'Amma Cheppina Kammani Mata' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
కొత్తగా రెక్కలొచ్చిన చిన్నారి పొన్నారి చిట్టి తల్లి వింటావా ఒకమాట
ఇప్పుడు చెట్టు కొమ్మలపై ఎగిరి గంతులు వేస్తూ గగనంలోకి సాగాలని
రెక్కలు విదిల్చి ఉబలాట పడుతున్నావు.....
అందమైన ఈ ప్రపంచమంతా నాదీ అని మురిసిపోకు క్రూర మృగాలుంటాయి
వాటి పంజా నుంచి తప్పించుకోవాలి
వేటగాడు పన్నిన వలలుంటాయి రాబందుల ఇనుప గోళ్ళుంటాయి
వాటికి ఆహుతి కాకుండా మెలకువతో ఉండాలి
ఆహరం వేటలో మెళకువలు నేర్చుకో అనుకూలమైన తోడు తెచ్చుకో
తరతరాల జీవన ధర్మానికి కట్టుబడి ఉండాలి తల్లిగా సార్ధకత సాధించు
అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోవాలి
జీవితం పూలబాటకాదు అడుగులు జాగ్రత్తగా వేయాలి
నీ చిట్టి కూనలకు అమ్మవై మంచి చెడులు నేర్పించు
ఆహారానికి విహారానికి గుంపుతో వెళ్ళలిసుమా తోటివారు హెచ్చరిస్తారు
నీకు రక్షణ కలిపిస్తారు అవసరానికి ఆదుకుంటారు
నేను నీకు రెక్కలిచ్చాను నాబాధ్యత తీరింది నాదారినాది నీదారి నీది
నీకు మంచి చెప్పడంవరకే నా బాధ్యత- ఆతర్వాత నీ బాధ్యతను నెరవేర్చుకో !
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని ,చతురలో
ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....''ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments