తూనే వుంటారు. 


అపరాజిత! అవును.. ఆమె, తనలోని అతడినే కాదు, లోకాన్నీ జయించింది. 



*****

కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక

 డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE  హైదరాబాద్ లో  సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను  నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు  ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో  కథలు రాయటం కూడా మొదలుపెట్టారు.  "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను,  యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు  అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.


Comments


bottom of page