కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Ame Vijetha' Written By A. Annapurna
రచన: A. అన్నపూర్ణ
తండ్రి మాటకు ఎదురు చెప్పలేక ఇష్టం లేని పెళ్లి చేసుకుంది హిమనీ.
కానీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది.
పట్టుదలతో అనుకున్నది సాధించింది.
మహిళలకు ఆదర్శప్రాయమైన హిమనీ కథను చక్కగా రాశారు ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు.
''అమ్మా! నేను బైపీసి గ్రూపు తీసుకుంటాను. నాన్నగారికి చెప్పు''అంది హిమనీ.
''మన మాట వింటారా తల్లీ… చెప్పి చూస్తాను ..” అంటూ భర్త రవీంద్రతో చెప్పింది తులసి.
''హిమకి ఎం పీ సి ఇంట్రెస్ట్ లేదు, వద్దు అంటోంది …” కూతురు అప్లికేషన్ పూర్తి చేస్తున్న భర్తకి చెప్పింది.
''అది చిన్నపిల్ల. దానికి తెలియదు. మెడిసిన్ చదివే వాళ్ళకి తప్ప ఆ గ్రూపు ఎందుకూ పనికిరాదు.
అదే ఎం పీ సి ఐతే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ లో ఐనా చేరవచ్చు.'' అన్నాడు రవీంద్ర.
''అదే.. మెడిసిన్ చదవాలనే దాని కోరిక ..." అంది తులసి.
''చూడు! మెడికల్ కాలేజీలో సీట్లు తక్కువ. ఎలాగో వచ్చిందే అనుకో… PG చేస్తేనే వేల్యూ ఉంటుంది...... అదంతా చాల ఖర్చుతో ఉంటుంది. నాకా తాహతు లేదు'' అన్నాడు రవీంద్ర.
''ఈ నాన్న నన్ను అర్థం చేసుకోడు. నేను బాగా చదివి సీటు తెచ్చుకుంటాను. నాకు నమ్మకం వుంది... కానీ నామాట పట్టించుకోడు…” అని బాధపడిన హిమ తండ్రి మీద భయంతో ఎం పీ సి గ్రూప్ తీసుకుంది.
తండ్రి చెప్పినట్టే ఇంజినీరింగ్ పూర్తిచేసింది.
హిమ క్లాస్ మేట్స్ హయ్యర్ స్టడీస్ కి అమెరికా వెడుతున్నారు.
మళ్ళీ తండ్రిని అడిగింది....వెళ్ళనిస్తారనే నమ్మకం లేకపోయినా.
''హిమా .... నువ్వు అమెరికా వెడితే MS పూర్తిచేసి ఉద్యోగంలో చేరుతావు.. నీ సంపాదన, స్వతంత్రం.. అంతా నీకు బాగానే ఉంటుంది. కానీ పెళ్లి ఆలస్యమవుతుంది. లేదా ఎవరినో ప్రేమించాను అంటావు. ఇంక ఇండియా రాను … అంటావు. నీ ముందు రెండు మార్గాలు వున్నాయి . కనుక పెళ్లి చేసుకుని వెళ్ళు.. ఆలోచించుకో ......” అన్నాడు హిమ తండ్రి.
''అబ్బబ్బ! ఈ నాన్న ఏదో ఆలోచించి ముందే బంధం వేస్తాడు. ఎలా వేగుతున్నావో అమ్మా నువ్వు...!'' అంది హిమ.
''ఏమి చేయను తల్లీ! అందుకే పెళ్ళి కుదిరిన వెంటనే నన్ను బ్యాంకు వుద్యోగం మానిపించారు. స్వతంత్రం, సంపాదన ఉంటే చెప్పిన మాట విననేమో అని. అన్నీ విపరీతంగా ఆలోచిస్తాడు.''అంది తులసి.
''నిన్ను వుద్యోగం చేయనిచ్చినా ఇంతేలే! నీకు, నాకు స్వతంత్రం ఉండదు. నాకు 23 ఏళ్ళు. అప్పుడే పెళ్లి ఏమిటి చెప్పు! వద్దు అంటే అమెరికా వెళ్ళలేను. ఇక్కడ ఉద్యోగ అవకాశాలులేవు. కాలేజీ లెక్చరర్ వుద్యోగం నాకు నచ్చదు.... పెళ్లి తప్ప మరో దారిలేదు. అదేదో అమెరికా సంబంధం చేసుకోడం బెటర్…” అనుకుంది హిమనీ..
'సరే' అని నాన్నకి చెప్పు అంది.
''అవును. నాన్నగారి దృష్టిలో ఎవడో ఉండి ఉంటాడు. అందుకే ఈ ఆలోచన''అంది తులసి.
రవీంద్ర అడిగాడు....”ఏమంటోంది నీ కూతురు?” అని.
''వేరే చెప్పడానికి ఏముంది.... పెళ్లి సంబంధం చూడండి .'' అంది తులసి.
''సరే! నాకు దూరపు బంధువు విశ్వనాథం అని వున్నాడు. అమెరికా వెళ్ళినా మన ఆచారాలు పాటిస్తూ ఉంటాడు. వాడికి ఒక్క కొడుకు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు ఫ్రెంచి వాడిని పెళ్ళిచేసుకుని వేరే కంట్రీలో వుందిట. రెండోది నాకు పెళ్లివద్దు అంటుందిట. ఆ పిల్ల కూడా వేరే ఊరులో ఉంటుంది. కొడుకు బుద్ధిమంతుడు. వాళ్ళు చెప్పినట్టు విని ఇండియన్ అమ్మాయిని చేసుకుంటాడట. బాగా డబ్బు సంపాదించాడు. ఆస్తి అంతా కొడుకుది. ఈ సంబంధం నచ్చింది. వాళ్ళు వస్తున్నారు. నచ్చితే పెళ్లి ఈ నెల్లోనే చేసేస్తారు.'' అన్నాడు రవీంద్ర తన నిర్ణయం చెప్పి.
వారంలో వాళ్ళు రావడం, అన్నీ కుదిరి నెల రోజుల్లో పెళ్లి కూడా జరిగిపోయింది.
వీసాలు అన్నీ సిద్ధంచేసుకుని మరో రెండునెలల్లో హిమనీ కూడా అమెరికా వెళ్ళిపోయింది.
పై పై కబుర్లు గొప్పలు చూసి ఎవరో చెప్పినమాటలు నమ్మి తండ్రి ఈ పెళ్లి చేసాడు.కానీ వెళ్ళాక అన్నీ గ్రహించింది హిమనీ.
పెళ్ళిలో అమెరికన్ కల్చర్, భాష, పద్దతులు వేరు కనుక అబ్బాయి కిషన్ అట్టే మాటాడడు అనుకున్నారు కాని వొట్టి అమాయకుడు. ఇంజినీరింగ్ చదివాడు కానీ చదువు వేరు.. ప్రవర్తనవేరు… అని తెలుసుకుంది.
నేను నాన్న భయం నీడలో పెరిగితే కిషన్ తల్లి నీడలో కొంగుచాటున భయంతో పెరిగాడు. అంతా అత్తగారు కామిని పెత్తనం.తండ్రి, కొడుకు ఆవిడ అదుపులో వుంటారు.
కామిని ఎలాంటి మనిషి అంటే రోజు చేసే వంట కూడా ఆవిడని అడిగే చేయాలి. ఆమెగారు తినే వంటకాలే అందరూ తినాలి. ఇష్టమైనది తినాలి అంటే ఒక్క వీకెండ్ లో బయటి రెస్టారెంట్ కి వెడదాం అంటే అక్కడ కూడా ఆవిడ డామినేషన్ అమలు అవుతుంది.
భర్తను 'మిష్టర్ విసు.'....అంటుంది. కొత్తవారికి ఆ విసు ఎవడో తెలియదు. PA అనుకోడానికి లేదు. మనిషి నోరు విప్పితే అతివినయం, బానిస మనస్తత్వం ..... అని అర్థం అవుతుంది.
