top of page

ఆమె నవ్వింది

Writer: Prameela Sarma VeluriPrameela Sarma Veluri

#VeluriPrameelaSarma, #వేలూరిప్రమీలాశర్మ, #AmeNavvindi, #ఆమెనవ్వింది, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ame Navvindi - New Telugu Story Written By - Veluri Prameela Sarma

Published In manatelugukathalu.com On 22/03/2025

ఆమె నవ్వింది - తెలుగు కథ

రచన: వేలూరి ప్రమీలాశర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



‘చాలా అలసటగా ఉంది. ఆఫీసులో పని ఒత్తిడికి తోడు ట్రాఫిక్ వలయంలో చిక్కుకొని ఇల్లు చేరడానికి రెండు గంటలు సమయం పడుతోంది. దగ్గర్లో ఏదైనా ఇల్లు అద్దెకి దొరికితే బాగుణ్ణు.. ఈ తిరుగుడు తప్పుతుంది’ అనుకుంటూ ఇంటికి చేరగానే సోఫాలో చేరబడి నిస్సత్తువుగా ఉండడంతో కళ్ళు మూసుకున్నాడు దేవ్. 


కడుపులో ఆకలికి పేగులు చిన్నగా శబ్దం చేస్తూ మెల్లగా తట్టి లేపినట్టయ్యి బద్ధకంగా కదిలాడు. ఫ్రిడ్జ్ డోర్ తీసి, ముందు రోజు చరిత ఊరికి వెళుతూ బాక్స్ లో మూతపెట్టి ఉంచిన ఆలూ మటర్ కూర వెచ్చ చేసుకోడానికి ఓవన్ వైపు దారితీసాడు. కూర వేడయ్యేలోపు, సూపర్ మార్కెట్ నించి తెచ్చుకున్న ఇన్స్టంట్ పరోటాలు కవర్ ఓపెన్ చేసి పెనం మీద వేసి వెచ్చచేసుకున్నాడు. స్నానం చేసి వచ్చి టీవీ పెట్టుకుని చూస్తూ ప్లేట్ లోని పరోటాలు తిని ఆ పూటకి ఆకలి తీరిందనిపించుకుని చెయ్యి కడుక్కున్నాడు. రాత్రి పన్నెండయ్యేదాకా ఛానల్స్ మారుస్తూ గడిపేసి, తెల్లారితే ఆఫీస్ కి వెళ్ళక తప్పదనుకుంటూ నిద్రకుపక్రమించాడు దేవ్. 


పదో నిముషానికి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రెండో ఝాము ముగిసేసరికి ఎవరో స్త్రీ రోదిస్తున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి, చుట్టూ కలయచూసాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. దేవ్ కి ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి. లేచి కిటికీ తలుపులు వేద్దామని వెళ్ళి చీకట్లోకి చూసిన అతనికి దూరంగా చెట్టుకింద వెన్నెల్లో కూచుని ఏడుస్తున్న స్త్రీ మూర్తి ఆకారం లీలగా కనిపించి వెన్నులో వణుకు మొదలయ్యింది. 


ఆరు నెలల ముందు వరకూ ఆ ప్రాంతంలో కొన్ని మావిడి, కొబ్బరిచెట్ల తోటలు ఉండేవి. కానీ రియల్ ఎస్టేట్ భూములకి ఆ తోటలు అమ్ముడుపోవడంతో వాటిని లే ఔట్లుగా మార్చడానికి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసి చదును చేసేసారు. ఓ పక్కగా ఉన్న మావిడిచెట్టునొకదానిని మాత్రం కొట్టకుండా ఉంచారు. ఆ చెట్టుకిందే ఇప్పుడు ఆమె కూర్చునిఉంది. కొద్దిసేపటికి చూస్తుండగానే ఆ ఆకారం అక్కడ్నుంచి మాయమవ్వడంతో దేవ్ కొంత అయోమయానికి గురయ్యాడు. 


