top of page

అమ్మ అమృత పలుకులు

Writer: Gadwala SomannaGadwala Somanna

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #AmmaAmruthaPalukulu, #అమ్మఅమృతపలుకులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 24

Amma Amrutha Palukulu- Somanna Gari Kavithalu Part 24 - New Telugu Poem Written By Gadvala Somanna Published In manatelugukathalu.com On 04/03/2025

అమ్మ అమృత పలుకులు - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


అమ్మ అమృత పలుకులు


బుర్రలోని బూజును

పర భాషపై మోజును

దులుపుకున్న మంచిది

మాతృభాష గొప్పది


చులకనైన భావనను

అవినీతి సంపదను

మానుకున్న క్షేమము

తొలగిపోవు క్షామము


పనికిరాని పనులను

చెత్తలాంటి తలపులను

వదులుకున్న లాభము

లేదంటే నష్టము


మితిలేని వ్యసనాలను

అదుపులేని కోరికలను

నియంత్రిస్తే బాగు! బాగు!

చేయకోయి! ఇక జాగు














అహం హానికరం

----------------------------------------

హానికరమే అహము

ముమ్మాటికీ నిజము

శిశిర ఋతువు మాదిరి

పోగొట్టును సర్వము


అహంతో అనర్ధము

చెరుపునోయ్! జీవితము

వదిలివేస్తే మేలు

వినయశీలత ముఖ్యము


అహమే చీడ పురుగు

అది శత్రువుని ఎరుగు

నిలువెల్లా తొలచును

ఆరోగ్యం చెరుపును


అగ్గిరవ్వ లాంటిది

అణువణువును కాల్చును

ఆదిలో త్రించితే

సకలము చక్కబడును


అహం లేని మనుషులు

మహిలో మహా ఘనులు

వారు శాంతి దూతలు

చూడ మహా దాతలు















నిత్య సత్యాలు

----------------------------------------

నిరంతర సాధన

ఆశయాల ఛేదన

అవుతుంది నిజముగా

విజయాలకు నిచ్చెన


గుండెల్లో వేదన

చూడ నరకయాతన

దించుకుంటే మేలు

క్షేమము వేనవేలు


ఎవరినీ చులకన

ఎప్పుడూ హేళన

చేయరాదు బ్రతుకున

ఉండరాదు మనసున


అమ్మ మాట దీవెన

హృదయాలకు సాంత్వన

యోచిస్తే మాత్రము

ఆమె మధుర భావన



















కన్నవారి కలలు

----------------------------------------

శ్రద్ధగా చదవాలని

వృద్ధిలోకి రావాలని

కన్నతల్లి స్వప్నము

పిల్లలు ఎదగాలని


హద్దులోన ఉండాలని

బుద్ధిగా బ్రతకాలని

తల్లిదండ్రుల ఆశలు

వారి గుండె బాలలు


గొప్పగా చూడాలని

మెప్పును పొందాలని

అమ్మానాన్నల కలలు

పెద్దల మాట వినాలని


భవిత బాగుండాలని

దేశభక్తి పెరగాలని

జన్మ దాతల కోరిక

దేశకీర్తి చాటాలని


ఊరు పేరు నిలపాలని

యేరులాగ సాగాలని

కోరుతారు మదిలోన

తీరు చక్కబడాలని















పల్లెసీమకు స్వాగతం

----------------------------------------

పల్లె సీమ అందాలు

అద్భుతమైన దృశ్యాలు

అలరించును హృదయాలు

కట్టేయును నయనాలు


అంతటా పచ్చదనము

విందు చేయు చక్కదనము

వర్ణింపనెవరి తరము!

పల్లెసీమ గొప్పదనము


పచ్చపచ్చని పొలములు

కాలువల్లో జలములు

కడు ముగ్ధమనోహరమే!

ప్రకృతి వర ప్రసాదమే!


పక్షుల కోలాహలము

రైతుల మందహాసము

చిరు గాలుల సవ్వడిలో

పైరుల నట విన్యాసము


స్వచ్ఛమైన వాయువులు

దొరుకు చోటు పల్లెటూరు

బంధాలకు పుట్టినిల్లు

ఆత్మీయతల పొదరిల్లు


ఒక్కసారి వచ్చిపోండి!

ఉచితంగా చూసిపోండి!

పల్లెసీమ అందాలు

పలికేను స్వాగతమండి!


-గద్వాల సోమన్న


 
 
 

留言


bottom of page