అదే పోలిక వచ్చింది కొడుకు కిషన్ కి కూడా.
కామిని అమెరికన్ స్టైల్ ఫాలో అవుతుంది. కానీ మిగిలినవాళ్లు అలాగే పాతకాలం వాళ్ళుగా ఆవిడ చెప్పినట్టు వినాలి. ఇదీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన హిమనీ గ్రహించింది. చాల సహనంతో కిషన్ ను మార్చాలి అనుకుంది. అది సాధ్యపడలేదు. దానికి కారణం కిషన్ విశ్వనాధం పూర్తిగా కామిని మీద ఆధారపడతారు. స్వంతంగా ఎదిగే తెలివి వాళ్లకి లేదు. అమెరికాలో ఉండేవారి జీవం విధానం ఇండియా వారికీ తెలియదు. ఇండియాలో ఏమి తెలియనట్టు మానేజ్ చేస్తారు. ఆలా మోసపోయాడు రవీంద్ర.
కామిని పధ్ధతి నచ్చకే కూతుర్లు ఇద్దరూ ఇంటినుంచి వెళ్లిపోయారని అర్థమైంది.
ఆవిడకి పిల్లలమీద ప్రేమకంటే తన మాట నెగ్గించు కోవాలన్న అహంకారం ఎక్కువ.
దానికి కారణం ఆవిడ - మెక్సికన్ అమెరికన్ కలసి స్థాపించిన కంపెనీ లో పార్ట్నర్ గా వున్నారు. . కామిని టాక్స్ కన్సల్టెంట్ కూడా. విశ్వనాధం కంటే ఆవిడ బాగా సంపాదిస్తోంది. కిషన్ విశ్వనాధం కూడా అదే కంపెనీలో వుద్యోగం చేస్తారు. వాళ్ళ పేమెంట్ తక్కువ. అది కూడా కామినే ఇస్తుంది.
హిమనీకి వయసు తక్కువే కానీ అన్నీ గ్రహించగలదు. కొత్త చోట భయంగా అనిపించినా తెలివిగా ఆలోచించింది. కిషన్ని మెల్లిగా తన వైపు తిప్పుకుంది. ఎం ఎస్ చేయడానికి అప్లై చేసింది.
అటు కామిని కోడలు వచ్చిన ఆరు నెలలకి తన ఆలోచన అమలు చేయడానికి నిర్నయిన్చుకుంది.
''కిషన్! రేపు నీతోపాటు హిమనీ ని ఆఫీసుకి తీసుకురా. మన కంపెనీ చూస్తుంది!” అంటూ చెప్పింది.
''అలాగే....తీసుకువస్తాను. ''అన్నాడు కిషన్.
''ఎందుకు ఆంటీ? అవసరం ఏముంది?” అంది హిమనీ.
''ఎందుకేమిటి.....నువ్వుకూడా ఆ కంపెనీలోనే చేరుతావు. మాతోబాటు వర్క్ చేస్తావు .''
''నా సబ్జక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మీ కంపెనీలో నాకు తగిన వర్క్ ఉండదు.'' చెప్పింది హిమ.
''నీ వర్క్ కి సబ్జెక్ట్ కి సంబంధం లేదు. ట్రైనింగ్ ఉంటుంది. వర్క్ నేర్చుకుంటావు. మార్నింగ్ లేచి త్వరగా తయారవ్వు.'' ఆర్డర్ వేసినట్టు చెప్పి తన రూములోకి వెళ్ళిపోయింది కామిని.
కిషన్ సాయంతో వంటగది సర్దుకుంటూ ''కిషన్! నా నిర్ణయం ఏమిటో నీకు చెప్పాను కదా.. మాటాడవేం... మీ అమ్మతో ఎందుకు చెప్పలేదు? అంది హిమ.
''అమ్మకి కోపం వస్తుంది....తరువాత చెబుతాను .రేపు వూరికే నాతో రా...ప్లీజ్ ''అన్నాడు కిషన్.
ఖర్మ. కిషన్ అటు ఆవిడకు చెప్పడు. ఇటు నన్ను కాదనడు. నేను నాదారి చూసుకోవలసిందే! అనుకుంది హిమ.
మర్నాడు కిషన్ తో పాటు వెళ్ళింది. అక్కడ కామిని అందరినీ పరిచయం చేసింది. అక్కడ కూడా ఆవిడ పనివాళ్లను, అధికారులను, కష్టమర్లను హ్యాండిల్ చేసే విధానం చూసింది.
విశ్వనాధం మరియు కిషన్ అక్కడ తన కింద పనివాళ్ళు అంతే! రేపు నేను కూడా వారితో సమానమే అని గ్రహించింది హిమ. అంటే ఇల్లు మరియు ఆఫీసు లోను కూడా ఆవిడ అధికారంలో ఉండాలి. ప్రతి విషయంలోను ఆవిడ చెప్పినట్టు నడుచుకోవాలి. కిషన్, విశ్వనాదం గారు జస్ట్ ''కీ బొమ్మలు''. ఇక్కడ అమెరికాలో ఎలా వున్నా ఇండియా వచ్చినపుడు మాత్రం వీళ్ళు వేరుగా వుంటారు.
నాన్న మోసపోయాడు....నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోవాలి....నాది ఒకరికి లొంగి తలవంచుకు వుండే తత్వం కాదు. నాన్న ఐతే వేరు. ఇప్పుడు నాకు చదువుంది ధైర్యం వుంది.ఈ ఇంటినుంచి కిషన్ ను తీసుకుని దూరంగా వెళ్ళాలి...అని నిర్ణయించుకుంది.
''ఆఫీసుకి ఎప్పుడు వస్తావ్”...అని కామిని అడిగినపుడు ధైర్యంగా చెప్పేసింది. ''లేదు నేను మీ కంపెనీలో చేరను. అంతేకాదు...కిషన్, నేను కూడా ఇక్కడ నుంచి వేరే ప్లేసుకి వెడుతున్నాం. నాకు షికాగో ఊనివర్సిటీలో సీటు వచ్చింది ఎం ఎస్ చేయడానికి'' చెప్పింది హిమ.
హిమ ఇంత ధైర్యంగా మాటాడుతుంది అని కామిని అనుకోలేదు.షాక్ ఐనది. అంతేకాదు కిషన్ కూడా నాతొ వస్తాడు....అంటోంది. ''ఎంత ధైర్యం నీకు? ఎవరిని అడిగి కిషన్ ని తీసుకు వెడతావ్...అంటూ పిచ్చిపట్టినట్టు అరిచింది. ''భలే అడుగుగుతున్నారు....కిషన్ ఇప్పుడు హిమకి భర్త. నేను ఎక్కడికివెడితే అతను అక్కడేవుంటాడు.'' అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. ఆ వెనుకనే కిషన్ కూడా వెళ్ళాడు.
మొదటిసారి నా కొడుకు నా మాట లెక్కచేయకుండా నాతో ఒక్కమాట చెప్పకుండా వెళ్ళిపోయాడు.
కామిని సృహతప్పి కూలబడి పోయింది.
కిషన్, హిమ షికాగోలో కాపురం పెట్టారు. సంవ్సరం గడిచినా కిషన్ కు జాబ్ రాలేదు.
''కిషన్! నీ చదువుకి జాబ్ రాదు. ఏదైనా కంప్యూటర్ కోర్సు చేయి. ట్రెండ్ మారింది. ఇంతకాలం మీ స్వంత కంపెనీ కనుక ఏదో చేసావ్. ఇప్పుడు అలాకాదు. ఎప్పటికప్పుడు పరిస్థితులనుబట్టి అప్డేట్ అవ్వాలి....” అంటూ కంప్యూటర్ కోర్సులో చేర్పించింది. కానీ అతడి తెలివితేటలకు, కంప్యూటర్ కోర్సుకి కుదరలేదు.
''బయటకు వచ్చి చూస్తేనే కానీ తెలివితేటలు పెరగవు. నువ్వు నేర్చుకోవలసింది ఎంతో వుంది.
మీ అమ్మ కంపెనీలో ఉండీ ఏమి సాధించావు? అవకాశాలు ఉన్నా కూడా పోగొట్టుకున్నావ్....”అంది హిమ.
''అవును హిమా .... నాకు ఫ్రెండ్సలేరు. ఎప్పుడూ బంధువులు పెళ్లిళ్లు … అంటూ అమ్మ తనతోనే తిప్పుకునేది. ఎవరు నన్ను ఇంటినుంచి దూరం చేస్తారో అని '' అన్నాడు కిషన్.
''నాకు అర్థం ఐంది. నన్నుకూడా అలాగే ఎదగకుండా చేయాలనుకుంది. అందుకే వచ్చేసాను.
మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్?''
''ఆన్లైన్ కోర్సు చేస్తాను. ..” అన్నాడు కిషన్ .
''సరే నీఇష్టం…” అంది హిమ.
ఆరోజు కిషన్ పుట్టినరోజు. కామిని ఫోన్ చేసి విషెస్ చెప్పింది. క్షేమ సమాచారాలు అడిగింది.
‘వుద్యోగం చేస్తున్నావా’ అంది. ‘డాడ్ నీకోసం బెంగ పెట్టుకున్నాడు....’ అంది.
“కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నా …” అన్నాడు కిషన్.
అలా ఫోన్ చేయడం రాకపోకలు మొదలుపెట్టింది కామిని.
వచ్చింది చూసివెళ్ళక, ‘ప్లాట్ లో ఉండటం ఏమిటి....నువ్వు ఏనాడూ ఇలాంటి ఇరుకు గదిలో వుండలేదు. అన్ని సుఖాలు వదిలి వచ్చి కష్ట పడుతున్నావ్.....” అంటూ ప్రేమ నటించింది.
''నాకేమీ కష్టంకాదు....హిమ ఉంది... నాకు నచ్చినట్టు వున్నాను.'' అన్నాడు కిషన్.
''ఓరి పిచ్చివాడా ! ఇంటిపని వంటపని చేయాలి. ఏమి బాగుంది ఇక్కడ?” అంది
''మన ఇంట్లో ఐతే పెద్ద ఇల్లు కనుక ఇంకా ఎక్కువపని ఉండేది. ప్లాటుకనుకనే తక్కువ పని.!” అన్నాడు కిషన్.
విశ్వనాథం వచ్చినపుడు .... “కిషన్! మన ఇంటికి వచ్చేయి. ఇప్పుడు ఈ చదువు నీ తలకు ఎక్కదు. నామాటవిను. మీ అమ్మ నీకోసం ఏడుస్తోంది…” అన్నాడు.
''మరి హిమ వస్తేనే నేను వస్తాను.'' అన్నాడు కిషన్.
''నువ్వు వచ్చేస్తే హిమకూడా వస్తుంది....!” అన్నాడు విశ్వనాధం.
''రాదు. హిమ తెలివికలది. చక్కగా ఎం ఎస్స్ కూడా పూర్తి చేసింది. పెద్ద కంపెనీలో జాబ్ వస్తుంది. మన కంపెనీలో ఉంటే ఏమీరాదు. ఎదగడం ఉండదు. అందుకే నేనిలా వున్నాను....” పాఠం అప్పగించినట్టు చెప్పాడు కిషన్.
''ఓహో! హిమ ఇదంతా చెప్పిందా? మా నుంచి విడదీసింది. అది అర్థం కాదురా నీకు!” అన్నాడు విశ్వనాధం.
''మరి నువ్వు గ్రాండ్మాని, గ్రాండ్పాని ఇండియాలో ఒంటరిగా వదిలి అమెరికా వచ్చేవుగా?”
‘'ఓరి నీ తెలివి మండిపోను....నాకే చెబుతున్నావా ...అదివేరు..”అంటూ తడుముకున్నాడు విశ్వనాధం.
కిషన్కి వెళ్లాలని ఉంది....హిమ ఒక్కతే ఎలా ఉంటుందని బాధగా ఉంది.ఎటూ తేల్చుకోలేకుండా వున్నాడు.
ఇదంతా చూసి హిమ చెప్పింది. ''కిషన్ నువ్వు మీ అమ్మ కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటే అలాగే వెళ్ళు. నీకు ఈ కోర్సు అంటే ఇంట్రస్టు లేనట్టువుంది.''
''అదే ఆలోచిస్తున్నాను. నీకు నేను సరిపడను. మా అమ్మ నాన్న తొందరపడి పెళ్లి చేశారు....” అన్నాడు.
''నువ్వు మనం కలిసినపుడే మీ కంపెనీ విషయం చెప్పాల్సింది. చెప్పలేదు. అయి పోయినదానికి చేయగలిగింది లేదు. నీ ఇష్టం ''అంది హిమ.
సరిగ్గా అప్పుడే కామిని నుంచి ఫోను వచ్చింది.
“కిషన్! ఈ క్రిస్మసుకి మీరిద్దరూ ఇంటికి రండి” అంటూ పిలిచింది. హిమతో పంతానికి పోవడం ఎందుకని రాజీకి వస్తూ. హిమ కూడా సరే అని వెళదాం పద అని ప్రయాణం అయినది. వారం అయ్యాక హిమ చికాగో వచ్చింది. కిషన్ అక్కడే వుండిపోయాడు.
అతను మళ్ళీ అదే కంపెనీలో చేరాడు. ....తల్లి తండ్రుల బలవంతం మీద.
అలా ఒకసారి కిషన్ చికాగో వెళ్లడం, మరోసారి హిమ అతడి దగ్గిరకి వెళ్లడం కొన్నాళ్ళు గడిచింది.
హిమనీ చదువు పూర్తిచేసి జాబ్ వస్తే కాలిఫోర్నియా వెళ్లాల్సివచ్చింది.
ఈ విషయం విన్న కామిని, విశ్వనాథం ''ఇన్నాళ్లు దగ్గిరే వున్నావు కనుక వెళ్లడం రావడం సరిపొయిన్ది. కాలిఫోర్నియా కి కుదరదు.''అన్నారు.
''ఐతే ఏమి చేయమంటారు? అడిగింది హిమ
''నువ్వు డైవోర్స్ ఇచ్చేయ్ !” చాల సులువుగా అంది కామిని.
''కిషన్!నువ్వేమంటావ్?” అడిగింది.
కిషన్ తలవంచుకున్నాడు. ముందే అతనికి చెప్పి పెట్టి ఉండటం వలన మాటాడలేదు.
''ఏదో ఒకరోజు మీరిలా అంటారని అనుకున్నాను...... మీరు చాల పొరబాటు చేశారు. చదువులేని అమ్మాయిని కిషన్కి చేయవలసింది. మీరు చెప్పినట్టు ఉండేది. సరే.. నాకు అభ్యంతరం లేదు. కిషన్! నీ నిర్ణయం కూడా చెప్పు .... '' అంది హిమ.
“సారీ హిమ!నేను పిరికివాణ్ణి .... ఏమీ చేతకాని వాణ్ని . నీకు తగిన వాడిని కాను. నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ దీ బెస్ట్” అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు.
''మీ నాన్న బంధువని కోరి నిన్ను కోడలిగా తెచ్చుకున్నాం. నువ్వు చేసిన పనికి గుండె ఆగి చస్తాడు.'' అన్నాడు హేళనగా విశ్వనాధం.
''మా నాన్న కి ఆ అవసరం లేదు. మీ గురించి నలుగురికి తెలిసాక ఏమి జరుగుతుందో ఆలోచించుకోండి. కిషన్ ని ఎందుకూ పనికి రాని వాడుగా పెంచారు.'' అంటూ పెళ్లికూతురిగా కొత్తకోడలిగా ఆ ఇంటికి వచ్చిన హిమనీ ఈరోజు ఆ ఇంటివాళ్ళకి ఏమీ కానీ వ్యక్తిగా గుమ్మందాటి బయటికి వచ్చింది.