ఆమె రూపం కళ్ళల్లోంచి చెరిగిపోకుండా గట్టిగా కనురెప్పలు మూసుకున్నాడు. కానీ కేవలం ఆమె కురులు మాత్రమే అతని మస్తిష్కంలో ముద్రించబడ్డాయి. అది కూడా వెన్నెల కాంతిలో తనకు కనిపించినట్టుగా కాంతివంతంగా లేవు. విచిత్రంగా చెదిరినట్టున్న ఆ కురులు ఎండిపోయి జీవం లేనట్టుగా అగుపించసాగాయి. అంతకుమించి దేవ్ కి ఏమీ గుర్తులేదు. తెల్లారి నిద్రలేచాక రాత్రి తాను చూసినది గుర్తుకుతెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమె రూపం జ్ఞప్తికి రాలేదు. కలగన్నానేమోననిపించడంతో అక్కడితో ఆ విషయం గురించి ఆలోచించడం మానేశాడు. 

******

“ఏవండీ! చాలా సంవత్సరాల తర్వాత పుట్టింటికొచ్చాను. ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలనుంది. అమ్మ కూడా ఉండమని చాలా గొడవచేస్తోంది. జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని ఒక్క వారం రోజులు గడుపుకోకూడదా.. ప్లీజ్! ప్లీజ్!! లంచ్ ఎలాగూ ఆఫీస్ క్యాంటీన్ లో తినేస్తారుగా. రాత్రి ఒక్క పూటకేగా.. అడ్జస్ట్ అవ్వండి. మా బంగారం కదూ!” ఫోన్ లో భర్తను బ్రతిమాలుతున్న చరిత.. పెళ్ళైన ఈ పద్ధెనిమిదేళ్లలో చాలా తక్కువసార్లు పుట్టింటికి వెళ్ళింది. ఆమె కోరుకున్నట్టే మరో వారం రోజులు పుట్టింట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు దేవ్. 


చరితా, దేవ్ లది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా, పెళ్లయ్యాక ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదించిన ఆ జంట అన్యోన్యతకు గుర్తుగా నందన్ పుట్టాడు. సంసారం బాధ్యతల్లో పడి ఇన్నేళ్ళుగా పుట్టింటికి కూడా ఎక్కువగా వెళ్లకుండా గడిపేసింది చరిత. నందన్ కి ఇంజనీరింగ్ సీటు గోవాలో రావడంతో అక్కడికి పంపించక తప్పలేదు. 


పుట్టినప్పట్నుంచీ సిటీలోనే పెరిగిన నందన్ కి గోవాలో హాస్టల్ లో ఉండడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇన్నాళ్ళూ తమతోపాటు ఉన్న కొడుకు.. పై చదువులకని దూరంగా వెళ్లిపోవడంతో ఇప్పుడు చరితకి కొంచెం తీరిక దొరికినట్లయ్యింది. భర్త కూడా ఉదయం ఎనిమిదికి బయల్దేరి ఆఫీస్ కి వెళ్లినవాడు, రాత్రి ఎనిమిదికి కానీ ఇంటికి చేరకపోతుండడంతో ఇంట్లో ఒక్కదానికీ ఏమీ తోచేది కాదు. 


తల్లీ తండ్రీ పెద్దవాళ్లయిపోవడంతో ఓసారి వాళ్ళని చూసివస్తానంటూ తాముంటున్న సిటీకి రెండువందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పల్లెటూరికి బయల్దేరింది. అక్కడికి వెళ్ళాక మరో వారం రోజులు ఉంటే బాగుణ్ణనిపించి తన మనసులోమాట భర్త ముందుంచింది. 


నాలుగు రోజులు బాగానే గడిచినా అలవాటులేని బయటి ఫుడ్ తెప్పించుకు తినడంవల్ల దేవ్ ఆరోగ్యం కొంచెం పాడయ్యింది. స్నేహితుడి సాయంతో హాస్పిటల్ లో చేరినా.. ఆ విషయం చరితకి తెలియనివ్వలేదు. రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టుకుని, కోలుకున్నాక తిరిగి యధావిధిగా విధుల్లో చేరాడు. కానీ బాగా నీరసంగా ఉండడంతో కొద్ది రోజులు డ్రైవింగ్ కి దూరంగా ఉండమన్న డాక్టర్ సలహామేరకు క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్ కి వెళ్తున్నాడు. 


శుక్రవారం కావడంతో పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసేవరకూ ఆఫీసులోనే ఉండి ఇంటికి లేటుగా బయలుదేరాడు. తాను వెళుతున్న క్యాబ్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాహనాల మధ్య నుంచి నడుస్తూ వెళుతున్న ఆ స్త్రీమూర్తి రూపాన్ని చూసి దేవ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆమె ముఖం ధూళితోనిండిన మృత కణాలతో జీవం లేకుండా ఉంది. రూపురేఖలు స్పష్టంగా కనపడకపోయినా నిండా దిగులు ఆవరించి ఉన్న ఆమె ముఖం మబ్బుతెరలు కమ్మడం వల్ల కాంతిని కోల్పోయినట్టు గోచరించింది. సిగ్నల్ క్లియర్ అయ్యే టైమ్ కి ఎంత వెతికినా అక్కడ ఆమె కనిపించలేదు. 

‘ఎవరయ్యుంటుంది ఈమె? ఎందుకు నాకు మాత్రమే కనిపిస్తోంది? గతంలో ఈమెను చూసిన జ్ఞాపకం కూడా లేదు. అంతా ఏదో కలలో జరుగుతున్నట్టుగా ఉంది. ’ అనుకుంటూ ఇల్లు చేరాడు దేవ్. కానీ ఈ విషయం ఎవరితో చెప్పినా తనను ఒక పిచ్చివాడిగా పరిగణిస్తారన్న సంశయంతో ఆమె గురించి ఎవరికీ చెప్పలేదు. చరిత లేని ఆ ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉండటం వల్ల రాత్రులు నిద్ర పట్టేదికాదు. చరిత తిరిగివచ్చాక ఈ విషయాలన్నీ తనతో చెప్పవచ్చని మిన్నకుండిపోయాడు. 

*******

ఆదివారం కావడంతో ఊరు నుంచి తిరిగివస్తున్న చరితను రిసీవ్ చేసుకోడానికి రైల్వే స్టేషన్ కి బయలుదేరాడు దేవ్. ట్రైన్ రావడానికి ఇంకా పావుగంట సమయం ఉంది. ప్లాట్ ఫామ్ పై అటూఇటూ తిరుగుతూ దూరంగా మరో ట్రాక్ నిర్మాణం కోసం కొండను తవ్వుతున్న కూలీలవైపు దృష్టి సారించాడు. ఆశ్చర్యంగా అక్కడ ఆమె మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె ముఖం చూడగలిగాడు. కానీ దిగులుతో కనురెప్పల చివర్లు కిందకి వాలి ఉన్నాయి. 


నుదుటిపై ముడతలు పడినట్టుగా ఉన్న గీతలు ఆమెలోని అసహనాన్ని సూచిస్తున్నాయి. వేదనతో ఉన్న ఆమె ముఖంపై అక్కడక్కడా గాయం తాలుకు గుర్తులున్నాయి. ప్లాట్ఫామ్ చివరి వరకు వచ్చి, ట్రాక్ దాటి ఆమె నుంచున్న వైపుకి వెళదామని కదలబోతున్నవాడల్లా ట్రైన్ వస్తున్న అనౌన్స్మెంట్ వినిపించడంతో మళ్లీ ప్లాట్ఫామ్ మీదకి రాక తప్పలేదు. వెనుదిరిగి చూసేసరికి ఆమె అక్కడ లేదు. తనను అయోమయానికి గురి చేస్తున్న ఆమె ఆలోచనల నుంచి బయటపడి.. ట్రైన్ దిగిన చరితను తీసుకుని ఇంటికి వెళ్లడానికి కారులో బయలుదేరాడు. 


భర్త ముభావంగా ఉండడాన్ని గమనించినా ఇన్నాళ్లూ తాను దూరంగా ఉండటం వల్ల బెంగతో అలా ఉన్నాడనుకుని సరిపెట్టుకుంది చరిత. కానీ రెండు రోజులు గడిచినా భర్త అలా అన్యమనస్కంగానే ఉండడంతో కారణం ఏమై ఉంటుందో తెలియక ఆలోచనలోపడింది చరిత. 

 “ఏవండీ! ఇంత అవస్థపడి రోజూ ఉద్యోగానికి వెళ్లడం ఈ వయసులో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మీరేమీ అనుకోనంటే ఒక్క విషయం చెప్పనా! 


మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నాన్నగారితో కలిసి మా తోటలూ పొలాలూ చూడడానికి వెళ్ళాను. నిజం చెప్పాలంటే ఇన్నేళ్లుగా ఉరుకులు పరుగులతో అలసిపోయిన నాకు అక్కడికి వెళ్ళగానే ఎంతో హాయిగా అనిపించింది. చాలా రీఛార్జ్ అయ్యాను. ఇక్కడ ఉన్నప్పుడు మోకాళ్ళు నొప్పులుగా అనిపించేవి.. మైగ్రెయిన్ ఎక్కువగా ఉండేది. కానీ ఎందుకో అక్కడ ఉన్నంత సేపూ నన్ను అనారోగ్య సమస్యలేవీ బాధించలేదు. చాలా సంవత్సరాల తర్వాత చాలా ప్రశాంతంగా గడిపాను. 


ఇక్కడ ఉంటే ఉద్యోగం ఒత్తిడి వల్ల మీకూ బిపి, షుగర్ కనిపిస్తున్నాయి. చాలా రెస్ట్ లెస్ గా కనిపిస్తున్నారండి. ” బత్తాయిరసం తీసి గ్లాసుతో భర్త చేతికి అందిస్తూ, అలసటకు అతని నుదుటిపై పట్టిన స్వేదాన్ని చీర చెంగుతో అద్దుతూ చెప్పింది చరిత. 

“ఈ ఉద్యోగం.. టెన్షన్లు ఉన్నంతవరకూ ఇవన్నీ తప్పవు చరితా! టాబ్లెట్స్ వేసుకుంటున్నానుగా అన్నీ అవే సర్దుకుంటాయి. ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటే రోజెలా గడుస్తుంది? నందన్ స్థిరపడేవరకూ ఈ బాధ్యతల నుంచి విరామం తీసుకోలేను. కాలంతో పాటు పరిగెడుతూ సాగిపోవడమే. తప్పదు” అంటున్న భర్తతో.. 


“నేను వచ్చేసేముందు నాన్న నన్ను ఒక మాట అడిగారు.. ‘యాభై ఐదేళ్లు పైపడ్డాక ఇంకా పరుగులు పెడుతూ ఉద్యోగం చేయడం అల్లుడు గారికి అవసరమా తల్లీ? నాకున్న ఈ ఆస్తికి నువ్వు ఒక్కదానివే వారసురాలివి. నాకా వయసు పైబడింది. ఈ తోటలూ పంట పొలాలూ చూసుకునే ఓపిక తగ్గిపోయింది. ఈ బాధ్యతలన్నీ అల్లుడు గారికి అప్పగించాలనుకుంటున్నాను. ముందు నీకో మాటచెబితే మంచిదనిపించింది. ఏమంటావ్ చరితా?’ అని అడిగారు. 