''మనసులు కలవడానికి చాలా కాలం పడుతుంది .కానీ ముక్కలు కావడానికి ఒక్క క్షణం చాలు....
నా వ్యక్తిత్వం నిలబెట్టు కోవాలనుకోవడం ఆత్మ విశ్వాసం అవుతుంది కానీ తప్పుకాదు”.... అనే ధైర్యం తో మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టింది.
విశ్వనాధం చిలవలు పలవలు కల్పించి “నీ కూతురు వెళ్ళిపొయిన్ది. నీకు తెలుసా?.....” అంటూ పనిగట్టుకుని రవీంద్రకి ఫోను చేసి మరీ చెప్పాడు.
''అందుకు సిగ్గుపడాల్సింది నువ్వు. నా కూతురు ఆలోచించే నిర్ణయం తీసుకుందిలే!” అన్నాడు పౌరుషంగా రవీంద్ర.
హిమనీని ఏమంటాడో అని భయపడిన తులసి.... భర్త మాటలకు ఊపిరి పీల్చుకుంది. ఎప్పటికప్పుడు హిమ అక్కడి మనుషుల గురించి తెలియని విషయాలు చెప్పి ఉండటం వలన తులసి కూతురు ధైర్యాన్ని మెచ్చుకుంది. భర్త కూతురివైపే మాటాడినందుకు సంతోషించింది. పదేళ్ళపాటు IBM లో పనిచేసింది హిమనీ.
అప్పుడే న్యూయార్కులో టెర్రరిస్ట్స్ అట్టాక్ జరిగింది. ఎకానమీ కుప్పకూలింది.
సాఫ్ట్వేర్ కంపెనీలు ఒకొక్కటే పతనం అవడం, బిజినెస్ నష్టపోడంతో చాలామందికి ఉద్యోగాలు లేవు.
అప్పుడు హిమానీకి మెడిసిన్ చేయాలన్న తన చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆలోచనకు పునాది వేసుకుంది. శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది . తాను సంపాదించుకున్న తనడబ్బుతోనే!
ఒకరోజు లైబ్రరీలో పరిచయం అయ్యాడు....జాక్సన్ . ఆపరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్నయిన్చుకున్నారు. హిమనీ తమ్ముడు వంశీ, చెల్లి పావని కూడా అప్పటికే అమెరికా వచ్చారు, వాళ్ళు వర్క్ చేసే కంపెనీ పంపిస్తే !
అమ్మని నాన్నని కూడా రమ్మని పిలిచింది హిమనీ. వాళ్ళు వచ్చాక చెప్పింది జాక్సన్ గురించి. పరిచయం చేసింది.
''మీ పేరెంట్స్ ని కూడా తీసుకురా జాక్సన్ నెక్స్ట్ వీక్ …” అన్నాడు రవీంద్ర.
''ఏమిటీ.. మీరే అంటున్నారా... ఈ పెళ్ళికి వొప్పుకుంటున్నారా....” ఆశ్చర్యంగా అంది తులసి, జాక్సన్ వెళ్ళిపోయాక .
''అవును. హిమనీ పట్ల నేను తప్పు చేసాను. ఆతప్పు దిద్దుకుంటున్నాను.'' అన్నాడు రవీంద్ర.
ఎనిమిదేళ్ల తర్వాత హిమనీ మెడికల్ కోర్సు పూర్తిచేసి డాక్టర్ గా స్థిరపడింది.
ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే ఎలాగైనా సాధించవచ్చు అని నిరూపించుకుంది .
పెద్దలు చేసిన పొరబాట్లు సరిచేసుకుని జీవితాన్ని మంచి మార్గంలోకి మళ్లించుకున్న విజేత ఆమె !
కోరిన చదువు, కోరుకున్న జీవిత భాగస్వామిని తన స్వశక్తితో సాధించింది.
''అనుకోని అవాంతరాలు ఏర్పడితే ఓపికతో ధైర్యంగా అధిగమించవచ్చు'' అని నిరూపించిన ఒక విజేత వనితా హిమనీ! ఎందరికో స్ఫూర్తి కూడా.
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
コメント