‘ఆయన నిర్ణయం కూడా అడిగి తెలుసుకోవాలి కదా నాన్నా!’ అంటూ మాట దాటేసాను. ఇప్పుడు చెప్పండి.. నాన్నగారు అడిగినట్టు పంటసాగు బాధ్యత మనమెందుకు తీసుకోకూడదు? ఆదాయానికి లోటు లేనప్పుడు ఈ ఉద్యోగం మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించి నాన్నకి ఫోన్ చేసి మాట్లాడకూడదా?” అంటూ సమాధానం కోసం భర్త ముఖంలోకి చూసింది చరిత. 


చరిత చెప్పింది సబబుగానే అనిపించినా.. ఓ నిర్ణయం తీసుకోవడానికి రెండు నెలల సమయం తీసుకున్నాడు దేవ్. రెండు నెలల తర్వాత.. చేస్తున్న ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని, చరితా వాళ్ళ ఊరికి మకాం మార్చాడు. చుట్టూ పచ్చని ప్రకృతిలో పల్లె వాతావరణంలో గడపడం దేవ్ కి కూడా చాలా నచ్చింది. అక్కడికి వెళ్లాక అతని ఆరోగ్యం కూడా కుదుటపడింది. మావగారితో కలిసి పొలానికీ, తోటలకీ వెళుతూ పంటసాగు విషయంగా పూర్తి అవగాహనకు వచ్చాడు. పొలం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చెరువుగట్టున కూర్చుని చెట్ల వెనుకనుంచి కిందకి జారుతున్నట్టుండే అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడ్డం అంటే దేవ్ కి చాలా ఇష్టం. ఆ ఊరికి వచ్చాక దేవ్ ఆలోచనలలలోనూ చాలా మార్పు వచ్చింది. 


అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుకున్న చరితను ప్రోత్సహించి హార్టికల్చర్ పై దృష్టి పెట్టేలా చేశాడు. కొత్త కొత్త టెక్నిక్స్ తో పంట దిగుబడిని పెంచే దిశగా తోటి రైతులకు సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు ఆ దంపతులు. సహజ సిద్ధమైన కంపోస్ట్ ఎరువుల వాడకంతో పండ్ల తోటల దిగుబడి మరింత పెరిగింది. వాటితోపాటు కాయగూరలను కూడా పండిస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. 


వరిపంట కోతకు వచ్చిన తర్వాత.. మంచె పైకెక్కి నుంచుని ధాన్యం ఎగరపోస్తున్న కూలీలతో కింద నుంచుని మాట్లాడుతున్నాడు దేవ్. గాలివాటుకి ధాన్యం పొల్లు దూరంగా ఎగిరి పడుతోంటే.. ముత్యపు చినుకులు రాలుతున్నట్టుగా అనిపించి సంభ్రమంగా చూస్తున్నాడు దేవ్. పలుచని ఆ తెరల మధ్యనుంచి అటువైపున ఉన్న ఈత ఈనిన పచ్చని పైరులోని కంకులు చల్లని పిల్లగాలి స్పర్శకి ఆనందంతో తలాడిస్తూ ఊగుతున్నాయి. అందమైన పచ్చని పాన్పులాంటి ఆ మొక్కలను చీల్చుకుంటూ మందహాస వదనంతో ‘ఆమె’ తనవైపు రావడం గమనించి ఆనందాశ్చర్యాలతో కళ్ళు పెద్దవిచేసి అటువైపే చూస్తున్నాడు దేవ్. పైన ధాన్యం ఎగరపోస్తున్న కూలీల వైపు తిరిగి “ఆమె నవ్వింది.. ఆమె న వ్వు తోం ది.. ఆమె ఎవరు?” అని అడిగాడు. 


“ఎవరు సామీ? ఆడ ఎవరూ లేరే!?” అంటున్న కూలీతో.. “అదుగో ఆ పైరు మధ్యన నుంచుని ఆనందంగా తలాడిస్తూ నవ్వుతోందే! ఆ మె! ఆమె ఎవరు??” మళ్లీ అడిగాడు దేవ్. 


“ఆడ ఎవరూ లేరు సామీ! ప్రకృతి తల్లిని సూసి బమ పడినట్టున్నారు” మంచె పై నుంచునే సమాధానం చెప్పాడు ఆ కూలి. 


‘అం టే.. ఇన్నాళ్లూ నాకు ఎదురుపడింది.. ఆ “ప్రకృతి కాంత” అన్నమాట. మై గాడ్!! మనకి ఇన్ని వరాలిచ్చిన ఆ తల్లిని, మన స్వార్థం కోసం ఎన్ని తూట్లు పొడుస్తున్నాం!! ప్రకృతిని నాశనం చేస్తూ మన అంతానికి మనమే పునాది వేసుకుంటున్నాం. బిడ్డలు కాలితో తన గుండెలపై తన్నుతుంటే.. ఓర్చుకుంటున్న ఆ తల్లి రోదనా.. ఇన్ని రోజులుగా నన్ను వెంటాడుతోంది. నీకు హాని కలిగిస్తున్న ఈ మనుష్య జాతిని మన్నించు తల్లీ!!” అంటూ కన్నీటితో చేతులెత్తి దణ్ణం పెడుతూ.. మందహాసంతో చూస్తున్న ఆ తల్లిని వేడుకున్నాడు దేవ్. 


 —----సమాప్తం—----


వేలూరి ప్రమీలాశర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వేలూరి ప్రమీలాశర్మ

నమస్తే!

సాహితీ ప్రయాణం : విశాఖ ఆకాశవాణిలో అనౌన్సర్ గా, ప్రాంతీయ వార్తా చదువరిగా 20 సం. సేవలందించిన నేను, 2004 లో ఆకాశవాణి కి అర్థగంట నాటికను వ్రాసి ఇచ్చాను. అడపాదడపా రచనలు చేస్తూ ఇంతవరకూ ఆకాశవాణిలో నాటికలు (11), కథానికలు (16), ధారావాహికలు(2) ప్రసారానికి నోచుకున్నాయి. వీటితోపాటు 2021 నుంచి అంటే మూడు సం. లుగా వివిధ పత్రికలకు కథలు, సీరియల్స్ వ్రాస్తున్నాను. దాదాపు 160 వరకూ నా రచనలు ప్రచురణకు నోచుకున్నవి. ఇంతవరకూ పోటీలలో బహుమతులు, మరియు సా. ప్ర. కు ఎంపికైనవి 24 కథలు. వీటిలో కేవలం 2024 సం. లోనే 14 కథలు పోటీలలో నిలబడ్డాయి అని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

రెండు నవలికలు, రెండు శతకాలు, త్రిశతిగా రామాయణం, శివోహం… నక్షత్ర మాలికలు... ఇలా నా రచనలు కొనసాగుతున్నాయి.


వృత్తిరీత్యా న్యూస్ రీడర్ గా ఉన్న నాకు 2016 సం. కి గాను VJF బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు దక్కింది.

మొదటి కథల సంపుటి "కడలి కెరటాలు" 2022 సం. కి గాను శ్రీ అడుసుమిల్లి అనిల్ కుమార్ స్మారక పురస్కారానికి ఎంపిక కాగా, కథల పోటీలలో 2024 సం. లో "వేలంపాట" కథకు శ్రీ కంచిపాటి గురుమూర్తి స్మారక పురస్కారం దక్కింది.

వివిధ సాహితీ ప్రక్రియలలో కొనసాగుతూ గజల్ సౌరభాలు పుస్తకం కూడా ముద్రించాను. నేను రచించిన భక్తి గీతాలు ఆల్బమ్ గా రూపొందించే యోచనలో ఉన్నాను.

ధన్యవాదములు. 🙏🏼

ఇట్లు,

వేలూరి ప్రమీలాశర్మ.




 
 
 

1 Comment



@prameelasarma970

• 5 hours ago (edited)

నా రచనను ఎంతో బాగా చదివి వినిపించారు. ధన్యవాదములు సీతారాం గారూ

Like
bottom of page